పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gen20 thumb

 

20:1, 20:2, 20:3, 20:4,5, 20:6,7, 20:8-11, 20:12,13, 20:14-16, 20:17,18

ఆదికాండము 20:1

అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.

ఆదికాండము 13:17 లో దేవుడు చెప్పిన ప్రకారం, అబ్రాహాము ఆ దేశమంతటినీ సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు.

ఆదికాండము 20:2

అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

ఆదికాండము 12 వ అధ్యాయంలో, అబ్రాహాము దేవునిపైన ఆధారపడకుండా, తన స్వంత ఆలోచనతో తనను‌ తాను కాపాడుకునేందుకే ఈవిధంగా ఐగుప్తు రాజు ముందు పలికాడని వివరించడం జరిగింది, ఈ సందర్భంలో కూడా అబ్రాహాము‌ అటువంటి ఆలోచననే కలిగియున్నాడు.

ఆదికాండము 20:3

అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చినీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.

ఈ సందర్భంలో, శారా నిమిత్తం దేవుడు గెరారు రాజును స్వప్నములో హెచ్చరించడం మనం చూస్తాం; బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ప్రవక్తల నిమిత్తం, ఇశ్రాయేలీయుల నిమిత్తం దేవుడు అన్యులతో మాట్లాడినట్లు కనిపిస్తుంది.

ఆదికాండము 20:4,5

అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడుప్రభువా ఇట్టి నీతిగల జన మును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.

ఈ సందర్భంలో అబీమెలకు తాను ఎందుచేత శారాను తన ఇంటచేర్చుకున్నాడో వివరించడం మనం చూస్తాం, అదేవిధంగా మోషే ధర్మశాస్త్రానికి ముందు కాలంలో, అన్యులకు సైతం పరాయివాని భార్యను ఆశించకూడదనే విషయం‌ తెలిసినట్లు కనిపిస్తుంది, ఇటువంటి నైతికపరమైన నియమాలు ప్రారంభం నుండీ మనస్సాక్షిలో దేవుని చేత బోధించబడుతున్నాయి. అయితే అబీమెలకు అక్కడ తన ప్రజలను, నీతిగల ‌జనంగా పేర్కోనడం‌ మనకి కనిపిస్తుంది, క్రింది వచనాల్లో అబ్రాహాము మాత్రం‌ వారిలో దేవుని భయం ఏమాత్రమూ లేదని ఆరోపిస్తున్నాడు. వాస్తవానికి అబ్రాహాము మాటలే వాస్తవం, అబీమెలకు తానే శారాయిని చేర్చుకోడం వల్ల ఆ నేరం తనదే కానీ, తన ప్రజలది కాదు, కాబట్టి వారిని శిక్షించవద్దని వేడుకునేందుకే అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు.

ఆదికాండము 20:6,7

అందుకు దేవుడు అవును, యధార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆ మెను ముట్టనియ్యలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకు దువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

దేవుడు ఈ విధంగా అబీమెలకుతో మాట్లాడి, అతను పాపాన్ని చేయకుండా ఆపుతున్నట్లు మనకి కనిపిస్తుంది; ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకునే క్రమంలో నరుల పాపాన్ని నియంత్రించగలడని ఈ సందర్భం రుజువు చేస్తుంది. ఒకవేళ, అబీమెలకు శారాతో వ్యభిచరిస్తే దానివల్ల ఇస్సాకుకూ, ఇశ్రాయేలు జాతికీ అవమానకరంగా ఆ నింద మిగులుతుంది. అందుచేతనే ఆయన ఈవిధంగా అబీమెలకును నియంత్రించాడు.

ఆదికాండము 20:8-11

తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రాహామును పిలిపించినీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకునీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా అబ్రాహాముఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు రనుకొని చేసితిని.

ఈ సందర్భంలో అబ్రాహాము తాను ఏ ఉద్దేశంతో ఆ విధంగా చేయవలసి వచ్చిందో అబీమెలకుకు వివరిస్తున్నాడు. అతని‌ మాటల ప్రకారం ఆ ప్రాంతంలో దేవునిభయం ఏమాత్రమూ‌ లేదు.

ఆదికాండము 20:12,13

అంతేకాకఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. దేవుడు నన్ను నా తండ్రియిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచిమనము పోవు ప్రతి స్థలమందుఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.

దీనిగురించి, 12 వ అధ్యాయపు వివరణలో మనం చూసాం; అబ్రాహాముకు శారా సొంత చెల్లి కాదు, అతని తండ్రియైన తెరహుకు ఆదికాండము 11:17 వచనం ప్రకారం, ఆడసంతానం లేదు. శారా తెరహు అన్నదమ్ములకు చెందినవారి కుమార్తె అవ్వడం వల్ల, ఆమె నా తండ్రికుమార్తెయని ఈ సందర్భంలో అబ్రాహాము సంబోధిస్తున్నాడు.

ఆదికాండము 20:14-16

అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకుఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమ నెను. మరియు అతడు శారాతోఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.

ఈ సందర్భంలో గెరారు రాజైన అబీమెలకు ఐగుప్తు రాజైన‌ ఫరోవలే, తాను చేసిన అపరాధానికి ప్రాయుశ్చిత్తంగా శారాయికి కొంత సొమ్ము ఇస్తున్నట్లు కనిపిస్తుంది; దీన్నిబట్టి అపరాధానికి ప్రాయుశ్చిత్తం తప్పనిసరనే విషయం అన్యులకు కూడా తెలిసినట్లు అర్థం ఔతుంది. అదేవిధంగా, మన తెలుగు‌ బైబిల్ లో ఆ ప్రాయుశ్చిత్త సొమ్ము వెయ్యి రూపాయలని తర్జుమా చేసినప్పటికీ, మూలభాషలో అవి వెయ్యి వెండినాణేలని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ లో చూసినా ఇది స్పష్టమౌతుంది.

ఆదికాండము 20:17,18

అబ్రాహాము దేవుని ప్రార్థింపగాదేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి. ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

ఈ సందర్భంలో, అబీమెలకు ఇంట్లో దేవుడు గర్భాల్ని మూసియుంచడం ద్వారా శారా అతని ఇంట్లో అనేకదినములు ఉందని మనం భావించవచ్చు, దేవుడు చెప్పినట్లుగా అబీమెలకు చేసినపుడు ఆయన అబీమెలకు ఇంటివారిని బాగుచేసాడు, ఆ పనిలో అబ్రాహాము ప్రార్థనను సాధనంగా వాడుకున్నాడు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.