పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

2:1, 2:2, 2:3 , 2:4 , 2:5,6 , 2:7 , 2:8 ,2:9 , 2:10-14 , 2:15 , 2:16,17 , 2:18 , 2:19,20 , 2:21,22 , 2:23 , 2:24 , 2:25

ఆదికాండము 2:1
ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.

ఈ వచనంలో దేవుడు సృష్టిని ఎలా, వేటితో చెయ్యాలని ఉద్దేశించాడో అదంతా పూర్తి చేసినట్టుగా రాయబడడం మనం చూస్తాం. ఐతే ఇక్కడ ఆకాశమునూ భూమియూ వాటిలో ఉన్న "సమస్త సమూహములు" అనేపదం వాడబడదాన్ని గమనిస్తున్నాం. సాధారణంగా సమూహములు అనేపదం సైన్యాన్ని ఉద్దేశించి వాడుతుంటారు. దీనిప్రకారం ఆకాశంలో ఉన్న పెద్దపెద్ద నక్షత్రాలు నుంచి, ఈ భూమిపై ఉండే చిన్నచిన్న జీవులవరకూ అవన్నీ దేవుని సైన్యాలే (ఆయన ఆజ్ఞను నెరవేర్చేవే). అందుకే ఆయనను సైన్యములకు అధిపతియని లేఖనాలు అనేకసార్లు సంబోధించాయి. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.

యోవేలు 2: 25
మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

ఈ సందర్భంలో, మిడతలు, గొంగలిపురుగులు, పసరపురుగులు, చీడపురుగులు కూడా ఆయన మహా సైన్యంగా ప్రస్తావించబడ్డాయి. ఈ సైన్యం ద్వారానే దేవుడు ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పాడు. కాబట్టి ఈ సృష్టిలో ప్రతీదీ దేవుని సైన్యంగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.

కీర్తనలు 148: 8
అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ-

ఆదికాండము 2:2
దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.

ఈ వచనంలో దేవుడు తాను ఉద్దేశించిన పనంతటినీ ఆరురోజుల్లో పూర్తి చేసి ఏడవ దినాన విశ్రమించినట్టు రాయబడడం మనం చూస్తాం. దీనికి ఆయన భవిష్యత్తులో మరేమీ సృష్టించడని కాదు కానీ, అప్పటికి ఆయన భూమి ఆకాశాలలో ఏవైతే సృష్టించాలనుకున్నాడో, వాటిని పూర్తిచేసాడని అర్థం. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ కూడా సృష్టిస్తాడని రాయబడింది (ప్రకటన 21:1). అదేవిధంగా, ఆయన ఏడవ దినం నుండి కూడా ఆయన సృష్టించిన ఈ సృష్టిని నిర్వహిస్తున్నాడు (ప్రత్యుత్పత్తి జరిగిస్తున్నాడు, కాపాడుతున్నాడు) ఒక్క క్షణం ఆయన ఆ పనిని ఆపేసినా ఈ సృష్టి ఏమౌతుందో ఊహించలేము.

హెబ్రీయులకు 1:3
ఆయన తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు-

1కోరింథీయులకు 15:38
అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

కీర్తనలు 139:13,14
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

మరో ప్రాముఖ్యమైన విషయం‌ ఏంటంటే, దేవుడు విశ్రమించాడు అనంటే, ఆయన మనవలే అలసిపోయి విశ్రమించాడని కాదు.
ఎందుకంటే;

యెషయా 40:28
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

ఈ వాక్యభాగంలో చాలా స్పష్టంగా ఆయన అలయడు, సొమ్మసిల్లడు అని రాయబడింది. కాబట్టి ఆయన విశ్రమించాడు అనంటే, ఏడవ దినం నుండి ఈ భూమి ఆకాశాలలో నూతన‌ సృష్టి ఏమీ చెయ్యలేదని అర్థం. ఎందుకంటే అప్పటికి ఆయన అనుకున్నవన్నీ సంపూర్తి చెయ్యబడ్డాయి. కానీ పైన చెప్పినట్టుగా ఆయన ఆ దినం కూడా వాటన్నిటినీ నిర్వహిస్తూనే (ప్రత్యుత్పత్తి, కాపాడడం) ఉన్నాడు. నూతన సృష్టి విషయంలో మాత్రమే ఆయన ఏడవ దినం‌ నుండి విశ్రమించాడు.

నిర్గమకాండము 20:11
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

ఆదికాండము 2:3
కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

ఈ వచనంలో దేవుడు తాను విశ్రమించిన ఏడవ దినాన్ని పరిశుద్ధపరుస్తున్నట్టు మనం చూస్తాం. ఇది మనకు ఆరు రోజులు మన ఉపాధి కోసం పని చెయ్యాలని, ఏడవదినాన ఆ పనినుండి విశ్రమించి ఆయన సన్నిధిలో గడపాలని బోధిస్తుంది. దీనిని ఆధారం చేసుకునే క్రైస్తవమిషనరీలు, ఈ దేశంలో భూస్వాముల క్రింద విశ్రాంతి లేకుండా బానిసత్వాన్ని అనుభవిస్తున్న వారికోసం పోరాడి వారికి వారానికి ఒకరోజు సెలవును తీసుకువచ్చారు‌.

