పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

30:1, 30:2, 30:3, 4, 30:5-8, 30:9-13, 30:14, 30:15,16, 30:17, 30:18, 30:19-21, 30:22, 30:23,24, 30:25,26, 30:27, 28, 30:29,30, 30:31-34, 30:35,36, 30:37-42, 30:43

ఆదికాండము 30:1
రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. లేనియెడల నేను చచ్చెదననెను.

ఈ వచనంలో రాహేలు తన అక్కపై అసూయతో యాకోబును విసిగిస్తూ మాట్లాడడం మనం చూస్తాం. యాకోబు మొదటినుండీ తన అక్కకంటే ఈమెనే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమలో లేయాకు దక్కని ప్రయోజనాలెన్నో ఈమె అనుభవించేయుంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం లేయా తన భర్త ద్వారా ఉన్నతమైన బహుమానాన్ని (సంతానం) పొందుకునేసరికి ఆమె పట్ల‌ అసూయపడుతుంది. పైగా ఆ బహుమానం తన భర్త ద్వారానే కలుగుతున్నప్పటికీ అది అనుగ్రహించేది మాత్రం దేవుడేయని మరచిపోయి "నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే చస్తానంటూ" యాకోబును బెదరిస్తుంది. ఇక్కడ రాహేలు యొక్క ప్రవర్తన దేవుణ్ణి ఎరిగిన విశ్వాసురాలిగా మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక విశ్వాసురాలు ఒకరిపట్ల అసూయపడదు, చస్తానంటూ బెదరింపులకు పాల్పడదు. గర్భఫలం నిమిత్తం తన భర్తను విసిగించకుండా సమూయేలు తల్లియైన హన్నావలే దేవునిపై ఆధారపడుతుంది.

ఆదికాండము 30:2
యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను.

ఈ వచనంలో రాహేలు పలికిన మాటలకు యాకోబు ప్రతిస్పందన మనం చూస్తాం. ఆ ప్రతిస్పందనలో యాకోబుకు దేవునిపై ఉన్న విశ్వాసం బయలుపడుతుంది. సాధారణంగా మన జీవితాలలో మంచి జరిగితే దేవుడు చేసాడని, మంచి జరగకపోతే సాతాను అడ్డగిస్తున్నాడని భావిస్తుంటాము, కానీ అది వాస్తవం కాదు. విశ్వాసి జీవితంలో ప్రతీదీ దేవుని చిత్తమే జరుగుతుంది. మనకు ఇచ్చేదీ దేవుడే ఇవ్వకుండా ఉండేది కూడా దేవుడే. కాబట్టి మన పరిధిలో లేనివాటి గురించి, ఏ మనిషిపైనా ఆధారపడకుండా ఎవరినీ నిందించకుండా కేవలం దేవునిపై మాత్రమే మనం ఆధారపడాలి, వినయపూర్వకంగా ఆయనను వేడుకోవాలి. అందుకే ఇక్కడ యాకోబు "నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్నటువంటి దేవుని స్థానంలో నేనున్నానా" అంటూ అది తన పరిధిలో లేని విషయమని రాహేలుకు‌ బుద్ధి చెబుతున్నాడు.

కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.

సాధారణంగా మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులను దైవాలుగా సంబోధిస్తుంటారు, తల్లిని మించిన దైవం లేదనే మాటలు మనకు ఎక్కువగా వినిపిస్తుంటాయి (దురదృష్టవశాత్తూ పిల్లలు చదువుకునే పాఠశాలల్లో సహా). కానీ పిల్లలను కనడంలో మన తల్లిదండ్రులు దేవుడు వాడుకునే సాధనాలే తప్ప వారు దైవాలు కాదు, ఎవరైనా ఆవిధంగా అతిశయిస్తుంటే వారు దేవుని మహిమను దొంగిలించే దుర్మార్గులు ఔతారు, ఇది సాతాను పుట్టించిన భావజాలం. ఎందుకంటే మొదటిసారిగా దేవునితో సమానంగా ఉండాలనే ఆశతో పరలోకం నుండి పడడ్రోయబడింది వాడే (యెషయా 14:12-15).

