పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

43:1, 43:2, 43:3-5, 43:6,7, 43:8-10, 43:11, 43:12, 43:13, 43:14, 43:15, 43:16,17, 43:18, 43:19-22, 43:23, 43:24,25, 43:26, 43:27,28, 43:29, 43:30,31, 43:32, 43:33, 43:34

ఆదికాండము 43:1
ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక-

ఈ వచనంలో యోసేపు ద్వారా దేవుడు ప్రకటించిన కరువు కనాను దేశంలో కూడా భారంగా మారుతున్నట్టు మనం చూస్తాం. యాకోబు కుటుంబం ఇంకా అక్కడే ఉంది.

ఆదికాండము 43:2
వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా-

ఈ వచనంలో ఐగుప్తునుండి తన కుమారులు తీసుకునివచ్చిన ధాన్యం అయిపోవడంతో యాకోబు వారిని మరలా ధాన్యం‌కోసం ఐగుప్తుకు పంపే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. గత అధ్యాయంలో ఐగుప్తునుండి తిరిగివచ్చిన యాకోబు కుమారులు అక్కడ జరిగిందంతా అతనికి తెలియచేసి యోసేపు బెన్యామీనును తీసుకుని రమ్మన్నాడని చెప్పినప్పుడు దానికి యాకోబు ఏమాత్రం ఒప్పుకోలేదు.

ఆదికాండము 43:3-5
యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.

ఈ వచనాలలో యూదా ఐగుప్తులో యోసేపు పలికిన మాటలను తన తండ్రికి మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. యోసేపు వారితో ఆవిధంగా కఠినంగా మాట్లాడడానికి బెన్యామీనును తన దగ్గరకు రప్పించుకోవలనే ఉద్దేశమే కారణమని గడచిన అధ్యాయంలో మనం చూసాం.

ఆదికాండము 43:6,7
అందుకు ఇశ్రాయేలుమీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా వారు ఆ మనుష్యుడుమీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.

ఈ వచనాలలో యాకోబు వేసిన ప్రశ్నకు అతని కుమారులు ప్రత్యుత్తరమివ్వడం మనం చూస్తాం. ఈ విషయంలో వారు ఊహించని విధంగా యోసేపు స్పందించాడు కాబట్టి, వారు ఏదీ కూడా కావాలని చేసి తమ‌ తండ్రిని శ్రమపెట్టే ప్రయత్నం చెయ్యలేదు. కానీ గతంలో మాత్రం‌ వీరు యోసేపు విషయంలో అతడిని కావాలనే శ్రమపెట్టారు. కాబట్టి మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు దానివిషయంలో నిందపడకుండా తప్పించుకున్నప్పటికీ అది తప్పకుండా వేరేవిధంగా మనపైకి వచ్చి పడుతుంది.

ఆదికాండము 43:8-10
యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము. నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను. నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును. మాకు తడవు కాకపోయినయెడల ఈపాటికి రెండవమారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా-

ఈ వచనాలలో యూదా తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ బాధ్యతగా ప్రవర్తిస్తున్నట్టు మనం చూస్తాం. ఒకవేళ అతను అలా చెయ్యకపోతే తన తండ్రి బెన్యామీనును వారితో కలపి పంపకపోతే ఆ కుటుంబమంతా ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ యూదా గతంలో కూడా యోసేపును తన మిగిలిన సహోదరులు చంపాలని ప్రయత్నిస్తూ గుంటలో పడవేసినప్పుడు అతనికి ప్రాణహాని సంభవించకుండా తప్పించి ఐగుప్తుకు అమ్మివేసేలా ప్రేరేపించాడు (ఆదికాండము 37:26,27).

ఆదికాండము 43:11
వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో అట్లయిన మీరీలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొనిపోవుడి.

ఈ వచనంలో యాకోబు యూదామాట ప్రకారం బెన్యామీనును వారితో ఐగుప్తుకు పంపడానికి సిద్ధపడుతూ వారిని యోసేపు దగ్గరకు ఊరికే పంపకుండా కొన్ని కానుకలను పంపించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ కాలంలో గొప్పవారికి కానుకలను ఇవ్వడం, కానుకల ద్వారా సమాధానపడడం ఆనవాయితీ.