ఇలా ఆయన ఏడవ దినాన విశ్రమించడం వెనుక మరో ప్రాముఖ్యమైన కోణం కూడా నిక్షిప్తమై ఉంది. ఇది భవిష్యత్తులో విశ్వాసులు క్రీస్తునందు పరలోకంలో పొందబోయే విశ్రాంతికి గుర్తుగా ఉంది.

హెబ్రీ 4:9,10
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.

దీనికి ఛాయగానే ఆయన ఇశ్రాయేలీయులకు కూడా విశ్రాంతి దినాచారం ప్రవేశపెట్టాడు.

నిర్గమకాండము 20:8-11
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏపనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

ఆదికాండము 2:4
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే.

ఈ వచనంలో దేవుడు తన ఆరురోజుల సృష్టిని ముగించేసరికి, ఆరవ దినానికి ఏవైతే ఉత్పత్తి అయ్యాయో (ఉనికిలోకి వచ్చాయో) వాటి గురించి చెప్పబడడం మనం చూస్తాం. ఇక్కడ భూమిని ఆకాశమును చేసిన "దినమందు" అన్నప్పుడు అవి పూర్తిచెయ్యబడిన (నింపబడిన) "ఆరవదినం" గురించి చెప్పబడుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రింది వచనాలను మనం పరిశీలించినప్పుడు (7,9,19,22) ఆయన ఆరురోజుల్లో సృష్టించిన ప్రధానమైనవాటి వివరణ (ఉత్పత్తిక్రమం) మనకు కనిపిస్తుంది. వీరంతా వేరు వేరు దినాలలో (3-6) ఆరవదినానికి సృష్టించబడ్డారు.

అదేవిధంగా, బైబిల్ లో మొదటిసారిగా ఇక్కడ దేవునికి‌ యెహోవా అనే నామం వాడబడింది.
ఆయన ఈ సమస్త సృష్టినీ చేసాడని చెబుతున్న వచనంలో ఆ పేరును ప్రస్తావించడం ద్వారా గ్రంథకర్త ఆ పేరుకు అర్థమైన ఉన్నవాడు అనేదానిని నిర్థారిస్తున్నాడు. ‌ఎందుకంటే సమస్తాన్ని ఉనికిలోకి రప్పించిన ఆయన తనకు తానుగా ఉనికికి కలిగియున్నవాడు. వాస్తవానికి ఆయన మాత్రమే ఉన్నవాడు మిగతావన్నీ ఆయన వల్ల ఉనికిలోకి వచ్చినవే.

ఆదికాండము 2:5,6
అదివరకు పొలమందలియే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు; అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.

ఈ వచనాలు మూడవదినానికి ఈ భూమిపైన ఉన్న పరిస్థితిని మనకు తెలియచేస్తున్నాయి. మొదటి దినం ఆయన భూమినీ ఆకాశాన్ని వెలుగునూ సృష్టించాడు. కానీ విశ్వమంతా అగాధజలాలతో నిండియుంది. గ్రహాలన్నీ నక్షత్రాలన్నీ ఆ నీటిలోనే ఉన్నాయి. రెండవ రోజు ఆయన ఆ నీటిని పైకీ కిందకూ పంపడం ద్వారా మధ్యలో విశాలం కలిగింది. ఆ విశాలంలోనే మన భూగ్రహం ఉంది. ఆ విశాలానికే ఆయన ఆకాశమని పేరుపెట్టాడు. మూడవరోజు ఆయన భూమిపై ఉన్న నీటిని ప్రత్యేకించి సముద్రాలుగా, ఆరిననేలగా చేసాడు. అదేరోజు ఆయన చెట్లను మొలిపించాడు (ఆదికాండము 1:11-13).

అదేవిధంగా, ఈ సందర్భంలో దేవుడు ఈ భూమిపై వాన కురిపించలేదని, భూమినుండి ఆవిరిలేచి నేల అంతటినీ తడిపినట్టుగా రాయబడింది. దీనిఆధారంగా కొందరు నోవహు జలప్రళయం వరకూ ఈ భూమిపై‌ వర్షం కురవలేదని భావిస్తుంటారు కానీ, అలా చెప్పడానికి మనకు ఆధారం లేదు. ఈమాటలు భూమిని సేద్యపరచడానికి నరుడు లేనప్పటి పరిస్థితి గురించి మాత్రమే చెప్పబడ్డాయి "ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు". దీనర్థం భూమిని సేద్యపరిచే నరుడు సృష్టించబడ్డాక వర్షం కురిసిందనేగా? ఒకవేళ నోవహు కాలంవరకూ వర్షం కురవకపోతే, భూమిపై ఆవిరైన నీరు ఏమైనట్టు? నోవహు అదివరకూ చూడని సంగతుల గురించి హెచ్చరింపబడి ఓడను కట్టాడంటే (హెబ్రీ 11:7), అతను వర్షాన్నే చూడలేదని అర్థం కాదు కానీ, జలప్రళయాన్ని కానీ, దానికి కారణమైన 40 రాత్రులు 40 పగళ్ళ భీకరమైన వర్షాన్ని కానీ చూడలేదని మాత్రమే భావించాలి.

