పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

27:1-4, 27:5-10, 27:11,12, 27:13,14, 27:15-17, 27:18-20, 27:21-25, 27:26-29, 27:30-33, 27:34-37, 27:38-40, 27:41, 27:42-45, 27:46

ఆదికాండము 27:1-4
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితోననెను. అప్పుడు ఇస్సాకుఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

ఈ వచనాలలో ఇస్సాకు తాను మరణించే సమయం దగ్గరపడిందని భావించి తన కుమారుడైన ఏశావును ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నట్టు మనం చూస్తాం. ఇది‌ వారసత్వంగా వస్తున్నటువంటి ఆశీర్వాదం, ఇందులో భౌతికపరమైనది, ఆధ్యాత్మికమైనది రెండూ కూడా ఇమిడి ఉంటాయి. వాస్తవానికి ఇస్సాకుకు ఆ ఆశీర్వాదానికి ఏశావు కాదు యాకోబే హక్కుదారుడని తెలుసు. ఎందుకంటే వారు పుట్టకముందే దేవుడు ఆ సంగతిని‌ తెలియచేసాడు (ఆదికాండము 25:22,23). రిబ్కా ఆ విషయాన్ని ఇస్సాకు దగ్గర దాచడానికి అదేమీ రహస్యంగా చెప్పబడిన మాటకాదు, పైగా రిబ్కా యాకోబునే ఎక్కువ ప్రేమించడం వల్ల ఆ ఆశీర్వాదం అతనికే దక్కాలని తప్పకుండా ఆ విషయం చెప్పే ఉంటుంది. అదేవిధంగా కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం; దేవుడు ఆ మాటలను రిబ్కాకు అబ్రాహాము ద్వారా తెలియచేసాడు. దేవుని చిత్తానికి విధేయత చూపించేలా తన కుమారుడైన ఇస్సాకు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న అబ్రాహాము (ముఖ్యంగా ఆశీర్వాదం విషయంలో), ఆ కుమారుడికి ఆ సంగతిని తెలియచెయ్యకుండా ఉండే అవకాశం లేదు.

దీనిప్రకారం; ఇస్సాకుకు ఎవరిని దీవించడం దేవుని చిత్తమో తెలిసినప్పటికీ అతను యాకోబు కంటే ఏశావునే ఎక్కువగా ప్రేమించడం వల్ల, అదేవిధంగా మొదట పుట్టినవాడే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదానికి పాత్రుడవ్వాలనే ఆనవాయితీ వల్ల అతను ఏశావును దీవించడానికి సిద్ధపడ్డాడు. ఒకవిధంగా అతను దేవుని ఏర్పాటును పక్కనపెట్టి వారి ఆనవాయితీని పాటించాలనుకున్నాడు. అదే అబ్రాహామైతే దేవుని మాటకు లోబడి, ఆ ఆనవాయితీని పట్టించుకోకుండా తన పెద్ద కుమారుడైన ఇష్మాయేలుకు బదులు అతని తర్వాత పుట్టిన ఇస్సాకునే ఆశీర్వదించి, తన వారసుడిగా ప్రకటించాడు. కాబట్టి విశ్వాసులకు తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీలు కాదు కానీ దేవుని వాక్యమే ప్రామాణికమని మనం గుర్తించాలి

అలా అని పెద్దకుమారుడిని జ్యేష్ఠత్వపు హక్కుదారుడిగా ఎంచడం లోకసంబంధమైన ఆచారమని నేను చెప్పడం లేదు ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో కూడా ఇదేవిధంగా చెయ్యమనే ఆజ్ఞను మనం చూస్తాం (ద్వితియోపదేశకాండము 21:17) కానీ ఇస్సాకు యాకోబుల విషయంలో మాత్రం దేవుడే దానిని మినహాయించి, పెద్దకుమారులకు బదులు చిన్నకుమారులకు ఆ హక్కును ఇచ్చాడు కాబట్టి, ఆ మాట ప్రకారంగా అబ్రాహాము చేసినట్టు ఇస్సాకు చెయ్యలేదని చెబుతున్నాను. యాకోబు మాత్రం ఆ తప్పు చెయ్యకుండా రూబేనుకు బదులు చిన్నవాడైన యోసేపును జేష్టుడిగా దీవించాడు (ఆదికాండము 48:22, 1 దినవృత్తాంతములు 5:1).

