పాత నిబంధన
రచయిత: సాగర్

ఆదికాండము 10:1

ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.

ఈ అధ్యాయం అంతటిలోనూ, నోవాహు కుమారులనుండి ఉద్భవించిన జాతుల వివరాలు మనకి కనిపిస్తాయి, ఆదికాండము 11 వ అధ్యాయం ప్రకారం,బాబేలు గోపురం దగ్గర ప్రజలందర్నీ దేవుడు భూమియంతటా చెదరగొట్టాడు, ఆ సందర్భంలో వారిలోని ఏ జాతి ఎక్కడికి చెదరిపోయింది అనే వివరాలు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. మొదటిశతాభ్దానికి చెందిన యూదాచరిత్రకారుడైన  జోసెఫెస్ తాను రాసిన 'The Antiquities of the Jews' అనే మొదటి పుస్తకం ఆరవ అధ్యాయంలో ఈ వివరాలన్నీ పొందుపరిచాడు. వాటి ఆధారంగా, ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన జాతులు, దేశాలపేర్లను మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఆదికాండము 10:2

యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

ఈ వచనం ప్రకారం, నోవాహు పెద్దకుమారుడైన యాపెతుకు ఏడుగురు కుమారులు పుట్టినట్లు మనం చూస్తాం. వారిలో, గోమేరు నుండి, galls ( గలతీయులు) అనే జాతి ఉద్భవించింది, వీరు modern turkey ప్రాంతంలో స్థిరపడ్డారు. మాగోగు నుండి, Scythia's అనే జాతి ఉద్భవించింది, వీరు ఈస్ట్రన్ ఇరాన్ లోనూ,సెంట్రల్ యురేషియాలోనూ స్థిరపడ్డారు. మాదయి నుండి, Mede's (మాదీయులు) అనే జాతి ఉద్భవించింది, వీరు ఏన్శియంట్‌ ఇరాన్ లో స్థిరపడ్డారు. యవాను నుండి, Ionia,Greeks అనే జాతులు ఉద్భవించాయి, వీరు సెంట్రల్ కోస్టల్ అనతోలియ, గ్రీసు ప్రాంతాల్లో నివశించారు. తుబాలు నుండి, Iberes అనే జాతి ఉద్భవించింది, వీరు మోడెర్న్ స్పెయిన్ లో స్థిరపడ్డారు. మెషెకు నుండి, cappadocians (కప్పదొకియులు) జాతి ఉద్భవించింది, వీరు సెంట్రల్ అనతోలియ (టర్కీ) లో స్థిరపడ్డారు. తీరసు నుండి, Tracians జాతి ఉద్భవించింది, వీరు బల్గేరియా (యూరప్) లో స్థిరపడ్డారు.

ఆదికాండము 10:3

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

ఈ వచనం ప్రకారం, యాపెతు కుమారుడైన గోమెరు కుమారుల ద్వారా మరికొన్ని జాతులు ఉద్భవించాయి. అష్కనజు నుండి, Rheginians అనే జాతి ఉద్భవించింది, వీరు ఇరాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. రేపతు నుండి, paphlagonians అనే జాతి ఉద్భవించింది, వీరు నల్లసముద్ర తీరంలోనూ, టర్కీ, నార్త్ సెంట్రల్ అనతోలియలోనూ స్థిరపడ్డారు. తోగర్మ నుండి, phrygians అనే జాతి ఉద్భవించింది, వీరు సెంట్రల్ అనతోలియ (టర్కీ) లో స్థిరపడ్డారు‌‌.

ఆదికాండము 10:4,5

యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు. వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

ఈ వచనం ప్రకారం యాపెతు కుమారుడైన యవాను ద్వారా మరికొన్ని జాతులు ఉద్భవించాయి. ఏలీషా నుండి, Aeolians అనే తెగ ఉద్భవించింది, వీరు గ్రీకులలో ఉన్న నాలుగు తెగల్లో ఒక తెగ. తర్షీషు నుండి, silicia అనే తెగ ఉద్భవించింది, వీరు ఏషియా మైనర్, సౌత్ కోస్టల్ లో స్థిరపడ్డారు. కిత్తీము నుండి, chittims (కిత్తీయులు) అనేజాతి ఉద్భవించింది వీరు  Cypruse అనే దీవిలో స్థిరపడ్డారు. దాదోనీము నుండి, Rhodes అనే జాతి ఉద్భవించింది, వీరు గ్రీకు దేశంలో స్థిరపడ్డారు.

ఆదికాండము 10:6

హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

ఈ వచనంలో నోవాహు కుమారుడైన హాము కుమారుల గురుంచి రాయబడింది. కూషు నుండి, chushites అనే జాతి ఉద్భవించింది, వీరు ఇతియోపియ(ఆప్రికా) లో స్థిరపడ్డారు. మిస్రాయీము నుండి, Egyptians జాతి ఉద్భవించింది, వీరు Egypt (ఐగుప్తు) లో స్థిరపడ్డారు. పూతు నుండి, ఉద్భవించిన జాతి లిబియాలో స్థిరపడ్డారు, వీరిని ఏమని పిలుస్తారో మనకి ఆధారాలు దొరకలేదు. కానాను నుండి, Canaanites (కానానీయులు) జాతి ఉద్భవించింది, వీరు మధ్యధారా సముద్రతీర ప్రాంతంలో నివశించారు, మోషే,యెహోషువ కాలంలో వీరి ప్రాంతాల్లో కొన్నిటిని ఇశ్రాయేలీయు స్వాధీనం చేసుకొన్నారు.

