పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

7:1, 7:2,3, 7:4, 7:5,6, 7:7, 7:8,9, 7:10,11, 7:12,13, 7:14-16, 7:17-20, 7:21-24

ఆదికాండము 7:1 యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.

ఈ వచనంలో దేవుడు నోవహును అతని ఇంటివారినీ ఓడలో ప్రవేశించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ "ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని" అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవునిముందు ఏ మానవుడూ నీతిమంతుడు కాలేడు. కాబట్టి ఈ మాటలను మనం
"లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను" (రోమా 4:3) అని పేర్కోబడిన అబ్రాహాము నీతితో పోల్చి అర్థం చేసుకోవాలి. అంటే అబ్రహాము ఎలాగైతే దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని విశ్వసించి (రోమా 4:18) నీతిమంతునిగా ఎంచబడ్డాడో నోవహు కూడా మొదట దేవుడు తనతో చెప్పిన మాటలను నమ్మి (విశ్వసించి) నీతిమంతునిగా ఎ‌ంచబడ్డాడు. అంటే ఇది విశ్వాసానికి సంబంధించిన నీతి. యోబు యథార్థవంతుడు అన్నప్పుడు కూడా మనం ఈవిధంగానే అర్థం చేసుకోవాలి. దీనంతటికీ కారణం మాత్రం కేవలం దేవుని కృపయే. ఆ కృపను బట్టే ఆయనపై వీరు విశ్వాసముంచారు. ఆ విశ్వాసానికి రుజువుగా నీతి క్రియలు చేసారు, యథార్థంగా జీవించారు. మన విషయంలో కూడా ఇంతే. ఆ కృపయే లేకుంటే వారైనా మనమైనా ఈ దుష్టలోకంలో దుష్టులుగానే జీవించి చివరికి నాశనమయ్యేవారం.

ఆదికాండము 7:2,3 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము.

ఈ వచనాలలో దేవుడు పవిత్ర జంతువులు, అపవిత్రజంతువులు అనే రెండురకాల జంతువుల గురించి నోవహుకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అయితే దేవుడు సమస్త జీవులనూ మంచిగానే (పవిత్రంగా) చేసినప్పుడు (ఆదికాండము 1:31) వాటిలో కొన్ని అపవిత్రజంతువులుగా ఎలా ఉన్నాయనే సందేహం ఇక్కడ కలుగుతుంది.

దీనికి సమాధానం: ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈ జీవరాశులన్నీ కూడా అపవిత్రంగా మారిపోయాయి (రోమా 8:19-21). అయితే దేవుడు మానవుల పాపానికి పరిహారంగా బలిని ప్రవేశపెట్టినప్పుడు (ఆదికాండము 3:21) ఆ బలికోసం ప్రత్యేకించబడే (దేవుడు ఏర్పరచిన) జంతువులు పవిత్రజంతువులుగా ఎంచబడ్డాయి. వాటి జాబితాలో ఆవులు, గొర్రెలు మేకలు, పక్షుల్లోనైతే పావురాలు, తెల్లగువ్వలు ఉన్నాయి (లేవీకాండము 1). మిగిలినవన్నీ అపవిత్రజంతువులే. అలానే ఇశ్రాయేలీయుల ఆహారం విషయంలో కూడా పవిత్ర అపవిత్రజీవుల విభజన జరిగింది ఆ వివరాలన్నీ మనం లేవీకాండము 11, ద్వితీయోపదేశకాండము 14 అధ్యాయాల్లో చదువుతాం. ప్రస్తుత సందర్భంలోనైతే బలికోసం ప్రత్యేకించబడిన జంతు, పక్షుల విషయంలోనే పవిత్రజీవులు అనీ మిగిలిన అన్నీ అపవిత్రజీవులే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భానికి ఇశ్రాయేలీయులూ ధర్మశాస్త్రమూ లేదు. అలానే‌ ఈమాటలను ఆహారం విషయంలో విభజన తెలిసిన మోషే కాదు దేవుడే పలుకుతున్నాడు.

