పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

 ఆదికాండము 49:1

యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.

గత అధ్యాయంలో యాకోబు యేసేపునూ, అతని సంతానాన్నీ ఉద్దేశించి ప్రవచనాత్మకంగా కొన్ని విషయాలు మాట్లాడాడు. దానికి కొనసాగింపుగానే ఈ అధ్యాయం ప్రారంభమౌతుంది. ఆ సమయంలో తన కుమారులు కొందరు బయట ఉండి ఉండవచ్చు అందుకే యాకోబు వారిని కూడా తానున్న గదిలోకి పిలిపించి, వారికి జరగబోతే విషయాలను ప్రవచిస్తున్నాడు. అందులో కొన్ని ఆశీర్వాదాలు అయితే మరికొన్ని శాపాలు, కొన్ని భౌతిక సంబంధమైనవైతే మరికొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనవి. కొన్ని మోషే, యెహోషువల కాలంలో నెరవేరితే మరికొన్ని న్యాయాధిపతుల కాలంలో నెరవేరాయి.

అదేవిధంగా ఈ ప్రవచనాత్మక మాటల్లో మెస్సీయను గురించిన వాగ్దానం కూడా నిక్షిప్తమై ఉంది కాబట్టి యాకోబు అది అంత్యదినాలలో జరగబోయేదిగా తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు అంత్యదినాలలో జన్మించాడని మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి.

హెబ్రీయులకు 1: 2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.

ఆదికాండము 49:2

యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.

ఈ సందర్భంలో యాకోబు మరలా తన కుమారులను తన మాటలను వినాలంటూ పిలవడం మనకు కనిపిస్తుంది. అతను చెప్పే మాటలు ప్రవచనాత్మకంగా పద్యరూపంలో రాయబడ్డాయి కాబట్టి ఆ పద్ధతిలో ఒకే మాటలను వాటి ప్రాముఖ్యతను తెలియచెయ్యడానికి మరలా ప్రస్తావించడం సాధారణంగానే జరుగుతుంది. అదేవిధంగా యాకోబు ఈమాటలను ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు కాబట్టి ఇందులో మనకు కొన్నిచోట్ల అలంకారభాష కూడా కనిపిస్తుంటుంది.

ఆదికాండము 49:3,4

రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను.

ఈ సందర్భంలో తన పెద్దకుమారుడైన రూబేను గురించి యాకోబు పలికిన మాటలు మనకు కనిపిస్తాయి. అతను యాకోబుకు పెద్దకుమారుడు కాబట్టి వారి నియమం ప్రకారం అతను జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని దానిద్వారా తన తండ్రి సొత్తులో ఇతరులకంటే ఒక భాగం ఎక్కువ పొందుకుంటాడు.

ద్వితీయోపదేశకాండము 21:17 తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.

అయినప్పటికీ రూబేను తన తండ్రి ఉపపత్నితో శయనించి నీచమైన ఆ పనికి పాల్పడినందువల్ల (ఆదికాండము 35:22) ఆ హక్కును కోల్పోయాడు; అతనికి ప్రతిగా యేసేపు ఆ హక్కును పొందుకున్నాడు.

ఆదికాండము 48:22 నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

మొదటి దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడైయుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు.

రూబేను ఈ కార్యం చేసి‌ చాలా సంవత్సరాలు గడచిపోయాయి ఆ సమయంలో అతను తాను చేసినపనిని బట్టి పశ్చాత్తాపపడి ఉండవచ్చు, అందుకే ఆ పాపాన్ని అతడు కొనసాగించినట్టు రాయబడలేదు. అయినప్పటికీ ఈ సమయంలో యాకోబు దానిని జ్ఞాపకం చేసుకుంటూ అతనిని జ్యేష్ఠత్వపు హక్కు నుండి తొలగించడమే కాకుండా అందరిముందూ అతను చేసినదానిని ప్రస్తావించి సిగ్గుపడేలా చేసాడు. దీనివల్ల అతని జీవితంపైన చెరగని మచ్చపడింది. కాబట్టి పాపపు ఫలితం ఎప్పటికైనా అనుభవించక తప్పదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాపం‌చేసి పరువు పోకుండా కాపాడుకోవడం సాధ్యం కాదు.

