పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

5:1, 5:2, 5:3, 5:4, 5:5, 5:6-8, 5:9-22, 5:23,24, 5:25-27, 5:28-31, 5:32

ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను.

ఈ వచనంలో దేవుడు ఆదామును దేవునిపోలికగా చేసాడని రాయబడడం మనం చూస్తాం. అంటే అది శారీరకరూపం గురించి కాదని, నైతిక గుణలక్షణాల గురించే ఆ మాటలు చెప్పబడ్డాయని ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 1:27 వ్యాఖ్యానం చూడండి).

ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరుపెట్టెను.

ఈ వచనంలో దేవుడు ఆదాము హవ్వలను ఒకేదినం (ఆరవరోజు) లో సృష్టించి వారికి నరులని పేరుపెట్టినట్టు రాయబడడం మనం చూస్తాం. కొందరు దేవుడు ఆదామును సృష్టించడానికీ, హవ్వను చేసివ్వడానికీ మధ్య కొన్నిరోజుల వ్యవథి ఉందని భావిస్తుంటారు కానీ, అది వాస్తవం కాదు. ఎందుకంటే, దేవుడు ఆరు దినాల్లో తన సృష్టిని ముగించి ఏడవ దినాన విశ్రమించాడు. కాబట్టి హవ్వకూడా, ఆదాము సృష్టించబడిన ఆరవదినంలోనే నిర్మించబడింది (ఆదికాండము 1:27,31). అయితే ఆదాము హవ్వలు ఇద్దరి సృష్టికీ మధ్యలో కొన్నిరోజుల వ్యవథి ఉందని వారు ఎందుకు భావిస్తున్నారంటే, ఆదాము ఆ సందర్భంలో భూజంతువులకూ, ఆకాశపక్షులకూ పేర్లు పెట్టేవరకూ హవ్వ నిర్మించబడలేదు. ఇన్ని జీవరాశులకు ఆదాము ఒకేదినంలో పేర్లు పెట్టడం అసాధ్యం కాబట్టి హవ్వ తరువాతి దినాల్లో నిర్మించబడిందని వారు భావిస్తుంటారు. కానీ, అక్కడ ఆదాముకు జీవరాశులన్నిటికీ పేర్లుపెట్టే జ్ఞానం దేవుడే అనుగ్రహించాడు. ఈ కారణం చేత ఆ పని కొద్దిసమయంలోనే పూర్తిచేసే శక్తిని మాత్రం ఎందుకు అనుగ్రహించడు? లేఖనాలు ఆదాము హవ్వలు ఒకే దినంలో సృజించబడ్డారని, ఆయన ఏడవ దినానికి తన సృష్టినంతా పూర్తిచేసి విశ్రమించాడని చెబుతున్నాయి కాబట్టి అదే సత్యం.

అదేవిధంగా, హీబ్రూబాషలో నరులు/నరుడు అన్నపుడు "אדם" Adam (ఆదాం) అనే పదం వాడబడింది. ఈ పదానికి Man (మనిషి/మనుషులు) అని అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి అది ఏకవచనమా లేక బహువచనమా అనేదాన్ని అర్థం చేసుకోవాలి.

ఆదికాండము 5:3
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరుపెట్టెను.

ఆదాము హవ్వలకు, కయీను చేత చంపబడిన హేబెలుకు ప్రతిగా షేతు జన్మించాడని నాలుగవ అధ్యాయంలో మనం చూసాం. ఆ షేతు వంశావళి‌ని గురించిన వివరణ ఈ వచనం నుండి ప్రారంభమౌతుంది. ఇతనినుండే  విశ్వాసులైన హనోకు, నోవాహు, అబ్రాహాము జన్మించారు, అబ్రాహాము సంతానం ద్వారానే మెస్సీయ (యేసుక్రీస్తు) ఈ భూమిపైకి అరుదించాడు‌ (లూకా 3:23-38).