ఆదికాండము 7:4 ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు నోవహుకు జలప్రళయం ఎన్ని రోజుల్లో రాబోతుందో తెలియచెయ్యడం మనం చూస్తాం. మొదట ఆయన జలప్రళయం గురించి హెచ్చరించి, ఓడను కట్టమన్నప్పుడు అది ఎంత సమయంలో వస్తుందో‌ అతనికి తెలియచెయ్యలేదు. ఇప్పుడైతే అది ఎన్ని రోజుల్లో రాబోతుందో స్పష్టంగా చెబుతున్నాడు. అప్పటికే నోవహు తన పని అంతటినీ పూర్తిచేసాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మానవులతో పాటు వారికోసం సృష్టించిన జీవరాశులను కూడా నాశనం చెయ్యబోతున్నాడు. సృష్టికర్తగా ఇది ఆయనకు న్యాయమే.

యిర్మీయా 45:4 నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను.

ఆదికాండము 7:5,6 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.

ఈ వచనంలో దేవుడు హెచ్చరించిన జలప్రళయం వచ్చేసరికి నోవహుకు 600 సంవత్సరాల వయస్సు అని రాయబడడం మనం చూస్తాం. ఇది సరిగ్గా మెతూషేల చనిపోయిన సంవత్సరం. ఎందుకంటే మెతూషేల అనేపేరుకు అతని మరణం తీసుకువస్తుంది అనే అర్థం వస్తుంది. ఈ మెతూషెల దేవునితో నడచిన హనోకు కుమారుడు‌. హనోకు ఈ జలప్రళయం గురించి ముందే ఎరిగినవాడై, అతని కుమారునికి అలాంటి పేరును పెట్టాడని బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు. ఆదికాండము 5:25 ప్రకారం; మెతూషెలకు లెమెకు జన్మించేసరికి 187 సంవత్సరాలు, ఆ క్రింది వచనాల ప్రకారం; లెమెకుకు నోవహు జన్మించేసరికి లెమెకుకు 182 సంవత్సరాలు. దీనిప్రకారం నోవహు పుట్టేసరికి మెతూషెల వయసు 187+182=369 సంవత్సరాలు. నోవహు యొక్క 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది అంటే అప్పటికి మెతుషెల వయసు 369+600=969 సంవత్సరాలు.

ఆదికాండము 5:27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు, "అప్పుడతడు మృతిబొందెను".

కాబట్టి సరిగ్గా మెతూషెల చనిపోయిన సంవత్సరంలో జలప్రళయం సంభవించింది.

ఆదికాండము 7:7 అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.

ఈ వచనంలో దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే నోవహు మరియు అతని కుటుంబం ఓడలో ప్రవేశించడం‌ మనం చూస్తాం. ఇక్కడ నోవహు మాత్రమే కాదు అతని కుటుంబం కూడా దేవునిపట్ల విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్టు మనకు అర్థమౌతుంది. ఇక్కడ వారికి కూడా ఆ విశ్వాసం దేవునివలనే కలిగిందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నోవహుతో చేసిన నిబంధన ప్రకారం (ఆదికాండము 6:18) అతని కుటుంబం ఈ భూమిపై విస్తరించాలంటే వారందరూ ఆయనను విశ్వసించి ఓడలో ప్రవేశించాలి. 

అదేవిధంగా దేవుని మాటను విశ్వసించే వారికి లోకానికి రాబోయే తీర్పుగురించి ఎలాంటి కలవరమూ ఉండదని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది (యెషయా 28:16). అందుకే నోవహు కుటుంబం ఎలాంటి కలవరమూ లేకుండా ఓడలో ప్రవేశించగలిగారు. మనం కూడా లోకానికి రోబోయే తీర్పు గురించి కలవరపడకుండా ఆయన రాకడకోసం ఎదురుచూస్తున్నాం.

ఆదికాండము 7:8,9 దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.

