పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gen24 thumb

 

ఆదికాండము‌ 24:1 

అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడైయుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.

అబ్రాహామును దేవుడు మొదటి నుండీ భౌతికపరమైన సంపదలతో ఆశీర్వదించినప్పటికీ అతనికి కుమారుడు లేడనే లోటు కనిపించేది. ఇస్సాకు జననంతో ఆ లోటు కూడా అబ్రాహాముకు తీరి సమస్తమూ కలిగినవాడిగా ఉన్నాడు.

ఆదికాండము 24:2-4

అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము; నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

ఈ సందర్భంలో అబ్రాహాము తన ఇంటిని ఏలే పెద్ద దాసునితో ఇస్సాకు వివాహం నిమిత్తం ప్రమాణము చేయిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దాసుని పేరు ఇక్కడ మనకు కనబడనప్పటికీ  ఆదికాండము 15:2లో దమస్కు ఏలియెజరు అనే వ్యక్తి కనిపిస్తాడు, అబ్రాహాము తనకు సంతానం కలగకపోతే అతనే తన ఆస్తి అంతటికీ కర్త ఔతాడని దేవునితో పలకడం ద్వారా అతనే అబ్రాహాము ఇంటిని ఏలుతున్న దాసుడని అర్థమౌతుంది.

మొదటి వచనం ప్రకారం, అబ్రాహాము అప్పటికి బహువృద్ధుడిగానూ, ఐశ్వర్యవంతుడిగానూ ఉన్నాడు; అతని మరణ దినమెపుడో అతనికి తెలీదు కాబట్టి, ఇస్సాకు విషయంలో తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చి తద్వారా ఇస్సాకు సంతానం తన ఆస్తిని స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతో అతని వివాహ విషయంలో ఈ విధంగా త్వరపడుతున్నాడు.

అదేవిధంగా ఈ సందర్భంలో అబ్రాహాము అతనితో ప్రమాణం చేయించడానికి తన తొడ క్రింద చెయ్యిని పెట్టమనడం కనిపిస్తుంది. Near East Asia ప్రాంతపు పురాతన‌కాల ప్రమాణ విధానాల్లో ఇది ఒకటి. ఇటువంటి ప్రమాణాన్ని యాకోబు విషయంలో కూడా మనం చూస్తాం -

ఆదికాండము 47:29 ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా యెడల నీకు కటాక్షమున్న యెడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.

కొంతమంది మత్తయి సువార్త 5వ అధ్యాయం‌లో యేసుక్రీస్తు ఎంతమాత్రమూ ఒట్టు పెట్టుకోవద్దు అని పలికిన మాటలను బట్టి మనం ప్రమాణం చేయకూడదని భావిస్తుంటారు; వాస్తవానికి యేసుక్రీస్తు చెబుతున్న మాటల అర్థం అది కానే కాదు. దానిగురించి మత్తయి సువార్త 5వ అధ్యాయపు వివరణలో చూద్దాం. మోషే ధర్మశాస్త్రంలో భక్తులు ఆయన పేరిట ప్రమాణం చేయాలనీ మరియు భక్తులు ఎంతోమంది ఆ విధంగా చేసినట్టు మనకు కనిపిస్తుంది.

అదేవిధంగా ఈ సందర్భంలో అబ్రాహాము తన కుమారుడికి కానానీయుల కుమార్తెలలో ఎవర్నీ వివాహం చేయకూడదని చెబుతున్నాడు. ఆదికాండము 9:25 ప్రకారం కానాను శపించబడ్డాడు, భవిష్యత్తులో దేవుడు ఆ ప్రాంతపు ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాడు. ఇందుచేతనే అబ్రాహాము అతని సంతానంలో ఏ స్త్రీనీ తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అబ్రాహాము సంతానం దేవుని చేత ఆశీర్వదించబడింది. ఇశ్రాయేలీయుల కాలంలో కూడా ఈ కానానీయుల కుమార్తెలను వివాహం చేసుకోకూడదనే కట్టడ నియమించినట్లు మనం చూస్తాం.

ఆదికాండము 24:5-9 

ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొనిపోకూడదు సుమీ. నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడినీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.

