పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

17:1, 17:2-4, 17:5, 17:6, 17:7,8, 17:9-14, 17:15,16, 17:17, 17:18, 17:19, 17:20, 17:21,22, 17:23-27

ఆదికాండము 17:1 అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై తాను సర్వశక్తిగల దేవుణ్ణని తన సన్నిధిలో నడుచుచూ నిందారహితుడిగా ఉండమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా జీవించడమే విశ్వాసుల బాధ్యత. అందుకే హనోకూ నోవహుల విషయంలో వారు దేవునితో నడిచినవారు అనే మాటలను మనం గమనిస్తాం (ఆదికాండము 5:22, 6:9). నిందారహితమైన/లోపము లేని జీవితమే ఆయన సన్నిధిలో నడుస్తున్నాం అనేందుకు రుజువుగా ఉంటుంది. కాబట్టి విశ్వాసులు తమ సమస్త ప్రవర్తన విషయంలోనూ లోపము లేకుండా (ఆలోచనలతో సహా) సరిచేసుకోవాలి.

ఆదికాండము 17:2-4 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు.

ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు తన నిబంధనను (ఆదికాండము 15) మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. పై వచనంలో‌ ఆయన నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా ఉండమని
ఆజ్ఞాపించి ఈ వచనంలో తన నిబంధనను జ్ఞాపకం చెయ్యడం ద్వారా నిబంధన ప్రజలు ఆ బాధ్యతను కలిగియున్నారని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులమైన మనమంతా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కొత్తనిబంధన‌ ప్రజలంగా ఉన్నాము (యిర్మియా 31:3122:20, లూకా 22:20). కాబట్టి ఆయన సన్నిధిలో నడుస్తూ పాపం విషయంలో నిందారహితంగా ఉండాలనే బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించాలి. పైన చెప్పినట్టు ఆ బాధ్యతానిర్వర్తనే మనం నిబంధన ప్రజలం అనడానికి రుజువు.

ఆదికాండము 17:5 మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.

ఈ వచనంలో దేవుడు అబ్రాము పేరును అబ్రాహాముగా మార్చడం మనం చూస్తాం. 15వ వచనంలో ఆయన శారయి పేరును కూడా శారా గా మార్చాడు. నేటి క్రైస్తవసమాజంలో దీని ఆధారంగానూ మరికొన్ని సందర్భాల ఆధారంగానూ బాప్తీస్మం తీసుకున్న వ్యక్తులకు పేర్లను మార్చడం ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ హెబ్రీబాష నుండి అబ్రాహాము అనే పేరును‌‌ మనం పరిశీలించినప్పుడు అబ్రాము అన్నా అబ్రాహాము అన్నా ఉన్నతమైన తండ్రియనే ఒకేవిధమైన అర్థం వస్తుంది. శారయి విషయంలో కూడా ఇంచుమించు అంతే. అలాంటప్పుడు ఆయన వారి‌ పేర్లను ఎందుకు మార్చాడంటే; ఆదాము సృజించబడినప్పుడు దేవుడు అతనికి భూజంతువులకు పేర్లు పెట్టే బాధ్యతను అప్పగించినట్టు చూస్తాం (ఆదికాండము 2:19). తర్వాత అతను తన భార్యకు కూడా హవ్వ అనే పేరు పెట్టాడు (ఆదికాండము 3:20). ఈ విధంగా ఆలోచించినప్పుడు ఒక వ్యక్తికి పేరుపెట్టడమనేది కొన్నిసార్లు వారిపై మనకున్న అధికారాన్ని సూచిస్తుంది. అందుకే మన పిల్లలకు మనమే పేర్లు పెట్టుకుంటాం.