ఈ వచనాలలో దేవుడు చెప్పినట్టుగానే జతలు జతలుగా జంతువులూ పక్షులూ ఓడలోని నోవహు యొద్దకు చేరుకోవడం మనం చూస్తాం. ఇలాంటి అద్భుతమైన సంఘటన జరుగుతున్నప్పటికీ అప్పటి ప్రజల్లో మార్పులేదు, కారణమేంటో గత అధ్యాయంలో వివరించాను. అలానే ఓడలోకి చేరిన ఆ జీవులన్నీ అందులో ఉన్నంతకాలం సాధు జంతువులుగానే జీవిస్తూ నోవహు సేకరించిన ఆహారాన్నే తిన్నాయి, వాటిలో ఏ జీవి కూడా మరో జీవిని చంపి తినకుండా దేవుడు వాటికి సాధు స్వభావాన్ని అనుగ్రహించాడు.

ఎందుకంటే నోవహు ఓడలోకి వెళ్ళిన పవిత్ర, అపవిత్ర జంతువులన్నీ లెక్క ప్రకారంగా వెళ్ళాయి, వాటిలో క్రూరజంతువులు వేరే జీవుల్ని చంపి తినే స్వభావంతోనే ఉండుంటే ఆ ఓడలో కేవలం అవి మాత్రమే మిగిలేవి, మిగిలిన జీవులతో పాటు నోవహు కుటుంబం కూడా వాటికి ఆహారమైపోయేది. ఇదంతా దేవుడు చేసిన అద్భుతం. అద్భుతాలు‌ విశ్వసించనివారికి ఇది ఎగతాళిగా అనిపించవచ్చు కానీ దేవుడు ఉన్నాడని విశ్వసించినవారికి ఇక్కడ ఏ సమస్యా లేదు. దీనిని ఎగతాళి చెయ్యాలంటే ముందు దేవుడు లేడని రుజువు చెయ్యాలి. తర్కపరంగా సృష్టిలోని రుజువుల పరంగా అది ఏ నాస్తికుడికీ సాధ్యం కాదు. అలా ప్రయత్నించిన ఎందరో కాలగర్భంలో కలసిపోయారు.

గమనించండి; క్రూరజంతువులకు కూడా ఆయన సాధుస్వభావం అనుగ్రహించగలడు. అలానే తనయొద్దకు వచ్చిన క్రూరులను కూడా దయగలిగినవారిగా చెయ్యగలడు. సంఘ చరిత్రలో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నెన్నో మనం చూడవచ్చు. చివరికి నరమాంసభక్షకులు కూడా ఆయన కృపను బట్టి మార్పుచెందారు. ఎందుకంటే ఆయనయొద్దకు వచ్చేవారికి "నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను" (యెహేజ్కేలు 36:26) అనేది ఆయన వాగ్దానంగా ఉంది.

ఆదికాండము 7:10,11 ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.

ఈ వచనాలలో దేవుడు చెప్పిన నిర్థిష్ట సమయంలో జలప్రళయం‌ సంభవించడం మనం చూస్తాం. అయితే ఇది సాధారణమైన వర్షం ఎక్కువరోజులు కురవడం వల్ల వచ్చింది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆకాశం నుండి ప్రచండవర్షంతో పాటుగా భూమి క్రిందనుండి కూడా మహాగాధ జలాల‌ ఊటలు విడవబడినట్టు రాయబడింది.

ఆదికాండము 7:12,13 నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

ఈ వచనాలలో నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించిన దినమందే ప్రచండ వర్షం కురవడం ప్రారంభమైనట్టు మనం చూస్తాం. నోవహు కుటుంబం, జలప్రళయం నుండి పొందుకున్న ఈ రక్షణను నూతననిబంధన మన ఆత్మీయ రక్షణకు ఛాయగా వర్ణిస్తుంది (1 పేతురు 3:20,21).

