పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

42:1, 42:2,3, 42:4, 42:5,6, 42:7-9, 42:10-13, 42:14-17, 42:18-20, 42:21, 42:22, 42:23, 42:24, 42:25-28, 42:29-38

ఆదికాండము 42:1
ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచు చున్నారని తన కుమారులతో అనెను.

ఈ వచనంలో ఫరోకు దేవుడు తెలియచేసిన కరవు ప్రభావం కనానులో నివసిస్తున్న యాకోబు కుటుంబంపై కూడా పడినట్టు మనం చూస్తాం (ఆదికాండము 41:57). దేవుడు అబ్రాహాము సంతానానికి వాగ్దానం చేసిన ఈ కనాను దేశంలో ఆదికాండము 12:10 ప్రకారం; అబ్రాహాము, 26:1 ప్రకారం; ఇస్సాకు, ఈ సందర్భంలో యాకోబు కూడా కరువు ప్రభావానికి గురయ్యారు. కాబట్టి విశ్వాసులకు అన్ని సమయాలలోనూ సమృద్ధి కలుగుతుందని‌ మనం భావించకూడదు. అది గ్రహించిన యాకోబు ఆ కరవు నుండి‌ తప్పించుకునే వైపుగా ఆలోచిస్తూ తామున్న పరిస్థితిని బట్టి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో (ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ) జీవిస్తున్న తన కుమారులకు ఐగుప్తులో ధాన్యం అమ్మకం జరుగుతుందని అతను తెలుసుకున్న విషయాన్ని చెబుతున్నాడు.

ఆదికాండము 42:2,3
మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.

ఈ వచనాలలో యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని‌ తెలుసుకుని తన కుటుంబం ఆకలితో నాశనం అవ్వకుండా అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కురమ్మని తన కుమారులను ప్రేరేపిస్తున్నట్టు మనం చూస్తాం. తన కుమారులు మాత్రం అప్పటికే వివాహాలు చేసుకుని పిల్లలతో ఉన్నప్పటికీ పైనచెప్పినట్టుగా అయోమయ స్థితిలో జీవిస్తున్నారు. ఐగుప్తులో ధాన్యం‌ ఉందని వృద్ధుడైన యాకోబు తెలుసుకున్న విషయం వారు తెలుసుకోలేకపోయారు. దీనిని బట్టి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యతలో యాకోబు మనకు మాదిరిగా కనిపిస్తున్నాడు.

1 తిమోతికి 5: 8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.

అదేవిధంగా ఐగుప్తీయులు యాకోబు కుటుంబం సేవించే దేవుణ్ణి కాకుండా అన్యదేవతలను పూజించేవారు అయినప్పటికీ యాకోబు తన కుటుంబపోషణ నిమిత్తం ధాన్యం కొనడానికి తన కుమారులను అక్కడికి పంపుతున్నాడు. కాబట్టి, విశ్వాసులు‌ అవిశ్వాసుల క్రియల్లో పాలుపొందకూడదు కానీ వారితో క్రయవిక్రయాలు చెయ్యకూడదనే నియమేదీ మనముందు లేదు. అబ్రాహాము కూడా అన్యులైన కనానీయుల నుండి భూమిని కొన్నట్టు గతంలో మనం చూసాం (ఆదికాండము 23:16-18).

ఆదికాండము 42:4
అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.

ఈ వచనాలలో యాకోబు బెన్యామీనును తన మిగిలిన కుమారులతో ఐగుప్తుకు పంపకుండా తనయొద్దే ఉంచుకోవడం మనం చూస్తాం. యాకోబు ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలు కుమారులలో చివరివాడే ఈ బెన్యామీను. అప్పటికే పెద్దవాడైన యోసేపు మరణించాడని అతను భావించడం‌ వల్ల, ఇతని విషయంలో జాగ్రతలు తీసుకుంటూ వచ్చాడు. అందుకే తన మిగిలిన కుమారులతో ఇతడిని పంపడం లేదు.

ఆదికాండము 42:5,6
కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.

