పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

 

ఆదికాండము 31:1

లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.

దేవుని అద్భుతం మేరకు లాబాను మందలన్నీ మచ్చలు చారలు గల పిల్లల్ని పెట్టడం ద్వారా ఒప్పందం ప్రకారం అవన్నీ యాకోబుకు చెందాయని ముందటి అధ్యాయంలో మనం చూసాం. అది చూసిన లాబాను కుమారులు, యాకోబు తమ తండ్రి దగ్గర పడిన కష్టానికి ఆ సొత్తు ప్రతిఫలంగా వచ్చింద‌ని కానీ, యాకోబును‌ బట్టే దేవుడు తమ తండ్రి మందలను దీవించాడని కానీ ఆలోచించకుండా అతని విషయంలో అసూయపడుతూ ఈవిధంగా మాట్లాడుతున్నారు, ఈ అసూయ మానవుల పతన స్వభావాన్ని తెలియచేస్తుంది‌. ఇటువంటి అనుభవం చాలామందికి తాము పనిచేసే చోట్లలోనూ, వ్యాపారం విషయంలోనూ, చదువుల పోటీలోనూ ,చివరికి పరిచర్యలో‌ సైతం ఎదురౌతుంటుంది.

ఆదికాండము 31:2

మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.

ఈ సందర్భంలో లాబాను ముఖం ఇదివరకటివలే ఉండకుండా తేడాగా ఉండడం యాకోబు గమనించినట్టు మనకు కనిపిస్తుంది. మన మనసులో ఉన్న భావనలు ఒకోసారి మన ముఖాల్లో బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి, తోటివారి పట్ల, మన కుటుంబీకుల పట్ల మన మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. లేదంటే మన మనసుల్లో ఉన్న కల్మషం  మన ముఖాల్లో బయటపడడం ద్వారా వారికీ మనకూ మధ్య ఉన్న సంబంధంలో సమస్యలు ఏర్పడే అవకాశం‌ ఉంది.

ఆదికాండము 31:3

అప్పుడు యెహోవానీ పిత రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా-

ఈ సందర్భంలో, దేవుడు మరలా యాకోబుతో తన తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమని చెబుతూ అతనిపై ఉన్న ఆయన కాపుదలను జ్ఞాపకం చేస్తున్నాడు.

ఆదికాండము 31:4-13

యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు; మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు. అతడుపొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైయుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయననీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

ఈ సందర్భంలో యాకోబుకు తన భార్యలపై తనకున్న అధికారంతో వారికి ఏమీ చెప్పకుండా, తమ తండ్రి ఇంటి నుండి వారిని తీసుకుని వెళ్ళకుండా, వారిని తానున్న చోటికి పిలిపించి తనకూ వారి తండ్రికీ మధ్య ఇంతకాలం ఏం జరిగిందో, ఇప్పుడు తాను తన తండ్రి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడో వివరిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చెయ్యకుండా వారిని తమ తండ్రి ఇంటి నుండి కానానుకు తీసుకువెళ్ళుంటే వారు యాకోబును అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

కాబట్టి భార్యభర్తలు తాము చేయబోయే ప్రతీదానినీ ఒకరికి ఒకరు సానుకూలంగా వివరించుకుంటూ, వారిమధ్య ఎటువంటి అపార్థాలూ తలెత్తకుండా జాగ్రతపడాలి. కొన్నిసార్లు ఒక చిన్న అపార్థం కూడా వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది.

అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబు లాబాను తన విషయంలో ఎన్నిసార్లు మాటలు మార్చినా, అతను మాత్రం నిజాయితీగా కొలువు చేసానని చెబుతున్నాడు. ఒకవేళ యాకోబు లాబాను తన విషయంలో చేస్తున్న మోసాన్ని బట్టి తాను కూడా అవినీతికి పాల్పడడం, తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోవడం వంటివి చేసుంటే ఇక్కడ కానీ, చివరిలో లాబాను దగ్గరకానీ ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేవాడు కాదు.‌ కాబట్టి, కొన్నిసార్లు మనం చేసేపనిలో అన్యాయానికి గురౌతున్నప్పటికీ దేవునిపై ఆధారపడి మననుండి ఎటువంటి లోపమూ లేకుండా  చూసుకోవాలి. చివరకు మనం ఎవరిపై ఆధారపడి నిజాయితీగా నడుచుకుంటున్నామో ఆ న్యాయవంతుడైన దేవుడే యాకోబు‌ విషయంలో చేసినట్టు మనకూ ప్రతిఫలం అనుగ్రహిస్తాడు.

