పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

ఈ అధ్యాయంలో దీనా షెకెము కుమారుడి చేతిలో బలవంతం చేయబడడం (1-2) తరువాత ఆమెను వివాహం చేసుకోవాలి అనుకోవడం (3-4) ఈ విషయం తెలిసి యాకోబు కుటుంబం సంతాపపడడం (5-7) షెకెము తండ్రి ఆ వివాహం కోసం దేనినైనా చెల్లించడానికి సిద్ధపడడం (8-12) యాకోబు కుమారులు వారిని కపటంగా చంపదలచి సున్నతిని అడ్డుపెట్టుకోవడం (13-17) షెకెము అతని‌ తండ్రి వారిమాటలకు సమ్మతించి తమతో పాటు ఆ ఊరివారందరూ సున్నతిపొందేలా ప్రేరేపించడం (18-24) ప్రణాళిక ప్రకారం యాకోబు కుమారులైన లేవీ షిమ్యోనులు ఆ ఊరి పురుషులందరినీ చంపి వారి సమస్తాన్నీ దోచుకోవడం (25-29) యాకోబుకు అది తెలిసి తన కుమారులతో వాదించడం (30-31) గురించి మనం చదువుతాం.  

ఆదికాండము 34:1

లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్లెను.

ఈ సందర్భంలో యాకోబు కుమార్తె తమ కుటుంబం పరదేశులుగా నివసిస్తున్న కానాను దేశంలోని అమ్మాయిలను చూడడానికి వెళ్ళినట్టు రాయబడింది. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం అది ఆ దేశంలో ఒక పండుగ రోజు.

ఆదికాండము 34:2

ఆ దేశమునేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.

ఈ సందర్భంలో హమోరు కుమారుడైన షెకెము దీనా అక్కడికి ఒంటరిగా రావడం చూసి ఆమెను బలవంతం చేసినట్టు రాయబడింది.  జరిగిన ఈ సంఘటనలో కొందరు దీనాను మాత్రమే తప్పుపడతారు కానీ ఆవిధంగా చెయ్యడం సరికాదు. అయితే ఇక్కడ ఆమె చేసినదానిలో కూడా పొరపాటు ఉంది. ఆమె కానానీయుల కుమార్తెలను ఏ ఉద్దేశంతో చూడడానికి వెళ్ళిందో మనకు తెలియనప్పటికీ, తనది కాని ప్రాంతంలోకి తగిన జాగ్రతలు తీసుకుని‌ వెళ్ళాలనే బాధ్యతను ఆమె నిర్లక్ష్యపెట్టింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నైతిక విలువలు పాటించే పరిస్థితి అంతగా ఉండదు, అది ఆమెకు కూడా తప్పకుండా తెలిసుండాలి.

కనీసం ఆమె అక్కడికి వెళ్తున్న విషయం తన కుటుంబ సభ్యులకైనా తెలియచేసిందో లేదో  మనకు తెలియదు. ఒకవేళ ఆమె తెలియచేసే ఉంటే తనను అలా ఒంటరిగా పంపిన కుటుంబం కూడా ఆమె విషయంలో సరైన జాగ్రతను తీసుకోలేదని మనం భావించాలి.

కాబట్టి దీనా విషయంలో జరిగినదానిని బట్టి మనం ఎప్పుడూ మన వ్యక్తిగత జాగ్రతలు మరచిపోకూడదు. అదేవిధంగా సాధ్యమైనంత మట్టుకు నైతిక ప్రమాణాలు పాటించని వ్యక్తులకు దూరంగా జీవించాలి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.

ఆదికాండము 34:3,4

అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.

ఈ సందర్భంలో షెకెము దీనాను బలవంతం చేసిన తరువాత ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ, ఆమెకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు రాయబడింది.

ఆదికాండము 33:19 ప్రకారం యాకోబు ఈ షెకెము సోదరుల దగ్గరే ఒక పొలాన్ని కొని అందులో గుడరాలు వేసుకుని నివసిస్తున్నాడు. దీనిప్రకారం యాకోబు కుటుంబానికి షెకెముకూ ముందు నుండీ పరిచయం ఉంది. కాబట్టి ఈ షెకెము ముందు నుండీ దీనాపై మనసుపడి ఉండవచ్చు. అయితే అతను తొందరపడి ఆమెను ఇలా బలవంతం చేయకుండా ముందే వివాహం చేసుకునే ప్రయత్నం చేసుంటే బావుండేది. ఈ తొందరపాటు వల్ల అతను తన ప్రాణంతో పాటు ఆ ఊరిలోని పురుషులందరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.

