పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

12:1, 12:2, 12:3, 12:4,5, 12:6,7, 12:8, 12:9,10, 12:11-13, 12:14-16, 12:17-20

ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై ఆయన చూపించే దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అపొ.కార్యములు 7:2-4 ప్రకారం; అబ్రాహాముకు ఈ పిలుపు మెసొపొతమియా (ఇరాక్) లో ఉండగా వచ్చింది. అప్పుడు అబ్రాహాము తన తండ్రి అయిన తెరహునూ తన భార్యయైన శారయినూ తన తమ్ముడి కుమారుడైన లోతునూ వెంట పెట్టుకుని హారానుకు వచ్చాడు (ఆదికాండము 11:31).

అయితే దేవుడు పిలిచింది అబ్రాహామునే (మరియు అతని భార్య) తప్ప కుటుంబాన్ని కాదు. అయినప్పటికీ అతను తన కుటుంబంతో కలసి దేవుడు చెప్పిన దేశానికి పయనమయ్యాడు. కానీ అబ్రాహాము తనకు దేవుడు చెప్పిన దేశం చేరకముందే తన తండ్రి చనిపోయాడు (అపోస్తలుల కార్యములు 7:4). తర్వాత లోతు కూడా అబ్రాహాము వాగ్దాన దేశమైన కనానులో ఉండకుండా వేరైపోయాడు (ఆదికాండము 13:11). దీనిని బట్టి దేవుడు ఎవరిని ఎందునిమిత్తం పిలిచాడో అది వారికి మాత్రమే చెందుతుందని మనం గ్రహించాలి. అందుకే కొన్నిసార్లు మనకున్న ఆలోచనతో తాపత్రయంతో ఇతరులను కూడా దేవుడు మనకప్పగించిన కార్యాలలో పాలిభాగస్తులను చెయ్యడానికి ప్రయత్నించినా అది నెరవేరదు‌.

ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాముకు "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు" అని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం.‌ ఈ వాగ్దానాన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి.

1. అబ్రాహాము శారీరక సంతానమైన ఇశ్రాయేలీయులను ఇది సూచిస్తుంది (ద్వితియోపదేశకాండము 4:6).

2. అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని‌ కలిగి అతని సంతానంగా పిలవబడుతున్న క్రైస్తవ జనాంగాన్ని కూడా సూచిస్తుంది (గలతి 3:29).

ఆదికాండము 12:3 నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా-

కొంతమంది విశ్వాసులు ఈ వచనంలో రాయబడిన మాటలను ఆధారం చేసుకుని, తమ శత్రువులెవరైనా తమను దూషించి నష్టపోయినప్పుడు అది దేవుని శాపంగా సాక్ష్యాలు చెబుతుంటారు. కానీ ఇక్కడ అబ్రాహామును దూషించడమంటే అతనినికి వ్యక్తిగతంగా దూషించడమనే కాకుండా దేవుని ఏర్పాటును తృణీకరించడంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అబ్రాహాము అనేకజనాలకు తండ్రిగా ఉండడానికి దేవుని చేత పిలవబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అలానే అబ్రాహామును ఆశీర్వదించడం అన్నప్పుడు కూడా దేవుని చిత్తానుసారమైన అతని ఏర్పాటును అంగీకరించడమని భావం.

అదేవిధంగా ఈ వచనంలో అబ్రాహాము మూలంగా భూమిమీద సమస్త వంశాలూ ఆశీర్వదించబడతాయని మనం చదువుతాం. దేవుడు అతనికి చేసిన ఈ వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా నెరవేరినట్టు లేఖనాలు చెబుతున్నాయి, అ నెరవేర్పుకు మన మారుమనస్సు, పాపక్షమాపణ కూడా సాక్ష్యంగా ఉంది (అపో.కార్యములు 3:26, గలతి 3:13,16).

ఆదికాండము 12:4,5 యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడుగలవాడు. అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.

