పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gene9

9:1, 9:2,3, 9:4, 9:5, 9:6, 9:7, 9:8-11, 9:12, 9:13-17, 9:18,19, 9:20,21, 9:22-23, 9:24,25, 9:26,27, 9:28,29

ఆదికాండము 9:1
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.

ప్రారంభంలో దేవుడు ఈ భూమిపైన తొలి మానవులైన, ఆదాము హవ్వలతో ఈ మాటలు పలికినట్లు ఆదికాండము 1:28 వచనంలో మనకి కనిపిస్తుంది. ఈ సందర్భంలో నోవాహు కుటుంబానికి ఆయన నరుల పట్ల తన ప్రణాళికను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు.

ఆదికాండము 9:2,3
మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడియున్నవి.  ప్రాణముగల సమస్తచరములు మీకు ఆహారమగును; పచ్చని కూరమొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.

ఏదేనుతోటలో దేవుడు ఆదాము హవ్వలను చేసినపుడు వారి ఆహారం నిమిత్తం శాఖల గురించి తెలియచేసినట్లు ఆదికాండము 1:29 వచనాలలో‌ కనిపిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని చాలామంది బైబిల్ పండితులు, పై వచనం ప్రకారం జలప్రళయం తరువాత మాత్రమే నరులు మాంసాన్ని తినేలా దేవుడు ఆజ్ఞాపించాడని అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ అభిప్రాయం సరైనదిగా మనం భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నరహత్య చేయకూడదనే ఆజ్ఞ ప్రారంభతరం నుండీ ఉన్నట్లుగా కయీను విషయంలో మనకి అర్థమవుతుంది; అదే ఆజ్ఞను దేవుడు ఈ క్రింది సందర్భంలో నోవాహు కుటుంబానికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవిధంగానే జలప్రళయానికి ముందుకాలంలో కూడా నరులకు మాంసం తినడాన్ని ఆయన అనుమతించి, దానినే జ్ఞాపకం చేస్తూ ఉండవచ్చు.

అదేవిధంగా, దేవుడైన యెహోవా ఏదేనులో ఆదాముహవ్వలు తన దృష్టికి పాపులుగా మారినపుడు వారి తరఫున ఆయన ఒక జంతువుని చంపి వారికి చర్మపు చొక్కాయిలు చేసి ఇచ్చాడు. అప్పటినుండి పాపియైన మానవుడు దేవున్ని చేరుకోవాలంటే బలిద్వారా వారి పాపాలకు ప్రాయుశ్చితం అవసరమని నేర్చుకున్నారు. ఇది అప్పటినుండీ జరుగుతూ ఉన్నప్పటికీ, మోషే ధర్మశాస్త్రంలో వీటిగురించి ఒక క్రమాన్ని చూడగలం; ఆ క్రమం ప్రకారం బలియిచ్చినవారు ఆ జంతువులలో కొన్నిటి మాంసాన్ని తినాలి.

అదేవిధంగా, ఆదికాండము ఏడవ అధ్యాయం, ప్రారంభ వచనాల ప్రకారం నోవాహుకు దేవునికి ఇవ్వవలసిన బలినిమిత్తం ఆయన ఎన్నుకున్న పవిత్రజంతువులేవో తెలుసు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు పవిత్ర, అపవిత్రజంతువుల గురించి వివరించినపుడు, పవిత్ర జంతువులు తనకు బలిగా మాత్రమే కాకుండా వారికి ఆహారం కూడా అవుతున్నాయి. వీటి వివరణ నోవాహుకూ తెలిసిన కారణం చేత మాంసాన్ని తినే అలవాటును జలప్రళయం తరువాతనే దేవుడు వారికి కొత్తగా నేర్పించినట్లు మనం భావించలేము.

ఆదికాండము 9:4
అయినను మాంస మును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.

మోషే ధర్మశాస్త్రం‌లోనూ, పాతనిబంధనలో మరికొన్ని సందర్భాలలోనూ, ఈమాట మనకి పదేపదే కనిపిస్తూ ఉంటుంది.
ఈ సందర్భంలో రక్తము ప్రాణము అని చెప్పినంత మాత్రాన, రక్తంలో ప్రాణం ఉంటుందని కాదు కానీ, ప్రాణానికి ఈ రక్తం ఆధారంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి, అందుచేతనే కొన్నిసార్లు జీవుల(మనుషుల)నుండి వాటి(వారి) రక్తాన్ని బయటకు చిందించనప్పటికీ (పీకపిసకడం) తమ ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తుంటాం; దానికి సంబంధించిన ఆధారం చూడండి.

