పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

6:1,2, 6:3, 6:4, 6:5, 6:6, 6:7, 6:8, 6:9, 6:10, 6:11, 6:12, 6:13, 6:14-16, 6:17, 6:18, 6:19,20, 6:21, 6:22

ఆదికాండము 6:1,2

నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.

ఈ వచనంలో నరులు భూమిమీద విస్తరిస్తున్నప్పుడు దేవుని కుమారులు అనబడేవారు నరుల కుమార్తెల అందాన్ని చూసి వారిలో తమ‌ మనసుకు నచ్చినవారిని వివాహాలు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంతకూ ఈ దేవుని కుమారులు ఎవరు అనేదానిపై బైబిల్ పండితుల మధ్య ప్రాముఖ్యంగా రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవిధంగా ఇది ఒక వివాదాస్పదమైన అంశం. అయినప్పటికీ ఆ రెండు భిన్నాభిప్రాయాలనూ మీతో నిష్పక్షపాతంగా పంచుకుని నేను ముందుకు కొనసాగుతాను. ఇది మన రక్షణకు కానీ, విశ్వాసానికి కానీ దేవుని‌ గుణలక్షణాలకు కానీ, లేఖనాల ప్రామాణికతకు కానీ సంబంధించిన అంశం కాదు కాబట్టి, నేను ఈ విషయంలో ఎటువ‌ంటి స్పష్టతనూ ఇవ్వదలచుకోలేదు. అయితే నేను ఈ రెండు అభిప్రాయాలనూ మీతో పంచుకునే క్రమంలో, మొదటి వాదనపై నాకున్న అభ్యంతరాలను, రెండవ వాదనపై నాకున్న సానుకూలతను మాత్రం తెలియచేస్తాను. నిజానికి నేను మూడవ అభిప్రాయాన్నే నమ్ముతుంటాను. అదేంటో ఈ రెండు అభిప్రాయాల తరువాత వివరిస్తాను.

మొదటి అభిప్రాయం ప్రకారం; ఇక్కడ దేవుని కుమారులు అని తర్జుమా చెయ్యబడినచోట‌ హీబ్రూబాషలో בני האלהים (Benay ha Elohim) అనేపదం వాడారు. పాతనిబంధనలో ఈ పదం కేవలం దేవదూతలను ఉద్దేశించి మాత్రమే వాడబడింది. ఉదాహరణకు; యోబు 1:6, 2:1, 38:7. ఈ కారణం చేత, అక్కడ మనకు కనిపించే దేవుని‌ కుమారులు దేవదూతలేయని వీరు విశ్వసిస్తారు. అయితే దీనిపై మనకు చాలా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే పరలోకంలో‌ దేవదూతలు పెండ్లికియ్యబడరు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు (మార్కు12:25). కానీ వీరు ఆ ప్రశ్నకు ఆదికాండము 18వ అధ్యాయంలో, యెహోవా ఇద్దరు దేవదూతలతో కలసి మానవరూపంలో అబ్రాహామును దర్శించిన సందర్భాన్నీ, తరువాత ఆ దూతలు లోతు ఇంటికి వెళ్ళిన సంఘటనను చూపించి సులభంగానే సమాధానం చెబుతుంటారు. అక్కడ దేవదూతలు మానవదేహాన్ని ధరించుకున్నారు, ఆహారం‌ కూడా తిన్నారు. అదేవిధంగా వారు మానవ దేహాలను‌ ధరించుకుని‌ మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నదే వీరి సమాధానం.

నాకు ఈ సమాధానంలో సమస్యగా అనిపించిన విషయం ఏంటంటే, అబ్రాహాము ఇంటికి వచ్చిన దూతలు దేవునితో కలసి వచ్చారు. కాబట్టి వారు మానవరూపాన్ని కలిగియుండడం, ఆయనతో కలసి భోజనం చెయ్యడంలో విచిత్రమేమీ లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దేవదూతలు కూడా అలా తమకు ఇష్టమైనప్పుడు మానవదేహాలను ధరించుకునే సామర్థ్యం కలిగియుంటారు అనడానికి లేఖనాలలో ఒక్క ఆధారం కూడా లేదు. పైగా ఆ దూతలు మానవ స్త్రీల అందాన్ని చూసి దానిని అనుభవించడం కోసమని అలా మానవ దేహాలను ధరించుకోవలసిన అవసరం ఏముంటుంది?. యేసుక్రీస్తు దేవదూతల గురించి‌ చెప్పిన మాటల ప్రకారం‌ వారు పెండ్లికియ్యబడరు అంటే, వారికి మనకు ఉన్నట్టుగా లైంగిక కోరికలు ఉండవని అర్థం. ఆ కోరికలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలనే దేవుని సంకల్పాన్ని బట్టి మనకూ (మనుషులకు) జంతువులకూ మాత్రమే అనుగ్రహించబడ్డాయి (ఆదికాండము 1:21,22, 1:27,28).

ఈవిధంగా లైంగిక కోరికలు లేని దేవదూతలు మానవ స్త్రీల అందానికి ఎలా ఆకర్షితులయ్యారు?. ఉదాహరణకు, నాకు ఆకలివేస్తుంది కాబట్టి అన్నం తింటాను, అది నా స్వభావం. ఒకవేళ నా స్వభావంలో ఆకలే లేకపోతే దానిని పుట్టించుకుని తినవలసిన అవసరం నాకు ఉండదు కదా!. ఎందుకంటే దానికోసం మళ్ళీ శ్రమపడాలి. పైగా మానవ స్త్రీలను వివాహం చేసుకున్న ఆ దేవుని కుమారులు పిల్లలను కూడా కన్నట్టు చదువుతున్నాం (ఆదికాండము 6:4). కానీ దేవుడు తాను సృష్టించిన స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు జన్మించేలా నియమించాడు. మరి ఆ ప్రక్రియ ఒకవేళ దేవదూతలు కూడా మానవ దేహాన్ని ధరించుకుని మానవ స్త్రీలతో సంభోగించినా, కొనసాగుతుందా?. నేనైతే దీనికి‌ అంగీకరించను. దేవుడు మాత్రమే సృష్టికర్త అయినప్పుడు దేవదూతలు తమంతట తాముగా మానవదేహాలను అది కూడా ప్రత్యుత్పత్తి చేసేలా ఎలా సృష్టించుకోగలిగారు? అంటే దేవదూతలు కూడా సృష్టికర్తలేనా? అది అసాధ్యం.

ఇంతకూ దేవదూతలు ఎందుకు ఇలా చేసారు? వారికి ఆ అవసరం ఏముంది? అని నేను పైన ప్రస్తావించిన ప్రశ్నకు కొందరు వారు దేవుడు చేసిన‌ నరులను (సృష్టిని) పాడుచెయ్యాలనే ఉద్దేశంతోనే అలా చేసారని చెబుతుంటారు. కానీ మొదటి రెండువచనాలనూ పరిశీలించినప్పుడు, వారు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే (చక్కనివారని చూసి) కారణమని స్పష్టంగా రాయబడింది. లేఖనం వారు అలా చెయ్యడానికి కారణమేంటో అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు అది పక్కనపెట్టేసి ఇంకేదో కారణం చెప్పడం సమంజసం‌ కాదు.