ఈ వచనాలలో అబ్రాహాము, హారాను నుండి కనాను దేశానికి వచ్చినట్టు మనం చూస్తాం. ఈ సంచార క్రమాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనంలో దేవుడు అబ్రాహామును పిలచినప్పుడు అతడు మెసొపొతమియా నుండి తన భార్యతోనూ తండ్రితోనూ లోతుతోనూ కలసి హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. హారానులో వారు కొంతకాలం కాపురమున్నాక అతని తండ్రియైన తెరహు చనిపోయాడు (అపో,కార్యములు 7:4, ఆదికాండము 11:31,33). అప్పటికి అబ్రాహాముకు 75 సంవత్సరాలు. తన తన తండ్రి చనిపోయిన ఆ సంవత్సరంలోనే అబ్రాహాము తన భార్యనూ లోతునూ వెంటపెట్టుకుని హారాను నుండి కనాను దేశం చేరుకున్నాడు (ఆదికాండము 11:30,31 వ్యాఖ్యానం చూడండి).

ఆదికాండము 12:6,7 అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

ఈ వచనాలలో అబ్రాహాము కనాను దేశం చేరగానే దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని సంతానానికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని ప్రమాణం చెయ్యడం మనం చూస్తాం (అపొ. కార్యములు 7:5). ఆయన వాగ్దానం చేసినట్టుగానే అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. ఈ నెరవేర్పును మనం యెహోషువ గ్రంథంలో స్పష్టంగా చదువుతాము.

ఆదికాండము 12:8 అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవ నామమున ప్రార్థన చేసెను.

ఈ వచనంలో అబ్రాహాము బేతేలుకూ హాయికీ మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవా దేవునికి‌ బలిపీఠం కట్టి ఆయనకు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. దీనిని బట్టి అతనిలో తన దేవుణ్ణి ప్రకటించాలనే తాపత్రయం ఎంతగా ఉందో మనం గమనించవచ్చు. ఎందుకంటే అతను బేతేలుకూ హాయికీ మధ్యలో యెహోవా దేవుని బలిపీఠం కట్టడం ద్వారా ఆ వైపుగా వెళ్ళే ప్రజలందరికీ అతను యెహోవా దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రతీ విశ్వాసిలోనూ ఈ తపన కనిపించాలి.

అదేవిధంగా ఈ సందర్భంలో మనకు కనిపించే బేతేలు అసలు పేరు లూజు. తర్వాత కాలంలో అబ్రాహాము మనువడైన యాకోబు ఈ ప్రాంతానికి బేతేలు అని నామకరణం చేసాడు (ఆదికాండము 28:19) ఐతే మోషే ఈ చరిత్రను రాస్తున్న సమయానికి ఆ ప్రాంతం బేతేలుగానే పిలవబడుతుంది‌ కాబట్టి అతను అదే పేరును ఇక్కడ ప్రస్తావించాడు (ఆదికాండము 4:16 వ్యాఖ్యానం చూడండి).

అబ్రాహాము యెహోవా దేవుని నామంలో ప్రార్థన చేసిన సంఘటనపై ఒక ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే నిర్గమకాండము 6:2,3 ప్రకారం; ఆయన మోషేతో మాట్లాడుతూ నేను సర్వశక్తిగల దేవుడనే పేరుతోనే పితరులకు ప్రత్యక్షమయ్యాను తప్ప, యెహోవా అనే నా నామాన్ని వారికి తెలియచెయ్యలేదని చెబుతున్నాడు.

అయితే మనం చూసిన సందర్భంలో అబ్రాహాము యెహోవా అనే నామంలోనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాహాము మాత్రమే కాదు, పితరులు చాలామంది యెహోవా అనే నామంలోనే దేవుణ్ణి సంబోధించి ఆయనకు ప్రార్థన చేసినట్టుగా లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి (ఆదికాండము 4:26, 9:26, 26:25‌, 28:16). కాబట్టి మోషేకంటే ముందున్న పితరులకు యెహోవా అనే నామం కచ్చితంగా తెలుసు. మరి ఆయన "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు" అని ఎందుకు అంటున్నట్టు? కొందరు ఈ ప్రశ్నకు సమాధానంగా పితరులెవ్వరికీ యెహోవా అనే నామం తెలియదనీ కానీ మోషే ఆదికాండాన్ని రాస్తున్నప్పుడు తానే పితరుల విషయంలో ఆ పేరును  ప్రస్తావించాడని చెబుతుంటారు. కానీ ఈ అభిప్రాయం సరైనది‌ కాదు. ఎందుకంటే మనం చూసిన సందర్భాలలో పితరులు స్పష్టంగా యెహోవా అనే నామంలో ప్రార్థన చేస్తున్నారు, ఆయనను అలానే సంబోధిస్తున్నారు. మోషే చరిత్రగానే ఉన్నది ఉన్నట్టు ఆ సందర్భాలను లిఖించాడు.

కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే బైబిల్ గ్రంథంలో "యెహోవా నామము" అన్నప్పుడు, దానిని అన్ని సందర్భాలలోనూ పేరు (sound) గా భావించకూడదు. ఉదాహరణకు; నిర్గమకాండము 34:5 లో దేవుడు మోషేకు మేఘములో నుండి యెహోవా అనే తన నామాన్ని ప్రకటించినట్టు రాయబడింది. అయితే అప్పటికే మోషేకు యెహోవా అనే నామం తెలుసు. మరి తెలిసిన నామాన్నే ఆయన మరలా ఎందుకు ప్రకటిస్తున్నట్టు? అందుకే ఆ క్రింది వాక్యభాగాలను మనం పరిశీలించినప్పుడు, దేవుడు తన గుణ లక్షణాలను ప్రకటిస్తున్నట్టుగా కనిపిస్తుంది (నిర్గమకాండము 34:6,7).

అలానే యోహాను 17:26 లో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి శిష్యులకు ఆయన నామాన్ని తెలియచేసానని ప్రార్థిస్తున్నాడు, పైగా ఇంకా తెలియచేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు గురించి బైబిల్ లో రాయబడినంతమట్టుకు ఆయన ఎక్కడా కూడా యెహోవా అనే పేరును ప్రకటించలేదు. ఎందుకంటే ఆయన కాలానికి యూదులు "యెహోవా అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదన్న ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని" ఆ పేరును ఉపయోగించడం మానేసారు. దానికి బదులు వారు దేవుణ్ణి "ఏలోహీం, అదోనాయ్" (ప్రభువు) అని పిలిచేవారు. శిష్యులకు ఈ చరిత్ర గురించీ యెహోవా అనే పేరు గురించీ బాగా తెలుసు. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రకటించిన తండ్రి నామం ఏంటంటే; ఆయన తన పరిచర్యలో తండ్రి యొక్క గుణలక్షణాలను నిర్విరామంగా ప్రకటించాడు. ఆ గుణలక్షణాలనే ఆయన తన ప్రార్థనలో తండ్రి నామంగా ప్రస్తావించాడు. ఈ రెండు ఆధారాలను బట్టి, దేవుని నామము అన్నప్పుడు ఆయన గుణలక్షణాలను కూడా సూచిస్తుందని అర్థమౌతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆయన మోషేతో "నీ పితరులకు యెహోవా అనే నా నామం తెలియబడలేదని" పలికిన మాటలను ఆలోచిస్తే, యెహోవా అనే నామానికి ఉన్నవాడని మరియు మాట ఇచ్చి నెరవేర్చేవాడని కూడా అర్థం వస్తుంది (యిర్మీయా 33:2).

ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తిమంతుడిగా వారికి అగుపించి, వారి సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసాడు (ఆదికాండము 12:7, 26:1-4, 28:13). కానీ ఆ నెరవేర్పును (మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా) వారు చూడలేదు. దానిని కేవలం మోషే/అతని తరం వారు‌ మాత్రమే చూస్తున్నారు. దీని గురించే ఆయన మోషేతో యెహోవా అనే నా నామం (మాట ఇచ్చి నెరవేర్చువాడను) వారికి తెలియబడలేదని, కానీ ఇప్పుడు మీరు ఆ నెరవేర్పును చూడబోతున్నారని ఆ భావంలోనే "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు" అని మాట్లాడుతున్నాడు.

ఆదికాండము 12:9,10 అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను. అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.

ఈ వచనాలలో అబ్రాహాము దేవుని పిలుపుమేరకు వెళ్ళిన కనాను దేశంలో కరవును ఎదుర్కొన్నట్టు, అప్పుడు అతను ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. దీనిని బట్టి మనం ఈలోకంలో దేవుని‌‌ ఆదేశానుసారంగానే నడుచుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోక తప్పదని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో అధైర్యపడకుండా ఆ పరిస్థితులు మన‌‌ విశ్వాసానికి పరీక్షలుగా భావించి, వాటినుండి తప్పించే దేవుని సహాయం కొరకు ఎదురుచూడాలి. భక్తుల జీవితాలలో ఎన్నోసార్లు ఇలాంటి పరీక్షలను మనం చూస్తుంటాం. అందుకే "నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి." (యాకోబు 5:10) అని రాయబడింది.

