పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

39:1, 39:2, 39:3, 39:4, 39:5,6, 39:7, 39:8,9, 39:10, 39:11,12, 39:13-16, 39:17-20, 39:21-23

ఆదికాండము 39:1
యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరనునొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

ఈ వచనంలో తన అన్నల ద్వారా ఇష్మాయేలీయులకు అమ్మబడిన యోసేపు ఫరో ఉద్యోగికి అమ్మివెయ్యబడడం మనం చూస్తాం. ఆకాలంలో బానిసలుగా మనుషులను అమ్మడం, కొనడం సాధారణంగా జరుగుతుందేది. అయితే జరిగిన ఈ సంఘటనలో దేవుని సార్వభౌమత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యోసేపు కన్నటువంటి కలలు నెరవేరాలి అంటే అతను ఐగుప్తుకు చేరాలి, అది కూడా ముందుగా పోతిఫరు ఇంటికి చేరాలి.

కీర్తనలు 105:17-19 వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.

రోమా 8:28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

ఆదికాండము 39:2
యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింటనుండెను.

ఈ వచనంలో బానిసగా పోతీఫరు ఇంట్లో ప్రవేశించిన యోసేపుకు తన కుటుంబం దూరమైనా దేవుడు అతనికి తోడైయుండడం వల్ల అతను వర్థిల్లుతున్నట్టు మనం చూడగలం. దేవునిపై ఆధారపడిన ప్రతీ ఒక్కరూ ఇదేవిధంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనను బట్టి ఆనందిస్తారు, వర్థిల్లుతారు.

హబక్కూకు 3:17-19 అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.

అదేవిధంగా ఇక్కడ యోసేపు తన యజమానుడికి లోబడి జీవిస్తున్నాడు, అతని‌ ఇంటినుండి పారిపోయే ప్రయత్నం కానీ అతనికి అవిధేయత చూపించడం కానీ చెయ్యడం లేదు. ఎందుకంటే పోతిఫరు అతడిని ఇష్మాయేలీయుల దగ్గర కొనుక్కున్నాడు కాబట్టి, అతనికి లోబడియుండడం న్యాయమని యోసేపు భావించాడు.

తీతుకు 2:9,10 దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.

ఆదికాండము 39:3
యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు-

ఈ వచనంలో పోతిఫరు యోసేపుపై ఉన్న దేవుని కాపుదలనూ అతనిని బట్టి తనకు కలుగుతున్న ఆశీర్వాదాన్ని గమనించినట్టు మనం చూస్తాం. దేవుడు తన పిల్లలను ఘనపరచడానికి భక్తిహీనులను కూడా ఆశీర్వదించి ఆ పిల్లలపై తన కాపుదలను బహిర్గతం చేస్తాడని దీనిని బట్టి మనకు అర్థమౌతుంది, యాకోబు విషయంలో కూడా ఇదే జరిగింది (ఆదికాండము 30:27).

ఆదికాండము 39:4
యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతికప్పగించెను.

ఈ వచనంలో యోసేపుకు దేవుడు తోడైయుండి అతనిని బట్టి తనను కూడా ఆశీర్వదించడం గమనించిన పోతిఫరు యోసేపుపై కటాక్షం‌ చూపించి తనను ఘనపరచడం మనం చూస్తాం. తన పిల్లలకు ఎవరినుండైనా కటాక్షం కలిగిందంటే దానికి కారణం దేవుడే. గతంలో ఆయన ఏశావుకు యాకోబుపై కటాక్షం కలుగచెయ్యడం వల్లనే ఏశావు అతనికి ఎలాంటి హానీ చెయ్యలేకపోయాడు (ఆదికాండము 33:10). ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ఆయన ఐగుప్తీయులకు కటాక్షం కలుగచేసి, ఆ ప్రజలు విస్తారమైన సంపదతో ఐగుప్తునుండి వచ్చేలా చేసాడు (నిర్గమకాండము 3:21,22, 12:36).

ఆదికాండము 39:5,6
అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణకర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునైయుండెను.

