పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

 ఈ అధ్యాయంలో మనం అబ్రాహాము కెతూరాల‌ వివాహం మరియు వారి సంతానం (1-4వ). కుమారులకు ఆస్తిపంపకం(5,6వ), అబ్రాహాము మృతిబొంది సమాధి చేయబడడం (7-11వ), ఇష్మా యేలు వంశావళి (12-18వ), ఇస్సాకుకు సంతానం అనుగ్రహించబడడం ( 19-26వ) మరియు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించడం (27-34) గురుంచి చదువుతాం.

ఆదికాండము 25:1-5

అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.

ఈ సందర్భంలో అబ్రాహాము కెతురా అనే స్త్రీని వివాహం చేసుకుని పిల్లల్ని కన్నట్టు రాయబడింది. దీనిపై కొందరు బైబిల్ పండితులు రెండురకాలైన అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. మొదటి అభిప్రాయం ప్రకారం - 'ఈ కెతురా, హాగరు ఇద్దరూ ఒకరే; అబ్రాహాము ఆమెను ఇంటి నుండి పంపివేసిన తరువాత ఆమె మరొక పురుషుణ్ణి చేరకుండా నిజాయితీగా ఉండబట్టి ఆమెకు ఆ పేరు పెట్టబడింది. శారా చనిపోయాక అబ్రాహాము ఆమెనే మరలా తీసుకుని వచ్చాడు‌.' కానీ, ఒకవేళ హాగరు, కెతురాలు ఇద్దరూ ఒకరే అయితే వీరి ద్వారా అబ్రాహాముకు వేరువేరుగా పిల్లలు పుట్టినట్టు ఎందుకు రాయబడింది? ఉదాహరణకు, ఇదే అధ్యాయం 12వ వచనంలో హాగరుకు జన్మించిన ఇష్మాయేలు గురించి రాయబడింది. అదేవిధంగా, 1 దినవృత్తాంతములు 1:32లో ఈ కెతురా సంతతి గురించి వేరుగా రాయబడింది, ఆ తర్వాతి వచనాల్లో ఇస్సాకు, ఇష్మాయేలు గురించి రాయబడింది. పైగా అబ్రాహాము జీవితం ఒక చరిత్రగా వరుసక్రమంలో రాయబడింది, దీన్నిబట్టి ఈ కెతురానే హాగరు అని చెప్పడం వీలుపడదు.

రెండవ అభిప్రాయం ప్రకారం, శారా బ్రతికుండగానే ఈ కెతురా అనే స్త్రీని అబ్రాహాము వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే నూరేళ్ళ వయసులోనే  అబ్రాహాము తనకిక పిల్లలు పుట్టరనే ఆలోచనలో పడ్డాడు; శారా చనిపోయేసరికి అబ్రాహాము వయసు 137. ఈ వయసులో అబ్రాహాము మరొక స్త్రీని వివాహం చేసుకుని పిల్లల్ని కనడం అసాధ్యమని ఇలా నమ్మేవారి వాదన. కానీ, అబ్రాహాము కెతూరాను శారా చనిపోయాకే వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు.

ఎందుకంటే, పైన చెప్పినట్టుగా అబ్రాహాము జీవితం వరుసక్రమంలో రాయబడింది; దీనిప్రకారం శారా చనిపోయాకే అబ్రాహాము కెతురాని వివాహం చేసుకోవాలి. అదేవిధంగా, శారా తనకిక పిల్లలు పుట్టరనే అభిప్రాయంతోనే ఐగుప్తీయురాలైన హాగరుని అబ్రాహాముకు భార్యగా ఇచ్చింది. దానికారణంగా వారి కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి.

అబ్రాహాము కూడా శారా చేత నిందించబడ్డాడు, చివరికి ఆమెను, ఆమె కుమారుణ్ణి ఇంటి నుండి పంపించివేశారు. ఇదంతా జరిగి, శారాకు ఒక కుమారుడు జన్మించాక, ఆమె బ్రతికుండగానే మరొక వివాహం చేసుకోవలసిన అవసరం అబ్రాహాముకు ఏముంది? దానికి శారా అంగీకరిస్తుందా? కాబట్టి ఈ అభిప్రాయం సరైంది కాదు. ఈ అభిప్రాయం నమ్ముతున్నవారి ప్రశ్నకు సమాధానమివ్వడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అబ్రాహాము నూరేళ్ళ వయసులో ఇస్సాకును కన్నట్టే, శారా చనిపోయాక కెతురా వల్ల కూడా అతనికి సంతానం కలిగేలా దేవుడు ఆశీర్వదించాడు. వారిలో ఇస్సాకు మాత్రమే వాగ్దానపుత్రునిగా గుర్తించబడినప్పటికీ మిగిలినవారు కూడా శారీరకంగా అబ్రాహాము సంతానమే, వంశావళి క్రమంలో కూడా ఆ విధంగానే రాయబడింది.