మరికొందరు ఇక్కడ చెప్పబడుతున్న దేవదూతలు అప్పటికే పతనమైన దేవదూతలని వారు దేవునిపై కోపంతోనే అలా చేసారని చెబుతుంటారు. అదే నిజమైతే పతనమైన దేవదూతలు కూడా దేవుని కుమారులుగానే పిలవబడతారా? అది‌ అసాధ్యం కదా. పైగా పతనమైన దేవదూతలు కూడా అబ్రాహాము, లోతు దగ్గరకు వెళ్ళినప్పటివలే మానవదేహాన్ని ధరించుకోలరా? నేను పైన తెలియచేసినట్టుగా దీనికి లేఖనంలో ఒక్క ఆధారం కూడా లేదు. మళ్ళీ చెబుతున్నాను. మొదటి రెండు వచనాల ప్రకారం దేవుని కుమారులు అనబడేవారు, నరుల కుమార్తెలను‌ వివాహం చేసుకోవడానికి వారి అందమే కారణం తప్ప, దేవునిపై కోపం కూడా కారణం కాదు.

అయితే ఈ దేవుని‌ కుమారులు దేవదూతలే అని వాదించేవారు దానికి ప్రధానమైన ఆధారంగా యూదాపత్రిక నుండి వాక్యభాగాన్ని చూపిస్తుంటారు. అదేంటో చూడండి.‌

యూదా 1:6,7 మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.

ఈ వాక్యభాగంలో యూదా దేవదూతలు చేసిన పాపం గురించి ప్రస్తావిస్తూ "ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు" అంటున్నాడు. అంటే ఈమాటల్లో దేవదూతలు చేసిన పాపం సొదొమ గొమొఱ్ఱాలు చేసిన పాపం ఒక్కటే (వ్యభిచారం) అని అర్థం వస్తుంది. కాబట్టి యూదా ఇక్కడ దేవుని కుమారులు (దేవదూతలు) చేసినదానినే తన పత్రికలో ప్రస్తావిస్తున్నాడని చెబుతుంటారు. అయితే ఇంతకూ మనం మాట్లాడుకుంటున్న దేవునికుమారులు మొదటి రెండు వచనాల ప్రకారం వ్యభిచారం చేసారా? లేక వివాహం చేసుకున్నారా?. వివాహమే కదా!. అందువల్ల ఒకవేళ యూదా మాటలకు వీరు చెబుతున్న వ్యాఖ్యానం ప్రకారం దేవదూతలు వ్యభిచారం చేసారని అనుకున్నప్పటికీ, ఈ దేవుని కుమారులు యూదా చెబుతున్న దేవదూతలే అని రుజువు చెయ్యలేరు. ఎందుకంటే వారు వివాహం చేసుకున్నారు. వ్యభిచారం చెయ్యలేదు. లేఖనాలలో ఎక్కడా కూడా వివాహం వ్యభిచారంతో పోల్చబడలేదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కలయిక, వ్యభిచారం పతనస్వభావం నుండి పుట్టుకొచ్చిన పాపపు కలయిక (హెబ్రీ 13:4).

ఇకపోతే యూదా తన పత్రికలో "వీరివలెనే" అని సొదొమ గొమొఱ్ఱా పట్టణస్తులకోసం మాట్లాడుతున్నప్పుడు అతను దేవదూతలను ఉద్దేశించి కాదు కానీ అతను మొదటివచనం నుండీ ఎవరి గురించైతే మాట్లాడుతున్నాడో వారిని ఉద్దేశించే ఆ పదప్రయోగం చేసాడు.

యూదా 1:4-8 ఏలయనగా "కొందరు" రహస్యముగా జొరబడియున్నారు. "వారు" భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు "వారు" పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును "వీరివలెనే" వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలెనే "వీరును" కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.

ఈ సందర్భం అంతటినీ మనం పరిశీలించినప్పుడు యూదా అప్పటి సంఘంలో కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న (వ్యభిచారం చేస్తున్న) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. ఆయన దృష్టికి పాపం చేసిన ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, తమ ప్రధానత్వాన్ని విడిచిపెట్టిన దూతలను ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా "వీరివలెనే" (కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న వీరివలెనే) వ్యభిచారం చేసిన సొదొమ గొమొఱ్ఱా పట్టణస్తులను కూడా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన వీరిని కూడా విడిచిపెట్టడు అ‌నేదే అతని మాటల సారాంశం. అంతేతప్ప అతను దేవదూతలు వ్యభిచారం చేసారు అని చెప్పడం లేదు.

ఇక ఈ దేవుని కుమారులు దేవదూతలే అనేవారు వారికీ మానవ స్త్రీలకూ పుట్టిన‌పిల్లలను కూడా మరో ప్రాముఖ్యమైన ఆధారంగా తీసుకుంటారు‌. ఎందుకంటే వారి గురించి "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" (ఆదికాండము 6:4) అని రాయబడింది.

ఈ వాక్యభాగంలో దేవుని కుమారులకూ మానవస్త్రీలకూ జన్మించిన ఆ నెఫీలులను ఇంగ్లీష్ బైబిల్ లో Giants అని తర్జుమా చెయ్యడం జరిగింది. హీబ్రూలో ఈ נפלים (Nephilim) అనేదానికి Fall (పతనం) అనే అర్థం వస్తుంది. వీరు సాధారణ మనుషులకంటే, ఉన్నత దేహులు. ఆ విధంగా దేవుని కుమారులు దేవదూతలు కాబట్టే వారి సంతానమైనటువంటి వీరు ఇలా ఉన్నతదేహులుగా జన్మించార‌నేది వారి వాదన.

అయితే ఈ నెఫీలీయులు ఉన్నతదేహులు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు కానీ, నరుల కుమార్తెలకూ, దేవునికుమారులకూ పుట్టిన అ‌ందరూ ఉన్నత దేహులేనా (నెఫీలీయులు) లేక కొందరే అలా ఉన్నారా అనేది నా ప్రశ్న. పైగా 4వ వచనంలో ఈ నెఫీలీయులు "తరువాత కూడా" (జలప్రళయం తరువాత కూడా) ఈ భూమిపై ఉన్నారని రాయబడింది (సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2). దావీదు కాలంలో కూడా, గొల్యాతు, రెఫామీయుల సంతతివారు ఉన్నత దేహులుగానే పేర్కోబడ్డారు (2 సమూయేలు 21:20). ఒకవేళ ఈ నెఫీలీయులు దేవదూతలకూ, మానవస్త్రీలకూ పుట్టిన పిల్లలే ఐతే జలప్రళయంలో‌ వారంతా నాశనమయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఎలా వచ్చారు?. దీనికి కొందరు నోవహు కుమారుడైన హాము భార్య ద్వారా ఆ జన్యువుల సంక్రమించాయని చెబుతుంటారు. కానీ ఇది అసలు నమ్మశక్యం కానటువంటి సమాధానం. యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ రచనల్లోనూ (The antiquities of the Jew), book of Enoch ‌లో‌నూ , మిగిలిన కొన్ని యూదా రచనల్లో కూడా ఈ దేవుని కుమారులు దేవదూతలే అని, నెఫీలీయులు వారి సంతానమే అని రాయబడింది. కానీ అది వాస్తవం కాదని ఇప్పటికే‌ వివరించాను.