దేవుడు కూడా అబ్రాము శారాయిలపై ఆయన అధికారాన్ని సూచించడానికే వారి పేర్లను మార్పు చేసాడు. కాబట్టి బాప్తీస్మం తర్వాత పేర్లు మార్చుకుంటున్నవారు, మారుస్తున్న సేవకులు ఆ సాంప్రదాయం దేవుని ఆజ్ఞలనుండి పుట్టింది కాదని, మారవలసింది మన ప్రవర్తనే తప్ప పేరుకాదని గ్రహించాలి. అయితే స్వచ్చందంగా ఎవరైనా తమ‌ తల్లితండ్రులు పెట్టిన పేర్లను ఇబ్బందిగా భావిస్తుంటే వాటిని మార్చుకునే స్వేచ్చ వారికి ఉంటుంది. కానీ అది దేవుని ఆజ్ఞ కాదు కాబట్టి దానివల్ల ప్రత్యేక ప్రతిఫలమేమీ లభించదు సుమా. ఆమాటకొస్తే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే భక్తులకు బబులోను దేవతలకు సంబంధించిన పేర్లు పెట్టబడ్డాయి. దానికి వారు ఎలాంటి ఇబ్బందీ వ్యక్తపరచలేదు (దానియేలు‌ 1:6,7, 4:8). తమ దైవికమైన మనుగడకు వ్యతిరేకంగా ఉందని బబులోనీయుల ఆహారాన్ని తృణీకరించిన వీరు (దానియేలు 1:8) వారి దేవతలపేర్లను బట్టి పిలవబడడంలో ఏదైనా పాపం ఉండుంటే ఆ‌ విషయంలో తమ విముఖతను తెలియచేసేవారు కదా!. యోసేపు కూడా ఐగుప్తీయుల అన్యపేరుతో సంబోధించబడ్డాడు (ఆదికాండము 41:45). కాబట్టి విశ్వాసులు తమ తల్లితండ్రులు పెట్టిన అన్యపేర్లతో పిలవబడినప్పటికీ అందులో ఎలాంటి పాపం‌లేదు. అయితే ఆ పేరు వారికి ఇష్టంలేని పక్షంలో స్వచ్చందంగా తమ పేరు మార్చుకోవచ్చు.

ఆదికాండము 17:6 నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాము సంతానపు ఔన్నత్యం గురించి తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు ఇష్మాయేలీయులు వంటి మరికొన్ని జాతులకు కూడా అబ్రాహాము మూలపురుషుడు. వారిలో ఎంతోమంది రాజులు జన్మించారు సౌదీ అరేబీయా వంటి దేశాల్లో ఇప్పటికీ ఆ రాజులే పరిపాలిస్తున్నారు. ప్రత్యేకజనమైన ఇశ్రాయేలీయుల విషయంలోనైతే దావీదు సొలోమాను వంటి గొప్పరాజులు అందులోనే జన్మించారు. 1&2 రాజుల గ్రంథాలను చదువుతున్నప్పుడు వారి చరిత్ర అంతా కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా యూదుల రాజుగా పిలవబడిన యేసుక్రీస్తు కూడా ఆ సంతానం నుండే జన్మించారు.

ఆదికాండము 17:7,8 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

ఈ వచనాలలో దేవుడు అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడం గురించి ప్రకటించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆయన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనే కారణం. అందుకే దైవజనుడైన మోషే "ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులోనుండి తన మహాబలముచేత నిన్ను వెలుపలికి రప్పించెను" (ద్వితీయోపదేశకాండము 4:37,38), "నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవావారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు" (ద్వితీయోపదేశకాండము 9:5) అని వారికి గుర్తు చేస్తూ వచ్చాడు.

