పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

ఈ అధ్యాయంలో యాకోబు మరణసమయం సమీపించిందని తెలుసుకున్న యోసేపు తన కుమారులతో వెళ్ళి అతనిని దర్శించడం (1-2) యాకోబు అతనితో వాగ్దానం గురించి జ్ఞాపకం చెయ్యడం (3-4) యోసేపు కుమారులు ఇద్దరినీ తన కుమారులుగా దత్తతు తీసుకోవడం (5-6) రాహేలు మరణం గురించి అతను జ్ఞాపకం చేసుకోవడం తరువాత మనష్షే ఎఫ్రాయీములను దీవించడం (7-20) వారి ఐగుప్తు విడుదల గురించి ప్రవచించడం యోసేపుకు ఆస్తిలో ఒక భాగం ఎక్కువ ఇవ్వడం (21-22) గురించి మనం చదువుతాం.

48:1, 48:2, 48:3,4, 48:5, 48:6, 48:7, 48:8-10, 48:11, 48:12, 48:13-16, 48:17,18, 48:19,20, 48:21, 48:22

ఆదికాండము 48:1

ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా-

ఈ వచనంలో యాకోబు అనారోగ్యంతో ఉన్నాడనే వార్త తెలుసుకున్న యోసేపు తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని అతని దగ్గరకు వెళ్ళడం మనం చూస్తాం. యాకోబు కుటుంబం ఐగుప్తుకు వచ్చినపుడు యోసేపు వారిని గోషెను ప్రాంతంలో నివసింపచేస్తూ అతను మాత్రం తన బాధ్యతలరీత్యా రాజమందిర సమీపంలోని తన గృహంలో ఉంటున్నాడు. ఆ కారణం చేత తన కుటుంబాన్ని గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు దూత ద్వారా తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆ దూత సమాచారం ప్రకారమే యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు.

అదేవిధంగా యోసేపు యాకోబు మరణం ఆసన్నమైందని గ్రహించి భక్తుడైన తన తండ్రి చివరి దశలో ఇవ్వబోయే ఆశీర్వాదం తన పిల్లలపైకి‌ రావాలనే ఉద్దేశంతో వారిని కూడా అతని దగ్గరకు తీసుకునివెళ్ళాడు. ఆ సమయంలో యాకోబు పలికిన మాటలను మనష్షే ఎఫ్రాయిములు తమ జీవితకాలంలో మరచిపోయి ఉండకపోవచ్చు. కాబట్టి మన సంఘాలలో దేవుని భక్తులుగా జీవిస్తున్న వృద్ధులతో మన పిల్లలకు మంచి సహవాసాన్ని మనం ఏర్పాటు చేయగలగాలి. వారి అనుభవం నుండి చెప్పేమాటల వల్ల మన పిల్లల ఆత్మీయస్థితి‌ ఎంతగానో‌ అభివృద్ధి చెందుతుంది.

ఆదికాండము 48:2

ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను.

ఈ వచనంలో యోసేపు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న యాకోబు తనకున్న‌ కొద్దిపాటి బలాన్ని పోగుచేసుకుని కూర్చున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే అతను ఇప్పుడు యోసేపుతో సహా తన మిగిలిన కుమారులను ప్రవచనాత్మకంగా ఆశీర్వదిస్తూ వారికి భవిష్యత్తులో జరుగబోయేది వివరించబోతున్నాడు.

ఆదికాండము 48:3,4

యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.

ఈ వచనంలో యాకోబు దేవుడు తనకు మొదటిగా ప్రత్యక్షమైనపుడు‌ చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానం తన పిల్లలైన అందరికీ సమానంగా చెందుతుందని చెబుతున్నాడు. అబ్రాహాము ద్వారా ఇస్సాకుకు ఇస్సాకు ద్వారా యాకోబుకు ఇవ్వబడిన ఆ వాగ్దానం ప్రకారం యాకోబు కుమారులంతా విస్తరించి కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. యాకోబు ఈ వాగ్దానాన్ని తన చివరి దశవరకూ విశ్వాసంతో నమ్ముతూ వచ్చాడు‌ కాబట్టే ఆ సమయంలో కూడా దానిని తన కుమారుడికి జ్ఞాపకం‌‌ చేస్తున్నాడు.