ఇక ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలపై ఉన్న రెండవ అభిప్రాయం ప్రకారం; ఆదికాండము నాలుగవ అధ్యాయంలో దుష్టుడైన కయీను సంతానం ఎలా విస్తరించిందో రాయబడింది, ఆ సంతానంలో హత్యలు చేసేవారూ, బహు భార్యాత్వం కలిగినవారు (లెమెకు) మనకు కనిపిస్తారు. ఐదవ అధ్యాయంలో విశ్వాసియైన షేతు సంతానం గురించి రాయబడింది, ఆ సంతానంలో మనకు దేవునితో నడచినవారు (హనోకు, నోవహు) యెహోవా నామమున ప్రార్థన చేసినవారు (ఎనోషను) దర్శనమిస్తారు. ఈ రెండు వంశావళులూ రాయబడిన తరువాత అధ్యాయంలో (6వ) ఈ సంఘటన జరగడం‌ వల్ల, అక్కడ దేవుని కుమారులంటే షేతు సంతానమని, నరుల కుమార్తెలంటే, కయీను సంతానమని వీరు భావిస్తారు. లేఖనాలలో విశ్వాసులను దేవుని కుమారులుగా సంబోధించబడడం మనకు సాధారణంగానే కనిపిస్తుంటుంది.

రోమీయులకు 8: 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

కానీ ఆ దేవుని కుమారులు ఆత్మీయతకు కాకుండా అందానికే ప్రాముఖ్యతను ఇస్తూ, కయీను సంతానపు వారిని‌ వివాహం చేసుకున్నారని అందుకే వారు చేసింది పాపమైంది. మిగిలిన లేఖనాలను కూడా మనం పరిశీలించినప్పుడు అవిశ్వాసులను వివాహం చేసుకోవడం విశ్వాసులకు నిషేధంగా ఆజ్ఞాపించబడింది (నిర్గమకాండము 34:16, 2కొరింధీ 6:14). అబ్రాహాము కూడా తన కుమారుడైన ఇస్సాకు విషయంలో ఇటువంటి జాగ్రతనే తీసుకున్నాడు (ఆదికాండము 24:3). కానీ ఈ దేవుని‌ కుమారులు (విశ్వాసులు) నరుల కుమార్తెలను (అవిశ్వాసులను) వివాహం చేసుకోవడం వల్ల, వారు చెడిపోవడమే కాకుండా వారికి పుట్టిన పిల్లలు కూడా బలాత్కారులుగా (నెఫీలీయులకు తెలుగు బైబిల్ లో పుట్ నోట్) తయారయ్యారనేది వీరి వాదన. ఎందుకంటే, ఇలాంటి మిశ్రిత వివాహాల వల్ల వారి కుటుంబవ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితినుండి జ్ఞానియైన సొలోమాను కూడా తప్పించుకోలేకపోయాడు (1 రాజులు 11:3,4).

ఇక వారికి పుట్టిన పిల్లలు ఉన్నతదేహులుగా ఎలా ఉన్నారనే ప్రశ్నకు కూడా వీరు, అప్పటిప్రజల ఆయుష్షును ఉదాహరణగా తీసుకుంటూ, అలానే వారిలో కొందరి దేహాలు కూడా ఉన్నతమైనవిగా ఉన్నాయని (జన్యుపరమైన మార్పులు) సమాధానం ఇస్తుంటారు. అందుకే జలప్రళయం తరువాత కాలంలో కూడా వారి ఉనికి ఉందట (సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2). అయితే, షేతు సంతానం కూడా నరులే అయినప్పుడు, మానవులకు నరులని దేవుడే పేరుపెట్టినప్పుడు, మోషే ఈ 6వ అధ్యాయంలో మాత్రం కయీను సంతానాన్ని నరుల కుమార్తెలని, షేతు సంతానాన్ని దేవుని కుమారులని వేరువేరుగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం ఔతుంది. కానీ ఈ ప్రశ్న ఈ వాదనను కాదనేంత బలీయమైనది కాదు. ఎందుకంటే నరులు అనేది అ‌ందరినీ ఉద్దేశించి సాధారణంగా వాడే పదమే అయినప్పటికీ (నరులు భూమిమీద విస్తరించనారంభించినప్పుడు) వారినుండి విశ్వాసులను ప్రత్యేకించి చూపించడానికి మోషే వారిని దేవుని కుమారులని ప్రస్తావించియుండవచ్చు.

నేను విశ్వసిస్తున్న మూడవ అభిప్రాయం ఏంటంటే; Doc. John Gill గారు తన ఆదికాండము 6 వ్యాఖ్యానంలో, యూదులకు చెందిన Targums of Onkelos and Jonathan, Jarchi and Aben ezra లలో అక్కడ ఈ "దేవునికుమారులను" గొప్పవ్యక్తులు, న్యాయాధిపతులు, పాలకులుగా వివరించారని తెలియచేసాడు. ఈ కారణం చేత పురాతన యూదులు Benay ha Elohim అన్నప్పుడు ఇలాంటివారిని కూడా పరిగణలోకి తీసుకుంటారని మనకు అర్థమౌతుంది. ఒకవిధంగా "Benay ha Elohim" (దేవుని కుమారులు) అనేది కొందరు కలిగియున్న బిరుదు (Title). కాబట్టి నాకు దేవునికుమారులు అనగానే లేఖనాల ప్రకారం విశ్వాసులు అని భావించడం కంటే, చరిత్రను బట్టి కొందరు కలిగియున్న బిరుదుగా (Title) గా భావించడమే సరి అనిపించింది. ఉదాహరణకు; నిమ్రోదుకు "అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తికలదు" (ఆదికాండము 10:9) అని బిరుదు ఉంది. నిజానికి యూదా చరిత్ర ప్రకారం అతను మంచివాడు కాదు. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుని కుమారులు అని రాయబడగానే వారు విశ్వాసులే కావక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ రెండవ అభిప్రాయం, ఈ మూడవ అభిప్రాయం ప్రకారం వారు మనుషులు అనేదే సత్యం. దీనికి 3వ వచనం కూడా మంచి ఆధారంగా ఉంది.

ఆదికాండము 6:3

అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు (మూలభాషను బట్టి ఇక్కడ 'వాదించడు' అనేది సరైన అనువాదం; 'వాదించదు' అని  తెలుగు బైబిల్లో ఉన్న స్త్రీలింగ/తటస్థ లింగ పదప్రయోగం అనువాదలోపం అని గమనించాలి). వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.

ఈ వచనంలో దేవుడు నరుల అక్రమం గురించి మాట్లాడడం మనం చూస్తాం. దీనిప్రకారం పై వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఇద్దరూ కూడా నరులేయనే వాదన మరింత బలపడుతుంది. ఎందుకంటే అక్కడ పాపం చేసిన ఇద్దరూ నరులు కాబట్టే దేవుడు నరుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే, దేవుని కుమారులు దేవదూతలని నమ్మేవారు, ఈ వచనానికీ పై రెండు వచనాలకూ మధ్యలో చాలా సమయం గడచిందని, దేవుని కుమారులు (దేవదూతలు) మానవ స్త్రీలను వివాహం చేసుకోగా జన్మించిన నెఫీలీయుల కారణంగా, అప్పుడున్న మనుషులంతా చెడిపోయారని, వారు మనుషులకు దైవవిరుద్ధమైన చాలా కార్యాలను నేర్పించారని Book of Enochలో రాయబడిన కొన్నిమాటల ఆధారంగా చెబుతుంటారు. ఆ నెఫీలీయుల వల్ల చెడిపోయిన నరుల గురించే దేవుడు ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నాడు అంట..