అదేవిధంగా, ఈ వచనంలో ఆదాము‌ తన పోలికలో షేతును కన్నాడని రాయబడింది. ఆదాము మాత్రం దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. స్వరూపం, పోలిక అన్నప్పుడు అది శారీరక రూపం గురించి కాదని, నైతిక గుణలక్షణాల గురించే ఆ పదం వాడబడిందని ఇప్పటికే మనం చూసాం (ఆదికాండము 1:27 వ్యాఖ్యానం చూడండి). అలాంటప్పుడు మోషే ఆదాము‌ విషయంలో రాసినట్టుగా, షేతు విషయంలో కూడా దేవుని పోలిక దేవుని స్వరూపంలో జన్మించాడని ఎందుకు రాయడం లేదు? ఎందుకంటే వీరిద్దరి జన్మకూ వ్యత్యాసం ఉంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు తనలో ఉన్న నైతిక గుణలక్షణాలతో, పాపంలేని సంపూర్ణ‌ మానవుడిగా సృష్టించాడు. కానీ ఆ ఆదాము పాపం చేసినప్పుడు అతనినుండి జన్మిస్తున్న మానవులందరికీ పాపస్వభావం సంక్రమించింది, వారందరూ ఆత్మీయంగా మరణించిన స్థితిలోనే జన్మిస్తున్నారు.

కీర్తనలు 51: 5 నేను పాపములో పుట్టినవాడను.

కాబట్టి ఇక్కడ మోషే షేతు దేవుని పోలికలో జన్మించాడని కాకుండా ఆదామునుండి అతనికి సంక్రమించిన పతనస్వభావాన్ని నొక్కిచెప్పడానికి అతను ఆదాము పోలికలో జన్మించాడని రాస్తున్నాడు. ఐతే యేసుక్రీస్తు ప్రభువు జన్మించబోతున్న ఈ షేతు సంతానంలో కొందరు, కయీను సంతానం వలే ఆత్మీయ‌ మరణంలోనే జీవించకుండా, దేవుని కృపనుబట్టి ఆత్మీయంగా తిరిగి జన్మించి, (ఎఫేసి 2:1, యోహాను 3:3, 1 పేతురు 1:4) వారికి కలిగిన విశ్వాసం ద్వారా (హెబ్రీ 12:2, ఎఫేసి 2:8) ఆ పాపస్వభావంతో పోరాడుతూ దేవునికి ఇష్టులుగా జీవించడం ప్రారంభించారు. ఈ విధంగా వారిలో దేవునిపోలిక దేవుని స్వరూపం మరలా స్థాపించబడింది. మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

రెండవ కొరింథీయులకు 3:17,18 ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.

గలతియులకు 4: 19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

గమనించండి, నేను ఇక్కడ మనం దేవునిపోలిక స్వరూపంలో లేమని చెప్పడం లేదు. కానీ ఆ దేవునిపోలిక స్వరూపానికి వ్యతిరేకంగా ప్రవర్తింపచేసే పతనస్వభావాన్ని కూడా సంక్రమించుకుని ఉన్నాము. షేతు విషయంలో మోషే దానిని నొక్కిచెప్పడానికే అలా ప్రస్తావించాడు.

ఆదికాండము 5:4
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.

యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫెస్ The Antiquities of the Jews అనే తన పుస్తకం మొదటి భాగం, రెండవ అధ్యాయం Footnote లో, ప్రాచీన యూదుల నమ్మకం ప్రకారం ఆదాముకు ముప్పై ముగ్గురు కుమారులు, ఇరువై ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లుగా రాసాడు. ఇది ఎంతమట్టుకు వాస్తవమో మనకు తెలియదు కానీ, యూదులలో మాత్రం ఈ నమ్మకం ఉంది.

ఆదికాండము 5:5
ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఈ భూమిపైన దేవుడు సృష్టించిన మొదటి మానవుడూ, మనందరికీ మూలపురుషుడునూ అయిన ఆదాము, ఈ వచనంలో మరణించినట్టు మనం చూస్తాం. దేవుని ఆజ్ఞను మీరకమునుపు మరణమే లేని ఇతను చివరికి తన పాపఫలితంగా మరణానికి లోనయ్యాడు. అతను చేసిన ఆ పాపంవల్ల మనలో కూడా అతని పాపస్వభావం సంక్రమించి మనమంతా మరణానికి లోనయ్యేలా చేస్తుంది. ఎందుకంటే అతనే మనకు పితరుడు, ప్రతినిధి కూడా.