అయితే ఆ సందర్భంలో ప్రస్తావించబడిన బాప్తీస్మం రక్షించబడిన వ్యక్తియొక్క బహిరంగ ఒప్పుకోలునే (రక్షణకు సాదృశ్యమే) తప్ప, బాప్తీస్మం వల్ల ఎవరికీ రక్షణరాదు. మనం కృపచేతనే రక్షించబడ్డాం (ఎఫెసీ 2:8). అక్కడ పేతురు కూడా దానికి సాదృశ్యమైన బాప్తీస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తుందనే మాటలు, నీటి‌ బాప్తీస్మం వల్ల మనం రక్షించబడతామనే భావంలో చెప్పలేదు. మనలో కలిగే అ‌ంతరంగిక రక్షణానుభవానికి ఆ బాప్తీస్మం సాదృశ్యంగా ఉంటుందనే భావంలోనే ఆ మాటలు చెబుతున్నాడు.‌ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అతను ప్రస్తావించిన నోవహు కుటుంబం నీటిలో రక్షించబడలేదు, ఓడలోనే రక్షించబడ్డారు. కానీ ఆ నీరు వారి రక్షణకు గుర్తుగా ఉంది. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.

బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుందా?

మరికొంతమంది, రక్షణ దేవుని‌ కృపమూలంగానే కలుగుతుంది కాబట్టి, ఇక అందులో మన పనేమీ ఉందదని భావిస్తుంటారు. కానీ నోవహు అతని కుటుంబం దేవుని కృపచేతనే రక్షించబడినప్పటికీ వారు పనిచేసారు, ఓడలో కూడా పనిచేస్తూనే ఉన్నారు. అన్ని జంతువులకు మేత వెయ్యడం ఆ ప్రదేశాన్ని శుభ్రం చెయ్యడమంటే ఇవన్నీ వారికి చాలా కష్టతరమైన పనులు. రక్షణలో మనిషి కూడా కష్టపడాలని (దేవుని ఆజ్ఞలను పాటించాలని) ఈ సంఘటన మనకు తెలియచేస్తుంది. రక్షణ 100% దేవుని కృపవల్ల మాత్రమే సాధ్యమౌతుంది అందులో మానవుడి ప్రమేయం ఎంతమాత్రమూ లేదు. కానీ ఆ రక్షించబడిన వ్యక్తి మాత్రం తప్పకుండా పనిచెయ్యాలి, ఇది రక్షణలో అతని భాగం.

ఆదికాండము 7:14-16 వీరే కాదు; ఆ యా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆ యా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.

ఈ వచనాలలో దేవుడు తెలియచేసినట్టుగా జీవాత్మ అనగా ఊపిరి తీసుకునే జీవులన్నీ ఓడలో ప్రవేశించినట్టు, ఆయన నోవహు కుటుంబంతో పాటు వాటన్నిటినీ ఆ ఓడలో మూసివేసినట్టు మనం చూస్తాం. ఇక దేవుని అనుమతి లేనిదే నోవహు కూడా ఆ ఓడ తలుపును తెరవలేడు.

ఆదికాండము 7:17-20 ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీద నుండి పైకి లేచెను. జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.

ఈ వచనాలలో జలప్రళయం సంభవించి భూమిపై పర్వతాలతో సహా అన్నీ మునిగిపోయినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ తెలుగు బైబిల్ లో "పదిహేను మూరల ఎత్తున" నీళ్ళు ప్రబలెను అని తర్జుమా చెయ్యబడింది‌ కానీ, వాస్తవానికి పర్వతాలకు పైగా పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రబలెను అనేది సరైన తర్జుమా.

Genesis 7:19,20 And the waters prevailed exceedingly upon the earth; and all the high hills, that were under the whole heaven, were covered. Fifteen cubits upward did the waters prevail; and the mountains were covered.