ఆదికాండము 27:5-10
ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచిఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.

ఈ వచనాలలో ఇస్సాకు ఏశావును ఆశీర్వదించబోతున్నాడని తెలుసుకున్న రిబ్కా దానిని యాకోబుకు చెందేలా చెయ్యడానికి మోసపూరితమైన ఆలోచనతో యాకోబును ప్రేరేపించడం మనం చూస్తాం. ఇస్సాకు యాకోబునే ఆశీర్వదించాలన్నది దేవుని ఏర్పాటైనప్పటికీ ఆయన నిర్ణయానుసారంగానే ఇదంతా జరుగుతున్నప్పటికీ (రోమా 9:10-12), ఈమె తలపెట్టిన ఈ కార్యం మోసపూరితం కాకుండా పోదు. ఎందుకంటే, ఈమె‌ దేవుని ఏర్పాటును నెరవేర్చాలనే ఆలోచనతో ఇదంతా చెయ్యడం లేదు. ఇస్సాకు మొదటినుండీ ఏశావు వేటాడి తెచ్చిన మాంసం తినడం వల్ల అతడిని ఎలా ప్రేమిస్తున్నాడో (ఆదికాండము 25:27,28) అదేవిధంగా రిబ్కా కూడా యాకోబు సాధువుగా తన గుడారంలో నివసించడం వల్ల అతడిని ప్రేమిస్తుంది, ఆ ప్రేమతోనే ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ఈమె చేసే ఈ మోసపూరితమైన పనికి ఈమెనే బాధ్యురాలు ఔతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు తన చిత్తాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు. దానికోసం ఎవరూ తమకు బోధించబడిన నైతిక బాధ్యతలను తప్పి ప్రవర్తించవలసిన అవసరం లేదు. అలా చేసినవారు దేవుని సార్వభౌమ నిర్ణయాన్నే నెరవేర్చినప్పటికీ తమ ప్రవర్తనను బట్టి వారు దోషులే ఔతారు, దానికి పర్యవసానం తప్పదు‌.

ఉదాహరణకు, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును దేవుని సంకల్పానుసారంగానే (అపో. కా 2:23) యూదులకు అప్పగించినప్పటికీ యూదులు కూడా ఆయన మరణానికి పిలాతును పట్టుపట్టి చివరికి చంపించినప్పటికీ దానివిషయమై వారు దోషులు అయ్యారు (1 థెస్సలోనిక 2:15). ఎందుకంటే వారు తమ వ్యక్తిగత కక్షలతోనూ దురాశలతోనే అలా చేసారు. యోసేపును కూడా అతని సోదరులు దేవుని ఉద్దేశప్రకారమే ఐగుప్తుకు అమ్మివేసినప్పటికీ (ఆదికాండము 50:20) వారు అతనిపై అక్కసుతో ఆ పని చేసారు కాబట్టి దాని విషయమై వారు దోషులు. ఈ అంశం గురించి ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 3:1 వ్యాఖ్యానం చూడండి).

అదేవిధంగా, మనిషి చేసే పాపపు క్రియలను బట్టి కూడా దేవుని సార్వభౌమత్వమే నెరవేరుతున్నప్పుడు ఆ పాపానికి దేవుడు ఎందుకు కర్త కాడో తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

ఆదికాండము 27:11,12
అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా. ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు తాను ఏశావుకు మారుగా తన తండ్రి దగ్గరకు వెళ్తే తన శారీరక స్థితిని బట్టి శపించబడతానేమో అని భయపడడం మనం చూస్తాం. ఇక్కడ అతను తన తండ్రిని మోసగించకూడదనే ఉద్దేశంతో ఆలోచించట్లేదు కానీ తనకు కీడు జరుగుతుందని మాత్రమే భయపడుతున్నాడు‌. దీనిని బట్టి అతని తల్లి చెబుతున్న మోసపూరితమైన ఆలోచన అతనికి కూడా అంగీకారమే.

