పాత నిబంధన
రచయిత: సాగర్

8.1

ఆదికాండము 8:1  

దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను. 

ఈ వచనంలో ముందుగా, నోవాహు మరియు అతనితో ఓడలో ఉన్నవారందరినీ దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుతున్నాడని మనకు అర్థమయ్యేలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా రాయబడింది. వాస్తవానికి దేవుడు మనవలే దేన్నీ మరిచిపోయి,తరువాత జ్ఞాపకం చేసుకోడు. ఈ విధంగా రాయబడిన మాటలను Anthropopathism అంటారని మనం ఆరవ అధ్యాయపు వివరణలో కూడా చూసాము. అదేవిధంగా, ఈ వచనంలో దేవుడు గాలిని భూమిపైన విసిరింపచేయడం ద్వారా నీరు తగ్గిపోయేలా చేస్తున్నట్లు చూడగలం. సృష్టిలో ఉన్న సమస్తమూ ఆయన మాటకు లోబడుతుంది అందులో గాలి ఒకటి.

కీర్తనల గ్రంథము 135:7 భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

సామెతలు 30:4 ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

అదేవిధంగా, బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాల్లో కొన్ని సృష్టికి అతీతమైమవిగా, మరికొన్ని సృష్టిద్వారానే చేసేవిగా మనకి కనిపిస్తాయి. ఈ గాలి ద్వారా దేవుడు చేసిన మరికొన్ని అద్భుతాలను చూడండి.

నిర్గమకాండము 14:21,22 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

నిర్గమకాండము 10:13 మోషే ఐగుప్తుదేశము మీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.

ఆదికాండము 8:2  

అగాధజలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.

దేవుడు ఆరవ అధ్యాయంలో చెప్పినట్లుగా నలుబది దినములు, నలుబది రాత్రులు గడిచాక భూమిపైన ఆకాశం నుండి పడే వర్షం, భూమి అగాధం నుండి పైకి వస్తున్న ఊటలు ఆగిపోయాయని ఈ వచనం తెలియచేస్తుంది.
 

ఆదికాండము 8:3

అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా; 
 
భూమిపైన దేవుడు గాలిని విసిరింపచేయడం వలన నీళ్లు తగ్గడం ప్రారంభించాయి. వాస్తవానికి జలప్రళయంలో భూమిపైకి వచ్చిన నీటిని తొలగించడానికి దేవునికంత సమయం అవసరం లేదు. ఎందుకంటే, ఆదికాండము 1:6 వచనంలో, భూమిమొత్తం జలములతో నిండియున్నపుడు ఆయన ఒక రోజుకంటే తక్కువ సమయంలో ఆ నీటిని తొలగించినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ జలప్రళయ సందర్భంలో కానీ, ఎర్రసముద్రాన్ని పాయలుగా చేసిన సందర్భంలో కానీ ఆయన ఇష్టం చొప్పున సృష్టిలోని గాలిని ఉపయోగించుకుని ఆ కార్యాల్ని అంత సమయంలో చేయదలచుకొన్నాడు.

 ఆదికాండము 8:4

ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 

 ఈ వచనంలో నోవాహు యొక్క ఓడ ఆరారాతు కొండలమీద నిలచినట్లు చూడగలం. దీనిప్రకారం ఆ పర్వతాలు ప్రపంచంలో ఎత్తైన పర్వతాల జాబితాలో ఉన్నట్లుగా అర్థం అవుతుంది. దీని గురించి మనం ఇంటర్నెట్ లో పరిశీలించినట్లైతే, ఈ పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నట్లుగానూ, ఆ పర్వతాల్లో కొందరు శాస్త్రవేత్తలు నోవాహు యొక్క ఓడను గుర్తించి ఆ ప్రాంతంలో  "Noah Ark" అనే పార్కును కూడా నిర్మించినట్లుగానూ చూడగలం. అయితే ఇది ఎంత నమ్మశక్యం అనేదానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నందువల్ల మనం ఆ ఓడ లభించిందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము.

