పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

45:1, 45:2, 45:3,4, 45:5, 45:6,7, 45:8, 45:9-11, 45:12, 45:13,14, 45:15, 45:16, 45:17-20, 45:21, 45:22, 45:23,24, 45:25,26, 45:27, 45:28

ఆదికాండము 45:1
అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక నాయొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతనియొద్ద నిలిచియుండలేదు.

గత అధ్యాయంలో బెన్యామీను నిమిత్తం యూదా యోసేపును బ్రతిమిలాడుతూ తన తండ్రి గురించి వేడుకోవడం మనం‌ చూస్తాం. యూదా అక్కడ పలికిన మాటలను బట్టి యోసేపు తన సహోదరులంతా మార్పుచెందారని భావించి ఈ సందర్భంలో వారికి తాను ఎవరో తెలియచెయ్యాలి అనుకుంటున్నాడు.‌ ఆ సమయంలో వారు యోసేపును గతంలో అమ్మివేసారని తన ఇంటివారికి తెలిస్తే వారు యోసేపు సహోదరులను అవమానంగా చూసే అవకాశం ఉంది కాబట్టి యోసేపు ముందుగా తన ఇంటిలోని వారందరికీ బయటకు పంపించాడు. మనం కూడా ప్రతీసారీ మనవారి లోపాలను అందరిముందూ బహిర్గతం చెయ్యకుండా (కఠినమైన విషయాలలో తప్ప) కాస్త జాగ్రత్తలు పాటించాలి.

అదేవిధంగా ఇక్కడ క్రైస్తవ ప్రేమ క్షమాపణలకు అసలైన నిర్వచనం కనిపిస్తుంది. సాధారణంగా క్రైస్తవ ప్రేమ క్షమాపణ అనగానే అవతలివాళ్ళు ఎంత కఠినంగా ఉన్నా సరే క్షమించి ప్రేమించెయ్యడం అనే బోధలు మనకు వినిపిస్తుంటాయి. కానీ అలా చెయ్యడం వారిని మరింత కఠినంగా మార్చడమే ఔతుంది. ఎందుకంటే వారు దానిని అవకాశంగా తీసుకుంటూ మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే తప్పు చేసినవాళ్ళను మనం మార్పు చెందేలా గద్దించాలి, హెచ్చరించాలి. వారు తమ తప్పేంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే క్షమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు క్రైస్తవ ప్రేమ క్షమాపణలకు ఇచ్చిన నిర్వచనం ఇదే (మత్తయి 18:15). యోసేపు దానినే అనుసరిస్తూ తన అన్నల విషయంలో ఇంతవరకూ కఠినంగా ప్రవర్తించాడు. వారు మార్పు చెందారని తెలిసాక వారిపై తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు‌. అలాగని తమ తప్పుల విషయంలో మార్పు చెందనివారిపై ద్వేషం కలిగియుండాలని నేను చెప్పట్లేదు. బైబిల్ అలా బోధించడం లేదు. మన క్షమాపణ మాత్రం అవతలివారు తమ తప్పేంటో తెలుసుకున్నప్పుడే చూపించాలని చెబుతున్నాను. లేదంటే వారిని వెలి వెయ్యడమే "అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము" (మత్తయి 18:17). ప్రేమకు రూపమైన దేవుడు కూడా తమ పాపాలను నిజాయితీగా ఒప్పుకున్నవారికి మాత్రమే క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన వైఖరికి విరుద్ధమైన ప్రేమ క్షమాపణలు ఆయన ఆజ్ఞాపించినవి‌ కావు. అవి కేవలం మూఢభక్తినుండి పుట్టినవి మాత్రమే.

ఆదికాండము 45:2
అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.

ఈ వచనంలో యోసేపు తన సహోదరులను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూస్తాం. అతను ఫరో ఇంటికి సమీపంలోని ఇంట్లోనే నివసిస్తున్నాడు కాబట్టి అతని ఏడుపు ఫరో ఇంటివారందరూ విన్నారు.

ఆదికాండము 45:3,4
అప్పుడు యోసేపు నేను యోసేపును. నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతట యోసేపునా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపునను నేనే.