ఆదికాండము 10:7

కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.

ఈవచనంలో హాము కుమారుడైన కూషు యొక్క కుమారుల గురించి రాయబడింది. సెబా నుండి, sabeans అనేజాతి ఉద్భవించింది, వీరు సౌత్ వెస్ట్ అరేబియన్ (యెమెన్) లో స్థిరపడ్డారు. హవీల నుండి, Getuli అనే జాతి ఉద్భవించింది, వీరు తునిషియా, అల్బీరియ, మొరాకో ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సబ్తా నుండి, Astaborans అనేజాతి ఉద్భవించింది, వీరు నైలునది ప్రాంతం (సుడాన్, మెరిత్రియ,నుభియ) లో స్థిరపడ్డారు‌. రయామా కు పుట్టిన ఇద్దరు కుమారుల నుండి ఉద్భవించిన జాతుల పేర్లు మనకి తెలియకపోయినా, వారిలో షెబ నుండి ఉద్భవించిన జాతి ఇతియోపియ లోనూ, దాదాను నుండి ఉద్భవించిన జాతి వెస్ట్రన్ ఇతియోపియలోనూ స్థిరపడ్డారు. సబ్తకా నుండి, sabactens జాతి ఉద్భవించింది, వీరు సౌత్ అరేబియలో స్థిరపడ్డారు, వీరినుండి ఒక డ్రవిడతెగ కూడా ఉద్భవించింది.

ఆదికాండము10:8-12

కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.

ఈ వచనాల ప్రకారం, కూషుకు పై వచనంలో మనం చూసిన కుమారులే కాకుండా నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు ఇతడు మిగిలినవారికంటే ప్రత్యేకంగా పేరు సంపాదించడం వల్ల ఇతనిగురుంచి రచయిత ప్రత్యేకంగా రాస్తున్నాడు. చరిత్రప్రకారంగా ఈ నిమ్రోదు భయంకరమైన వేటగాడిగా మారి, ఆకాలంలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కౄరజంతువులని వేటాడి వారికి రక్షణకల్పించేవాడు, దాన్నిబట్టి ప్రజల్లో అతనికి యెహోవా యెదుట పరాక్రమము కలిగిన వేటగాడని పేరువచ్చింది, దానికారణంగా అతను వారందరికీ రాజుగా మారి తన రాజ్యాన్ని విస్తరింపచేసుకొన్నాడు, బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని మొదటిగా స్థాపించింది ఇతనే, యోనా సువార్త ప్రకటించిన నినెవే పట్టణాన్ని కూడా మొదటిగా కట్టించింది ఇతనే. అదేవిధంగా అప్పటి ప్రజలు దైవచిత్తానికి విరుద్ధంగా బాబేలు గోపురాన్ని‌  నిర్మించే ప్రయత్నం చేసింది కూడా ఇతని నాయకత్వంలోనే. ఇతను చనిపోయాక అప్పటి ప్రజలు ఇతన్నీ, ఇతని భార్యను, కుమారున్ని దేవుళ్లుగా చేసుకొని పూజించడం ప్రారంభించారు. బాబిలోనియన్  మతాల్లో ఇతను ఒక దేవుడిగా మిగిలిపోయాడు.

ఆదికాండము 10:13,14

మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.

ఈవచనాలలో, హాము కుమారుడైన, మిస్రాయీము నుండి ఉద్భవించిన మరికొన్ని‌ జాతుల గురించి రాయబడింది. ఇందులో, లూదీయులు, అనామీయులు,లెహబీయులు లిబియా (ఆప్రికా) లో స్థిరపడ్డారు. నప్తుహీయులు నైలునది డెల్టా ప్రాంతంలో స్థిరపడ్డారు. పత్రుసీయులు సదరన్ ఈజిప్టు (ఐగుప్తు)లో స్థిరపడ్డారు. కస్లూహీయులనుండి వచ్చిన పిలిష్తీయులు పాలస్థీనాలో స్థిరపడ్డారు, తరువాతి కాలంలో ఇశ్రాయేలీయులకు వీరికి అనేకసార్లు యుద్దాలు జరిగినట్లు మనకి బైబుల్ గ్రంథం వివరిస్తుంది. కఫ్తోరీయుల గురించి‌ మనకి ఆధారాలు లభ్యంకాలేదు.

ఆదికాండము 10:15-20

కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.