అయితే, మొదటిశతాబ్దానికి చెందిన యూదా చరిత్రకారుడు, యెరుషలేము దేవాలయంలో యాజకుడు అయిన  "ఫ్లేవియస్ జోసెఫెస్" తాను రాసిన The Antiquities of The Jews అనే పుస్తకంలో మొదటిభాగం మూడవ అధ్యాయం ఐదు,ఆరు వచనాలలో నోవాహు ఓడ నిలిచిన పర్వతం, అర్మేనియా దేశంలో ఉందనీ, ఆ దేశంలోని ప్రజలందరూ ఆ పర్వతాన్ని Apobarērion అని పిలిచేవారనీ రాశాడు. ఈపేరుకు కిందకు దిగిరావడం అని అర్థం. నోవాహు కుటుంబం ఆ పర్వతం పైన ఓడ నిలిచినపుడు అక్కడ నుండి కిందకు దిగివచ్చారు. కనుక ఆ కారణంతోనే ఆ దేశపు ప్రజలు ఆ పర్వతాన్ని ఆ విధంగా పిలవడం జరిగింది.


దీన్నిబట్టి జోసెఫెస్ జీవించిన కాలానికి, ఈ ఓడ శిథిలాలు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఆయనకు తెలుసని మనకి అర్థమౌతుంది. ఈ అర్మేనియా దేశమే ప్రస్తుతం టర్కీదేశంగా పిలవబడుతుంది. దీనిప్రకారం ప్రస్తుతం టర్కీదేశంలోని పర్వతంపైన లభించిన ఓడ శిథిలాలు బహుశా నోవాహు ఓడవే అయ్యుండొచ్చని కొందరి అభిప్రాయం. ఎందుకంటే జోసెఫెస్ కేవలం తన పరిశీలన ఆధారంగా మాత్రమే ఈ మాటలు రాయలేదు,  అప్పటికాలంలో పేరుపొందిన బబులోను చరిత్రకారుడు Berosus, ఈజిప్టు చరిత్రకారుడు Hieronymus, ధమస్కు చరిత్రకారుడు Nicolas చెప్పినవాటి వివరాలను కూడా జోసెఫెస్ ప్రస్తావించి ఈమాటలు రాశాడు. ఆ ముగ్గురు కూడా ఓడ అదేప్రాంతంలో ఉందనీ, అక్కడి ప్రజలలో కొందరు ఆ ఓడ శిథిలాలను చిన్నముక్కలుగా చేసి రక్షరేకుల్లో ఉంచుకుని, మెడలో వేసుకునేవారని తమ పుస్తకాల్లో రాశారు.

ఆదికాండము 8:5

నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
 
పై వచనంలో మనం నోవాహు ఓడ ఆరారాతు పర్వతం పైన నిలిచినట్లు చూస్తాం. అప్పటికి ఆ పర్వతం కూడా నీటిలో మునిగిపోయే ఉంది. సాధారణంగా ఓడ అమరం కాస్త నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆ అమరానికి ఏదైనా మెరక తగిలినపుడు అది ఎటూ కదలకుండా నిలచిపోతుంది. ఆరారాతు పర్వతం పైన కూడా ఆ ఓడ నిలచిపోవడానికి కారణం ఇదే అయ్యుండొచ్చు.
 
ఈ వచనంలో అయితే ఆ నీరు ఇంకా తగ్గడం వల్ల అప్పటికి నీటిలో మునిగిపోయిన పర్వతాల పైభాగాలు నోవాహు వయస్సు యొక్క ఆరువందల సంవత్సరం పదవనెల మొదటి దినమున కనిపించడం ప్రారంభించాయి.
 

ఆదికాండము 8:6,7

నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.

ఈ వచనాలలో మనకి కనిపిస్తున్న కాకి ఒక అపవిత్రజంతువని బైబిల్ లో రాయబడింది.

లేవీయకాండము 11:13-15 పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,  క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి.