విశ్వాసులమైన మనం చేస్తున్న పాపాలను బట్టి దేవుడు మనల్ని నరకంలో వేయనప్పటికీ కచ్ఛితంగా ఆయన వాటిని బట్టి మనల్ని గద్దిస్తాడు. ఆయన అలా చెయ్యకుంటే మనం పాపభీతి లేకుండా ప్రవర్తించేవారమయ్యే అవకాశం ఉంది. దీనికి ఉదాహరణగా మనం దావీదు జీవితాన్ని గమనించవచ్చు. అతను బెత్సెబా విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతడు మరణించకుండా కృప చూపినప్పటికీ ఆ పాపపు ఫలితాన్ని మాత్రం జీవితాంతమూ అనుభవిస్తూనే ఉన్నాడు.

ఆదికాండము 49:5

షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.

ఈ సందర్భంలో యాకోబు తన ఇద్దరు కుమారులైన షిమ్యోను, లేవీల గురించి మాట్లాడుతూ వారు షెకెము విషయంలో చేసిన హింసను జ్ఞాపకం చేస్తున్నాడు. వీరికి ఇతర సహోదరులు ఉన్నప్పటికీ వీరిద్దరికీ ఒకేవిధమైన హింసాస్వభావం ఉండడం చేత యాకోబు వీరిద్దరినీ సహోదరులని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే వీరు ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన ఆయుధాలను బలత్కారం చెయ్యడానికి ఉపయోగించారు. రూబేను ఇంటిలో పాపం చేసి తన తండ్రిని బాధపెడితే వీరి బయట హింస చేసి తమ తండ్రికి చెడ్డపేరునూ, ప్రమాదాన్నీ తీసుకువచ్చారు. దేవుడు ఆ సమయంలో యాకోబుపై కృప చూపించకపోతే అతనితోపాటు కుటుంబమంతా షెకెము చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలచేతిలో నాశనమయ్యేది. వీరిగురించి యాకోబు పలుకుతున్న మిగిలిన మాటలు కూడా చూడండి.

ఆదికాండము 49:6

నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.

ఈ సందర్భంలో యాకోబు చెబుతున్న మాటలన్నీ వారు ఆదికాండము 34వ‌ అధ్యాయంలో జరిగించారు. దానితో అతనికి ఎటువంటి సంబంధం లేదని అలాంటి కౄరమైన కార్యానికి తాను అంగీకారం తెలుపలేదని యాకోబు ఇక్కడ తెలియచేస్తూ వారు చేసినదానికి వారినే నిందితులుగా ఎంచుతున్నాడు.

ఆదికాండము 49:7

వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

ఈ సందర్భంలో యాకోబు శపించినట్టుగానే అతని కుమారులైన లేవి షిమ్యోనులు వారి ఇతర సహోదరులవలే ఒకేచోట స్థిరంగా నివసించకుండా చెదరగొట్టబడ్డారు. యెహోషువా షిమ్యోనీయులకు యూదాగోత్రికుల మధ్యలో స్వాస్థ్యం పంచినప్పటికీ (యెహోషువా 19:1-9) తరువాత వారు చెదరిపోయారు.

మొదటి దినవృత్తాంతములు 4:39-43 వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి. పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱెలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొనియున్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.

ఈ వచనాలలో షిమ్యోను గోత్రికులు చెదరిపోయినట్టు రాయబడింది. అదేవిధంగా యెరుషలేము టార్గంలో యూదా పండితులు యాకోబు మాటలకు భావం చెబుతూ షిమ్యోను గోత్రికులు బోధకులుగానూ, శాస్త్రులుగానూ మారి ఇశ్రాయేలీయులలో చెదరిపోయారని ప్రస్తావించారు. యూదా పండితుడైన జార్కి కూడా అదేవిషయాన్ని తెలియచేసాడు.

అదేవిధంగా ఇక లేవీయుల పరిస్థితిని పరిశీలిస్తే వారిని దేవుడు తన యాజకత్వం నిమిత్తం ఏర్పరచుకుని వారికి ఎటువంటి స్వాస్థ్యమూ ఇవ్వలేదు.