అదేవిధంగా ఇక్కడ దేవుడు "నీకునూ నీ తరువాతి సంతతికినీ నీవు పరదేశివైయున్న ఈ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని" అబ్రహాముకు కూడా ఆ దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడినట్టు మాట్లాడుతున్నాడు. కానీ అబ్రాహాము కనాను దేశంలో పరదేశిగానే జీవించాడు తప్ప దానిని స్వాస్థ్యంగా స్వాధీనపరచుకోలేదు (అ.పొ. కా 7:5). లేఖనాలలో వాడబడిన బాషా శైలులను అర్థం చేసుకోలేని కొందరు దీనిని వైరుధ్యంగా ప్రస్తావిస్తుంటారు. కానీ దేవుడు అబ్రాహాముతో కనాను దేశం గురించి మాట్లాడిన మొత్తం సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు, అది అతని నాలుగవ తరంవారికి మాత్రమే స్వాధీనం చెయ్యబడుతుందని స్పష్టంగా ప్రకటించబడింది (ఆదికాండము 15:16). అందుకే ఆయన ఇస్సాకుకు కూడా ప్రత్యక్షమై కనాను దేశంలో‌ పరదేశిగా సంచరించమన్నాడు (ఆదికాండము 26:2-4). కాబట్టి ఆ భూమి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది అన్నప్పుడు "అది ప్రమాణం చెయ్యబడడంగా", "వారి సంతానం ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నపుడు ఆ ప్రమాణం నెరవేర్చబడడంగా" మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు అర్థమైంది‌ కాబట్టే వారు కనాను దేశంలో పరదేశులుగానే జీవించారు (హెబ్రీ 11:9,13). ఆ భూమిని తాము కాదు తమ సంతానం మాత్రమే స్వాధీనం చేసుకుంటుందని ఆలోచించారు (ఆదికాండము 28:3,4). అందుకే తమ భార్యలు చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి కూడా ఆ భూమిని వెలపెట్టి కొనుక్కున్నారు (ఆదికాండము 23).

ఆదికాండము 17:9-14 మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధనయేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతిపొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

ఈ వచనాలలో దేవుడు తన నిబంధనకు గుర్తుగా సున్నతి అనే ఆచారాన్ని నియమించడం మనం చూస్తాం. దీనిని బట్టి నిబంధన ప్రజలు ఆ నిబంధనకు సంబంధించిన క్రియలను పాటించాలని అర్థం చేసుకోవాలి. అబ్రాహాము/అతని సంతానం ఏవిధంగా ఐతే వారి నిబంధనకు సంబంధించిన‌ సున్నతి అనే క్రియను పాటించారో విశ్వాసులమైన మనం కూడా మన నిబంధననుకు సంబంధించిన నీతిక్రియలను జరిగించాలి‌. అసలు మనం ఆ నిబంధనలో చేరిందే లేక రక్షించబడిందే ఆ నీతి (సత్) క్రియలు జరిగించడానికి (ఎఫెసీ 2:10). అందుకే పౌలు "మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని" (అపో.కార్యములు 26:20) అని అంటున్నాడు.

అయితే ఆ నీతిక్రియలు మనం కృపచేత విశ్వాసం ద్వారా పొందుకున్న రక్షణకు గురుతులే తప్ప, ఏ క్రియల మూలంగానూ మనకు రక్షణ రాదు (ఎఫెసీ 2:8,9). కానీ నేను రక్షించబడ్డానని భావిస్తున్న వ్యక్తిలో క్రియలు లేకుంటే ఆ వ్యక్తి ఇంకా రక్షించబడనట్టే. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి అతను చేసే నీతిక్రియలే రుజువులుగా/గురుతులుగా ఉంటాయి (రోమా 4:11,12). ఉదాహరణకు ఒక గ్రుడ్డివాడు చూపు పొందుకుంటే అప్పటినుండి లోకాన్ని చూస్తాడు. అతను ఇంకా చూడలేకపోతున్నాడు అంటే ఇంకా చూపు పొందుకోలేదని అర్థం. అతను చూపు పొందుకోవడానికి చూడడం కారణం కాదు కానీ అతను‌ చూపు పొందుకుంటే మాత్రం తప్పకుండా చూస్తాడు.