ఆదికాండము 2:7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

ఆదికాండము 1:27లో దేవుడు ఆరవదినాన నరులను సృజించినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఈ వచనంలో ఆ నరులలో మొదటివాడైన ఆదామును ఆయన ఎలా సృష్టించాడో వివరణ ఇవ్వబడుతుంది. ఆదాము చెయ్యబడిన ఈవిధం గురించి చెప్పబడుతున్న మరో లేఖనం కూడా చూడండి.

1కోరింథీయులకు 15: 47‌
మొదటి మనుష్యుడు భూసంబంధియై మట్టినుండి పుట్టినవాడు

ఐతే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి, ఆయన ఆదాములోకి జీవవాయువును ఊదాడంటే, తనలోని నైతికగుణలక్షణాలు, సృజనాత్మకత (పోలిక,స్వరూపం) కలిగి చలించేలా ప్రాణం పోసాడని అర్థం చేసుకోవాలే తప్ప, దేవుని ఆత్మలో భాగమేదో అతనిలోకి పంపాడని కాదు. ఇదెందుకు చెబుతున్నానంటే, మన‌‌తెలుగు క్రైస్తవ్యంలో ఒక గుంపు, ఈ సందర్భాన్ని చూపించి మరికొన్ని సందర్భాలను వక్రీకరించి, దేవుడు తన ఆత్మలో భాగాన్ని ఆదాములోకి పంపాడంటూ హాస్యాస్పద బోధ చేస్తుంటారు. కానీ దేవుడు తన ఆత్మను మనిషిలోకి ఊదాడు అనడానికి కానీ, మనలోని‌ ఆత్మ దేవునిలో భాగమని చెప్పడానికి కానీ బైబిల్ లో ఆధారం లేదు. వాస్తవానికి మన జీవాత్మ, మన దేహం కూడా తల్లి గర్భంలోనే సృష్టించబడుతుంది (కీర్తనలు 139:13-16, యోబు 10:8-12, యెషయా 42:5, జెకర్యా 12:1, యిర్మియా 38:16).

ఆదికాండము 2:8
దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.

ఈ వచనంలో దేవుడు తాను మంటినుండి సృజించి జీవాత్మను ఊదిన మనిషిని ఏదెను తోటలో ఉంచడం మనం చూస్తాం. కొందరు ఈ ఏదెను తోట అనేది కేవలం అలంకారప్రాయంగా రాయబడిందని భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే అప్పుడు దేవుడు నరుడిని‌ చెయ్యడం కూడా అలంకారమేనా అనే ప్రశ్నవస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడి ప్రేరణతో చరిత్రగా చెబుతున్న మాటలను సైన్స్ తో రాజీపడడానికి అలంకారాలుగా మార్చకూడదు. సరైన విధంగా పరిశీలిస్తే సైన్స్ కి చెప్పదగిన సమాధానాలు ఎన్నో మనకు ఉన్నాయి. ఎంతోమంది బైబిల్ పండితులు వాటిని‌ మనకు అందుబాటులో ఉంచారు. ఈ ఏదెను అనేది అలంకారంగా రాయబడింది కాదు, అది ఉనికిలో ఉన్న ప్రాంతమే అని క్రింది వచనాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి.

ఆదికాండము 2:9
మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.

ఈ వచనంలో దేవుడు నరున్ని ఉంచిన ఏదెను తోటలో ఆహారానికి మంచివైన వృక్షాలనూ, జీవవృక్షాన్నీ, మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా మొలిపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. ఆదికాండము 1:31 ప్రకారం; దేవుడు సృష్టించిన ప్రతీదీ మంచిది కాబట్టి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంలో ఏదో చెడు ఉందని‌ మనం భావించకూడదు.‌ అవి తిన్నవారు మంచిచెడ్డలను తమంతట తాముగా గుర్తించేలా చేసే సామర్థ్యం మాత్రం వాటికి ఉంది. అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా వాటిని తింటారో, ఆజ్ఞ అతిక్రమం పాపం కాబట్టి (1 యోహాను 3:4) ఆ పాపం చెయ్యగానే వారు ఆత్మీయ మరణానికి‌ లోనౌతారు (ఎఫెసి 2:1, ఆదికాండము 2:17) దీనివల్ల వారు అప్పటినుండి ఆత్మీయమరణ స్థితిలో, వారిలో చేరిన పతనస్వభావంతో మంచిచెడ్డలను తమంతట తాము నిర్ణయించుకుంటారు, కాబట్టి అది‌ వారికి నష్టాన్నే కలుగచేస్తుంది. దీనిగురించి తరువాత అధ్యాయంలో వివరంగా మాట్లాడుకుందాం.

