పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

 ఆదికాండము 44:1-3

యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పినమాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.

ఈ సందర్భంలో యేసేపు గతంలో చేసినట్టుగానే వారివారి ఆహార పదార్థాలు ఉన్న గోనెలలో వారు తీసుకువచ్చిన ధనాన్ని వేయించడం, బెన్యామీను గోనెలో అయితే వెండి గిన్నెను కూడా పెట్టించడం మనకు కనిపిస్తుంది. యేసేపు ఇదంతా వారిని పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని ఈ చరిత్ర అంతటిలో మనకు అర్థమౌతుంది. యేసేపు ఈ విధంగా మంచి ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడే తప్ప వారిని అన్యాయంగా శిక్షించాలనే ఉద్దేశంతో చెయ్యడం లేదు కాబట్టి దానిని మనం తప్పుపట్టలేము కానీ ఎవరైనా అవతలివారిని అన్యాయంగా ఇబ్బందిపెట్టాలని ఇలా చేస్తే మాత్రం అది దేవుని దృష్టికి ఘోరపాపం ఔతుంది.

ఆదికాండము 44:4,5

వారు ఆ పట్టణము నుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల? దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.

ఈ సందర్భంలో వారిపై మోపబడుతున్న ఆరోపణ ఎంత దారుణమైనదో తెలియచెయ్యడానికి యేసేపు ఈవిధంగా వారితో తన గృహనిర్వాహకుడి ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు.

ఆదికాండము 44:6-9

అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసికొనివచ్చితిమి; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగానుందుమని అతనితో అనిరి.

ఈ సందర్భంలో యేసేపు అన్నలు ఆ తప్పు వారు చెయ్యలేదు కాబట్టి, పైగా గతంలో యేసేపు తమ గోనెల్లోకి వేయించిన ధనాన్ని కూడా వారు తిరిగి తీసుకుని వచ్చి అప్పగించారు కాబట్టి ఇంత ధైర్యంగా సమాధానం చెబుతున్నారు. నిజాయితీని అనుసరించేవారు ఎవరిముందైనా‌ ఇటువంటి ధైర్యాన్ని చాటుకుంటారు. గతంలో యాకోబు కూడా తన మామయైన లాబానుతో వాదించినప్పుడు అతను నిజాయితీగా పనిచేసాడు కాబట్టి ధైర్యంగా వాదించగలిగాడు.

ఆదికాండము 44:10-14

అందుకతడు మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతనియెదుట నేలను సాగిలపడిరి.

ఈ సందర్భంలో యేసేపు అన్నలు ఆ గృహనిర్వాహకుడితో పలికిన మాటల ప్రకారం తమ‌ గోనెలను తెరచి చూపించినప్పుడు అందులో వారు తీసుకువచ్చిన ధనంతో పాటు బెన్యామీను గోనెలో యేసేపు వెండిగిన్నె దొరకడం. వారు బెన్యామీను విషయమైన ఆందోళనతో యేసేపు ముందుకు వచ్చి సాగిలపడడం మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 44:15

అప్పుడు యోసేపుమీరు చేసిన యీ పనియేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా-

ఈ సందర్భంలో యేసేపు తన అన్నలతో నావంటి మనుష్యుడు శకునం చూస్తాడని మీకు తెలియదా అంటూ తన హోదాను బట్టి ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుని పిల్లలు శకునం చూడడం పూర్తి నిషేధం.

సంఖ్యాకాండము 23:23 నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును.

దేవుని కుమారుడైన యేసేపు శకునం చూసే దైవవిరుద్ధమైన కార్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడడు. బెన్యామీను గోనెలో అతని వెండిపళ్ళెం ఉందనే సంగతి అతను శకునం చూడడం వల్ల తెలియలేదు కానీ, అతనే దానిని ఆ గోనెలో పెట్టించాడు కాబట్టి తెలిసింది. మరి యేసేపు ఎందుకిలా మాట్లాడుతున్నాడంటే అతను వారికి ఒక ఐగుప్తీయునిలా కనపరచుకుంటున్నాడు ఐగుప్తీయులు శకునాలు చూస్తారు ఫరో పేరిట ప్రమాణం చేస్తారు. అందుకే యేసేపు కూడా గత అధ్యాయంలో ఫరో జీవము తోడనే మాటలను ఉచ్ఛరించాడు.