ఒకవేళ పిల్లలను కనడం తల్లితండ్రుల పరిధిలోని విషయమే ఐతే ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేకుండానే ఎందుకు ఉండిపోతున్నారు? ఈ అవగాహన విశ్వాసికి ఎల్లప్పుడూ ఉండి‌, అతను దేవుని మహిమను దొంగిలించే పనిని ఎప్పుడూ చెయ్యలేడు కనుక, యాకోబు ఆ విధంగా "నేను దేవునికి ప్రతిగా ఉన్నానా" అంటూ ప్రత్యుత్తరమిస్తున్నాడు. ఇదే లక్షణం తన కుమారుడైన యోసేపులో కూడా మనకు కనిపిస్తుంది (ఆదికాండము 50:19).

అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబుకు రాహేలుపై కోపం రగులుకున్నట్టు మనం చూస్తాం. ఈ యాకోబు రాహేలును ఎంతో గాఢంగా ప్రేమించి ఆమె కోసం దాస్యత్వం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతగా ప్రేమించిన అతనికి ఆ భార్య ఒక అవిశ్వాసురాలిలా మాట్లాడేసరికి ఆమెపై కోపం రగులుకుంది. కాబట్టి నిజమైన ప్రేమలో అవతలివారు తప్పు చేసినప్పుడు దానిని కోపంతో సరిచేసే నైతికబాధ్యత నిక్షిప్తమైయుంటుందని మనం గుర్తుంచుకోవాలి, ఆ లక్షణం లేకపోతే అది ప్రేమేకాదు. ఎందుకంటే ప్రేమ అవతలివారి క్షేమం కోరుకుంటుంది కాబట్టి, వారు తప్పుచేసినప్పుడు దానివల్ల ఏదైనా ప్రమాదం తెచ్చుకుంటారేమో అనే ఆందోళనతో వారిపై కోపం‌ కూడా కలుగుతుంది.

సామెతలు 27: 6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

కానీ చాలామంది తాము ప్రేమించేవారు ఏదైనా తప్పు చేసేసరికి ఏదో తెలియక చేసారులే ఆవేశంలో చేసారులే అంటూ సమర్థించుకుంటారు. అలా చెయ్యడం వారి జీవితానికే‌ పెనుప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకే యోబు కూడా తన భార్య అన్నీ నష్టపోయిన ఆవేదనలో మాట్లాడినప్పటికీ ఆ మాటలకు స్పందిస్తూ ఆమెకు బుద్ధి చెప్పాడు (యోబు 2:9,10) కాబట్టి తప్పు చేస్తున్నవారిని (తీవ్రతను బట్టి) కఠినంగానే గద్దించాలి.

తీతుకు 1:14 విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

ఆదికాండము 30:3,4
అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా. ఆమెతో పొమ్ము. ఆమె నా కొరకు పిల్లలను కనును. ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా-

ఈ వచనంలో రాహేలు తన దాసిద్వారా పిల్లలను కనాలనే ఉద్దేశంతో యాకోబుకు ఆమెను భార్యగా ఇవ్వడం మనం చూస్తాం. తన భర్త ద్వారా దాసి కనే పిల్లలను తన పిల్లలుగా భావించడానికి సిద్ధపడిన రాహేలు అదే భర్తతో తన స్వంత అక్క కన్నటువంటి పిల్లలను మాత్రం తన పిల్లలుగా భావించలేకపోయింది. అదేవిధంగా ప్రాచీన కాలంలో తమకు పిల్లలు పుట్టనప్పుడు తమ దాసిల ద్వారా పిల్లలను కనే సాంప్రదాయం ఉండేది, అబ్రాహాము విషయంలో కూడా మనం దీనిని చూస్తాం. ఇక్కడ యాకోబు కూడా ఆ పద్ధతిని దృష్టిలో పెట్టుకుని తన భార్య మాటకు సమ్మతించి ఆ దాసిని భార్యగా స్వీకరించాడు.