ఇక "సున్నతి" అనే ఆచారం గురించి పరిశీలిస్తే; మర్మాంగపు (penis) ముందటి చర్మాన్ని (Foreskin) తొలగించడాన్నే సున్నతి అంటారు. అయితే ఆయన తన నిబంధనకు గుర్తుగా ఇలాంటి ఆచారాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడనే సందేహం కొందరికి కలుగుతుంది. కొందరు మూర్ఖులైతే ఈ విషయంలో ఎగతాళి కూడా చేస్తుంటారు. ఈ ఆచారం ఎందుకు ప్రవేశపెట్టబడిందో అర్థం చేసుకోవాలంటే అబ్రాహాము ఇస్సాకును కనేసరికి అతని శారీరక పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి. హెబ్రీ 11:12 ప్రకారం; ఇస్సాకును కనే సమయానికి అబ్రాహాము శరీరం మృతతుల్యంగా ఉంది. అంటే సహజసిద్ధంగా కుమారుడిని కనే పరిస్థితి (వయస్సు) అతనికి లేదు (ఆదికాండము 17:17). అయినప్పటికీ దేవుని వాగ్దానాన్ని బట్టి అతనికి సంతానం కలిగి ఆ సంతానం ఆకాశనక్షత్రాల వలే విస్తరించబోతుంది. కాబట్టి ఆ సంతానం అన్ని జాతుల్లా మేము మా పితరుడి (అబ్రాహాము) సహజ పురుషత్వశక్తిని బట్టి జన్మించినవారం కాదని, దేవుని నిబంధనను బట్టే మేము జన్మించి ఇంతలా విస్తరిస్తున్నామని జ్ఞాపకం చెయ్యడానికే లేక తమ జన్మకూ విస్తరణకూ మూలమైన "దేవునియందు అతిశయించడానికే" ఈ ఆచారం ప్రవేశపెట్టబడింది. "ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము." (ఫిలిప్పీ 3:3) అనే పౌలు మాటల్లో ఆ భావం స్పష్టంగా వివరించబడింది. అంటే ఆ ప్రజలు దేవునియందు అతిశయిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడాలి.

అందుకే సున్నతి హృదయసంబంధమైనదని రాయబడింది (ద్వితీయోపదేశకాండము 30:6, రోమా 2:29). ఈ కారణాన్ని బట్టే కృపచేత రక్షించబడి తమ రక్షణకు కారణమైన దేవునియందు అతిశయిస్తున్న విశ్వాసులు కూడా హృదయమందు సున్నతి పొందినవారని లేఖనం చెబుతుంది (కొలస్సీ 2: 11).

అదేవిధంగా ఈ సున్నతి అనే ఆచారం వెనుక ఆరోగ్యపరమైన మేలు కూడా నిక్షిప్తమైయుంది. దీనివల్ల మర్మాంగసంబంధమైన కొన్ని కేన్సర్లు మరియు సుఖవ్యాధులు సోకకుండా ఉంటాయి. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించండి.

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3734995/

ఆ సున్నతిని ఆయన ఎనిమిదవ దినానే చేయించాలని చెప్పడానికి కూడా శాస్త్రీయపరమైన‌ కారణం ఉంది. మనిషిని‌ సృష్టించిన దేవునికి, ఆ మనిషి పిండంగా ఏర్పడిన నాటనుండి అతని శరీరతత్వం ఎప్పుడు ఏవిధంగా అభివృద్ది చెందుతుందో ఎలాంటి మార్పులకు లోనౌతుందో బాగా తెలుసు ఎందుకంటే ఆవిధంగా నియమించినవాడు ఆయనే. పుట్టిన బిడ్డ శరీరంలో ఎనిమిదవ దినానికి K vitamin అనేది బాగా అభివృద్ది చెందుతుంది. అది రక్తం గడ్డకట్టేలా చేసి సున్నతి సమయంలో అధికశాతంలో రక్తస్రావం కాకుండా సహాయపడుతుంది. అందుకే ఆయన ఆ ఎనిమిదవ దినానే సున్నతి చేయించాలని నియమించాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించండి.