ఆదికాండము 44:16,17

యూదా యిట్లనెను ఏలినవారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవారికి దాసులమగుదుమనెను. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగానుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా-

ఈ సందర్భంలో యూదా యేసేపుతో పలికిన మాటలు అందుకు యేసేపు ఇచ్చిన ప్రత్యుత్తరం మనకు కనిపిస్తుంది. గతంలో యేసేపు తన అన్నలకు తనకు వచ్చిన కలను చెప్పినపునపుడు నిశ్చయముగా నీవు మమ్మును ఏలెదవా అని పగబట్టినవారు ఇక్కడ ఆ కల నెరవేర్పుగా మేము నీకు దాసులం ఔతామని ఒప్పుకుంటున్నారు.

దానికి యేసేపు ఒప్పుకోకుండా బెన్యామీను మాత్రమే తనకు దాసుడిగా ఉండాలని పట్టుబడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, గతంలో యాకోబు వారందరికంటే యేసేపును‌ ఎక్కువగా ప్రేమిస్తున్నాడనే అసూయతోనే వారు అతడిని చంపే ప్రయత్నం చేసి చివరికి అమ్మివేసారు. ప్రస్తుతం అతని స్థానంలో బెన్యామీను ఉండి యాకోబు చేత అందరికంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు. ఒకవేళ వారిలో ఎటువంటి మార్పు లేకుండా ఇంకా అలాంటి అసూయతోనే ఉండుంటే మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్ళండి, బెన్యామీనును ఇక్కడ విడిచిపెట్టండని యేసేపు చెప్పినపుడు వారు తప్పకుండా వెళ్ళిపోయి ఉండేవారు. యేసేపు అది తెలుసుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు. క్రింది‌ వచనాలలో యూదా పలికిన మాటలవల్ల అతనికి ఆ సందేహం నివృత్తి చెయ్యబడి తన అన్నలు ఇదివరకటిలా కాకుండా మార్పు చెందారనే నిశ్చయతను పొందుకున్నాడు.

ఆదికాండము 44:18-34

యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలినవారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా ఏలినవాడు మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితిమి. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితిమి. మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండినయెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతోనుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చబడెననుకొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొనియున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము. తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము. ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

ఈ సందర్భంలో యూదా గతంలో జరిగిన చరిత్రనంతటినీ యేసేపుకు వివరిస్తున్నాడు. గతకాలపు యూదా జీవితంలో యేసేపును అమ్మివేసిన విషయంలోనూ, తామరు విషయంలోనూ మనం లోపాలను గుర్తించాం. కానీ ఇక్కడ యూదా పలుకుతున్న మాటలలో అతను మార్పుకు గురయ్యాడని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో యేసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అతనిపై అసూయపడినవారిలో ఇతను కూడా ఉన్నాడు కానీ ఇక్కడ బెన్యామీను విషయంలో మాత్రం తన తండ్రి చూపుతున్న ప్రేమను బట్టి అలాంటి అసూయకు లోనవ్వడం లేదు, పైగా దానికి కారణం అతను వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడవ్వడమే అని అర్థం చేసుకున్నాడు.

ఇక్కడ అతను బెన్యామీనును మరలా యాకోబు దగ్గరకు తీసుకుని వెళ్ళకపోతే తనపై నింద వస్తుందనే కాకుండా తన తండ్రికి కలిగే అపాయాన్ని కూడా చూడలేననే కారణంతో ఈవిధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి గతంలో కఠినంగా ప్రవర్తించినవారు ఎప్పుడూ మార్పుచెందకుండా అలానే ఉంటారని మనం భావించకూడదు. ఇక్కడ యూదా విషయంలో ఆ మార్పునే మనం చూస్తున్నాం. ప్రభువగు యేసుక్రీస్తు జన్మించబోయే గోత్రానికి ఇతను మూలపురుషుడు కాబట్టి దేవుడే తన పిలుపుకు తగినట్టుగా ఇతడిలో మార్పును కలిగించాడు.

అదేవిధంగా ఇతను యేసేపుకు‌ వివరించిన చరిత్రవల్ల అతనికి గతంలో యేసేపును ఐగుప్తుకు అమ్మివేసి వీరు తమ తండ్రికి తన గురించి ఏం‌చెప్పారో కూడా అర్థమైంది.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.