పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 21:1, 21:2, 21:3 , 21:4, 21:5,6 , 21:7 ,21:8 , 21:9 , 21:10 , 21:11 , 21:12 , 21:13 , 21:14 , 21:15 , 21:16 , 21:17 , 21:18,19 , 21:20 , 21:21 , 21:22 , 21:23-25 , 21:26,27 , 21:28 , 21:29 , 21:30 , 21:31 , 21:32 , 21:33,34 , 21:35 , 21:36

 నిర్గమకాండము 21:1

నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా-

గత అధ్యాయంలో దేవుడు; ఇశ్రాయేలీయుల ప్రజలందరూ వినేలా పది ఆజ్ఞలనూ పలికినప్పుడు ఆ ప్రజలు దేవుని స్వరానికి భయపడి, నీవు దేవునిమాటలు విని వాటిని మాకు తెలియచెయ్యమని మోషేకు విన్నవించుకుకోవడం, అప్పుడు మోషే ప్రజల పక్షంగా దేవుని యొద్దకు ఎక్కిపోవడం మనం చూసాం (నిర్గమకాండము 20:18-21). అలా దేవుని యొద్దకు సమీపించిన మోషేతో ఆయన పలుకుతున్న న్యాయవిధులనే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. సాధారణంగా ఏ దేశంలోనైనా అందులోని పౌరులు ఎలా జీవించాలో, అలా జీవించకపోతే ఎలాంటి శిక్షలు అనుభవించాలో తెలియచేసే చట్టాలు ఉంటాయి, ఆయా దేశాల రాజులు వాటిని ప్రవేశపెడతారు. ఇశ్రాయేలీయుల విషయంలోనైతే దేవుడు వారితో చేసిన నిబంధనను బట్టి ఆయనే వారికి రాజుగా ఆ ప్రజలు ఎలా జీవించాలో తెలియచేసే న్యాయవిధులను వారికి ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు చెబుతున్న ఈ విధులను బట్టే ఆ ప్రజలు జీవించాలి, వాటి ఉల్లంఘన విషయంలో తీర్పు తీర్చబడాలి కాబట్టి ఇవి న్యాయవిధులు అని పిలవబడ్డాయి, అంతేకాకుండా ఈ విధులు చాలా న్యాయమైనవి కాబట్టి కూడా అలా పిలవబడ్డాయి. ఈ విధుల్లో అన్యాయమేమీ లేదు, దేవుడు నియమించిన విధులే ఏ ప్రమాణాన్ని బట్టి చూసినా న్యాయంగా ఉంటాయి. అందుకే వీటి గురించి ఏమని రాయబడిందో చూడండి.

ద్వితీయోపదేశకాండము 4:5,6,8 నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. "వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు". మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న "యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?"

కీర్తనలు 19:9 యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

ఈ న్యాయవిధులు ఇశ్రాయేలీయుల రాజ్యనిర్వహణకై దేవుడు ఇస్తున్న రాజ్యాంగం. ఇందులో వారి పౌరసత్వానికి సంబంధించిన ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మేరకు ఇవి ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం. ఐతే ఇందులో చెప్పబడిన నియమాలు ఏ నైతికవిలువలనైనా బేరీజు వెయ్యడానికి ప్రమాణాలుగా ఉన్నాయి. కాబట్టి ఇందులోని న్యాయవిధులు అన్ని దేశాలూ ఆచరించదగినవిగా ఉన్నాయి. మన దేశీయ చట్టాలు వేరుగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలందరూ ఈ న్యాయవిధులను హత్తుకుని వాటిని ఉల్లంగించకుండా జీవించాలి. వాటిని బట్టే ఏది న్యాయమో ఏది అన్యాయమో గుర్తించాలి. ఎందుకంటే ఈ‌ న్యాయవిధుల పరిథిలో ఉన్న చట్టాలు మాత్రమే న్యాయమైనవిగా ఉంటాయి, వీటిని ధిక్కరించేవి, వీటికి వెలుపల ఉన్నవన్నీ ఏదో ఒక కోణంలో అన్యాయమైనవే. దురదృష్టవశాత్తూ నేటి దేశీయచట్టాలు ఉన్నతమైన ఈ న్యాయవిధుల పరిథిలో కాకుండా, మానవుల దురాశలకు వారి హేయకృత్యాలకు అనుకూలంగా ఏర్పడుతున్నాయి. అందుకే విశ్వాసులందరూ ఈ న్యాయవిధులను హత్తుకుని వాటిపరిథిలోనే జీవించాలి.

ఈ న్యాయవిధులన్నీ గత అధ్యాయంలో ప్రత్యక్షపరబడిన పది ఆజ్ఞలలో ఏదో ఒకదాని పరిథిలో చెప్పబడుతున్నవే. ఉదాహరణకు ఐదవ ఆజ్ఞ నీ తల్లితండ్రులను సన్మానించాలని వారికి లోబడియుండాలని చెబుతుంది. ఆ ఆజ్ఞ‌ పరిథిలో తల్లితండ్రులకు లోబడనివానికి ఏ శిక్షవిధించాలో 17వ వచనంలో చుస్తాం. అలాగే నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ పరిథిలో, నరహత్య చేసినవాడికి మరణశిక్ష‌ విధించాలని 12వ వచనంలో చూస్తాం. ఈవిధంగా మనం చూస్తున్న ఈ న్యాయవిధులన్నీ పది ఆజ్ఞలను నిర్వచించి అన్వయించబడ్డాయి.

నిర్గమకాండము 21:2
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.