లేవీయకాండము 17: 14 - దానిరక్తము దాని ప్రాణమునకాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్షనొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

రక్తము సమస్తజీవుల ప్రాణానికీ ఆధారంగా ఉంటుందని అప్పటి ప్రజలకు అర్థమయ్యేలా తెలియచేసేందుకే ఆయన రక్తము ప్రాణము అని బైబిల్ లో పదేపదే చెప్పడం జరిగింది.

కొంతమంది దేవుడు రక్తాన్ని ఎందుకు తినకూడదు అనేదాన్ని వివరిస్తూ, రక్తము అనేది మానవుల పాపప్రాయశ్చిత్తం నిమిత్తం చిందించబడి బలిపీఠం మీద ప్రోక్షించబడుతుందనీ, యేసుక్రీస్తు చిందించిన రక్తానికి ఇది ఛాయగా ఉందనీ, దీన్నిబట్టి రక్తం దేవునికి సొంతమైంది కనుక దాన్ని మానవులు తినకూడదనే ఆజ్ఞ ఆయనిచ్చాడని చెబుతుంటారు. ఒకవేళ దేవుడు రక్తాన్ని తినకూడదని చెప్పడానికి కారణం ఇదే అయితే, పాతనిబంధన బలులన్నీ ఏ యేసుక్రీస్తు బలియాగానికి ఛాయగా, సూచనగా ఉన్నాయో, అది ముగిసిన పిమ్మట కూడా ఈ ఆజ్ఞ ఎందుకు కొనసాగుతుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది; దీనిగురించి నూతన నిబంధన కాలంలోనూ మనం ఆజ్ఞపించబడుతున్నాం చూడండి.

అపొ. కా. 15:28 - విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

ఈ సందర్భంలో మనం కూడా రక్తాన్ని తినకూడదని బైబిల్ చెపుతుంది. ఈ విధంగా మనం ఆలోచించినపుడు దేవుడు రక్తాన్ని తినవద్దనడానికి కారణం ఇది కాదని అర్థం అవుతుంది. అయితే, మనం రక్తాన్ని ఎందుకు తినకూడదని శాస్త్రీయంగా పరిశీలించగలిగితే, రక్తాన్ని fluid of life అని పిలుస్తారు. ఇది సమస్తజీవుల ప్రాణానికి ఆధారంగా ఉంటుంది, ఆ జీవుల్లో ఏదైనా రోగం ఉన్నపుడు దాని యొక్క మాంసంలో కంటే, రక్తంలోనే ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటపుడు ఆ రక్తాన్ని ఎవరైనా త్రాగితే/తింటే, ఆ వ్యక్తికి ఆ రోగం సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ కారణం చేతనే దేవుడు రక్తాన్ని తినవద్దని మన ఆరోగ్యం నిమిత్తం ఆజ్ఞాపించాడని మనం భావించవచ్చు.

ఆదికాండము 9:5
మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.

ఈ వచనాలలో, నరుని రక్తం సాటి నరుల ద్వారా చిందించబడినా, జంతువుల ద్వారా చిందించబడినా, ఆయన దాని విషయమై విమర్శ చేస్తానని తెలియచేస్తున్నాడు; ఈ మాటలకు కేవలం రక్తాన్ని చిందించడమనే భావం కాదు కానీ, ఒక నరున్ని ఏ విధంగా చంపినా, లేక అతన్ని బాధించినా, దేవుని న్యాయమైన విమర్శలో నిలబడి శిక్ష పొందక తప్పదని అర్థం వస్తుంది. దీని గురించి, హేబేలు రక్తం(హత్య) విషయంలో ఆయన కయీనును విమర్శించి శిక్ష విధించిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.

