పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

23:1,2, 23:3,4, 23:5,6, 23:7-9, 23:10-13, 23:14,15, 23:16, 23:17-20

ఆదికాండము 23:1,2 శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.

ఈ వచనాలలో శారా మృతి చెందడం మనం చూస్తాం. ఆమె జీవించిన కాలం 127 సంవత్సరాలు. గమనించండి; ఇప్పటివరకూ అబ్రాహాము శారాలు తమ‌కు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కలిసే ఉన్నారు. ఉదాహరణకు; గొడ్రాలు అని తెలిసి అబ్రాహాము ఆమెను విడిచిపెట్టలేదు. అలానే ప్రాణభయంతో తనను చెల్లిగా చెబుతున్నాడనే కారణంతో శారా కూడా అతన్ని విడిచిపెట్టలేదు. హాగరు విషయంలో కూడా వీరి మధ్య వివాదం కలిగింది.‌ అంతేకాకుండా దేవుని పిలుపుతో అబ్రాహాము కనానుకు పయనమైనప్పుడు శారా కూడా తన కుటుంబాన్ని విడిచి అతన్ని వెంబడించింది. అలా ఏ పరిస్థితీ ఏ వివాదమూ వేరు చెయ్యలేని వారిని ఇప్పుడు మరణం వేరు చేసింది. కాబట్టి ఎంత ప్రేమానుబంధాలు కలిగిన దంపతులైనా/ప్రియులైనా మరణంతో వేరుకాక తప్పదని గుర్తించి వారితో ఉన్నంత కాలం నమ్మకంగా జీవించాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది భార్యల/భర్తల వైఖరి ఇలా ఉండదు‌. భాగస్వామి జీవించియున్నంతకాలం వారిని ఏదో విసిగిస్తూ నిందిస్తూ కాలం గడుపుతుంటారు‌. వారికి పంచవలసిన ప్రేమను పంచరు. కానీ చనిపోగానే గుండెలు పగిలేలా ఏడుస్తారు. వారినే తలచుకుని బాధపడతారు. అదే ప్రేమను అదే సహనాన్ని వారు జీవించియున్నప్పుడు చూపించి ఉంటే వారు బ్రతికినంతకాలం సంతోషంగా ఉందురు. విశ్వాసులు మాత్రం ఈ విషయంలో తప్పిపోకుండా చూసుకోవాలి‌.

ఇక్కడ చనిపోయిన శారా గురించి మరలా నూతననిబంధనలో "ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను" (1పేతురు 3:6) అని ఉన్నతంగా రాయబడడం మనం చూస్తాం. నిజానికి అబ్రాహాములో కూడా లోపాలున్నాయి. ప్రాణభయంతో అతను ఒకటి కాదు రెండు సార్లు ఆమెను చెల్లెలని అబద్ధం చెప్పాడు. అయినా సరే ఆమె అబ్రాహాము పట్ల అదే ప్రవర్తనను అనుసరించింది. కాబట్టి విశ్వాసురాళ్ళైన స్త్రీలు తమ‌ భర్తలపట్ల ఇలాంటి మాదిరిని అనుసరించాలి. అందుకే "అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు" (1పేతురు 3:5,6) అని స్పష్టంగా రాయబడింది. మనం శారా పిల్లలంగా ఉండాలంటే శారాలానే ప్రవర్తించాలి. చివరికి అవిశ్వాసులైన భర్తల పట్ల కూడా అలానే ఉండాలని దానివల్ల వారు మార్పు చెందే అవకాశం చాలామట్టుకు ఉందని బైబిల్ బోధిస్తుంది (1 పేతురు 3:1,2). అలాగని వారినుండి అధికవేధింపులు, ప్రాణహాని వంటివి ఉన్నా సర్ధుకుపొమ్మని నేను చెప్పడం లేదు. ఆ సమయంలో విడిపోవడంతో సహా ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 21:10,11 వ్యాఖ్యానం చూడండి).