కానీ షెకెము విషయంలో ఈ ఒకటి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అతను దీనా విషయంలో పొరపాటు చేసినప్పటికీ ఆమెను వివాహం చేసుకోవడం ద్వారా దానిని సరిచేసుకోవాలి అనుకుంటున్నాడు; దావీదు కుమారుడైన అమ్నోనులా ఆమెను కోరిక తీర్చుకుని విడిచిపెట్టడం లేదు (2 సమూయేలు 13:15,16).

ఆదికాండము 34:5

తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.

ఈ సందర్భంలో యాకోబు తన కుమార్తె విషయంలో జరిగినదానిని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దానిపై తన కుమారుల ఉద్దేశం కూడా తెలుసుకోడానికి వారికోసం ఎదురుచూసాడు.

ఆదికాండము 34:6

షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.

ఈ సందర్భంలో తన కుమారుడి కోరిక ప్రకారం హమోరు దీనాతో తన కుమారుడికి వివాహం జరిపించమని అడిగేందుకు యాకోబు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ హమోరులో కూడా మనకు మంచితనం కనిపిస్తుంది. యాకోబుతో పోలిస్తే తనకున్న హమోరుకు ఉన్న బలం చాలా ఎక్కువ కాబట్టి, అతను తలచుకుంటే అన్యాయానికి గురైన దీనా విషయంలో అతను యాకోబుకు ఎటువంటి సంజాయిషీ ఇవ్వకుండా తప్పించుకోగలడు, తన కుమారుడి కోరికను కూడా లక్ష్యపెట్టకపోదుడు. కానీ అతను అలా చెయ్యకుండా సత్ప్రవర్తననే అనుసరిస్తున్నాడు. కానానీయులు మోషే కాలానికి దుర్మార్గులే అయినప్పటికీ అబ్రాహాము యాకోబుల కాలంలో వారిలో కొందరు మంచివారు కూడా మనకు కనిపిస్తుంటారు.

ఆదికాండము 34:7

యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.

ఈ సందర్భంలో దీనాను షెకెము బలవంతం చేసాడనే విషయం తెలుసుకున్న యాకోబు కుమారులు అది ఇశ్రాయేలీయులలో అవమానకార్యంగా భావించి అందు నిమిత్తం బాధపడడం, కోపపడడం మనకు కనిపిస్తుంది. అయితే ఆ చుట్టుపక్కలున్న కానాను ప్రజలలో వివాహానికి ముందు ఒక స్త్రీతో శయనించకూడదనే నియమం అంత కఠినంగా లేకపోవచ్చు. అందుచేత కూడా షెకెము ఆవిధంగా చేసాడు.

ఆదికాండము 34:8-10

అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లిచేయుడి.  మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.

ఈ సందర్భంలో షెకెము తండ్రియైన హమోరు యాకోబుతోనూ అతని కుమారులతోనూ తనను తాను తగ్గించుకుని మాట్లాడుతూ, తన కుమారుడికి  దీనాను ఇవ్వడం ద్వారా వారికి కలిగే ప్రయోజనాలను తెలియచేస్తున్నాడు. పైన చెప్పినట్టుగా అతను వారితో సమాధానపడాలనుకుంటున్నాడే తప్ప తనకున్న బలంతో వారిపై దౌర్జన్యం చేసే ప్రయత్నం చెయ్యడం లేదు.

ఆదికాండము 34:11,12

మరియు షెకెముమీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.  ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.

ఈ సందర్భంలో హమోరు తన కుమారుడి పక్షంగా తీసుకువచ్చిన వివాహ అభ్యర్థనకు వారు ఒప్పుకోడానికి అతనికున్న సొమ్ము ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడినట్టు మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అతను తన కుమారుడు దీనా పట్ల చేసిన పొరపాటుకు ప్రాయుశ్చిత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి నియమమే మనకు మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది.

ద్వితీయోపదేశకాండము 22:28,29 ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.

ఆదికాండము 34:13

అయితే తమ సహో దరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా-

ఈ సందర్భంలో యాకోబు కుమారులు (లేవి షిమ్యోనులు) దీనా విషయంలో షెకెము చేసిన పొరపాటుకు అతను పడిన పశ్చాత్తాపాన్ని కానీ, అతని తండ్రి దానికి ప్రతిఫలంగా వారిముందు పెట్టిన ప్రయోజనాలను కానీ అంగీకరించకుండా, వారిని హత్యచేయాలనే ఉద్దేశంతో ఉండి వారికి కపటంగా ఉత్తరమిస్తున్నట్టు రాయబడింది.