అదేవిధంగా, కొందరు ఈ సందర్భాన్ని ఎత్తిచూపిస్తూ దేవుడు ఆ మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఎందుకు మొలిపించాడు? ఆయన అలా చెయ్యకుంటే ఆదాము హవ్వలు వాటిని తినేవారే కాదుగా అని ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్న చదువుకునేవారికి పరీక్షలు ఎందుకు పెట్టాలి? అవే లేకపోతే అందరూ విజయం సాధించేవారు అన్నట్టుగా ఉంటుంది.‌ చదువుకుని విజయం సాధించడం విద్యార్థుల బాధ్యత, చెట్టు‌ ఉన్నా వాటి ఫలాలు తినకుండా ఉండడం ఆదాము హవ్వలపై దేవునికి ‌విధేయత చూపాలని మోపబడిన బాధ్యత. ఎందుకంటే, ఈ భూమిపై ఉన్న సమస్తమూ ఆదాము హవ్వలకు అప్పగించబడింది. కానీ వారు మాత్రం తమను సృష్టించిన దేవునికి లోబడి విధేయత చూపించాలి. ఆదాము హవ్వలు ఆ చెట్టును‌ చూసినప్పుడల్లా అది దాని ఫలాలను తినవద్దన్న దేవుని ఆజ్ఞ‌ను వారికి జ్ఞాపకం చేసి, ఆ ఆజ్ఞకు లోబడి దేవునికి విధేయత చూపించమని జ్ఞాపకం చేస్తుంది. ఈ కారణంతోనే ఆయన ఆ చెట్టును మొలిపించాడు. గమనించండి. ఏదెనుతో ఆదాము హవ్వలు తినగలిగే ఫలాల చెట్లు వందలకొలదీ ఉన్నాయి. కానీ దేవుడు ఒకే ఒక్క చెట్టు ఫలాలు తినవద్దన్నాడు. అయినా సరే వాటిని తినడం ఎవరి తప్పు? అసలు వారు ఎందుకు తిన్నారో తరువాత అధ్యాయంలో వివరంగా చూద్దాం.

ఆదికాండము 2:10-14‌
మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు.

ఈ వచనాలలో ఏదెను తోట నాలుగు నదుల మధ్య ఉన్నదని రాయబడడం మనం చూస్తాం. ఈ నాలుగు నదులలో రెండు నదులైన పీషోను, గిహోను అనే నదులను నేటివరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. బహుశా ఈ రెండు నదులూ అంతరించిపోయి ఉండవచ్చు, భూమిపైన అలాంటి మార్పులు సహజమే కదా. కానీ మోషే ఆదికాండాన్ని రాసే సమయానికి మాత్రం అవి ఉనికిలో ఉండి ఉండవచ్చు. అందుకే అతను అంత కచ్చితంగా వాటి పేర్లను ప్రస్తావించాడు. అంతరించిపోయిన గిహోను నది ప్రవహిస్తున్న కూషుదేశం నేటి ఇతియోపియా అని‌ కొందరు పొరబడుతుంటారు. కానీ ఇరాక్ దేశంలో అదే పేరుతో మరొక ప్రాంతం కూడా ఉండేదని కొందరు బైబిల్ పండితులు తెలియచేసారు.

మిగిలిన రెండు నదులైన యూఫ్రటీసు నది, ప్రస్తుతం టైగ్రిస్ గా పిలవబడుతున్న హిద్దెకెలు నది ఆసియా ఖండంలో నైరుతీ భాగమందు కాకసస్సు పర్వతాలలో నేటివరకూ ఎండిపోకుండా ఇరాన్, ఇరాక్ దేశాలలో ప్రవహిస్తూ హిందూ మహాసముద్రంలో పర్షియా అగాధమందు కలసిపోతున్నాయి. వీటి ఆధారంగా దేవుడైన యెహోవా వేసిన ఏదేను తోట ఇరాక్ దేశంలోని మెసపటోమియా అని బైబిల్ పండితులు విశ్వసిస్తారు.

ఆదికాండము 2:15‌
మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.

ఈ వచనంలో దేవుడు తాను సృజించిన నరుడిని ఏదెనును సేద్యపరచడానికీ కాయడానికీ అందులో ఉంచినట్టు మనం చూస్తాం. ఈవిధంగా మానవుడు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన పనిని జరిగిస్తూ ఆయనను మహిమపరచడానికే సృష్టించబడ్డాడు. అయితే ఆదాము చేసిన పాపఫలితంగా అతను ఏదెనులో సులభంగా చేసే పని, అక్కడినుండి గెంటివెయ్యబడ్డాక కష్టతరంగా మారింది. ఈ వాక్యభాగం చూడండి.

ఆదికాండము 3:17-19
ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

దేవుడు ఆదాముకు ఏదెనును సేద్యపరుస్తూ, దానికి కాపుకాయాలనే పనిని అప్పగిస్తే, ఈనాడు మనకు కూడా దేవుడు తన జీవగ్రంథంలో ఆజ్ఞాపించిన పని‌ నియమించబడియుంది. ఆయన ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ, జీవనోపాధి కలిగియుంటూ, ఆయనను మహిమపరచడమే ఈనాడు మనముందున్న దేవుని పని.