ఈ వచనాలలో యోసేపు సహోదరులు తమ తండ్రి చెప్పినట్టుగా ఐగుప్తుకు వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం‌ చేసినట్టు మనం చూస్తాం. గతంలో యోసేపు ఒక కలలో "మీ పనలు లేచి నా పనకు సాష్టాంగపడ్డాయని, మరో కలలో పదకొండు నక్షత్రాలు కూడా నాకు సాష్టాంగపడ్డాయని" తన సోదరులకు తెలియచేసిన‌వాటి నెరవేర్పుకు ఇది ప్రారంభం (ఆదికాండము 37:5-8).

ఆదికాండము 42:7-9
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా-

ఈ వచనాలలో యోసేపు తన సోదరులను గురుతుపట్టి తన కలలను జ్ఞాపకం చేసుకుంటూ వారితో కఠినంగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ప్రస్తుతం యోసేపు వయసులో పెద్దవాడయ్యాడు, ఐగుప్తీయుల ప్రధానిగా మంచి వస్త్రాలతో ఉన్నకారణం చేత వారు అతడిని గుర్తించలేదు. అయితే యోసేపు తన సోదరులు తనను అమ్మివేసారనే పగతో వారితో ఇలా కఠినంగా మాట్లాడం లేదు కానీ వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికీ మరియు అతని‌ మిగిలిన కుటుంబ వివరాలను వారినుండి తెలుసుకోడానికీ ఈవిధంగా మాట్లాడుతున్నాడు. యోసేపు దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మిన కారణం చేత తన సోదరులపై పగతీర్చుకోవాలని అనుకోవడం లేదు. మనం‌ కూడా దేవుని సార్వభౌమత్వాన్ని నమ్ముతున్నప్పుడు మన మనసులో ఇతరులపై పగకు చోటుండదు.

ఆదికాండము 42:10-13
వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడులేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారునీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు. ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.

ఈ వచనాలలో యాకోబు కుమారులు యోసేపు ఏ ఉద్దేశంతో ఐతే వారితో కఠినంగా మాట్లాడుతున్నాడో దానికి తగినట్టుగా వారు తమ కుటుంబ‌ వివరాలను అతనికి తెలియచెయ్యడం మనం చూస్తాం. బహుశా వారు జీవితంలో మొదటిసారిగా ఇంత తీవ్రమైన భయానికి లోనైయ్యుంటారు.

ఆదికాండము 42:14-17
అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్లకూడదు. మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగులవారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.

ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ కుటుంబ వివరాలను యోసేపుకు తెలియచేసినప్పటికీ వారితో కఠినంగానే ప్రవర్తిస్తూ తన‌ తమ్ముడైన బెన్యామీనును అక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు తనపై చూపించిన ప్రేమనే తన తమ్ముడైన బెన్యామీనుపై కూడా చూపుతాడని ఊహించిన యోసేపు ఒకవేళ వీరు అతనికి కూడా ఏదైనా హాని చేసారేమో అని అనుమానించి ఉంటాడు, అందుకే అతను బెన్యామీనును చూడాలి అనుకుంటున్నాడు.

అదేవిధంగా ఈ సందర్భంలో యోసేపు ఫరో జీవముతోడని ప్రమాణం చేస్తున్నాడు, ఐగుప్తీయులు ఫరోను కూడా తమ దేవుడిగా భావిస్తూ‌ అతని పేరిట ప్రమాణం చేస్తుంటారు. ఈ సందర్భంలో యోసేపు వారికి ఒక ఐగుప్తీయుడిగా కనపరచుకోవాలి కాబట్టి అతనిపై వారికి ఎలాంటి సందేహం కలుగకుండా అలా చేసాడు. అయినప్పటికీ ఈ క్రింది వచనాలలో అతను నేను దేవునికి భయపడేవాడనని వారితో మరలా పలకడం ద్వారా అతను ఫరోను దేవునిగా భావించడం లేదని మనం గుర్తిస్తాం.