https://www.researchgate.net/publication/321462229_Haematological_Basis_of_8th_Day_Male_Child_Circumcision_in_The_Holy_Bible

https://hermeneutics.stackexchange.com/questions/31778/

అయితే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన Herodotus అనే గ్రీకు చరిత్రకారుడు, ఈ సున్నతి అనే ఆచారం ఐగుప్తీయులు, ఇతియోపియన్లు ప్రాచీనకాలం నుండి ఆచరిస్తున్నారని, అదే ఆచారాన్ని పాలస్తీనా ప్రాంతంలో నివసించే ఫినీషియన్లు, సిరియన్లు పాటిస్తున్నారని ప్రస్తావించాడు. కానీ ఐగుప్తీయులూ మరికొన్ని జాతులూ ఆ ఆచారాన్ని అబ్రాహాము ముందటికాలం నుండే పాటిస్తున్నారు అనడానికి అతను ఆధారం చూపించలేకపోయాడు. గమనించండి; అబ్రాహామూ అతని సంతానమూ దేవుడు ఆజ్ఞాను బట్టి సున్నతిని ఆచరిస్తున్నారు తప్ప, ఇతర ప్రజల ఆచారాలను అరువు తెచ్చుకుని కాదు.

అలానే ఈ సందర్భంలో సున్నతి గురించి నిత్యనిబంధనగా రాయబడడాన్ని చూపించి (13వ) నేటి విశ్వాసులు కూడా సున్నతిని పొందాలని కొందరు బోధిస్తుంటారు. వ్యక్తిగత కారణాలను బట్టి ఎవరైనా సున్నతిని పొందవచ్చు. ఆరోగ్యపరంగా అది మంచిదే. అయితే దానివల్ల ఆత్మీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే ఆ ఆచారం క్రీస్తునందు కొట్టివెయ్యబడిందని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి (గలతీ 5:2, 6:15, కొలస్సీ 2:11, 1కోరింథీ 7: 19). ప్రారంభక్రైస్తవ సంఘంలో కూడా సున్నతి గురించి ఇలాంటి వివాదమే చెలరేగినప్పుడు అపోస్తలులు సంఘానికి స్పష్టతను ఇస్తూ ఈ సున్నతిని తృణీకరించినట్టు మనం చదువుతాం (అపొ.కా 15వ అధ్యాయం).

పాతనిబంధనలో కొన్ని ఆచారాలు నిత్యమైనవి అని చెప్పబడినప్పుడు అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని కాదు కానీ దేవుడు నిర్ణయించిన కాలం వరకూ కొనసాగాలని అర్థం. అందుకే బలులూ విశ్రాంతిదినాచారాల విషయంలో కూడా అలాంటి పదప్రయోగమే వాడబడింది (నిర్గమకాండము 31:16, లేవీయకాండము 6:12-14). కానీ క్రీస్తు సిలువమరణంతో అవన్నీ కొట్టివెయ్యబడ్డాయి (ఎఫెసీ 2:14, 2 కొరింథీ 3:14, కొలస్సీ 2:16,17, హెబ్రీ 9:10-12, 10:1). కాబట్టి సున్నతి నిత్యనిబంధన అన్నప్పుడు కూడా ఇలానే అర్థం చేసుకోవాలి.

ఆదికాండము 17:15,16 మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు. ఏలయనగా ఆమె పేరు శారా నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను. నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.

ఈ వచనాలలో దేవుడు శారా ద్వారానే నీకు సంతానం కలుగుతుందని వివరంగా చెప్పడం మనం చూస్తాం. గతంలో అబ్రాహాముకు ఆయన నీకు సంతానం కలుగచేస్తాని చెప్పినప్పుడు అది శారా మూలంగానే కలుగుతుందని చెప్పలేదు. బహుశా అబ్రాహాము ఆ సంతానం హాగరు మూలంగా కలుగుతుందనే అపార్థంతో కూడా శారా మాట విని ఆమెను భార్యగా చేసుకునియుండవచ్చు. అదేవిధంగా శారా అనే పేరుకు అందగత్తె, ఎవరైనా గుర్తించవలసిన ప్రముఖవ్యక్తి అని అర్థం.