ఎఫెసీయులకు 6: 7 మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

ఆదికాండము 31:14-16 

అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తరమియ్యగా-

ఈ సందర్భంలో లేయా రాహేలులు యాకోబు మాటలకు తమ అనుభవాలను కూడా జతచేస్తూ, తమ తండ్రి ఇంటినుండి కానానుకు వెళ్ళడానికి సిద్ధపడినట్టు మనకు కనిపిస్తుంది. వారు అక్కడ తమ తండ్రి ఇంటిదగ్గరే ఉండాలని యాకోబుతో వాదనకు దిగలేదు, ఎందుకంటే యాకోబు మాటల్లో న్యాయం‌ ఉంది. కాబట్టి దాంపత్య జీవితంలో, మరొకరు చెప్పినమాటలను న్యాయబద్ధంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

ఆదికాండము 31:17,18

యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొనిపోయెను.

ఈ సందర్భంలో యాకోబు తనకున్న సమస్తాన్నీ వెంటబెట్టుకుని కానాను దేశానికి పయనమవ్వడం మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 31:19

లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహదేవతలను దొంగిలెను.

ఈ సందర్భంలో రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మన తెలుగు బైబిల్ లో వాటిని గృహదేవతలు అని తర్జుమా చేసినప్పటికీ, ఆ ప్రాంతపు పూర్వ సంస్కృతులపైన కొందరు బైబిల్ పండితులు చేసిన పరిశీలన ప్రకారం, అవి వారు పూజించే దేవతలు కాదు;‌ హీబ్రూ బాషలో వాటిని Teraphim అంటారు. ఆ ప్రాంతపు ప్రజలు వాటిని‌ తమ‌గృహానికి రక్షణగా (దేవదూతలులా) ఉంటాయని భావించేవారు, వాటిదగ్గర శకునాలు కూడా‌ చూసేవారు. ఇవి కుటుంబంలోని జ్యేష్ఠకుమారుడికి హక్కుగా సంప్రాప్తించేవి.

ఉదాహరణకు ఈ వచనం చూడండి -

జెకర్యా 10:2 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి.

దేవుని చేత విసర్జించబడిన సౌలు రాజు ఇంట్లో కూడా ఇలాంటిది ఉన్నట్టు మనం చూడవచ్చు -

1సమూయేలు 19:13 తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి-

ఇంతకూ రాహేలు ఈ గృహదేవతలను ఎందుకు దొంగిలించినట్టు? దీనిపై కొందరు‌, రాహేలు కూడా తమ‌ తండ్రి నుంచి వస్తున్న విశ్వాసం ప్రకారం, ఆ దేవతలు తన కుటుంబానికి రక్షణగా ఉంటాయనీ, మార్గమధ్యంలో వారెటువైపు వెళ్తున్నారో తెలుసుకోవడానికి శకునం చూడవచ్చనీ, మరి ప్రాముఖ్యంగా ఆ దేవతలు ఎవరిదగ్గర ఉంటాయో వారికి తమ తండ్రి ఆస్తిలో జ్యేష్ఠకుమారుడికి రావలసిన భాగం వస్తుంది కాబట్టి తన భర్త పడిన కష్టం నిమిత్తం భవిష్యత్తులో లాబాను ఆస్తిలో వాటాను సంపాదించడానికి కూడా అలా చేసిందని తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే మేము ఈ అభిప్రాయాలతో పూర్తిగా విభేదిస్తున్నాము.

ఎందుకంటే -

1) రాహేలు అక్కడ యాకోబు తనతో దేవుడు మాట్లాడి కానానుకు తిరిగివెళ్ళమన్నాడని  చెప్పిన మాటలను నమ్మి, ఆయన చేసిన అద్భుతం మేరకు యాకోబుకు లభించిన మందనంతా చూసి తన‌ భర్తతో కలసి వెళ్ళడానికి సిద్ధపడింది. కాబట్టి మార్గంలో శకునం చూడవలసిన అవసరం వస్తుందని కానీ, దేవుని రక్షణకు మించి మరో రక్షణ వారికి అవసరమని కానీ ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. గత చరిత్రలో ఆమెలో మనకు కొన్నిసార్లు అవిశ్వాసపు ఛాయలు కనిపిస్తున్నప్పటికీ, ఆ ప్రాంతపు ప్రజలు నమ్మే ఒక మూఢనమ్మకాన్ని ఈమె కూడా నమ్మినప్పటికీ, తరువాతి కాలంలో ఆమె దేవునిగా యెహోవాను మాత్రమే నమ్ముతుందని తన పిల్లలకు ఆమె పెట్టిన పేర్లను బట్టి మనం గుర్తించవచ్చు. కాబట్టి ఆమె ఆ దేవతలలో ఏదో శక్తి ఉందనే ఉద్దేశంలో వాటిని దొంగిలించిందని మనం భావించలేము. మరి ముఖ్యంగా, ఆ దేవతలలో ఏదో శక్తి ఉందని నమ్మే ప్రజలు వాటిపట్ల ఎంతో గౌరవంతో ఉంటారు అలాంటి గౌరవమే రాహేలుకు వాటిపై ఉండియుంటే వాటిపై కూర్చునే సాహసం చేసియుండేదా?