ద్వితీయోపదేశకాండము 10:9 కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు.

వారు ఇశ్రాయేలీయుల అన్నీ‌గోత్రాలలోనూ చెదరిపోయి వారు కేటాయించిన 48 పట్టణాలలో నివసించారు (యెహోషువ 21:1-41).

ఆదికాండము 49:8

యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీయెదుట సాగిలపడుదురు.

యూదా జన్మించినపుడే లేయా నేను యెహోవాను స్తుతిస్తానంటూ ఆ పేరును అతనికి పెట్టింది. ఆ పేరుకు‌ తగినట్టుగానే యూదా పొందుకునే ఆధిక్యతను యాకోబు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ మాటలు యూదులు ఇశ్రాయేలీయులపై చేసిన పరిపాలననూ, మరియు యూదాగోత్రం నుండి వచ్చిన మెస్సీయ చేస్తున్న పరిపాలననూ సూచిస్తున్నాయి.

మొదటి దినవృత్తాంతములు 5:2 యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపుదాయెను.

ఆదికాండము 49:9

యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?

ఈ మాటలు యూదుల యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తున్నాయి. సింహం వేటాడి దానిని తృప్తిగా తిని విశ్రాంతి తీసుకునేటపుడు ఏవిధంగా అయితే ఎవరూ దానిని లేపే సాహసం చెయ్యలేరో, అదేవిధంగా యూదులు తమ శత్రువులపై జయం పొంది విశ్రాంతి తీసుకుంటారు. కాలేబు మొదలుకుని దావీదు మరియు అతని సంతానంలోని ఎందరో రాజులు తమ శత్రువుల విషయంలో ఇటువంటి శౌర్యాన్నే కనపరిచారు. చివరిగా ఈ గోత్రం నుండి వచ్చిన మెస్సీయా కూడా యూదాగోత్రపు కొదమ సింహంగా పిలవబడి తన శత్రువులపై విజయం సాధించి తన పిల్లలకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు.

ప్రకటన గ్రంథము 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.

ఆదికాండము 49:10

షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.

ఈ మాటలు యూదా గోత్రం నుండే మెస్సీయ వస్తాడు అనడానికి కచ్ఛితమైన ఆధారాలు. చారిత్రాత్మకంగా మనం యూదుల చరిత్రను పరిశీలించినప్పుడు షిలోహుగా పిలవబడిన మెస్సీయ ఆ గోత్రంలో జన్మించేవరకూ యూదులు తమ అధికారాన్ని పూర్తిగా కోల్పోలేదు. వారు ఆయా దేశాలకు బానిసలుగా కొనిపోబడినప్పటికీ యెరుషలేములో శేషించిన ప్రజలపై ఎవరొకరు పరిపాలన చేసేవారు. కానీ మెస్సీయ జన్మించి మరణించి తిరిగి లేచిన తరువాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా అధికారి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి వారికిక ఎటువంటి అధికారం లేకుండా చేసాడు. దీనిగురించి యేసుక్రీస్తు కూడా ముందుగానే ప్రవచించారు.

మత్తయి సువార్త 24:1,2 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

ఈ విధంగా యేసుక్రీస్తు రాకతో యూదుల మధ్యనుండి రాజదండం తొలగిపోయింది అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మెస్సీయకు విధేయులుగా ఉంటున్నారు. దీనిని బట్టి వాగ్దానం చెయ్యబడిన మెస్సీయ యేసుక్రీస్తే అని యూదులు కూడా ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఈ ప్రవచనం చెప్పబడింది వారి గ్రంథం(పాతనిబంధన)లోనే. ఆ నేరవేర్పు యేసుక్రీస్తులో తప్ప మరెవరి విషయంలోనూ నెరవేరలేదు.

ఆదికాండము 49:11,12

ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.