ఆదికాండము 25:6
అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడైయుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.

ఈ సందర్భంలో అబ్రాహాము తాను‌ బ్రతికుండగానే అతని కుమారులకు రావలసిన ఆస్తిభాగాలను అప్పగించి వారిని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు ఎదుట నుండి పంపివేసినట్టు కనిపిస్తుంది. దేవుని పిలుపు మేరకు వాగ్దానపుత్రుడైన ఇస్సాకు మాత్రమే ఆ భూమికి హక్కుదారుడు కాబట్టి అబ్రాహాము ఆ‌ విధంగా చేసాడు. అబ్రాహాము చేసిన ఈ పనిని బట్టి‌ విశ్వాసులు రెండు విషయాలను అలవర్చుకోవాలి.

1) అబ్రాహాము తాను బ్రతికున్నపుడు తన పిల్లల కోసం నిజాయితీగా ఆస్తిని సంపాదించాడు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి కోసం సంపాదించడం తల్లితండ్రుల బాధ్యత.

2కోరింథీయులకు 12:14 పిల్లలు తలిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా.

ఒకవేళ ఏ తండ్రైనా ఉద్దేశపూర్వకంగా సోమరిగా మారి తన కుటుంబానికి పోషణను చేకూర్చకపోతే అతను అవిశ్వాసికన్నా చెడ్డవాడు.

మొదటి తిమోతికి 5:8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడైయుండును.

2) అబ్రాహాము తాను బ్రతికుండగానే తనపిల్లలకు రావలసిన భాగాలను పంచిపెట్టడం ద్వారా అతను చనిపోయాక వారి మధ్య ఆస్తి విషయంలో ఎటువంటి తగాదాలు రాకుండా జ్ఞానయుక్తంగా బాధ్యతతో ప్రవర్తిస్తున్నాడు. తల్లితండ్రులు బ్రతికున్నపుడే కాదు చనిపోయాక కూడా వారి పిల్లల మధ్య ఆస్తి విషయంలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా బ్రతికున్నపుడే పంపకాలు చేయాలి.

అదేవిధంగా ఈ సందర్భంలో మిగిలిన పిల్లల్ని కన్నటువంటి తల్లులు(హాగరు,కెతురా) అబ్రాహాము ఉపపత్నులని రాయబడింది. 1 దినవృత్తాంతములు 1:32లో కూడా కెతూరా ఉపపత్ని అని రాయబడింది. అయితే ఈ అధ్యాయం ప్రారంభ వచనంలో, కెతూరాని అబ్రాహాము వివాహం చేసుకున్నాడని, అదేవిధంగా‌ ముందటి సందర్భంలో శారా హాగారును అతనికి‌ భార్యగా ఇచ్చిందని రాయబడింది. ఇంతకూ హాగరు, కెతూరాలు అబ్రాహాము భార్యలా లేక ఉపపత్నులా? దీనికి సమాధానం చూద్దాం - అబ్రాహాముకు చాలామంది పిల్లలు పుట్టి‌నప్పటికీ వారిలో ఇస్సాకు మాత్రమే ఏ విధంగా వాగ్దానపుత్రునిగా గుర్తించబడ్డాడో, అదేవిధంగా అబ్రాహాము హాగరు, కెతూరాలను వివాహం చేసుకుని భార్యలుగా భావించినప్పటికీ  దేవునివాక్యం వాగ్దానపుత్రుడిని కన్న భార్యయైన శారాకు మాత్రమే ప్రాముఖ్యతను ఆపాదిస్తూ మిగిలిన ఇద్దరూ ఉపపత్నులని పేర్కొంది.

ఆదికాండము 25:7-10
అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి బొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుటనున్నది. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.

