పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

 

ఆదికాండము 33:1

యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.

గత అధ్యాయంలో, యాకోబు తనవారందరినీ రేవు దాటి పంపివేసి తాను మాత్రం ఒక్కడూ నిలచిపోయి యెహోవాదూతతో పోరాడినట్టు మనకు కనిపిస్తుంది. అది జరిగిన తరువాత అతను కూడా రేవు దాటి అతని భార్యాపిల్లలు ఉన్నచోటికి చేరుకుని అక్కడి నుండే ఏశావు నాలుగువందల మందితో అతని దగ్గరకు రావడం చూస్తున్నాడు.

ఆదికాండము 33:2,3

అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

ఈ సందర్భంలో యాకోబు చేస్తున్నదానిని బట్టి అతనిలో తన కుటుంబాన్ని తన ప్రాణం పెట్టైనా సంరక్షించాలనుకునే మంచి యజమాని మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే, ఈ సంఘటన జరిగే సమయానికి యాకోబు మనసులో ఏశావుపట్ల భయం ఉంది. ఒకవేళ ఏశావు తాను ఊహించినట్టుగా తనపై దాడికి పాల్పడితే తన కుటుంబాన్ని అతను వెనుక ఉంచడం వల్ల వారు ఆ సమయంలో తప్పించుకునే అవకాశం ఉంటుందనే అతను అలా చేసాడు.

ఇక్కడ యాకోబు తన కుటుంబాన్ని తన వెనుక ఉంచిన వరుసక్రమాన్ని బట్టి, అతను ఎవరిని ఎంతగా ప్రేమించాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అతను మొదటిగా దాసీలనూ వారి పిల్లలనూ ఉంచాడు, రెండవదిగా తాను అనుకోకుండా వివాహం చేసుకున్న లేయానూ ఆమె పిల్లలనూ ఉంచాడు. మూడవదిగా అతను ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలునూ ఆమె కుమారుడైన యేసేపునూ ఉంచాడు. యాకోబు అందరికంటే ఎక్కువగా యేసేపునే ప్రేమించాడు.

ఆదికాండము 37: 3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.

ఒకవేళ ఏశావు తనను చంపి తన కుటుంబంపై కూడా దాడికి పాల్పడితే తప్పించుకుపోయే అవకాశం తాను ఎక్కువగా ప్రేమించిన రాహేలు, యేసేపులకే ఉంటుంది. ఇక్కడ అతను తన కుటుంబాన్ని ప్రేమించడంలో వృత్యాసం చూపిస్తున్నప్పటికీ వారందరినీ తనకంటే ఎక్కువగానే ప్రేమించాడు‌ తనకన్నా ఎవరినీ తక్కువగా ప్రేమించలేదు. అందుకే అందరికంటే ముందు వరుసలో తాను ఉన్నాడు.

అదేవిధంగా అతను తన అన్నముందు ఎంతో తగ్గించుకుంటూ సాగిలపడి‌ ఏడుసార్లు నమస్కారం చేసాడు.

ఆదికాండము 33:4

అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

ఈ సందర్భంలో యాకోబు కానీ అతని కుటుంబం కానీ ఊహించని విధంగా ఏశావు యాకోబుపట్ల ప్రేమ కలిగి ప్రవర్తిస్తున్నాడు.
ఇది యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానం. ఒకప్పుడు యాకోబును చంపుతానని శపథం చేసిన ఏశావు హృదయాన్ని ఆయన మార్చివేసి తన సోదరుడు చేసిన తప్పిదాన్ని క్షమించేలా చేసాడు.

ఆదికాండము 33:5,6,7

ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.

ఈ సందర్భంలో ఏశావు యాకోబుతో ఉన్నవారిని వీరు ఎవరని ప్రశ్నించినప్పుడు యాకోబు వారంతా దేవుడు నాకు అనుగ్రహించినవారని చెబుతూ ఆయన్ని‌ మహిమపరుస్తున్నాడు. చాలామంది మనుషుల్లో‌ ఉండే ఒక చెడ్డగుణం ఏంటంటే, వారు కష్టాలలో ఉన్నపుడు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటారు, ఆయన వారికి వాటి నుండి విముక్తి కల్పించగానే సంతోషంలో ఆయన్నే మర్చిపోతుంటారు. కానీ ఇక్కడ యాకోబు తన సోదరుడు తనను క్షమించాడనే సంతోషంలో పరలోకతండ్రిని మర్చిపోకుండా ఆయన్ని ఘనపరుస్తున్నాడు.

ఆదికాండము 33:8

ఏశావు నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.