ఆదికాండము 31:34 రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను.

2) ఆ విగ్రహాలు రాహేలు తన‌ తండ్రి ఇంటినుండి‌ దొంగిలించేటప్పుడు అవి దొంగిలించబడ్డాయనే సంగతి తరువాతైనా తన తండ్రికీ, సోదరులకీ తెలిసిపోతుందని ఆమెకు తప్పకుండా తెలుసు. కాబట్టి ఆమె దొంగిలించిన విగ్రహాలు తన దగ్గర ఉంచుకున్నంత మాత్రాన తరువాతి కాలంలో ఆమె వాటిని తన సోదరులకు చూపించి, తన భర్తకు తన తండ్రి ఆస్తి నుండి అధికభాగం తెచ్చిపెట్టే అవకాశం లేదు. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆమె వాటిని దొంగిలించడానికి ఇవి కారణాలు కాదని మనకు అర్థమౌతుంది. ఆమె కేవలం ఆ విగ్రహాలు వెండి బంగారుతో చేయబడి ఉంటాయి కాబట్టి, వాటిపైన ఆశతోనే వాటిని దొంగిలించిందని మేము భావిస్తున్నాము.

ఆదికాండము 31:20,21

యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుటవలన అతని  మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.

ఈ సందర్భంలో యాకోబు లాబానుకు చెప్పకుండా తాను సంపాదించుకున్న సమస్తమూ తీసుకుని పారిపోవడం వల్ల అతను మోసగించినవాడిగా లేఖనం పరిగణించింది. ఇక్కడ హెబ్రీబాషలో వాడిన గానవ్ అనే పదానికి దొంగిలించడం అని అర్థం వస్తుంది. వాస్తవానికి యాకోబు లాబాను సొత్తునేమీ దొంగిలించలేదు ఒప్పందం ప్రకారం తనకు చెందినదానినీ, మరియూ తనకు సొంతమైన భార్యపిల్లలనే తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఆ విషయం తన బాధ్యతగా లాబానుకు చెప్పకుండా వెళ్తున్నాడు కాబట్టి ఆవిధంగా పరిగణించింది (దొంగచాటుగా పారిపోవడం).

అయితే యాకోబు ఈవిధంగా చెయ్యడానికి  న్యాయమైన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటినుండీ లాబాను ఇతడిని మోసగిస్తూ వస్తున్నందువల్ల ఈసారి కూడా ఆడినమాటను తప్పి తన కుమార్తెలను బలవంతంగా లాక్కుంటాడేమో అని ఇతను భయపడ్డాడు.

ఆదికాండము 31:31

యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని.

కానీ యాకోబు తనపై ఉన్న దేవుని కాపుదలను స్పష్టంగా గమనిస్తూ వచ్చాడు కాబట్టి ఈవిషయంలో  భయానికి లోనై తన బాధ్యతను విస్మరించి లాబానుతో చెప్పకుండా ఇలా పారిపోకుండా ఉండవలసింది.

ఆదికాండము 31:22,23

యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదుకొండ మీద అతని కలిసికొనెను.

19వ వచనం ప్రకారం రాహేలు తన తండ్రి ఇంటి నుండి గృహదేవతలను దొంగిలించేసరికి (యాకోబు పారిపోయే సమయానికి) లాబాను తన గొఱ్ఱెల బొచ్చును కత్తిరించడానికి వెళ్ళాడు. ఆకాలంలో మందలున్న‌చోటికీ, వారి‌ నివాసానికీ మధ్య చాలా దూరం ఉంటుంది. ఉదాహరణకు 30:36వ వచనం ప్రకారం గతంలో లాబాను యాకోబు మందలు మేపే చోటికీ, తన కుమారులు మేపే చోటికీ మధ్యలో మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉండేలా చేసాడు. ఈవిధంగా ఆలోచించినప్పుడు లాబాను తన మందల గొఱ్ఱెల బొచ్చును కత్తిరించడానికి తన ఇంటినుండి చాలా దూరమే వెళ్ళి‌ఉండవచ్చు. కాబట్టి అతనికి యాకోబు పారిపోయాడనే సమాచారం మూడవరోజున తెలిసింది. ఆ సమాచారం తెలుసుకున్న‌ లాబాను తన బంధువులందరినీ పోగుచేసుకుని ఏడు రోజుల ప్రయాణమంత దూరంలో అతడిని కలుసుకున్నాడు.