ఆదికాండము 48:5

ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలైయుందురు.

ఈ వచనంలో యాకోబు తన కుమారుడైన యోసేపు కుమారులిద్దరినీ తన కుమారులుగా గుర్తించడం మనం చూస్తాం. దీనిమూలంగా వారు‌ యాకోబు కుమారులతో కలసి రెండు గోత్రాలుగా అభివృద్ధి చెందారు. ఐగుప్తులో వారి తండ్రిని బట్టి వారికి కలిగిన ఔన్నత్యం కంటే ఇది ఉన్నతమైనది.

ఆదికాండము 48:6

వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.

ఈ వచనంలో యాకోబు యోసేపు కుమారులైన మనష్షే ఎఫ్రాయిములను‌ మాత్రమే తన కుమారులుగా దత్తత తీసుకుంటూ అతనికి ఇంకా పిల్లలు పుడితే వారు తన కుమారులుగా కాకుండా యోసేపు కుమారులుగానే ఉంటారని, వారికి‌ యోసేపుకు ఇవ్వబడిన స్వాస్థ్యంలో మాత్రమే భాగం ఉంటుందని తెలియచేస్తున్నాడు.

ఆదికాండము 48:7

పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరముననుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితినని యోసేపుతో చెప్పెను.

ఈ వచనంలో యాకోబు యోసేపు తల్లియైన రాహేలు చనిపోయిన సంఘటన గురించి జ్ఞాపకం‌‌ చేసుకుంటున్నట్టు మనం చూస్తాం.

ఆదికాండము 48:8-10

ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపువారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.

ఈ వచనాలలో యాకోబు యోసేపుతో ఉన్నవారి గురించి ఆరా తీసి వారు అతని కుమారులని తెలుసుకున్నపుడు వారిని దగ్గరకు తీసుకోవడం మనం చూస్తాం. అతను వృద్ధాప్యంవల్ల సరిగా చూడలేక, యోసేపుతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా వచ్చారని తెలియకుండానే మొదట వారిని తన కుమారులుగా దత్తత తీసుకున్నాడు.

అదేవిధంగా ఇక్కడ యోసేపు ఆ పిల్లలను ఐగుప్తు దేశంలో దేవుడు అనుగ్రహించాడని చెబుతూ ఆయనను మహిమపరుస్తున్నాడు. తనకు కలిగిన కష్టం నిమిత్తం ఎవరినీ నిందించడం లేదు.

ఆదికాండము 48:11

ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా-

ఈ వచనంలో యాకోబు కూడా దేవుడు తనకు చేసిన మేలును తలచుకుంటూ ఆయనను స్తుతించడం మనం చూస్తాం. ఇది విశ్వాసులలో‌ ఉండే నైజంగా మనం గుర్తించాలి. యోసేపు, యాకోబుల జీవితాలలో ఎన్నో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి అయినప్పటికీ వారు దేవుడు చేసిన మేలులను ‌బట్టి ఆయనను స్తుతిస్తున్నారే తప్ప నిందించడం లేదు.

ఆదికాండము 48:12

యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

ఈ వచనంలో యోసేపు తన తండ్రి కౌగిలిలో ఉన్న తన ఇద్దరు పిల్లలను తన మోకాళ్ళ మధ్య నుండి‌ వెనక్కు తీసుకుంటూ తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చెయ్యడం మనం చూస్తాం. ఇది యోసేపు దేవుని ఆరాధనలో భాగంగా చేసిన ‌నమస్కారం కాదు అటువంటి నమస్కారం దేవునికి కాక ఎవరికి చేసినా విగ్రహారాధనే ఔతుంది. కానీ‌ ఇక్కడ యోసేపు తన‌ తండ్రితో జరిగిన సంభాషణను బట్టి అతనికి గౌరవంతో అలా నమస్కారం‌ చేసాడు. ఎందుకంటే యాకోబు మరణ సమయం‌ ఆసన్నమైందని‌ అతనికి తెలుసు.

