పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

47:1,2, 47:3, 47:4, 47:5,6, 47:7, 47:8,9, 47:10, 47:11, 47:12, 47:13,14, 47:15-17, 47:18,19, 47:20-25, 47:26, 47:27, 47:28, 47:29,30, 47:31

ఆదికాండము 47:1,2
యోసేపు వెళ్లి ఫరోను చూచినా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులోనున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.

ఈ వచనాలలో యోసేపు ఫరోమాట ప్రకారమే తన కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించినప్పటికీ వారు రాగానే మరలా ఆ విషయం ఫరోకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈవిధంగా యోసేపు తనకున్న అధికారాన్ని‌ బట్టి తన ఇష్టానుసారంగా నడచుకోకుండా ఆ దేశపు రాజైన ఫరోకు లోబడుతున్నాడు.

రోమీయులకు 13: 1 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను. ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడియున్నవి.

అదేవిధంగా ప్రస్తుతం యోసేపు ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగానూ ఐగుప్తు దేశంలో ప్రముఖ అధికారిగానూ విలసిల్లాడు. అయినప్పటికీ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సహోదరుల విషయంలో సిగ్గుపడకుండా వారిని తక్కువగా చూడకుండా ఫరోకు వారిని పరిచయం చేస్తున్నాడు. ప్రభువగు యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడైయుండి ఈలోకంలో దైవమానవుడిగా తన మానవబంధాలను గౌరవించాడు. ఇప్పుడు కూడా ఆయన అయోగ్యులమైన మనలను కేవలం‌ తన తండ్రి నిర్ణయాన్ని‌ బట్టి సహోదరులని పిలుస్తున్నాడు.

హెబ్రీయులకు 2:11,12 పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.

కాబట్టి మనం కూడా మన బంధువుల‌ విషయంలోనూ మన సంఘస్థుల విషయంలోనూ వారి స్థాయిని‌బట్టి సిగ్గుపడకుండా వారిని మనవారిగా గుర్తించాలి కేవలం సంబంధాన్ని బట్టి తగినవిధంగా గౌరవించాలి.

ఆదికాండము 47:3
ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారునీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.

ఈ వచనంలో ఫరో యోసేపు సహోదరులను వారి వృత్తి ఏంటని ప్రశ్నించినప్పుడు వారు గతంలో యోసేపు చెప్పినట్టే తాము గొఱ్ఱెల కాపరులమని ఒప్పుకోవడం మనకు చూస్తాం. మన సమాజంలో కొన్ని వృత్తులవారిని చులకనగా చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది కానీ బైబిల్‌ బోధలో సోమరిగా ఉండడం మాత్రమే తప్పు కానీ జీవనోపాధి కోసం ఏ వృత్తి చేసినా అది గౌరవించదగిందే.

1 థెస్సలొనికయులకు 4: 11 సంఘమునకు వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగియుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

ఆదికాండము 47:4
మరియు వారు కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా-

ఈ వచనంలో యోసేపు సహోదరులు ఫరోకు ఇచ్చిన సమాధానం ప్రకారం; ఇప్పుడు వారి తమ్ముడు ఆ దేశానికి ప్రధానిగా ఉన్నాడు కాబట్టి ఆ దేశపు సమృద్ధిలో శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశం వారిలో కనిపించడం లేదు. అందుకే వారు కనాను దేశంలోని కరవు వల్ల కొంతకాలం మాత్రమే ఇక్కడ‌ ఉండడానికి వచ్చామని చెబుతున్నారు. ఎందుకంటే దేవుడు వారి పితరులకు కనాను దేశాన్ని వాగ్దానం చేసాడని వారికి తెలుసు. అందుకే వారు ఆ వాగ్దానదేశాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని అనుకోవడం లేదు.

ఆదికాండము 47:5,6
ఫరో యోసేపును చూచినీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు. ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను.

ఈ వచనాలలో ఫరో యోసేపు తనకూ తన దేశానికీ చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా కేవలం అతని కుటుంబాన్ని తన దేశంలో నివసింపచెయ్యడమే కాకుండా అతని సహోదరులలో ఎవరైనా ప్రజ్ఞగలవారుంటే తన మందలపై వారిని నియమించమని కూడా చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఫరో జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ వచ్చినవారు యోసేపు సహోదరులు కాబట్టి వారిని తన మందలపై నియమించడం లేదు. వారికున్న ప్రజ్ఞను బట్టే నియమించమంటున్నాడు. కాబట్టి పనిలో ప్రజ్ఞ కలిగినవారు మాత్రమే ఎక్కడైనా ప్రతిఫలం‌ పొందుకుంటారు.