ఆదికాండము 31:24

ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.

ఈ సందర్భంలో యాకోబుపై కోపంతో అతడిని తరుముతున్న లాబానుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై హెచ్చరిక చెయ్యడం మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రవక్తలతో మాత్రమే కాకుండా ఆ ప్రవక్తలతో సంబంధం కలిగియున్నవారితో కూడా, వారి క్షేమం నిమిత్తం మాట్లాడిన సందర్భాలు కొన్ని మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఆయన అబ్రాహాము నిమిత్తం అబీమెలకు రాజుతో మాట్లాడాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం ఏమిటంటే ఒకవ్యక్తితో దేవుడు మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా మారిపోయి ఆయనకు దాసుడు కాడు.

ఆయన సార్వభౌమ నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే ఆయనకు సదా దాసులుగా మారుమనస్సు పొందుతారు. ఈ సందర్భంలో ఆయన లాబానుతో మాట్లాడినప్పటికీ ఆ మాటలు కేవలం అతడిని యాకోబుకు ఎటువంటి హానీ చెయ్యకుండా నియంత్రిస్తున్నాయే తప్ప అతని జీవితాన్ని మార్చడం లేదు; ఒకవేళ మార్చే ఉంటే, యాకోబు దగ్గర తన పొరపాటును మరచిపోయి వాదించేవాడు కాదు. అదేవిధంగా ఈరోజుకీ దేవుడు ఎంతోమంది దుష్టులతో వారి మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ నీతిమంతులకు హాని చెయ్యకుండా నియంత్రిస్తున్నాడు, లేకపోతే చంపాలకున్న ప్రతీవారూ చంపుకునిపోదురు.

అదేవిధంగా ఈ సందర్భంలో దేవుడు లాబానుతో మాట్లాడుతూ నీవు యాకోబుతో మంచి కానీ, చెడు కానీ ఏమీ మాట్లాడకు అంటున్నాడు. దానర్థం అసలేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండమని కాదు. దానర్థం అదే అయితే నువ్వు యాకోబును కలుసుకోకుండా వెనక్కు వెళ్ళిపోమని చెప్పేవాడు. జరిగిన చరిత్రనంతా పరిశీలించినప్పుడు, ఇక్కడ లాబాను యాకోబు దగ్గరకు‌ వెళ్ళడంలో‌ అతనికి రెండు‌ ఉద్దేశాలు ఉన్నట్టు మనకు అర్థమౌతుంది.‌ మొదటిగా అతను యాకోబు చేసినదాని విషయంలో కోపంతో ‌ఉండి అతనికి ఏదైనా హాని చెయ్యడానికి వెళ్తున్నాడు.

రెండవదిగా యాకోబు తనను విడిచిపెట్టిపోవడం లాబానుకు మొదటి నుండీ ఇష్టం లేదు, యాకోబు నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అన్నపుడు అతను‌ తప్పక అంగీకరించాడే తప్ప ఇష్టంతో కాదు. ఎందుకంటే‌ యాకోబును బట్టే దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడని అతను నమ్మాడు.

ఆదికాండము 30:27 

అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

దీనిప్రకారం అతను యాకోబును ఏదోలా వెనక్కు తీసుకుని వెళ్ళే ఉద్దేశంతో కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి దేవుడు అతనితో నీవు అతనితో కీడుకానీ (హానిచేసేలా కానీ) మేలుగా కానీ (తిరిగి నీదగ్గరకు తీసుకుని వెళ్ళేలా కానీ) ఏమీ మాట్లాడవద్దని చెబుతున్నాడు.

ఆదికాండము 31:25-28 

లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసికొనెను. అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.