ఈ సందర్భంలో మొదటిగా, అబ్రాహాము ఏలియాజరును ప్రమాణం చేయమన్నపుడు ఊరికే చేసేయకుండా, ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే ఏం చేయాలని తాను చేసే విషయమై జాగ్రత వహిస్తున్నాడు. ఒకవేళ ఇది అడగకుండా అతను ప్రమాణం చేసి వెళ్ళిపోతే ఆ స్త్రీ అతనితో రాకపోతే, చేసిన ప్రమాణాన్ని నిలుపుకోలేనివాడిగా ఇతను కూడా దేవుని ముందు నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రమాణానికి ఆయనే సాక్షి. మనం కూడా ఎవరికైనా ప్రమాణం చేయవలసి వచ్చినపుడు తొందరపడకుండా జాగ్రతలు తీసుకోవాలి. అబ్రాహాము ఏలియాజరుకు ఆ ప్రమాణం విషయంలో కల్పించిన వెసులుబాటు మనకు ఉన్నపుడు ప్రమాణం చేయవచ్చు.

అబ్రాహాము ఈ సందర్భంలో, ఇస్సాకును రిబ్కా ఉన్న తన బంధువుల ఇంటికి తీసుకుని వెళ్ళకూడదని ఏలియాజరుతో కచ్చితంగా చెబుతున్నాడు. దీనికి కారణం దేవుడు‌ అబ్రాహాముకు  ప్రత్యక్షమైనపుడు తాను చూపించే కానాను దేశానికి వెళ్ళమని  ఆజ్ఞాపించాడు, అబ్రాహాము కానాను దేశంలో నివసిస్తూ దేవుని పిలుపును మీరి తాను బయలుదేరి వచ్చిన స్వదేశానికి తిరిగివెళ్ళే ప్రయత్నాన్ని తనకు ఆ దేశం జ్ఞాపకం ఉన్నప్పటికీ చేయలేదు.

హెబ్రీయులకు 11:15 వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

అబ్రాహాము తనంతట తాను దేవుని ‌పిలుపుకు ఏవిధంగా లోబడ్డాడో ఇస్సాకు విషయంలో కూడా అటువంటి జాగ్రతనే తీసుకుంటున్నాడు, ఒకవేళ ఇస్సాకు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులకు ఆకర్షితుడై అక్కడే నివసించాలని కోరుకుంటే దేవుని పిలుపును ఎదిరించినవాడు ఔతాడు. విశ్వాసులైన తల్లితండ్రులు కూడా తమ పిల్లల‌ విషయంలో ఇటువంటి బాధ్యతను కలిగుండి, తమ పిల్లలముందు దేవు‌ని పిలుపుకు వ్యతిరేకంగా మార్చే అన్ని మార్గాలనూ మూసివేసే ప్రయత్నం‌ చేయాలి. ఎందుకంటే, రెండవ పేతురు 2:21 లో ఇలా ఉంది - వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

అదేవిధంగా అబ్రాహాము ఈ సందర్భంలో దేవుడు తన దూతను పంపి ఏలియాజరు వెళ్ళే కార్యాన్ని సఫలం‌ చేస్తాడని కచ్చితంగా చెబుతున్నాడు. ఎందుకంటే అబ్రాహాము చేసే ఈ కార్యం దేవుని పిలుపుకు విధేయత చూపేదిగా కనిపిస్తుంది. అందుకే కానానీయుల కుమార్తెలను తన కుమారుడికి వివాహం చేయలేదు, మరియు ఇస్సాకుని అక్కడికి పంపడం లేదు. దీనిప్రకారం విశ్వాసులైనవారు దేవుని పిలుపు(ఆజ్ఞ) ప్రకారం ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినపుడు దానికి దేవుడు తన దూతలను పంపి సహాయం‌ చేస్తాడని నిశ్చయించుకోవచ్చు.

హెబ్రీయులకు 1:14 వీరందరు(దూతలు) రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?

ఆదికాండము 24:10-27

అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొనిపోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను - నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.

అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేది పోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.

మరియు ఆమెమా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించెననెను.