ఈ వచనంలో హెబ్రీయుడైన ఒక వ్యక్తిని దాసుడిగా కొన్నప్పుడు వానిపట్ల ఎలా ప్రవర్తించాలో వివరించబడడం మనం చూస్తాం.‌ సాధారణంగా ఇక్కడ దాసుడ్ని‌ కొనడమంటే చాలామంది ఇది ఒకప్పుడు మన దేశంలో ఉన్న బానిస వ్యవస్థలాంటిది అనుకుంటారు. కానీ ఇది అలాంటి బానిస వ్యవస్థ కాదు. ఇది ఒక యజమానుడికీ ఉద్యోగికీ మధ్య జరిగే పని ఒప్పందం లాంటిది. ఒక వ్యక్తి తాను చేసిన అప్పులను బట్టి (2 రాజులు 4:1), లేదా దొంగతనం చేసిన కారణాన్ని బట్టి (నిర్గమకాండము 22:3) అమ్మకానికి పెట్టబడతాడు. అప్పుడు దాసులు (ఉద్యోగులు) అవసరమైన యజమానుడు వారిని కొనుక్కుంటాడు. ఆ విధంగా ఆ వ్యక్తికి అప్పు ఇచ్చినవారికి, లేదా ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడిన ఇంటివారికి ఈ యజమానుడు‌ ఇచ్చే సొమ్ముద్వారా నష్టం‌ బర్తీ చేయబడి న్యాయం జరుగుతుంది. అప్పటినుండి అలా కొనబడిన ఆ వ్యక్తి యజమానుడి‌‌ కోసం పని చేస్తాడు. ఇది న్యాయమే. ఒకవేళ ఇలాంటి పరిస్థితే లేకపోతే, ఆ వ్యక్తికి అప్పులు ఇచ్చినవారికీ, లేదా ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడిన ఇంటివారికీ అన్యాయం జరుగుతుంది. తలకుమించిన అప్పులు చెయ్యడం, దొంగతనానికి పాల్పడడం ఆ వ్యక్తి చేసిన తప్పిదం కాబట్టి అలా చేసినందుకు అమ్మబడి ఒక యజమానుడి దగ్గర పని చెయ్యాలని నిర్ణయించబడడం న్యాయమే కదా!

ఐతే ఇది ఇతర దేశాల బానిసవ్యవస్థ లాంటిది కాదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇతర దేశాలలో ఉన్న బానిసవ్యవస్థలా అలా అమ్మబడిన ఒక వ్యక్తిచేత కఠిన సేవ చేయించుకునే అధికారం, హింసించే అధికారం యజమానులకు లేదు. ఆ యజమానులు తప్పకుండా ఆ దాసులను గౌరవిస్తూ, శక్తికి తగినట్టుగానే పని చేయించుకోవాలి. ఉదాహరణకు ఈ వచనం చూడండి.

లేవీయకాండము 25:39 నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.

ఇది హెబ్రీయులైన దాసుల విషయంలోనే కాదు అన్యులైన దాసుల విషయంలో కూడా వర్తిస్తుంది.

నిర్గమకాండము 22:21 పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై (దాసులై) యుంటిరి గదా.

నిర్గమకాండము 23:9 పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై (దాసులై) యుంటిరిగదా.

ద్వితియోపదేశకాండము 10:19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులై (దాసులై) యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.

కాబట్టి బైబిల్ లో‌ చెప్పబడుతున్న దాసత్వం, ఒక యజమానుడికీ ఉద్యోగికీ ఉండే ఒప్పందమే తప్ప ఇతరదేశాల బానిసత్వం వంటిది కానేకాదు. అసలు ఇదంతా ఎందుకు ఒక వ్యక్తిని అలా పనికోసం కొనుక్కునే పద్ధతే లేకుండా చేస్తే సరిపోయేదిగా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక వ్యక్తి తలకుమించి చేసిన అప్పులకు, నైతికప్రమాణం తప్పి చేసిన దొంగతనానికీ ఎలా న్యాయం చేకూరుతుందో వివరించాలి. ఇలా ప్రశ్నించేవాళ్ళంతా వెళ్ళి అతని అప్పులను తీర్చేవారా? అతను చేసిన దొంగతనానికి నష్టపరిహారం చెల్లించేవారా? అందుకే అలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తి అమ్మబడి అతని వల్ల నష్టం కలిగినవారికి న్యాయం కలిగేలా ఈ పద్ధతి అనుమతించబడింది. ఈ పద్ధతే లేకపోతే ఆ వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడమో, లేక దొంగతనం చేసినందుకు హింసించబడడమో, చివరికి తినడానికి తిండి లేక ఆకలిచావు చావడమో జరుగుతుంది. దీనివల్ల అతనికీ నష్టమే, అతనికి అప్పులు‌ ఇచ్చినవారికీ, అతను దొంగతనం చేసిన ఇంటివారికీ నష్టమే. ప్రస్తుతం కూడా కష్టాల్లో ఉన్నవారికి ముందుగా కొంత డబ్బును ఇచ్చి (అడ్వాన్శ్) వారిచేత పని చేయించుకునే యజమానులు ఉన్నారు.

ఇక ఈ దాసత్వం గురించి రాయబడిన ప్రాముఖ్యమైన మాటను చూద్దాం.

"వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును"

హెబ్రీయుడైన దాసుడి విషయంలో యజమానుడు ఎంతకాలం పనిచేయించుకోవాలో ఈ మాటల్లో మనం చూస్తాం. ఒక హెబ్రీయుడైన దాసుడ్ని ఒక యజమానుడు ఎంత సొమ్ము ఇచ్చి‌ కొనుక్కున్నా సరే వాడిచేత ఆరు సంవత్సరాలు మాత్రమే పని చేయించుకోవాలి. ఏడవ సంవత్సరంలో‌ వాడిని విడుదల చెయ్యాలి.

ద్వితియోపదేశకాండము 15:9 విడుదల సంవత్సర మైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీద వాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును.

ఎందుకంటే ఆ ఆరు సంవత్సరాలు ఆ దాసుడు ఎంతోపని చేసి ఉంటాడు. అందుకే ఇంక ఆ దాసుడ్ని విడుదల చేసి తన ఇంటికి పంపించివెయ్యాలి. దానికి సంబంధించిన మరికొన్ని నియమాలను ఈ‌ క్రింది వచనాలలో చూస్తాం.‌ ఐతే ఇలా ఏడవ సంవత్సరాన విడుదల చెయ్యడం కేవలం హెబ్రీయుడైన దాసుడికి మాత్రమే పరిమితం, అన్యుడైన దాసుని విషయంలో ఇలాంటి సమయమేమీ ఉండదు (లేవీకాండము 25:46). ఈ తారతమ్యం ఎందుకో ఆ సందర్భంలో వివరించుకుందాం.