ఈ వచనాలలో హాము కుమారుడైన కానాను కుమారుల నుండి ఉద్భవించిన జాతులగురించి రాయబడింది. సీదోను నుండి, Sidoniuse జాతి ఉద్భవించింది, వీరు లెబనోనులో స్థిరపడ్డారు. హేతు నుండి, Hiltities (హిత్తీయులు) జాతి ఉద్భవించింది, వీరు మధ్యధారా సముద్రం తూర్పుతీరంలో‌ స్థిరపడ్డారు. మెబూసీయులు, ఆమోరీయులు, గీర్గాసీయులు, హివ్వీయులు, సినీయులు, సెమరీయులు మధ్యధారా సముద్రం తీర్పుతీరంలో స్థిరపడ్దారు, ఈ ప్రాంతాలలో కొన్నిటిని తరువాత ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకొన్నారు, అర్కీయులు లెబనోను ప్రాంతంలో స్థిరపడ్డారు,అర్వాధీయులు,హమతీయులు సిరియా,సిరియా తీరప్రాంతాల్లో స్థిరపడ్దారు‌.

ఆదికాండము 10:21,22

మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

ఈ వచనాలలో, నోవాహు కుమారుల్లో యెపెతు అనేవాడు పెద్దవాడని రాయబడి,తరువాత అతని సహోదరుడైన షేము కుమారుల గురించి రాయబడింది. ఏలాము నుండి, Elamites అనే జాతి ఉద్భవించింది, వీరు పర్షియా(ఇరాక్) పితరులు. అష్షూరు నుండి, Assyrians (అష్షూరీయులు) జాతి ఉద్భవించింది, వీరు మెసపొటొమియ లో స్థిరపడ్దారు, వీరిద్వారానే ప్రాచీన సుమేరియన్ నాగరికత ఉద్భవించింది. అర్పక్షదు నుండి, Chadians (కల్దీయులు) జాతి ఉద్భవించింది, వీరు బాబిలోనియ (ఇరాక్) ప్రాంతంలో స్థిరపడ్డారు, ఇతనినుండే ఇశ్రాయేలీయులకు మూలపురుషుడైన అబ్రహాము జన్మించాడు. లూదు నుండి, Lydians అనే జాతి ఉద్భవించింది, వీరు వెస్ట్రన్ అనతోలియ(టర్కీ) లో స్థిరపడ్దారు. అరాము నుండి, aramians అనేజాతి ఉద్భవించింది, వీరి భాషపేరు అరామిక్, ఈ భాషలో బైబిల్ లోని కొన్ని వచనాలు రాయబడ్డాయి. వీరు సిరియా ప్రాంతంలో నివసిస్తున్నందున గ్రీకులు ఆ భాషను సిరియాభాషగా పిలిచారు‌.

ఆదికాండము 10:23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

ఈ వచనంలో అరాము కుమారుల‌ గురించి రాయబడింది. ఊజు నుండి, Trachonitis జాతి ఉద్భవించింది, వీరు సిరియాలో స్థిరపడ్డారు. హూలు నుండి, ఏ జాతి ఉద్భవించిందో ఆధారాలు లభ్యంకాలేదు కానీ, వీరు అర్మేనియా దేశంలో స్థిరపడ్దట్లుగా మాత్రమే మనకి తెలిసింది. గెతెరు నుండి, Bactrians అనే జాతి ఉద్భవించింది, వీరు సెంట్రల్‌ ఏషియాలో నివశించారు (ఆప్గనిస్తాన్,కజికిస్తామ్,ఉజ్జుకిస్తాన్). మాషను నుండి, Characene అనేజాతి ఉద్భవించింది, వీరు పర్షియన్ గల్ప్ ప్రాంతంలో స్థిరపడ్డారు.

ఆదికాండము 10:24,25

అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

ఈ వచనాలలో, అర్పక్షదు కుమారుడైన షేలహు కుమారుడైన ఏబెరుకు పుట్టిన ఇద్దరు కుమారుల గురించి రాయబడింది, వారిలో పెలెగు కాలంలో భూమి దేశాలుగా విభాగించబడింది. అంతకుముందు బహుశా వారు సరిహద్దులు లేకుండా  జాతుల పేర్లనుబట్టే విడివిడిగా జీవిస్తూ ఉండవచ్చు.

ఆదికాండము‌ 10:26-31

యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అబీమాయెలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు. మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.

ఈ వచనాలలో, ఏబెరు కుమారుడైన యెక్తాను కుమారుల గురుంచి రాయబడింది. వీరందరూ, ఏజాతుల పేర్లతో జీవించారో మనకి తెలియదు. వీరందరూ, కోఫెన్ నది నుండి తూర్పువైపుగా విస్తరించారు. కోఫెన్ నది అప్గనిస్తాన్ లో ప్రవహిస్తుంది.

ఆదికాండము 10:32
వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.

నోవాహు కుటుంబం ఓడనుండి బయటకు వచ్చి‌నపుడు, దేవుడు వారిని విస్తరించమని ఆశీర్వదించినట్లుగా మనకి‌ కనిపిస్తుంది, దేవుడు ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చి వారిని విస్తరింపచేసి భూమియంతటా నింపినట్లుగా ఈ అధ్యాయం సాక్ష్యమిస్తుంది.

 

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.