ఈ సందర్భంలో ఏశావు తనకు యాకోబు పంపిన కానుకను ఎందునిమిత్తం పంపాడో తెలుసుకుని, వాటిని తృణీకరించడం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యాకోబు వాటిని ఏశావు క్షమాపణ కోరుతూ పంపించాడు. తన సహోదరుడు తనపట్ల చేసిన తప్పుకు అతడిని క్షమించడానికి ఎటువంటి మూల్యం చెల్లించనవసరం లేదని ఏశావు గుర్తించాడు. వారి మధ్య‌ ఉండే సహోదర బంధానికే విలువనిచ్చాడు. అవిశ్వాసి అయిన ఏశావే సోదరబంధానికి ఇంతగా కట్టుబడితే, విశ్వాసులమైన మనం మన కుటుంబసభ్యుల పట్ల, సంఘస్తుల పట్ల మరెంత నిస్వార్థమైన క్షమాగుణంతో నడుచుకోవాలో ఆలోచించండి.

లూకా సువార్త 17:3,4 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపు తిరిగి మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.

అదేవిధంగా ఇక్కడ ఏశావు మాటల్లో నాకు కావలసినంత ఉందని చెప్పడం ద్వారా దేవుడు అతడిని కూడా ఇహలోకపరంగా దీవించాడని మనం భావించాలి. ఏశావుకు ఆయన‌ అంతటి సమృద్ధిని దయచేసాడు‌ కాబట్టే అతను తన సోదరుడిని క్షమించగలిగాడు. ఒకవేళ ఏశావు కనుక అటువంటి సమృద్ధి లేక హీనస్థితిలో ఉండుంటే, దానికి కారణం యాకోబు తన దీవెనను దొంగిలించుకుపోవడమే అని భావించి అతనిపై ఇంకా పగతోనే ఉండేవాడు. సార్వభౌముడైన దేవుడు మానవుల పట్ల చేసే‌ మేలు కీడులన్నీ తన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకే.

ఆదికాండము 33:10

అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నా మీద నున్నయెడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నా మీద వచ్చినది గదా;

ఈ సందర్భంలో యాకోబు ఏశావును తన కానుకను స్వీకరించమని‌ బ్రతిమిలాడుతూ దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూసానని చెబుతున్నాడు. దీనికి యాకోబు అక్కడ ఏశావును దేవునితో సమానుడిని చేసాడని భావం కాదు. గతంలో అతనికి దేవుడు ప్రత్యక్షమైనపుడు ఆయనను చూస్తూ యాకోబు ఎటువంటి భయానికైతే  లోనయ్యాడో అంతే భయంతో ఏశావు ముఖాన్ని చూసి, చివరికి ఏశావు అతడిని క్షమించడం ద్వారా అతని కటాక్షాన్ని పొందుకున్నందువల్ల అతను ఇలా చెబుతున్నాడు.

ఆదికాండము 33:11

నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని-

ఈ సందర్భంలో యాకోబు మాటకు ఏశావు సమ్మతించి అతను‌ పంపిన కానుకను స్వీకరించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏశావు యాకోబు తనకు ఇస్తున్న ఉద్దేశాన్ని బట్టే దానిని స్వీకరించాడు. యాకోబు మొదట అతనికి కానుకను పంపినప్పుడు అతని‌ కటాక్షాన్ని కోరుకుంటూ దానిని పంపాడు, పైన చెప్పినట్టుగా తన సోదరుడిని‌ క్షమించడానికి అది అవసరం లేదు కాబట్టి ఏశావు దానిని తిరస్కరించాడు. కానీ ఇక్కడ యాకోబు ఏశావు కటాక్షం తనపైకి వచ్చిన తరువాత దానికి గుర్తుగా సంతోషంతో ఆ కానుకను ఇస్తున్నాడు. కాబట్టే ఏశావు దానిని స్వీకరించాడు.

ఇతరులు మనకేదైనా ఇచ్చేదానిని తీసుకునేముందు వారు ఎటువంటి ఉద్దేశంతో‌ దానిని ఇస్తున్నారో గుర్తించి దానిని స్వీకరించాలి. మన వ్యక్తిత్వం ఎటువంటిదో మన ఇచ్చి పుచ్చుకోవడాలలో కూడా బయటపడుతూ ఉంటుంది.

ఆదికాండము 33:12-14

మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చు వరకు, నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.

