పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gen15 thumb

15:1, 15:2,3, 15:4,5, 15:6, 15:7,8, 15:9-12, 15:13,14, 15:15, 15:16, 15:17-21

 ఆదికాండము 15:1

ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

ఈ సందర్భంలో మనకి యెహోవా వాక్యం అబ్రాహాముకు దర్శనమిచ్చినట్లు కనిపిస్తుంది; ఈ యెహోవా వాక్కు ఒక ప్రత్యేకమైనది, ఇది కేవలం వినిపించడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది.

1సమూయేలు 15:10 - ​​అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2సమూయేలు 7: 4 - అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా.

యెహేజ్కేలు 38: 1 - మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1రాజులు 6: 11 - అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

యెషయా 38: 4 - యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల భక్తులకు యెహోవా వాక్కు/వాక్యము ప్రత్యక్షమై మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఇటువంటివాటిని బట్టి, యూదులు కూడా యెహోవా దేవునిలో బహుళత్వం ఉందనే విషయాన్ని నమ్మేవారు; వాస్తవానికి ఆ సందర్భంలో అబ్రాహాముకు, మిగిలిన భక్తులకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు/వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తేయని బైబిల్ చెబుతుంది.

మీకా‌ 5:2 - బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

యోహాను సువార్త‌ 1:1-3,14 - ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

ప్రకటన గ్రంథం 19: 13 - రక్త ములో ముంచబడిన(కొన్ని ప్రాచీన ప్రతులలో-చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన (క్రీస్తు) ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

అదేవిధంగా, ఈ సందర్భంలో దేవుడు అబ్రాహాముకు ఇవ్వబోయే బహుమానం గురించి తెలియచేస్తున్నాడు; ఎందుకంటే అంతకుమునుపే అబ్రాహాము దేవునితో చేసిన ప్రమాణం చొప్పున సొదొమ రాజు ఇచ్చే బహుమానాన్ని తిరస్కరించాడు.

దేవుడు అబ్రాహాముకు ఇవ్వబోయే గర్భఫలమనే బహుమానం గురించి మాట్లాడుతుంటే, అతను బహుశా దాన్ని భౌతికపరమైన సంపదలుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, అందుకే క్రింది వచనాల్లో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి -

ఆదికాండము 15:2,3

అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా-

సాధారణంగా ఆ కాలంలో, యజమానునికి పిల్లలు లేనపుడు అతని ఆస్తి అంతా తన పరివారాన్ని ఏలుతున్న వ్యక్తికో, లేక దత్తతు తీసుకున్న వ్యక్తికో చెందుతుంది; అబ్రాహాము దేవుడు ఇస్తానన్న బహుమానాన్ని ఆస్తిగా భావించినందున, ఈ విధంగా ఆయనకు ప్రత్యుత్తరమిస్తున్నాడు.

ఆదికాండము 15:4,5

యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

ఈ సందర్భంలో, యెహోవా వాక్యము అబ్రాహాముకు ఇవ్వబోయే బహుమానం కేవలం భౌతికపరమైన సంపద మాత్రమే కాదనీ, అది అతని గర్భఫలం గురించి చెప్పబడిందని తెలియచేస్తున్నాడు. ఆ గర్భఫలమే ఇస్సాకుగా మనకి బైబిల్ వివరిస్తుంది; అతని నుండి వచ్చిన ఇశ్రాయేలీయులనే దేవుడు ఆకాశనక్షత్రములుగా విస్తరింపచేశాడు.

ద్వితియోపదేశకాండము 1: 10 - మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.

ఆదికాండము 15:6

అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

విశ్వాసము ద్వారా నీతి కలుగుతుందనే సిద్ధాంతాన్ని బైబిల్ ప్రారంభం నుండీ బోధిస్తుంది; ఈ సందర్భంలో అబ్రాహాము విషయంలో అదే మనకి కనిపిస్తుంది, ఇది కేవలం అతని వరకూ మాత్రమే పరిమితం కాదు‌ కానీ, ప్రస్తుత విశ్వాసులందరికీ ఇది ఆపాదించబడుతుంది.

దీని గురించి పౌలు మాటల్లో చూడండి -

రోమీయులకు 4:3-5,18-25 - లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

దీన్నిబట్టి, దేవుడు చెప్పిన మాటలను అబ్రాహాము నమ్మి(విశ్వసించి) ఎలాగైతే నీతిమంతునిగా తీర్చబడ్డాడో, అదేవిధంగా క్రీస్తు యేసు బలియాగాన్నీ, ఆయన చెప్పిన మాటలను నమ్మే ప్రతీ వ్యక్తి కూడా నీతిమంతునిగా తీర్చబడతాడు.

ఆదికాండము 15:7,8

మరియు ఆయననీవు ఈ దేశమును స్వతం త్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా-

ఈ సందర్భంలో దేవుడు చేసిన వాగ్దానానికి అబ్రాహాము ఒక సూచన అడుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఆదికాండము 15:9-12

ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా-

అబ్రాహాము కోరిక మేరకు, దేవుడు ఈ సందర్భంలో అతనితో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పేందుకు నిబంధన చేస్తున్నాడు; ప్రాచీన కాలంలో, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక ఒప్పందం జరిగేటపుడు, కొన్ని జీవులను తీసుకుని, వాటిని రెండుగా ఖండించి ఆ రెండు భాగాల మధ్య నుండీ వారిద్దరూ నడచిపోవాలి. దీని వెనుక ఉన్న భావం ఏమిటంటే, ఒకవేళ ఒప్పందం చేసుకున్న వ్యక్తులలో ఎవరైనా దాన్ని మీరితే, మిగిలిన వ్యక్తి తనను ఆ విధంగా రెండుగా చీల్చినా నాకు అంగీకారమే అని తెలియచేస్తున్నాడు; అటువంటి ప్రమాణాన్ని దేవుడు అబ్రాహాముతో చేస్తున్నాడు. ఉదాహరణకు ఈ మాటలు చూడండి -

యిర్మీయా 34:18,19 - మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినంద రిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.