ఈ సందర్భంలో లాబాను యాకోబు తనకు చెప్పకుండా తన కుమార్తెలనూ, వారిపిల్లలనూ తీసుకుని పారిపోయాడనే కోపంలో ఈవిధంగా మాట్లాడుతూ నిందనంతా యాకోబుపైనే వేస్తున్నాడు. ఒక తండ్రిగా అతని కోపంలో కొంతమట్టుకు న్యాయం ఉన్నప్పటికీ, జరిగినదానిలో నిందనంతా యాకోబుపై మాత్రమే వేసే హక్కు ఇతనికి ఏమాత్రం లేదు. ఎందుకంటే, అసలు యాకోబు అలా ఆలోచించడానికి కారణం ఏంటి?

ఆదికాండము 31:31 యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని.

20 సంవత్సరాలుగా లాబాను మోసపూరిత స్వభావాన్ని యాకోబు గమనిస్తూ ఎంతో అన్యాయానికి గురయ్యాడు.మరలా ఆవిధంగానే అన్యాయానికి గురౌతాననే భయంతోనే యాకోబు లాబానుకు చెప్పకుండా పారిపోతున్నాడు. కాబట్టి యాకోబు చేసింది పొరపాటే అయితే ఆ పొరపాటును అతను‌ చెయ్యడానికి కారణమే లాబాను. కొంచెం జీతంలోనే నమ్మకంగా ఉండకుండా 10 సార్లు తన జీతాన్ని మార్చిన లాబాను ఇంతమంద, తన కుమార్తెల విషయంలో నమ్మకంగా ఉండి తనతో పంపిస్తాడని యాకోబు ఎలా నమ్మగలడు? కాబట్టి యాకోబు తనకు చెప్పకుండా పారిపోయే పరిస్థితిని కల్పించింది లాబానే అని మనం కచ్చితంగా చెప్పవచ్చు.

కాని, ఇక్కడ లాబాను వాదనలో మనకు మానవ పతనస్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.  అతను ఏమాత్రమూ యాకోబు విషయంలో తాను చేస్తూ వచ్చిన పొరపాటును గుర్తించకుండా, నిందనంతా యాకోబుపైనే‌ నెట్టివేస్తున్నాడు. ఇటువంటి‌ స్వభావం ఉన్న మనుషులు మనకు చాలామంది సమాజంలో తారసపడుతూ ఉంటారు.

కీర్తనలు 19:12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?

కాబట్టి ఒక విశ్వాసిగా, ఒకరు మనపట్ల ఏదైన పొరపాటుగా ప్రవర్తించినప్పుడు దానివిషయమై వారిపై నిందవేసే ముందు, వారు మనపట్ల ఆ విధంగా ప్రవర్తించడానికి మనలో కూడా ఏదైనా లోపం ఉందా, వారు అటువంటి పొరపాటు‌ చేసే పరిస్థితిని మనమే వారికి కల్పించామా అని ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. ఇది నైతికత ఉన్న వ్యక్తులు మాత్రమే అనుసరించగలరు.

ఆదికాండము 31:29 

మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.

ఈ సందర్భంలో లాబాను ఒకవిధంగా దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ఒప్పుకుంటూనే,  అప్పుడు కూడా తనతో ఉన్న బంధువులను బట్టి నేను తలచుకుంటే నీకు హాని చేయగలననే గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. పతనమైన మానవుడు ఇదేవిధంగా తనకున్న మంది, ఆస్తిని బట్టి తాను ఏమైనా చేయగలననే గర్వంతో ప్రవర్తిస్తుంటాడు. తగిన కాలంలో దేవుడు ఆ గర్వాన్ని అణచివేస్తాడు.

ఆదికాండము 31:30

నీ తండ్రి యింటి మీద బహు వాంఛగలవాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా-

ఈ సందర్భంలో లాబాను దొంగిలించబడిన తన గృహదేవతల నిమిత్తం కూడా యాకోబును నిందించడం మనకు కనిపిస్తుంది కానీ యాకోబు వాటిని దొంగిలించలేదు, పైగా ఆ పని అతనే చేసాడనడానికి లాబాను దగ్గర ఎటువంటి సాక్ష్యమూ లేదు. అయినప్పటికీ అతను యాకోబు తనకు చెప్పకుండా పారిపోయాడు కాబట్టి తన గృహదేవతలను అతనే దొంగిలించాడనే అనుమానంతో ఈవిధంగా ఆరోపణ చేస్తున్నాడు.

మన సమాజంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతరులపై కేవలం అనుమానంతోనో, ద్వేషంతోనో మోపబడే ఆరోపణలు మనం‌ చాలా చూస్తుంటాం. కొన్నిసార్లు ఆ ఆరోపణల‌ వల్ల ఏ తప్పిదం చెయ్యని అమాయకులు కూడా అన్యాయంగా శిక్షకూ అవమానానికీ లోనౌతారు. ఒక వ్యక్తిపై మనకు ఏదైనా అనుమానం ఉన్నపుడు అతడిని ప్రశ్నించడం తప్పుకాదు కానీ, కచ్చితంగా ఆ పని అతనే చేసాడని ధృవీకరించడం మాత్రం సరికాదు.