ఈ సందర్భంలో అబ్రాహాము దాసుడు, ఆ దేశపు స్త్రీలలో ఇస్సాకు వివాహం చేసుకోబోయే స్త్రీ ఎవరో తెలుసుకొనేందుకై దేవుణ్ణి ఒక‌ సూచన అడిగినట్లు మనకు కనిపిస్తుంది. దీని ఆధారంగా చాలామంది, నేటికీ కూడా వివాహాల విషయంలోనూ, ఇతర కార్యాల‌ విషయంలోనూ దేవున్ని సూచనలు అడుగుతూ ఉంటారు. వాస్తవానికి ఆ విధంగా అడగమని బైబిల్ మనకు ఇప్పుడు నేర్పించడం లేదు, పైన మనం చూసిన సందర్భమంతా వాక్యప్రత్యక్షతను అనుగ్రహించకుండా దేవుడే స్వయంగా ప్రత్యక్షమై తన భక్తులను‌ నడిపించే కాలానికి సంబంధించింది. కాబట్టి, అటువంటి సూచనలు దేవుడు అనుగ్రహిస్తాడని భావించకుండా వాక్యప్రత్యక్షతను ‌బట్టి ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించుకోవాలి.

ఒకవేళ ఏలియాజరులా మనం కూడా వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి సూచన అడిగినప్పటికీ, అతను నిర్థారించుకున్నట్టు మనం చేయలేము. ఎందుకంటే, ఏలియాజరు తన యజమానుడికి కాబోయే భార్య ఏవిధంగా ఉండాలో దేవుణ్ణి సూచన అడిగినప్పటికీ, అది నెరవేరాక ఆమెను మళ్ళీ వ్యక్తిగత వివరాలు అడుగుతున్నాడు. ఎందుకంటే, అతను అబ్రాహాముతో చేసిన ప్రమాణం ప్రకారం, ఇస్సాకుకు కాబోయే భార్య అబ్రాహాము బంధువుల కుమార్తెయై ఉండాలి. అందుకే ఏలియాజరు అడిగిన సూచన నెరవేరినప్పటికీ, అది దేవుడే నెరవేర్చాడో లేక సాధారణంగానే అలా జరిగిందో తెలుసుకునేందుకు ఆమె‌ తండ్రి ఇంటివారి వివారాలు అడుగుతున్నాడు. ఆమె అబ్రాహాము బంధువుల కుమార్తెయే అని నిర్థారించుకున్నాక దేవుడే అతను అడిగిన సూచన నెరవేర్చి, అతన్ని సరైన స్థలానికే నడిపించాడని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు.

మనం ఇటువంటి సూచనే దేవుణ్ణి అడిగినప్పటికీ ఏలియాజరు ముందున్న ప్రమాణం మనకేదీ లేదు కాబట్టి ఆ విధంగా నిర్థారించుకోలేము. ఒకవేళ విశ్వాసులనే, అవివాహితులనే చేసుకోవాలనేది మనం ప్రమాణంగా తీసుకుని సూచన అడిగినప్పటికీ అటువంటివారు చాలామంది మనకు కనిపిస్తారు. వారిలో ఆ సూచన నెరవేరినప్పటికీ అది కచ్చితంగా దేవుడే నెరవేర్చాడా లేక సాధారణంగా జరిగిందా అని ఎలా తెలుసుకుంటాం?

అదేవిధంగా ఏలియాజరు ఈ సందర్భంలో రిబ్కాను కనుగొనేందుకు ఏ ఆటస్థలంలోనో మరోచోటనో వెదకలేదు కానీ, ప్రతీ స్త్రీ తన కుటుంబ బాధ్యత ప్రకారం ప్రతీదినం వచ్చిపోయే నీళ్ళబావి దగ్గరే వెదుకుతున్నాడు, దీనిప్రకారం రిబ్కా తన బాధ్యతలు తెలిసినదై ఉంటుందని అతను‌ భావించాడు.

ఏలియాజరు బావి దగ్గరకు రాగానే తన కార్యం నిమిత్తం దేవుణ్ణి సూచన అడుగుతూ ప్రార్థించాడు. అదేవిధంగా రిబ్కాను కనుగొన్న తరువాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దీన్ని బట్టి విశ్వాసులు ప్రతీ విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయాన్ని అర్థించాలనీ, తమ‌ కార్యం నెరవేరాక ఆయనకు దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని గుర్తించాలి.
కొంతమంది కార్యానికి ముందు దేవుణ్ణి ప్రార్థనలో బ్రతిమిలాడతారు కానీ అది సఫలమయ్యాక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం మరచిపోతారు.