నిర్గమకాండము 21:3
వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.

ఆరు సంవత్సరాలు పనిచేసిన దాసుడు ఏడవ సంవత్సరాన ఎటువంటి నిర్బంధం లేకుండా ఆ యజమానుడి ఇంటినుండి వెళ్ళిపోవచ్చని ఈ వచనంలో మనం చూస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి భార్యతో కలసి ఆ ఇంటికి వచ్చియుంటే ఆ భార్యతో పాటే వెళ్ళిపోవచ్చు. ఎవరికీ ఎటువంటి నిర్బంధం ఉండదు.

నిర్గమకాండము 21:4
వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.

ఈ వచనంలో ఒకవేళ ఆ దాసుడికి యజమానుడే వివాహం చేసినట్లైతే, వాడు మాత్రమే ఆ ఏడవ సంవత్సరాన అక్కడినుండి వెళ్ళిపోవాలని అతని భార్యాపిల్లలూ ఆ యజమానుడి ఇంటిదగ్గరే ఉండాలని రాయబడడం మనం చుస్తాం. చాలామంది ఈమాటలు చూపించి బైబిల్ దేవుడు చేస్తున్న ఈ నియమం, ఒక యజమానుడికి భార్యభర్తలను విడదీసే హక్కును కల్పిస్తుందని, ఇది దాసుడి పట్ల అన్యాయమని ఆరోపిస్తుంటారు.

కానీ ఇక్కడ ఆ యజమానుడు ఏమీ బలవంతంగా తన భార్యనుండి ఆ దాసుడ్ని పంపివెయ్యడం లేదని గుర్తించాలి. ఆ దాసుడు కావాలి అనుకుంటే యజమానుడి ఇంట్లోనే తన భార్యతో కలసి పనిచేసుకోవచ్చు. దాసుడైన అతనిపై కరుణ చూపించి, అతనిచేత కఠినసేవ చేయించుకోకుండా శక్తికి తగిన పనినే అప్పగించి, పైగా భార్యను కూడా ఇచ్చిన యజమానుడ్ని వదిలేసి పోవాలని ఎలాంటి వ్యక్తులు అనుకుంటారు? అలాంటి వ్యక్తుల విషయంలో యజమానుడు తాను వివాహం‌ చేసిన స్త్రీని ఆమెకు పుట్టిన పిల్లలను తన ఇంటివద్దే ఉంచడంలో ఎటువంటి అన్యాయం‌లేదు. ఎందుకంటే ఆ స్త్రీ కూడా ఆ యజమానుడి దాసినే. దాసులకు దాసిలను ఇచ్చే వివాహం జరిపిస్తారు.

ఒకవేళ ఆ దాసుడికి నిజంగా తన భార్యా పిల్లలపై ప్రేమ ఉంటే, తనకు అంత మంచి చేసిన యజమానుడిపై ప్రేమ‌ఉంటే ఆ యజమానుడి ఇంటినుండి వెళ్ళిపోలేడు. దానిగురించే క్రింది వచనంలో మనం చూస్తాం. "ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల" (నిర్గమకాండము 21:5). ఈ ప్రేమ‌ లేనప్పుడు మాత్రమే అతను వెళ్ళిపోతాడు. హృదయకాఠిన్యం విషయంలో విడాకులు ఎలా అనుమతించబడ్డాయో (మత్తయి 19:8), అలాగే మంచిచేసిన యజమానులపైన, యజమానుడి ద్వారా పొందుకున్న భార్యపైన, ఆమెద్వారా పుట్టిన పిల్లలపైన ప్రేమలేని దాసుల విషయంలో ఈ‌‌మాటలు చెప్పడం జరిగింది. ఒకవిధంగా ఈ మాటలు; యజమానుడి చేత భార్యను పొందుకున్న దాసులు ఆ యజమానుడి ఇంటినుండి వెళ్ళిపోకూడదని, అంతమంచిగా చూసుకున్న యజమానుడి పట్ల కృతజ్ఞత‌ కలిగి అతని ఇంట్లోనే భార్యతో కలసి పని చేసుకోవాలని బోధిస్తున్నాయి. ఒకవేళ ఆ దాసుడికి ఆ పరిస్థితి ఇష్టం లేకుంటే అసలు ఆ యజమానుడు‌ ఇస్తున్న భార్యనే తీసుకోకూడదు.

నిర్గమకాండము 21:5,6
అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

ఈ వచనంలో తన యజమానుడ్ని, తన భార్యాపిల్లలనూ ప్రేమిస్తున్నానని చెప్పి, ఇంక ఆ యజమానుడి దగ్గరే పని చెయ్యాలనుకున్న దాసుడి విషయంలో ఏం చేయాలో వివరించబడడం మనం చూస్తాం.‌ ఆ యజమానుడు దేవుని యొద్దకు అనగా న్యాయాధిపతి యొద్దకు ఆ దాసుడ్ని తీసుకువెళ్ళాలి. ఇక్కడ దేవుని యొద్దకు అన్నప్పుడు న్యాయాధిపతి అనే భావమే వస్తుంది (కీర్తనలు 82:1,6). న్యాయాధిపతుల సమక్షంలోనే ఒక వ్యక్తిని‌ దాసుడిగా కొనడం జరుగుతుంది కాబట్టి ఆ దాసుడు నిరంతరం ఆ యజమానుడి దగ్గరే ఉండాలనుకున్నప్పుడు ఆ న్యాయాధిపతికి ఆ సమాచారం తెలియచెయ్యాలి. ఆ న్యాయాధిపతి సమ్మతితో ఆ యజమానుడి తన దాసుడ్ని ఇంటికి తీసుకువెళ్ళి తలుపువద్ద ఆ వ్యక్తిని నిలబెట్టి అతని చెవికి ఒక సూదితో‌ బెజ్జం చెయ్యాలి. అప్పటినుండి ఆ దాసుడు ఆ యజమానుడి‌ ఇంట్లోనే పనిచెయ్యాలని, ఆ ఇంటివారు చెప్పే మాటలకు అనుకూలంగా ప్రవర్తించాలని దీనిభావం.