ఈ సందర్భంలో ఏశావు మనం వెళ్దామని తన ఇంటికి యాకోబును ఆహ్వానించడం‌ మనకు కనిపిస్తుంది. యాకోబు ఏశావుల గతచరిత్రను మనం పరిశీలించినప్పుడు వారిద్దరూ ఎప్పుడూ కూడా ఇంత ప్రేమగా లేరు. కానీ ఇక్కడ వారిద్దరి మధ్య దేవుడే సమాధానం కలుగచేసేసరికి వారు మునుపటికంటే ఆప్యాయంగా కనిపిస్తున్నారు; దేవుడు కలుగచేసే సమాధానం ఈవిధంగా ఉన్నతంగా ఉంటుంది.

అదేవిధంగా ఈ సందర్భంలో ఏశావు యాకోబును పిలవగానే అతని‌ వెంట వెళ్ళిపోకుండా అతనితో ఉన్న కుటుంబం మంద పరిస్థితిని ఆలోచిస్తూ తన సోదరుడికి ఆ విషయం తెలియచేస్తున్నాడు. మనం కూడా ఏదైనా చేసేముందు‌ మనతో ఉన్నవారి పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ముందడుగు వెయ్యాలి.

ఆదికాండము 33:15,16

అప్పుడు ఏశావు నీకిష్టమైన యెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.

ఈ సందర్భంలో ఏశావు తనదగ్గర ఉన్న కొంతమందిని యాకోబు దగ్గర విడిచిపెడతాను అన్నపుడు దానికి యాకోబు నిరాకరించడం మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి కొందరు యాకోబుకు ఏశావు దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేకనే ఈ విధంగా నిరాకరించాడనీ, పై సందర్భంలో కూడా కావాలనే ఏశావుతో మందల గురించీ, పిల్లల గురించీ సాకులు చెప్పాడని అభిప్రాయపడతారు. వారు ఆ విధంగా అభిప్రాయపడడానికి కారణాలుగా ఈ క్రింది వచనాలలో ఏశావు తిరిగి వెళ్ళాక యాకోబు‌ ఏశావు వెంట వెళ్ళకుండా సుక్కోతుకు వెళ్ళినట్టు రాయబడినదానినీ,  అదేవిధంగా పద్దనరాములో దేవుడు అతనికి ప్రత్యక్షమైనపుడు కానానుకు వెళ్ళమని ఆజ్ఞాపించినదానినీ చూపిస్తారు. ఒకవేళ యాకోబు ఏశావు వెంట శెయీరుకు వెళ్తే దేవుని మాటకు విరుద్ధంగా పయనించినవాడు ఔతున్నాడు అనేదే ఇక్కడున్న ప్రధానమైన సమస్య.

అయితే మేము ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు ఎందుకంటే, ఒకవేళ అది నిజమే అయితే, ఏశావు యాకోబును క్షమించాక కూడా యాకోబు మార్పు లేకుండా అతనితో అబద్ధం చెప్పి మరలా మోసగించాడని ఒప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే అక్కడ యాకోబు ఏశావుతో చాలా నమ్మకంగా నేను శేయీరుకు వస్తానని మాటిచ్చాడు. ఏశావు అదేమాటను నమ్మి అక్కడి నుండి తన చోటికి వెళ్ళిపోయాడు.

కాబట్టి  యాకోబు ఖచ్చితంగా తాను ఏశావుతో చెప్పినట్టే శేయీరుకు వెళ్ళి కొన్నిదినాలు నివసించి ఆ తర్వాతనే క్రింది వచనంలో రాయబడినట్టు సుక్కోతుకు వచ్చాడు. ఇక్కడ యాకోబు దేవుని మాటకు కూడా విరుద్ధంగా ప్రవర్తించలేదు ఎందుకంటే యాకోబు ఏశావు దేశమైన శేయీరులో శాశ్వతంగా ఉండిపోలేదు, అతిథిగా వెళ్ళి మరలా దేవుడు చెప్పినచోటికే వచ్చాడు. ఒకవేళ అలా చెయ్యడం దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించడమే అయితే, ఏశావుతో వస్తానని చెప్పి వెళ్ళకుండా మోసగించడం కూడా ఆయన న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కదా!.
మరి ఏశావు తన మనుష్యులను యాకోబు దగ్గర ఉంచుతాను అన్నపుడు అతను ఎందుకు నిరాకరించాడంటే, యాకోబుకు ప్రస్తుతం వారి అవసరం లేదు కనుక.

ఆదికాండము 33:17

అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.