ఆదికాండము 24:28-33

అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాననునొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొనిపోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెలు దగ్గర నిలిచి యుండగా లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడనున్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.

ఈ సందర్భంలో యాకోబు మామయైన లాబాను ప్రస్తావన మనకు కనిపిస్తుంది. వచ్చిన వ్యక్తి అబ్రాహాము దాసుడని‌ అతనికి తెలియనప్పటికీ, అతన్ని యెహోవా పేరట పిలవడం ద్వారా ఆ కుటుంబమంతా యెహోవా దేవుణ్ణి ఎరిగినవారే అని మనకు అర్థమౌతుంది. అంతమాత్రమే కాకుండా అబ్రాహాము దాసుడు రిబ్కాకు ఇచ్చిన బంగారాన్ని బట్టి కూడా లాబాను అతని పట్ల అంత ఆసక్తిని కనపరచి ఉండవచ్చు ఎందుకంటే, లాబానులోని లాభాపేక్ష స్వభావం యాకోబు విషయంలో మనకు కనిపిస్తుంది.

అదేవిధంగా,  అబ్రాహాము దాసుడు అతను ఆ ఇంటికి వచ్చిన కారణం చెప్పకుండా భోజనం చేయనని పలకడం ద్వారా, అతను యజమానికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడం పట్ల ఎంత ఆసక్తి‌ కలిగి ఉన్నాడో అర్థమౌతుంది. బాధ్యత కలిగిన దాసులకు ఏలియాజరు మంచి ‌మాదిరిగా ఉన్నాడు, అందుకే అతను ఒక ప్రాముఖ్యమైన కార్యంలో ముఖ్య పాత్రను పోషించినవాడిగా బైబిల్ చరిత్రలో నిలచిపోయాడు. దాసులు తమ యజమానుల పట్ల నమ్మకంగా చేసే పనులు ఒకవేళ వారు గుర్తించకపోయినా దేవుని నుంచి వారికి ప్రతిఫలం దక్కుతుంది.

కొలొస్సయులకు 3:22-24 దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమును బట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.

ఆదికాండము 24:34-51

అంతట అతడిట్లనెనునేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు; మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంటరాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింట నుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు , నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయైయుండును గాకని మనవి చేసికొంటిని.

నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.

కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము; ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి.

ఈ సందర్భంలో, అబ్రాహాము దాసుడు తాను ఎందునిమిత్తం బెతూయేలు ఇంటికి రావలసివచ్చిందో, దేవుడు అతనిపట్ల నెరవేర్చిన సూచన ఏంటో వారికి వివరిస్తున్నాడు. ఈ విధంగా అతను వివరించినప్పుడు వారు రిబ్కాను అతని వెంట పంపడానికి సమ్మతించారు, ఈ ప్రకారంగా అబ్రాహాము‌ చెప్పినట్టుగా దేవుడు తన దూతను పంపి, ఏలియెజరును పంపిన కారణాన్ని నెరవేర్చాడు. అందుకే లాబాను దానిని గ్రహించి ఇది యెహోవా వలన కలిగిన కార్యమని చెబుతున్నాడు.

అయితే, ఆదికాండం గ్రంథరచయిత పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇది రాస్తూ, జరిగినట్టుగా రాసినదానినే ఏలియాజరు మాటల్లో నుండి‌ మరలా  రాస్తున్నాడు. మనకు వివరించినదానినే మరలా తెలియచేసేలా రాయబడ్డ లేఖనాలు బైబిల్ లో మరికొన్ని కూడా మనకు కనిపిస్తాయి. ఒకవైపు ఈవిధంగా ఉంటే, మరోవైపు మరికొన్ని అంశాల్లో ఎటువంటి స్పష్టమైన ఆధారాలు ఇవ్వకుండా మర్మంగా రాయబడినవీ‌ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మెల్కీసెదకు గురించి ఇదే మోషే వివరంగా రాయలేదు.
దీనిని బట్టి, దేవుడు వివరంగా రాసినవాటిని వివరంగా తెలుసుకోవడం, మర్మంగా రాసినవాటిని అంతవరకే తీసుకోవడమే మన బాధ్యత. మనమేమీ మర్మాలను మన జ్ఞానంతో విశదీకరించే ప్రయత్నం‌ చేయవలసిన అవసరం లేదు, చెప్పాలనుకుంటే ఆయనే చెప్పేవాడు.