ప్రభువగు యేసుక్రీస్తు ఈలోకానికి దాసుని స్వరూపంలో (ఫిలిప్పీ 2:7) వచ్చినప్పుడు కూడా ఆయనకు ఇటువంటి అలంకార‌ బాషనే వాడబడింది.

కీర్తనల గ్రంథము 40:6,7 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. "నీవు నాకు చెవులు నిర్మించియున్నావు" ("తెరచియున్నావు" సరైన తర్జుమా). దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

ఎందుకంటే యేసుక్రీస్తు ఈలోకానికి దాసునిగా వచ్చి తన తండ్రికి యజమానుడికి లోబడినట్టుగా లోబడ్డాడు. ఆయన ప్రతీ మాటనూ శివసావహించాడు. మనం కూడా మన యజమానుడైన దేవునిపట్ల ఇలాంటి వైఖరినే కలిగియుండాలి.

నిర్గమకాండము 21:7
ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.

ఈ వచనంలో ఎవరైనా వ్యక్తి తన కుమార్తెను దాసిగా అమ్మితే ఆమె పురుషుడు వెళ్ళిపోయినట్టుగా ఏడవ సంవత్సరాన వెళ్ళిపోకూడదని (2 వచనం) మనం చూస్తాం. ఎందుకంటే ఒక స్త్రీ కొంతకాలం ఒక ఇంట్లో పనిచేసి అలా వెళ్ళిపోతే ఆమెను సమాజం ఏదోఒక విధంగా అవమానించే పరిస్థితి కలుగవచ్చు కాబట్టి దేవుడు ఆమెకు స్థిరమైన స్థానాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఒక స్త్రీని కొనుక్కుంటే ఆ యజమానుడైనా వివాహం (ప్రధానం) చేసుకోవాలి (8 వచనం) లేదా తన కుమారుడికైనా వివాహం చెయ్యాలి (9 వ వచనం) లేదా తన దాసుడికైనా ఇచ్చి వివాహం చెయ్యాలి (4 వ వచనం). ఈవిధంగా కాకుండా మరేవిధంగానూ ఒక స్త్రీని కొనుక్కుని ఆమె చేత పని చేయించుకోకూడదు.

ఇంతకూ ఒక తండ్రికి తన కుమార్తెను అమ్మే పరిస్థితి ఎందుకు వస్తుందంటే; రెండవ‌ వచనంలో చూసినట్టుగా అప్పుల బాధను‌ బట్టి, పేదరికాన్ని బట్టి అలా వస్తుంది. కానీ ఆ పేదరికానికి కారణం ఆ కుటుంబమే. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించినప్పుడు ఆ దేశాన్ని వారికి సమానంగా పంచిపెట్టాడు. ఈ విషయాలు మనం యెహోషువ 14 వ అధ్యాయం నుండి వివరంగా చూస్తాం. దేవుడు సమానంగా భూమిని పంచియిచ్చాక కూడా ఎవరైనా పేదరికంతో బాధపడుతుంటే దానికి భూమిని సరిగా సాగుచెయ్యలేని సోమరితనమో, లేక ఆ భూమిని మరోవిధంగా పోగొట్టుకున్న వ్యసనమో కారణమయ్యుంటుంది.

నిర్గమకాండము 21:8
దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకాని యెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.

ఒక యజమానుడు ఒక స్త్రీని కొనుక్కుంటే అతనైనా ఆమెను వివాహం చేసుకోవాలని, లేదా ఆమెను తన కుమారుడికైనా, దాసుడికైనా ఇచ్చి వివాహం జరిపించాలని దీనికి ముందటి వచనపు వివరణలో చూసాం. అలా వివాహం చేసుకోవడానికి ముందు జరిగేదే ప్రధానం. ఆ ప్రధానానికీ వివాహానికీ మధ్యలో కొంత సమయం ఉంటుంది.‌ ఉదాహరణకు మరియ యోసేపుకు ప్రధానం చెయ్యబడింది (మత్తయి 1:18). కానీ వారి వివాహం వెంటనే జరుగలేదు. అలా ఒక యజమానుడు ఒక స్త్రీని కొనుక్కుని ప్రధానం చేసుకున్న తరువాత వివాహ సమయం నాటికి ఆమెపట్ల అతనికి ఇష్టం లేకపోతే ఆమెను స్వేచ్చగా విడిచిపెట్టెయ్యాలని ఈ వచనం చెబుతుంది. ఆమెను ఆ యజమానుడు వివాహం చేసుకుంటానని కొనుక్కుని తరువాత ఆమెపట్ల మాటతప్పుతున్నాడు కాబట్టి ఆమెను మరెవ్వరికీ అమ్మకూడదు, ఆమె చేత పని చేయించుకోకూడదు. ఆమెను స్వేచ్చగా తన‌ తండ్రి ఇంటికి విడిచిపెట్టెయ్యాలి. ఈ క్రమంలో అతనికి నష్టం కలుగుతున్నప్పటికీ, అతను ఆమెపట్ల మాట తప్పాడు కాబట్టి భరించక తప్పదు.