సామెతలు 22: 29 తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

అదేవిధంగా ఫరో యోసేపును ఎంతగా నమ్ముతున్నాడో ఇక్కడ ఆయన పలికిన మాటల్లో కూడా మరోసారి మనకు అర్థమౌతుంది. వారిలో ఎవరైన ప్రజ్ఞగల వారుంటే వారిని నామందలపై నియమించమని ఫరో ఆ బాధ్యతను కూడా యోసేపుకే అప్పగిస్తున్నాడు ఒకవేళ వారిలో ప్రజ్ఞగలిగినవారు లేకపోయినా బంధుప్రీతితో యోసేపు వారికే‌ మందలను అప్పగిస్తాడేమో అని సందేహించి ఆ పనికోసం వేరేవారిని ఏర్పాటు చెయ్యడం లేదు. ఫరో యోసేపును ఇంతగా నమ్మడానికి అతను అధికారిగా నియమించబడిననాట నుండీ కనపరచిన యథార్థతే కారణం.

ఆదికాండము 47:7
మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతనినుంచగా యాకోబు ఫరోను దీవించెను.

ఈ వచనంలో యాకోబు అన్యుడైన ఫరోను అతడి శ్రేయస్సు కోరుతూ దీవించడం మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫరో యాకోబు కుటుంబానికి‌ మేలు చేస్తున్నాడు కాబట్టి అతని శ్రేయస్సు కోరుకోవడం అతని బాధ్యత. కాబట్టి విశ్వాసులమైన మనం అన్యులనే కారణంతో మనకు మేలు చేసినవారి క్షేమం కోసం ప్రార్థన చెయ్యకుండా ఉండకుండా దానితో పాటు వారి రక్షణకోసం కూడా ప్రార్థిస్తూ ఉండాలి. పౌలు ఐతే చివరికి సువార్తకు శత్రువులుగా వ్యవహరిస్తున్న యూదుల రక్షణకోసం కూడా ఎంతో ప్రార్థించాడు.

రోమీయులకు 10:1 సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి.

ఆదికాండము 47:8,9
ఫరోనీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబునడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూటముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి-

ఈ వచనంలో ఫరో అడిగిన ప్రశ్నకు యాకోబు మొదటిగా తన జీవితకాలాన్ని ఒక యాత్రగా వర్ణించడం మనం చూస్తాం. యాకోబు మాత్రమే కాదు కానీ అబ్రాహాము ఇస్సాకులు కూడా తమ జీవితాన్ని ఒక యాత్రగానే చూసారు (హెబ్రీ 11: 13) వాగ్దానదేశానికి రాజుగా నియమించబడిన దావీదు కూడా ఇలాంటి మాటలే పలికాడు (1 దినవృత్తాంతములు 29:15, కీర్తనలు 119: 19). ఎందుకంటే మన శాశ్వతమైన లోకం పరలోకమే. ఈ భూమిమీద మనమంతా పరదేశులం, ఆ లోకం వైపుగా పయనిస్తున్న యాత్రికులం (ఫిలిప్పీ 3: 20) కాబట్టి విశ్వాసులు ఈలాంటి నిరీక్షణతోనే జీవించగలగాలి, ఈలోకంలో‌ ఉన్నదేదీ తమకు శాశ్వతమని భావించకూడదు (1 కోరింథీ 7: 31).

ఇక రెండవదిగా యాకోబు ఫరోకు ఇచ్చిన సమాధానంలో తన 130 సంవత్సరాలూ దుఃఖసహితమైనవిగా గడిచాయని చెబుతున్నాడు. యాకోబు చరిత్రను మనం‌ పరిశీలించినప్పుడు అతను ఏశావును మోసగించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాక తనను ఎంతగానో ప్రేమించిన తల్లికి దూరంగా లాబాను దగ్గరకు పారిపోయాడు. అక్కడ లేయా విషయంలోనూ తన జీతం విషయంలోనూ మోసగించబడ్డాడు. కనానుకు తిరిగి వచ్చాక దీనా అత్యాచారం విషయంలో బాధపడ్డాడు, రూబేను తన ఉపపత్నితో శయనించినప్పుడు వేదనపడ్డాడు. అంతమాత్రమే కాకుండా బేతేలుకు వెళ్ళి తిరిగివచ్చేటప్పుడు తాను‌ ఎంతగానో ప్రేమించిన రాహేలు బెన్యామీనును‌ కంటూ చనిపోవడం చూసాడు. తన కుమారులు యోసేపును ఐగుప్తుకు‌ అమ్మివేసి అతను దుష్టమృగం చేత చంపబడ్డాడని చెప్పినప్పుడు గతంలో కంటే భరించలేని వేదనకు లోనయ్యాడు. దేవునిచేత విశేషంగా ఆశీర్వదించబడిన యాకోబు జీవితంలోనే ఇలాంటి వేదనకరమైన సంఘనలు జరిగితే విశ్వాసులు‌ అనగానే వేదనలకూ కష్టాలకూ మినహాయింపు కాదని మనం గుర్తించాలి. ఆయన కొన్నిసార్లు అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లోనే మనల్ని పరిపూర్ణులను చేస్తూ మన యాత్రను కొనసాగించేలా చేస్తాడు. మన యాత్ర ముగిసిన రోజు ఆయన మనకిచ్చే నిత్యసంతోషం ముందు ఈ శ్రమలన్నీ ఏమాత్రం‌ లెక్కలోకి రావు.