ఈమాటలు యూదులు స్వాస్థ్యంగా పొందబోయే ప్రాంతంలో వారికి లభించే సమృద్ధి గురించి అలంకారప్రాయంగా చెప్పబడ్డాయి. అక్కడ ద్రాక్షారసం మనం బట్టలు ఉతుకుకోవడానికి ఉపయోగించే నీరు అంత విస్తారంగా దొరుకుతుంది. ద్రాక్షతీగల బలం వాటికి గాడిదలను కట్టివేసేంతగా ఉంటుంది‌ (అలంకారం). అదేవిధంగా ఈమాటలు మెస్సీయద్వారా లోకానికి రాబోయే తీర్పును కూడా తెలియచేస్తున్నాయి ఎందుకంటే యూదా తన శత్రువులపై పగతీర్చుకుంటాడనే మాటలకు ఇవి కొనసాగింపు.

యెషయా గ్రంథము 63:1-4 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్నయితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

ఆదికాండము 49:13 

జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.

ఈ సందర్భంలో యాకోబు జెబులూను గురించి చెప్పినట్టే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చాక ఈ గోత్రం కానాను ఉత్తరభాగంలో సీదోనుకు దగ్గరగా స్వాస్థ్యం పొందుకుంది. దీనివల్ల సముద్ర వాణిజ్యపరంగా ఇది అభివృద్ధి చెందింది.

ద్వితీయోపదేశకాండము 33:18,19 జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతిబలులనర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.

ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో యాకోబు వీరు ఎక్కడెక్కడ అయితే‌ నివసిస్తారని ప్రవచనాత్మకంగా చెప్పాడో అవే ప్రదేశాలు వీరికి చీటీవల్ల స్వాస్థ్యంగా వచ్చాయి యెహోషువా తన ఇష్టప్రకారమో లేక వారికోరిక ప్రకారమో వాటిని పంచలేదు.

యెహొషువ 19:10-16 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము.

ఆదికాండము 49:14

ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.

ఈ సందర్భంలో యాకోబు ఇశ్శాఖారు గురించి చెప్పినట్టే అతని గోత్రానికి జెబులూను గోత్రీకులకూ, దాను గోత్రీకులకూ మధ్యలో స్వాస్థ్యం వచ్చింది. కాబట్టి రెండు దొడ్లమధ్య పండుకొనియున్న గార్దభంగా ఇతను వర్ణించబడ్డాడు. గార్దభం అన్నపుడు అతని బలాన్ని సూచిస్తుంది.

ఆదికాండము 49:15

అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.

ఇశ్శాఖారు గోత్రీకులు ఎక్కువగా యుద్దాలలో పాల్గోకుండా భూమిపైనే ఆధారపడి కష్టపడి వ్యవసాయం‌ చేసేవారు. దీనివల్ల యుద్ధాలు సంభవించినప్పుడు వీరు యుద్దంలో పాల్గొనేవారికి పన్నును కట్టవలసి వచ్చేది ఇందువల్ల అతడు దాసుడిగా వర్ణించబడ్డాడు.

ఆదికాండము 49:16

దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

దాను యాకోబు భార్యలైన లేయా రాహేలుల ద్వారా కాకుండా రాహేలు దాసిద్వారా జన్మించాడు (ఆదికాండము 30:5,6) అయినప్పటికీ అతను ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రాలకంటే తక్కువేం కాదని అతను కూడా మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడని ఈ మాటలు తెలియచేస్తున్నాయి.

ఆదికాండము 49:17

దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

దాను గోత్రీకులకు సరిహద్దుల్లోని భూభాగం స్వాస్థ్యంగా లభించింది (యెహోషువ 19:40-46) దీనివల్ల ఆ దేశంపై యుద్ధానికి ఎవరు ప్రవేశించినా మొదటిగా దాను గోత్రీకులను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి ఆ గోత్రీకులు తమ దేశంలోకి ప్రవేశించే శత్రువులను అడ్డుకోడానికి సర్పంవలే వివేకంగా ఉండి వారిని అంతం చేస్తారు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా వ్యవహరించిన సంసోను ఈ గోత్రానికి చెందినవాడే.

ఆదికాండము 49:18

యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను.

యాకోబు తన కుమారుల గురించి ప్రవచిస్తూనే మధ్యలో తాను దేవునిరక్షణకోసం కనిపెట్టుకుని ఉన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించాడు. తన సంతానం భూమిపై ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందో, రక్షించబడుతుందో అతనికి తెలిసినప్పటికీ అతను వాటినిబట్టి అతిశయించకుండా దేవుడు అతనికి కలుగచేసే నిత్యజీవమైన రక్షణకోసమే ఎదురుచూస్తున్నాడని ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి.