ఆదికాండము 30:5-8
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను. ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

ఈ వచనాలలో రాహేలు ఆశించినట్టుగానే తన దాసి ద్వారా పిల్లలను కనడం మనం చూస్తాం. ఆమె వారికి పెట్టిన పేర్లు కూడా తన అక్కతో ఉన్నటువంటి పోటీని తెలియచేస్తున్నాయి.

ఆదికాండము 30:9-13
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

ఈ వచనాలలో లేయా కూడా తాను అప్పటికే దేవుని కృపచేత కుమారులను కన్నప్పటికీ తన చెల్లెలు దాసి ద్వారా కుమారులను కంటుందనే అసూయతో ఆమె కూడా అదే పని చెయ్యడం మనం చూస్తాం. పైగా ఆమె అలా చేసి ఆషేరు పుట్టినప్పుడు స్త్రీలు నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారని ఆశించింది‌. లోకం మనల్ని గొప్పగా అనుకోవాలనే ఉద్దేశంతో ఏవేవో చెయ్యడం విశ్వాసికి చెందిన లక్షణం కాదు. యేసుక్రీస్తు తల్లియైన మరియ ఆ ఉద్దేశంతో ఏమీ చేయనప్పటికీ దేవుడు ఆమెను స్త్రీలలో ధన్యురాలిగా చేసాడు.

ఆదికాండము 30:14
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా-

ఈ వచనంలో లేయా కుమారుడైన రూబేను పొలంనుండి పుత్రదాత వృక్షఫలాలను తన తల్లి కోసం తెచ్చినట్టు మనం చూస్తాం. మన తెలుగు బైబిల్ లో ఈ పండ్లను పుత్రదాత వృక్షఫలాలని తప్పుగా అనువదించారు కానీ, ఇంగ్లీష్ బైబిల్ లో వీటిని "Mandrakes" అని తర్జుమా చేసారు, హీబ్రూలో ఐతే ఇక్కడ 'דּוּדי'(dûday) అనేపదం ఉపయోగించబడింది. ఈ పండ్లు పెద్ద రేగుపండ్లలా (Green apples) లా కనిపించి, చాలా రుచికరంగా తీపి వాసనతో ఉంటాయి. అప్పటి ప్రజలు వీటిని కామవాంఛను పెంచుకునేందుకు (సంతాన సాఫల్యానికి) తినేవారు. అందుకే హీబ్రూలో వీటిని (dûday) అని పిలిచారు, దీనికి కామసంబంధమైన ప్రేమ అని‌ అర్థం. ఈ పండ్లు గురించి రాయబడ్డ మరో సందర్భం చూడండి.

పరమగీతము‌ 7:13 పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి.

ఈ పండ్లు, సహజసిద్ధంగా కామవాంఛను పెంచే సామర్థ్యం గలవైనప్పటికీ కొందరు ప్రజలు వీటిని తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకంతో కూడా తింటూ ఉండేవారు. అవి స్త్రీ పురుషులలో కామవాంఛను పెంచి, భార్యాభర్తలు ఎక్కువగా లైంగిక జీవితాన్ని గడిపేలా చేస్తాయి కాబట్టి వాటివల్ల కొందరు గర్భవతులు అవ్వడం సాధారణంగానే జరుగుతుంది. దానిని బట్టి చాలామంది అవి తింటే పిల్లలు పుడతారనే మూఢనమ్మకాన్ని వ్యాప్తిచేసారు. ఒకవేళ లైంగికంగా సామర్థ్యం కలిగున్న జంటలు ఇతర లోపాలు కలిగి ఆ పండ్లు తిన్నప్పటికీ వాటివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ పండ్లు కామవాంఛను పెంచుతాయే తప్ప పిల్లలను కనేలా చెయ్యలేవు. రాహేలు అప్పటికి ఇంకా పిల్లలను కనలేదు కాబట్టి, బహుశా ఆమె కూడా ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతూ ఆ పండ్లను ఆశించియుండవచ్చు.

ఆదికాండము 30:15,16
ఆమె నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.