ఐతే ఒకవేళ ఆమె ప్రవర్తనను బట్టే ఆ యజమానుడికి ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టంలేకపోతే అతను‌ నష్టపోవలసిన అవసరం లేదు. దానికి ఇశ్రాయేలీయుల్లో ఉండే న్యాయాధిపతులు ధర్మశాస్త్రంలోని నిష్పక్షపాత న్యాయాన్ని అనుసరించి తగినవిధంగా తీర్పు తీరుస్తారు. ఈ వచనం కేవలం ఒక యజమానుడు తాను కొనుక్కున స్త్రీ విషయంలో వివాహం చేసుకుంటానని మాటతప్పినప్పుడు (వంచించినప్పుడు) ఏం చేయాలో చెబుతుంది కాబట్టి నేను అంతవరకే వివరించాను.

నిర్గమకాండము 21:9
తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దానియెడల జరిగింపవలెను.

ఈ వచనం ప్రకారం; ఎవరైనా యజమానుడు ఒక స్త్రీని కొని తన కుమారుడికి ప్రధానం (వివాహం) చేస్తే ఆపై ఆమెను తన కుమార్తెగా చూసుకోవాలి. కుమార్తెల విషయంలో ఉన్న న్యాయవిధులను అనుసరించే ప్రవర్తించాలి. ఒకవేళ కుమారుడికి కాకుండా అతనే వివాహం చేసుకుంటే భార్య హోదాలో ఆమెను చూసుకోవాలి. దాసుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే ఆమె సంరక్షణను చూసుకోవాలి, అందుకే ఆ దాసుడు వెళ్ళిపోయినా ఆమెను ఆమె పిల్లలనూ పంపకుండా తన గృహంలోనే నివసింపనియ్యాలి (4 వ వచనం).

నిర్గమకాండము 21:10
ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు.

ఈ వచనంలో ఒక యజమానుడు ఒక స్త్రీని కొని తన కుమారుడికి వివాహం జరిపించాక, ఆ కుమారుడు వేరొక స్త్రీని వివాహం చేసుకుంటే, అప్పుడు కూడా అతను ఆ కొనబడిన స్త్రీకి ఆహారం, వస్త్రాలు, సంసారధర్మం తక్కువ చెయ్యకూడదని హెచ్చరించడం మనం చూస్తాం. మనిషి జీవించడానికి ఆహారం, వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఆమెకు అవి తక్కువ చెయ్యకూడదు. భార్యాభర్తల మధ్య సంసారధర్మం చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి అది కూడా ఆమెకు తక్కువచెయ్యబడకూడదు.

ఐతే కొందరు ఈ వచనం ఆధారంగా‌ బైబిల్ బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తుందని, మొదటి భార్యకు ఏలోటూ చెయ్యనివిధంగా రెండవ భార్యను కలిగియున్నా పర్లేదని చెబుతుందని ఆరోపిస్తుంటారు. కానీ ఆయన సృష్టి ప్రారంభంలో ఆదాముకు ఒకే భార్యను ఇవ్వడం ద్వారా ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలని నియమించాడు. అలానే ధర్మశాస్త్రంలో వివాహం గురించి రాయబడిన ఒకమాటను చూడండి.

లేవీయకాండము 18:18 ​నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసి కొనకూడదు.

ఈ వచనంలో భార్య బ్రతికియుండగా ఆమెతో పాటు ఆమె సహోదరిని కూడా వివాహం చేసుకోకూడదని రాయబడింది. భార్య పీడించబడేలా ఆమె సహోదరినే వివాహం చేసుకోకూడదంటే ఆమె మరి ఎక్కువగా పీడించబడేలా ఇతర స్త్రీ ఎవరినీ కూడా వివాహం చేసుకోకూడదని అర్థం వస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీ తన భర్త తన చెల్లిని వివాహం చేసుకుంటేనే పీడించబడేటప్పుడు, మరెవరో స్త్రీని వివాహం చేసుకుంటే మరింత ఎక్కువగా పీడించబడుతుంది కదా! కాబట్టి ఈ వచనం బహుభార్యాత్వాన్ని స్పష్టంగా ఖండిస్తుంది. అలాంటప్పుడు "ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు" అని ఎందుకు చెప్పబడిందంటే, ఆ మాటలు జాగ్రత్తగా పరిశీలించండి. "ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకుని" మొదటిదానికి ఏ లోటూలేకుండా చూసుకోవాలని అక్కడ లేదు. "ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొనినను (ఒకవేళ)" అని ఉంది. పతనమైన మనిషి ఏదోక విధంగా దేవుని ఆజ్ఞలను మీరి పాపం చేస్తాడు కాబట్టి, ఒకవేళ ఆ పాపం బహుభార్యత్వం రూపంలోనే ఉంటే, దానివల్ల మొదటి భార్యకు నష్టం కలుగకుండా ఉండడానికి ఈ హెచ్చరిక చెయ్యబడింది. ఒకవేళ ఈ హెచ్చరిక లేకపోతే, పేదరికం‌వల్ల అమ్మబడి భార్యగా మారిన ఆ స్త్రీకి మరింతగా అన్యాయం జరుగుతుంది. దీనిని హెచ్చరికగానే చూడాలి తప్ప, రెండవ వివాహానికి అనుమతిగా కాదు.

నిర్గమకాండము 21:11
ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.

దీనికి పైవచనం ప్రకారం, ఆ కుమారుడు వేరొక స్త్రీని వివాహం‌ చేసుకుని, మొదటిగా వివాహం చేసుకున్న ఆమెకు "ఆహారం, వస్త్రాలు, సంసారధర్మం" తక్కువ‌చేస్తుంటే, ఆమె తనను కొనుక్కునేటప్పుడు ఆ కుమారుని తండ్రి ఇచ్చిన సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ఆ ఇంటినుండి వెళ్ళిపోవచ్చని ఈ వచనంలో రాయబడడం మనం చూస్తాం. ఈ నియమం యజమానుడి కుమారుని విషయంలోనే కాకుండా ఒకవేళ ఆమెను కొనుక్కున్న యజమానుడే వివాహం చేసుకున్నప్పటికీ వర్తిస్తుంది. వారు వేరొక స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ లేక చేసుకోనప్పటికీ ఈ స్త్రీకి "ఆహారం, వస్త్రాలు, సంసారధర్మం" తక్కువచేస్తుంటే అతనిని విడిచిపోవచ్చు. ఇప్పటి వివాహాల్లో కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇది ఒక పురుషుడు తన భార్యకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేస్తుండి, సరిచెయ్యబడనివిధంగా కఠినుడైనప్పుడు మాత్రమే అనుకరించవలసిన పద్ధతి.