ఈ వచనాలలో పోతిఫరు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి తాను విశ్రాంతిగా ఉంటు‌నట్టు మనం చూస్తాం.‌ దీనిప్రకారం దేవుడు యోసేపును వర్థిల్లింపచేస్తున్నప్పుడు అందులో అతను కూడా కష్టపడి తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన కార్యం జరిగించేటప్పుడు అందులో మానవుడు కూడా కష్టపడాలి.‌ అంతా దేవుడే చూసుకుంటాడని సోమరిలా బ్రతకకూడదు.

ఆదికాండము 39:7
అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను.

ఈ వచనంలో యోసేపు సుందరుడై ఉండడం చూసిన పోతిఫరు భార్య అతనిపై కన్నువేసి కామవాంఛను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇతరులపై కామపూరితమైన కోరిక ముఖ్యంగా చూపులతోనే ప్రారంభమౌతుంది. దీనికి స్త్రీ పురుషులు ఎవరూ మినహాయింపు కాదు. కాబట్టి విశ్వాసులు యోబులా తమ చూపుల‌ విషయంలో జాగ్రత్త వహించాలి (యోబు 31:1,2). యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలి.

మత్తయి 5:28,29 - నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని (స్త్రీలైతే పురుషుడ్ని) మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

ఆదికాండము 39:8,9
అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

ఈ వచనాలలో యోసేపు పోతిఫరు భార్య కామవాంఛకు లొంగిపోకుండా తాను కనుక ఆ పాపం చేస్తే తన యజమానుడికే కాదు దేవునికి కూడా విరోధంగా పాపం చేసినవాడిని ఔతానని ఆమెకు నచ్చచెప్పడం మనం చూస్తాం. విశ్వాసులు చేసే ప్రతీ పాపం మనుషులకే కాదు మొదటిగా దేవునికే విరుద్ధంగా ఉంటుంది. అందుకే దావీదు బెత్షబతో పాపం చేసినప్పుడు ఏమంటున్నాడో చూడండి.

కీర్తనలు 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

ఆదికాండము 39:10
దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతోనుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

ఈ వచనంలో పోతిఫరు భార్య ప్రతీరోజూ యోసేపును తన కామవాంఛకై ఇబ్బంది (tempt) పెడుతున్నట్టు, కానీ అతను ప్రతీసారీ ఆమెనుండి తప్పించుకుంటున్నట్టు మనం చూస్తాం. సాధారణంగా చాలామంది విశ్వాసులు పాపపు శోధనను కొన్నిసార్లు జయించినప్పటికీ ఆ పాపం వారిని పదేపదే బలవంతపెడుతుంటే (tempt చేస్తున్నప్పుడు) దానికి లొంగిపోతుంటారు. కానీ యోసేపు మాత్రం అలా చెయ్యలేదు. పాపం నుండి తనకు ఎన్నిసార్లు శోధన ఎదురౌతుంటే అన్నిసార్లూ దానిని జయిస్తూనే వచ్చాడు. దీనంతటికీ దేవునిపై అతనికున్న భయభక్తులే కారణం. కాబట్టి విశ్వాసులు ఈ విషయాన్ని చాలా జాగ్రతగా గుర్తుంచుకోవాలి, ఎక్కువగా వాక్యధ్యానంలో గడుపుతుండాలి.

సామెతలు 16:6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

కీర్తనలు 119: 11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

ఇక్కడ నేను మరో ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచెయ్యాలి అనుకుంటున్నాను. ఈ సంఘటన జరిగే సమయానికి యోసేపు లేత యవ్వనప్రాయంతో పాపానికి సులభంగా ఆకర్షితమయ్యే వయసులో ఉన్నాడు. పైగా తన కుటుంబ ప్రేమకు దూరమై ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆ సమయంలో పోతిఫరు భార్య అతడిని ఆశించి, కేవలం లైంగికసుఖాన్నే కాకుండా మానసిక ఓదార్పును కూడా అతడికి ఇచ్చేలా మాట్లాడుతుండవచ్చు, ఎందుకంటే అలాంటి స్త్రీల/వ్యక్తుల మాటలు అలానే ఉంటాయి.