ఆదికాండము 17:17 అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వినూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.

ఈ వచనంలో అబ్రాహాము దేవుడు తన సంతానం గురించి చెబుతున్నమాటలు విని‌ నవ్వుకున్నట్టు మనం చూస్తాం. అయితే ఆ నవ్వు అతనికున్న అవిశ్వాసం నుండి పుట్టింది కాదు కానీ‌ అతని/అతని భార్య శారీరక స్థితినిబట్టి అతని మనసులో సహజంగా పుట్టినవే (రోమా 4:19-21). ఒకవేళ అబ్రాహాము అవిశ్వాసంతోనే ఆవిధంగా నవ్వియుంటే నిబంధన సంబంధమైన సున్నతిని కూడా పాటించకపోయేవాడు. కాబట్టి విశ్వాసులు తామున్న పరిస్థితిని బట్టి మనసులో అనేక వ్యతిరేక సందేహాలు పుడుతున్నప్పటికీ దేవుని‌వాగ్దానం పట్ల విశ్వాసంతో ముందుకు సాగాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు మనకు అసాధ్యం అనిపించినవి సాధ్యం చెయ్యగల శక్తిమంతుడు.

ఆదికాండము 17:18‌ అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా-

ఈ వచనంలో అబ్రాహాము ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకనిమ్మని దేవుణ్ణి వేడుకుంటున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే అబ్రాహాముకు అప్పటికే ఇష్మాయేలు కుమారుడిగా ఉన్నప్పటికీ దేవుడు వేరొక సంతానం గురించి మాట్లాడుతున్నాడు. దీనిని బట్టి అబ్రాహాము దేవుడు చెప్పిన సంతానం తనకు కలుగగానే ఇష్మాయేలు చనిపోతాడని‌ కానీ‌ లేక దేవుడు అతడిని త్రోసివేస్తాడని కానీ భావించాడు. అందుకే ఇలా‌ ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకనిమ్మని వేడుకుంటున్నాడు. అతనిలోని తండ్రి ప్రేమకు ఇది మంచి నిదర్శనం. దేవుడు వాగ్దానం చేసిన మరో కుమారుడు కలుగబోతున్నాడని తెలిసినప్పటికీ అతను ఇస్మాయేలుపై ప్రేమను చంపుకోవడం లేదు. అతని మేలు కోసం ఆలోచిస్తున్నాడు‌. తల్లి తండ్రులు ఈ‌ మాదిరిని అనుసరించి తమకు ప్రయోజనకరంగా వర్ధిల్లిన పిల్లల విషయంలోనే కాదు తమకు జన్మించిన పిల్లలందరి విషయంలోనూ ప్రేమ‌ కలిగి వారి మేలుకోసం ఆలోచించాలి.

ఆదికాండము 17:19 దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.

ఈ వచనంలో తన మరియు తన‌ భార్యయొక్క శారీరక స్థితిని బట్టి ఆలోచిస్తున్న అబ్రాహాముకు దేవుడు నిశ్చయతను కలుగచేస్తున్నట్టు మనం చూస్తాం. మన దేవుడు మన పరిస్థితులను అర్థం చేసుకుని మనసులో పుడుతున్న సందేహాలకు‌ విరుగుడుగా నిశ్చయతను అనుగ్రహించే కృపగలవాడు. భక్తుల జీవితంలో ఇలాంటి ఉదాహరణలెన్నో మనం గమనిస్తాం. అదేవిధంగా ఆయన ఇక్కడ అబ్రాహాముకు సంతానం కలుగుతుందనే కాదు, ఆ కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా ముందే తెలియచేస్తున్నాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం.