ఆదికాండము 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

ఈ సందర్భంలో, ఆయన నరుని రక్తాన్ని ఎందుకు చిందించకూడదో (చంపకూడదో) కారణం చెబుతున్నాడు. ఆదికాండము 1:27 వచనం ప్రకారం దేవుడు మానవులను తన పోలిక స్వరూపంలో చేసాడు, వారు దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా ఆ దేవుని పోలికకూ, స్వరూపానికీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ (ప్రవర్తిస్తున్నప్పటికీ) ఆయన ఇంకా ఈ నరులలో తన పోలిక, తన స్వరూపాన్ని చూస్తున్నాడు. అందుచేతనే వారిలో ఎవరిని చంపినా అది ఆయన పోలికకూ, స్వరూపానికీ వ్యతిరేకం అవుతుంది. ఇందుచేతనే నరహత్య చేయకూడదనే నియమాన్ని ఆయన ప్రవేశపెట్టాడు.

ఇందుకు భిన్నంగా చాలా మతగ్రంథాల్లో శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదనీ, శరీరంలో ఉన్న ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యత ఉందనీ, ఈ కారణం చేత శరీరాన్ని ఎవరైనా చంపినప్పటికీ పర్వాలేదు అన్నట్లుగా రాయబడింది. ఉదాహరణకు హిందువులు ప్రామాణిక గ్రంథంగా నమ్మే భగవద్గీత రెండవ అధ్యాయం (సాంఖ్య యాగము) లో ఇటువంటి మాటలే మనకి కనిపిస్తాయి. బైబిల్ గ్రంథమైతే ఇటువంటి తారతమ్యాన్ని బోధించకుండా, మనిషిని చంపడం మరణశిక్షకు తగిన నేరమని చెబుతుంది.

అదేవిధంగా, ఆ సందర్భంలో నరుని రక్తము చిందించినవాని రక్తము నరునివల్లనే చిందించబడునని దేవుడు పలుకుతూ, హత్య చేసినవారిపై న్యాయబద్ధంగా కొనసాగే తన శిక్షను తెలియచేస్తున్నాడు. ఈ న్యాయాన్ని అనుసరించే ఆయన నరహంతకులకూ, కౄరులకు మరణశిక్షను అమలు చేయడం మోషే ధర్మశాస్త్రంలోనూ, ఇతర లేఖనభాగాల్లోనూ మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 9:7
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.

ఈ సందర్భంలో, మరలా దేవుడు తన ఉద్దేశాన్ని నోవాహు కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాడు.

ఆదికాండము 9:8-11
మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.

ఆదికాండము 6:18 వచనాలలో, ఈ నిబంధన గురించి వివరించడం జరిగింది. దానిప్రకారం, మానవుడు స్వభావసిద్ధంగా పాపి కనుక, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరలా వారిని నాశనం చేయనని చెబుతున్నాడు. ఈ నిబంధన మానవుని చర్యలపైన ఆధారపడి లేదు. అలా అని మానవజాతి ఈ భూమిపైన నిత్యమూ ఉంటుందని అర్థం కాదు, క్రీస్తు రెండవ రాకడతో ఆయన మానవులనూ, ఈ సమస్త సృష్టినీ, కలిగించిన ఉద్దేశం నెరవేరుతుంది. ఆ తరువాత ఈ సమస్తసృష్టీ నాశనం అవుతుంది.

రెండవ పేతురు 3:6,7,10 - ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

ఆదికాండము 9:12
మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.

దేవుడు మానవులతో చేసిన కొన్ని నిబంధనల్లో, గురుతులు మనకి కనిపిస్తుంటాయి. ఉదాహరణకు - ఆదికాండము 17:10,11 నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధనయేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.  మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.

ఈ సందర్భంలో అబ్రాహాముతో దేవుడు నిబంధన చేసినపుడు, సున్నతి అనే గురుతును ఏర్పరిచినట్లు మనకి‌ కనిపిస్తుంది.

రోమీయులకు 4:11 - మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రియగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందక మునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

అదేవిధంగా, ఆయన ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినపుడు కూడా, మోషే ధర్మశాస్త్రంలోని విశ్రాంతిదినం వంటి ఆచారసంబంధమైన ఆజ్ఞలు వారికి గురుతులుగా ఉన్నాయి.