ఆదికాండము 2:16,17
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

ఈ వచనాలలో దేవుడు ఆదాముకు మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాలను తినకూడదని, వాటిని తిన్నదినాన నిశ్చయంగా చస్తావని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ చచ్చెదవు అన్నప్పుడు మొదట ఆత్మీయ మరణాన్ని (ఎఫెసీ 2:1) తరువాత శారీరక మరణాన్ని కూడా సూచిస్తుంది (రోమా 5:12). కాబట్టి ఆదాము హవ్వలు ఆ ఫలాలను తినగానే మొదటిగా ఆత్మీయంగానూ తరువాత శారీరకంగానూ చనిపోయారు. వారు మాత్రమే కాదు వారినుండి వస్తున్న మానవజాతి అంతటికీ ఈ రెండు మరణాలు సంక్రమించాయి. కాబట్టే దేవుడు తన నిర్ణయంలో ఉన్నవారిని మరలా ఆత్మీయంగా తిరిగి జన్మింపచేస్తున్నాడు (యోహాను 3:3,6, ఎఫెసి 2:1) దీనిమూలంగా ఆదామువల్ల మనకు సంక్రమించిన శారీరక మరణం నుండి కూడా మృతుల పునరుత్థానంలో విడిపించబడి నిత్యజీవం పొందుకుంటున్నాము (రోమా 6:23, 1 కొరింథీ 15:21).

అయితే కొందరు ఆదాము హవ్వలు ఆ ఫలాలను తింటున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదని ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ వారికి దేవుడు ఆ ఫలాలను తినవద్దని ఆజ్ఞాపించకపోతే, వారు పొరపాటున వాటిని తింటుంటే, తప్పకుండా ఆయన ఆపేవాడు కానీ, ఇక్కడ వారికి వాటిని తినవద్దనే ఆయన ఆజ్ఞ వారు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో విభజించి తెలియచేస్తుంది. తెలిసి కూడా వారికున్న స్వేచ్చతో, దురాశతో ఆ పని చేస్తున్నప్పుడు దానికి తప్పకుండా వారే బాధ్యులు. బలవంతంగా నిలువరించవలసిన అవసరం దేవునికి లేదు. ఇంతకూ వారు ఆ ఫలాలను ఎందుకు తిన్నారో తరువాత అధ్యాయంలో చూద్దాం.

ఆదికాండము 2:18
మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను.

ఈ వచనంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి సాటియైన సహాయాన్ని నిర్ణయించడం మనం చూస్తాం. ఆ సాటియైన సహాయమే హవ్వ (స్త్రీ) యని క్రింది వచనాలలో స్పష్టమౌతుంది. దీనిని బట్టి, వివాహ వ్యవస్థ అనేది దేవుని సంకల్పమని మనం గుర్తించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మానవుడు ఎంచుకునే ప్రతీదీ పాపమే.

హెబ్రీయులకు 13:4
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

నిర్గమకాండము 20:14
వ్యభిచరింపకూడదు.

లేవీయకాండము 18:22-24
స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము. ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.

రోమీయులకు 1:26,27
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి .

దేవుడు సంకల్పించిన వివాహ వ్యవస్థను నిషేధించే బోధను లేఖనాలు దెయ్యాల బోధగా ప్రస్తావించడం జరిగింది.

మొదటి తిమోతికి 4:1-3
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుదురు.

సాధారణంగా మన సమాజంలో వివాహం పైన ఉన్నన్ని సరసోక్తులు మరిదేనిపైనా ఉండవేమో! సృష్టికర్తయైన దేవుడు సంకల్పించిన వివాహవ్యవస్థను హేళన చేసేలా సరసోక్తులను కల్పించడం మనిషి యొక్క పతనస్వభావాన్ని రుజువుచేస్తుంది. ఈరోజు ప్రపంచంలో వివాహ వ్యవస్థ దారితప్పి, భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారడానికి దేవుని సృష్టిని పాడుచెయ్యాలనే అపవాది కుయుక్తినే కారణం. పతనస్వభావియైన మానవుడు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వివాహ వ్యవస్థపై ఎన్నో విధాలుగా దాడిచేస్తున్నాడు. ఇందులో ప్రధానమైనవే వ్యభిచరించడం, స్వలింగ సంపర్కాన్ని జీవితంలోకి ఆహ్వానించడం, జంతుశయనం చెయ్యడం, జీవిత‌ భాగస్వామిని మానసికంగానైనా, శారీరకంగానైనా హింసించడం. ఇవన్నీ కూడా దేవుడు నియమించిన వివాహ వ్యవస్థపై దాడిచేసేందుకు అపవాది ప్రవేశపెట్టిన ఆయుధాలే. దీనికి సంబంధించి రాయబడిన ఈ వ్యాసం కూడా చదవండి.