అదేవిధంగా చాలామంది‌ బోధకులు, ఏలియాజరు ఇస్సాకు నిమిత్తం రిబ్కాను తీసుకురావడానికి అబ్రాహాము చేతపంపబడ్డ సంఘటనను పెళ్ళిళ్ళలో ఎక్కువగా ప్రస్తావిస్తూ అంతమాత్రమే కాకుండా దీనిని యేసుక్రీస్తుకూ సంఘానికీ ముడిపెట్టి సేవకుడైన ఏలియాజరు అబ్రాహాము చేత పంపబడ్డట్టే  యేసుక్రీస్తు  తన సేవకులను ఈ లోకంలోకి పంపాడని ఏవేవో అలంకారాలు చెబుతుంటారు. వాస్తవానికి ఈ సందర్భంలో ఇటువంటి అలంకారమేదీ మనకు కనిపించడం లేదు.
ఈ విధంగా అలంకారాలు చెప్పడం మొదలుపెడితే లేఖనభాగాలన్నిటికీ చెప్పవలసి వస్తుంది, అది రచయిత మనసులోని ఉద్దేశం ఎప్పటికీ కాలేదు.

ఆదికాండము 24:52

అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. ఈ సందర్భంలో ఏలియాజరు మరలా తాను అబ్రాహాముతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చిన దేవునికి విధేయత చూపిస్తున్నాడు. విశ్వాసుల జీవితంలో దేవునికి విధేయత చూపించడం తప్పనిసరి.

ఆదికాండము 24:53

తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.

ఈ సందర్భంలో ఏలియాజరు తన యజమానుడి దగ్గర నుండి వెంటతెచ్చుకున్న విలువైనవాటిని రిబ్కాకూ, ఆమె కుటుంబ సభ్యులకూ ఇచ్చినట్టు చూడగలం. ప్రాచీనకాలం నుండీ వివాహాల్లో వధువుకు వరుడి తరపు నుండి ఓలిని ఇవ్వడం ఆచారంగా మనకు కనిపిస్తుంది (యాకోబు, దావీదుల‌ విషయంలో ఇది చూడగలం). ప్రస్తుతం మన దేశంలో వధువు తరఫు నుండి వరుడికి కట్నం ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా అవతలివారిని బలవంతం చేయకుండా ఎవరి సమృద్ధి నుండి వారు ఇష్టపూర్వకంగా ఇచ్చిపుచ్చుకోవడం తప్పుకాదు. బలవంతం చేసినపుడు మాత్రమే అది దురాచారం ఔతుంది. కొన్ని వివాహాల్లో వధువు తరపునుండి వచ్చే కట్నం తక్కువ కావడం వల్ల ఆ వివాహాలు రద్దు ఔతాయి, మరికొన్నిటిలో వరుడికి ఉన్న ఆస్తిపాస్తులు, అతని‌ తరపు నుండి వధువుకు‌ చెల్లించే ఆభరణాల విషయంలో  తక్కువ ఉండడం వల్ల కూడా ఆ విధంగా ఔతుంటాయి. ఈవిధంగా చేయడం ఎవరు చేసినా అది దూరాచారమే, అది వివాహ వ్యవస్థ పవిత్రతకు భంగాన్ని కలిగిస్తుంది.

ఆదికాండము 24:54-61

అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియుఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్లెదననెను. కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.