అలానే చనిపోయినవారి కోసం ప్రత్యేకంగా విలపించడమనేది బైబిల్ లో మనకు పదేపదే కనిపిస్తుంది. ఒకవ్యక్తి చనిపోయినప్పుడు ఎవరూ తనకోసం ఏడ్వలేదంటే ఆ వ్యక్తిపై ఎవరికీ ఎలాంటి ప్రేమలేదనే అర్థం వస్తుంది. అందుకే అబ్రాహాము శారాపై ఉన్న ప్రేమతో ఆమె దగ్గరకు ఏడ్వడానికి వచ్చాడు.

అయితే ఇక్కడ అబ్రాహాము ఆమెకోసం విలపించడానికి వచ్చినదానిని దావా ప్రచారకులు వక్రీకరించి, గత అధ్యాయంలో దేవుని పరిశోధన ముగిసాక అతను బేయేర్షెబాలో ఉన్న హాగరు దగ్గరకు వెళ్ళిపోయాడని అప్పటినుంచి శారాకు దూరంగానే ఉంటున్నాడని అందుకే ఆమె చనిపోయినప్పుడు ఆమె దగ్గరకు వచ్చినట్టు రాయబడిందని చెబుతుంటారు. కానీ అబ్రాహాము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి బెయేర్షెబా నుండే బయల్దేరాడు. ఆ శోధన ముగిసాక మరలా అక్కడికే చేరుకున్నాడు. శారా అప్పటికి అక్కడే ఉంది (ఆదికాండము 22:19 వ్యాఖ్యానం చూడండి). కనాను దేశంలో ప్రస్తుతం వారి సంచారం హెబ్రోనను కిర్యతర్బాకు చేరుకుంది. శారా అక్కడే‌ మృతి చెందింది.

మరి అబ్రహాము ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వచ్చినట్టు "శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను" అని ఎందుకు రాయబడిందంటే; అబ్రాహాము శారాలు ఒకేచోట నివసిస్తున్నప్పటికీ వారు వేరు వేరు గుడారాలలో నివసిస్తున్నారు (వృద్ధులు కదా!). శారా తన కుమారుడైన ఇస్సాకుతో కలసి ఒక గుడారంలో నివసిస్తుంటే అబ్రహాము వేరే గుడారంలో నివసిస్తున్నాడు. అందుకే ఇస్సాకుకు వివాహమైనప్పుడు ఆమెను తన తల్లి గుడారంలోకి తీసుకువెళ్ళాడు (ఆదికాండము 24:67).

ఏ భర్తయైనా తన భార్యను తన గదిలోకే తీసుకువెళ్తాడు. అలా శారాదీ ఇస్సాకుదీ ఒకే గుడారం (వారిద్దరూ ఒకే గుడారంలో నివసించేవారు) కాబట్టే ఇస్సాకు రిబ్కాను తన తల్లి గుడారంలోకి (తన గుడారంలోకి) తీసుకువెళ్ళి ఆమెతో కలిసున్నాడు. ఈవిధంగా అబ్రహాము శారాలు ఒకే ప్రదేశంలో వేరు వేరు గుడారాల్లో నివసించేవారు, శారా చనిపోయిందనే విషయం తెలుసుకున్న అబ్రాహాము ఆమె నివసిస్తున్న గుడారం దగ్గరకు విలపించడానికి వచ్చాడు. అంతేతప్ప అబ్రహాము శారాలు ఎప్పుడూ విడిగాలేరు. చివరికి వారు చనిపోయినప్పుడు కూడా వారు ఒకే సమాధిలో పాతిపెట్టబడ్డారు (ఆదికాండము 25:10).

ఆదికాండము 23:3,4 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా-

ఈ వచనాలలో అబ్రాహాము తన భార్యను పాతిపెట్టే స్థలంకోసం హేతుకుమారులను సంప్రదిస్తున్నట్టు మనం చూస్తాం. శారా మరణం అబ్రాహామును ఎంతో కృంగదీసినప్పటికీ అతను ఆ స్థితిలోనే ఉండిపోలేదు కానీ "పైకి లేచి" ఆ మృతదేహం విషయంలో చెయ్యవలసిన దానిగురించి విచారిస్తున్నాడు. ఇది‌ మనకు చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఇలా మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే విషాదసంఘటల (మరణాలు) వల్ల వేదనకు‌ లోనైనప్పటికీ అబ్రాహాములా పైకి లేచి (కోలుకుని) వారి బాధ్యతను నిర్వర్తించాలి. ఎందుకంటే మనల్ని ఎంతో కృంగదీసే ఈ మరణం విషయంలో మనకున్న ఓదార్పు నిరీక్షణ అంత గొప్పవి (1 థెస్సలొనీక 4:13-16).