అదేవిధంగా ఈ జలప్రళయం వాస్తవంగా జరిగింది‌‌ అనేందుకు, శాస్త్రీయ రుజువులెన్నో మనముందు ఉన్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలో పర్వతాలపైన, భూమిపొరలలోన చనిపోయిన జీవుల అవశేషాలు లభ్యమయ్యాయి. అవన్నీ పర్వతాలమీదకు కొట్టుకు వచ్చి ఏకకాలంలో చనిపోయినవే. దీనిగురించి వివరంగా ఈ ఆధారాలు పరిశీలించండి.

https://www.gotquestions.org/Genesis-flood-proven.html

https://answersingenesis.org/kids/geology/evidence-flood/

కొన్నిమత గ్రంథాలలో కూడా ఈ జలప్రళయం గురించి ప్రస్తావించబడింది. ఎందుకంటే ఈ జలప్రళయంలో రక్షించబడిన నోవహు కుటుంబం ద్వారానే ఈ భూమిపై‌ ప్రజలు విస్తరించారు కాబట్టి బాబేలు గోపురం దగ్గర వారు చెదరిపోయినప్పుడు (ఆదికాండము 11:8) వారు కల్పించుకున్న మతాలలో దాని గురించి రాసుకున్నారు. భూమియంతటా జలప్రళయం సంభవించింది అనేందుకు అవి కూడా ఒక ఆధారం.

ఇక్కడ మనం గుర్తించవలసిన మరోప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జలప్రళయంలో ఏ నీళ్ళైతే అప్పటి ప్రజలనూ జీవరాశులనూ చంపివేసాయో అవే నీళ్ళు నోవహు, అతని కుటుంబం ఉన్న‌ ఓడను పైకి‌ తేలజేసి వారిని రక్షించాయి. ప్రస్తుతం క్రీస్తు సువార్త కూడా విశ్వాసులను నోవహు కుటుంబంలా రక్షించేదిగానూ అవిశ్వాసులను నాశనం చేసేదిగానూ ప్రకటించబడుతుంది. ఎందుకే పౌలు "రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము." (1 కొరింథీ 2:15,16) అని అంటున్నాడు.

ఆదికాండము 7:21-24 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను. నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

ఈ వచనాలలో దేవుడు చెయ్యదలచినట్టే జలప్రళయం ద్వారా అందరినీ అన్నిటినీ నాశనం చేసినట్టు మనం చూస్తాం. ఈ నశించిపోయినవారి విషయంలో మనం గ్రహించవలసిన మరో పాఠం ఏంటంటే; అంతపెద్ద ఓడను నోవహూ అతని కుటుంబం మాత్రమే నిర్మించియుండరు, దానికి తప్పకుండా అప్పటి ప్రజలు కూడా కొందరు పనిచేసే ఉంటారు. అయితే వారిలో ఎవ్వరూ ఆ ఓడలో ప్రవేశించలేకపోయారు. ఈరోజు కూడా దేవుని సంఘాన్ని‌ నిర్మించడానికి, ఎంతోమంది పరిచారకులుగా సహకారులుగా (క్రైస్తవేతరులతో సహా) పనిచేస్తుండవచ్చు, వారు చేస్తున్న పని నోవహు ఓడలా విజయవంతంగా పూర్తిచేయబడుతుండవచ్చు. కానీ వారు నోవహులా కృప పొందినవారు కాకుంటే అతనికున్న విశ్వాసం‌, దానికి ఫలమైన నిందారహితమైన జీవితం వారిలో లేకుంటే వారు నశించే పోతారు. కాబట్టి ఓడకోసం పనిచేసామా లేదా అన్నదే కాదు ఓడలో ఉన్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలి. క్రీస్తు కోసం ప్రయాసపడ్డామా లేదా అనేదే కాదు క్రీస్తులో ఉన్నామా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు తన పిల్లలకోసం కష్టపడే పనిని పాపాత్ములకు కూడా నిర్ణయిస్తుంటాడు (ప్రసంగి 2:26)