ఆదికాండము 42:18-20
మూడవ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి భయపడువాడను. మీరు బ్రదుకునట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

ఈ వచనాలలో యోసేపు తాను దేవునికి భయపడేవాడినని వారితో చెబుతూ వారిముందు న్యాయబద్ధమైన ఒక ప్రత్యమ్నాయాన్ని పెడుతున్నట్టు మనం చూస్తాం. అతను వారితో నేను దేవునికి భయపడేవాడినని చెప్పడం ద్వారా వారు కూడా అతను చెప్పినట్టు చెయ్యడానికి ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే దేవునికి భయపడేవారు మాట తప్పి క్రూరత్వాన్ని ప్రదర్శించరని వారికి కూడా తెలుసు. దేవునిపట్ల భయం విశ్వాసులను తాము చిన్న పొరపాట్లను సైతం చెయ్యకుండా నిలువరిస్తుంది.

ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.

నెహెమ్యా 5:15 అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.

ఈ సందర్భంలో నెహెమ్యా దేవునిపట్ల తనకున్న భయం చేత అతనికి ముందున్న అధికారులు తీసుకున్నట్టుగా జీతం కూడా తీసుకోకుండా ప్రజలకు సేవచేసాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులు దేవునిపట్ల భయంతో‌ ఇలాంటి చిన్న పొరపాట్లను కూడా చెయ్యకుండా జాగ్రతపడితే ఈరోజు విశ్వాసులమని చెప్పుకునే చాలామంది దేవుడు అసహ్యించుకునే కార్యాల విషయంలో రాజీపడిపోతున్నారు. అలాంటి వారు నిజంగా దేవునిపట్ల భయాన్ని‌ కలిగియున్నారో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి.

సామెతలు 16:6 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

ఆదికాండము 42:21
అప్పుడు వారు నిశ్చ యముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

ఈ వచనంలో యోసేపు అన్నలు వారు ఐగుప్తులో చిక్కుబడేసరికి గతంలో తమ తమ్ముడి విషయంలో చేసిన దుర్మార్గానికి ఫలితం అనుభవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తాం. పాపపు ఫలితం ఎప్పటికైనా ఈవిధంగానే ఎదురౌతుంది.

సంఖ్యాకాండము 32:23 మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

యోసేపును వీరు గుంటలోకి త్రోసివేసే సమయంలో అతను ఎంతగా బ్రతిమిలాడుతున్నప్పటికీ తమ మనస్సులను కఠినపరచుకుని భోజనాలకు కూర్చున్నారు చివరికి అతడిని అన్యాయంగా అమ్మివేసారు. కానీ ఈ సందర్భంలో దేవుడు వారు చేసిన ఆ అన్యాయాన్ని వారు ఒకప్పుడు కఠినపరచుకున్న మనస్సాక్షి ద్వారానే ఒప్పింపచేస్తున్నాడు.

కీర్తనలు 50: 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను.

ఆదికాండము 42:22
మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను.

ఈ వచనంలో రూబేను యోసేపు విషయంలో వారు చేసిన అన్యాయాన్ని‌ వారికి జ్ఞాపకం చేస్తూ వారిని నిందించడం మనం చూస్తాం. వారు యోసేపుకు హాని చెయ్యాలనుకునే సమయంలో రూబేను వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ (ఆదికాండము 37:21,22), వారు అతని మాట వినలేదు. ఇక్కడ రూబేను తన‌ మిగిలిన సహోదరులతో చిక్కులో ఉన్నప్పటికీ వారు చేసిన దుర్మార్గంలో అతను పాలివాడు కాలేదు కాబట్టి అతని మనసుకు ఆ సమాధానమైనా మిగిలి ఉంది.

ఆదికాండము 42:23
అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.

ఈ వచనంలో ద్విభాషి యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఐగుప్తీయుల బాష యాకోబు కుమారులు మాట్లాడే భాష‌ ఒకటి కాదు, యోసేపు వారిమధ్య ఐగుప్తీయుడిగా కనుపరచుకున్నాడు కాబట్టి వారి బాష అతనికి‌ తెలిసినప్పటికీ వారితో ఇప్పటిదాకా చేసిన సంభాషణ అంతా అనువాదకుడి (translator) ద్వారానే చేసాడు. దీనివల్ల యాకోబు కుమారులు అనువాదకుడు లేనప్పుడు వారు మాట్లాడిన మాటలు యోసేపుకు అర్థం కావనే ఉద్దేశంతో తాము అమ్మివేసిన సోదరుడికోసం పై వచనాలలో చూసినట్టు పశ్చాత్తాపంతో మాట్లాడుకోసాగారు. కానీ యోసేపుకు వారి భాష తెలుసు కాబట్టి వారు మాట్లాడుకున్నదంతా గ్రహించాడు.