ఆదికాండము 9:13-17
మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగానుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్తశరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములోనుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

ముందటి వచనాలలో దేవుడు నోవాహు సంతానంతో చేసిన నిబంధనకి గురుతును ఏర్పరిచానని చెబుతూ, ఈ వచనాలలో ఆ గురుతు మేఘంలో కనిపించే ధనస్సుగా ఆయన తెలియచేస్తున్నాడు. ఇప్పటికీ కూడా, వర్షం వచ్చేటపుడు మేఘంలో ఈ ధనస్సు మనకి రంగులుగా కనిపిస్తుంది. ఇది ఏ విధంగా రంగులుగా ఏర్పడుతుందో మనకి శాస్త్రప్రపంచం తెలియచేస్తుంది కానీ ఎప్పటినుండి, ఎందుకు ఏర్పడిందో బైబిల్ తెలియచేస్తుంది.

ఆదికాండము 9:18,19
ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

నోవాహు కుమారుల ద్వారా భూమియంతటా వ్యాపించిన జాతుల‌ వివరాలు పదవ అధ్యాయంలో మనం వివరంగా చూద్దాం. అయితే ఈ వచనంలో ఓడలోనుండి వచ్చిన నోవాహు కుమారుల పేర్లను రచయిత తెలియచేస్తూ, ఆ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడైన హాముకు పుట్టిన కానాను పేరును ప్రస్తావించాడు; దీని గురించి క్రింది భాగంలో చూద్దాం.

ఆదికాండము 9:20,21
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.

కొంతమంది అభిప్రాయం ప్రకారం, జలప్రళయం తరువాత భూమిపైన సంభవించిన మార్పులవల్లే, ఆ ద్రాక్షరసం మత్తుగా మారిందనీ, నోవాహు తెలియకనే దాన్ని పానం చేసాడని చెబుతుంటారు. ఇది వాస్తవం అనడానికి మనకి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, పాతనిబంధన ప్రజల అహారాపు అలవాట్లలో ద్రాక్షరసం త్రాగడం అనేది ఒక భాగంగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా, ఈ సందర్భంలో నోవాహు ద్రాక్షరసాన్ని మత్తుకలిగేదాకా త్రాగి, వస్త్రహీనుడయ్యాడు. బైబిల్ గ్రంథం మత్తుకు దూరంగా ఉండమని ఆజ్ఞాపించడానికి ఇదొక కారణంగా కనిపిస్తుంది.

ఎఫెసీయులకు 5: 18 - మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.

ఆదికాండము 9:22-23
అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమయిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.

ఈ వచనాలలో మొదటిగా నోవాహు చిన్నకుమారుడైన హాము చేసినదాన్ని మనం పరిశీలించగలిగితే, తన తండ్రిని పొరపాటున వస్త్రహీనుడిగా చూడడం అతని తప్పుకాదు కానీ, చూసిన పిదప అతన్ని కప్పకుండా, తన సహోదరుల యొద్ద ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, తన తండ్రియొక్క గౌరవాన్ని భంగం చేసేలా ప్రవర్తించాడు, ఒకరకంగా తన తండ్రిని అవహేళన చేసాడు. దీనివల్ల అతను శాపగ్రస్తునిగా తీర్చబడ్డాడు.

అయితే అతని సోదరులు తమ తండ్రికి కలిగిన ఆ అవమానకరమైన పరిస్థితిని కప్పే ప్రయత్నం చేసి, అతన్ని వస్త్రములు లేకుండా చూస్తే మరలా‌ తన తండ్రి గౌరవానికి భంగం కలుగుతుందేమో అనే ఆలోచనతో వెనకతట్టుగా వెళ్లి ఆ పని పూర్తి చేసారు.

ఆదికాండము 9:24,25
అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

ఈ సందర్భంలో మత్తు నుండి‌ మేలుకున్న‌ నోవాహు, హాము చేసిన పని నిమిత్తం అతన్ని శపిస్తున్నట్లుగా చూడగలం; అయితే ఈ సందర్భంలో నోవాహు హాము పేరును కాకుండా అతని కుమారుడైన కానాను పేరునే ప్రస్తావిస్తున్నాడు, హాముకు మిగిలిన కుమారులు కూడా ఉన్నారు.

