పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

36:1, 36:2,3, 36:4,5, 36:6-8, 36:9-30, 36:31-43

ఆదికాండము 36:1
ఎదోమను ఏశావు వంశావళి ఇదే.

ఈ అధ్యాయంలో యాకోబు సోదరుడైన ఏశావు వంశావళి గురించి వివరించబడడం మనం చూస్తాం. రచయిత అతని వంశావళిని వివరించే క్రమంలో అతడిని ఎదోము అని సంబోధించాడు. ఏశావుకు ఎదోము అనే పేరు అతను ఎర్రని కూరను ఆశించి తన జేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న వృత్తాంతాన్ని సూచిస్తుంది (ఆదికాండము 25:29,30). కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ పొరపాటును గ్రంథకర్త అతని వంశావళి గురించి తెలియచేసేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవిధంగా అతని సంతానమంతా ఎదోము అనే పేరుతోనే పిలవబడింది.

అదేవిధంగా లేఖనం ఏశావును తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుని దేవునిచేత విసర్జించబడినవాడిగా పేర్కొంటుంది (హెబ్రీయులకు 12:16,17) అయినప్పటికీ‌ అతని వంశావళి లేఖనాలలో ఎందుకు రాయబడిందంటే ఏశావు యాకోబులు గర్భంలో ఉన్నప్పుడే ఏశావుకంటే యాకోబే గొప్ప జనం ఔతాడని రిబ్కాకు తెలియచెయ్యబడింది (ఆదికాండము 25:22,23). ఆయన చెప్పిన ఆ మాటల నెరవేర్పునే ఈ వంశావళి మనకు తెలియచేస్తుంది, తర్వాత మనం యాకోబు వంశావళిని, వారి చరిత్రనూ పరిశీలించి‌నప్పుడు ఏశావు కంటే యాకోబే గొప్పజనంగా కనిపిస్తాడు.

ఆదికాండము 36:2,3
ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను.

ఈ వచనాలలో ఏశావు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యల గురించి రాయబడడం మనం చూస్తాం. అయితే ఆదికాండము 26:34, 28:9 వచానాల్లో ప్రస్తావించబడిన వారి పేర్లకూ ఈ సందర్భంలో రాయబడిన పేర్లకూ తండ్రుల పేర్లతో సహా మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఆదికాండము 26:34 ప్రకారం; ఏలోను కుమార్తె బాశెమతు ఐతే ఈ సందర్భంలో ఆమె పేరు ఆదా అనీ బేయేరీ కుమార్తెయైన యహూదీతు ఐతే ఈ సందర్భంలో ఆనా కుమార్తె ఆహోలీబా అనీ 28:9 ప్రకారం; ఇష్మాయేలు కుమార్తె మహలతు ఐతే ఈ సందర్భంలో ఆమె పేరు బాశెమతు అనీ రాయబడింది. కాబట్టి కొందరు దీనిని‌ వైరుధ్యంలా భావిస్తుంటుంటారు, మరికొందరైతే ఇవి వేరే వేరే భార్యల పేర్లని చెబుతుంటారు, ఈ రెండూ వాస్తవం కాదు.

దీని గురించి వివరంగా తెలుసుకోడానికి ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

ఏశావు భార్యల పేర్ల విషయంలో వైరుధ్యం? - దానికి పరిష్కారం!!!

ఆదికాండము 36:4,5
ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.

ఈ వచనాలలో ఏశావుకు పుట్టిన ఐదుగురు కుమారుల గురించి రాయబడడం మనం చూస్తాం. వీరి నుండే ఏశావు సంతానం (ఎదోమీయులు) విస్తరించింది. ఈ క్రిందివచనాల్లో ఆ వివరాలు పొందుపరచబడ్డాయి. అయితే ఈ వచనాల్లో ఉన్న యూషు, రగూయేలు అనే పేర్లకూ 1 దినవృత్తాంతములు 1లోని పేర్లకూ కొంచెం తేడా కనిపిస్తుంది. అక్కడ ఇవే పేర్లు యెయూషు, రెయూవేలు అని రాయబడ్డాయి. కానీ మనం ఈ పేర్లను ఇంగ్లీషు బైబిల్ లో చూసినప్పుడు ఏవిధమైన తేడా కనిపించదు.

ఆదికాండము 36:6-8
ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులైయుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.