ఈ వచనాలలో యోసేపు తాను ఎవరో తన సహోదరులకు కనపరచుకున్నప్పుడు వారు తొందరపడినట్టు మనం చూస్తాం. అందుకే యోసేపు తానే వారి సహోదరుడను అనేందుకు రుజువుగా మీరు గతంలో నన్ను అమ్మివేసారని వారి మధ్య జరిగిన చరిత్రను వివరిస్తున్నాడు.

ఆదికాండమ 45:5
అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

ఈ వచనంలో యోసేపు తాను ఐగుప్తుకు అమ్మివేయబడడం దేవుని నిర్ణయమే అని తన సహోదరులకు తెలియచేస్తూ వారు చేసిన ఆ తప్పిదం విషయంలో వారిని క్షమిస్తున్నాడు.

కీర్తనలు 105:17-19 వారికంటె ముందుగా ఆయనయొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.

వాస్తవానికి యోసేపు విషయంలో తన అన్నలు చేసినదంతా దేవుని సార్వభౌమత్వాన్నే నెరవేర్చినప్పటికీ వారు దానిని జరిగించడం వెనుక వారికి యోసేపుపై‌ పగతీర్చుకోవాలనే ఉద్దేశమే ఉంది కాబట్టి అందులో వారు దోషులే (ఆదికాండము 3:1 వ్యాఖ్యానం చూడండి) అయినప్పటికీ వారు ప్రస్తుతం దానివిషయంలో పశ్చాత్తాపపడ్డారు కాబట్టి, తాము చేసిన దుష్క్రియకు తగిన బాధను కూడా అనుభవించారు కాబట్టి యోసేపు వారికి ఆ దోషం గురించి మరలా జ్ఞాపకం చెయ్యకుండా వారికి కేవలం దానివెనుక ఉన్న దేవుని సార్వభౌమత్వాన్నే తెలియచేస్తూ వారి మనసులో కలిగినబాధను బట్టి ఓదారుస్తున్నాడు.

పైన వివరించినట్టుగా నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది క్షమించడం అనేదానిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించలేక క్షమించడం అంటే అవతలివారు అదే తప్పు చేస్తూ ఉన్నప్పటికీ మౌనంగా సహించడమని అనుకుంటున్నారు. కానీ విశ్వాసులు తప్పకుండా తప్పుచేసినవారిని మొదట యోసేపులా గద్దించి వారికి తమ తప్పును తెలియచెయ్యాలి. వారు ఆ విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు క్షమించి వారిని దగ్గరకు తీసుకోవాలి.

లూకా 17: 3 నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.

గద్దించడం, క్షమించడం ఈ రెండింటిలో దేనినీ మనం తృణీకరించకూడదు.

ఆదికాండము 45:6,7
రెండు సంవత్సరములనుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

ఈ వచనాలలో యోసేపు తన సహోదరులతో ఇప్పటికి కరవు సంవత్సరాలు రెండు గడచిపోయి ఇలాంటివి మరో ఐదు సంవత్సరాలు వస్తాయి కాబట్టి, మిమ్మల్ని కాపాడడానికే దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపాడని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు కుటుంబాన్ని ఆ కరవునుండి కాపాడేందుకే దేవుడు ఐగుప్తులో ముందుగా సమృద్ధిగా పంటలు పండించాడు. దానివల్ల ఐగుప్తీయులకూ మరియు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని దేశాలకు కూడా మేలు జరిగింది. ఈవిధంగా దేవుడు తన పిల్లల మేలుకోసం నిర్ణయించిన దానివల్ల కొన్నిసార్లు అన్యులు కూడా మేలు పొందుకుంటారు.

ఉదాహరణకు, దేవుడు తన నిర్ణయంలోని వారిని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు సువార్తను వెలుగులోకి తీసుకువచ్చాడు. దానివల్ల ఆ నిర్ణయంలో ఉన్నవారు నిత్యజీవానికి నడిపించబడుతుంటే మిగిలిన కొందరు ప్రజలు కూడా సువార్త నైతిక విలువలను బట్టి మేలు పొందుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో మూఢాచారాలు, బానిసవ్యవస్థలు రూపుమాసిపోయాయంటే దానికి కారణం సువార్త నైతిక విలువలే.