ఆదికాండము‌ 10:6 - హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

ఇందులో, కానాను అనేవాని నుండే, ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్న కానాను ప్రాంతంలోని జాతులు విస్తరించాయి; ఈ ఆదికాండపు చరిత్రనంతటినీ మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆ కానాను ప్రాంతానికి తీసుకెళ్లే మార్గమధ్యలో రాస్తున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలంతా ఏ కానాను జాతివారినైతే నాశనం చేసి వారి దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నారో, వారిలో చావగా మిగిలినవారిని దాసులుగా మార్చుకోబోతున్నారో, ఆ జాతివారంతా హామును బట్టి శాపగ్రస్తులనీ, దేవుని ప్రజలకు విరోధులని తెలియచేసేందుకు మోషే అతని పేరును మాత్రమే పైభాగంలో కూడా ఉద్దేశపూర్వకంగా ఆత్మప్రేరణతో ప్రస్తావించాడు; నోవాహు కూడా ఆ పేరునే ప్రాముఖ్యంగా ఎత్తిచూపాడు. ఆ శాపగ్రస్తుల దుర్మార్గచర్యలన్నిటినీ, లేవీకాండము, ద్వితీయోపదేశకాండములో మనం వివరంగా చూడగలం. యెహోషువ కాలంలో చావగా మిగిలిన కానానీయులు కొందరు ఇశ్రాయేలీయులకు దాసులుగా మారారు, దీనివల్ల నోవాహు చెప్పిన మాట నెరవేరింది.

యెహోషువ 9: 23 ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.

అదేవిధంగా, నోవాహు కానానును (హాము సంతానాన్ని) శపించినప్పుడు, అది నెరవేరడానికి కొన్నివందల సవత్సరాల సమయం పట్టింది; ఈమధ్య కాలంలో వారు ఎంతగానో బలమైన జనంగా విస్తరించినట్లు మోషే రాసిన ఈ పుస్తకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్నిబట్టి మనమొక విషయాన్ని గుర్తించాలి, దేవుని ప్రజలకు విరోధులైన శాపగ్రస్తులు ఎంతగా ప్రబలినప్పటికీ, దేవుడు ఏర్పరచిన సమయంలో వారికి నాశనం తప్పదు.

కీర్తనల గ్రంథము 37:1,2,9,10,12-15
చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

ఆదికాండము 9:26,27
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

ఈ సందర్భంలో, నోవాహు తన కుమారులైన షేము, యాపేతులు చేసిన మంచిని బట్టి, దేవునిని స్తుతిస్తున్నాడు, అతను ఆ విధంగా చేయడంలో ఉన్న‌ ఉద్దేశం ఏమిటంటే సమస్త మంచికీ మూలం దేవుడే, మంచి చేయాలనే ప్రేరణ ఆయననుండే అందరికీ కలుగుతుంది.

మత్తయి సువార్త 5:16 - మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

ఈ షేము సంతానం నుండే, విశ్వాసులకు తండ్రిగా పేరుపొందిన అబ్రాహాము, విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడైన యేసుక్రీస్తు జన్మించాడు. యాపెతు అతని గుడారంలో నివసిస్తాడు అన్నపుడు వారిరువురి సంతానాలు ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని కలిగియుంటాయనే అర్థం వస్తుంది. అదేవిధంగా, హాము సంతానంలో‌ కానాను మాత్రమే కాకుండా అతని సంతానమంతా శపించబడింది అనడానికి ఈ సందర్భం కూడా సాక్ష్యంగా ఉంది. ఇక్కడ షేము గుడారంలో యాపెతు నివశిస్తున్నాడే తప్ప, హాము, మిగిలిన కుమారుల ప్రస్తావన లేదు. దీన్నిబట్టి, హాము సంతానాన్ని అంతా నోవాహు శపించినప్పటికీ, ఇశ్రాయేలీయులు యుద్ధం చేయబోయే కానానీయుల నిమిత్తమే కానాను పేరును మోషే, నోవాహులు ప్రాముఖ్యంగా ప్రస్తావించారని మరోసారి స్పష్టం అవుతుంది. ఇశ్రాయేలీయులను 215 సవత్సరములు బానిసలుగా బాధపెట్టిన ఐగుప్తీయులు ఈ హాము కుమారుల్లో మిస్రాయీము నుండి వచ్చినవారే.

ఆదికాండము 9:28,29
ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబదియేండ్లు బ్రదికెను. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

జలప్రళయం తరువాత ఈభూమి పైన ఎక్కువకాలం బ్రతికిన వ్యక్తిగా నోవాహు మనకి కనిపిస్తున్నాడు.

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.