ఆదికాండము 27:13,14
అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.

ఈ వచనాలలో రిబ్కా తన శారీరకస్థితిని బట్టి భయపడుతున్న యాకోబును ధైర్యపరుస్తూ నీవు భయపడుతున్నట్టు నీ తండ్రి నిన్ను గుర్తుపడితే ఆ శాపం నామీదకు వస్తుందని పలకడం మనం చూస్తాం. ఇక్కడ ఈమె ఏ మనుష్యుడూ పలుకకూడని మాట పలుకుతుంది. ఎందుకంటే ఎవరూ కూడా మరొకరి శాపాన్ని తమకు ఆపాదించుకోలేరు. యేసుక్రీస్తుకు మాత్రమే అది సాధ్యం. అందుకే దేవుడు మనపై ఉన్న శాపాన్ని ఆయనపై పెట్టి మనల్ని విమోచించాడు.

గలతియులకు 3: 13 క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను.

కాబట్టి విశ్వాసులు మనం భరించలేని విషయాలలో అవతలివారికి హామీలు ఇస్తూ వారిని ధైర్యపరచకూడదు.

ఆదికాండము 27:15-17
మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా-

ఈ వచనాలలో రిబ్కా యాకోబుకు ఏశావు వస్త్రాలను తొడిగించి, మేకచర్మంతో అతని చేతులనూ మెడనూ కప్పి ఇస్సాకు దగ్గరకు పంపే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఈ ఆలోచన ఆమెకు ముందునుండీ ఉంది కాబట్టే ఇస్సాకు యాకోబును గుర్తించలేడనే నిశ్చయతతో అతడిని ఆవిధంగా ప్రేరేపించింది. దురదృష్టవశాత్తూ కొందరు విశ్వాసులు తప్పుడు పనులను చెయ్యడానికి ఉపయోగించే తెలివిని మంచిపనుల‌ కోసం ఉపయోగించలేరు‌. దేవుడు మనకు తెలివితేటలను ఇచ్చింది మంచి పనులకోసమే తప్ప చెడుపనులకోసం కాదు.

యోబు 35: 11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొనువారెవరును లేరు.

ఆదికాండము 27:18-20
అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడుఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడునీ దేవుడైనయెహోవా నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్ళి తనను ఏశావుగా కనపరచుకోవడం మనం చూస్తాం. ఆ క్రమంలో అతనిలోని పతన స్వభావం ఇక్కడ మనకు స్పష్టంగా బయటపడుతుంది. అతను తన తండ్రితో నేను ఏశావునని అబద్ధం చెప్పడమే కాదు, దానిని‌ నిశ్చయపరచుకోడానికి దేవుడైన యెహోవా పేరును కూడా ప్రస్తావిస్తున్నాడు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైతే (నిర్గమకాండము 20:7), ఒక అబద్ధాన్ని స్థాపించడానికి దానిని ప్రస్తావించడం మరెంత ఘోరపాపమో ఆలోచించండి. ఇంతటి ఘోరపాపిని కూడా దేవుడు తన ఏర్పాటును బట్టి క్షమించి తన పిలుపుకు తగినట్టుగా మార్పు పొందించాడు. అయితే ఇప్పటికే రక్షణ పొందుకున్న విశ్వాసులు మాత్రం ఈవిషయంలో జాగ్రత్త వహిస్తూ దేవుని నామాన్ని ఏవిధంగా ఎందుకు ఉచ్చరిస్తున్నారో సరిచూసుకోవాలి. ఈ అంశం మరింతగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

పది ఆజ్ఞల వివరణ

ఆదికాండము 27:21-25
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచె దను దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచిస్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము. నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.