ఆదికాండము 45:8
కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను.

ఈ వచనంలో యోసేపు ఐగుప్తులో‌ తన స్థాయి గురించి మరోసారి తన సహోదరులకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఫరో కూడా యోసేపును బట్టే ఆ దేశంలో ఆహారం‌ కలిగి సంరక్షించబడుతున్నాడు కాబట్టి, యోసేపు తనను తాను ఫరోకు తండ్రిగా వర్ణించుకుంటున్నాడు.

ఆదికాండము 45:9-11
మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపుదేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటివారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.

ఈ వచనాలలో యోసేపు తన సహోదరులతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తన గురించి చెప్పి‌ ఐగుప్తుకు తీసుకురమ్మనడం మనం చూస్తాం. దీనివల్ల ఒకప్పుడు నీ కుమారుడిని దుష్టమృగం తినివేసిందని యాకోబుతో అబద్ధం‌ చెప్పినవీరు అతనిని మేమే ఐగుప్తుకు అమ్మివేసామని కానీ ఇప్పుడు అతను కలలో చెప్పినట్టుగా ఐగుప్తును పాలిస్తున్నాడని తమ తప్పును ఒప్పుకుంటారు. కాబట్టి యోసేపు వారి తప్పును తమ తండ్రి దగ్గరకూడా ఒప్పుకునేలా చేసేందుకు కూడా వారిని తమ తండ్రిదగ్గరకు పంపిస్తున్నాడు. చేసిన తప్పులను సరిచెయ్యడంలో ఇది మంచి మాదిరి. అదేవిధంగా ఇక్కడ గోషెను దేశం గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఇది ఐగుప్తులోని శ్రేష్టమైన ప్రాంతం. ఇశ్రాయేలీయులను మోషే ఐగుప్తునుండి విడిపించేవరకూ వారు ఈ ప్రాంతంలోనే నివసించారు. దీనినే రామసేసు అని కూడా పిలిచేవారు (ఆదికాండము 47:11).

ఆదికాండము 45:12
ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.

ఈ వచనంలోని మాటలకు అర్థం ఏంటంటే ఇంతముముందు వరకూ యోసేపు తన సహోదరులతో అనువాదకుడి ద్వారా ఐగుప్తు బాషలో సంభాషించాడు కానీ ఇప్పుడు వారి స్వంత బాషలోనే మాట్లాడడం వారి కళ్ళు చూస్తున్నాయి. దీనివల్ల వారు అతను తమ తమ్ముడు కాబట్టే తమ స్వభాషలో మాట్లాడుతున్నాడని మరింత నిశ్చయానికి వస్తారు.

ఆదికాండము 45:13,14
ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి యేడ్చెను. బెన్యామీను అతని మెడ మీదపడి యేడ్చెను.

ఈ వచనాలలో యోసేపు తమ తండ్రికి వారు తెలియచెయ్యవలసింది వివరించి, ఆ తర్వాత తన తల్లి కుమారుడైన బెన్యామీను పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడం మనం చూస్తాం.

ఆదికాండము 45:15
అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడియేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.

ఈ వచనంలో యోసేపూ అతని‌ సహోదరులు సమాధానపడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు మనం చూస్తాం.

ఆదికాండము 45:16
యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.

ఈ వచనంలో యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చారనే‌ సంగతి ఫరోకు తెలిసినప్పుడు అది ఫరోకూ తన సేవకులకు ఇష్టంగా ఉన్నట్టు మనం చూస్తాం. యోసేపుకూ ఐగుప్తీయులకూ మధ్య మతపరమైన బేధాలు ఉన్నప్పటికీ యోసేపులోని నైతికవిలువలతో కూడిన ప్రవర్తన వల్ల వారికి అతనిపై ఎప్పుడూ విముఖత కలుగలేదు. అందుకే వారు యోసేపు కల భావం చెప్పినప్పటినుండీ చివరివరకూ అతనిపై అభిమానంతోనే మసలుకున్నారు. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసుల మధ్య జీవిస్తున్నప్పటికీ తమ నైతికవిలువలతో కూడిన ప్రవర్తన వల్ల వారిని తమవైపు త్రిప్పుకోవచ్చు. గతంలో అబ్రాహాము కూడా కనానీయుల మధ్య మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ వారిచేత నీవు మా మధ్య మహారాజువైయున్నావని ప్రశంసించబడడం మనం చూసాం (ఆదికాండము 23:5).