ఇది నోవాహుకు తెలిసినప్పటికీ సమాచారం తీసుకురావడానికి దానినే ఎందుకు పంపించాడో మనకి బైబిల్లో వివరించబడలేదు. అయితే అది తన అపవిత్ర నైజాన్ని నిరూపించుకుంటున్నట్లు ఈ వచనాలలో కనిపిస్తుంది. సాధారణంగా కాకులు, చనిపోయిన కళేబరాలను ఇష్టంగా తింటూ ఉంటాయి, ఈ కాకి కూడా, ఆ సమయంలో చనిపోయిన వారి కళేబరాలు నీటిలో తేలడం చూసినపుడు వాటిని తినే ఆసక్తిలో నోవాహు దగ్గరకు రాకుండా ఉండిపోయి ఉంటుంది.

ఆదికాండము 8:8

మరియు నీళ్లు నేల మీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తనయొద్ద నుండి నల్లపావురమొకటి వెలుపలికి పోవిడిచెను. 

ఈ వచనంలో నోవాహు రెండవసారి సమాచారం కోసం పంపినటువంటి పావురం పవిత్రమైన జీవిగా మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అపవిత్రమైన పక్షుల జాబితాలో ఈ పావురం మనకి కనిపించదు.

ఆదికాండము 8:9

నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. 

ఈ పవిత్ర పక్షి అయిన పావురం, నోవాహు యొక్క ఆజ్ఞను మీరకుండా, ప్రవర్తిస్తున్నట్లు ఈ వచనంలో కనిపిస్తుంది.

ఆదికాండము 8:10,11

అతడు మరి యేడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.
 
ఈ వచనాలలో నోవాహు రెండవసారి అదే పావురాన్ని పంపినట్లు, అది నోవాహు దగ్గరకు సమాచారం తీసుకుని వచ్చినట్లు రాయబడింది. ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవాలి.

దేవుడు నోవాహుతో జలప్రళయం ఎప్పుడు వస్తుందో, ఎన్నిదినాలు వస్తుందో చెప్పాడు కానీ నీరు ఎంతకాలం తరువాత భూమినుండి ఇంకిపోతుందో చెప్పలేదు. నోవాహు కూడా దాని గురించి దేవునిని ఏమీ అడగలేదు. కానీ అతడు తనకున్న జ్ఞానాన్నీ, వనరులను(పక్షులు) ఉపయోగించుకుని అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అది తెలియచేయమని దేవున్ని అడగడం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని దేవుడు తెలియచేయకపోయినా తనకున్న జ్ఞానం, వనరులతో తెలుసుకోగలడు.

నేటికాలంలో చాలామంది విశ్వాసులు తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కార్యాలలో, పరిచర్యకు సంబంధించిన విషయాలలో వాక్యాన్ని ఆధారంగా చేసుకుని తమకున్న వనరులు, జ్ఞానంతో నిర్ణయం తీసుకుని ముందుకు సాగకుండా, ఇంకా దేవుడు ప్రతీ విషయంలో కూడా మెల్లనిస్వరంతో మాట్లాడతాడనీ, దర్శనాల ద్వారా మాట్లాడతాడనీ భ్రమపడుతున్నారు.

దేవునితో ముఖాముఖిగా సంభాషించిన నోవాహులాంటివాడే (ప్రత్యక్షతలు ఉన్నకాలంలోనే) అలా భ్రమపడకుండా ముందుకు సాగితే నేటికాలంలో ఇంకా ప్రతీవిషయంలోనూ దేవుడు వచ్చి మాట్లాడతాడనే అపోహలో ఉండటం ఎంత విడ్డూరమో మీరే ఆలోచించండి.

ఆదికాండము 8:12-16

అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.  మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమి మీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను. అప్పుడు దేవుడు నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
 
నోవాహు అతని కుటుంబం దేవుని మాటచొప్పున ఓడలోకి ప్రవేశించినట్లు మనకి ఏడవ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ వచనాలలో వారు భూమి ఎండి ఉండటం చూసినప్పటికీ తమంతట తాము ఓడ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేదు. దేవుడు తమకి బయటకు వెళ్లండని ఆజ్ఞాపించేంతవరకూ వారు ఓడలోనే ఉన్నారు. దీన్నిబట్టి రక్షణకు పాత్రులుగా కృపపొందిన నోవాహు, అతని కుటుంబం ప్రతీవిషయంలోనూ దేవునికి లోబడుతున్నట్లు మనకి కనిపిస్తుంది. దేవుని చేత నిత్యజీవానికి అర్హులుగా నిర్ణయించబడిన విశ్వాసులు కూడా, ప్రతీవిషయంలోనూ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞాపించిన మాటలకు లోబడుతూ ఈ లోకంలో తమ బ్రతుకును కొనసాగిస్తారని ఈ సందర్భం మనకు గుర్తుచేస్తుంది.