ఇక్కడ మనకు కరవు భారంగా ఉన్న దేశంలో యాకోబు యోసేపుకు పంపిస్తున్న కానుకలు ఎలా దొరికాయనే సందేహం రావచ్చు. అయితే ఆ కరవు ఐగుప్తులోనూ చుట్టుపక్కలున్న దేశాలలోనూ భారంగా ఉన్నప్పటికీ ఆ కరవు ప్రధానంగా ప్రజలు తినే ఆహారం విషయంలో సంభవించింది ఫరో కలలో కూడా దానినే మనం చూస్తాం. యాకోబు పంపిస్తున్న కానుకలు ప్రజలు ప్రధానంగా తినే ఆహారం (ధాన్యాలు) కాదు.

అదేవిధంగా కొన్ని ప్రాంతాల భూమిలో పండే వనరులు మరికొన్ని‌ ప్రాంతాల భూమిలో పండవు. ఈవిధమైన దేవుని సృష్టి వెనుక ఆయన జ్ఞానం దాగియుంది. దీనివల్ల ఒక ప్రాంతపు ప్రజలు మరో ప్రాంతానికి సంచరిస్తూ వ్యాపారాలను చెయ్యగలుగుతారు దీనివల్ల వారిమధ్య సంబంధాలు పెంపొందుతాయి.

ఆదికాండము 43:12
రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరబాటైయుండును.

ఈ వచనంలో యాకోబు తన‌ కుమారుల ద్వారా యోసేపు యొద్దకు కానుకలను మాత్రమే కాకుండా ధాన్యాన్ని కొనడానికి అవసరమైన ధనాన్నీ గతంలో వారి సంచులలో తిరిగి వచ్చిన ధనాన్ని కూడా పంపించడం మనం చూస్తాం. గతంలో వారి సంచుల్లో వారికి తమ తమ ధనం తిరిగిరావడం పొరపాటువల్ల జరిగిందని అతను భావించాడు. ఇలాంటి పొరపాట్లు చాలా విషయాలలో జరుగుతాయి కానీ కొందరు మాత్రం ఆ పొరపాటు వల్ల తమకు లబ్ధి కలుగుతుంటే దానిని బయటపెట్టే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇక్కడ యాకోబు అలా చెయ్యకుండా తన కుమారులకు నిజాయితీ నేర్పిస్తున్నాడు. విశ్వాసులు ఇటువంటి నిజాయితీని ఎప్పుడూ కోల్పోకూడదు.

ఆదికాండము 43:13
మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.

ఈ వచనంలో యాకోబు యూదా కోరినట్టు బెన్యామీనును వారితో ఐగుప్తుకు పంపించడం మనం చూస్తాం. ఒకవేళ ఇప్పుడు కూడా యాకోబు బెన్యామీనును వారితో పంపకుంటే అది జ్ఞానం అనిపించుకోదు. ఎందుకంటే బెన్యామీను ఐగుప్తుకు వెళ్తే అతనికి హాని జరుగుతుందో లేదో అతనికి కచ్చితంగా తెలియదు‌ కానీ అతనిని పంపకుంటే మాత్రం ఆ కరవు వల్ల బెన్యామీనుతో సహా యాకోబు కుటుంబం అంతా నశించిపోతుంది. కాబట్టి విశ్వాసులు తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఏది ఎక్కువ కీడు కలిగిస్తుందో వివేచించి నడచుకోవాలి.

ఆదికాండము 43:14
ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీకప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.

ఈ వచనంలో యాకోబు బెన్యామీనును ఐగుప్తుకు పంపుతూ సర్వశక్తుడైన దేవునిపై ఆధారపడడం మనం చూస్తాం. ఇక్కడ యాకోబు మొదటిగా యోసేపుతో సమాధానపడే తన ప్రయత్నంగా అతనికి కానుకను‌ పంపిస్తూ మరలా దేవునిపై ఆధారపడుతున్నాడు. గతంలో ఏశావు విషయంలో కూడా ఇతను అదేవిధంగా అతనికి కానుకను పంపించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం‌ కనిపిస్తుంది. మనకేదైనా చిక్కు ఎదురైనప్పుడు దానినుండి తప్పించుకోడానికి దేవుడు మనకిచ్చిన సహజ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మన ప్రయత్నం మనం చెయ్యాలి. అదేసమయంలో దేవునిపై ఆధారపడాలి. కొందరు ఈవిధంగా చెయ్యకుండా అంతా దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా తమ ప్రయత్నమేమీ చెయ్యరు. మరికొందరు తమ స్వంత ప్రయత్నాలు చేసి దేవునిపై ఆధారపడరు. ఈ రెండూ కూడా సరైనవి కావు.