అదేవిధంగా అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కనాను దేశంలో పరదేశులుగానే జీవించారు (హెబ్రీ 11:9-13) అబ్రాహాము ఆ విషయాన్ని ఇక్కడ ఆ పట్టణస్థుల ముందు ఒప్పుకుంటూ కొంతకాలం తర్వాత నేను కూడా ఈ లోకాన్ని విడిచిపోతాననే నిశ్చయంతో ఉన్నాడు. 

చూడండి; అబ్రాహాముకు అంతకుముందు కన్నులవిందుగా కనిపించిన తన భార్య ఇప్పుడు చనిపోగానే ఆమెను సమాధి చెయ్యడానికి త్వరపడుతున్నాడు. ఎందుకంటే అది దేవుడు ఏర్పరచిన ప్రకృతి నియమం. కాబట్టి మానవసంబంధాలు ఎంత అశాశ్వతమైనవో గుర్తించి బ్రతికినంతకాలం ఆ సంబంధాల పట్ల ప్రేమతో నమ్మకంగా ప్రవర్తించాలి. అదే దేవునినియమం.

ఆదికాండము 23:5,6 హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై యున్నావు; మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాముకుత్తరమిచ్చిరి.

ఈ వచనాలలో అబ్రాహాము అభ్యర్థనకు హేతు కుమారులు‌ సమాధానమివ్వడం మనం చూస్తాం. సాధారణంగా కొంతమంది అన్యులు చూపించే మంచిప్రవర్తన దేవుని పిల్లలమని చెప్పుకునేవారు సైతం‌ సిగ్గుపడేలా ఉంటుంది. ఎందుకంటే కొందరు దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెబుతూ అన్యులపైన అతిశయిస్తారే తప్ప వారు చేసే మంచిపనులు కూడా వీరు చెయ్యలేరు. కాబట్టి దేవుని నుండి ఆయన పిల్లలు పొందుకున్న నీతి విషయంలో వారు లోకస్థులకంటే అధికులైనప్పటికీ దానికారణంగా ఎవరిపైనా అతిశయించే అవకాశం లేదు.

అలానే "నీవు మా మధ్యను మహారాజువై యున్నావు" అని హేతుకుమారులు పలికిన మాటలను బట్టి అబ్రాహాము వారి మధ్య ఎంత ఉన్నతమైన విలువలతో జీవిస్తున్నాడో వారితో ఎలాంటి స్నేహసంబంధం కలిగియున్నాడో మనకు అర్థమౌతుంది. దేవుడు అతన్ని విగ్రహారాధన నుండి బయటకు పిలిచాడే తప్ప, విగ్రహారాధన చేసే ఎవరితోనూ స్నేహంగా ఉండకూడదనే నియమాన్ని అతని ముందు పెట్టలేదు. అందుచేతనే ఆ ప్రాంతపువారికీ అబ్రాహాముకూ మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడింది. దానికి మంచి విలువలతో కూడిన జీవితం కూడా కారణం. ఇలా మనం కూడా మన చుట్టుప్రక్కలున్న అన్యులతో స్నేహభావంతో మెలగాలి, వారి మధ్యలో మంచి విలువలు కలిగి జీవించాలి. వారికి సువార్త ప్రకటించడానికి ఇది మనకు మంచి అవకాశం.