కాబట్టి, ఒక విశ్వాసిగా, నైతికత ఉన్న మనిషిగా మనం ఇతరులపై ఆరోపణ చేసేముందు దానికి తగిన ఆధారం మనదగ్గర ఉండాలి. వారు ఇతర విషయాలలో దోషులైనంత మాత్రాన ఆ తప్పిదం కూడా వారే చేసారని మనం ఖచ్చితంగా ధృవీకరించకూడదు దానిని తెలుసుకోవడానికి తగిన రీతిలో విచారణ జరిపించాలి.

ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం  ఏమిటంటే, ఇక్కడ లాబాను మనసులో యాకోబు తీసుకుపోతున్న సంపదను‌ బట్టి కలిగే బాధకంటే తన దేవతలను దొంగిలించుకుపోతున్నాడనే కోపమే ఎక్కువ కనిపిస్తుంది. ఇటువంటి మరో సందర్భాన్ని కూడా చూడండి.

న్యాయాధిపతులు 18:24 అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదేమన్న మాట అనగా-

ఈ సందర్భంలో మీకా అనేవాడు తాను చేయించిన దేవతలను దానీయులు పట్టుకుపోయేసరికి, మీరు వీటిని పట్టుకుపోతున్నారు ఇక నాకేముందని వేదనతో వారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే తన దేవతలను ఎవరో పట్టుకుపోయేసరికి తనకిక ఏమీలేదు అనే స్థితిలోకి అతను కూరుకుపోయాడు. దీనిని బట్టి ఈరోజు జీవముగల దేవునిపిల్లలుగా భావించేవారు కొందరు బుద్ధి తెచ్చుకోవాలి. విగ్రహారాధికులైన వారు తాము చేయించుకున్న దేవతల విషయంలో అవి వారి దగ్గర లేకపోతే ఇక వారికేమీ లేదన్నంత భక్తి ప్రేమలు కలిగుంటుంటే, జీవము గల దేవుని పిల్లలమని చెప్పుకునేవారు మాత్రం తమ దేవుణ్ణి ఎన్నోసార్లు తమ క్రియలతో  విడిచిపెడుతుంటారు.

ఆదికాండము 31:31,32

యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని . ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.

ఈ సందర్భంలో మొదటిగా, యాకోబు లాబాను తనపై వేస్తున్న నిందకు స్పందిస్తూ నేనలా పారిపోడానికి నీపట్ల ఏర్పడిన భయమే కారణమంటూ సమాధానం చెబుతున్నాడు.  రెండవదిగా గృహదేవతల విషయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ అటువంటి పనిచేయరనే నమ్మకంతో ఉండి, ఎంతో ధైర్యంగా అవి ఎవరిదగ్గర దొరుకుతాయో వారు చస్తారని తీర్పుతీరుస్తున్నాడు.

ఇక్కడ యాకోబు తన కుటుంబం విషయంలో అటువంటి నమ్మకం కలిగియుండడం తప్పుకాదు కానీ, తన కుటుంబ సభ్యుల ప్రవర్తనను పరీక్షించకుండా ఆ నమ్మకాన్ని కనుపరచడం మాత్రం తప్పే ఔతుంది. గతంలో లేయా, రాహేలులు ఏవిధంగా లోపయుక్తమైన తమ ప్రవర్తనను కనుపరిచారో అతనికి తెలుసు; అదంతా తెలిసిన యాకోబు ఈ విషయంలో కూడా వారిలో ఎవరైనా అటువంటి తప్పిదం చేసారా అని ఆలోచించకుండా వారిపట్ల కనపరచిన నమ్మకం ఒక మూఢనమ్మకంతో సమానం.

దానివల్ల ఒకవేళ ఆ గృహదేవతలు రాహేలు దగ్గర లాబానుకు దొరికే ఉంటే తాను పలికిన‌మాట ప్రకారం తానే ఆమెను చంపవలసి వచ్చియుండేది. కాబట్టి మనం మన కుటుంబసభ్యుల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ నమ్మకంతో మాట్లాడేముందు వారి ప్రవర్తనను పరిశీలించడం చాలా ముఖ్యం.

ఆదికాండము 31:33-35

లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతనికేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమయెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.