నోవాహు, అతని కుటుంబం మరియు వారితో ఉన్న సమస్త జీవరాశులు ఓడలో నివసించిన మొత్తం కాలం ఒక సంవత్సరం పదిరోజులు. ఏడవ అధ్యాయంలో రాయబడిన వచనాల ప్రకారం, నోవాహు వయసుయొక్క ఆరువందల సంవత్సరం, రెండవ నెల పదిహేడవ దినాన వారు ఓడలో ప్రవేశించారు.

పై వచనాల ప్రకారం నోవాహు వయసు యొక్క ఆరువందల ఒకటవ సంవత్సరం, రెండవ నెల ఇరువది ఏడవ రోజున వారు ఓడ నుండి బయటకు వచ్చారు - ఈమొత్తం సమయం ఒక సంవత్సరం పదిరోజులు.

ఆదికాండము 8:17

పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
 
 
ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసినపుడు సమస్త జీవరాశులతోనూ ఈ మాటలు పలికినట్లు మనకి కనిపిస్తుంది.  దీనిప్రకారం దేవుడు జలప్రళయం తరువాత తనసృష్టిని నూతనపరుస్తున్నట్లుగా నూతన పరుస్తున్నాడు.
 

ఆదికాండము 8:18,19

కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను.
 
ఈ వచనాలలో జలప్రళయ సమయంలో ఓడలో ప్రవేశించిన నోవాహు కుటుంబం, సమస్త జీవరాశులు ఓడనుండి బయటకు వస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే రక్షణకు పాత్రులుగా ఎంచబడి ఓడలో ప్రవేశించిన నోవాహు కుటుంబం ఆ ఓడలో జీవించినంతకాలం క్రియలు లేకుండా ఖాళీగా ఉండలేదు. వారు ప్రతీదినం తమతో ఉన్నటువంటి జీవరాశులకు ఆహారాన్ని వేయడం, అవి ఉన్నచోటును శుభ్రం చేయడం వంటి భారమైన పనిచేస్తూ జీవించారు.
 

ఆదికాండము 8:20

అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను.
 
ప్రారంభంలో జంతువులన్నీ జతలు జతలుగా లెక్క ప్రకారం ఓడలో ప్రవేశించాయి అన్నది నిజమైతే వాటిని నోవాహు బయటకు వచ్చాక బలి అర్పించినప్పుడు ఆ జాతులు అంతరించిపోవాలి కదా అని ఇక్కడ కొందరు ప్రశ్నిస్తారు కానీ నోవాహు బలిగా అర్పించిన పవిత్రజంతువులు ఓడలోకి ఒక జతగా మాత్రమే ప్రవేశించలేదు ఈ వచనాలు చూడండి.
 
ఆదికాండము 7:2,3 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవ ముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము.
 
ఈ వచనాల ప్రకారం ఓడలోకి ప్రవేశించిన జీవుల్లో, పవిత్రమైనవి ఏడేసి జతలు చొప్పున ప్రవేశించాయి.  అందులో కొన్నిటినే నోవాహు ఈ సందర్భంలో బలిగా అర్పిస్తున్నాడు. అదేవిధంగా వారందరూ ఓడలో జీవించిన కాలం ఒక సంవత్సరం పదిరోజులు. ఈ కాలంలో ఆ జీవులన్నీ ఖచ్చితంగా పిల్లలు పెట్టి, విస్తరించే అవకాశం ఉంది.

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

ఈ వచనాలలో మొదటిగా, నోవాహు అర్పించిన బలిద్వారా దేవుడు సువాసన ఆఘ్రాణించినట్లుగా మనకి కనిపిస్తుంది. మనం ప్రారంభం నుండీ  బైబిల్ లో దేవుని గురించి రాయబడిన అనేక సందర్భాలు మానవునికి అర్థమయ్యేలా రాయబడ్డాయనీ అందులో ఒక విధానాన్ని Anthropomorphism అంటారని చూసాము.