సాధారణంగా కొంతమంది "దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక" (కీర్తనలు 1:1) అనే మాటలనూ "మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి" (2 కొరింధీ 6:14) అనేమాటలనూ అపార్థం చేసుకుని దేవుణ్ణి నమ్మని అన్యులతో స్నేహం చెయ్యడానికి ఇష్టపడరు, వాస్తవానికి ఆ సందర్భాలు మనకు దుష్టులతో (దుర్ణీతి) పాలిబాగస్తులుగా ఉండవద్దని చెబుతున్నాయే తప్ప, అన్యులతో స్నేహం చేయకూడదని కాదు. అందుకే పౌలు "అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?" (1 కోరింథీ 5:10) అని అంటున్నాడు. కాబట్టి పై సందర్భంలోని హేతుకుమారులు, ఎఫ్రోనులవలే మనల్ని గౌరవిస్తూ స్నేహపూర్వకంగా ఉండడానికి‌ ప్రయత్నించేవారితో మనం కూడా అబ్రాహాములా స్నేహం చెయ్యాలి. దీనివల్ల పైన చెప్పినట్టుగా వారిని సువార్తవైపు నడిపించడానికి మనకు మంచి అవకాశం దొరుకుతుంది.

ఆదికాండము 23:7-9 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.

ఈ వచనాలలో అబ్రాహాము, తన భార్యను పాతిపెట్టుకునేందుకు ఎఫ్రోను పొలం, మక్పేలా గుహ పట్ల ఆసక్తితో ఉన్నట్టు మనం చూస్తాం. బైబిల్ గ్రంథం నీ పొరుగువాడిది ఏదీ ఆశింపకూడదనే మాటలను అన్యాయంగా ఎవరిదీ స్వంతం చేసుకోకూడదని, దొంగిలించకూడదనే భావంలో చెబుతుంది. అలా కాకుండా న్యాయబద్ధంగా కొనుక్కునే స్తోమత మనకున్నప్పుడు దానిని అమ్మేందుకు అవతలి వారికి కూడా ఇష్టమైనప్పుడు దేనినైనా మనం ఆశించవచ్చు. అందుకే అబ్రాహాము ఎఫ్రోను పొలాన్నీ గుహను అతని ఇష్టంతో కొనుక్కునే ఉద్దేశంతో వాటిని ఆశించాడు.

అదేవిధంగా ఇక్కడ అబ్రాహాము హేతుకుమారులకు సాగిలపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రాచీనకాలంలో ఇతరుల పట్ల కృతజ్ఞతను తెలియచెయ్యడానికి ఇలాంటి పద్ధతి వాడుకలో ఉండేది. అయితే ఇది దేవునిపట్ల చూపించే విధేయతతో సమానంగా మనం భావించకూడదు. ఉదాహరణకు మనం చేతులతో దేవునికి దణ్ణం పెడతాం, కొన్నిసార్లు మన సహోదరులకు కూడా పెడుతుంటాం ఈ రెండింటిమధ్యా వ్యత్యాసం ఉంది కదా! .

ఆదికాండము 23:10-13 అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లుకాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను. దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను. నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను. మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను. అది నాయొద్ద పుచ్చుకొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను.

ఈ వచనాలలో ఎఫ్రోను అబ్రాహాము కోరుకున్న భూమినీ గుహనూ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడితే అబ్రాహాము దానికి నిరాకరిస్తూ వాటికి తగిన వెలను చెల్లించడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. అబ్రాహాము ఈ విధంగా చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నట్టు భావించవచ్చు.

1. కనాను దేశాన్ని దేవుడు అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేసి మోషే/యెహోషువ కాలంలో వారికి స్వాస్థ్యంగా స్థిరపరిచాడు. ఈ కారణం చేత అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ఆయన మాట ప్రకారం ఆ దేశంలో పరదేశులుగానే జీవించాలి (అపొ. కా 7:5, హెబ్రీ 11:9). కాబట్టి ప్రస్తుతానికి ఆ భూమి అబ్రాహాముది కాదు. న్యాయబద్ధంగా అప్పటికి ఎఫ్రోనే దానికి హక్కుదారుడు. ఇందువల్ల అబ్రాహాము దేవు‌ని మాటకు లోబడుతూ ఎఫ్రోను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ వెల చెల్లించేందుకు పట్టుపడుతున్నాడు.

2. ఎఫ్రోను ప్రస్తుతం అబ్రాహాముతో ఉన్న స్నేహాన్ని బట్టి ఆ భూమిని ఉచితంగానే ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో వారిమధ్య ఏదైనా వివాదం జరిగితే అబ్రాహాము ఆ విషయంలో మాటపడవలసి రావొచ్చు. ఒకవేళ ఎఫ్రోను అలా చెయ్యకున్నా అతని సంతానం చేసే అవకాశం ఉంది. అందుకే అబ్రాహాము చాలా వివేకంగా ఆలోచిస్తూ ఆ భూమికీ గుహకూ తగిన వెల చెల్లిస్తున్నాడు. 