రోమీయులకు 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

అయితే విశ్వాసులకు ఈ మరణం శాశ్వతం కాదు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు రెండవరాకడలో వారందరూ మరణం నుండి విడిపించబడి తిరిగిలేస్తారు, శాశ్వతంగా దేవుని సన్నిధిలో జీవిస్తారు.

1కోరింథీయులకు 15: 22,13 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

ఆదికాండము 5:6-8
షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఈ వచనాలలో ఎనోషను జననం గురించి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఆదికాండము 4:26 ప్రకారం; ఇతని ద్వారానే యెహోవా దేవుని నామంలో ప్రార్థన చెయ్యడం ప్రారంభమైంది. అంతకుముందు‌ వారు మనం చేస్తున్నట్టుగా క్రమబద్ధంగా, సమయాన్ని కేటాయించి ప్రార్థన చేస్తుండకపోవచ్చు, లేదా ఇప్పటి మనకులా సమాజంగా చేరి ప్రార్థన చెయ్యడం అతని ద్వారానే ప్రారంభమైయుండవచ్చు.

ఆదికాండము 5:9-22 
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.

ఈ వచనాలలో యెరెదు కుమారుడైన హనోకును దేవునితో నడిచినవాడిగా మనం చూస్తాం. ఇతని సంతానంలో జన్మించిన నోవహు కూడా దేవునితో నడిచినవాడే (ఆదికాండము 6:9). దేవునితో నడవడం అంటే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించడమని అర్థం.

ద్వితియోపదేశకాండము 5:33 కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరుస్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.

ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన మరొక విషయం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రానికి ముందున్న భక్తులకు దేవుడు వ్రాతరూపకంగా ఆజ్ఞలను ఇవ్వనప్పటికీ, వారు తన మార్గంలో నడుచుకునేలా వ్యక్తిగతంగా (ప్రత్యక్షతల ద్వారా) బోధిస్తూనే ఉన్నాడు. ఆ బోధలు మనస్సాక్షి ద్వారా కూడా వెల్లడి ఔతుంటాయి.

ఆదికాండము 5:23,24
హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ఈ వచనంలో హనోకును దేవుడు తీసుకుపోయాడు కాబట్టి అతను లేకపోయెను అని రాయబడడం మనం చూస్తాం. ఆదాము నుండి ప్రతీమానవుడూ మరణించాలి అనేది దేవుని శాసనం.

కీర్తనలు 89:48 మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

అయితే పై వచనంలో, హనోకుకు మాత్రం ఆ మరణం నుండి మినహాయింపు కలిగినట్టుగా రాయబడింది.

హెబ్రీయులకు 11:5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

హనోకు మాత్రమే కాదు ఏలియా కూడా మరణించకుండా కొనిపోబడినట్టు రాయబడింది (2 రాజులు 2:11). మనిషి తనకు తానుగా మరణం నుంచి తప్పించుకోలేడు కానీ, దేవుడు తప్పించాలనుకుంటే ఆయనకు అసాధ్యమైనదేదీ ఉండదని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది. మరణశాసనం రాసినవాడు దానినుండి మినహాయించగలడు, తప్పించగలడు.

అయితే ఇక్కడ ఒక అపార్థానికి స్పష్టత ఇవ్వదలిచాను. ఈ హనోకు ఏలియాల సందర్భాలను బట్టి కొందరు వారు పరలోకానికి వెళ్లిపోయారని భావిస్తుంటారు. కానీ ఈ భూమిపైన జీవించిన మనుషుల్లో యేసుక్రీస్తు పునరుత్థానానికి ముందుగా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదని వాక్యం చెబుతుంది.