ఈ వచనాలలో ఏశావు తనకూ తన‌ తమ్ముడికీ ఉన్న విస్తారమైన సంపదను బట్టి వారు ఒకే స్థలంలో నివసించడం వీలుకాదని శేయీరు మన్యానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అయితే ఈ ఏశావు యాకోబు పద్దనరాము నుండి ‌వచ్చేసరికే శేయీరు మన్యంలో కాపురమున్నాడని రాయబడింది (ఆదికాండము 32:3). దీనిని కూడా కొందరు వైరుధ్యంలా ‌భావిస్తుంటారు కానీ ఏశావు అప్పటికే చాలా పశుసంపద, దాసదాసీలు కలిగినవాడుగా ఉన్నాడు కాబట్టి అతను కనాను దేశంలో తన తండ్రి దగ్గరే కాకుండా శేయీరు మన్యంలో కూడా నివసిస్తూ (తన పశువులను ఉంచుతూ) ఉండేవాడు. అలా నివసిస్తున్న ఏశావు దగ్గరకే యాకోబు పద్దనరాము‌ నుండి వచ్చేటప్పుడు దూతలను పంపించాడు. ఈ సందర్భం ప్రకారం; అతని తండ్రి చనిపోయాక ఆ సంపదలో తనకు రావలసిన భాగాన్నీ తనవారినీ తీసుకుని పూర్తిగా కనాను నుండి శేయీరుకు వెళ్ళిపోయాడు. ఇందులో‌ వైరుధ్యం ఏమీలేదు.

ఏశావు తన పొరపాటును బట్టి దేవుని చేత విసర్జించబడివాడు అయి‌నప్పటికీ అతను కాపురమున్న ఈ శేయీరు ప్రాంతాన్ని దేవుడే అతనికి ఇచ్చాడు (ద్వితియోపదేశకాండము 2:5). ఇది దేవుడు అందరిపైనా చూపించే సహజ కృపను తెలియచేస్తుంది. ఈ భూమిపై ఎంతటి దుష్టుడైనా ఆయన సహజకృపను బట్టే జీవించగలడు.

మత్తయి 5: 45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

అదేవిధంగా ఏశావు తన సహోదరుడైన యాకోబు ఎదుటనుండి శేయీరుకు వెళ్ళిపోవడంలో కనాను కేవలం యాకోబు సంతానానికి మాత్రమే స్వాస్థ్యమనే దేవుని వాగ్దానం కూడా నెరవేరుతుంది.

ఆదికాండము 36:9-30
శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే, ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు. వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశనివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ హేమీము. లోతాను సహోదరి తిమ్నా శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా. ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా. దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను. దీషాను కుమారులు ఊజు అరాను. హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.

ఈ వచనాలలో ఏశావు యొక్క సంతానపు‌ వివరాలు రాయబడడం మనం చూస్తాం. అదేవిధంగా ఈ జాబితాలో తేమాను అనేవాడూ (15వ) ఊజు అనేవాడు (28వ) మనకు కనిపిస్తున్నారు. ఈ ఊజు అనేవాడి సంతానం నివసించిన ప్రాంతానికే ఊజుదేశం అనే పేరు వచ్చింది (యోబు 1:1) ఈ ఊజుదేశం ఏశావు సంతతేయని తెలియచేసే మరొక స్పష్టమైన ఆధారం కూడా మనకు లేఖనం ఇస్తుంది.

విలాపవాక్యములు 4:21 "ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ", సంతోషించుము ఉత్సహించుము.

దీనిప్రకారం, యోబు గ్రంథంలో మనకు కనిపించే యోబు ఏశావు సంతతివాడని బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు. అయితే మరికొందరు దేవుని చేత విసర్జించబడిన ఏశావు సంతతిలో యోబు వంటి భక్తిపరుడు ఉండడం అసాధ్యమని కూడా భావిస్తుంటారు. కానీ యోబు ఏశావు సంతానపువాడు కాదని చెప్పడానికి ఈ అభ్యంతరం‌ సరిపోదు. ఎందుకంటే దేవునిచేత విసర్జించబడిన ప్రజల్లో కూడా కొందరు భక్తిపరులు మనకు తారసపడడం జరుగుతుంది. ఉదాహరణకు, ఈ వాక్యభాగం చూడండి.

ద్వితియోపదేశకాండము 23:3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరమువారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