రోమీయులకు 8:17,18 క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

ఆదికాండము 47:10
ఫరోను దీవించి ఫరోయెదుట నుండి వెళ్లిపోయెను.

ఈ వచనంలో అన్యుడైన ఫరోను దీవించడానికి యాకోబు ఏవిధంగా ఐతే వెనుకాడలేదో అదేవిధంగా ఫరో కూడా యాకోబు దీవెనను స్వాగతించడం మనం చూస్తాం. ఎందుకంటే అతడు అన్యుడైనప్పటికీ యోసేపును బట్టి యాకోబు కుటుంబం‌ నమ్మే దేవుడు ఎంత శక్తివంతుడో బాగా గ్రహించాడు.

ఆదికాండము 47:11
ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.

ఈ వచనంలో‌ యోసేపు తన కుటుంబాన్ని నివసింపచేసిన రామసేసు అనే ప్రదేశాన్నే గోషెను అని కూడా పిలిచారు (ఆదికాండము 45:10, 47:27).

ఆదికాండము 47:12
మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

ఈ వచనంలో యోసేపు తన దగ్గర ఉన్న సమృద్ధిని బట్టి తన కుటుంబానికి అవసరానికి మించి ఆహారాన్ని వృథా చెయ్యకుండా వారికి కావలసినంత మట్టుకే లెక్కచొప్పున ఆహారం ఇస్తున్నట్టు మనం చూస్తాం. దీనిని బట్టి ప్రతీ కుటుంబ యజమానీ అధికారి తమ కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అవసరానికి మించిన వనరులను వెచ్చించి వాటిని వృథా చెయ్యకూడదనే పాఠాన్ని నేర్చుకోవాలి.

ఆదికాండము 47:13,14
కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చినవారికి ధాన్యమమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.

ఈ వచనాలలో కాలం గడచేకొద్దీ కరవు ప్రభావం ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ‌ విపరీతంగా ఉండడం, యోసేపు ముందుగా సమకూర్చిన ధాన్యాన్ని అమ్మడం ద్వారా వచ్చిన ధనాన్ని అంతా ఫరో నగరులోకి తెప్పించడం‌ మనం చూస్తాం. ఇక్కడ యోసేపు తన జ్ఞానాన్ని‌ బట్టే ఆ ధనాన్ని సమకూర్చినప్పటికీ దానినుండి ఏమీ తీసుకోకుండా ఆ దేశపు రాజు ఖజానాలోకి తెప్పించాడు. కరవు ప్రభావం తగ్గిన తరువాత మరలా‌ ఐగుప్తు దేశం అభివృద్ధి చెందడానికి ఆ ధనం ఉపయోగపడుతుంది.

ఆదికాండము 47:15-17
ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెలను మందలను పశువులను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

ఈ వచనాలలో ఐగుప్తు ప్రజలు తమ దగ్గర ఉన్న ధనం అంతటితోనూ ధాన్యాన్ని కొనుక్కున్న తర్వాత ఇక వారి దగ్గర ఏమీ లేనప్పుడు యోసేపు వారి పశువులకు ప్రతిగా వారికి ఆహారం ఇవ్వడం మనం చూస్తాం. అ పశువులు వారి దగ్గర ఉన్నప్పటికీ వారికి వాటివల్ల ఏ ప్రయోజనం‌ ఉండదు పైగా వాటితో పాటు వారు కూడా ఆకలితో నశిస్తారు, అందుకే యోసేపు ఈవిధంగా చేసాడు.

ఆదికాండము 47:18,19
ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతనియొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము. ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు. నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి.

ఈ వచనాలలో ఐగుప్తీయులు యోసేపు దగ్గరకు వచ్చి వారికి తమ భూములకు ప్రతిగా ఆహారం ఇవ్వమని వేడుకోవడం మనం చూస్తాం. ఇక్కడ వారి పరిస్థితిని మనం ఆలోచిస్తే వారిదగ్గర భూములున్నాయి, పశువులున్నాయి కానీ వాటివల్ల ప్రస్తుతం వారికి ఏ ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు మనుషులకు ప్రకృతి ద్వారా అనుగ్రహిస్తున్న ప్రాణాధారమైన ఆహారం లేకపోతే మనుషుల దగ్గర ఏమున్నా అది వారిని బ్రతికించలేదు. కాబట్టి ప్రతీ మనిషీ దేవునిపై ఆధారపడాలి.