అలా కాకుండా ఒక పురుషుడు తనకున్న పేదరికం వల్ల తన భార్యకు ఆహారం వస్త్రాలు తక్కువ చేస్తుంటే, అనారోగ్యం కారణంగా సంసారధర్మం తక్కువచేస్తుంటే అతనిని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెడితే తప్పకుండా ఆ భార్య దేవునిముందు ప్రమాణాన్ని మీరినదానిగా శిక్షించబడుతుంది. ఎందుకంటే "సుఖమందునూ కష్టమందుమూ, రోగమందునూ బాధయందునూ" అతనితో కలసియుంటానని దైవసాక్షిగా ప్రమాణం‌ చేసే ఆమె అతడిని వివాహం చేసుకుంది. కాబట్టి ఆమె అతనికి పేదరికంలోనూ, అనారోగ్యంలోనూ తోడుగా ఉండాలి. వారి పేదరికం పోయేలా ఇద్దరూ కలసి కష్టపడాలి, అతనిలో అనారోగ్యం ఉంటే సరైన వైద్యాన్ని, ఆహారాన్ని అందించాలి.

అలాగే ఒక పురుషుడు కూడా, తన భార్య ఉద్దేశపూర్వకంగా తనకు ఆహారాన్ని సిద్ధపరచని విధంగా, సంసారధర్మానికి సహకరించని‌ విధంగా ప్రవర్తిస్తుంటే, ఆమెకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఆమెను విడిచిపెట్టవచ్చు. ఈవిషయంలో ఆమెను హెచ్చరించినా సరిచెయ్యబడకపోతే అలా విడాకులు ఇవ్వడంలో ఎటువంటి పాపం లేదు. కానీ ఆమె అనారోగ్యం‌ కారణంగానే అతనికి ఆహారం సిద్ధపరచలేని విధంగా, సంసారధర్మానికి సహకరించలేని విధంగా ఉంటుంటే, ఆమెను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. వివాహ సమయంలో అతను దైవసాక్షిగా చేసిన ప్రమాణాన్ని గుర్తుంచుకుని ఆమెకు తోడుగా ఉండాలి. ఆమె‌‌‌ బలపడేలా సరైన వైద్యాన్ని, ఆహారాన్ని ఆందించాలి. ఆమెను ప్రేమగా ఆదరించాలి.

నిర్గమకాండము 21:12
నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.

ఈ వచనంలో ఒక నరుడ్ని చనిపోయేలా కొట్టినవాడికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా తీర్చుకునే ప్రతీకారం కాదు, న్యాయాధిపతుల సమక్షంలో విధించబడే శిక్ష (అందుకే ఇవి న్యాయవిధులు "1వ వచనం). నరుడు దేవుని పోలిక దేవుని స్వరూపంలో జన్మిస్తున్నాడు. అందుకే నరుడ్ని చంపిన వ్యక్తికి న్యాయాధిపతులు మరణశిక్ష విధించాలన్నది న్యాయాధిపతియైన దేవుని శాసనం (ఆదికాండము 9:6). ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి "నిశ్చయముగా" అనేపదం ఇక్కడ ప్రయోగించబడింది. కాబట్టి ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపిన వ్యక్తి విషయంలో ఎలాంటి కనికరం, సానుభూతి చూపించకూడదు, కుట్రపూరితంగా కానీ, పగతో కానీ, మరేయితర కారణంతో కానీ ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష‌ విధించబడాలి. అప్పుడే చంపబడిన వ్యక్తి విషయంలో న్యాయం జరిగినట్టు. "దేవుని పోలిక, దేవుని స్వరూపానికి విలువను ఇచ్చినట్టు" దురదృష్టవశాత్తు నేటి చట్టాలలో అలాంటి ఉద్దేశపూర్వక హత్యలకు మరణశిక్షలు కరువైపోయాయి. మరణశిక్ష విధించవలసిన హంతకులకు సానుభూతులతో క్షమాభిక్షలు పెడుతున్నారు. ఇలాంటి క్షమాభిక్షలు, పక్షపాత తీర్పులు, "ప్రాణమునకు ప్రాణం" తీయాలనే (ద్వితీయోపదేశకాండము 19:21) దేవునిన్యాయ శాసనానికి వ్యతిరేకం. చంపబడిన వ్యక్తికీ, అతని కుటుంబానికీ జరుగుతున్న ఘోర అన్యాయం. విశ్వాసులు దీనిని తీవ్రంగా ఖండించాలి.

నిర్గమకాండము 21:13
అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణ యించెదను.

దీనికి పై వచనంలో హత్యకు మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించబడితే, ఈ వచనంలో ఎలాంటి హత్యకు మరణశిక్ష విధించకూడదో మనం చూస్తాం.‌ కొన్నిసార్లు పొరపాటుగా కూడా హత్యలు జరుగుతుంటాయి. ఉదాహరణకు;

ద్వితీయోపదేశకాండము 19:4-6 పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధిలేదు.

ఈ సందర్భంలో ఒక వ్యక్తి గొడ్డలితో చెట్టును నరుకుతుండగా దాని పిడి ఊడిపోవడం‌ వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది. ఈ‌ హత్య ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు కాబట్టి, దానికి కారణమైన వ్యక్తికి మరణశిక్ష విధించకూడదు. దీనికి సంబంధించిన మాటలు సంఖ్యాకాండంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి.

సంఖ్యాకాండము 35:22-24 అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను, దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.