అయితే అబ్రాహాము దేవుని పిలుపుకు వ్యతిరేకంగానే ఐగుప్తుకు వెళ్ళాడని కొందరు బైబిల్ పండితులు భావిస్తుంటారు. ఎందుకంటే అతనిక్కడ దేవుని ఆదేశాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళినట్టు మనం చూడము. పైగా అక్కడికి వెళ్ళాక అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి శారయిని చెల్లెలని చెప్పవలసిన పరిస్థితి దాపరించింది. తర్వాతకాలంలో ఆ ఐగుప్తు నుండి తీసుకువచ్చిన హాగరు అనే దాసివల్లే అతని కుటుంబంలో అలజడి చెలరేగింది. ఈ కారణాలను‌ బట్టి అబ్రాహాము దేవుని పిలుపుకు విరుద్ధంగానే ఐగుప్తుకు వెళ్ళాడని భావించడం ఆమోదయోగ్యమే. మరొక విషయం ఏంటంటే ఇస్సాకు కూడా కనాను దేశంలో ఇలాంటి కరువునే ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అతడిని ఐగుప్తుకు వెళ్ళకుండా అడ్డుకున్నాడు (ఆదికాండము 26:1-3). కాబట్టి అబ్రాహాము కూడా ఐగుప్తుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అందుకే యాకోబు యోసేపు ఐగుప్తును ఏలుతున్నాడని తెలిసినప్పటికీ మనసులో ఉన్న ఈ సంశయంతో ఐగుప్తుకు వెళ్ళడానికి కాస్త భయపడ్డాడు. అప్పుడు దేవుడు అతనిని ధైర్యపరచి ఐగుప్తుకు వెళ్ళడానికి అనుమతించాడు (ఆదికాండము 46:2,3).

ఆదికాండము 12:11-13 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుకనిచ్చెదరు. నీవలన నాకు మేలుకలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.

ఈ వచనాలలో అబ్రాహాముకు తన భార్య అందాన్ని‌ బట్టి కలిగిన భయం వల్ల, ఆమెతో ఐగుప్తీయుల ముందు నువ్వు నా చెల్లెలివని చెప్పమనడం మనం చూస్తాం. అబ్రాహాము తన‌‌ తండ్రి ఇంటినుండి బయలుదేరేటప్పుడే ఇలాంటి ప్రణాళికను శారయితో పంచుకున్నట్టు అతని‌ మాటల్లోనే మనకు స్పష్టమౌతుంది (ఆదికాండము 20:11-13). అతను ఈ విధంగా చెయ్యడం చాలా పొరపాటుగానే ఉంది. ఎందుకంటే అతను తనను పిలిచిన దేవుని‌ కాపుదలపై కాకుండా ఒక అబద్ధం ద్వారా తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. పైగా దానివల్ల శారయి శీలానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అబ్రాహాము జీవితంలో మనకు కనిపించే ఇలాంటి పొరపాట్లను బట్టి, దేవుని‌చేత పిలువబడినవారు కూడా అపరాధాల్లో పడే అవకాశం ఉందని‌ మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసులు ఈవిధంగా దేవునిపట్ల అపరాధులు కాకుండా మరింత జాగ్రతగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ విశ్వాసులు కొన్నిసార్లు అపరాధాల్లో పడినప్పటికీ తమను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు‌ కాబట్టి వారు ఆ పిలుపును పోగొట్టుకోరు కానీ (రోమా 11:29, 2 తిమోతి 2:13). వారి అపరాధానికి క్రమశిక్షణ చెయ్యబడడం మాత్రం ఉంటుంది. కొన్నిసార్లు ఆ క్రమశిక్షణ చాలా భయంకరంగా ఉంటుంది. దావీదు, యాకోబు, సంసోనుల జీవితాలు.

అదేవిధంగా కొందరు, అబ్రాహాము‌ శారయిని తన చెల్లెలు అని చెప్పినదాని విషయమై, అతను గెరారు రాజుముందు మాట్లాడిన మాటలను అపార్థం చేసుకుని శారయి అబ్రాహాము తండ్రికి పుట్టిన కుమార్తెయని (సగం చెల్లి) భావిస్తుంటారు. కానీ అబ్రాహాము తండ్రియైన తెరహుకు ఆడసంతానం లేదు. ఎందుకంటే తెరహుకు ముందున్న పితరులకు ఆడసంతానం కలిగితే అది రాయబడింది‌. తెరహు విషయంలో మాత్రం అలా జరగలేదు (ఆదికాండము 11:26,27) పైగా శారయి తెరహుకు కోడలు అని స్పష్టంగా రాయబడింది (ఆదికాండము 11:31).