ఈ సందర్భంలో లాబాను యాకోబు కుటుంబం మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి వేసుకున్న గుడారాలలోకి వెళ్ళి తన గృహ దేవతల కోసం వెదకడం కనిపిస్తుంది. రాహేలు తనకున్న తెలివితేటలతో వాటిపై కూర్చుని తాను నెలసరిలో ఉన్నందువల్ల అక్కడి నుండి లేవలేనని చెప్పి తన తండ్రికి తాను చేసిన దొంగతనం తెలియకుండా తప్పించుకుంది.

ఆదికాండము 31:36,37

యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.

ఈ సందర్భంలో యాకోబు లాబాను కావాలనే తనపై ఇటువంటి దొంగతన ఆరోపణను మోపుతున్నాడని భావించి అతనితో ఈవిధంగా వాదిస్తున్నాడు. ఎందుకంటే అతనికి రాహేలు ఆ దొంగతనం చేసిందని తెలియదు.

ఆదికాండము 31:38-42

ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొనిపోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడినదాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.

ఈ సందర్భంలో యాకోబు లాబాను తనకు చేసిన మోసమంతటినీ, తాను పడిన కష్టమంతటినీ, చివరికి దేవుడు తనకు చేసిన‌ మేలును కూడా లాబాను తీసుకువచ్చిన బంధువుల ముందు వివరించడం, మనకు కనిపిస్తుంది. దీనిద్వారా లాబాను ఏ‌ బంధువులనైతే యాకోబుకు‌ విరుద్ధంగా పోగుచేసుకుని వచ్చాడో వారిముందే తానొక మోసగాడిగా అవమానించబడ్డాడు.

ఆదికాండము 31:43,44

అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా-

ఈ సందర్భంలో లాబాను యాకోబుతో ఉన్నదంతా తనదని చెబుతూ, అతనితో నిబంధన చేసుకోవడానికి సిద్ధపడడం మనకు కనిపిస్తుంది.  ఇక్కడ లాబాను తాను యాకోబుపై వేసిన నిందకు అతను తిరిగి నిందను వేసేసరికి దానికి సమాధానం ఇవ్వలేక నీతో ఉన్నదంతా నాదే వారిని నేనేం చేయగలనంటూ ఆ నిందను దాటవేస్తూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతను అక్కడ ఎటువంటి విధ్వంసమూ సృష్టించకుండా ఉన్నది వారిపై ఉన్న ప్రేమను బట్టే కాదు దేవుడు చేసిన హెచ్చరికను బట్టే.

ఒకవేళ దేవుడు ఆవిధంగా అతడిని హెచ్చరించకుండా ఉంటే ఆవేశంలో తప్పకుండా యాకోబుకు ఏదోవిధంగా హాని తలపెట్టేవాడు. ఆ సమయంలో ప్రతిఘటించే తన కుమార్తెలకు కూడా హాని సంభవించి ఉండేది. ఆవేశంలో ఉన్న మనిషి ఒకోసారి తన విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తాడు; కొందరు అలా చేసాక తప్పకుండా పశ్చాత్తాపపడి వేదనను అనుభవిస్తారు. దీనిని బట్టి లాబాను తనకున్న ఆవేశంలో యాకోబు కుటుంబానికి హాని తలపెట్టి వారిపై ఉన్న ప్రేమతో తరువాత తప్పకుండా‌ బాధపడేవాడు. ఒకవిధంగా దేవుడు అతనిని హెచ్చరించడం‌ వల్ల‌ యాకోబుకే కాదు, ఇతనికి కూడా మేలు చేసాడు.

ఆదికాండము 31:45,46

యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.

ఆ కాలంలో ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక నిబంధన చేసుకున్నపుడు  దానికి సాక్ష్యంగా ఒక గుర్తును పెట్టుకోవడం కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో పత్రాలు సాధారణ ప్రజలకు అంతగా వాడుకలో లేవు. ఈ సందర్భంలో లాబాను‌ యాకోబులు చేసుకున్న నిబంధనకు సాక్ష్యంగా రాళ్ళను పెట్టడం జరిగింది.