అదేవిధంగా ఇక్కడ యాకోబు మాటల్లో ఒకవేళ నేను పుత్రహీనుడిగా ఉండవలసి వస్తే అలానే ఉంటానంటూ మేలుకే కాదు కీడుకు కూడా సిద్ధపడడం మనకు కనిపిస్తుంది. చాలామంది విశ్వాసులు దేవుని నుండి మేలునే ఆశిస్తారు తప్ప ఏదైనా కీడు జరిగితే మాత్రం సహించలేరు. ఇది నిజవిశ్వాసికి‌ ఉండవలసిన‌ లక్షణం కాదు‌. మనం మేలునైనా కీడునైనా సమానంగా స్వీకరించగలగాలి. ఎందుకంటే అవి రెండూ కూడా దేవునియొద్దనుండే (ఆయన అనుమతితోనే) మనకు సంభవిస్తాయని వాక్యం సెలవిస్తుంది.

విలాపవాక్యములు 3:38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?

యెషయా 45:7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.

ఈవిషయంలో దానియేలు స్నేహితులైన షద్రకు, మేషాకు, అబెద్నెగోలు మనకు మంచి మాదిరిగా కనిపిస్తున్నారు. నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో వేసే సమయంలో వారు ఆయన మమ్మల్ని ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన‌ మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ మేము‌ దానికి సిద్ధమేనంటూ అతనిముందు ధైర్యంగా మాట్లాడారు (దానియేలు 3:17,18).

ఆదికాండము 43:15
ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.

ఈ వచనంలో యాకోబు కుమారులు బెన్యామీనుతో సహా ఐగుప్తులోని యోసేపు దగ్గరకు చేరడం మనం చూస్తాం.

ఆదికాండము 43:16,17
యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.

ఈ వచనాలలో యోసేపు తనకు అప్పగించబడిన బాధ్యతలో ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో మరోసారి మనం చూస్తాం. ఎందుకంటే బెన్యామీనును చూడగానే యోసేపు తన ధాన్యపు అమ్మకపు పనిని విడిచిపెట్టి వచ్చెయ్యకుండా వారిని తన గృహనిర్వాహకుడికి అప్పగిస్తున్నాడు. విశ్వాసులు తమకు అప్పగించబడిన పనిలో ఇలాంటి నిబద్ధతను చాటుకోవాలి.

ఆదికాండము 43:18
ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.

ఈ వచనంలో యాకోబు కుమారులు గతంలో వారి సంచుల్లో తిరిగివచ్చిన ధనాన్ని బట్టి దాసులుగా పట్టబడతామని భయపడడం‌ మనం చూస్తాం. ఎందుకంటే వీరికి ఐగుప్తు బాష తెలియదు‌.

ఆదికాండము 43:19-22
వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి అయ్యా ఒక మనవి. మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలోనెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.

ఈ వచనాలలో యోసేపు‌ ఇంటికి చేరుకున్న యాకోబు కుమారులు తమకున్న భయం చేత జరిగిన సంగతిని ఆ గృహనిర్వాహకుడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. వారి ఈ సంభాషణ అంతా అనువాదకుడి ద్వారానే జరుగుతూ వచ్చిందని గత అధ్యాయంలో మనం చూసాం.

ఆదికాండము 43:23
అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను.

ఈ వచనంలో యోసేపు గృహనిర్వాహకుడు యాకోబు కుమారులతో పలుకుతున్న మాటలను బట్టి అతనికి యోసేపు ప్రణాళిక ఏంటో బాగా తెలుసని మనకు అర్థమౌతుంది. అతను యాకోబు కుమారుల పితరుల దేవుడి గురించి ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడు‌. దీనిని బట్టి యోసేపు తన సేవకులకు తన దేవుని గురించి ప్రకటిస్తూవచ్చాడు. కాబట్టి విశ్వాసులు ప్రతీచోటా తమ దేవుని నామాన్ని ప్రకటించేవారిగా ఉండాలి.