ఈ ఆధారాలను బట్టి, శారయి అబ్రాహాము తండ్రికి పుట్టిన స్వంత చెల్లి కాదు, ఆమె తెరహుకు కోడలు మాత్రమే. మరి అబ్రాహాము గెరారు రాజుదగ్గర ఆమె నా తండ్రి కుమార్తెయని ఎందుకు‌ సంబోధించాడో తెలుసుకోవాలంటే అది మనం హెబ్రీయుల కోణం నుండి‌ ఆలోచించాలి. హెబ్రీయులు తమ తండ్రి వంశపువారందరినీ "తండ్రి" అనే సంబోధిస్తారు. శారా అబ్రాహాము తండ్రి అయిన తెరహు తరంలోని వారికి (పెదనాన్న& చిన్నాన్న) పుట్టిన అమ్మాయి. ఈ కారణంతోనే అబ్రాహాము ఆమెను "నా తండ్రి కుమార్తె" అని సంబోధించాడు. అబ్రాహాము మాటల్లోనే శారా తన స్వంత చెల్లి కాదని మనకు స్పష్టం ఔతుంది. ఎందుకంటే తెరహుకు అబ్రాహామును కన్న భార్య తప్ప వేరే భార్య ఉన్నట్టు ఎలాంటి ఆధారం లేదు.

ఆదికాండము 12:14-16 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను. అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.

ఈ వచనాలలో ఐగుప్తీయులకు శారయి సౌందర్యవతిగా కనిపించడం, ఆ కారణంతో ఆమె ఫరో ఇంటికి తేబడడం మనం చూస్తాం. ఈ సందర్భాన్ని మనం పరిశీలించగలిగితే అబ్రహాము‌ కంటే శారయి 10 సంవత్సరాల చిన్నది (ఆదికాండము 17:17). అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 యేళ్ళ వయస్సుగలవాడు. అప్పటికి శారయికు 65 యేళ్ళు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఐగుప్తీయులు ఆమెను సౌందర్యవతిగా చూసి రాజు దగ్గరకు తీసుకువచ్చారు. దీనిని‌బట్టి కొందరు ముసలమ్మ అయిన శారయిను ఐగుప్తీయులు మరియు ఫరో సౌందర్యవతిగా భావించి ఆమెను ఆశించడం ఎలా సాధ్యమంటూ పరిహాసం చేస్తుంటారు. కానీ అప్పటి ప్రజల ఆహారపు అలవాట్లను బట్టి, వారు పెరిగిన ప్రాంతాలూ పరిస్థితులను బట్టి మనతో వారిని పోల్చుకోకూడదు. పైగా శారయి అప్పటికి ఇంకా పిల్లలను కనలేదు.

ఆదికాండము 12:17-20 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయిని బట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించినీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.

ఈ వచనాలలో దేవుడు శారయిని బట్టి ఐగుప్తీయులను దండించడం, వారు ఆమెను అబ్రాహాముకు అప్పగించి ఐగుప్తునుండి పంపివెయ్యడం మనం చూస్తాం. అబ్రాహాము తనకు కలిగిన భయంలో దేవుని‌ కాపుదలపై కాకుండా తన స్వంత‌ తెలివిపైనే ఆధారపడి‌ శారయి విషయంలో‌ అబద్ధం చెప్పినప్పటికీ దేవుడు ఇక్కడ ఆమెనూ అతడినీ కాపాడుతూ వారిపై తన కృపను చూపిస్తున్నాడు. దేవుని పిలుపు అందుకున్నవారి విషయంలో ఆయన కృప వారిని గమ్యం చేర్చేవరకూ విడిచిపెట్టదు అనేందుకు ఇదొక మంచి ఉదాహరణ. కాబట్టి దేవుని పిల్లలు ఆయన కృపపై నమ్మకముంచుతూ ముందుకు సాగాలి.

2 థెస్సలొనిక 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి (దుష్టునినుండి) కాపాడును.

Add comment

Security code
Refresh

Comments  

# RE: ఆదికాండము అధ్యాయము 12RAJARAO KOLAKALURI 2020-08-21 21:33
very good explanation sir
thank u very much sir
sir upload all explanations about the book of genesis
Reply
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.