ఈ వచనాలలో లేయా తనచెల్లలైన రాహేలు ఆ పండ్లను అడిగినప్పుడు వాటిని ఇవ్వకుండా ఆమెను హేళన చేస్తూ మాట్లాడడం, ఆ పండ్లకు ప్రతిగా యాకోబు ఆమెతో కలిసుండే రోజుల్లో ఒకరోజును కోరుకోవడం మనం చూస్తాం. యాకోబు లేయా రాహేలులకే కాకుండా వారి దాసిలకు కూడా భర్తగా ఉన్నాడు కాబట్టి వారితో అతను వంతుల చొప్పున కాపురం చేసేవాడు. కాబట్టి లేయా తన కుమారుడు తెచ్చిన పండ్లతో రాహేలు వంతులోని ఒక రోజును తన వశం చేసుకుంది. వీరు చేసే పనులు చాలా లోపయుక్తంగానే కనిపిస్తున్నాయి.

ఆదికాండము 30:17
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

ఈ వచనంలో దేవుడు లేయా ప్రార్థనను ఆలకించి, కానుపు ఉడిగిపోయిన ఆమెకు గర్భఫలం ఇవ్వడం మనం చూస్తాం. ఈమె ఒకవైపు దేవునిపై ఆధారపడి ఆయనను ప్రార్థిస్తూనే మరోవైపు తన చెల్లెలిపట్ల సరికాని పద్ధతిలో ప్రవర్తిస్తుంది. అయినప్పటికీ యాకోబు సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అ వాగ్దానం నిమిత్తం ఆమె ప్రార్థనలను సాధనంగా వాడుకుని గర్భఫలం ఇస్తూవచ్చాడు.

ఆదికాండము 30:18
లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

ఈ వచనంలో లేయా తెలియకుండానే ఒక పొరపాటు ఆలోచన కలిగియున్నట్టు‌ మనం చూస్తాం. పతనమైన మానవజాతిలో ఇలాంటి పొరపాట్లతో నిండిన ఆలోచనలు బయటపడుతూనే ఉంటాయి కాబట్టి మనమంతా దేవుని వాక్యమనే కొలమానంతో మన ప్రవర్తననూ ఆలోచనలనూ సరిచూసుకోవాలి. ఎందుకంటే‌ దేవుడు లేయాపై కనికరపడి అప్పటికే ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చినప్పటికీ ఆమె కేవలం తన చెల్లెలితో పోటిపడి తన దాసిని యాకోబు వశం చేసింది, అలా చెయ్యమని దేవుడు ఆమెకు ఆజ్ఞాపించలేదు. ఆవిధంగా దేవుడు చెప్పని ఒక పనిని ఆమె జరిగించి, అందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని భావించడం, మనం చేసేపొరపాట్లకు కూడా దేవుడు బహుమతులిస్తాడని ప్రకటించడమే ఔతుంది.

ఆదికాండము 30:19-21
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.

ఈ వచనాలలో లేయా ఆరుగురు కుమారులనూ ఒక కుమార్తెనూ కన్నట్టుగా మనం చూస్తాం. చివరి కుమారుడిని కన్న సమయంలో కూడా ఆమె తన భర్త తనతో కాపురం చేస్తాడనే అనుకుంటుంది. కానీ ఆ భర్త తనతో కాపురం‌ చెయ్యబట్టే ఆమె పిల్లలను కనగలుగుతుంది. బహుశా ఆమె యాకోబు తనతో మాత్రమే కాపురం‌ చెయ్యాలని ఆశించి ఉండవచ్చు అదే నిజమైతే ఆ కోరిక న్యాయం‌ కాదు, ఎందుకంటే ఇప్పుడు యాకోబు జీవితం నలుగురితో కలసి సాగుతుంది.

ఆదికాండము 30:22
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.

ఈ వచనంలో రాహేలు అప్పటి ప్రజలు మూఢనమ్మకంతో తినే పండ్లను తినబట్టి కాదు కానీ ఆమె దేవునికి చేసిన ప్రార్థనను బట్టే ఆమె గర్భవతి అయినట్టు మనం చూస్తాం. కాబట్టి మనుషులకు మంచి అనేది కేవలం దేవుని మూలంగానే జరుగుతుంది‌ తప్ప, వారు ఆచరించే నమ్మకాలను బట్టి కాదు.