కానీ ఈ క్రింది వచనం (4) ప్రకారం దేవుడు ఈమాటలు పలికేసరికి నెఫీలీయులు కూడా ఈ భూమిపైనే ఉన్నారు. దేవుడు వారిని కూడా నరులనే సంబోధిస్తున్నాడు. ఎందుకంటే 5వ వచనంలో ఆయన నరుల చెడుతనం గురించి ప్రస్తావించి, "నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి" 7వ వచనంలో ఆ నరులను నాశనం‌ చేస్తాను అంటున్నాడు. "అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను" ఒకవేళ నెఫీలీయులు దేవదూతలకూ మనుషులకూ పుట్టినవారే ఐతే, వారు పూర్తిగా నరులు ఎలా ఔతారు? దేవునికుమారులు దేవదూతలే అని అంటున్నవారి వాదనప్రకారం వారు ఒక విధంగా రాక్షసజాతి కదా!

అదేవిధంగా, ఆ సందర్భంలో దేవుడు నా ఆత్మ‌నరులతో ఎల్లప్పుడూ వాదించదని పలకడం‌ మనం చూస్తాం. దీనికి ఆయన ఆత్మ (పరిశుద్ధాత్మ) నరులు చేస్తున్న పాపాన్ని చూస్తూ వారికి శిక్షవిధించకుండా ఎల్లప్పుడూ వాదిస్తూనే (భరిస్తూనే) ఉండడని అర్థం. అందుకే, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు (శరీరస్వభావం గలవారు/దైవవిరుద్ధంగా శరీరేచ్చలు నెరవేర్చుకునేవారు) అయినప్పుడు దేవుడు వారిని నాశనం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికీ అలాంటి శరీరస్వభావం గలవారి గురించి దేవుడు ఏమని రాయిస్తున్నాడో చూడండి.

రోమీయులకు 8:7-10,12,13 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు" గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

"అయిననూ వారి దినములు 120 యేండ్లగుననెను"

దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడని (శిక్షవిధించకుండా భరించడని) చెబుతున్న క్రమంలోనే ఈమాటలు కూడా పలకడం మనం గమనిస్తాం. దీనిని కొందరు అప్పటినుండి మానవుల ఆయిష్షును ఆయన 120 యేళ్ళకు కుదించివేసాడని అపార్థం చేసుకుంటుంటారు. కానీ, ఇది మానవుల ఆయుష్షుకోసం చెప్పబడినమాట కాదు. ఎందుకంటే, 11వ అధ్యాయం ప్రకారం; నోవహు కుమారుల సంతానం వందల సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తాం. అదేవిధంగా అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 25:7), ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 35:28), యాకోబు కూడా 147 సంవత్సరాలు బ్రతికాడు (ఆదికాండము 47:28).

కాబట్టి ఆ సందర్భంలో దేవుడు వారి దినములు 120 యేండ్లగును అనంటే, అది మానవుల ఆయుష్షుకోసం కాదు కానీ, అప్పుడున్న మనుషుల అంతం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ మాటలు పలికినప్పటినుండి జలప్రళయం వచ్చి వారిని నాశనం‌ చేసేవరకూ మధ్య ఉన్న సమయమే ఆ 120 సంవత్సరాలు. దేవుడు ఈ మాటలు పలికే సమయానికి నోవహుకు ఇంకా కుమారులు జన్మించలేదు. ఎందుకంటే, ఆదికాండము 5:32 ప్రకారం; నోవహు తన 500 యేండ్లకు కుమారులను కన్నాడు. ఆదికాండము 7:6 ప్రకారం; నోవహుకు 600 సంవత్సరాలు వచ్చినప్పుడు రెండవనెలలో జలప్రళయం వచ్చింది. దీనిప్రకారం, దేవుడు ఈ మాటలు పలికేసరికి నోవాహు వయస్సు 480 సంవత్సరాలు.

గమనించండి. దీర్ఘశాంతుడైన దేవుడు అప్పటి నరులు పాపం చెయ్యగానే‌ వారిని అంతం‌ చెయ్యకుండా వారికి 120 సంవత్సరాలు‌ గడువు ఇచ్చాడు. అప్పటికి కూడా వారిలో ఎవరూ మార్పుచెందనప్పుడు ఆయన తన ఉగ్రతను వారిపై కురిపించి నాశనం చేసాడు. దీనిని బట్టి, దేవుడు దీర్ఘశాంతుడు అనగానే ఎల్లప్పుడూ మన పాపాలను భరించేవాడిగా మనం భావించకూడదు. మారుమనస్సు పొందడానికి ఆయన ఈరోజు ఇచ్చిన అవకాశం రేపు ఇవ్వకపోవచ్చు, కాబట్టి సమయం ఉండగానే మన తప్పులు సరిచేసుకోవాలి.

కీర్తనలు 50: 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను.

యిర్మియా 13:16 ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.

ప్రకటన 2:21,22 మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.

ఆదికాండము 6:4

ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.

ఈ నెఫీలుల గురించి ఇప్పటికే పైన మనం విస్తృతంగా చర్చించుకున్నాము. వీరిని మన తెలుగు బైబిల్ పుట్ నోట్ లో‌ బలత్కారులు అని పేర్కోవడం జరిగింది. ఎందుకంటే వీరు అప్పటి సమాజంలో తమకంటే బలహీనులపై దౌర్జన్యం జరిగిస్తూ, హింసకు మరోపేరుగా నిలిచారని కొందరు బైబిల్‌ పండితుల అభిప్రాయం. వీరు శూరులు అన్నప్పుడు అది వీరి బలాన్ని సూచిస్తుంది.

ఆదికాండము 6:5

నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి-

ఈ వచనం మానవుడు చేసే క్రియలను బట్టే కాదు అతని ఊహను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని తెలియచేస్తుంది, ఎన్నో లేఖనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి (యిర్మియా 17:9,10, 1 కోరింథీ 4:5). దేవుడు మనిషిని తనకు అనుకూలమైన ఆలోచనలు, ఊహలు కలిగియుండాలనే ఉద్దేశంతోనే ఆలోచించే, ఊహించే వ్యక్తిగా తయారుచేశాడు (మనసాక్షి కలిగినవాడిగా). కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దైవ విరుద్ధమైన ఆలోచనలతో ఊహలతో జీవిస్తాడో అప్పుడే ఆయన యెదుట పాపిగా తీర్పు పొందుకుంటాడు. ఎందుకంటే ప్రతీ పాపమూ క్రియారూపం దాల్చడానికంటే ముందుగా మానవుని ఆలోచనలోనే రూపుదిద్దుకుంటుంది. అలానే ప్రతీపాపమూ ఆయన పరిశుద్ధస్వభావానికి వ్యతిరేకంగానే చెయ్యబడుతుంది. కాబట్టి దేవునిపిల్లలు, దైవవిరుద్ధమైన ఆలోచనలకూ, ఊహలకూ మనసులో తావివ్వకుండా జాగ్రతపడాలి, ఆ విధంగా ప్రేరేపించేవాటికి దూరంగా ఉండాలి. ప్రస్తుత సినిమాలు, ఇతర చిత్రీకరణలు, నవలలు చాలామట్టుకు మనిషిని ఈవిధంగానే ప్రేరేపిస్తున్నాయి.