ఆదికాండము 43:24,25
ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.

ఈ వచనాలలో యోసేపు అన్నలు అతని‌ ఇంటికి చేరడం, ఆ గృహనిర్వాహకుడు వారితో మర్యాదగా ప్రవర్తించడం మనం చూస్తాం. దీనిద్వారా అతను వారి మనసులో ఉన్న భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆదికాండము 43:26
యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.

ఈ వచనంలో యోసేపు వారితో గతంలో చెప్పిన కల నేరవేర్పుగా వారు మరోసారి అతనిముందు సాగిలపడడం తమ కానుకలను అతనికి ఇవ్వడం మనం చూస్తాం.

ఆదికాండము 43:27,28
అప్పుడుమీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.

ఈ వచనాలలో యోసేపు యాకోబు గురించి, వారిని ప్రశ్నించడం, అతను అడిగిన ప్రశ్నకు వారు సమాధానమిస్తూ తమ తండ్రియైన యాకోబును కూడా అతనికి దాసుడని ఒప్పుకోవడం మనం చూస్తాం. యోసేపు కలలో అతనికి సాష్టాంగపడిన వారిలో యాకోబు కూడా ఉన్నాడు (ఆదికాండము 37:9,10). అది దృశ్యరూపకంగా జరగకపోయినప్పటికీ యాకోబు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు అతను కూడా యోసేపు అధికారం క్రిందనే జీవించాడు కాబట్టి అది ఆ విధంగా నెరవేరింది.

ఆదికాండము 43:29
అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచిమీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను.

ఈ వచనంలో యోసేపు తన తమ్ముడైన బెన్యామీనును కుమారుడని సంబోధించడం మనం చూస్తాం. హెబ్రీయుల సంస్కృతిలో తమకంటే చిన్నవారిని కుమారులుగా సంబోధించే పద్ధతి ఉన్న కారణం చేత యోసేపు ఇక్కడ తన తమ్ముడిని అలా సంబోధించి దీవించాడు.

ఆదికాండము 43:30,31
అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుతాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.

ఈ వచనంలో యోసేపు బెన్యామీనుపై ఉన్న ప్రేమతో ఏడ్వడం మనం చూస్తాం. అయినప్పటికీ అతను వారి విషయంలో వేసిన ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు కాబట్టి తాను ఎవరో వారికి ఇంకా తెలియచెయ్యాలి అనుకోవడం లేదు.

ఆదికాండము 43:32
అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తీయులకు హేయము.

ఈ వచనంలో యోసేపు ఇంటిలో ఉన్న ఐగుప్తీయులైన పనివారు, అతని సహోదరులు వేరుగా భోజనానికి కూర్చోవడం, ఐగుప్తీయులకు హెబ్రీయులతో కలసి భోజనం చెయ్యడం హేయమని రాయబడడం‌ మనం చూస్తాం. దీనికి కొందరు బైబిల్ పండితులు ఐగుప్తీయులు పూజించే జంతువులను హెబ్రీయులు తింటారు కాబట్టి వారితో కలసి భోజనం చెయ్యడం ఐగుప్తీయులు హేయంగా భావించేవారని వివరణ ఇచ్చారు దీనికి వారు ఒక లేఖన ఆధారాన్ని కూడా చూపించే ప్రయత్నం చేసారు.

నిర్గమకాండము 8:25,26 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించిమీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.

అయితే ఈ వివరణ ఈ సందర్భానికి అంత సమంజసంగా అనిపించడం లేదు. ఎందుకంటే యోసేపు తన సహోదరులకు విందుచేసేటప్పుడు వారితో కలసి తన ఇంట్లో ఐగుప్తీయులు కూడా భోజనం చేస్తారని తెలిసి వారు పూజించే జంతువులను ఎందుకు సిద్ధం చేయిస్తాడు? కాబట్టి దీనివెనుక వేరే కారణం ఏదో‌ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలసి భోజనం చెయ్యడాన్నే కాదు గొర్రెలకాపరియైన ప్రతీవాడినీ హేయులుగానే భావించేవారు.