అదేవిధంగా దేవుడు ఆదాముకు భార్యగా చెయ్యబోయే స్త్రీని అతనికి సాటియైన సహాయంగా పేర్కోవడం జరిగింది. ఇంతకూ ఆమె ఎందులో సాటియైన సహాయం? పై వచనాలలో, దేవుడు ఆదాముకు తోటను సేధ్యపరిచే పనిని అప్పగించినట్టు మనం చూసాం. ఆ పనిలో సాటియైన సహాయంగానే ఆయన స్త్రీని‌ సృష్టించాడు. దీనిప్రకారం ప్రతీ పురుషుడూ దేవుని పనిలో ఉండాలి (దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి). ఆ పనిలో సాటియైన సహాయంగా స్త్రీ అతనికి జతచెయ్యబడాలి. కాబట్టి యవ్వన పురుషులూ, స్త్రీలు జీవితభాగస్వామి విషయంలో అ‌ందానికీ ఆస్తులకూ ప్రాధాన్యతను ఇవ్వకుండా, తాను ఎంచుకుంటున్న వరుడు దేవునిపనిలో ఉన్నాడా? తాను ఎంచుకుంటున్న వధువు ఆ పనిలో సాటియైన సహాయంగా ఉంటుందా అనేదానికి‌ మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ నియమం దారితప్పడం వల్లే, చాలామంది విశ్వాసుల జీవితాలు కూడా వివాహం తరువాత పతనమౌతున్నాయి.

ఆదికాండము 2:19,20
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.

ఈ వచనాలలో దేవుడు భూజంతువులనూ ఆకాశపక్షులనూ నేలనుండి నిర్మించడం, ఆదాము వాటికి పేర్లు పెట్టడం మనం చూస్తాం. ఆ జీవులన్నీ మొదటి అధ్యాయం ప్రకారం ఐదవ దినంలో సృష్టించబడ్డాయి (ఆదికాండము 1:20-25). కొందరు దీనిని కూడా వైరుధ్యంగా భావిస్తుంటారు కానీ, ఇక్కడ అలాంటి అవకాశమేమీ లేదు. మొదటి అధ్యాయంలో ఐదవ దినాన సృష్టించబడినవాటి గురించే ఇక్కడ మరలా జ్ఞాపకం చెయ్యబడింది. ఎందుకంటే ఇది ఆదాము వాటన్నిటికీ పేర్లుపెట్టడం ద్వారా దేవుడు వాటిపై అతన్ని ఏలికగా నియమిస్తున్న సందర్భం. అందుకే దేవుడు "ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు....." వాటిని అతనిదగ్గరకు తీసుకువచ్చినట్టు రాయబడింది. అదేవిధంగా ఇక్కడ ఆదాముకు దేవుడిచ్చిన జ్ఞానం కూడా మనం చూడగలం. ఈ సందర్భం తరువాతనే ఆయన ఆదాముకు సాటియైన సహాయం‌ లేదని స్త్రీని చేసాడు.

అయితే దేవుడు ఆదామును సృష్టించడానికీ హవ్వను సృష్టించడానికీ మధ్యలో రోజుల‌ గడువేమీ లేదు. వారిద్దరూ ఒకేరోజు (ఆరవదినం) కాస్త సమయ పరిథిలో సృష్టించబడ్డారు (ఆదికాండము 1:27-31, 5:2). కానీ ఆదాము సృష్టించబడిన సమయం మొదలుకుని భూజంతువులకు పేర్లుపెట్టే సమయం‌ గడిచే వరకూ (బహుశా సాయంత్రం వరకూ) దేవుడు స్త్రీని చేసివ్వలేదు. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉన్నట్టు మనం భావించవచ్చు. దేవుడు ఆదాము చేత పేర్లు పెట్టించడానికి అతనివద్దకు భూజంతువులను తీసుకువచ్చినపుడు అవన్నీ జతలు జతలుగానే వస్తాయి. కానీ ఆదాముకు మాత్రం‌ జతలేదు. ఇది చూసిన ఆదాముకు జీవితభాగస్వామి పట్ల ఆశ కలుగుతుంది, విలువ పెరుగుతుంది. దీనివల్ల అతను ఆమెను బాగా ప్రేమించగలుగుతాడు. అందుకే ఆదాము హవ్వను చూడగానే ఆనందంతో, "నా ఎముకలో ఎముక మాంసములో మాంసము" అని సంబోధించడం మనం చూస్తాం. వారిద్దరూ ఒకరిని ఒకరు అంత గాఢంగా హత్తుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆదాముకు వెంటనే స్త్రీని చేసివ్వకపోవచ్చు.

ఆదికాండము 2:21,22‌
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.

ఈ వచనాలలో దేవుడు ఆదాము ప్రక్కటెముకను తీసి దానిని స్త్రీగా నిర్మించడం మనం చూస్తాం. స్త్రీ పురుషుడికి వేరుగా చెయ్యబడలేదు. అతని దేహం నుండే ఆమె నిర్మించబడింది. అందుకే లేఖనాలు వారిద్దరూ ఒకరేయని చెబుతున్నాయి.