అపో. కార్యములు 14:17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.

ఆదికాండము 47:20-25
అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను. అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు. పొలములలో విత్తుడి. పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము. ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.

ఈ వచనాలలో యోసేపు ఐగుప్తీయుల మాటప్రకారం వారినీ వారి భూములనూ కొని‌ వారికి ఆహారాన్ని విత్తనాలకూ ఇవ్వడం‌ మనం చూస్తాం. ఇక్కడ యోసేపు వారి భూములనూ వారినీ ఫరో కోసం కొన్నప్పటికీ వారి విషయంలో అన్యాయంగా ప్రవర్తించడం లేదు. అందుకే ఆ భూమి నుండి వచ్చేపంటలో నాలుగు భాగాలు వారే తీసుకుని ఒక భాగం మాత్రమే ఫరోకు ఇమ్మంటున్నాడు. అది కూడా ఐగుప్తు దేశపు అభివృద్దికే ఉపయోగపడుతుంది. అందుకే యోసేపు వారి భూములను కొని అందులో పండే పంట నుండి ఒక భాగం ఫరోకు ఇవ్వాలని ఆజ్ఞాపించినప్పుడు వారు అతనికి కృతజ్ఞతలు చెబుతున్నారే తప్ప నిందించడం లేదు.

ఆదికాండము 47:26
అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.

ఈ వచనం ప్రకారం యోసేపు ఆనాడు చేసిన ఈ కట్టడ అప్పటినుండి ఈ చరిత్రను రాస్తున్న మోషేకాలం వరకూ కొనసాగుతూనే ఉంది. ఐగుప్తులో రాజకుమారుడిగా పెంచబడిన మోషేకు విషయం బాగా తెలుసు కాబట్టి (నిర్గమకాండము 2:10, హెబ్రీ 11:24-27), ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.

ఆదికాండము 47:27
ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాముకూ ఇస్సాకుకూ యాకోబుకూ చేసిన వాగ్దానం ప్రకారం (ఆదికాండము 15:4,5, 26:3,4, 28:14, 46:3), ఇశ్రాయేలీయులు అతి తక్కువకాలంలోనే ఐగుప్తు దేశంలో బాగా విస్తరించడం మనం చూస్తాం.

ఆదికాండము 47:28
యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.

ఈ వచనంలో యాకోబు బ్రతికిన సంవత్సరాల గురించి రాయబడడం మనం చూస్తాం. గతంలో‌ ఈ యాకోబు తనకుమారుడైన యోసేపు బ్రతికేయుండి ఐగుప్తును పరిపాలిస్తున్నాడని తెలిసినప్పుడు నేను చనిపోకముందే నా కుమారుడిని చూస్తానంటూ ఎంతో తాపత్రయపడ్డాడు. కానీ అతను యోసేపుతో కలసి ఐగుప్తులో 17 సంవత్సరాలు ఆనందంగా బ్రతికేలా దేవుడు కృప చూపించాడు.

ఆదికాండము 47:29,30
ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించినా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు తనను ఐగుప్తులో కాకుండా కనాను దేశంలో పాతిపెట్టమని యోసేపు చేత ప్రమాణం చేయించుకునే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. కనాను దేశం దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం‌ చేసిన దేశం కాబట్టి వారందరూ అక్కడే పాతిపెట్టబడాలని ఆసక్తి చూపించారు.

అదేవిధంగా ఇక్కడ యాకోబు యోసేపుచేత ప్రమాణం చేయించుకునేటప్పుడు నీ చెయ్యిని నా తొడక్రింద పెట్టమనడం మనం చూస్తాం. ఇది ప్రమాణాలు చేసుకోవడంలో అప్పటి ప్రజలు అనుసరించిన ఒక పద్ధతి. దీనిగురించి ఇప్పటికే‌ నేను అబ్రాహాము ఎలీయెజెరుల సందర్భంలో వివరించాను (ఆదికాండము 24:9 వ్యాఖ్యానం చూడండి).

ఆదికాండము 47:31
అందుకతడు నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను.

ఈ వచనంలో యోసేపు తన మాటకు సమ్మతించి ప్రమాణం చెయ్యడం చూసిన యాకోబు చివరిగా దేవునికి నమస్కారం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు నిరీక్షణ పరలోకమే.

హెబ్రీయులకు 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునైయున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.