ఆదికాండము 30:23,24
అప్పుడామె గర్భవతియై కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

ఈ వచనంలో రాహేలు ఒక కుమారుడిని కని అతనికి యోసేపు అని పేరు పెట్టడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో క్రియలమూలమైన పాపాన్ని తనకు అంటనీయకుండా దేవునికి లోబడి జీవించిన భక్తుల్లో ఈ యోసేపు ఒకరు, ఇతని మూలంగానే దేవుడు యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి కరువు సమయంలో వారిని సంరక్షించాడు. ఈ యోసేపు చరిత్ర గురించి ముందటి అధ్యాయాలలో మనం వివరంగా చూద్దాం.

ఆదికాండము 30:25,26
రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను. నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము‌ అప్పుడు నేను వెళ్లెదను. వారి కోసము నీకు కొలువు చేసితిని నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళేందుకు లాబానుతో చర్చిస్తూ తాను చేసిన కొలువు గురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ సమయానికి యాకోబు లాబానుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం లేయా రాహేలుల నిమిత్తం కొలువు చెయ్యవలసిన 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇక్కడ యాకోబు దేవుడు తనకు వాగ్దానం చేసిన కనానుకు తిరిగివెళ్ళడానికి సిద్ధమౌతూ 14 సంవత్సరాలుగా అతను అలవాటు పడిన ప్రదేశాన్ని విడిచివెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరానికీ గురికావడం లేదు. అప్పటివరకూ అతనున్న ప్రదేశం అతనికి స్థిరమైన నివాసం కాదని, దేవుడు తనకు వాగ్దానం చేసిన కనానునే అతని స్థిరమైన స్వాస్థ్యమని అతను గ్రహించాడు. విశ్వాసులమైన మన విషయంలో కూడా ఈ భూమి మనకు స్థిరమైన నివాసం కాదని లేఖనం చెబుతుంది కాబట్టి, మనం ఎల్లప్పుడూ దీనిని విడిచివెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. యాకోబు ఎలాగైతే లాబాను ఇంటి దగ్గర తన పనిని ముగించి తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడో అలానే మనమంతా కూడా ఒకరోజున ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన పనిని ముగించుకుని ఆయన దగ్గరకు తిరిగివెళ్తాం (హెబ్రీ 13:14, కీర్తనలు 119:19, 1 దినవృత్తాంతములు 29:15) అందుకే "ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది" (1 కోరింథీ 7:31) అని ఆజ్ఞాపించబడుతున్నాం.

ఆదికాండము 30:27,28
అందుకు లాబాను అతనితోనీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

ఈ వచనాలలో యాకోబు తనను విడిచివెళ్ళడం ఇష్టం లేని లాబాను అతనిని ఎలాగైనా తనవద్దనే‌ ఉంచుకోవాలనే ఉద్దేశంతో సానుకూలంగా మాట్లాడుతూ జీతం గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. ఇప్పటివరకూ యాకోబు లాబానుకు ఎలాంటి జీతమూ లేకుండా కేవలం తన కుమార్తెలకోసమే కొలువు చేసాడు. అందుకే ఇక్కడ లాబాను ఇకపై నువ్వు నాకు ఉచితంగా ఏమీ కొలువు చెయ్యనవసరం లేదు, నీకు ఏం జీతం కావాలో అడుగు దానికే నాకు కొలువుచేద్దువని ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాటలన్నీ కేవలం అతను యాకోబును అక్కడినుంచి వెళ్ళకుందా చేసేందుకే. ఎందుకంటే ఇక్కడ లాబాను ఒప్పుకుంటున్నట్టుగా యాకోబును బట్టే దేవుడు అతడిని ఆశీర్వదించాడనేది వాస్తవం. ఈ విషయం‌ మనకు క్రిందివచనాలలో యాకోబు మాటల్లో కూడా స్పష్టమౌతుంది. యోసేపు విషయంలో కూడా దేవుడు ఇదే విధంగా ఐగుప్తీయుడైన పోతిఫరును ఆశీర్వదించాడు. ఇదంతా కేవలం తన భక్తులను గొప్ప చెయ్యడానికే (ఆదికాండము 39:5). అదేవిధంగా ఈ సందర్భంలో లాబాను తనకు కలిగిన ఆశీర్వాదానికి యాకోబే కారణమనే విషయం శకునం చూసి తెలుసుకున్నట్టుగా చెబుతున్నాడు. ఈ శకునాలు, మంత్రప్రయోగాలు అపవాది శక్తితో జరిగే కార్యాలు కాబట్టి ప్రజలు వాటిద్వారా కొన్ని విషయాలను గ్రహించగలుగుతారనేది వాస్తవం. కానీ అపవాది (దుష్ట) శక్తులను ఆశ్రయించడమనేది దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి ఆయన తన ధర్మశాస్త్రంలో వాటిని నిషేధించాడు (నిర్గమకాండము 22:18).