ఈ సందర్భంలో అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికి మరణించినట్టు చూస్తాం. బైబిల్ గ్రంథంలో పదేపదే,  మరణం గురించి తెలియచేసేలా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారనే పదప్రయోగం కనిపిస్తుంది. అదేవిధంగా, అబ్రాహాము ఎఫ్రోను దగ్గర కొన్న పొలం గురించి ప్రస్తావించబడి అతన్ని అక్కడ సమాధి చేసినట్టు రాయబడింది. క్రింది వచనంలో అది హేతు కుమారుల దగ్గర కొన్నట్టు కూడా రాయబడింది. వాస్తవానికి అబ్రాహాము ఆ పొలాన్ని ఎఫ్రోను దగ్గరే కొన్నప్పటికీ, దానికి సాక్షులుగా హేతుకుమారులు‌ ఉండి, వారిచేతుల మీదుగా అబ్రాహాముకు అది స్థిరపరచబడినందున వారి గురించి ప్రస్తావించబడింది. దీనిగురించి 23వ అధ్యాయంలో కూడా వివరించడం జరిగింది.

ఆదికాండము 25:11
అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను.

అబ్రాహాముకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం, వాగ్దానపుత్రుడైన ఇస్సాకుకు సంతరించుకుంటున్నట్టు ఈ సందర్భం తెలియచేస్తుంది, తరువాత యాకోబు కూడా ఈ ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఇదంతా అబ్రాహాముకు దేవుడిచ్చిన పిలుపు మేరకే జరుగుతుంది.

ఆదికాండము 25:12-18
ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమానమశ్శా హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.

ఆదికాండము 17:20 వచనంలో దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా, ఆయన ఇష్మాయేలును ఆశీర్వదించి, అతని నుండి 12మంది రాజులు వచ్చేట్టు చేసాడు, ఆ చరిత్ర తెలిసిన మోషే దీన్ని రాస్తున్నాడు.

ఆదికాండము 25:19-21
అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి యునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.

దేవుడు తన భక్తుల ప్రార్థనను సాధనంగా వాడుకుని తన చిత్తాన్ని నెరవేరుస్తాడనడానికి ఇదొక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే,  దేవుడు అబ్రాహాముతో  అతని సంతానాన్ని ఆకాశనక్షత్రాలవలే విస్తరింపచేస్తానని ఆ సంతానం ఇస్సాకు మూలంగా కలుగుతుందని ముందే చెప్పాడు. దాన్ని తన చిత్తప్రకారం ముందుగా‌నే ఆయన నిర్ణయించాడు.

అయితే ఇస్సాకు భార్య ఈ సందర్భంలో గొడ్రాలుగా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇస్సాకు ప్రార్థనను దేవుడు సాధనంగా వాడుకుని ఆమె గర్భవతి అయ్యేలా కృప చూపాడు. అదేవిధంగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు మోరియా పర్వతంపైన అబ్రాహాముతో చెప్పి‌నపుడు, అక్కడ ఇస్సాకు కూడా ఉండి ఆ మాటలు విన్నాడు. అది జరిగి తీరుతుందని ఇస్సాకుకు తెలిసినా తన బాధ్యత ప్రకారం గర్భఫలం నిమిత్తం దేవునికి ప్రార్థించాడు. దీనిప్రకారం, దేవుడు వాగ్దానం చేసినప్పటికీ మానవ బాధ్యతగా ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థించాలి. ప్రస్తుతం మనమంతా మన బాధ్యతగా ఆయన వాక్యంలో బయలుపరచబడ్డ ఆయన చిత్తనెరవేర్పుకై ప్రార్థించాలి.

ఆదికాండము 25:22
ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగవెళ్లెను.

సాధారణంగా స్త్రీలు గర్భవతులుగా ఉన్నపుడు శిశువు యొక్క కదలికలు వారికి తెలుస్తుంటాయి; ఆ విషయంలో రిబ్కా
అప్పటికే‌ పిల్లలను కన్న స్త్రీలను వాకబు చేయడం ద్వారా ఆమె గర్భంలో శిశువు మాత్రం ఇతరులవలే కాకుండా అసాధారణంగా పెనుగులాడుతున్నట్టు గ్రహించింది. అందుకే తనకు మాత్రమే ఇలా ఎందుకు ఔతుందనే వేదనతో, దేవుని దగ్గరకు తెలుసుకోవడానికి వెళ్ళింది. తెలుగు బైబిల్ లో ఈ వచనంలో ఇలా అయితే నేను బ్రతకడంయెందుకని తర్జుమా చేసినప్పటికీ ఇంగ్లీష్ బైబిల్ KJVలో మనం చూస్తే ఇలా నాకేయెందుకు ఔతుందనే తర్జుమా చేయబడింది. Genesis 25:22 And the children struggled together within her; and she said, If it be so, why am I thus? And she went to enquire of the LORD.