యోహాను 3:13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

భూమిపైన పుట్టిన మనిషి ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో దైవమానవునిగా జన్మించి, ఆదామువల్ల మానవులందరికీ సంక్రమించిన పాపానికి (పాపస్వభావానికి), దాని కారణంగా పాపభరితంగా మారిన వారి క్రియలకు తన మరణం ద్వారా ప్రాయశ్చిత్తం చేసాకనే పరలోకం వెళ్ళడం సాధ్యం ఔతుంది. అందుకే ఆయన "యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు" (యోహాను 14: 6), "మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా "విమోచన క్రయధనముగా" తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను" (మార్కు 10: 45) అని స్పష్టంగా తెలియచేసాడు.

కాబట్టి హనోకు ఏలియాలు ఈ భూమిపైన మానవులందరికీ ప్రాప్తించే సహజమరణం నుండి మినహాయించబడినప్పటికీ, వారు పాతనిబంధన భక్తులందరూ మరణించి నెమ్మదిపొందే స్థలానికే వెళ్ళారు (లూకా 16:20-26). ఆవిధంగా హనోకు, ఏలియాలు శారీరకంగా మరణించనప్పటికీ వారు పరలోకం వెళ్లలేదు.

మరికొందరు హనోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు అనేమాటను వక్రీకరించి, ఆ మరణం రెండవ మరణమైన నరకమే తప్ప, శారీరక మరణం కాదని బోధిస్తుంటారు. వీరి వాదనప్రకారం మరణం అన్నపుడల్లా రెండవ మరణమైన నరకమే ఐతే అబ్రాహాముతో సహా మిగిలిన భక్తులందరూ మరణించారని రాయబడింది. అంటే వారు రెండవ మరణమైన నరకానికి వెళ్ళిపోయారనా? వాక్యం స్పష్టంగా హనోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడని తెలియచేస్తున్నప్పుడు దానికి ఎవరూ స్వంత భాష్యాలు చెప్పే ప్రయత్నం చెయ్యకూడదు.

హెబ్రీయులకు 11:5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

గ్రంథకర్తలు ఈ విషయాన్ని నొక్కి చెబుతుంది, అతని జీవితంలో అలాంటి అద్భుతం జరిగిందని తెలియచెయ్యడానికే. లేదంటే అతనివిషయంలో మాత్రమే ఎందుకు అలా రాయబడింది?

ఇక ఈ హనోకు గురించి మనం తెలుసుకోవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అంత్యదినాలలో భక్తిహీనులకు జరగబోయే తీర్పు గురించి ఇతను ప్రవచించినట్టు యేసుక్రీస్తు సహోదరుడైన యూదా పరిశుద్ధాత్మ ప్రేరణతో తన పత్రికలో ప్రస్తావించాడు.

యూదా 1:14,15 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

ఈ రోజుకు కూడా Book of Enoch అనే పేరుతో మూడు పుస్తకాలు యూదాసమాజంలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పుస్తకాన్ని హనోకే రాసాడని కానీ, అందులోని మాటలన్నీ అతని ప్రవచనాలే (దేవునివాక్యమే) అని కానీ చెప్పడం సాధ్యపడదు. అందుకే యూదులు కూడా పాతనిబంధనను గ్రీకులోకి తర్జుమా చేసేటప్పుడు (LXX) అందులో ఆ పుస్తకాన్ని చేర్చలేదు. అయినప్పటికీ అందులో కొన్ని చరిత్రకు సంబంధించిన విషయాలు యూదులకు ఈనాటికీ అంగీకారమే. యూదా పత్రికను రాస్తున్న యేసుక్రీస్తు సోదరుడైన యూదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో దానిని రాస్తున్నాడు కాబట్టి, అతను ప్రస్తావించింది మాత్రం హనోకు ప్రవచనంగా (దేవుని‌వాక్యంగా) మనం అంగీకరిస్తున్నాం.

ఆదికాండము 5:25-27
మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఈ వచనాల ప్రకారం ఈ భూమిపై ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా మెతూషెలను మనం చూస్తాం. సాధారణంగా కొందరు బైబిల్ పండితులు ఆ కాలంలోని వ్యక్తులు అంత ఎక్కువకాలం ఎలా జీవించారనే ప్రశ్నకు అప్పటి వాతావరణ పరిస్థితులు కారణమని కొందరు, ఏదెనుతోటలో ఆదాము హవ్వలు తిన్నటువంటి ఫలాల ప్రభావం వల్ల అని మరికొందరు సమాధానం ఇస్తుంటారు.
ఈ రెండు సమాధానాలు కూడా వారి స్వంత ఊహ నుండి వచ్చినవే తప్ప వాటికి వాక్య ఆధారం ఏమీ లేదు. ఈ కారణం చేత ఈ విషయాన్ని ఇంతటితో విడచిపెడుతున్నాను.