ఈ సందర్భంలో అప్పుడు అంటే యాకోబు ఏశావుతో చెప్పినట్టు శేయీరుకు వెళ్ళి వచ్చిన తరువాత అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సుక్కోతు అనే పేరు ఆ ప్రాంతానికి ఎలా వచ్చిందో గ్రంథకర్త వివరిస్తూ ప్రారంభంలో తాను అదే పేరుతో దానిని సంబోధించాడు. గ్రంథకర్తలు చరిత్రను రాస్తున్నపుడు అవి అప్పటికి ఏ పేర్లతో పిలవబడుతున్నాయో వాటినే ప్రస్తావించినప్పటికీ, అతను రాస్తున్న చరిత్రలోని వ్యక్తుల కాలానికి మాత్రం ఆ ప్రాంతాలు వేరే విధంగా పిలవబడుతూ ఉంటాయి.

ఉదాహరణకు;

ఆదికాండము 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.

ఈ సందర్భంలో కయీను యెహోవా సన్నిధిలోనుండి నోదు దేశానికి వెళ్ళినట్టు రాయబడింది కానీ అప్పటికి ఆదాము హవ్వల సంతానం తప్ప భూమిపై మరెవ్వరూ లేరు.
మరెందుకు ఇక్కడ అలా రాయబడిందంటే,

ఆదికాండ చరిత్రను రాస్తున్న సమయానికి కయీను కాపురమున్న దేశానికి నోదు‌ అనే పేరుంది కాబట్టి మోషే అదే పేరును అక్కడ ప్రస్తావించాడు.

ఆదికాండము 33:18,19

అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని-

ఈ సందర్భంలో యాకోబు కానాను ప్రాంతానికి చేరుకుని అక్కడ ఒక స్థలాన్ని వెలపెట్టి కొనుక్కున్నట్టు చూడగలం. దేవుడు అబ్రాహాముతో చేసిన ప్రమాణం ప్రకారం వారి సంతానానికి కానాను స్వాస్థ్యంగా ఇవ్వబడుతుందే తప్ప అబ్రాహాము ఇస్సాకు యాకోబులు అందులో పరదేశులుగానే నివసించారు.

అపొస్తలుల కార్యములు 7:5 ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.

హెబ్రీయులకు 11:9 విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

దీనిప్రకారం న్యాయబద్ధంగా యాకోబు అప్పటికి కానానులో ఎవరు నివసిస్తున్నారో వారిదగ్గర వెలపెట్టే ఆ భూమిని కొనుక్కోవాలి. యాకోబు ఆ న్యాయాన్ని అనుసరిస్తూ వారి దగ్గర భూమిని కొనుక్కున్నాడు గతంలో అతని తాతయైన అబ్రాహాము కూడా 23వ అధ్యాయంలో ఇదేవిధంగా కొనుక్కున్నాడు. అయితే, అపోస్తలుల కార్యములు  7:16లో స్తెఫను మాటల ప్రకారం ఇక్కడ యాకోబు ఎవరిదగ్గరైతే భూమిని కొన్నాడో ఆ హమోరు కుమారుల దగ్గర అబ్రాహాము కొన్నట్టు ప్రస్తావించాడు.‌  స్తెపెను అలా పేర్లు మార్చి ఎందుకు ప్రస్తావించాడో తెలుసుకోడానికి 23వ అధ్యాయపు వివరణ చదవండి.

ఆదికాండము 33:20

అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

యాకోబుతో దేవుడు పెనుగులాడి అతనిని ఆశీర్వదించాక అతనిలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఈ సందర్భం‌ మనకు తెలియచేస్తుంది. గతంలో అతను దేవుణ్ణి అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడని సంబోధించేవాడు కానీ ఈ సందర్భంలో అతను ఆ బలిపీఠానికి పెట్టిన పేరుకు ఇశ్రాయేలు(నా) దేవుడు అని అర్థం. యాకోబు ఇక్కడ దేవుణ్ణి తన దేవుడని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు.

దేవుని సంకల్పం చొప్పున రక్షించబడివారంతా యాకోబులా మార్చబడి దేవుణ్ణి హత్తుకుంటారు.

జెకర్యా 2:11 ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు.

అదేవిధంగా ప్రారంభం నుండీ మనిషికీ, దేవునికీ మధ్యలో బలిపీఠం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. హేబేలు కానీ, నోవాహు కానీ, అబ్రాహాము కానీ బలిపీఠంపై చిందించే రక్తం ద్వారా దేవుణ్ణి సమీపించేవారు. ఇది యేసుక్రీస్తు బలియాగానికి ఛాయగా ఉంది; ప్రస్తుతం మనమంతా ఆయన బలియాగాన్ని బట్టే దైవసన్నిధికి చేరగలుగుతున్నాం.

హెబ్రీయులకు 10:10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.