13:1, 13:2, 13:3,4, 13:5-7, 13:8,9, 13:10-12, 13:13, 13:14-16, 13:17,18
ఆదికాండము 13:1
అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.
ఈ వచనంలో అబ్రాహాము దేవుని పిలుపుకు వ్యతిరేకంగా పయనించిన ఐగుప్తునుండి మరలా కనానుకు తిరిగివచ్చినట్టు మనం చూస్తాం. నెగెబు అనేది కనానుకు దక్షిణంగా ఉన్న ప్రాంతం. దీనిని బట్టి మానవుడు దేవుని పిలుపుకు వ్యతిరేకంగా పయనించినప్పటికీ, ఆయన అతనిని తగినవిధంగా క్రమశిక్షణ చేసి తన పిలుపును నెరవేర్చుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి.
దానియేలు 4:35 ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.
అయితే దేవునిపిలుపుకు వ్యతిరేకంగా పయనించిన విశ్వాసి ఆ కారణంగా దేవునిచేత క్రమశిక్షణ చెయ్యబడుతూ కొన్నిసార్లు తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి విశ్వాసులు తమపట్ల దేవుని పిలుపు విషయంలో చాలా జాగ్రత కలిగియుండాలి.
ఎఫెసీయులకు 4:1-3 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, "మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా" దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
ఆదికాండము 13:2
అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.
ఈ వచనంలో అబ్రాహాము చాలా ధనవంతుడిగా ఉన్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆదికాండము 12:16 ప్రకారం; అతను హారాను నుండి తెచ్చుకున్న ఆస్తితో పాటుగా, ఇప్పుడు ఐగుప్తులో ఫరో ఇచ్చిన ఆస్తికూడా అతనికి ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి, ముందటి అధ్యాయంలో అబ్రాహాము కనాను దేశం నుండి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతను దేవుని పిలుపుకు విరుద్ధంగానే అక్కడికి వెళ్ళాడని వివరించుకున్నాము. ఆ విధంగా అతను ఐగుప్తుకు దేవుని పిలుపుకు వ్యతిరేకంగానే వెళ్ళినప్పటికీ అక్కడ చాలా ఆస్తి లభించింది. సాధారణంగా కొంతమంది తాము చేస్తున్న వ్యాపారాలలో, కార్యాలలో సమృద్ధిని చూస్తున్నప్పుడు అది దేవుడు తలపెట్టిన కార్యంగానూ, నష్టాన్ని చూస్తున్నప్పుడు అది దేవునికి విరుద్ధమైన కార్యంగానూ భావిస్తుంటారు. కానీ ఇక్కడ చూడండి, అబ్రాహాము దేవుని పిలుపు మేరకు వెళ్ళిన కనానులో కరవును (కష్టాన్ని) ఎదుర్కొన్నాడు, కానీ దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళిన ఐగుప్తులో మాత్రం చాలా ఆస్తి సంపాదించాడు. కాబట్టి విశ్వాసులు తాము చేసేది దేవుని చిత్తానుసారమైన కార్యమా కాదా అనేదానికి దేవునివాక్యాన్ని బట్టి పరిశీలించుకోవాలే తప్ప, లాభనష్టాలను బట్టి కాదు.
లూకా 12: 15 ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
ఆదికాండము 13:3,4
అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి తాను మొదట బలి పీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ఈ వచనాలలో అబ్రాహాము మరలా కనాను దేశంలోని బేతేలు అనే ప్రాంతానికి తిరిగివచ్చినట్టు మనం చూస్తాం. అతను కనాను దేశం చేరుకోగానే ఇక్కడ బలిపీఠం కట్టి దేవునిపట్ల భయభక్తులను చాటుకున్నాడు, చుట్టుపక్కల ప్రజలకు యెహోవా దేవుణ్ణి ప్రకటించాడు.
ఆదికాండము 13:5,6
అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందు కనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
ఈ వచనాలలో అబ్రాహాము, లోతులకు ఉన్న ఆస్తి విస్తారంగా ఉన్నందువల్ల, వారికి ఇబ్బంది తలెత్తినట్టు మనం చూస్తాం. కొందరు బోధకులు ఇలాంటి మాటలను ఆధారం చేసుకుని, దేవునిచేత ఆశీర్వదించబడడమంటే, భౌతికపరమైన సంపదతో తులతూగడంగా బోధిస్తుంటారు. కానీ, దేవుని ఆశీర్వాదం అనగానే భౌతికపరమైన సంపదమాత్రమే కాదు. ఇలాంటి భౌతికపరమైన సంపద, భక్తులందరి జీవితంలోనూ కనిపించకపోవచ్చు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో దేవుని చేత ఆశీర్వదించబడిన భక్తులు (అపోస్తలులు) ఎంతోమంది ఎలాంటి భౌతికమైన సంపద లేకుండా, పేదరికంలో జీవించినట్టు మనకు కనిపిస్తుంది.
