పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

 

ఆదికాండము 26:1
అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

ఆదికాండము 12:10వ వచనం‌ ప్రకారం, అబ్రాహాము కానాను దేశంలో నివసిస్తున్నపుడు‌ మొదటిసారి అక్కడ కరువు వచ్చింది. అటువంటి కరువునే మరోసారి ఇక్కడ మనం చూస్తాం. దానికారణంగా ఇస్సాకు, ఆదికాండము 20వ అధ్యాయంలో అబ్రాహాము నివసించిన గెరారు దేశానికి వెళ్ళాడు.

ఆదికాండము 26:2
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.

అబ్రాహాము సమయంలో కరువు వచ్చినప్పుడు, అత‌ను దేవుని పిలుపును విడిచిపెట్టి ఐగుప్తులో‌ ప్రవేశించాడు. ఈ సందర్భంలో ఇస్సాకు కూడా ఐగుప్తుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ముందుగా గెరారుకు చేరాడు, అందుకే దేవుడు ఐగుప్తుకు వెళ్ళకుండా అతనున్న గెరారు ప్రాంతంలోనే పరదేశిగా నివసించమని చెబుతున్నాడు.

ఆదికాండము‌ 26:4
ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.

ఈ సందర్భంలో, దేవుడు అబ్రాహాముతో చేసిన ప్రమాణాన్ని ఇస్సాకుకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు; ఈవిధంగా ఆయన జ్ఞాపకం చేయడం చాలామార్లు మనకు కనిపిస్తుంది, తాను పిలుచుకున్న భక్తులు, వారున్న పరిస్థితిని బట్టి నిరుత్సాహపడకుండా ధైర్యపరచడానికే ఆయన ఎక్కువసార్లు ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడని‌ మనం భావించవచ్చు.

ఆదికాండము 26:5
ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞ లను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

అబ్రాహాము దేవునిపట్ల నడచుకున్న తీరును ఆయన ఇస్సాకుకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఈ విధంగా చేయడం గతంలో కూడా కనిపిస్తుంది.

ఆదికాండము 18:17-19 అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతనినెరిగియున్నాననెను.

ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం ఏమిటంటే,  ఇస్సాకుతో దేవుడు అబ్రాహాము తనపట్ల నడచుకున్న మంచి నడవడిక గురించి ప్రస్తావిస్తున్నాడే తప్ప, అతను కొన్నిసార్లు చూపిన అవిధేయతను జ్ఞాపకం చెయ్యడం లేదు. ఉదాహరణకు అబ్రాహాము,  కానానులో కరువు రాగానే దేవునియొద్ద‌ విచారణ చేయకుండా ఆయన పిలుపును మీరుతూ ఐగుప్తుకు వెళ్ళాడు; అంతకుముందు గెరారులోనూ, ఐగుప్తులోనూ దేవుని రక్షణపై ఆధారపడకుండా తన భార్యను చెల్లిగా చెప్పుకున్నాడు. దేవుడు మాత్రం ఇవేమీ జ్ఞాపకం చేసుకోవడం లేదు ఎందుకంటే -

యిర్మియా 31: 34 నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

ఈ మాటలు అబ్రాహాముకు, విశ్వాసము ద్వారా పిల్లలైన మనందరికీ కూడా ఎంతో ఆదరణగా ఉన్నాయి.

ఆదికాండము 26:6,7

ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె యెవరని అడిగినప్పుడు అతడుఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.

గతంలో అబ్రాహాము కూడా  ఐగుప్తులో‌ ఫరో ముందూ, ఇదే గెరారు రాజైన అబీమెలెకు ముందూ, దేవుడు కలుగచేసే రక్షణపై ఆధారపడకుండా, తన స్వంత ఆలోచనతో కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ శారాను‌ తన చెల్లని చెప్పినట్టు కనిపిస్తుంది.
ఈ సందర్భంలో అదే బలహీనత‌ తన కుమారుడైన ఇస్సాకులో కనిపిస్తుంది. అయితే, అబ్రాహాము కాలంలోని‌ అబీమెలకూ ఈ సందర్భంలోని అబీమెలకూ ఒకరు కాదు, ఐగుప్తును పాలించేవారిని ఫరోలని‌ పిలచినట్టే వీరిని అబీమెలకుగా పిలిచారు.
లేకపోతే అబ్రాహాము చనిపోయిన‌ చాలాకాలం తర్వాత అదే అబీమెలకు బ్రతికుండి గెరారును పాలించడం సాధ్యపడదు.