ఆదికాండము 48:13-16

తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రాహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు యోసేపు కుమారులలో చిన్నవాడైన ఎఫ్రాయీముపై తన కుడిచేతినీ, పెద్దవాడైన మనష్షేపై తన యెడమ చేతినీ ఉంచి వారిని దీవించడం మనం చూస్తాం. వాస్తవానికి కుడిచేతిని ఎక్కువ ఘనతను సూచించడానికి ఉపయోగిస్తారు. ఆ ప్రకారంగా పెద్దకుమారుడిపైనే దానిని పెట్టి దీవించాలి. కానీ ఇక్కడ యాకోబు చిన్నవాడైన ఎఫ్రాయీముపై తన కుడిచేతిని‌ ఉంచుతూ అతడు తన సహోదరుడికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతాడని ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్నాడు.

హెబ్రీయులకు 11:21 - విశ్వాసమును బట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.

అదేవిధంగా ఇక్కడ యాకోబు తన‌ జీవితంలో తనను కాపాడి పోషించిన దేవుని గురించి మాట్లాడుతూ ఆయనను దూతయని సంబోధించడం కూడా మనం గమనిస్తాం. ఆ దూత గురించి వివరంగా తెలుసుకునేందుకు ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసాన్ని చదవండి.

"యెహోవా దూత యేసుక్రీస్తు"

https://hithabodha.com/books/god/269-the-angel-of-the-lord-is-jesus-christ.html

ఆదికాండము 48:17,18

యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీద నుండియెత్తి నా తండ్రీ అట్లు కాదు.ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు తన పెద్దకుమారుడిపై యెడమ చేతినీ, చిన్నకుమారుడిపై కుడిచేతినీ పెట్టి దీవించడం చూసిన యోసేపు, పద్ధతి ప్రకారం పెద్దవాడిపైనే కుడి చేతిని పెట్టాలి కాబట్టి యాకోబు కన్నులు కనిపించక అలా చేశాడనుకుని దానిని మార్చే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం.
ఇక్కడ యోసేపుకు తన చిన్నకుమారుడికంటే పెద్దకుమారుడిపైనే ఎక్కువ ప్రేమ ఉండి అలా మార్చాలనుకోవడం లేదు కానీ కేవలం వారి పద్ధతిని మాత్రమే అనుసరిస్తున్నాడు.

ఆదికాండము 48:19,20

అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగునుగాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించిఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

ఈ వచనాలలో యాకోబు యోసేపు మాటకు ఒప్పుకోకుండా, తాను కావాలనే అలా చేస్తున్నానని చెబుతూ ఎందుకలా చేస్తున్నాడో కూడా వివరించడం మనం చూస్తాం. ఇక్కడ యాకోబు చెప్పినట్టుగానే చిన్నవాడైన ఎఫ్రాయిము పెద్దవాడైన మనష్షే కంటే విస్తరించాడు (సంఖ్యాకాండము 1:32-35).

ఆదికాండము 48:21

మరియు ఇశ్రాయేలుఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొనిపోవును.

ఈ వచనంలో యాకోబు తను మరణించబోతున్నానని తెలియచేస్తూ, వారు అప్పటికి నివసిస్తున్న ఐగుప్తు దేశం వారి స్వదేశం కాదని భవిష్యత్తులో దేవుడు వారి స్వదేశమైన కనానుకు తీసుకునివెళ్తాడని ప్రవచించడం మనం చూస్తాం. ఇది మోషేకాలంలో నెరవేరింది (నిర్గమకాండము 12:40,41).

ఆదికాండము 48:22

నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

ఈ వచనంలో యాకోబు యోసేపుకు‌ ఇవ్వబోతున్న ఆస్తి గురించి మాట్లాడుతూ అది తన సహోదరులంటే ఒక భాగం ఎక్కువని చెబుతున్నాడు.
దీనిప్రకారం యాకోబు యోసేపునే జ్యేష్ఠకుమారుడిగా ఎంచుతున్నాడు. ఎందుకంటే ఆస్తిలో ఒక భాగం ఎక్కువ జ్యేష్టకుమారుడికే సంక్రమిస్తుంది (ద్వితీయోపదేశకాండము 21:17).

మొదటి దినవృత్తాంతములు 5:1 - ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.