అదేవిధంగా ఆ సందర్భంలో, అబ్రాహాముకు‌ కునుకు పట్టినదాన్ని కొందరు అపార్థం చేసుకుని, దేవుడు మాట్లాడుతుంటే అబ్రాహాము నిద్రపోయాడనీ, అందుచేతనే క్రింది వచనాల్లో అబ్రాహాము సంతానం దాసులుగా మారతారని ఆయన శపించాడనీ భావిస్తుంటారు. దేవుని వాక్యం అటువంటి వివరణ ఏదీ కూడా ఇక్కడ ఇవ్వలేదు; అబ్రాహాము తనకు తానుగా నిద్రపోలేదు కానీ, అతని ప్రమేయం లేకుండానే అతని కన్నులకు చీకటి కమ్మింది. ఏదేనులో దేవుడు, ఆదాముకు గాఢనిద్రను కలిగించినట్లే, ఇతనికి కూడా కలిగించి ఉండవచ్చు.

ఆదికాండము 15:13,14

ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

ఈ సందర్భంలో, దేవుడు చెప్పినటువంటి దాస్యత్వం, ఇశ్రాయేలీయుల గురించే అని కొందరు అభిప్రాయపడుతుంటారు, కానీ అది ఇస్సాకు నుండీ మనం చూడాలి, అతనితో కలిపి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యత్వంలో జీవించిన కాలమే ఈ నాలుగువందల సంవత్సరములు, ఆ తరువాత అబ్రాహాము సంతానమంతా దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి తిరిగివచ్చినట్లుగా బైబిల్ వివరిస్తుంది.

దీని గురించి మరింత వివరంగా క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు -

https://hithabodha.com/books/miscellaneous/257-how-long-did-israelite-stay-in-egypt.

ఆదికాండము 15:15

నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.

ఈ సందర్భంలో, దేవుడు చెప్పినట్లే అబ్రాహాము మరణించినట్లుగా మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 25:7-9 - అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. అబ్రాహాము నిండు వృద్ధాప్య మునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.

ఆదికాండము 15:16

అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

పాపం చేసే ప్రతీవారూ మరణానికి పాత్రులు అయినప్పటికీ, దేవుని యొక్క దీర్ఘశాంతము చొప్పున వారి మార్పు కోసం ఆయన ఇచ్చే సమయం గురించి ఈ సందర్భం తెలియచేస్తుంది, పాపం సంపూర్ణమవ్వడమంటే, దేవుడు తీర్పు తీర్చే సమయం తటస్థించినపుడని అర్థం.

కీర్తనలు 37: 13 - వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

చాలామంది మోషే ధర్మశాస్త్రములో, కానానీయులను ఇశ్రాయేలీయులు నాశనం చేసినదాన్ని చూపిస్తూ దేవుడు వారి చేత ఆ ప్రజలను అన్యాయంగా చంపివేసినట్లుగా విమర్శిస్తుంటారు. వాస్తవానికి వారు చేసిన హేయక్రియలు ఎటువంటివో అక్కడ మనకి వివరించబడుతుంది.

అదేవిధంగా, ఈ సందర్భంలో దేవుడు అబ్రాహాముతో నీ నాలుగవ తరము కానాను దేశానికి తిరిగివస్తుందని తెలియచేస్తున్నాడు; దీనిగురించి కూడా పైన లింక్ ద్వారా సూచించిన వ్యాసంలో వివరించబడింది.

ఆదికాండము 15:17-21

మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

పైన నిబంధన గురించిన సందర్భంలో, ఒప్పందం చేసుకున్న ఇద్దరు వ్యక్తులూ ఖండించిన జంతుభాగాల మధ్య నడచిపోవాలని చూశాం; ఈ సందర్భంలో ఆ జంతుభాగాల మధ్య అబ్రాహాము, దేవుడు కలసి నడవకుండా, కేవలం దేవుడు మాత్రమే నడచివెళ్లాడు.

దీన్నిబట్టి, దేవుడు అబ్రాహాముతో చేసిన ఆ నిబంధనలో అబ్రాహాము ప్రమేయం ఎంతమాత్రమూ లేదు; ఆయన అతనితో చేసిన నిబంధనను తప్పకుండా ఆయన మాత్రమే నెరవేర్చితీరుతాడు, ఇది షరతులు లేని నిబంధన. అందుచేతనే ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవుని మాటపైన ఎన్నోమారులు తిరగబడి ఆయన్ని శోధించి‌నప్పటికీ, ఆయన తన నిబంధనను మీరకుండా వారిని వాగ్దానం చేసిన దేశానికి చేర్చినట్లుగానూ, వారిని పూర్తిగా నాశనం చేయనట్లుగానూ మనకి కనిపిస్తుంది.

ద్వితియోపదేశకాండము 9: 5 - నీవు వారి దేశ మునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జన ముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.

న్యాయాధిపతులు 2:1 - యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

రెండవ రాజులు 13:22,23 - యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను గాని యెహోవా వారి మీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్ననిబంధనను బట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టక యుండెను.

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.