అదేవిధంగా, లాబాను యాకోబును‌ ఎన్నోసార్లు మోసగించాడు, ఇక్కడిదాకా తరుముకుంటూ వచ్చి తనపై పారిపోతున్న నిందను మాత్రమే కాకుండా దొంగతనాన్ని కూడా అంటగట్టి అతని గుడారాలన్నీ గాలించి అవమానించాడు. కానీ, లాబాను మనం నిబంధన చేసుకుందామని పిలిచేసరికి యాకోబు తన మనసులో అతనిపట్ల ఎటువంటి ద్వేషాన్నీ పెట్టుకోకుండా సమాధానపడడానికి సిద్ధపడ్డాడు, అతడిని క్షమించాడు. ఇటువంటి క్షమించే మనసు విశ్వాసులందరూ కలిగియుండాలి, మనపట్ల పొరపాటు చేసినవారు మనతో సమాధానపడడానికి ప్రయత్నించినప్పుడు వారు తమ పొరపాటును గుర్తించారని ఎరిగి వారితో సమాధానపడాలి.

రోమీయులకు 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

ఆదికాండము 31:47

లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. 

ఇక్కడ లాబాను యాకోబులు ఆ రాళ్ళకుప్పకు పెట్టిన రెండు పేర్లకూ 'సాక్ష్యపుకుప్ప' అనే అర్థం వస్తుంది.‌ లాబాను దానికి అరామిక్ భాషలో ఆ పేరుపెడితే, యాకోబు హెబ్రీబాషలో పెట్టాడు.

ఆదికాండము 31:48

లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగానుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.

ఇక్కడ లాబాను దానికి మిస్పా అనే పేరును కూడా పెట్టినట్టు కనిపిస్తుంది, దానికి 'కావలి గోపురం' అని అర్థం.

ఆదికాండము 31:49,50

అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.

ఈ సందర్భంలో లాబాను తన కుమార్తెల క్షేమం నిమిత్తం యాకోబుతో దేవునిని సాక్ష్యంగా పెట్టి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఇది ఒక తండ్రికి తన పిల్లలపై  సహజంగా ఉండే ప్రేమను తెలియచేస్తుంది. కానీ ఇదే లాబానుపై తన కుమార్తెలు మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడని ఆరోపించడం ఇదే అధ్యాయం ప్రారంభంలో మనకు కనిపిస్తుంది.
అక్కడ  ఆ కుమార్తెలు చేసిన ఆరోపణను సత్యంగానే మనం భావించాలి, ఎందుకంటే లాబాను ప్రవర్తన అదేవిధంగా ఉంది.

వాస్తవానికి లాబాను మనసులో తన కుమార్తెల పట్ల ప్రేమ ఉంది కానీ, ఆ ప్రేమను తనకున్న మోసపూరితమైన దురాశలు బయటపడకుండా చేసి స్వంతకుమార్తెల చేతనే నింద అనుభవించేట్టు చేసాయి. మనకున్న స్వార్థపు, మోసపూరితమైన ఆలోచనలు మన సంబంధాలను దెబ్బతీస్తాయనడానికి ఇది మంచి‌ ఉదాహరణ.

ఆదికాండము 31:51,52

మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.

ఈ సందర్భంలో లాబానుయాకోబులు ఒకరిపై ఒకరు ఎటువంటి హానినైనా చేసే ఉద్దేశంతో ఆ కుప్పను దాటకూడదని లాబాను ఆ రాళ్ళను సాక్ష్యంగా పెట్టి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. లాబాను మనసులో భవిష్యత్తులో యాకోబు మరింత అభివృద్ధి చెందాక తాను చేసిన కీడు నిమిత్తం తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆలోచించాడు. అందుకే ఇటువంటి నిబంధనను అతనితో చేస్తున్నాడు.

ఆదికాండము 31:53

అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.

ఈ సందర్భంలో లాబాను దేవుని పేరిట ప్రమాణం చేస్తూ ఆయన అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడని ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఆయన రిబ్కా వివాహం విషయంలో అది యెహోవా వలన కలిగిన కార్యమని ఒప్పుకున్నాడు. అంటే లాబానుకు యెహోవాయే దేవుడని తెలుసు. ఈ సత్యం తెలిసిన లాబానుకు ఇంకా గృహదేవతలతో పనేంటి? కొందరికి సత్యమేంటో తెలిసినప్పటికీ దానిని పూర్తిగా అనుసరించలేరని లాబానును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఆదికాండము 31:54,55

యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుపెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయెను.

ఈ సందర్భంలో లాబాను యాకోబులు ఇద్దరూ యెహోవా దేవుని పేరిట నిబంధన చేసుకుని, ఆయనకు బలిని అర్పించి, వారి బంధువులతో కలసి భోజనం చేసి సమాధానంగా ఎవరి మార్గాన వారు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఈవిధంగా దేవుడు యాకోబుపై కోపంతో వచ్చిన లాబానును మార్గమధ్యంలోనే హెచ్చరించి సమాధానపడి వెళ్ళేలా చేసాడు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.