అదేవిధంగా నోవహు ఓడను కడుతున్నప్పుడు నమ్మని ప్రజలూ ఎగతాళి చేసిన మూర్ఖులూ ఆ ప్రళయం ప్రారంభమై తీవ్రరూపం దాల్చినప్పుడూ తప్పించుకోవడానికి ఎక్కిన ప్రతీ ఎత్తైన ప్రదేశం‌ మునిగిపోతున్నప్పుడూ ఓడను చేరుకుని తలుపులు కొట్టియుంటారు, నోవహును ప్రాధేయపడి‌ ఉంటారు. కానీ అప్పుడు నోవహు కూడా ఏమీ చెయ్యలేడు‌ ఎందుకంటే ఆ తలుపులను దేవుడే మూసివేసాడు. ఆ కారణం చేత నోవహు వారికి సమయం‌ మించిపోయిందనే బదులు‌ ఇచ్చుంటాడు. కాబట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆయనదగ్గరకు వచ్చే ప్రయత్నం చెయ్యాలి. అందుకే "యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి" (యెషయా 55:6) అని హెచ్చరించబడింది.

ఒకవేళ ఆ ప్రజలు నోవహు తలుపు తియ్యకుండేసరికి, ఓడపైకి ఎక్కైనా తమను తాము కాపాడుకుందాం అనుకుంటే ప్రచండంగా కురుస్తున్న వర్షానికీ మరియు అలలకు అటూ ఇటూ ఊగుతున్న ఓడపై ఎక్కడం వారికి సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా 40 రోజుల ప్రచండ వర్షంలో తడుస్తూ ఆహారం లేకుండా బ్రతకడం సాధ్యపడదు. దేవుడు కలుగచేసే కీడు ఈవిధంగానే భయానకంగా ఉంటుంది. దానినుండి ఎంతో శక్తియుక్తులు కలిగినవారు కూడా తప్పించుకోలేరు.

యెషయా 31: 3 యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

చివరిగా; వీరు ఎలాగైతే ఒకవైపు నోవహు‌ ఓడను కట్టడం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ మరోవైపు దేవుడే ఆత్మరూపిగా ప్రకటిస్తున్నప్పటికీ (అనగా మనసాక్షి ద్వారా) మార్పులేని కఠినస్థులుగా ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో కూడా అలానే ఉంటారని రాయబడింది (లూకా 17:26,27).

కాబట్టి విశ్వాసులైనవారు ఈ లోకంలో దేవునిపట్ల పెరుగుతున్న అవిధేయతకు చింతించకుండా అగ్నిలోనుండి లాగినట్టు కొందరినైనా రక్షించడానికి ప్రయాసపడాలి. ఈ క్రమంలో నోవహులా ఆటంకాలను, అవమానాలను‌ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మరో విషయం; ఇక్కడ నోవహుకు కేవలం బయటవ్యక్తుల నుండే ఆటంకాలు, అవమానాలు సంభవించియుండవచ్చు. కుటుంబపరంగా అతనికి ఎలాంటి ఇబ్బందీ లేదు వారందరూ నోవహుకు సహకరిస్తూ అతనితో కలసి‌ పనిచేసారు. కానీ మన విషయంలో‌ "సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షింబడును" (మత్తయి 10:21,22) అని ప్రభువు ముందే హెచ్చరించినట్టు కుటుంబం నుండి కూడా ఆటంకాలు అవమానాలు ఎదురవ్వవచ్చు. ఆ పరిస్థితి మన మనసులను మరింతగా కృంగదీయవచ్చు. అయితే "అంతమువరకును సహించిన వాడు రక్షింబడును" అనే మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుపై ఉన్న‌ ప్రేమతో వాటన్నిటినీ మనం జయించగలగాలి. ఈ విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నివిధాలుగా భరించిన శ్రమలు మనకు ఎంతో ఓదార్పుగా ఉన్నాయి.

హెబ్రీయులకు 12:3,4 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.

2 తిమోతికి 2:11,12 మనమాయనతో కూడ చనిపోయినవారమైతే ఆయనతో కూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.