ఆదికాండము 26:8-11

అక్కడ అతడు చాలా దినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించిఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకుఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను. అబీమెలెకుఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా-

గతంలో అబ్రాహాము దేవుడు కలుగచేసే రక్షణపై ఆధారపడకుండా, శారాను తన చెల్లెలని చెప్పి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ, దేవుడు అతడినీ, అతని ‌భార్యనూ విడిచిపెట్టకుండా కాపాడినట్టే, ఇస్సాకు విషయంలో కూడా అదే కాపుదలను చూపిస్తున్నాడు. దీనిని బట్టి దేవుడు పిలిచిన వ్యక్తులు ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆయన పట్ల పొరపాట్లు చేసినప్పటికీ, స్వంత తెలివిపై ఆధారపడినప్పటికీ వారిని విడిచిపెట్టడని అర్థమౌతుంది.

అదేవిధంగా, ధర్మశాస్త్రంలో నీ పొరుగువాని భార్యను ఆశించకూడదనే ఆజ్ఞ లేని కాలంలో కూడా ఆ నియమం అన్యులకు సైతం తెలిసినట్టు అబీమెలకు మాటల్లో మనకు కనిపిస్తుంది, దేవుడు ఇటువంటి నైతికపరమైన ఆజ్ఞలను పూర్వం నుండే మానవులకు వారి మనస్సాక్షి ద్వారా బోధించాడు.

రోమీయులకు 2:14,15 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

ఆదికాండము 26:12-14

ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

పిలిష్తీయులు తమ విషయంలో అప్పటివరకూ చూడనంత అభివృద్ధిని దేవుడు ఇస్సాకుకు‌ అనుగ్రహించాడు.‌ అందుచేత వారు అతని పట్ల అసూయకు లోనయ్యారు; అదేవిధంగా దేవుడు తన చిత్తప్రకారంగా భక్తులకు ఆత్మీయంగానే కాకుండా భౌతికపరంగా కూడా ఆశీర్వదిస్తాడని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది.

ఆదికాండము 26:15

అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

ఆదికాండము 21:22లో అబ్రాహాముతో పిలిష్తీయులు చేసుకున్న ఒప్పందాన్ని మీరుతూ, అబ్రాహాము బావులను వారు పూడ్చివేసారు.

ఆదికాండము 26:16,17

అబీమెలెకు నీవు మాకంటె బహుబలము గలవాడవు గనుక మాయొద్ద నుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా
ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.

ఈ సందర్భంలో పిలిష్తీయుల రాజ్యమే‌ భయపడేంతగా ఇస్సాకును దేవుడు అన్నివిషయాల్లోనూ అభివృద్ధిపరిచాడు. అందుచేతనే వారు అతనిని తమ దగ్గర నుండి వెళ్ళగొడుతున్నారు; బహుశా తరువాతి కాలంలో ఇస్సాకు వారిపై యుద్ధం ప్రకటించవచ్చని వారు ఊహించారు. దేవుడు ఇస్సాకుతో ఇదే దేశంలో పరవాసిగా నివసించమని చెప్పిన కారణంచేత అతను పూర్తిగా అక్కడ నుండి వెళ్ళిపోకుండా, అక్కడున్న లోయలో నివసిస్తున్నాడు.

ఆదికాండము 26:18-22

అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.

ఈ సందర్భంలో ఇస్సాకులోని ఓర్పు, సహనం మనకు కనిపిస్తున్నాయి. పిలిష్తీయులు అతను‌ చేసే పనిని ఆటంకపరస్తున్నప్పటికీ, తన కష్టాన్ని వారు స్వంతం చేసుకుంటున్నప్పటికీ విసిగిపోకుండా,‌  దేవుడు వారి నుండి ఎడమ కలుగచేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగాడు‌ తప్ప వారితో అనవసరంగా పోట్లాటకు దిగలేదు. మనం కూడా సాధ్యమైనంత వరకూ‌ పోట్లాటలకు దూరంగా ఉండాలి.

రోమీయులకు 12: 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

అలా అని మనకు సొంతమైనదానిని ఎవరో ఆక్రమించుకుంటుంటే మౌనంగా ఉండమని దీనర్థం కాదు. ఇస్సాకు ఈదేశంలో‌ పరవాసిగా నివసిస్తున్నాడు దీనిప్రకారం ఆ భూమిపై‌ అతనికి పూర్తి హక్కులేదు. అందుచేతనే అతను ఆ భూమి విషయంలో వారితో కొట్లాటకు దిగకుండా దేవునిపై‌ ఆధారపడ్డాడు చివరికి దేవుడు అతనికి పిలిష్తీయుల నుంచి‌ ఎడమ కలుగచేసాడు.

ఆదికాండము 26:23-25

అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.