ఈ వచనాలలో ఇస్సాకు, ఏశావు దుస్తుల్లో ఒంటిపై రోమాలతో ఉన్న యాకోబును ఏశావుగా భావించి అతను తీసుకువచ్చినదానిని తిని త్రాగడం మనం చూస్తాం. ఇస్సాకుకు వృద్ధాప్యం వల్ల కళ్ళు సరిగా కనిపించనప్పటికీ చెవులు సరిగానే వినిపిస్తున్నాయి. అతను అప్పటికే తన కుమారుడు తొందరగా వేటను తీసుకురావడం, తర్వాత అతని స్వరం కూడా యాకోబు స్వరంలా‌ ఉండడం గమనించాడు. అలాంటి అనుమానం అతనికి కలిగినప్పుడే కాస్త జాగ్రత్తను తీసుకుంటూ అతనితో ఎక్కువసేపు మాట్లాడినా లేక వెళ్ళి నీ తమ్ముడైన యాకోబును కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పినా ఇలా మోసపోయేవాడు కాదు. అతను తన కుమారుడు వేటాడి తెచ్చిన సమయం విషయంలోనూ స్వరం విషయంలోనూ అనుమానం కలిగినప్పటికీ ఒంటిపై మేకచర్మపు వెంట్రుకలనూ వస్త్రాలనూ గుర్తించి తనకున్న అసలు అనుమానాలు పక్కనపెట్టేసాడు. ఈ విషయంలో ఇస్సాకు దేవుని సార్వభౌమ నిర్ణయం ప్రకారమే విఫలమైనప్పటికీ మనం మాత్రం ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా సరే తార్కికమైన అనుమానాలు కలిగినప్పుడు మోసపోకుండా వివేకంతో ప్రవర్తించాలి. ఈరోజు మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న అపవాది మోసానికి జనకుడని, వాడు మనల్ని మోసగించడానికి దేనినైనా ఎవర్నైనా తెలివిగా వాడుకోగలడని మరచిపోవద్దు.

ఆదికాండము 27:26-29
తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక-

ఈ వచనాలలో ఇస్సాకు యాకోబును ఏశావుగా భావించి అతడిని ఆశీర్వదించడం మనం చూస్తాం. అతను ఏశావును ఎక్కువగా ప్రేమించి, దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా అతడినే దీవించాలనుకున్నప్పటికీ చివరికి ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరింది (రోమా 9:10-12).

యెషయా 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

సామెతలు 19: 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

సామెతలు 21: 30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

యోబు 12: 16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.

ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించిన వాటిలో భౌతికపరమైన, ఆధ్యాత్మికమైన రెండు కోణాలు ఇమిడి ఉన్నాయని పైన తెలియచేసాను. అందులో భౌతికపరమైన ఆశీర్వాదం ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెంది వాగ్దాన భూమిని అనగా కనానును స్వతంత్రించుకోవడంతో నెరవేరుతుంది.

సంఖ్యాకాండము 24:5-9  యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి. నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి యెముకలను విరుచునుతన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.

అధ్యాత్మికమైన ఆశీర్వాదం మెస్సీయ (యేసుక్రీస్తు) లో నెరవేరుతుంది.

సంఖ్యాకాండము 24:17-19  ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును. ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును. యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.

ఆదికాండము 27:30-33
ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను. అతని తండ్రియైన ఇస్సాకునీ వెవర వని అతని నడిగి నప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్య మును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.

ఈ వచనాలలో ఏశావు వేటను సిద్ధపరచుకుని ఇస్సాకు దగ్గరకు రావడం, ఇస్సాకు జరిగినదానిని తెలుసుకుని భయంతో వణకడం మనం‌ చూస్తాం. సాధారణంగా మనకు తెలిసిన పెద్దల దీవెనలు ఏ ఒక్కరికీ పరిమితం కాదు. కానీ ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలు అలాంటి సామాన్యమైనవి కాదు, అవి అబ్రాహామునుండి వారసత్వంగా దేవుని ప్రమాణంతో కూడినవి, ప్రవచనాత్మకమైనవి. ఈ కారణం చేత ఇస్సాకు ఎవర్నైతే దీవించాడో వారిలో మాత్రమే అవి నెరవేరతాయి. అందుకే ఆ విషయంలో ఇస్సాకు బాధతో వణికిపోయాడు.