సామెతలు 4: 23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.

ఫిలిప్పీయులకు 4:8 మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి.

ఈ వ్యాసం చదవండి.

సినిమాలు-క్రైస్తవులు

ఆదికాండము 6:6

తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.

ఈ వచనంలో దేవుడు నరుల పాపాన్ని బట్టి వారిని చేసినందుకు సంతాపపడి, హృదయంలో నొచ్చుకున్నట్టు మనం చూస్తాం.‌ అయితే సార్వభౌముడైన దేవునికి ఈ సృష్టిని చెయ్యకముందే అలా జరుగుతుందని తెలుసు‌, తెలిసే ఆయన ఈ సృష్టిని చేసాడు. అయినప్పటికీ, ఆయనకు విరుద్ధమైన కార్యం సృష్టిలో జరుగుతున్న సమయంలో ఆ పాపం పట్ల తన వ్యతిరేఖ భావాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు, దానిద్వారానే లోకానికి తీర్పుతీరుస్తాడు. ఈ సందర్భంలో అదే జరుగుతుంది.

కీర్తనలు 5:4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు.

హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా.

అదేవిధంగా, మొదటి అధ్యాయపు వ్యాఖ్యానంలో దేవునికి మనవలే శరీరం ఉన్నట్టుగా వర్ణించబడిన పద్ధతిని Anthropomorphism (మానవునికి అర్థమయ్యేలా కనిపించడం) అంటారని వివరించాను (ఆదికాండము 1:26 వ్యాఖ్యానం చూడండి). ఈ వచనంలో ఐతే మానవునికి ఏ విధంగా భావనలు పుడుతాయో, అటువంటి భావనలే దేవునికి కూడా పుడుతున్నట్టుగా వర్ణించడం జరిగింది (సంతాపపడడం, నొచ్చుకోవడం). కానీ, దేవునికి హృదయంలో ఆలోచనలు, బాధలు (సంతాపం) సందర్భాన్ని బట్టి మనకు పుట్టినట్టుగా పుట్టవు. ఎందుకంటే ఆయన నిత్యుడు (యెషయా 40:28), ఆయన మార్పులేనివాడు (మలాకీ 3:6). తన చిత్తం విషయంలో విఫలం కానివాడు (దానియేలు 4:35, యెషయా 46:10, యోబు 42:2). కాబట్టి దేవునికి పాపం పట్ల ఉండే వ్యతిరేక వైఖరి మనకు అర్థమయ్యేలా తెలియచెయ్యడానికే ఆయనకు కూడా సమయాన్ని‌ బట్టి భావనలు పుడుతున్నట్టుగా (సంతాపం, నొచ్చుకోవడం) ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మానవుని భావనలను దేవునికి ఆపాదించి మాట్లాడడాన్ని Anthropopathism అంటారు.

ఆదికాండము 6:7

అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశపక్ష్యాదులును భూమి మీదనుండకుండ తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది యున్నాననెను.

ఈ వచనంలో దేవుడు నరులతో సహా జీవరాశులను కూడా నాశనం చేయబోతున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. మానవుడు చేసే పాపాన్ని‌ బట్టి‌ దేవుని ఉగ్రత కొన్ని‌సార్లు సమస్త జీవరాశుల మీదకు కూడా వస్తుంటుంది. ఎందుకంటే, ఆయన ఈ సృష్టిలో సమస్తం మానవుని కోసమే సృష్టించాడు, మానవుడిని వాటన్నిటిపై ఏలికగా నియమించాడు.

ఆదికాండము 6:8

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

ఈ వచనంలో దేవుడు రప్పించబోతున్న జలప్రళయంలో నశించిపోకుండా నోవహు ఆయన కృపను పొందుకోవడం మనం చూస్తాం.‌ ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పై వచనాలలో దేవుడు నరులందరినీ నాశనం చేస్తానని పలికినట్టు రాయబడింది. దానర్థం, నరులను చెయ్యడంలో ఆయనకున్న ఉద్దేశం విఫలమైనట్టు కాదు. ఒకవేళ అదే నిజమైతే ఆయన నోవహును కూడా కాపాడకుండా నశింపచేసి ఉండేవాడు. కానీ, దుష్టుడైన కయీను సంతానాన్ని సమూలంగా నాశనం చేసి, షేతు సంతానమైన నోవహు మూలంగా ఈ భూమిని నిండించాలన్నదే దేవుని చిత్తం‌ కాబట్టి ఆయన నోవహునూ అతని కుటుంబాన్నీ కాపాడుతున్నాడు.

యెషయా 46: 10 "నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు", చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

యోబు గ్రంథము 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు "నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు" నేనిప్పుడు తెలిసికొంటిని.

అదేవిధంగా నోవహు యెహోవా‌ దృష్టియందు కృపపొందినవాడు అంటే, అది అతని గొప్పతనమో, అతను చేసిన మంచిపనుల గొప్పతనమో‌ కాదు. కృప అంటే, మనం యోగ్యులం కానప్పటికీ/అర్హత లేనప్పటికీ ఆయన మనపై దృష్టినిలపడం/కరుణించడం (దానం). ఈరోజు మనం కూడా నోవహు వలే దేవుని దృష్టియందు కృపపొందబట్టే రక్షించబడ్డాం/విశ్వసించాం. అది మన గొప్పతనం‌ వల్ల కానీ,‌ మనం చేసిన మంచిక్రియల వల్ల కానీ కాదు. అందుకే పౌలు స్పష్టంగా ఇలా రాస్తున్నాడు.

ఎఫెసీయులకు 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

రోమీయులకు 11:6 అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు.

ఆదికాండము 6:9

నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

ఈ వచనంలో నోవహు నీతిపరుడునూ, తన తరంలో నిందారహితుడిగానూ ఉండి దేవునితో నడుస్తున్నట్టు మనం చూస్తాం.‌ కానీ నోవహు జలప్రళయం నుండి రక్షించబడడానికి కేవలం దేవుని కృపే కారణమని ముందటి వచనంలో వివరించుకున్నాం. కాబట్టి ఇక్కడ నోవహు దేవునితో నిందారహితుడిగా, నీతిపరుడిగా నడవడానికి కూడా ఆయన కృపే కారణం. ఎందుకంటే నోవహు ఆ విధంగా నడుచుకునేలా దేవుని‌కృపనే అతనికి‌ బోధించింది, మనకు కూడా బోధిస్తుంది.