ఆదికాండము 30:29,30
అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను.నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను.నేను నా యింటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.

ఈ వచనాలలో లాబాను నీకేం జీతం కావాలో అడగమన్నపుడు యాకోబు అది అడగడానికి ముందుగా తన కష్టం గురించి, దేవుడు తనను బట్టి అతనికి కలిగించిన సమృద్ధి గురించీ వివరించడం మనం చూస్తాం. ఇక్కడ యాకోబు ఎలాంటి దురాశకూ పోకుండా కేవలం తన కష్టానికి తగిన ప్రతిఫలం కోసమే ఎదురుచూస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు ఇతరులనుండి తమ కష్టానికి తగిన ఫలాన్నే తప్ప దురాశాలను బట్టి ఏమీ ఆశించకూడదు.

ఆదికాండము 30:31-34
అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగి నందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైననుగల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును.మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.

ఈ వచనాలలో యాకోబు లాబాను ఒప్పందానికి సమ్మతిస్తూ ఇకపై జీతం నిమిత్తం‌ అతనికి కొలువుచెయ్యడానికి సిద్ధపడడం మనం చూస్తాం. అయితే ఇక్కడ యాకోబు నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా ఎలాంటి దురాశకూ పోకుండా మందలో తక్కువసంఖ్యలో ఉండే పొడలూ మచ్చలూ నల్లనివాటినే జీతంగా కోరుకుంటున్నాడు, సాధారణంగా అలాంటివి మందలో తక్కువ సంఖ్యలోనే ఉంటాయి, ఉదాహరణకు గొఱ్ఱెల్లో నల్లనివి చాలా అరుదుగా ఉంటాయి, యాకోబు వాటినే కోరుకున్నాడు. ఎందుకంటే అతను న్యాయబద్ధంగా తన కష్టానికి ప్రతిఫలం‌‌ మాత్రమే ఆశిస్తున్నాడు. అందుకే లాబాను నీకేం కావాలో అడుగు అన్నప్పుడు అతను "నీవు నాకేమియు ఇయ్యవద్దు" అంటూ తనకు కావలసినవాటిని తానే తీసుకుంటానంటున్నాడు.

ఆదికాండము 30:35,36
ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైననుగల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను.లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.

ఈ వచనాలలో లాబాను మరలా యాకోబును మోసం చేస్తున్నట్టు మనం చూస్తాం. అయితే ఇది ఒకసారి జరిగిన మోసం కాదు, లాబాను పదిసార్లు వరకూ ఇదేవిధంగా మోసం చేస్తూ వచ్చాడు (ఆదికాండము 31:7). ఇక్కడ యాకోబును క్రమశిక్షణ చేస్తున్న దేవుని సార్వభౌమత్వాన్ని కూడా మనం గమనిస్తాం. అతను తన అన్ననూ తండ్రినీ ఒకటి రెండుసార్లే మోసం చేస్తే అతను మాత్రం లేయా విషయంలో మాత్రమే కాకుండా మరోపదిసార్లు మోసపోయాడు. ఈ క్రమశిక్షణ యాకోబు జీవితంలో జరిగేందుకే కొలువు సంవత్సరాలు పూర్తియైన తరువాత అతను తన దేశానికి వెళ్ళాలనుకున్నప్పటికీ మరలా లాబాను మాటలకు సమ్మతించి జీతంకోసం అక్కడే కొలువు చెయ్యాలనుకున్నాడు. ఇదంతా కూడా మానవుని నిర్ణయాలకు పైగా ఉన్న దేవుని నిర్ణయాన్ని తెలియచేస్తుంది. యాకోబు జీవితంలో ఈ క్రమశిక్షణ ఇంతటితో పూర్తికాగానే తదుపరి వచనం నుండి అతనిపట్ల దేవుని మేలును మనం గమనిస్తాం. కాబట్టి మనం చేసిన అపరాధాలకు దేవుడు మనల్ని‌ క్రమశిక్షణ చేసినప్పటికీ అందులో మన మేలుకూడా దాగియుంటుందని గుర్తించాలి, అందుకే ఆయన క్రమశిక్షణకు లోబడాలి‌.