కీర్తనలు 5:6 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

ఒకరు మనపట్ల చేసిన పొరపాటు విషయంలో వారు పశ్చాత్తాపపడి, దానిని సరిచేసుకునే ప్రయత్నం చేసినపుడు కూడా వారిని మన్నించకుండా వారిని శిక్షించాలనుకోవడం దేవుని పిల్లల లక్షణం కాదు.

మత్తయి 6:15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

ఆదికాండము 34:14

మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును.

ఈ సందర్భంలో యాకోబు కుమారులు (లేవి,షిమ్యోను) హమోరు షెకెముకూ దీనాకూ మధ్య వివాహం జరిపించవలసిందిగా తీసుకువచ్చిన వివాహ అభ్యర్థనకు వారు సున్నతి పొందని అన్యులు కాబట్టి అలా చెయ్యలేము అది మాకు అవమానమనే అభ్యంతరాన్ని తెలియచేస్తున్నారు. ఈ అభ్యంతరం కేవలం వారి కపట ఆలోచనలో ఒక భాగం.

ఆదికాండము 34:15-17

మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి; ఆ పక్షమందు మీ మాటకొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా-

ఈ సందర్భంలో యాకోబు కుమారులు తమ చెల్లెలిని షెకెముకు ఇవ్వడానికి అభ్యంతరాన్ని తెలియచేసి, వారు హమోరు చెప్పినట్టుగా ఒప్పుకోవాలంటే ఆ ఊరిలో పురుషులంతా సున్నతిని పొందాలనే షరతును పెట్టడం మనకు కనిపిస్తుంది. వీరు తమ చెల్లెలి విషయంలో జరిగినదానికి పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో సున్నతిని అడ్డుపెట్టుకుంటూ, దేవుడు తన నిబంధనకు గుర్తుగా నియమించిన ఆ ఆచారాన్ని అవమానిస్తున్నారు.

ఇక్కడ వీరు భక్తికి సంబంధించిన ఆచారాలను అడ్డుపెట్టుకుని తమ ఉద్దేశాలను నెరవేర్చుకునే దుష్టులతో పాలివారుగా కనిపిస్తున్నారు. యెహోవా నామాన్నే వ్యర్థంగా ఉచ్చరించకూడదన్నపుడు ఆయన తన నిబంధనకు గుర్తుగా నియమించిన సున్నతిని పగతీర్చుకోవడానికి అడ్డుపెట్టుకోవడం ఎ‌ంత పాపమో ఆలోచించండి.

ఆదికాండము  34:18,19

వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు.

ఈ సందర్భంలో షెకెముకు దీనాపట్ల ఉన్న ప్రేమ మరోసారి మనకు స్పష్టమౌతుంది. దానికి తన తండ్రి కూడా అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.

ఆదికాండము 34:20-24

హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నది గదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.  అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేకజనముగా నుందురు.  వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పినమాట అతని ఊరిగవిని ద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవిని ద్వారా వెళ్లువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.

ఈ సందర్భంలో షెకెము మరియు అతని తండ్రియైన హమోరులు, యాకోబు కుమారులు తమ ముందు పెట్టిన షరతు ప్రకారం ఆ ఊరి పురుషులందరికీ సున్నతి చేయించడానికి దానివల్ల వారికి కలిగే ప్రయోజనాలను‌ వివరిస్తున్నారు. వారు కూడా షెకెము, హమోరుల మాటలకు సమ్మతించి సున్నతిని పొందారు.

అయితే, వారు దైవ నిబంధనకు గురుతైన సున్నతిని, దానిని నియమించిన దేవుని గురించి తెలుసుకోకుండా, షెకెము హమోరులు తమతో చెప్పినదాని ప్రకారం సున్నతి పొందితే యాకోబు కుటుంబం వల్ల లాభం పొందవచ్చనే దానినే ఆలోచించారు. ఒకవిధంగా తమకు యాకోబు కుటుంబం నుండి లాభం కలుగుతుందనేసరికి ఏమాత్రం ఆలోచించకుండా తాము ఎరుగని ఒక అన్యదేవుడి ఆచారాన్ని పాటించారు, దురాశకు పోయారు.