ఆదికాండము 45:17-20
అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా-

ఈ వచనాలలో ఫరో యోసేపుకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతో అతని కుటుంబాన్ని‌ ఐగుప్తుకు రప్పించి వారిని ఉన్నతంగా పోషించడానికి సంతోషంగా ఒప్పుకోవడం మనం చూస్తాం. అక్కడ ఫరో యోసేపు కుటుంబానికి చేస్తున్నదేదీ ఉచితంగా రుణంగా చెయ్యడం లేదు. అతను కేవలం యోసేపు రుణాన్ని ఆ విధంగానైనా తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఐగుప్తు పతనం కాకుండా సమృద్ధిగా నిలచియుందంటే దానికి కారణం యోసేపునే. అదేవిధంగా ఇక్కడ ఫరోలో ఉన్న మంచి లక్షణాన్ని కూడా మనం మాదిరిగా తీసుకోవచ్చు అతడు అన్యుడైనప్పటికీ యోసేపు రుణాన్ని తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం మరి ఎక్కువగా మనం ఎవరికి రుణపడ్డామో వారికి ప్రత్యుపకారం చెయ్యడానికి ఆసక్తి చూపించాలి.

ఆదికాండము 45:21
ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.

ఈ వచనంలో యోసేపు ఫరోమాటను బట్టి యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకునిరావడానికి బండ్లనూ ఆహారాన్ని ఇప్పించడం మనం చూస్తాం. ఐగుప్తునుండి కనానుకు వెళ్ళడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. మరలా అక్కడినుండి‌ కనానుకు రావడానికి కూడా యాకోబు కుటుంబానికి అంతే సమయం పడుతుంది. ఆ మధ్యసమయంలో వారు తినడానికి కావలసిన ఆహారాన్నే యోసేపు వారిచేత ఇక్కడ పంపిస్తున్నాడు.

అదేవిధంగా ఇక్కడ యోసేపులోని యథార్థప్రవర్తన మనకు మరోసారి కనిపిస్తుంది. అతనికున్న అధికారంతో యోసేపు ఐగుప్తులో ఏమైనా చెయ్యగలడు కానీ అలా తనంతట తానుగా ఇక్కడ ఏమీ చెయ్యకుండా తన కుటుంబానికి కావలసిన వాటిని ఫరో సెలవుతోనే కనానులోని తన తండ్రి దగ్గరకు పంపిస్తున్నాడు. అతని మాట ప్రకారమే తన కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పిస్తున్నాడు. ఎందుకంటే అతను సింహాసనం‌ విషయంలో తనకంటే ఎక్కువైన ఫరోకు లోబడుతున్నాడు. విశ్వాసులు కూడా తమ కంటే ఎక్కువ అధికారం‌ కలిగినవారికి‌ లోబడి తమ కార్యాలు జరిగించాలి.

ఆదికాండము 45:22
అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను.

ఈ వచనంలో యోసేపు తన సహోదరులకు వస్త్రాలను బహుకరిస్తూ తన తల్లి కుమారుడికి వారికంటే ఎక్కువే ఇవ్వడం మనం చూస్తాం. ఇది మానవ సహజ‌ ప్రేమను మనకు తెలియచేస్తుంది. తన తల్లి కుమారులు కానివారి విషయంలోనే యోసేపు కనికరం చూపించి వారి‌ తప్పును క్షమించి ఇదంతా చేస్తున్నప్పుడు తన స్వంత తమ్ముడికి మరి ఎక్కువగా చెయ్యడంలో ఎలాంటి పక్షపాతమూ లేదు. పైగా తన సహోదరులు అప్పటికే మార్పు చెందారు కాబట్టి దానిని అర్థం చేసుకుంటారని అతను భావించాడు.