హెబ్రీయులకు 12:5-8 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.

ఆదికాండము 30:37-42
యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లనివాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతోనుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.

ఈ వచనాలకు ముందు వచనాలలో లాబాను మరలా యాకోబును మోసం చేస్తూ వచ్చినట్టు మనం చూసాం. ఆవిధంగా యాకోబు విషయంలో దేవుని క్రమశిక్షణ పూర్తికాగానే ఈ వచనాలనుండి ఆయన యాకోబుకు తోడై మేలుచేస్తున్నట్టు గమనిస్తాం. ఎలాగంటే ఈ వచనాలలో యాకోబు చినారు జంగి సాలు చెట్ల చువ్వలను మందలముందు పెట్టింది తనంతట తానుగా కాదు. ఇదంతా దేవుడు అతనికి స్వప్నంలో బోధించబట్టే అలా చేసాడు‌. ఈ విషయం మనం తదుపరి అధ్యాయంలో గమనిస్తాం (ఆదికాండము 31:10-13).

ఈవిధంగా యాకోబు తన జీతంగా ఎలాంటి పశువులనైతే తనకు జీతంగా కావాలని‌ కోరుకున్నాడో లాబాను ఏ పశువుల విషయంలోనైతే యాకోబును పదిసార్లు మోసగించాడో దేవుడు అవే పశువులను విస్తారంగా పుట్టించి యాకోబుకు న్యాయం చేసాడు. అతని కష్టానికి మించిన ప్రతిఫలాన్ని అందించాడు. ఇంతకూ యాకోబు "చినారు జంగి సాలు" చెట్ల చువ్వలను మందలముందు ఎందుకు పెట్టినట్టు? ఆ విషయాన్ని వివరంగా చూద్దాం. ఈ చెట్లను ఇంగ్లీష్ లో Green poplar, Hazel, Chestnut అని పిలుస్తారు. వాస్తవానికి యాకోబు ఆ చువ్వలకు తొక్కలు ఒలిచి ఆ మందలు ముందు పెట్టడం వల్ల ఆ మందలు మచ్చలుగల పిల్లల్ని ఈనలేదు కానీ కేవలం దేవుడు చేసిన అద్భుతం కారణంగానే అలా జరిగింది. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని అద్భుతాలను చేసేటప్పుడు అక్కడున్న మనుషులకు కూడా ఏదో ఒక పని చెయ్యమని చెప్పి వారిని (వాటిని) సాధనాలుగా వాడుకోవడం మనం గమనిస్తాం. ఉదాహరణకు ఈ సందర్భాలను చూడండి.

నిర్గమకాండము 15:22-25 మోషే ఎఱ్ఱ సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి.అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషే మీద సణగుకొనగా అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను.

ఈ సందర్భంలో దేవుడు మారా నీళ్ళను మధురంగా మార్చేటప్పుడు మోషేకు ఒక చెట్టును ఆ నీటిలో వేయమని ఆజ్ఞాపించడం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఆ చెట్టును‌ వేసినంత మాత్రాన ఆ నీళ్ళు మధురంగా మారలేదు, దేవుడు మారిస్తేనే మారాయి. అయినప్పటికీ ఆయన మోషేతో అలా చెయ్యమని చెప్పి ఆ చెట్టును (మోషే ‌చేసిన పనిని) సాధనంగా వాడుకున్నాడు.