ఈ సందర్భంలో ఏలియాజరు రిబ్కాను తన వెంట పంపమన్నపుడు, మొదట ఆమె మాటను తీసుకోకుండా పంపుతామన్న కుటుంబ సభ్యులు ఆమెను అతనితో వెళ్తావా అని ఆమె ఇష్టాన్ని కనుక్కోవడం మనకు కనిపిస్తుంది.‌‌ దీనిని బట్టి దేవుణ్ణి పూర్తిగా ఎరుగని అన్యులకు సైతం వివాహం విషయంలో పిల్లల ఇష్టాన్ని కనుక్కోవడం తెలుసని మనకు అర్థమౌతుంది.
ఆవిధంగా కనుక్కొని చేసినపుడే వారి జీవితం సుఖంగా సాగుతుంది. కొంతమంది క్రైస్తవులు మాత్రం, దీనిని మీరుతూ వధువు తరపు నుండి వచ్చే కట్నంపైన ఆశతోనో, వరుడి వెనుకున్న ఆస్తిపాస్తులు అధికమనో పిల్లల ఇష్టంతో పనిలేకుండా వివాహాలు నిశ్చయిస్తూ ఉంటారు. పై సందర్భంలో రిబ్కా ఇంటివారు అబ్రాహాము ఆస్తిపాస్తుల గురించి తెలిసినప్పటికీ ఆమె ఇష్టాన్ని కనుగొని ఆమె సమ్మతి‌ తెలియచేసాకనే ఆమెను పంపుతున్నారు.

అదేవిధంగా ఈ సందర్భంలో రిబ్కాతో పాటు ఆమె పనికత్తెలు కూడా, ఇస్సాకు దగ్గరకు సాగనంపబడడం మనకు కనిపిస్తుంది.
అప్పటి వివాహాల్లో వధువుతో పాటుగా కొందరు దాసిలను కూడా వరుడి ఇంటికి సాగనంపేవారు. యాకోబు వివాహాల  విషయంలో కూడా ఇది మనం చూడొచ్చు. రిబ్కా ఇటువంటి పనికత్తెలను కలిగి ఉండి కూడా, నీళ్ళ కోసం వారిని పంపకుండా బావి దగ్గరకు ఆమెనే వెళ్ళింది. దీనిని బట్టి ఆమె పనిపట్ల ఆసక్తికలిగినదానిగా మనం గుర్తించవచ్చు, రిబ్కా కుమార్తెలమని చెప్పుకునే విశ్వాసులు కూడా ఇటువంటి‌ లక్షణాలు కలిగుండాలి.

ఆదికాండము 24:62-66

ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.

ఈ సందర్భంలో, రిబ్కాను ఏలియెజరు తీసుకువచ్చేసరికి ‌ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడని చూస్తాం.
అబ్రాహాము వలే ఇస్సాకు కూడా దేవునితో సహవాసం చేసేవాడని ఇది మరొకసారి తెలియచేస్తుంది.

ఆదికాండము 24:67

ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

ఈ సందర్భంలో ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకునేవరకూ తన తల్లి విషయమై దుఃఖపడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది.

ఆదికాండము 17:17 ప్రకారం, ఇస్సాకు జన్మించేసరికి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆదికాండము 23:1 ప్రకారం ఆమె 127 సంవత్సరాలకు మరణించింది. అప్పటికి ఇస్సాకు వయసు 37 సంవత్సరాలు ఔతుంది. ఆదికాండము 25:20 వచనాల ప్రకారం, ఇస్సాకు రిబ్కాను 40 సంవత్సరాలకు పెళ్ళి చేసుకున్నాడు. దీనిప్రకారం ఇస్సాకు సుమారు 3 సంవత్సరాలు తన తల్లి విషయమై దుఃఖపడుతూ జీవించాడు. చాలామంది, తమకు కలిగిన వేదనల వల్ల దుఃఖానికి లోనైనపుడు అది అవిశ్వాసుల లక్షణంగా కొందరు నిందిస్తుంటారు. అది వాస్తవం కాదని  ఇస్సాకు విషయంలోని ఈ మాటలు తెలియచేస్తున్నాయి. ఒక వ్యక్తి ఎంత విశ్వాసి అయినప్పటికీ అతనిలో మానవ భావనలు ఉంటాయి, వాటివల్ల ఇష్టమైనవారిని కోల్పోయినపుడు చాలాకాలం దుఃఖానికి లోనవ్వడం సహజం.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.