ప్రస్తుత సంఘాలలో దేవుని గురించి ఏమీ తెలుసుకోకుండా, ఏదో లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో బాప్తీస్మాలు పొందేవారూ, ఇతర దైవిక కార్యక్రమాల్లో  పాలుపొందేవారూ ఇటువంటివారే. ఇటువంటివారిని లేఖనం చెడిపోయిన మనస్సు కలిగినవారని పేర్కొంది.

1తిమోతికి 6:5 చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.

ఈవిధంగా యాకోబు కుటుంబం చేత లాభం పొందుకోవాలనే దురాశతో అతని కుమారులైన లేవీ షిమ్యోనులు పెట్టిన షరతు ప్రకారం షెకెము, హమోరులను బట్టి సున్నతి పొందిన ఆ ఊరి పురుషులకు ఏం జరిగిందో ఈ క్రింది వచనాలలో రాయబడింది. వారు ఏదో సంపాదించుకోవాలని సున్నతి పొందితే, చివరికి తమ ప్రాణాలతో సహా ఉన్నదంతా పోగొట్టుకున్నారు.
దైవిక సంబంధమైన ఆచారాలను లాభం సంపాదించుకోవడానికి పాటించేవారికి ఈ విధంగానే నష్టం కలుగుతుంది.

ఆదికాండము 34:25,26

మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి.

ఈ సందర్భంలో తాము ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం; యాకోబు కుమారులైన లేవీ షిమ్యోనులు ఆ ఊరి పురుషులందరూ సున్నతి చేయించుకుని, ఆ బాధతో బలహీనులుగా ఉన్న సమయంలో వారిపై దాడి‌చేసి షెకెము, హమోరులతో సహా వారందరినీ చంపి తమ చెల్లెలిని అక్కడి నుండి తీసుకుపోయినట్టు చూడగలం.

జరిగిన ఈ సంఘటనలో రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలి.

(1) వీరు చేసింది దేవుని న్యాయానికి పూర్తి వ్యతిరేకం.

కీర్తనలు 5:6 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

సామెతలు 3:29 నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.

అందుకే తమ తండ్రియైన యాకోబు తన మరణ సమయంలో దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రెండు గోత్రాలవారినీ శపించాడు.

ఆదికాండము‌ 49:5-7 షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

 (2) అదేవిధంగా లేవీ షిమ్యోనులు దైవవిరుద్ధంగా చేసిన ఈ హింస కూడా దేవుని సార్వభౌమత్వాన్నే నెరవేరుస్తుంది.

కీర్తనలు 76:10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

ఎందుకంటే, అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలే ఇస్సాకుతో కలపి ఏకజనం కానప్పుడు, ఇస్సాకుకు పుట్టిన ఏశావు కూడా విసర్జించబడినప్పుడు, నోవాహు చేత శపించబడిన కానానీయులు ఇశ్రాయేలీయులతో కలసి ఏకజనం ఎలా అవ్వగలరు? ఆ సందర్భంలో ఆ ఊరిప్రజలు ఇశ్రాయేలీయులతో ఏకజనం అవ్వాలనే ఉద్దేశంతో కూడా సున్నతి పొందారు‌. కాబట్టి వారికున్న ఆ ఆశ నెరవేరకుండానే హతమయ్యారు.

ఈవిధంగా ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరింది. అయినప్పటికీ ఆ హింసను జరిగించిన లేవీ షిమ్యోనులు వారికున్న స్వంత ఉద్దేశాన్ని బట్టి అలా చేసారు కాబట్టి అందులో వారు పైన చెప్పినట్టుగా దేవునిదృష్టికి దోషులూ, ఆయన న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించిన హేయులు అయ్యారు.

ఆదికాండము 34:27-29 

తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్నదంతయు దోచుకొనిరి.

ఈ సందర్భంలో లేవీ షిమ్యోనులు ఆ ఊరివారిని అన్యాయంగా‌ చంపడమే కాకుండా, వారి స్త్రీలనూ, మిగిలిన సొత్తు అంతటినీ దోచుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి వీరిలో వారి సొత్తును కూడా దోచుకోవాలనే  ఆలోచన ఉంది.

ఆదికాండము 34:30

అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు; నేనును నా ఇంటివారును నాశనమగుదమని చెప్పెను.