ఆదికాండము 27:34-37
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయ ముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని. ధాన్యమును ద్రాక్షారస మును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తర మియ్యగా-

ఈ వచనాలలో ఏశావు ఇస్సాకు మాటల ద్వారా తనకు చెందుతుందని ఆశించిన ఆశీర్వాదం తన సోదరుడికి వెళ్ళిపోయిందని గుర్తించి దుఃఖించడం మనం చూస్తాం.

హెబ్రీయులకు 12:16,17 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.

వాస్తవానికి ఏశావు ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినప్పుడే దానిని బట్టి అతనికివచ్చే ఆశీర్వాదం విషయంలో కూడా హక్కును కోల్పోయాడు. ఎందుకంటే ఆ రెండూ ఒకటేయని పై లేఖనంలో మనకు అర్థమౌతుంది. కానీ ఏశావు అప్పుడు దానిని జ్యేష్ఠత్వాన్ని బట్టి ఒకభాగం అదనంగా ప్రాప్తించే ఆస్తిహక్కుగా భావించాడు. (యాకోబు కూడా అలానే భావించాడు లేకపోతే ఇస్సాకును మోసగించకుండానే ఏశావుతో వాదించి తాను కొనుక్కున్న ఆశీర్వాదం పొందుకునే ప్రయత్నం చేసుండేవాడు). అందుకే ఏశావు ఇంకా ఆ ఆశీర్వాదంపై ఆశతో తండ్రి చెప్పినట్టుగా వేటకు వెళ్ళాడు. కానీ చివరికి అతని ఆశ నిరాశై నన్ను కూడా దీవించమని ఏడుస్తున్నాడు. దానిని శ్రద్ధగా వెదికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎవరైతే లోకంలోని స్వల్పకాల భోగాలకోసం యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారో వారందరూ ఏశావులా రోధించే సమయం రాబోతుంది. అప్పుడు వారు కూడా ఎంత రోధించినా శ్రద్ధగా వెదకినా ఎలాంటి ఫలితం ఉండదు.

ఆదికాండము 27:38-40
ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

ఈ వచనాలలో ఏశావు నన్ను కూడా దీవించమని ఎలుగెత్తి ఏడ్చినపుడు ఇస్సాకు ప్రతిస్పందన మనం చూస్తాం. ఇక్కడ "నీ నివాసం భూసారము లేకయూ మంచులేకయూ" ఉంటుందని తర్జుమా చెయ్యబడిన చోట హీబ్రూ బాషలో విభక్తిగా వాడిన ఒక పదాన్ని బట్టి అవి ఉంటాయని కూడా తర్జుమా చెయ్యవచ్చు. అందుకే కొన్ని ఇంగ్లీషు బైబిళ్ళలో అవి ఉంటాయని అర్థం వచ్చేలా కూడా తర్జుమా చేసారు. దీని ఆధారంగా కొందరు ఏశావు కూడా భౌతికపరమైన దీవెనను పొందుకున్నాడని, ఆధ్యాత్మికమైన దీవెనలను మాత్రం కోల్పోయాడని ‌బోధిస్తారు. కానీ సందర్భానుసారంగా మనం చదివితే మన తెలుగు బైబిల్ లో అవి ఉండవని చేసిన తర్జుమానే సరైనదని అనిపిస్తుంది. అదేవిధంగా ఏశావు సంతానం నివసించిన ఎదోము దేశం మృతసముద్రానికి దక్షిణంగా ఉంటుంది ఇది సారవంతమైన భూమికాదు. అందుకే తర్వాత మాటలో అతను కత్తిచేత (వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడకుండా) బ్రతుకుతాడని కనిపిస్తుంది. ఇది ఇశ్రాయేలీయులతోనూ మిగిలిన జాతులతోనూ అతని సంతానానికుండే వైరాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ ఇస్సాకు చెప్పినట్టే ఏశావు సంతానం ఇశ్రాయేలీయులకు కొంతకాలం దాసులుగా జీవించి తరువాత స్వతంత్రులయ్యారు (2 రాజులు 8:20-22).