ఆదికాండము 5:28-31
లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఈ వచనాలలో జలప్రళయం తరువాత ఈ భూమిపై విస్తరించిన మానవజాతికి మూలపురుషుడైన నోవహు జననం గురించి రాయబడడం మనం చూస్తాం. నోవహు అనే పేరుకు హీబ్రూ భాషలో Rest (విశ్రాంతి) or Comfort (నెమ్మది) అని అర్థం. ఈ పేరుకు అతనికి పెట్టడం వెనుక లెమెకుకు ఉన్న ఉద్దేశం స్పష్టంగా రాయబడింది. ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి భూమిని కష్టపడి సాగుచేయవలసిన పరిస్థితి వచ్చింది, ఆ సాగుచేసే క్రమంలో నోవహు కూడా వారికి తోడుగా ఉండి కాస్త కష్టాన్ని తగ్గిస్తాడు అన్నదే ఆ ఉద్దేశం. గమనించండి జన్మపాపాన్ని విస్మరించే కొన్ని గుంపులు ఆదాము శాపం ఆదాముకు మాత్రమే తప్ప‌ మిగిలినవారికి వర్తించదని మూర్ఖంగా వాదిస్తుంటారు. అదే నిజమైతే ఆదామును బట్టి శపించబడిన నేల నోవహు సమయంవరకూ కూడా శపించబడినట్టుగానే ఎందుకు ప్రస్తావించబడింది? అది చివరి వరకూ అలానే ఉంటుందని కూడా స్పష్టంగా రాయబడింది.

రోమీయులకు 8:19-22 దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.

కొందరు, ఆదాము నుండి నోవహు వరకూ ఉన్న వారి పేర్ల అర్థాలను సేకరించి అందులో సువార్తమర్మం నిక్షిప్తమైయుందని బోధిస్తుంటారు కానీ, బైబిల్ హెర్మునిటిక్స్ (భాష్యం) ప్రకారం అది నాకు సరైనదిగా అనిపించలేదు అందుకే ఆ అభిప్రాయాన్ని నేను తీసుకోవడం లేదు. ఒకవేళ అదే అభిప్రాయాన్ని స్వాగతిస్తే తరువాత రాయబడిన వంశావళుల నుండి కూడా పేర్ల అర్థాలను సేకరించి వేరే ఏదో చెప్పే ప్రయత్నం కూడా చెయ్యవచ్చు కదా!

ఆదికాండము 5:32
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

ఈ వచనంలో నోవహుకు ముగ్గురు కుమారులు‌ ఉన్నట్టుగా వారి పేర్లు ప్రస్తావించబడడం మనం చూస్తాం. జలప్రళయం తరువాత వీరినుండే మానవజాతి విస్తరించింది. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులెవరైనా ఈ ముగ్గురిలో ఎవరొకరి సంతానానికి చెందినవారే (ఆదికాండము 10:32). బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి పుట్టిన పిల్లల జాబితా రాయబడినప్పుడు మొదట పుట్టినవాని పేరు ప్రారంభంలోనూ, ఆఖరిగా పుట్టినవాని పేరు చివరిలోనూ రాయబడలేదు. ఈ వచనంలో నోవహు కుమారుల జాబితాలో షేము పేరు ముందుగా రాయబడింది. కానీ షేము నోవహుకు పెద్దకుమారుడు కాదు, నోవహు పెద్దకుమారుని పేరు యాపెతు (ఆదికాండము 10:21). షేము నోవహుకు పెద్దకుమారుడు కాకపోయినా దేవుడు అతడిని ప్రముఖుడిగా ఏర్పరచుకున్న కారణం చేత మోషే అతని పేరునే ముందుగా ప్రస్తావిస్తున్నాడు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.