ఇదంతా జరుగుతున్న సమయంలో అబ్రాహాము పరిస్థితి ఆలోచించండి, అతను తన భార్య చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ ఒకవైపు పరదేశిగా నివసించమన్న దేవుని ఆజ్ఞకు లోబడుతూ మరోవైపు భవిష్యత్తులో తనపై ఎలాంటి నిందా రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఈ మెలకువలను మరచిపోకూడదు. అందుకే దావీదు కూడా దేవునికి బలిపీఠం కట్టే సమయంలో‌ ఇలాంటి పద్ధతినే అనుసరించాడు (2 సమూయేలు 24:20-24)

అదేవిధంగా హేతుకుమారులు అబ్రాహామును నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావంటూ అతన్ని ఎంతో హెచ్చిస్తున్నప్పటికీ అబ్రాహాము వారిముందు సాగిలపడుతూ తన తగ్గింపును‌ చాటుకుంటున్నాడు. అతను తలచుకుంటే వారిముందు గర్వంగా ప్రవర్తించవచ్చు కానీ అలా‌ చెయ్యలేదు. కాబట్టి విశ్వాసులు తమ‌ ప్రవర్తన విషయంలో ఇలాంటి తగ్గింపును కనపరచాలి. నిజమైన దైవభక్తి‌ మనకు సాటి మనుషులతో ఏవిధంగా నడుచుకోవాలో నేర్పిస్తుంది.

ఆదికాండము 23:14,15 అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును; నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకుత్తరమిచ్చెను;

ఈ వచనాలలో ఎఫ్రోను సమాధానం మనం చూస్తాం. తెలుగు తర్జుమాలో ఈ మాటలు అంత అర్థవంతంగా లేవు, వాస్తవానికి అతను నీకూ నాకు మధ్య ఉన్న బంధం ముందు, ఆ వెండి ఎంత అనే భావంలో మాట్లాడుతున్నాడు.

Genesis 23:15 My lord, hearken unto me: the land is worth four hundred shekels of silver; what is that betwixt me and thee? bury therefore thy dead.

ఆదికాండము 23:16 అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.

ఈ వచనంలో అబ్రాహాము, ఎఫ్రోను చెప్పిన వెల ప్రకారం తక్షణమే ఆ వెండిని అతనికి చెల్లించి, ఆ భూమిని స్వంతం చేసుకున్నట్టు మనం చూస్తాం. ఎఫ్రోను ఆ భూమిని ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడినప్పటికీ చివరికి అబ్రాహాము బలవంతం మేరకు ఆ వెలను తీసుకోవడానికి అంగీకరించాడు. అయితే ఆ వెలను‌ అతనికి వెంటనే చెల్లించవలసిన అవసరమేమీ అబ్రాహాముకు లేదు. అయినప్పటికీ అబ్రాహాము ఆ వెలను వెంటనే‌‌ చెల్లిస్తున్నాడు. దీనిని‌బట్టి ఒక వ్యక్తితో మనకు ఎంతమంచి సంబంధం ఉన్నప్పటికీ న్యాయబద్ధంగా చెల్లించవలసినవాటి విషయంలో ఆలస్యం చెయ్యకూడదని (మన దగ్గర ఉన్నప్పుడు)‌ నేర్చుకోవాలి.