తీతుకు 2:11-13 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన "దేవుని కృప" ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

ప్రతీకాలంలోనూ,
దేవుని కృప పొందినవారు, నోవహులా, ఈలోకంనుండి ప్రత్యేకించబడి దేవునికి శేషంగా జీవిస్తారు (దేవునితో నడుస్తారు). ఇది వారి గొప్పతనం కాదు కానీ, దేవుని కృపను‌ బట్టే అది వారికి సాధ్యమౌతుంది.

రోమీయులకు 11:3-6 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. ఆలాగుననే అప్పటికాలమందు సయితము "కృప యొక్క యేర్పాటు చొప్పున" శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

కాబట్టి, దేవునిమార్గంలో‌ నీతిమంతులుగా, నిందారహితులుగా నడుస్తున్న మనమందరమూ, అదేదో మన గొప్పతనమని భావించకుండా, ఆయన మనపై చూపిన కృపకు నిదర్శనమే మన నీతిగల ప్రవర్తనయని గుర్తించి, ఇందుకై ఆయనను‌ అధికంగా మహిమపరచాలి. అందుకే దావీదు ఆయన కృపకు సంబంధించిన వాక్యం గురించి కూడా "నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130) అని అంటున్నాడు.

ఆదికాండము 6:10

షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.

ఈ వచనంలో ‌నోవాహు ముగ్గురు కుమారుల పేర్లూ రాయబడడం మనం చూస్తాం. జలప్రళయం తరువాత వీరినుండే మానవజాతి విస్తరించింది (ఆదికాండము 10).

ఆదికాండము 6:11

భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

ఈ వచనంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి, బలాత్కారంతో నిండియున్నట్టు మనం చూస్తాం. ఈ భూమిపై జరిగే ఏ పాపమూ కూడా దేవుని సన్నిధిని మరుగైయుండలేదని ఇది ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. చివరికి అవి మనకే తెలియని మన రహస్య పాపాలు కూడా. అందుకే మోషే "మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి" (కీర్తనలు 90:8) అని అంటున్నాడు.

యోబు 12:22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధ కారమును వెలుగులోనికి రప్పించును

ఆదికాండము 6:12

దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

ఈ వచనంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్టుగా మనుషులంతా తమ మార్గాన్ని చెరిపివేసుకున్నట్టుగా మనం చూస్తాం.  ఇక్కడ "దేవుడు చూచెను" అన్నప్పుడు కూడా ఆ మాటలు మనకు అర్థమయ్యేలా Anthropomorphism పద్ధతిలో చెప్పబడ్డాయి. వాస్తవానికి ఆయన మనవలే ఒక్కోసారి ఒక్కో ప్రదేశాన్ని చూడడు. ఆయనకు తన సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అంతా తెలుసు.

కీర్తనల గ్రంథము 139:4,7-12 యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

అదేవిధంగా, సమస్తశరీరులూ తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు అనంటే, దేవుడు వారిముందు ఒక‌ మార్గాన్ని పెట్టినట్టుగా మనకు అర్థమౌతుంది. కాబట్టి ఏ కాలంలో అయినా దేవుని మార్గం మనుషులకు మరుగైయుండలేదు. వారు ఎలా జీవించాలో ఆయన బోధిస్తూనే ఉన్నాడు. మనసాక్షి ద్వారా కొంత, తన భక్తుల ద్వారా మరికొంత ఆ మార్గం బోధించబడుతూనే ఉంది. ఈ వ్యాసం చదవండి.

మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

ఆదికాండము 6:13

దేవుడు నోవహుతో సమస్తశరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది.
ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.

ఈ వచనంలో, దేవుడు భూమిపైకి రాబోతున్న తన తీర్పు గురించి నోవహుకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దీనిని బట్టి అప్పటి ప్రజల పాపం సంపూర్ణమైనట్టుగా మనకు అర్థమౌతుంది. ఎందుకంటే దేవుడు వారి పాపం పరిపూర్ణమవ్వకుండా ఎవరికీ తీర్పు తీర్చడు, అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి.

ఆదికాండము 15:16 అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

ఆదికాండము18:20,21 మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను
నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.

ఈరోజు మన ప్రపంచంలో కూడా పాపం విచ్చలవిడిగా విహారం చేస్తుంది. కానీ అది ఇంకా సంపూర్ణం కాలేదు. అది సంపూర్ణమైన వెంటనే దేవుని తీర్పు తప్పకుండా అమలౌతుంది. ఆ తీర్పులో విశ్వాసులు నోవహులా రక్షించబడితే, అవిశ్వాసులు అప్పటి ప్రజల్లానే నశించిపోతారు.

ప్రకటన గ్రంథము 6:9-11 ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియువారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

లూకా 17: 26 నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.

2 పేతురు 3:10-12 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు , మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

ఆదికాండము 6:14-16

చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.

ఈ వచనాలలో దేవుడు నోవహుకు ఓడ కట్టమని ఆజ్ఞాపించి దానిని ఎలా నిర్మించాలో వివరించడం మనం చూస్తాం. ఇక్కడ మన తెలుగు బైబిల్ లో "చితిసారకపు" అని తర్జుమా చేసిన చోట హీబ్రూలో גּפֶר (gopher) అనే పదం వాడారు ఇది ఒక చెట్టు పేరు. అదేవిధంగా ఇక్కడ మూరలు అన్నప్పుడు అప్పటి ఈజిప్టువంటి దేశాల కొలమానం ప్రకారం 18 నుండి 28 అంగుళాలు దాకా ఉంటుందని కొందరు బైబిల్ పండితులు వెల్లడించారు.

గమనించండి. దేవుడు ఇక్కడ ఓడకొలతల గురించి వివరించినదానిని కొందరు వక్రీకరించి బైబిల్ లో కూడా వాస్తు ఉందని బోధిస్తుంటారు. కానీ బైబిల్ వాస్తు వంటి మూఢనమ్మకాలను ఎక్కడా ప్రోత్సహించదు, సమర్థించదు. కాబట్టి ఇక్కడ దేవుడు నోవాహుకు వాస్తు ప్రకారం కొలతలు‌ ఇవ్వడం లేదుకానీ, ఆ ఓడ పరిమాణం ఏమేరకు ఉండాలో దానికి మాత్రమే కొలతలు ఇస్తున్నాడు. ఎందుకంటే; ఆ ఓడలో నివశించబోయే నోవహు కుటుంబానికీ, మిగిలిన జీవరాశులన్నిటికీ, వారందరికీ కావలసిన ఆహారం నిల్వచేయడానికీ, ఆ ఓడ ఎంత పరిమాణంలో ఉండాలో, ఏ భాగంలో ఏది పెడితే వారికి నివాసయోగ్యంగా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ ఓడ ఇప్పటి మన కొలతల ప్రకారం 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, మూడు అంతస్తులు కలపి 45 అడుగుల ఎత్తు కలదిగా ఉంటుంది. ఇది 522 రైలుపెట్టెలకు సమానం.

నోవహు కేవలం దేవుని మాటలపై విశ్వాసంతో తాను కానీ తన పితరులు కానీ చూడని‌‌ జలప్రళయం నుండి తప్పించుకోడానికి ఇంత పెద్ద ఓడను సిద్ధం చేసాడు కాబట్టే, ఆ తరం వారిపైన నేరస్థాపన చెయ్యగలిగాడు.

హెబ్రీయులకు 11:7 విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.