ఆదికాండము 49:19

బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.

గాదు గోత్రంవారు సరిహద్దు ప్రాంతంలో నివసిస్తూ తమ దేశంలోకి ప్రవేశించే శత్రువును మట్టుపెట్టడానికి సిద్ధంగా ఉంటారని పై వివరణలో మనం చూసాం. ఆ క్రమంలో వీరిలో కొందరు చనిపోవడం సహజం అందుకే బంటుల గుంపు గాదును కొట్టును అని యాకోబు చెబుతున్నాడు. అయినప్పటికీ అతని‌గోత్రం వారు యుద్ధసన్నద్ధులై తమ శత్రువులతో పోరాడతారు - అదే అతను వారి మడిమెను కొట్టడం.

ఆదికాండము 49:20

ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

ఆషేరు గోత్రంవారికి స్వాస్థ్యంగా లభించిన భూభాగంలో (యెహోషువ 19:24-31) ఆహారము మరియు తైలాల సమృద్ధి ఇతరగోత్రాలకంటే ఎక్కువగా లభిస్తుంది. దీనిమూలంగా తమ దేశాన్ని పరిపాలించే రాజులు ఈ ప్రాంతంనుండే ఆహారాన్ని పొందుకునేవారు.

ద్వితీయోపదేశకాండము 33:24,25 ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షమునొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునైయుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

ఆదికాండము 49:21

నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.

ఈ సందర్భంలో నప్తాలి విడువబడిన లేడిగా సంబోధించబడ్డాడు కొందరు బైబిల్ పండితులు ఆ మాటకు సింధూరవృక్షం అనే అర్థం కూడా వస్తుందని అ వృక్షంలానే నఫ్తాలి విస్తరిస్తాడని చెప్పేందుకే యాకోబు ఆ పోలికను తీసుకువచ్చాడని భావించారు. అదేవిధంగా అతను ఇంపైన మాటలు పలికి అందరినీ తనవైపు ఆకర్షించుకుంటాడు.

ద్వితీయోపదేశకాండము 33:23 నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

ఆదికాండము 49:22 

యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

ఈ సందర్భంలో యాకోబు తన ప్రియకుమారుడైన యేసేపు గురించి మాట్లాడుతున్నాడు దానిప్రకారం నీటిఊటల పక్కన ఉన్న చెట్టు ఎలా అయితే ఫలించి విస్తరిస్తుందో అలానే యేసేపు సంతానం అభివృద్ధి చెందుతుంది.

ఆదికాండము 49:23

విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

ఇక్కడ యాకోబు యేసేపు జీవితంలో అతనికి‌ కలిగిన హింసలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసేపు చరిత్రను మనం పరిశీలించినపుడు అతను మొదటిగా తన అన్నలచేత హింసించబడ్డాడు, తరువాత పోతిఫరు భార్య చేత హింసించబడ్డాడు.
చివరికి పానదాయకుల అధిపతి కూడా యేసేపును రెండు సంవత్సరాలు మరచిపోయి బాధపడేలా చేసాడు.

ఆదికాండము 49:24,25

యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును.

ఈ సందర్భంలో యాకోబు తన కుమారుడైన యేసేపును అన్ని హింసల నుండీ తప్పించి ఘనపరచిన పరాక్రమశాలి అయిన తన దేవుణ్ణి బండగా, కాపరిగా వర్ణిస్తూ ఆయన యేసేపు సమస్తమైన దీవెనలూ కలుగుతాయని ప్రవచిస్తున్నాడు.
ఆయనను బట్టి యేసేపు సంతానం‌ వారి విల్లు బలమైనదిగా యుద్ధశూరులుగా అభివృద్ధి చెందుతారు.

ఆదికాండము 49:26

నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.

ఈ సందర్భంలో‌ యాకోబు యేసేపు గురించి తనమాటలను కొనసాగిస్తూ తాను పొందుకున్న దీవెనలు తన పితరుల దీవెనలకంటే ఉన్నతమైనవని అవి యేసేపు తలమీదకే వస్తాయని‌ చెబుతున్నాడు.