ఆదికాండము 45:23,24
అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తిను బండములను మెయుచున్న పది ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగామార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను.

ఈ వచనాలలో యోసేపు ఫరోమాట చొప్పున వారికి కావలసినవాటిని ఇస్తూ మార్గంలో కలహపడవద్దని చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు యోసేపు ఎవరో వారికి తెలిసిపోయింది, యోసేపులోని క్షమాగుణం కూడా వారికి తెలిసింది. దీనివల్ల వారు అతడిని హింసించి ఐగుప్తుకు అమ్మివేసిన సంఘటన గురించి ఒకరిని ఒకరు నిందించుకుంటారేమో అనే అతడు ఆ విధంగా వారికి చెబుతున్నాడు. ఎందుకంటే యోసేపు అప్పటికే వారిని క్షమించాడు‌ కాబట్టి ఆ విషయంలో ఎవరి పాత్ర ఎంతవరకూ ఉందో మరలా వాదించుకుని నిందించుకోవడం అవసరం లేదు. విశ్వాసులు‌ కూడా దేవుడు క్షమించిన గతకాలపు తప్పుల విషయంలో ఒకరిని ఒకరు నిందించుకుని కలహపడకూడదు.

ఆదికాండము 45:25,26
వారు ఐగుప్తునుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.

ఈ వచనాలలో యోసేపు సహోదరులు క్షేమంగా తమ తండ్రిదగ్గరకు తిరిగివచ్చి యోసేపు గురించి తెలియచెయ్యడం మనం చూస్తాం. ఐగుప్తులో బంధించబడిన షిమ్యోను, అక్కడికి వెళ్ళిన బెన్యామీను క్షేమంగా తిరిగివస్తే చాలనుకుని‌ ఎదురుచూస్తున్న యాకోబుకు యోసేపు కూడా బ్రతికియున్నాడని వారు తెలియచెయ్యడం నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే అతను ఏమీ మాట్లాడలేక మొదట స్తంభించిపోయాడు.

ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి; యాకోబు తన కుమారుడైన షిమ్యోను ఐగుప్తులో బంధించబడ్డాడని తెలుసుకున్నాడు. తర్వాత బెన్యామీనును కూడా అక్కడికి పంపించాడు. ఈ సందర్భంలో వారు తిరిగివచ్చేంతవరకూ అతని మనసు ఎలా ఉండుంటుంది? వారంతా క్షేమంగా తిరిగివస్తారా లేదా అని చాలా ఆందోళనతో ఎదురుచూస్తుంటుంది కదా! వృద్ధుడైన అతను కేవలం దేవునిపై ఆధారపడబట్టే ఆ కాలమంతా గడపగలిగాడు. చివరికి దేవుడు అతనికి యోసేపు సమాచారంతో ఊహించినదాని కంటే అధికమైన ఆనందం కలుగచేసాడు.

ఆదికాండము 45:27
అప్పుడు వారు యోసేపు తమతో చెప్పినమాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపినబండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.

ఈ వచనంలో యాకోబు యోసేపు పంపించిన శ్రేష్టమైన బండ్లను చూసినప్పుడు వారు చెప్పిన మాటలను నమ్ముతూ సంతోషానికి గురైనట్టు మనం‌ చూస్తాం. అందుకే ఆ ఆనందంతో ఈ క్రింది వచనంలో ఈవిధంగా పలుకుతున్నాడు.

ఆదికాండము 45:28
అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

ఈ వచనంలో యాకోబు యోసేపును చూడాలన్న సంతోషంతో తాపత్రాయపడడం మనం చూస్తాం. అతను కరువువల్ల ఏర్పడిన దీన పరిస్థితిని బట్టి ఇకపై నేను ఐగుప్తు సమృద్ధిని‌ బట్టి సంతోషంగా ఉంటానని ఆలోచించడం లేదు కానీ కేవలం యోసేపును చూడాలని మాత్రమే ఆశపడుతున్నాడు. ఇది అతనిలోని‌ శ్రేష్టమైన తండ్రి ప్రేమను మనకు తెలియచేస్తుంది.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.