ఆదికాండము 42:24
అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.

ఈ వచనంలో తన సోదరుల మాటలను గ్రహించిన యోసేపు వారిపై తనకున్న ప్రేమతో ఏడ్చినప్పటికీ వారిలో ఇంకా మార్పు తీసుకురావాలన్నదీ అలానే బెన్యామీను కూడా తన దగ్గరకు రావాలన్నదే తన ఉద్దేశం కాబట్టి పై వచనాలలో వారితో చెప్పినట్టుగా షిమ్యోనును బంధించడం‌ మనం చూస్తాం.

ఆదికాండము 42:25-28
మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడలనిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను. అప్పుడతడు నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

ఈ వచనాలలో యోసేపు తన అన్నలు ధాన్యం కొనడానికి తెచ్చిన ధనాన్ని తిరిగి వారి సంచులలోనే వేయించడం ద్వారా వారిపై దొంగతనపు ఆరోపణ మోపబడుతుందని వారు భావించడం మనం చూస్తాం. యోసేపు ఇలా చెయ్యడం ద్వారా వారికి దేవుడు గుర్తువచ్చేలా చేసాడు అందుకే వారు దేవుడు మనకిలా చేసాడేంటని భయపడుతున్నారు. వీరికి కష్టం రాగానే జ్ఞాపకం వచ్చిన దేవుడు తన సోదరుడిని అన్యాయంగా అమ్మివేసేటప్పుడు మాత్రం జ్ఞాపకం రాలేదు. ఇది మానవుడిలోని పతనస్వభావాన్ని తెలియచేస్తుంది, చాలామంది తాము పాపాలు చేసేటప్పుడు దేవుడికి లెక్కచెప్పాలని (రోమా 14:12) జ్ఞాపకం చేసుకోరు కానీ తమ పాపఫలితాన్ని చూసినప్పుడు మాత్రం దేవుడు నాకెందుకిలా చేసాడంటూ వాపోతుంటారు. అదేవిధంగా ఇక్కడ యోసేపు ఇలా చెయ్యడం ద్వారా తన కుటుంబం నుండి ఎలాంటి ధనమూ‌ తీసుకోకుండా ఉచితంగా వారికి ఆహారమిస్తూ తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నాడు.

ఆదికాండము 42:29-38
వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి. ఎట్లనగాఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను. అప్పుడుమేము యథార్థవంతులము, వేగులవారము కాము. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచిమీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపా రము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు. షిమ్యోను లేడు. మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు. ఇవన్నియు నాకు ప్రతి కూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేనునేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడునా కుమారుని మీతో వెళ్లనియ్యను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు కుమారులు తమ‌ తండ్రికి ఐగుప్తులో జరిగిన సంగతంతా వివరించడం మనం చూస్తాం. ఇదంతా యాకోబు తనకు ప్రతికూలంగా జరుగుతున్నట్టుగా భావించాడు కాబట్టి రూబేను తన కుమారులను కొదువపెట్టి బెన్యామీనును తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ అతను దానికి ఒప్పుకోకుండా బెన్యామీనుకు కూడా ఏదైనా హాని జరిగితే తన మరణం బాధతో జరుగుతుందని వారిని అడ్డగిస్తున్నాడు. కానీ ఇక్కడ యాకోబు నా కుటుంబానికి ఎందుకిలా జరుగుతుందని దేవుణ్ణి నిందించడం లేదు. కాబట్టి విశ్వాసుల కుటుంబాలలో ప్రతికూలమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ తమ దేవుణ్ణి నిందించకుండా యాకోబులా జాగ్రతపడాలి. ఆ పరిస్థితి నుండి కాపాడమని దేవుణ్ణి విధేయతతో వేడుకోవాలి.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.