అదేసమయంలో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా అప్పటిప్రజల మధ్యకు ఆత్మరూపిగా వెళ్ళి వారి మనసాక్షుల ద్వారా వారికి సువార్త ప్రకటించారని లేఖనం చెబుతుంది.

1పేతురు 3: 20 దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

ఆదికాండము 6:17

ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండ నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.

ఈ వచనంలో దేవుడు సమస్త భూమిపైకీ జలప్రళయం సంభవించి, జీవవాయువు గల (ఊపిరి తీసుకునే) ప్రతీదీ చనిపోబోతున్నట్టుగా తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ భూమి అన్నప్పుడు అది ఏదో ఒక ప్రదేశాన్ని సూచిస్తూ అలంకారంగా చెప్పబడిన మాట కాదు. అదే నిజమైతే నోవహు ఓడను కట్టవలసిన అవసరం లేదు, మరో ప్రదేశానికి వెళ్ళి రక్షించబడేవాడు. అదేవిధంగా జీవరాశులను కూడా అతను ఓడలో కాపాడవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఆ జలప్రళయం భూమి అంతటా సంభవించింది. అందుకు శాస్త్రీయ రుజువులెన్నో మనముందు ఉన్నాయి. ఉదాహరణకు ఇది Open చేసి చదవండి

https://answersingenesis.org/kids/geology/evidence-flood/

ఆదికాండము 6:18

అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.

బైబిల్ గ్రంథం అంతటిలోనూ నిబంధన (Covenant) అనే పదం ఈ వచనంలోనే మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. అయితే అంతకుముందు కూడా దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు.

హోషేయా 6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు.

దేవుడు మానవులతో చేసిన ఈ నిబంధనలు రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది షరతులతో కూడిన నిబంధనలు. వీటిలో, దేవుడు కొన్ని షరతులను మానవుని ముందు ఉంచుతాడు. వాటిని ఆ మానవుడు పాటించినంతవరకే ఆ నిబంధన కొనసాగుతుంది. ఎప్పుడైతే మానవుడు ఆ నిబంధనలోని షరతులను ఉల్లంఘిస్తాడో, అప్పుడు ఆ నిబంధన కొట్టివెయ్యబడుతుంది. ఉదాహర‌ణకు, ఆదాము ముందు మంచిచెడ్డల వృక్షఫలాలను తినకూడదనే ఆజ్ఞ, దేవుడు అతనితో చేసిన నిబంధనకు షరతుగా ఉంది. మోషేతో దేవుడు చేసిన నిబంధన (ధర్మశాస్త్రం) కూడా షరతులతో కూడిన నిబంధనే.

నిర్గమకాండము 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.

ద్వితియోపదేశకాండము 29:9 కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను.

కీర్తనలు 50:5 బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచు చున్నాడు.

రెండవది కృపతో కూడిన ‌నిబంధన, ఇందులో మానవుడి ప్రమేయం లేకుండా దేవుడే దానిని కొనసాగిస్తాడు. 

రోమీయులకు 11:6 అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని యెడల కృప ఇకను కృప కాకపోవును.

పైవచనంలో నోవహుతోనూ, అతని సంతానంతోనూ దేవుడు చేస్తున్నది ఇలాంటి కృపతో కూడిన నిబంధన. అందుకే నోవహు దేవుని దృష్టికి కృపపొందినవాడు ఆయెనని‌ చెప్పబడింది (ఆదికాండము 6:8). ఈ నిబంధనలో మానవుని ప్రమేయం లేకుండా దేవుడే దానిని కొనసాగిస్తాడు. ఉదాహరణకు;

ఆదికాండము 15:8-12-17 (21) అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నాయొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగానుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా మరియు ప్రొద్దుగ్రుంకి కటికచీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

ఈ సందర్భంలో, దేవుడు అబ్రాహాము సంతానానికి కానను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని నిబంధన చెయ్యడం మనం చూస్తాం. ప్రాచీనకాలంలో నిబంధన చేసుకునే పద్ధతుల్లో ఏదైనా జంతువును రెండుగా చీల్చి, ఆ భాగాల మధ్య నడచిపోవడం ప్రధానమైనది. దానికి నిబంధన చేసుకున్న ఇద్దరు వ్యక్తుల్లో దానిని ఎవరు అతిక్రమించినా మిగిలిన వ్యక్తి ఆ జంతువువలే అతనిని చీల్చవచ్చని (చంపవచ్చని) అర్థం (యిర్మియా 34:18). ఇక్కడ అటువంటి నిబంధనా పద్ధతినే దేవుడు అబ్రాహాము ముందుంచి, ఆ ఖండించిన భాగాల మధ్య ఆయన మాత్రమే నడిచివెళ్ళాడు. అబ్రాహాముతో కలసి నడవలేదు. దీనిప్రకారం ఆయన చేసిన‌ నిబంధనలో, అబ్రాహాము ప్రమేయం కానీ, అతని సంతానం యొక్క ప్రమేయం కానీ లేకుండా ఆయనే దానిని నెరవేర్చుకుంటాడు. అందుకే ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పటికీ ఆయన వారికి కానను దేశాన్ని పంచిపెట్టాడు.

న్యాయాధిపతులు 2:1 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకు వచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

ఇలాంటి కృపతో కూడిన నిబంధననే, దేవుడు నోవహుతో చేస్తున్నాడు. దానిప్రకారం నోవహు సంతానం ఎలా ఉన్నప్పటికీ ఆయన వారిని విస్తరింపచేస్తాడు, మరలా జలప్రళయంతో వారిని నాశనం చెయ్యడు.

ఆదికాండము 9:8-17 మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో "నా నిబంధన స్థిరపరచుదును". సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న "నిబంధనకు" గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగానుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న "నా నిబంధనను" జ్ఞాపకము చేసికొందును గనుక సమస్తశరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములోనుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్తశరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

ప్రస్తుతం ఆయన విశ్వాసులమైన మనతో చేసిన నిబంధన కూడా, ఇలాంటి కృపతో కూడిన నిబంధనే. అందుకే "మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు" (2తిమోతికి 2:13) అని రాయబడింది. దీనికి సంబంధించిన మరికొన్ని వాక్యభాగాలు చూడండి.

యిర్మీయా 31:31-34 ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్తనిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

హెబ్రీయులకు 10:16-18 ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయు దును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

ఈ నిబంధన ప్రకారం, తాను ఏర్పరచుకున్న వారిని ఆయనే రక్షించి పరలోకరాజ్యం చేరుస్తాడు.

1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.

హెబ్రీయులకు 10: 23 వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

ఈ నిబంధన మన క్రియలపై ఆధారపడి ఉండదు కానీ, మన రక్షణకు మన నీతి క్రియలు రుజువులుగా మాత్రం ఉంటుంటాయి (అబ్రాహాము తన నీతికి సున్నతి గురుతును పొందినట్టు "రోమా 4:11"). ఇందులో, మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన రెండు విషయాలు;

1. ఈ నిబంధన మానవుని క్రియలపై ఆధారపడి చెయ్యబడింది కాదు, ఇది దేవుడే కృపచేత చేసిన నిబంధన.