సామెతలు 5: 3 జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి.

అయినప్పటికీ యోసేపు పాపం‌వలన తనకు కలిగే ఓదార్పును కానీ సుఖాన్ని కానీ ఆశించకుండా దేవునిలోనే తనను తాను ఓదార్చుకుంటున్నాడు. ఎందుకంటే పాపం‌వల్ల చివరికి అతనికి కలిగే ఫలం ముసిణిపండు అంత చేదుగా ఉంటుందని, రెండంచుల కత్తిలా హానిచేస్తుందని అతనికి తెలుసు (సామెతలు 5:4). కాబట్టి ఈరోజు అక్రమసంబంధాలను తమకు ఓదార్పుగా భావిస్తున్నవారు, వాటిని బట్టి యవ్వనవాంఛలను తీర్చుకుంటున్నవారు యోసేపును బట్టి వాస్తవం గ్రహించాలి.

అయితే మనకిక్కడ పోతిఫరు భార్య యోసేపుతో అలా వ్యవహరిస్తున్నప్పుడు అతను ఆ విషయాన్ని తన యజమానుడి దృష్టికి ఎందుకు తీసుకునివెళ్ళలేదనే సందేహం కలుగుతుంది. బహుశా యోసేపుతో ఆమె అప్పటివరకూ సున్నితంగానే వ్యవహరిస్తూ అతడిని ప్రేరేపిస్తుంది. కాబట్టి అతను ఆ ప్రేరణను అప్పటివరకూ జయించినట్టే ఇకపై కూడా జయించగలననే నిశ్చయంతో ఉండుంటాడు. అందుకే ఆమెను తన భర్తముందు అవమానించడం ఇష్టంలేక అలా చెప్పకుండా ఉండుంటాడు. కానీ మనమైతే అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పకుండా దానిని సరిచెయ్యగలవారికి వెంటనే తెలియచెయ్యాలి. లేకపోతే యోసేపులా మనం కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ప్రభువు మనల్ని పాములవలే వివేకులుగా ఉండమంటున్నాడు.

మత్తయి 10:16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.

ఆదికాండము 39:11,12
అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

ఈ వచనాలలో యోసేపును పోతిఫరు భార్య తన కామవాంఛకై బలవంతం చెయ్యడం, అతను ఆమె చేతినుండి తప్పించుకుపోవడం మనం చూస్తాం. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరుకాబట్టి యోసేపు కూడా ఆమెతో రాజీపడిపోవచ్చు, దీనివల్ల అతనికి కూడా చాలా లాభం కలుగుతుంది, కావాలనుకుంటే అతను తన తండ్రి ఇంటికి వెళ్ళివచ్చేలా తన భర్తతో మాట్లాడి సహాయం కూడా చెయ్యగలుగుతుంది. అయినప్పటికీ అతను అలాంటి మేలులకోసం ఆశించకుండా ఆమె నుండి పారిపోయాడు. ఎందుకంటే అతను తన కష్టాలను‌ అధిగమించడానికి దేవునికి విరుద్ధమైన మార్గంలో పయనించి ఆయన శ్రేష్టమైన ప్రేమనూ సహాయాన్నీ కోల్పోవాలి అనుకోలేదు. కాబట్టి విశ్వాసులు పాపంవల్ల తమకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నా దానినుండి యోసేపులా పారిపోవాలే తప్ప, అప్పగించుకోకూడదు. ఎందుకంటే నేనుపైన చెప్పినట్టుగా దాని పర్యవసానం చివరికి దారుణంగానే ఉంటుంది.

సామెతలు 7:26,27 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.

ఆదికాండము 39:13-16
అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు తన యింటి మనుష్యులను పిలిచిచూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్దకేక వేసితిని. నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచుకొనెను.