అదేవిధంగా, ఈ సందర్భంలో రిబ్కా తన గర్భంలో శిశువు అసాధరణంగా పెనుగులాడడం గ్రహించి దేవుని దగ్గర అడగడానికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కొందరు దీనిని అపార్థం చేసుకుని ఆమె దేవునితో ముఖాముఖిగా ఆ విషయం మాట్లాడిందని భావిస్తుంటారు. కానీ, ఇక్కడ మనం ఆ విధంగా భావించకూడదు, అదే నిజమైతే ఆమె మరోచోటికి వెళ్ళడమెందుకు? ఆమె ఉన్న చోటనే మాట్లాడితే దేవుడు ప్రత్యుత్తరమియ్యడా? ఒక వ్యక్తి దేవుని నుండి ఏదైనా తెలుసుకోవాలనుకున్నపుడు ప్రవక్త దగ్గరకు కానీ, యాజకుడి దగ్గరకు కానీ వెళ్ళి ఆ విషయం తెలియచేయడం దేవుడు ఆ ప్రవక్త/యాజకుడి ద్వారా ప్రత్యూత్తరమియ్యడం మనకు బైబిల్ లో అనేక సందర్భాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు -

మొదటి సమూయేలు 30:7,8 పిమ్మట దావీదు-ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను. నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా-తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

రెండవ రాజులు 3:11-13 యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యహోషాపాతు యెహోవా ఆజ్ఞ యితని ద్వారామనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. ఆలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింప వలెనని యెహోవా, రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు-

ఈ విధంగా మనం చూసినపుడు రిబ్కా దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేదనీ, ఆ విషయం వేరొకరి ద్వారా కనుక్కునేందుకు వెళ్ళిందని అర్థమౌతుంది. ఇప్పుడు ఆమె ఆ విషయం కనుక్కునేందుకు ఎవరి దగ్గరకు వెళ్ళుంటుందనే ప్రశ్న వస్తుంది. కొందరు బైబిల్ పండితులు ఆమె యాజకుడైన మెల్కీసెదెకు దగ్గరకు వెళ్ళిందని చెబుతుంటారు కానీ, ఆమెకు అంత అవసరం లేదు. ఎందుకంటే, ఆమె మామగారైన అబ్రాహాము దేవుని స్నేహితుడిగా పేరొందినవాడు, గతంలో ఎన్నోసార్లు దేవుడు ఆయనతో మాట్లాడి అతని ఇంట భోజనం కూడా చేసాడు. దేవుడు ఒక సందర్భంలో‌ నేను చేయబోయే కార్యాన్ని అబ్రాహాముకు దాచనని చెప్పడం ఆదికాండము‌ 18:17లో మనకు కనిపిస్తుంది. ఆ పట్టణాలను నాశనం చేసే కార్యమే ఆయన అబ్రాహాముకు దాచనప్పుడు తన కుటుంబంలో జరిగే కార్యం దాస్తాడా? దీనిప్రకారం రిబ్కా  అబ్రాహాము దగ్గరకే  ఆమె గర్భంలోని పెనుగులాట గురించి దేవుని దగ్గర అడగడానికి వెళ్ళింది.

ఆదికాండము 25:23
అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

మానవుల విషయంలో దేవుని ‌ముందస్తు ఏర్పాటును ఈ సందర్భం మనకు కచ్చితంగా తెలియచేస్తుంది. ఈ దేవుని ముందస్తు ఏర్పాటు ప్రకారమే యాకోబు సంతానం ఏశావు సంతానం కంటే ఉన్నతమైన జనమై, దేవుని ప్రజలుగా (ఇశ్రాయేలీయులు) పేరుపొందారు. దీని గురించి పౌలు మాటలు చూడండి.

రోమీయులకు 9:10-16 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని (మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.

ఆదికాండము 25:24-26
ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.