ఆదికాండము 23:17-20 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు, అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

ఈ వచనాలలో అబ్రాహాము ఎఫ్రోను యొక్క పొలమూ అందులోని గుహలనూ కొని తన భార్యను పాతిపెట్టినట్టు మనం చూస్తాం. అయితే ఇదే సందర్భం గురించి స్తెఫను మాట్లాడుతూ "యాకోబు ఐగుప్తునకు వెళ్లెను.అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి" (అపొ. కార్యములు 7:15,16) అని అంటున్నాడు.‌ అంటే అతను అబ్రాహాము ఆ పొలాన్ని షెకెములోని హమోరు కుమారుల దగ్గర కొన్నాడని చెబుతున్నాడు. కొందరు దీనిని ఒక వైరుధ్యంగా భావిస్తుంటారు. ఎందుకంటే హమోరు కుమారుల దగ్గర పొలాన్ని కొన్నది అబ్రాహాము కాదు అతని మనువడైన యాకోబు (ఆదికాండము 33:18-20, యెహొషువ 24:32). అదేవిధంగా స్తెఫను చెబుతున్నట్టుగా యాకోబు అక్కడ సమాధి చెయ్యబడలేదు. యెహోషువ కాలంలో ఆ భాగం యోసేపు సంతతికి వచ్చింది కాబట్టి అతడిని మాత్రమే అక్కడ సమాధి చేసారు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులు (వారి భార్యలతో సహా) అబ్రాహాము ఎఫ్రోను దగ్గరకొన్న పొలంలోనే సమాధి చెయ్యబడ్డారు (ఆదికాండము 49:29-32, ఆదికాండము‌ 50:13). మరి స్తెఫను వైరుధ్యంలా అనిపించేటట్టు ఎందుకు మాట్లాడాడంటే అబ్రాహాము, ఇస్సాకు యాకోబులు వారి భార్యలతో సహా సమాధి చెయ్యబడ్డ ప్రాంతం‌ అబ్రాహాము ఎఫ్రోను దగ్గర కొన్నదైతే తర్వాత కాలంలో యాకోబు హమోరు కుమారుల దగ్గర కొన్నదానిలో కూడా తన సంతానపు స్వాస్థ్యభాగం చొప్పున "పితరుడైన యోసేపు" సమాధి చెయ్యబడ్డాడు. దీనిప్రకారం కనాను దేశంలో అబ్రాహాము మరియు యాకోబు ఇద్దరూ వేరువేరు వ్యక్తుల దగ్గర పొలాన్ని ‌కొన్నారు, అక్కడ ఇశ్రాయేలీయుల పితరులు సమాధి చెయ్యబడ్డారు.

స్తెఫను అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు, వారిలో గ్రీకుభాష మాట్లాడే హెల్లెనిస్టులు ఉన్నారు. వీరు కొన్నిసార్లు రెండు మూడు సంగతులను కలపి (బాగా తెలిసిన చరిత్రను) ఒకేమాటలో చెప్పే పద్ధతిని అనుసరించేవారు.  దానినే "Telescoping" (దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా చూపడం) అంటారు. స్తెఫను అక్కడ అదే పద్ధతిని అనుసరిస్తూ మొదటిగా; వారి సమాధుల కోసం పొలాన్ని కొన్న అబ్రాహాము పేరును, రెండవదిగా; మరొక పొలాన్ని యాకోబు ఎవరి దగ్గరనుండైతే కొన్నాడో ఆ హమోరు కుమారులనూ ప్రస్తావించి అందులో పితరులు సమాధి చెయ్యబడ్డట్టు చెబుతున్నాడు. ఈవిధంగా ఒకేలాంటి వేరువేరు సందర్భాలను ‌కలపి మాట్లాడుకోవడం అక్కడున్న యూదులకు బాగా అలవాటు కాబట్టే వారు స్తెఫను వైరుధ్యంగా (తప్పుగా) మాట్లాడుతు‌న్నాడని‌ ఆరోపించలేకపోయారు.

అదేవిధంగా యాకోబు మాటల్లో అబ్రాహాము ఆ పొలాన్ని హేతుకుమారుల దగ్గర కొన్నట్టు కనిపిస్తుంది, అదేమాటల్లో ఆ పొలం ఎఫ్రోను దగ్గర కొన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది కూడా వైరుధ్యం కాదు, అబ్రాహాము ఆ పొలాన్ని ఎఫ్రోను దగ్గర కొన్నప్పటికీ ఆ లావాదేవీలకు హేతుకుమారులే పెద్దమనుషులుగా వ్యవహరించి, వారిచేతుల మీదుగా అబ్రాహాముకు ఆ పొలాన్ని‌ అప్పగించారు కాబట్టి యాకోబు వారిని ప్రస్తావించాడు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.