1 కొరింథీయులకు 4:11-13 ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము. పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేకయున్నాము; స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము; దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
కాబట్టి భౌతికపరమైన సంపదను మాత్రమే దేవుని ఆశీర్వాదంగా ఎవరూ భావించకూడదు, ఒకవేళ అలాంటి ఆశీర్వాదాన్ని (సంపద) ఎవరైనా పొందుకుంటే అది సహోదరుల అవసరల నిమిత్తం కూడా వారికి ఇవ్వబడిందని గుర్తించి వారికి మనస్పూర్తిగా సేవ చెయ్యాలి.
1 తిమోతికి 6:17-19 ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, "తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైయుండవలెనని" వారికి ఆజ్ఞాపించుము.
విశ్వాసులందరికీ, లభించిన అతి శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం వారి రక్షణమాత్రమే, ఆ ఆశీర్వాదాన్ని బట్టే మనం దుష్టత్వం నుండి విడిపించబడి క్రీస్తునందు పాపక్షమాపణ పొందుకున్నాం.
అపొస్తలుల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, (లేక, లేపి) మీలో "ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు" ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.
ఆదికాండము 13:7-9
అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాముమనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా -
ఈ వచనాలలో అబ్రాహాము పశువుల కాపరులకూ, లోతు పశువుల కాపరులకూ మధ్యలో కలహం పుట్టినట్టు, దానివల్ల అబ్రాహాము లోతుల సంబంధం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి, అబ్రాహాము లోతును తననుండి విడిగా ఉండడమనడం మనం చూస్తాం. అబ్రాహాము ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, వారు బంధువులు కాబట్టి వారిద్దరి మధ్యా కలహాలు ఉండకూడదు, అలా ఉండకూడదంటే వారిద్దరూ విడిగానే ఉండాలి, ఎందుకంటే వారున్న ప్రదేశం వారిద్దరికీ సరిపోయేంతగా లేదు. దీనిని బట్టి, మనం కూడా కొన్ని సమస్యల వల్ల ఒకే ఇంట్లో అన్నదమ్ములతో కలసి నివసించలేనప్పుడు వేరుగా వేరుగా ఉండడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మన సంబంధాల మధ్యలో కలహాలు రాకుండా ఉంటాయి. ఇక్కడ వేరువేరుగా ఉండమంటే, సంబంధాలు తెంచుకోమని అర్థం కాదు. కొన్ని పరిస్థితులు ఆ సంబంధాలపై ప్రభావం పడేలా చేస్తున్నాయి కాబట్టే వేరుగా ఉండవలసి వస్తుంది. ఈ విధంగా వేరువేరుగా నివసించేవారు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం మరచిపోకూడదు అదేంటంటే, ఆ సందర్భంలో అబ్రాహాము తనకూ లోతుకూ మధ్యలో కలహాలు రావడం ఇష్టం లేక అతడిని దూరంగా ఉండమన్నాడు, (లేక అతనే దూరంగా ఉంటున్నాడు) కానీ అదే అబ్రాహాము లోతుకు కష్టం వచ్చినప్పుడు ఏం చేసాడో చూడండి.
ఆదికాండము 14:14-16 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.
ఈ సందర్భంలో అబ్రాహాము లోతు చెరపట్టబడగానే ఎంతో సాహసంతో, ప్రయాసతో శత్రువులతో యుద్ధం చేసి అతడినీ, అతని కుటుంబాన్నీ కాపాడుకున్నాడు. కాబట్టి మనం కూడా, ఒకేచోట కలిసుంటే వచ్చే సమస్యలను బట్టి మన అన్నదమ్ములతో వేరుగా ఉంటున్నప్పటికీ, వారికి కష్టం రాగానే అబ్రాహాములా ఆదుకోవడానికి ముందుండాలి, ఇదే సంబంధాల మధ్యలో అసలైన ఐక్యత.
కీర్తనలు 133: 1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము.
ఇక అబ్రాహాము లోతును విడిగా ఉండమనడానికి రెండవ కారణం;
7వ వచనం ప్రకారం, అబ్రాహాము లోతులు నివసిస్తున్న కనాను దేశంలో అప్పటికి కనానీయులు పెరిజ్జీయులు కాపురముంటున్నారు. వారి మధ్యలో అబ్రాహాము యెహోవా దేవునికి బలిపీఠాలు కడుతూ, లోతుతో కలసి ఆ దేవుని పిల్లలుగా జీవిస్తున్నాడు. ఒకవేళ అబ్రాహాముకూ లోతుకూ మధ్యలో కలహాలు జరుగుతుంటే, అది చూస్తున్న కనానీయులు పెరిజ్జీయులు అబ్రాహాము లోతులు నమ్మిన దేవుణ్ణి చులకనగా భావించే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే, దేవుని పిల్లలు పొరపాటు చేస్తున్నప్పుడు ఆ దేవుని నామం కూడా దూషించబడుతుంది.