ఈ సందర్భం ఏశావు, యాకోబుల జననం గురించి తెలియచేస్తుంది. సాధారణంగా ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది, పుట్టే ఏ పిల్లాడూ ఆ సమయంలో దేన్ని గట్టిగా తన చేతితో పట్టుకోలేడు, కానీ యాకోబు మాత్రం తన సోదరుని మడిమను పట్టుకున్నట్టు ఇక్కడ మరియు, హోషెయ 12:3 లో కూడా  రాయబడింది. ఇదెలా సాధ్యమౌతుంది?! దీనికి సమాధానం కోసం ప్రాచీన యూదుల, నానుడుల గురించి మనకు తెలియాలి. కవలపిల్లలు జన్మించేటప్పుడు, ఇద్దరి మధ్యా కనీసం 2-5 నిమిషాల‌ వ్యవథి ఉంటుంది. అలా కాకుండ వెంటవెంటనే, అంటుకుని ఉన్నట్టుగా ఒకరితరువాత ఒకరు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఈ విధంగా బయటకు వచ్చిన బిడ్డను అంటుకుని వెంటనే జన్మించేవారి గురించి  హెబ్రీయులు మడిమెను పట్టుకున్నవాడనే నానుడి వాడతారు; ఇక్కడ మోషే అదే నానుడిని ఉపయోగిస్తూ యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకుని జన్మించాడని రాస్తున్నాడు. అదేవిధంగా, మోసగాండ్రను, అబద్ధికులని సంబోధించడానికి కూడా హెబ్రీయులు ఈ‌ నానుడిని ఉపయోగించేవారు. (ఈ వాదనను Ellicott's Bible commentary English నుండి తీసుకోవడం జరిగింది). మన సంస్కృతిలో కూడా ఇటువంటి కొన్ని నానుడులు మనం వింటుంటాం, ఉదాహరణకు పెళ్ళాం కొంగుపట్టుకుని తిరుగుతాడు, వాడు వాళ్ళ అమ్మ నోట్లో నుండి ఊడిపడ్డాడు.

యాకోబు, ఏశావులు జన్మించిన 15 సవత్సరాల వరకూ అబ్రాహాము‌ జీవించాడు. ఆదికాండము 21:5 ప్రకారం ఇస్సాకు జన్మించేసరికి అబ్రాహాముకు 100 సవత్సరాలు, ఇస్సాకుకు 60 సవత్సరాల వయస్సులో వీరు జన్మించారు. 100+60-160
అబ్రాహాము మొత్తం 175 సవత్సరాలు జీవించాడు. ఈ విధంగా అతను‌ తన కుమారుడి సంతానాన్ని చూసాడు.

ఆదికాండము 25:27,28
ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.

ఈ సందర్భంలో యాకోబు, ఏశావులు ఒకొక్కరినీ వేరువేరుగా తమ తల్లితండ్రులు ప్రేమించినట్టు రాయబడింది. బహుశా పెద్దవాడు చిన్నవాడికి దాసుడౌతాడని రిబ్కాతో చెప్పబడినందువల్ల ఆమె యాకోబుని ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు.
లేదా, తనకు మాంసం తెచ్చిపెడుతున్నందున ఏశావును ఏవిధంగా అయితే ఇస్సాకు ప్రేమించాడో అదేవిధంగా యాకోబు గుడారాల్లో తన తల్లి దగ్గర ఎక్కువ సమయం నివసిస్తున్నందున ఆమె‌ అతన్ని ఎక్కువగా ప్రేమించి‌ ఉండవచ్చు. తల్లితండ్రులు ఈవిధంగా వెలిచూపు ద్వారా పిల్లల్ని ప్రేమించడం వారి బాధ్యత ప్రకారం మంచి మాదిరి కాదు.

ఆదికాండము 25:29-34
ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండుకొను చుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబునీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహార మును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

ఈ సందర్భంలో యాకోబు తన వంట ద్వారా, ఏశావు జేష్ఠత్వపు హక్కును ఆశించడం, దాన్ని ఏశావు అమ్మివేయడం, మనకు కనిపిస్తుంది; పెద్దవాడు చిన్నవాడికి దాసుడౌతాడనే దేవుని‌ ముందస్తు నిర్ణయ నెరవేర్పుకు ఇది మొదటిమెట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రాచీన యూదుల పద్ధతి ప్రకారం, జేష్ఠకుమారుడికి తండ్రికున్న ఆస్తిలో రెండు బాగాలు వస్తాయి. ఇక్కడ నెరవేరింది దేవుని చిత్తమే అయినా, ఏశావు ఒక పూటకూటి కొరకు తన జేష్ఠత్వపు హక్కును చులకనగా‌ చూసి, ఉద్దేశపూర్వకంగా దాన్ని అమ్మివేసాడు. తత్ఫలితంగా అతను భ్రష్టుడిగా మారి విశ్వాసులను హెచ్చరించడానికి ఉదాహరణగా ఉన్నాడు.

హెబ్రీయులకు 12:15-17
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.