ఎఫెసీయులకు 2:8,9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

2. ఈ నిబంధన క్రిందకు వచ్చినవారు (రక్షించబడినవారు) తప్పకుండా దేవుడు సిద్ధపరిచిన క్రియలను చేస్తారు, నోవహులా లోకం నుండి ప్రత్యేకపరచుకుని దేవునితో నడుస్తారు (ఆజ్ఞలను గైకొంటారు) అవి వారి రక్షణకు గురుతులుగా ఉంటాయి.

ఎఫెసీయులకు 2:10 మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

ఈ నిబంధనలో ఉన్న వ్యక్తి పాపం చేస్తే ఆదాములా ఏదెనునుండి (దేవుని సన్నిధి) గెంటివెయ్యబడడు, ఇశ్రాయేలీయులలా నశించిపోడు కానీ, తండ్రిచేత క్రమశిక్షణ చెయ్యబడతాడు (శిక్షించబడతాడు), ఆ శిక్షలో మారుమనస్సు పొందుకుని పశ్చాత్తాపపడతాడు

హెబ్రీయులకు 12:6-8 ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.

1కోరింథీయులకు 11: 32 మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

మొదటి థెస్సలొనీకయులకు 5:23,24 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

ఈ అంశం (రక్షణ) గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

రక్షణ యెహోవాదే

ఆదికాండము 6:19,20

మరియు నీతోకూడ వాటిని బ్రదికించియుంచుకొనుటకు సమస్తజీవులలో, అనగా సమస్తశరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.

ఈ వచనాలలో, దేవుడు జలప్రళయంలో నశించిపోకుండా నోవహు కుటుంబంతో పాటుగా జీవరాశులను కూడా కాపాడబోతున్నట్టు మనం చూస్తాం. ఆయన ఇక్కడ ఆ జీవరాశుల విషయంలో నోవహుకు ఆజ్ఞాపిస్తున్నదానిని బట్టి, ఆయన మనిషికి సాధ్యం కాని భారాన్ని అతనిపై మోపడని అర్థమౌతుంది. ఎందుకంటే, ఆయన మొదటిగా కొన్ని జీవరాశులను జతలచొప్పున ఓడలోకి తెమ్మన్నాడు, కానీ అన్నిటినీ నోవహు తేలేడు. అందుకే అలాంటివి తమంతట తాముగా నీదగ్గరకు వస్తాయని తదుపరిమాటల్లో తెలియచేస్తున్నాడు.

అదేవిధంగా, నోవహు కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఓడను కట్టడం, అక్కడున్న ప్రజలందరి మూఢత్వంపైనా సాక్ష్యంగా ఉంది.‌ అంతేకాకుండా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా జంతువులన్నీ జతలు జతలుగా నోవహు దగ్గరకు వస్తున్నప్పుడు, అందులో‌ క్రూరమృగాలు కూడా ఉంటాయి కాబట్టి, ఆ దృష్యాన్ని చూస్తున్న ప్రజలు అది దేవుడు చేస్తున్న కార్యమని నమ్మే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పటికి కూడా వారు నమ్మలేదు, ఓడలోకి చేరలేదు. తన పాపం సంపూర్ణమైన మనిషి దేవుని కార్యాలు గుర్తించి, పశ్చాత్తాపడలేడని, దేవుని యొద్దకు రాలేడని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది.

1సమూయేలు 2: 25 ​నరునికి నరుడు తప్పుచేసిన యెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొఱ్ఱను వినకపోయిరి.

ద్వితియోపదేశకాండము 2:30 అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.

నిర్గమకాండము 8:19 శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.

ఆదికాండము 6:21

మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.

ఈ వచనంలో, నోవహు కుటుంబానికీ అతనితో ఓడలో ఉన్న జీవరాశులకూ ఆహారాన్ని సిద్ధపరచుకునే పనిని దేవుడు నోవహుకు అప్పగిస్తున్నట్టు మనం చూస్తాం. దీనిప్రకారం, మనం పైన వివరించుకున్నట్టుగా నోవహు కృపచేత చెయ్యబడిన నిబంధనలో ఉన్నప్పటికీ పనినుండి మినహాయించబడలేదు. ప్రతీ నిబంధనలోనూ దేవుని పని చెయ్యవలసిన‌ బాధ్యత మనిషిపై ఉంటుంది. కానీ ఆ పనిని బట్టి నిబంధన స్థిరపడడం, కొట్టివెయ్యబడడం మాత్రం జరగదు. ఈరోజు మనముందు కూడా దేవుడు ఆజ్ఞాపించిన పని ఎంతో‌ ఉంది. యేసుక్రీస్తు వలే మనమందరమూ ఆ పనిలో‌ నిమగ్నులమై యుండాలి.

యోహాను 17: 4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని.

ఫిలిప్పీయులకు 2: 21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

ఆదికాండము 6:22

నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

ఈ సందర్భంలో నోవహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తూ పూర్తిచేసినట్టు మనం చూస్తాం. ఓడకట్టడం, ఆహారాన్ని సేకరించడం, జీవరాశులను జతలు జతలుగా సమకూర్చడం ఇవన్నీ అతను పూర్తిచేసాడు. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం కచ్చితంగా చెప్పలేము కానీ, 3వ వచనం ప్రకారం; ఆయన ఆ ప్రజల ఆయుష్షు 120 యేండ్లు ఔతుందని నిర్ణయించాడు. ఆ అంతం నోవహు యొక్క వయస్సు ఆరువందల సంవత్సరం రెండవ నెలలో సంభవించింది (ఆదికాండము 7:11). దీనిప్రకారం దేవుడు జలప్రళయం ద్వారా భూమిని నాశనం చెయ్యాలని తీర్పు తీర్చేసరికి నోవహు వయస్సు 480 సంవత్సరాలు. అతను 500 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ముగ్గురు కుమారులను కన్నాడు (ఆదికాండము 5:32), ఆ తరువాత వారు పెద్దవారయ్యే సమయానికి అతను దేవుని చేత ఓడకట్టమని ఆజ్ఞాపించబడ్డాడు. ఎందుకంటే, ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడేటప్పుడు అతని కోడళ్ళ ప్రస్తావన కూడా తీసుకువచ్చాడు.

అదేవిధంగా, నోవహు ఓడను కడుతుండగా అప్పటిలోకం నుండి‌ అతనికి ఎన్నో విమర్శలు, అవమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటిప్రజలకు జలప్రళయం అంటే ఏంటో తెలియదు. కానీ నోవహు, వాటన్నిటిని బట్టి కృంగిపోలేదు, తన పనిని ఆపి వెయ్యలేదు. దేవునిపై విశ్వాసంతో ముందుకుసాగాడు. మనం కూడా, ఈలోకంలో దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవమానాలు, విమర్శలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటినీ నోవహులా జయించగలగాలి. మన నిబంధనకు ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు అనుభవించిన నిందలు, అవమానాలు, శ్రమలతో పోల్చుకున్నప్పుడు మనం అనుభవిస్తున్నవి ఏమాత్రం ఎంచతగినవి కావని గుర్తించి ముందుకు సాగాలి.

1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరును (కృపద్వారా తిరిగి జన్మించినవారు) లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.

హెబ్రీయులకు 12: 3,4 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.