మొదటి కొరింథీయులకు 11:11,12
అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగాకలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

దీనిని బట్టి స్త్రీ పురుషుల మధ్యలో అహంకారానికి కానీ, ద్వేషానికి కానీ చోటులేదు. ఈరోజు సమాజంలో లింగవివక్ష, లింగపక్షపాతం పుట్టడానికి, మానవ పతనస్వభావం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రేరేపించే అపవాది భావజాలమే కారణం. దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే, పురుషుని దేహం నుండి స్త్రీని కలుగచేసాడు. కానీ నేడు స్త్రీ పురుషులు చాలామంది తమ లింగాన్ని బట్టి మేము వేరు, వారు వేరు అన్నట్టుగా వివక్షలతోనూ, పక్షపాతంతోనూ ప్రవర్తిస్తున్నారు. తమ లింగాన్ని హెచ్చించుకుంటూ, వేరేవారిని ‌కించపరుస్తూ సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారు‌. చివరికి ఇతరుల ప్రాణం ప్రాణమే కాదన్నట్టు, వారి జీవితం జీవితమే కాదన్నట్టుగా కూడా క్రూరాతి క్రూరంగా జీవిస్తున్నారు. క్రీస్తునందు విశ్వాసులైనవారు మాత్రం అపవాది కుట్రమూలంగా మనిషిలోకి ప్రవేశించిన ఈ క్రూరస్వభావాన్ని జయించాలి. దేవుడు తన పోలిక తన స్వరూపంలో చేసిన స్త్రీ పురుషుల పట్ల, ఆయనయందు ఒక్కటిగా ఉన్న ఆ స్త్రీ పురుషుల పట్ల ఇలా లింగాన్ని బట్టి క్రూరమైన బేధం చూపించేవారు ఎప్పటికీ విశ్వాసులు కారు. ఎందుకంటే ఆయన వారిని తన పోలిక, స్వరూపంలో సమానంగా సృష్టించాడు (ఆదికాండము 1:27), సమానంగా (ఒక్కటిగా) చూసాడు (1 కొరింథీ 11:11), సమానంగా రక్షించాడు (గలతీ 3:27,28), సమానంగా శిక్షిస్తాడు కూడా (మత్తయి 13:41, ప్రకటన 20:15). ధర్మశాస్త్రపు న్యాయవిధుల్లోని నేరము-శిక్షల విషయంలో కూడా ఆయన సమాన న్యాయమే చూపించాడు, దానిగురించి నేను వివరించాను (నిర్గమకాండము 21:23-25 వ్యాఖ్యానం చూడండి). కాబట్టి నిజంగా మారుమనస్సు పొంది ఆయన స్వభావాన్ని ధరించుకున్నవారు (కొలస్సీ 3:9,10, గలతీ 3:27) లేక ఆయన మనస్సును కలిగియున్నవారు (ఫిలిప్పీ 2:5) మాత్రమే ఆయనకులా స్త్రీ పురుషుల పట్ల అన్ని విషయాలలోనూ సమానత్వం చూపిస్తారు.

1యోహాను 2:6
ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

అదేవిధంగా కొందరు దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని నిర్మించిన ఈ సందర్బాన్ని హేళన చేస్తూ, దాని ప్రకారం పురుషుడికి ఒక ఎముక తక్కువ ఉండాలికదా అని ప్రశ్నిస్తుంటారు.‌ ఈ విమర్శ ఎంత అవివేకం అంటే దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని చేసాడే తప్ప ప్రతీ పురుషుడికీ అదేవిధంగా చెయ్యడం లేదు.‌ కాబట్టి ఈ సంఘటన నిజమా అబద్ధమా అనేది తేల్చుకోవాలి అనుకునేవారు ఆదాము దేహం ఎక్కడైనా దొరుకుద్దేమో చూసి ఎముకలను లెక్కపెట్టుకోవాలి.
అంతేతప్ప ఇప్పుడున్న పురుషుల ఎముకలను లెక్కించి, ఆదాముకు నిజంగా అలా జరిగిందా లేదా అనేది తేలుస్తామంటే ఎలా? దీనిప్రకారం ఈ విమర్శచేసేవారిలో ఎవరికైనా కాలునో చెయ్యినో విరిగితే, వారి మనవడు కూడా కాలు చెయ్యి విరిగే పుడతాడా? పోని ఏ కిడ్నీయో తీసివేస్తే వారి సంతానం అందరూ కిడ్నీ లేకుండానే పుడతారా?

మరికొందరు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీ నిర్మించబడడాన్ని బట్టి వారిమధ్య సమానత్వం సూచించడానికే దేవుడు ప్రక్కటెముకను తీసుకున్నాడని చెబుతుంటారు. కానీ వాక్యంలో అలా ఎక్కడా వివరించబడలేదు. పైగా వారిద్దరూ సమానం అనడానికి దేవుడు వారిద్దరినీ కూడా తనపోలిక తన స్వరూపంలో చెయ్యడమే పెద్ద సాక్ష్యంగా ఉంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని నేను విడిచిపెడుతున్నాను.

ఆదికాండము 2:23
అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.

ఈ వచనంలో ఆదాము తన‌ భార్యయైన హవ్వను ఉద్దేశించి "నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును" అని పలకడం మనం చూస్తాం. ఆదాము పలికిన ఈమాటల ప్రకారం దేవుడు స్త్రీని చేసేటప్పుడు ఆదాము‌ ఎముకను మాత్రమే తీసుకోలేదు. మాంసాన్ని కూడా తీసుకున్నాడు. అందుకే తరువాత కాలంలో, ఈ మాటలను బంధుత్వాన్ని సూచించడానికి అలంకారంగా వాడేవారు (2 సమూయేలు 19:12, ఆదికాండము 29:14).