అబ్రాహామును బట్టే అతని సంతానమైన ఇస్సాకుకు తదుపరి యాకోబు, ఇశ్రాయేలు జనాంగానికి‌ ఆయన ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు ఈ సందర్భంలో తెలియచేస్తున్నాడు.‌ ఇది వారి క్రియల మూలంగా కలిగింది ‌కాదు, ఆయన అబ్రాహామును పిలిచిన పిలుపును‌ బట్టే జరుగుతుంది.

ఆదికాండము 26:26-31

అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి.  ఇస్సాకుమీరు నామీద పగపట్టి మీయొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

ఆదికాండము 21:22లో అబ్రాహాముతో ఒప్పందం చేసుకోవడానికి పిలిష్తీయుల రాజు, అతని సేనాధిపతి వచ్చినట్టే,
ఈ సందర్భంలో ఇస్సాకుతో కూడా ఒప్పందం చేసుకునేందుకు అబీమెలకూ అతని సేనాధిపతీ  వచ్చారు.‌ అబ్రాహాము కాలంలో అబీమెలకూ ఇప్పటి అబీమెలకూ వేరైనప్పటికీ సేనాధిపతి‌ మాత్రం  ఒకరేయని మనం అర్థం చేసుకోవచ్చు‌.
అబ్రాహాము కాలంలో అతను యవ్వనుడిగా ఉండి ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతూ ఉండవచ్చు.

అదేవిధంగా, అబీమెలకు ఇస్సాకును‌ వెళ్ళిపోమన్నపుడు మౌనంగా అక్కడి నుంచి వచ్చేసినప్పటికీ, ఈ సందర్భంలో‌ మాత్రం‌ అబీమెలకుతో మాట్లాడుతున్నాడు. దీనిప్రకారం విశ్వాసి‌ కొన్ని సమయాల్లో మౌనంగా ఉన్నప్పటికీ అవసరమైనపుడు‌ న్యాయంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి.

ఆదికాండము 26:32,33 

ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసిమాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక  దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.

అబ్రాహాము కాలం‌ నుండే మనకు బెయేర్షెబా అనేప్రాంతం పేరు కనిపిస్తుంది, వాస్తవానికి ఆ పేరును ఇస్సాకే మొదటిగా పెట్టాడు. ఆదికాండంలోని చరిత్రను మోషే రాస్తున్న కారణం చేత, అప్పటికే పిలవబడుతున్న పేరును ప్రస్తావిస్తూ ఆ ప్రాంతాన్ని అబ్రాహాము కాలంలో కూడా  బెయేర్షెబా అని అతను రాసాడు.

ఆదికాండము 26:34,35

ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

ఈ సందర్భంలో తన జేష్ఠత్వాన్ని తృణీకరించిన ఏశావు, కానానీయుల కుమార్తెలను వివాహం చేసుకుని వారి ఆచారాలు, ప్రవర్తన ద్వారా దేవుని పిల్లలైన ఇస్సాకు, రిబ్కాలకు మనోవేదన కలిగింపచేసినట్టు కనిపిస్తుంది. ఏశావు ఇలా చేయడంలో ఇస్సాకు అజాగ్రత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 24 వ అధ్యాయంలో, అబ్రాహాము‌ ఇతని విషయంలో కానానీయుల కుమార్తెలను వివాహం చేసుకోకుండా జాగ్రత తీసుకున్నట్టు ఇస్సాకు తన పెద్దకుమారుడి విషయంలో తీసుకోలేకపోయాడు. ఎందుకంటే, కొందరు బైబిల్ పండితుల పరిశీలన ప్రకారం ఏశావు ఎవరి కుమార్తెలనైతే వివాహం చేసుకున్నాడో ఆ బేయేరీ, ఏలోనులు వారి వ్యక్తిగత పేర్లు కావు. బేయేరీ అంటే బావులు తవ్వించేవాడని అర్థం. ఏలోను అంటే ఒప్పందాలు చేసేవాడని అర్థం. పై సందర్భమంతటిలో ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను మళ్ళీ తవ్వించే పనిలో నిమగ్నమయ్యాడు, ఆ క్రమంలో అతనికి సహాయపడినవారే ఈ బెయేరీ, ఏలోనులు. ఇస్సాకు ఆ పనిలో నిమగ్నమై ఉంటే, ఏశావు వీరి కుమార్తెలను ఇష్టపడి వారిని వివాహం చేసుకున్నాడు.

అదేవిధంగా, ఆదికాండము 36 వ అధ్యాయంలో ఉన్న ఏశావు భార్యల పేర్లకు ఈ సందర్భంలో ఉన్న పేర్లకు వైరుధ్యం కనిపిస్తుంది, దాని గురించి ఆ అధ్యాయపు వివరణలో చూద్దాం.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.