ఆదికాండము 46:33 గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల-

దీనికి కారణం ఏంటంటే కనాను దేశంలో నివసిస్తున్న కనానీయులు మరియు "Phoenician" అనే ప్రజలు ఐగుప్తు దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించి ఆ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు ఆ రెండు గుంపుల‌ ప్రజలూ ఎక్కువశాతం గొఱ్ఱెలకాపరులే.‌ అందుకే ఐగుప్తీయులు కనాను దేశానికి చెందిన గొఱ్ఱెల‌ కాపరులందరినీ ద్వేషించేవారు. హెబ్రీయులు కూడా కనాను దేశంలో గొఱ్ఱెల కాపరులే కాబట్టి యోసేపు ఇంటిలోని‌ ఐగుప్తీయులు వారితో కలసి భోజనం చెయ్యలేదు అప్పటికి వారు యోసేపు సహోదరులని వారికి‌ తెలియదు. ఈ చరిత్రను యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ రచించిన "The Antiquities Of The Jews" అనే పుస్తకాన్ని తర్జుమా చేసిన బిషప్ "Comberland" గారు ఆ బుక్ నంబర్ 2.7.5 పుట్ నోట్ లో ప్రస్తావించారు.

అదేవిధంగా ఇక్కడ యోసేపు ఐగుప్తీయులందరికీ ప్రధానిగా ఉన్నప్పటికీ వారు తన సహోదరులతో కలసి భోజనం చెయ్యాలని వారిని ఇబ్బంది పెట్టలేదు. అలా చేస్తే అది బలవంతంగా వారి ఆచారాలను నిలువరించే ప్రయత్నం చేసినట్టుగా ఔతుంది. కాబట్టి విశ్వాసి ఎప్పుడూ కూడా బలవంతంగా ఒకరిపై తన విశ్వాసాన్ని రుద్దే ప్రయత్నం చెయ్యకూడదు‌. మన విశ్వాసంలో ఉన్న సత్యమేంటో వారికి ప్రకటించినప్పుడు వారు స్వేచ్ఛగా దానికి లోబడాలి అనుకున్నపుడు మాత్రమే వారిని మనతో కలపుకోవాలి.

ఆదికాండము 43:33
జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.

తెలుగుబాషలో ఈ వచనపు అనువాదంలో కాస్త లోపం ఉంది. ఇక్కడ భోజనానికి వరుసగా యోసేపు సహోదరులే కూర్చున్నట్టుగా తర్జుమా చేసారు కానీ వాస్తవానికి వారిని వయసుల చొప్పున వరుసక్రమంలో యోసేపే కూర్చోబెట్టాడు. అందుకే వారు తమ వయస్సుల చొప్పున వరుసగా కూర్చోబెట్టడానికి అతనికి మా వయస్సులు ఎలా తెలుసని వారు ఆశ్చర్యపడ్డారు.

ఆదికాండము 43:34
మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

ఈ వచనంలో యోసేపు తన అన్నలను గౌరవిస్తున్నట్టు సూచనగా తన భోజనపు బల్లదగ్గర నుండే వారికి ఆహారం పంపించడం‌ మనం చూస్తాం. అయితే అతను తన తమ్ముడైన బెన్యామీనుకు మిగిలినవారికంటే ఐదువంతులు ఎక్కువగా పంపించాడు. దీనికి కారణం వారికంటే బెన్యామీను ఎక్కువ తింటాడని ‌కానీ యోసేపు మనసులో పక్షపాతం ఉందని‌ కానీ కాదు. గతంలో యాకోబు తన కుమారులందరికంటే ఇతడిని ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు వారు అసూయతో పగపట్టి తన క్షేమసమాచారాన్ని కూడా అడగకుండా ఉండేవారని యోసేపుకు తెలుసు. ఈ సందర్భంలో బెన్యామీనుపై యోసేపు ఎక్కువ శ్రద్ధను తీసుకుంటున్నప్పుడు వారి మనస్సుల్లో అదే అసూయ ఇంకా నిలిచియుంటే ముఖాన్ని చూసి మనసును గుర్తించే యోసేపుకు అది సులభంగా అర్థమైపోతుంది (ఆదికాండము 40:7). అందుకే వారిని పరీక్షించడానికి యోసేపు బెన్యామీనుకు వారందరికంటే ఎక్కువ ఆహారాన్ని పంపించాడు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.