ఈ వచనాలలో యోసేపు తనకిక లొంగడని భావించిన పోతిఫరు భార్య అతనిపై మానభంగ ఆరోపణను మోపి, అతనిని హింసకు గురిచెయ్యాలని ప్రయత్నించడం మనం చూస్తాం. విశ్వాసులు లోకంతో రాజీపడకుండా యథార్థంగా జీవిస్తున్నపుడు వారిపై ఇలాంటి అన్యాయపు ఆరోపణలూ హింసలూ తప్పకుండా వస్తుంటాయి. కానీ వారు యోసేపులా దైవచిత్తానుసారమైన మనస్సాక్షి కలిగి పాపంతో పోరాడుతూ దానివల్ల ఎలాంటి శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడాలి.

1 పేతురు 4:4,5 అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

1 పేతురు 2:19,20 ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.

అదేవిధంగా కామసంబంధమైన ప్రేమ చివరికి ఎలా క్రూరంగా మారుతుందో ఈ పోతిఫరు భార్య చేసినదానిని బట్టి మనం గ్రహించాలి. ఆమె తన కామవాంఛను తీర్చుకోడానికి యోసేపును ప్రేమించి అతనిని లొంగదీసుకోవడానికి చాలా ప్రయత్నించింది. తీరా ఆ కోరిక అతనివల్ల తీరదని ఆమెకు తెలిసినప్పుడు ద్వేషంతో అతనికి హాని చెయ్యడానికి సిద్ధపడింది. కాబట్టి యవ్వనస్తులు ఈ విషయంలో జాగ్రతగా ఉండాలి. ప్రస్తుత సమాజంలో ఇలాంటి అన్యాయపు ఆరోపణలు, హింసలెన్నిటినో మనం చూస్తూనే ఉన్నాం.

ఆదికాండము 39:17-20
అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెననెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

ఈ వచనాలలో తన భార్య మాటలను విన్న పోతిఫరు కోపంతో యోసేపును పట్టుకుని చెరశాలలో వేయించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ పోతిఫరు తలచుకుంటే యోసేపును చంపగలడు కానీ చంపకుండా చెరశాలలో మాత్రమే వేయించాడు. ఎందుకంటే మొదటిగా తన భార్యమాటలు విన్నప్పుడు అతను కోపంతో మండిపడినప్పటికీ తరువాత అతను యోసేపు నిర్దోషి అని అతను గ్రహించియుండవచ్చు. అయినప్పటికీ తన భార్యను బట్టి యోసేపును చెరశాలలోనైనా వేయించక తప్పకపోవచ్చు. ఒకవేళ ఈ పోతిఫరు యోసేపు నిర్దోషి అని గ్రహించకపోతే చెరశాలలో కూడా అతడికి ఎందుకు ఘనపరుస్తాడు? ఈ వాక్యభాగం చూడండి.

ఆదికాండము 40:1-4 అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై "రాజసంరక్షక సేనాధిపతికి" అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. "ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా" అతడు వారికి ఉపచారము చేసెను.

ఆదికాండము 39:21-23
అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

ఈ వచనాలలో కూడా దేవుడు యోసేపుపై చెరశాల అధిపతికి కటాక్షం కలిగించడం, అతను ఖైదీలందరికీ యోసేపుకు అప్పగించడం మనం చూస్తాం. జరిగిన ఈ సంఘటనలను జాగ్రతగా పరిశీలిస్తే యోసేపు శ్రమలకు లోనైన ప్రతీసారీ దేవుడు అతనికి తోడైయున్నాడని లేఖనంలో నొక్కిచెప్పబడడడం మనం గమనిస్తాం. దీనిప్రకారం విశ్వాసులకు తప్పకుండా శ్రమలు వస్తాయి, ఎందుకంటే ఆ శ్రమలు వారు దేవుని పిల్లలు అనేందుకు రుజువుగా ఉన్నాయి.

యోహాను 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును.

2 తిమోతికి 3:12 క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

అయినప్పటికీ దేవుడు ఆ శ్రమలలో వారికి తోడుగా ఉంటాడు, తగిన విధంగా వారిని ఘనపరచి తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. కాబట్టి, దేవుణ్ణి నమ్మితే మీకు ఏ శ్రమలూ సంభవించవు అనేది ఒక దుర్బోధ, దానివల్ల ఎవరూ మోసపోవద్దు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.