ఆదికాండము 2:24
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఈ వచనంలో పురుషుడు తల్లినీ తండ్రినీ విడిచి‌ భార్యను హత్తుకుంటాడని, వారు ఏకశరీరమై‌ ఉంటారని రాయబడడం మనం చూస్తాం. దీనర్థం వివాహం జరిగిన స్త్రీ పురుషులు తమ తల్లితండ్రులను విడిచిపెట్టాలని కానీ, అశ్రద్ధ చెయ్యాలని కానీ కాదు. ఎందుకంటే తల్లితండ్రులను నిర్లక్షపెట్టకూడదని రాయబడింది (సామెతలు 23:22). అలానే తల్లితండ్రులకు ఇవ్వవలసిన సొమ్మును వారికి ఇవ్వకుండా అది దేవునికిచ్చేసానని తప్పించుకుంటున్న శాస్త్రులు పరిసయ్యులకు యేసుక్రీస్తు ప్రభువు బుద్ధి చెప్పినట్టుగా కూడా మనం చదువుతాం (మత్తయి 15:5,6). కాబట్టి, పురుషుడు‌ తన తల్లినీ తండ్రినీ విడచి భార్యను హత్తుకోవడం అంటే అప్పటినుంచి అతను తల్లితండ్రులకంటే ఎక్కువగా తన భార్యను ప్రేమించి, ఆమెతో ఒక ప్రత్యేక కుటుంబం‌గా ఏర్పడాలి. అలానే స్త్రీ కూడా తాను ఎవరికోసమైతే సృష్టించబడిందో ఆ పురుషుడికి లోబడాలి. కానీ ఈరోజు మన దేశంలో చాలా మట్టుకు ఇలా కాకుండా, ఉమ్మడి‌ కుటుంబంగా జీవించబట్టే అత్తాకోడళ్ళ సమస్యలు వంటివి తలెత్తి చాలామంది భార్యాభర్తలు విడాకుల దాకా వెళ్తున్నారు.

కాబట్టి ప్రతీ పురుషుడూ, వివాహం తరువాత వీలైనంతమట్టుకు తన భార్యతో ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నించాలి. తల్లితండ్రులు‌ కూడా మంచి మనసుతో దీనిని అర్థం చేసుకోవాలి. వీరు అలా ప్రత్యేక కుటుంబంగా ఉంటూ, అటు అమ్మాయి తల్లితండ్రులకూ ఇటు అబ్బాయి‌ తల్లితండ్రులకూ వారి అవసరతల్లో సాయపడాలి.‌ ఒకవేళ వారు వృద్ధులై తమకు తాముగా జీవనం సాగించలేనప్పుడు తప్పకుండా వారిని తమ కుటుంబంలో చేర్చుకోవాలి. ఎందుకంటే "నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము" (సామెతలు 23:22) అనేది దేవుని ఆజ్ఞ. నీ తల్లితండ్రులను సన్మానించాలనే ఆజ్ఞలో ఇది కూడా ప్రధానమైన భాగం. అయితే ఆ తల్లితండ్రులు తమకు తాముగా జీవనం సాగించే స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వీరు‌ ప్రత్యేకంగా ఉంటూ‌ వారికి అవసరమైన ఈవులను సమకూర్చాలి.

అదేవిధంగా అక్కడ ఏకశరీరం అనేమాటలు మనకు కనిపిస్తాయి. ఈ మాట భార్యభర్తల‌ లైంగిక సంబంధాన్నీ, వారి అన్యోన్యతనూ సూచిస్తుంది. అప్పటినుండి వారు ఎటువంటి సమస్యల్లోనూ విడిపోకూడదు. ఎందుకంటే వారిద్దరూ విడిపోవడానికి వేరువేరు కాదు‌ ఒకటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు "ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు
ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను" (మత్తయి 19:3-6) అని తనను శోధిస్తున్న శాస్త్రులూ పరిసయ్యులకు సమాధానం ఇచ్చాడు. అయితే వారు ఎలాంటి పరిస్థితిలో విడిపోవచ్చో ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 21:11 వ్యాఖ్యానం చూడండి).

ఈ భార్యభర్తల సంబంధం‌ ఎంతో విలువైనదిగా నియమించబడింది కాబట్టే, క్రీస్తుకూ సంఘానికీ ఇది అలంకారంగా పోల్చబడింది.

ఎఫెసీయులకు 5:31-33
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏక శరీరమగుదురు. ‌ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.

ఆదికాండము‌ 2:25
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

ఈ వచనంలో ఆదాము హవ్వలు దిగంబరులుగా, సిగ్గు అనేది తెలియకుండా ఉన్నట్టు మనం చూస్తాం. తరువాత కాలంలో సిగ్గు అనేది వారి పాపఫలితంగానే వచ్చింది. దీనిగురించి మూడవ అధ్యాయంలో మాట్లాడుకుందాం.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.