ఇలా పని చేసేటప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ పొరపాటున హత్యలు జరిగితే అవి మరణశిక్ష విధించవలసిన హత్యలు కావు. కానీ, ఆ హత్యకు కారణమైన వ్యక్తి ఆశ్రయపురానికి పారిపోవాలి. పారిపోవాలి అంటే, ఆ‌ వ్యక్తి చట్టానికి లోబడుతూ ఆశ్రయపురానికి చేరుకోవాలి అని అర్థం. ఆ ఆశ్రయపురాలు కూడా ఇశ్రాయేలీయుల చట్టవ్యవస్థలో భాగమే. నేడు మనం కూడా మనవల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, మనకారణంగా అనుకోకుండా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు చట్టానికి మనంతట మనంగా లొంగిపోయి, జరిగిన విషయం తెలియచేయాలి. చట్టానికి సహకరించాలి. ఇది దేవుని నియమం.

ద్వితీయోపదేశకాండము 19:2,3 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.

ద్వితీయోపదేశకాండము 19:6,7 వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును. అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.

ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు చనిపోయేంతవరకూ ఆ ఆశ్రయపురంలోనే జీవించాలి.

సంఖ్యాకాండము 35:25 అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.

నిర్గమకాండము 21:14
అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.

ఈ వచనంలో దేవుడు మరోసారి ఉద్దేశపూర్వకంగా హత్యచేసిన వ్యక్తికి మరణశిక్ష విధించబడాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అలా ఉద్దేశపూర్వక హత్య చేసిన వ్యక్తి స్వయంగా దేవుని క్షమాభిక్షనే కోరుకుంటూ ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించినప్పటికీ, నేను 12వ వచనంలో వివరించినట్టుగా ఆ వ్యక్తిపై ఎలాంటి కనికరం, సానుభూతి చూపించకూడదు, క్షమాభిక్ష పెట్టకూడదు. తప్పకుండా ఆ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఈరోజు దీనికి వ్యతిరేకంగా హంతకులకు క్షమాభిక్షలు పెట్టేవారు, దానిని స్వాగతించేవారు, మరణశిక్షలు విధించకూడదని పోరాడేవారు, వీరంతా దేవునిన్యాయానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న దోషులే. దేవుని‌ న్యాయతీర్పులో వీరికి శిక్షతప్పదు. విశ్వాసులు అలాంటి పాపంలో పాలివారు కాకుండా జాగ్రత్తపడాలి.

జ్ఞానియైన సొలోమోను ఇదే న్యాయాన్ని అనుసరిస్తూ హంతకుడైన యోవాబు క్షమాభిక్షను కోరుకుంటూ బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నప్పటికీ అక్కడే అతనికి మరణశిక్ష విధించాడు (1 రాజులు 2:29:34).

ద్వితియోపదేశకాండము 19:21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము మీకు విధి.

సంఖ్యాకాండము 35:16-21 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంత కుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను. నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.

నిర్గమకాండము 21:15
తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్షనొందును.

ఈ వచనంలో తల్లినైనా తండ్రినైనా కొట్టేవారికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. "నీ తండ్రినీ తల్లినీ సన్మానించాలని" దేవుని ఆజ్ఞ చెబుతుంది (నిర్గమకాండము 20:12). అలా సన్మానించకపోవడమే (గౌరవించకపోవడం, సంరక్షించకపోవడం) పాపమైతే వారిని కొట్టడం మరింత పాపం కాబట్టి అలాంటి దుర్మార్గులకు మరణశిక్షే న్యాయమైనది. ఐతే ఆత్మరక్షణలో ఇది వర్తించదని గుర్తించాలి. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఉన్మాదులుగా మారి తమ స్వంత పిల్లలకే హానిచేసే పరిస్థితికి వస్తే ఆ సమయంలో ఆ పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి వారిపై దాడి చెయ్యడం పాపం కాదు. దీనిగురించి తదుపరి అధ్యాయంలో వివరంగా చూద్దాం.

నిర్గమకాండము 21:16
ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

ఈవచనంలో ఒకవ్యక్తిని దొంగిలించి అమ్మినవారికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. బైబిల్ బలవంత బానిసత్వానికి, బలవంతపు అమ్మకాలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆ కాలంలో మనుషులను దొంగిలించి వారిని బానిసలుగా అమ్మేవారు. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఈ మాటలు చెబుతున్నాడు. ఒక వ్యక్తి తనకు తానుగా పనికోసం అమ్మబడడం వేరు, ఆ వ్యక్తిని వేరొక వ్యక్తి దొంగిలించి బలవంతంగా అమ్మడం వేరు. మొదటిదాని గురించి 2-7 వచనాల్లో మనం చూసాం. రెండవది మాత్రం మరణానికి‌ తగిన నేరమని ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా చిన్నపిల్లల అపహరించి అమ్మేవారికి కూడా మరణశిక్ష విధించాలని ఈ ఆజ్ఞ మనకు తెలియచేస్తుంది. నరుని‌ దొంగిలించి అమ్మడం అన్నప్పుడు అందులో‌ చిన్నపిల్లలను అపహరించి అమ్మడం కూడా ఉంటుంది.

నిర్గమకాండము 21:17
తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.

15వ వచనంలో తల్లినైనా తండ్రినైనా కొట్టేవారికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపించబడితే ఈ వచనంలో‌ వారిని శపించేవారికి కూడా ఆ మరణశిక్ష అమలు జరగాలని ఆదేశించడం మనం చూస్తాం. మానవ జనన, జీవనాలలో తల్లితండ్రులు దేవుడు వాడుకునే గొప్ప సాధనాలు కాబట్టి వారిని గౌరవించాలి తప్ప శపించకూడదు. దీనిగురించి జ్ఞానియైన సొలోమాను ఏమంటున్నాడో చూడండి.

సామెతలు 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.

నిర్గమకాండము 21:18,19
మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలన వాడు చావక మంచముమీద పడియుండి తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండిన యెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.