ద్వితీయోపదేశకాండము 33:13-17 యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగుననుందురు.

ఆదికాండము 49:27

బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.

ఈ సందర్భంలో యాకోబు బెన్యామీనును‌ చీల్చునట్టి తోడేలుగా వర్ణిస్తున్నాడు అది‌ ఆ గోత్రపువారి యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తుంది. తోడేలు ఎరను తిన్నట్టుగా వారు పగలంతా యుద్ధంలో సైనికులను చంపి సాయంకాలంలో వారినుండి దోచుకున్న సొమ్మును పంచుకుంటారు. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొదటిరాజు సౌలు ఈ గోత్రానికి‌‌ చెందినవాడే. అన్యజనులకు అపోస్తలుడిగా ఏర్పరచబడిన పౌలు కూడా ఈ గోత్రంలోనే జన్మించాడు. వీరు తరువాతి కాలంలో యూదులతో కలసిపోయి యూదులుగానే పిలవబడ్డారు.

ద్వితీయోపదేశకాండము 33:12 బెన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును.

ఆదికాండము 49:28

ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.

ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులవి పన్నెండు గోత్రాలనీ రాయబడింది. ఈ పన్నెండు గోత్రాలలో లేవీ సంతానం లేదు ఎందుకంటే వారు యాజకత్వం నిమిత్తం ప్రత్యేకపరచబడి ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలలోనూ చెదరిపోయారు. కాబట్టి యాకోబు కొడుకులవి పదిగోత్రాలు మిగిలిన రెండు గోత్రాలూ యేసేపు కొడుకులవి.

ఆదికాండము 49:29

తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.

ఈ సందర్భంలో యాకోబు తన మరణం గురించి తాను సమాధి చెయ్యబడే ప్రదేశం గురించి చెబుతున్నాడు. కొందరు ఇక్కడ స్వజనులు అన్నపుడు పరదైసులో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడని భావిస్తుంటారు కానీ, మనం రాజుల‌ గ్రంథాలు చదివినపుడు అక్కడ యూదా రాజులు చనిపోయినపుడు కూడా వారు తమ పితరులయొద్దకు చేర్పబడ్డారని రాయబడింది. అందులో‌ చాలామంది‌ దుష్టరాజులు మనకు కనిపిస్తారు కాబట్టి వారు తమ పితరుడైన దావీదు ఉన్న పరదైసుకు‌ చేర్చబడ్డారని మనం భావించలేము. కాబట్టి ఇక్కడ స్వజనుల యొద్దకు అన్నపుడు సమాధి గురించే మాట్లాడుతున్నాడు వారందరూ ఒకే సమాధిలో పెట్టబడేవారు.

ఆదికాండము 49:30-32

హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనెను.

ఈ సందర్భంలో యాకోబు‌ ప్రస్తావించబడిన భూమి ఆదికాండము 23వ అధ్యాయంలో అబ్రాహాము శారా చనిపోయునప్పుడు కొన్నాడు. అయితే అపోస్తలుల కార్యములు 7:16 లో స్తెఫెను ఆ భూభాగాన్ని అబ్రాహాము హమోరు కుమారుల యొద్ద కొన్నాడని అక్కడే యాకోబు సమాధి చెయ్యబడ్డాడని ప్రస్తావించాడు. ఈ‌ వైరుధ్యం గురించి తెలుసుకోవడానికి 23వ అధ్యాయపు వివరణ చూడండి.

ఆదికాండము 49:33

యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చ బడెను.

ఈ సందర్భంలో యాకోబు మరణం గురించి రాయబడింది. కానాను ప్రాంతంలో కరవువచ్చినపుడు అతని కుమారులు ఐగుప్తుకు బెన్యామీనును తీసుకుని వెళ్తామంటే మీరు నన్ను పుత్రహీనుడిగా చేస్తున్నారని బాధపడిన యాకోబుకు తాను కోల్పోయాననుకున్న కుమారుడిని సైతం కలుసుకుని అతనితో 17సంవత్సరాలు కలిసుండి ఆనందంగా మరణించే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఈవిధంగా ఆయన యాకోబుపై‌ అతని‌ కుటుంబంపై తన కృపను చూపించాడు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.