ఆదికాండము 27:41
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

ఈ వచనంలో ఏశావు యాకోబుపై పగబట్టి‌ తన తండ్రి చనిపోగానే అతడిని చంపాలనుకోవడం మనకు కనిపిస్తుంది. ఇతను కయీనులా తన తమ్ముడిని హత్యచెయ్యాలనే ఆలోచనతో ఉన్నాడే తప్ప, గతంలో తాను ఒకపూట భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన పొరపాటును గుర్తించడం లేదు. నువ్వు కత్తితో బ్రతుకుతావనే తండ్రి మాట ఇతనిలో నెరవేరుతూ ఆ కత్తిని మొదటిగా తన సోదరుడిపైనే ఉపయోగించాలని ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా ఏశావు యాకోబును చంపాలనే‌ ఉద్దేశంతో ఉన్నప్పటికీ అది తన తండ్రి చనిపోయాక చెయ్యాలని దానిని వాయిదా వేసుకుంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు‌ తన చిత్తానుసారంగా దుష్టులు వారు చెయ్యదలచిన దుష్టత్వాన్ని జరిగించకుండా వారికున్న కారణాలతోనే నియంత్రిస్తాడు (యాకోబు జీవించినప్పుడే అతనిపట్ల దేవుని ఏర్పాటు‌ నెరవేరుతుంది). ఆయన ఈవిధంగా నియంత్రించకపోతే ఈ ప్రపంచంలో చంపాలకున్న అందరూ చంపుకుంటూ పోతారు.

ఆదికాండము 27:42-45
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెనుఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపె దనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.

ఈ వచనంలో తనకు అనుకూలంగా ఉన్న ఏ దాసుడితోనో యాకోబు హత్యగురించి ఏశావు పలికిన మాటలు విన్నటువంటి రిబ్కా వివేకంగా ప్రవర్తిస్తూ యాకోబును తన సోదరుడి ఇంటికి పంపేప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఆమె ఊహించినట్టుగానే తరువాత కాలంలో ఏశావు తనకోపాన్ని విడిచిపెట్టి, యాకోబును క్షమించడం జరిగింది (ఆదికాండము 33:4).

ఆదికాండము 27:46
మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనిన యెడల నా బ్రదుకు వలన నాకేమి ప్రయోజనమనెను.

ఈ వచనాలలో యాకోబును తన సహోదరుని దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్న రిబ్కా దానికి ఇస్సాకు అనుమతి కోరుతూ దానికి మరో కారణం చెప్పడం మనం చూస్తాం. రిబ్కా ఇక్కడ ఇస్సాకుతో అబద్ధం చెప్పడం లేదు కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి వేరే కారణాన్ని‌ మాత్రమే చెబుతూ (అది కూడా నిజమే) జ్ఞానయుక్తంగా నడుచుకుంటుంది. మనం కూడా కొన్ని సమయాలలో అక్కడున్న పరిస్థితిని బట్టి మనం చేసేదానిని ఎవరికీ పూర్తిగా వివరించవలసిన అవసరం లేదు, కొంతమట్టుకు చెప్పినా చాలు (అబద్ధం కాకుండా). సమూయేలు కూడా దావీదును రాజుగా అభిషేకించే సమయంలో సౌలుకు భయపడి యెష్షయికి వేరే కారణం మాత్రమే చెప్పి (బలి) తనదగ్గరకు పిలిపించుకున్నాడు (1 సమూయేలు 16:1-3). ఈవిధంగా చెయ్యమని దేవుడే అతనికి బోధించాడు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.