రోమీయులకు 2: 24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
కాబట్టి అబ్రాహాము ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ, లోతును విడిగా ఉండడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ విషయంలో విశ్వాసులమైన మనం కూడా చాలా బాధ్యత కలిగి, అన్యులముందు మన దేవుని నామం దూషించబడకుండా/అవమానించబడకుండా ఉండడానికి, మన కుటుంబ సభ్యులతో కానీ, సంఘస్తులతో కానీ ఎలాంటి కలహాలూ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా అపార్థాలు చోటుచేసుకున్నప్పుడు, సంఘం/కుటుంబంతో చర్చలు జరుపుకుని సమాధానపడాలి. ఆనాడు కొరింథీ సంఘంలో ఇలాంటి బాధ్యత కరువైనందుకు పౌలు ఎంతో వేదనతో వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం.
1 కొరింథీయులకు 6:6,7 అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు. ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?
ఆదికాండము 13:10-12
లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లు వారు ఒకరి కొకరు వేరై పోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను.
ఈ వచనాలలో లోతు తనకు అనుకూలంగా కనిపిస్తున్న భూభాగంపై లక్ష్యముంచి, అబ్రాహాముతో వేరైపోయినట్టు మనం చూస్తాం. అతను ఆ భూమి ఎంతో భాగ్యవంతంగా, తనకు అనుకూలంగా ఉండడాన్నే చూసాడు తప్ప, దానివెనుక ఉన్న భయంకర పాపాన్ని గుర్తించలేకపోయాడు. దానివల్ల అతను అక్కడ నివసించిన కాలమంతా చాలా వేదనభరితంగా జీవించాడు.
రెండవ పేతురు 2:8 ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
అంతమాత్రమే కాకుండా, లోతు ఆ ప్రాంతంలో స్థిరపడబట్టే, ఆ ప్రాంత ఐశ్వర్యానికి బానిసైన తన భార్య ఉప్పుస్థంభంగా మారి నశించిపోయింది (ఆదికాండము 19:26). ఈవిధంగా అతను తన భార్యను కోల్పోయాడు. తరువాత కాలంలో తన కుమార్తెలు కూడా, ఆ ప్రాంతనివాసుల హేయక్రియలను అనుసరించి తన విషయంలో నీచమైన కార్యానికి పాల్పడ్డారు (ఆదికాండము 19:31-36).
కాబట్టి విశ్వాసులు, తమ జీవనోపాధి నిమిత్తం ఎంచుకునే ప్రాంతాల విషయంలోనూ, చేయదలచిన ఇతర కార్యాల (పెళ్ళి, వ్యాపారం) విషయంలోనూ ఈ సంఘటనను బట్టి చాలా జాగ్రతగా నిర్ణయాలు తీసుకోవాలి. మనం లోతులా పైకి కనిపించే అందమైన, భాగ్యవంతమైన స్థితిని కాకుండా, అక్కడ/ఆ కార్యంలో మన పరిశుద్ధత, ఆత్మీయతలను నిలకడగా కొనసాగించగలమా, లేదా అనేది ప్రాధమికంగా చూడగలగాలి. ఎందుకంటే పాపం మనల్ని లోపరచుకోవడానికి చాలా ఆకర్షణీయంగా, భాగ్యవంతంగానే దర్శనమిస్తుంటుంది.
సామెతలు 6: 25 దాని (పాపము) చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
1 థెస్సలొనీకయులకు 5:21,22 సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును (కీడుగా కనబడు ప్రతిదానికి) దూరముగా ఉండుడి.
ఆదికాండము 13:13
సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.
ఈ వచనంలో సొదొమ పట్టణంయొక్క పతనస్థితిని మనం చూస్తాం. ఈ పట్టణం స్వలింగ సంపర్కానికి నిలయంగా ఉండేది. అందుకే వీరు లోతు ఇంటికి పురుషరూపంలో వచ్చిన దేవదూతలను కూడా బలత్కరించడానికి ప్రయత్నించారు (ఆదికాండము 19:5). స్వలింగ సంపర్కాన్ని ఇప్పటికి కూడా ఈ పట్టణం పేరుతో Sodomy అని పిలుస్తారు.