ఈ సందర్భంలో కూడా అదేవిధంగా రాయబడింది. ఆత్మ అయిన దేవునికి మనవలే వాసన చూసేందుకు ముక్కు ఉండదు. నోవాహు అర్పించిన ఈ బలి యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉండి,  ఆ బలికి సంబంధించిన సువార్త ద్వారా దేవునికి కలిగే సంతోషాన్ని తెలియచేసేందుకే ఈ సువాసన అనే పదాన్ని రచయిత వాడడం జరిగింది.

ఎఫెసీయులకు 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

2 కోరింథీయులకు 2:15 రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము.

ఇక పైన మనం చూసిన వచనాలను బట్టి కొందరు దేవుడు మానవుల పాపంతో రాజీపడుతున్నాడని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ దేవుడు నరుల ఆలోచన బాల్యం నుండీ చెడ్డదనీ, ఇక వారిని సంహరించననీ పలకడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మనుషుల పాపంతో రాజీపడడం లేదుకానీ, ఆదామునుండి ప్రతీమనిషిలోకీ వస్తున్న పాపస్వభావాన్ని బట్టి వారు ఎల్లప్పుడూ కలిగియుండే స్థితిని తెలియ చేస్తున్నాడు, మనిషి బ్రతికినంతకాలం అతనిలో తప్పకుండా ఆ పాపస్వభావం కనపరచబడుతూనే ఉంటుంది. అందుకే యోహాను దీని గురుంచి ఏం రాస్తున్నాడో చూడండి.

1 యోహాను 1:8 మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.

ఈవచనం ప్రకారం ఎంత గొప్ప విశ్వాసినైనా కూడా, బ్రతికున్నంతకాలం ఏదో ఒక సమయంలో తనలో ఉన్న పాపపు స్వభావం తనను ఇబ్బంది పెట్టడం సహజం. కానీ, దేవుడే తన ఆత్మ నియమం ద్వారా ఆ పాపపు స్వభావాన్ని జయించే శక్తిని అనుగ్రహిస్తాడు.

రోమీయులకు 8: 2 క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను.

చివరిగా విశ్వాసి మహిమలోకి మార్చబడినపుడు, అతను ఆ పాపస్వభావం నుండి పూర్తిగా విడిపించబడతాడు. అదేవిధంగా మనం పైన చూసిన భాగంలో, దేవుడు ఇక నరులనూ, సమస్త జీవరాశులనూ సంహరించనని మాట్లాడం మనకి కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని మనం తరువాతి అధ్యాయంలో ఉన్న మాటలతో కలసి అర్థం చేసుకోవాలి.

ఆదికాండము 9:11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.

ఈ వచనం ప్రకారం దేవుడు సమస్త మనుషులనూ, జీవరాశులను జలప్రళయం ద్వారా నాశనం చేయనని మాత్రమే చెపుతున్నాడు. అయితే క్రీస్తు రాకడలో మార్పుచెందని సమస్త మానవులకూ, వారితో పాటుగా ఈ సమస్త సృష్టికీ దేవుడు మరోవిధంగా నాశనాన్ని సిద్ధపరిచాడు. ఆ మాటలు చూడండి -

రెండవ పేతురు 3:6,7,10-12 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.  అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

ఆదికాండము 8:22

భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
 

ఈ వచనాల ప్రకారం, దేవుడు ప్రారంభంలో సృష్టిని చేసినపుడు ఏయే కాలాలనైతే నియమించాడో, అవి, రాత్రింబగళ్లు క్రీస్తు రాకడలో అంతం వరకూ ఈ భూమిపైన కొనసాగుతాయి.ఈ వచనాల ప్రారంభంలో భూమినిలచియున్నంత కాలం అని దేవుడు పలకడం ద్వారా, ఈ భూమి ఏదో రోజు నిలువకుండా నాశనం అవుతుందని కూడా తెలియచేస్తున్నాడు. ఆ నాశనం ఎలా ఉంటుందో మనం పై వచనపు వివరణలో చూశాము.

 

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.