ఈ వచనంలో దేవుడు మోయాబీయుడు‌ తన సమాజంలో (తన ప్రజలతో) చేరకూడదని చెబుతున్నాడు. అది మోయాబీయుల జాతి అంతటిగురించి చెప్పబడుతున్నప్పటికీ అందులో రూతు మినహాయించబడింది (రూతు 1:4) ఈ రూతు ద్వారానే బోయాజు దావీదుకు తాతయైన ఓబేదును కన్నాడు, ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో కూడా మనం చూస్తాం (మత్తయి 1:5. దీనిప్రకారం, రూతు ఏ విధంగా ఐతే మోయాబీయురాలైనప్పటికీ దేవుని కృపను పొందుకుని యెహోవా సమాజంలో చేరిందో‌ (తన జాతితో తెగదెంపులు చేసుకోవడం ద్వారా "రూతు 1:16), అదేవిధంగా ఏశావు సంతానంలో యోబుకూడా ఆ కృపను బట్టి భక్తిపరుడిగా జీవించాడు. యోబు ఏశావు సంతానపువాడే అనేందుకు మరొక ఆధారం కూడా ఏంటంటే పై వచనాలలో మనం ఏశావు సంతానం గురించి చదువుతున్నప్పుడు అక్కడ తేమాను అనేవాడి పేరు కూడా మనం చూసాం. అతని ద్వారానే తేమానీయులు వచ్చారు యోబు స్నేహితుడు కూడా తేమానీయుడే (యోబు 2:11.)

అయితే కొందరు యోబు అబ్రాహాము సమకాలికుడని చెబుతుంటారు, అలా చెప్పడానికి అబ్రాహాములా యోబు ఆస్తులు కూడా పశువులుగా చెప్పబడడం, తన కుటుంబానికే తానే యాజకుడిగా బలులు అర్పించడం చూపిస్తుంటారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మాత్రమే లేవీయులకు యాజకధర్మం అప్పగించబడింది, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 215 సంవత్సరాలు జీవించారు. కాబట్టి ఏశావు సంతానపు వాడైన ఊజు సంతానం ఆ కాలాన్ని‌ బట్టి విస్తరించి తమ పితరుడి పేరుతో దేశంగా పిలవబడడానికి ఈ సమయం‌ చాలు. ఈ మధ్యకాలంలోనే యోబు తన కుటుంబానికి యాజకుడిగా బలులు అర్పించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తిరిగివచ్చేటప్పుడు కూడా వారి సంపదలో పశువులు ఉన్నాయి. కాబట్టి యోబు అబ్రాహాము సమకాలికుడు అనే వాదన ఏవిధంగా చూసినా సరికాదు, అతను ఏశావు సంతతివాడే.

ఆదికాండము 36:31-43
మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజులెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నదీతీరమందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.

ఈ వచనాలలో, ఎదోము దేశపు రాజుల గురించి రాయబడడం మనం చూస్తాం. ఏశావు యాకోబు యెదుటనుండి పూర్తిగా శేయీరుకు వెళ్ళిపోయాక యాకోబు తనకు 130 సంవత్సరాలు వచ్చేవరకూ కనానులోనే నివసించాడు. ఆ తర్వాత అతను ఐగుప్తుకు వెళ్ళాక అతని సంతానం 215 సంవత్సరాలు అక్కడే బానిసలుగా జీవించారు. ఈమధ్యకాలంలో ఏశావు సంతానం బాగా విస్తరించి రాజుల పాలనలో కొనసాగించింది.

పై వచనాలలో ఏ రాజునూ ఇశ్రాయేలీయుల మీద రాజ్యపరిపాలన చేయక మునుపు అనే మాటలను బట్టి, కొందరు ఈ మాటలను మోషే రాయడం లేదని ఇశ్రాయేలీయులను కూడా రాజులు పరిపాలిస్తున్న సమయంలోనే ఎవరో ఒకరు రాసారని భావిస్తుంటారు. కానీ ఈ అభిప్రాయానికి ఇక్కడ తావులేదు ఎందుకంటే మోషే కాలానికి ఇశ్రాయేలీయులు రాజుల పాలన క్రిందలేనప్పటికీ భవిష్యత్తులో వారిని రాజులు పరిపాలిస్తారని మోషేకు దేవుడు తెలియచేసాడు (ఆదికాండము 35:11). ఇశ్రాయేలీయులను భవిష్యత్తులో రాజులు పరిపాలిస్తారని మోషేకు తెలుసు కాబట్టే ఆ రాజు ఎలా ఉండాలో కూడా అతను వారికి తెలియచేసాడు (ద్వితీయోపదేశకాండము 17:14-20). అదేవిధంగా మోషే కూడా ఇశ్రాయేలీయులకు రాజుగా పిలవబడ్డాడు (ద్వితీయోపదేశకాండము 33:4,5). కాబట్టి మోషే తనను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి రాజ్యపాలన వారికి లేని సమయంలోనే ఎదోమీయులు రాజ్యపాలనను కొనసాగించారని చెబుతున్నాడు.

ఇక ఎదోము రాజుల పతనం గురించిన రాయబడిన మాటలు చూడండి.

యెహెజ్కేలు 32:29 అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారియొద్ద ఉంచబడిరి. సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండుకొనిరి

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.