ఆదికాండము 13:14-16
లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము; ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణు వులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, అతని సంతానం గురించీ కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వడం గురించీ తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన ఈ సమయంలోనే ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, అప్పటికి అబ్రాహాము లోతు దూరమైన బాధలో ఉన్నాడు. అందుకే ఆయన ఈ దేశం (వాగ్దానం) లోతుకు చెందదని నీ సంతానానికి మాత్రమే స్వాస్థ్యమని, కాబట్టి లోతు ఈ దేశం నుండి దూరమైనందుకు బాధపడవద్దని అతనిని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పిలిచింది అబ్రాహామునే తప్ప లోతును కాదు. అయినప్పటికీ అతను అబ్రాహాముతో కలసి కనానువరకూ వచ్చాడు. కానీ ఆయన లోతు సంతానానికి వేరే ప్రాంతాన్ని నిర్ణయించాడు.
ద్వితియోపదేశకాండము 2: 9 మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. "లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని", వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్య ముగా ఇయ్యను.
అదేవిధంగా ఆయన ఇక్కడ నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాల వలే విస్తరింపచేస్తానని, ఎవరైనా భూమిమీద ఉన్న రేణువులను లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలరని పలకడం కూడా మనం చూస్తాం. ఇవి అబ్రాహాము సంతానం గొప్పగా విస్తరిస్తుందనే భావంలో అలంకారంగా చెప్పబడినమాటలు. అంతేతప్ప మనం వాటిని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఎందుకంటే, భూమిమీద ఉన్న రేణువులంత విస్తారంగా అబ్రాహాము సంతానం విస్తరిస్తే వారు ఎక్కడ నివసిస్తారు? మిగిలిన జాతుల ప్రజలు ఎక్కడ ఉంటారు? ఈ మాటలను మోషే కూడా అలంకారంగానే అర్థం చేసుకున్నాడు.
ద్వితియోపదేశకాండము 1: 10 మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు "మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు".
ఈ సందర్భంలో మోషే, దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టే వారిని ఆకాశ నక్షత్రాలుగా విస్తరింపచేసాడని చెబుతున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అప్పటికి ఎంతమేరకు విస్తరించారో (జనసంఖ్య చేయగలిగినంతని) అతనికి తెలుసు. కాబట్టి దేవుడు అబ్రాహాముతో చెప్పినమాటలు అలంకారమే. అదేవిధంగా దేవుడు, నీ సంతానం ఆకాశనక్షత్రాలవలే, భూమిపై ఉన్న రేణువులవలే విస్తరిస్తారని అబ్రాహాముతో అలంకారంగా చెప్పినమాటలు విశ్వాసులమైన మనలను కూడా సూచిస్తున్నాయి. ఎందుకంటే గలతీ 3:29 ప్రకారం మనమంతా అబ్రాహాము సంతానమే. ఈ అబ్రాహాము సంతానం క్రీస్తు రెండవ రాకడలో ఎలా ఉందో చూడండి.
ప్రకటన గ్రంథము 7:9,10 అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, "యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము" కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్లయెదుటను నిలువబడి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
ఆదికాండము 13:17,18
నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూరవృక్షవన ములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముతో కనాను దేశమంతటినీ సంచరించమని చెప్పడం, అబ్రాహాము అదేవిధంగా చెయ్యడం మనకు కనిపిస్తుంది. అతను దేవుడు చెప్పిన ఈమాట చొప్పున కనాను దేశంలో ఎలాంటి స్థిరమైన నివాసాన్నీ ఏర్పరచుకోకుండా, గుడారాలలో నివసిస్తూ సంచరిస్తూనే ఉన్నాడు. ఇది దేవునిపై అతనికి ఉన్న విశ్వాసాన్ని మనకు రుజువు చేస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టే అతను దేవునిమాటకు విధేయత చూపుతూ ఆయన చెప్పినట్టుగా ఆ దేశంలో స్థిరమైన నివాసం లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను తన విశ్వాసానికి ప్రతిఫలంగా కనానును కాదు పరలోకాన్ని పొందుకోవాలని ఎదురుచూసాడు.
హెబ్రీయులకు 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
కాబట్టి విశ్వాసులమైన మనం కూడా ఈలోకంలో ఎంత భాగ్యాన్ని కలిగియున్నప్పటికీ, అబ్రాహాములా దేవుని ఆజ్ఞలచొప్పునే ఈలోకంలో జీవించాలని, మన స్థిరమైన నివాసం పరలోకంలోనే ఉందని మరచిపోకూడదు.
ఫిలిప్పీయులకు 3: 20 మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
1కోరింథీయులకు 7: 31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments
Thank you so much sir,,,