2 రాజులు 2:19-22 అంతట ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగు చేసియున్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

ఈ సందర్భంలో ఏలీషా తన దగ్గరున్నవారిని ఉప్పు తెమ్మని చెప్పి ఆ ఉప్పును నీటి ఊటలో వేసినప్పుడు అ నీరు మంచిదిగా మారడం‌ మనకు కనిపిస్తుంది. ఆ నీరు ఉప్పు వెయ్యడం‌‌వల్ల మంచిదిగా మారలేదు కానీ దేవుడు మారిస్తేనే మారాయి. అయినప్పటికీ ఏలీషా చేసిన పనిని‌ ఆయన సాధనంగా వాడుకున్నాడు.

అదేవిధంగా, 2 రాజులు 6:6 సందర్భంలో కూడా ఏలీషా నీటిలో పడిన గొడ్డలిని పైకి తీసుకురావడానికి అక్కడున్నవారితో ఒక చెట్టుకొమ్మను నరికి ఆ నీటిలో పడవేయమనడం మనకు కనిపిస్తుంది. చెట్టుకొమ్మను నరికి నీటిలో పడవేయడానికీ గొడ్డలి నీటిపై తేలడానికీ ఏ సంబంధం లేనప్పటికీ ఆ అద్భుతంలో వారు చేసిన పనిని ఆయన సాధనంగా వాడుకున్నాడు. ఇవన్నీ అదృష్యుడైన దేవుని హస్తానికి దృష్యమైన సంకేతాలు. ఆయన చెప్పిన వస్తువులను ఉపయోగించి అద్భుతాన్ని చూడడం ద్వారా ఆయనే ఆ అద్భుతం చేసాడని వారి మనసుల్లో స్థిరపరచబడుతుంది.

యాకోబుకు కూడా ఆయన స్వప్నంలో మందల గురించి తెలియచేసినప్పుడు ఆ విధంగా వాటిముందు ఆ చెట్ల చువ్వలను పెట్టమని ఆజ్ఞాపించి ఉంటాడు, అందుకే యాకోబు ఆవిధంగా చేసాడు. కాబట్టి యాకోబు అలా ఆ చువ్వలను మందలముందు పెట్టడం‌వల్ల అవి పొడలు గలవి, మచ్చలు గలవి ఈనలేదుకానీ దేవుడు చేసిన అద్భుతం మేరకే ఆవిధంగా జరిగిందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను.

ఆదికాండము 30:43
ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

ఈ వచనంలో యాకోబు దేవుడు చేసిన అద్భుతం‌ మేరకు విస్తారంగా ఆశీర్వదించబడడం మనం చూస్తాం. ఒకవిధంగా యాకోబు యోసేపు పుట్టగానే అక్కడినుండి వెళ్ళిపోతానని తన మామతో సంభాషించినప్పుడు, అతను యాకోబును ఆటంకపరచకుండా పంపివేసియుంటే, లేక యాకోబు లాబాను మాటలకు సమ్మతించకుండా అక్కడినుండి కనానుకు వచ్చేసియుంటే ఇంత విస్తారమైన సంపద యాకోబుకు లభించేదికాదు. అదేవిధంగా లాబాను యాకోబును మచ్చలు, పొడలు గల గొర్రెమేకల విషయంలో పదిసార్లు మోసం చెయ్యకుండా వాటిని యాకోబుకు ఇచ్చేసి ఉన్నా కూడా అతనికి ఇంత సంపద దక్కేది కాదు. కాబట్టి దేవుని‌పిల్లల జీవితంలో ఎటువంటి ఆటంకం కలిగినా ఎలాంటి‌‌ మోసానికి గురైనా అది వారి విస్తారమైన మేలుకు ఉద్దేశించబడిన దేవునినిర్ణయమే అని‌ మనం గుర్తుంచుకోవాలి.

రోమీయులకు 8:28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

యోబు 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.

ఈవిధంగా దేవుడు యాకోబును తన అన్నదగ్గర నుండి పారిపోతున్నప్పుడు వాగ్దానం చేసినట్టే విస్తారంగా దీవించాడు (ఆదికాండము 28:15).

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.