ఈ సందర్భంలో యాకోబులో తన కుమారులైన లేవీ షిమ్యోనులు చేసినదానిని బట్టి ఆ ప్రాంతంలోని మిగిలిన ప్రజలు తనపై దాడిచేస్తారనే ఆందోళనే కాకుండా ఆ ప్రజల దృష్టిలో తాను అసహ్యునిగా చేయబడ్డాననే బాధ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే యాకోబు వారిమధ్యలో ఒక మంచి వ్యక్తిగా నివసిస్తున్నాడు, పైగా వారిమధ్య యెహోవా దేవునికి బలిపీఠం కట్టడం ద్వారా అతను దేవునికి లోబడే దాసునిగా తనను అందరికీ ప్రకటించుకున్నాడు.

ఇప్పుడు అతని కుమారులు చేసినదానిని బట్టి చుట్టుపక్కల ప్రజల దృష్టిలో అతను అసహ్యుడిగా మారడమే కాదు, అతను నమ్మిన దేవుని నామం కూడా అవమానించబడుతుంది.
భక్తుపరుడిగా పేరుపొందిన ఒక వ్యక్తి చేసే చెడుకార్యపు ప్రభావం అతను భక్తికలిగున్న దేవునిపై కూడా తప్పకుండా పడుతుంది. ఉదాహరణకు దావీదు చేసిన హేయకార్యం వల్ల దేవుని నామం దూషించబడింది.

రెండవ సమూయేలు 12:13,14 నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను-నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి.

కాబట్టి ఒక విశ్వాసి చేసే పనుల విషయంలో చాలా జాగ్రత కలిగినడుచుకోవాలి, తన కుటుంబపు ప్రవర్తనను కూడా పరిశీలించుకోవాలి. ప్రస్తుతం కూడా కొందరు విశ్వాసులుగా పిలవబడేవారు చేసే చెడుకార్యాలను బట్టి దేవుని నామం ఎంతగా దూషించబడుతుందో మనకు తెలుసు. వీరు దానికి తగిన శిక్షను తప్పించుకోలేరు.

ఆదికాండము 34:31

అందుకు వారు వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.

ఈ సందర్భంలో యాకోబు లేవీ షిమ్యోనులు చేసిన చెడును బట్టి వారిని గద్దించినప్పుడు వారు దానికోసం ఆలోచించకుండా తమ చెల్లెలి పట్ల షెకెము చేసినదానిని ప్రస్తావించి తాము చేసినదానిని సమర్థించుకుంటున్నట్టు చూడగలం.

అయితే ఇక్కడ షెకెము తమ చెల్లెలి విషయంలో చేసినదానినీ, తరువాత వీరు చేసినదానినీ పోల్చిచూసినప్పుడు వీరే అత్యంత కఠినమైన నేరస్తులుగా కనిపిస్తారు. ఎందుకంటే షెకెము తమ చెల్లెలి పట్ల పొరపాటు చేసి, తరువాత పశ్చాత్తాపపడి దానిని సరిచేసుకోడానికి ప్రయత్నించాడు, తనకున్న బలంతో వీరిపై దౌర్జన్యం చెయ్యకుండా ఆమె కోసం వీరు చెప్పిన మాటకు సమ్మతించాడు.

కానీ వీరు షెకెముపైనా, అతని ఊరుపైనా పగ తీర్చుకోడానికి దేవుని నిబంధనకు గురుతైన సున్నతిని అడ్డుపెట్టుకున్నారు. వారు దానికి సమ్మతించి వీరిమాట ప్రకారమే చేసినా ఏమాత్రం కనికరం లేకుండా ఆ ఊరివారంతా బలహీనులుగా ఉన్న సమయంలో వారిపై దాడికి పాల్పడ్డారు. తమ చెల్లెలి విషయంలో పొరపాటు చేసింది ఒకడే అయితే వీళ్ళు ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపి, వారికున్న సమస్తాన్నీ స్త్రీలతో సహా దోచుకున్నారు.

చివరికి వీరు ఏ చెల్లికోసమైతే ఇదంతా చేసామని తమ తండ్రిని ఎదిరిస్తూ సమాధానం చెబుతున్నారో ఆ చెల్లికి కూడా వీరు చేసింది అన్యాయమే ఔతుంది. ఎందుకంటే షెకెము మొదట ఆమెను బలవంతం చేసినప్పటికీ తరువాత ఆమెను ప్రేమించి ఆమెకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు.  అంతగా తమ చెల్లిని ప్రేమించినవాడిని వీరు చంపేసి తమ చెల్లి విషయంలో ప్రతీకారం చేసామని భావిస్తున్నారు. ఈ సంఘటన తరువాత ఆమె జీవితం ఏవిధంగా గడిచిందో, ఆమెకు మరలా వివాహం అయిందో లేదో మనకు వివరించబడలేదు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.