ఆదికాండము 17:20 ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు పండ్రెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసెదను.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాము‌ ఇష్మాయేలు‌‌ నిమిత్తం చేసిన మొరను కూడా ఆలకించి అతనిని కూడా దీవించడం మనం చూస్తాం. ఇవే మాటలను గతంలో యెహోవా దూత హాగరుకు జ్ఞాపకం‌ చేసాడు (ఆదికాండము 16:10). వాస్తవానికి ఇష్మాయేలు అబ్రాహాముకు శారీరకంగా జన్మించినవాడు. అయినప్పటికీ దేవుడు‌ అతడిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే అబ్రాహాము‌ శారాలు తీసుకున్న ఆ తొందరపాటు నిర్ణయంలో అతని ప్రమేయం ఎంతమాత్రం‌ లేదు. దీనిని‌ బట్టి దేవుడు ఎవరికీ అన్యాయం చెయ్యడని మనం గ్రహించాలి. ఆయన ఇష్మాయేలు విషయంలో పలికిన ఈమాటల‌ నెరవేర్పును మనం ఆదికాండము 25:12-18 వచనాలలో చూస్తాం. నేడు ప్రపంచంలో గొప్పగా విస్తరించిన అరబ్బులు ఇతని సంతానమే.

ఆదికాండము 17:21,22 అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.

ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముతో వచ్చే సంవత్సరానికి నీకు ఇస్సాకు జన్మిస్తాడని చెప్పడం మనం చూస్తాం. ఈ నెరవేర్పు ఆదికాండము 21:1-5 వచనాలలో వివరించబడింది.

ఆదికాండము 17:23-27 అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు. ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషు లందరును అతనితో కూడ సున్నతి పొందిరి.

ఈ వచనాలలో దేవుడు చెప్పినట్టుగానే అబ్రాహాము సున్నతి నియమాన్ని పాటించడం మనం చూస్తాం. ఇక్కడ అతను దేవుడు చెప్పినదానిని‌ నెరవేర్చడానికి ఎలాంటి ఆలస్యమూ చెయ్యకుండా వెంటనే ఆ పని జరిగించాడు. పైగా ఇప్పుడున్నట్టుగా ఆకాలంలో Anaesthesia అనే పద్ధతి లేదు (సర్జరీ సమయంలో నొప్పితెలియకుండా చేసేది). ఈ కారణంచేత అబ్రాహామూ అతని ఇంటివారూ ఆ సున్నతి పొందే సమయంలోనూ తర్వాత మరి కొన్ని రోజుల వరకూ బాధను అనుభవించవలసి ఉంటుంది. అయినా సరే దేవుడు ఆజ్ఞాపించగానే బాధతో కూడిన ఆ ఆచారాన్ని పాటించడానికి అతను వెంటనే సిద్ధపడ్డాడు. ఇష్మాయేలు అనబడే తన కుమారుడి బాధను కూడా పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత కాలంలో దేవుడు ఇష్మాయేలును పంపివెయ్యమన్నప్పుడు కూడా లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ వెంటనే ఆ పని చేసాడు (ఆదికాండము 21:14). కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలు ఇలానే శారీరకంగానో మానసికంగానో బాధ కలిగేవిగా ఉండొచ్చు. అయినప్పటికీ అబ్రాహాములా వాటికి లోబడాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలకు లోబడడం మన బాధ్యత. దానివల్ల మనకే మేలు. ఉదాహరణకు అబ్రాహామూ అతని పరివారమూ సున్నతికి లోబడడం వల్ల శ్రేష్టమైన దేవుని నిబంధనలో పాలివారయ్యారు. ఇలా శ్రమయైనా బాధయైనా దేవుని ఆజ్ఞలకు లోబడిన ప్రవక్తలూ అపోస్తలులూ మరియు ప్రారంభక్రైస్తవుల జీవితంలో ఇలాంటి మేలునేగా గమనిస్తాం. చివరికి వారు దేవుని లోకమైన పరలోకంలో ప్రవేశించారు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.