ఈ వచనాలలో ఎవరైనా ఇద్దరు మనుష్యుల మధ్య పోట్లాటజరిగి అందులో ఒక వ్యక్తి కొంతకాలం పనిచెయ్యలేని విధంగా గాయపడితే ఆ గాయం చేసిన వ్యక్తి అతడిని బాగు చేయించాలని, ఆ వ్యక్తి పని చెయ్యలేనికాలనికి తగిన సొమ్ము చెల్లించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఇది చాలా న్యాయమైన కట్టడ. ఎందుకంటే గాయం చేసిన వ్యక్తిని శిక్షించినప్పటికీ గాయపడిన వ్యక్తి బాగుపడడానికి అవసరమైన సొమ్ము, పని చెయ్యలేని కాలానికి నష్టపరిహారం లభించదు కాబట్టి, ఈ కట్టడ ప్రవేశపెట్టబడింది. దీనివల్ల గాయపడిన వ్యక్తి బాగుపడతాడు, పని చెయ్యలేని‌కాలానికి నష్టపరిహారం దక్కించుకుంటాడు. ఐతే ఆ పోట్లాటలో ఆ వ్యక్తి వెంటనే కానీ, లేక కొంతకాలం తరువాతైనా కానీ చనిపోతే దానికి కారణమైన వ్యక్తికి 12వ వచనం ప్రకారం; మరణశిక్ష విధించాలి. ఒకవేళ పూర్తి అంగవైకల్యం కలిగితే ఉదాహరణకు కన్ను పోవడం, చెయ్యి పోవడం వంటివి. అప్పుడు దానికి కారణమైన వ్యక్తికి 23-25 వచనాల ప్రకారం న్యాయాధిపతులు అదే నష్టం కలుగచెయ్యాలి. పోట్లాటల్లో అలాంటి ప్రాణహాణి హాని కానీ, పూర్తి అంగవైకల్యం కానీ సంభవించకుండా గాయపడిన వ్యక్తి కొంతకాలం మంచంపై పడియుండి, తరువాత కొంతకాలం పనిచెయ్యలేని విధంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే నష్టపరిహారంతో సరిపెట్టబడుతుంది.

నిర్గమకాండము 21:20
ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.

ఈ వచనంలో ఒక యజమానుడు దాసుడ్ని కానీ దాసిని కానీ చనిపోయేలా కొడితే అతనికి ప్రతిదండన విధించబడుతుందని తెలియచెయ్యడం మనం చూస్తాం. 12వ వచనం ప్రకారం ఆ ప్రతిదండన మరణమే. ఇది దాసుల పట్ల యజమానులు క్రూరంగా ప్రవర్తించకూడదని హెచ్చరికగా చెప్పబడుతుంది.

నిర్గమకాండము 21:21
అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.

ఈ వచనంలో యజమానుడి చేత కొట్టబడిన దాసుడు ఒకటి రెండు‌దినాలు బ్రతికితే ఆ ప్రతిదండన పొందడని రాయబడడం మనం చూస్తాం. దీనిని కొందరు అపార్థం చేసుకుని దీనికి పై వచనం ప్రకారం కొట్టబడిన దాసుడు వెంటనే చనిపోతే ఆ కొట్టిన యజమానుడికి ప్రతిదండన ఉంటుంది కానీ, ఈ వచనం ప్రకారం ఆ దాసుడు ఒకటి రెండు రోజులు బ్రతికి చనిపోతే అలాంటి ప్రతిదండన ఉండదని భావిస్తుంటారు. కొందరు బైబిల్ విమర్శకులు కూడా ఈ మాటలను ఆధారం చేసుకుని ఇదేం న్యాయమంటూ హేళన చేస్తుంటారు. కానీ ఈ వచనం చెబుతున్న విషయం అది కానేకాదు. లేఖనాలలోని మాటలను మిగిలిన లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు సరైనభావం లభిస్తుంది. 18,19 వచనాల ప్రకారం ఇద్దరు మనుష్యులు పోట్లాడుకుంటున్నప్పుడు అందులో ఒక వ్యక్తికి గాయం కలిగితే అతను పనిచెయ్యలేని కాలానికి నష్టపరిహారం చెల్లించాలి. అలా కొట్టినందుకు వాడు పొందే ప్రతిదండన అదే. కానీ ఇక్కడ యజమానుడి చేతిలో దాసుడు గాయపడి ఒకటి రెండురోజులు పని చెయ్యలేని విధంగా బ్రతికితే ఆ యజమానుడు ఎలాంటి ప్రతిదండన పొందడు (నష్టపరిహారం చెల్లించడు). ఎందుకంటే ఆ దాసుడు యజమానుడి సొత్తే కాబట్టి, ఆ దాసుడు పని చెయ్యకపోవడం వల్ల అతనికే నష్టం కాబట్టి, ఆ యజమానుడు నష్టపరిహారం చెల్లించే ప్రతిదండన పొందుకోడు. "ఒకటి రెండు దినములు బ్రతికిన యెడల" అంటే ఆ తరువాత చనిపోయాడని కాదు. 18,19 వచనాల ప్రకారం పనిచెయ్యలేని విధంగా‌ బ్రతికితే అని అర్థం. అలానే "ఆ ప్రతిదండన" అనేది తర్జుమా లోపం, అది పై వచనంలోని మరణశిక్షకు సంబంధించిన ప్రతిదండన గురించి చెప్పబడడం లేదు. నష్టపరిహారం అనే శిక్షగురించి చెబుతుంది (ఇంగ్లీష్ బైబిల్ చూడండి అక్కడ పై వచనంతో పోల్చబడేలా "ఆ" అనేది లేదు).

నిర్గమకాండము 21:22
నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధి పతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.

ఈ వచనంలో మనుష్యులు పోట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరైనా గర్భవతికి గర్భపాతం తప్ప మరే హానీ సంభవించకపోతే ఎవరికారణంగా ఆమెకు గర్భపాతం జరిగిందో ఆ వ్యక్తి నష్టపరిహారం చెల్లించాలని రాయబడడం మనం చూస్తాం. తెలుగుబాషలో చెయ్యబడిన ఈ తర్జుమాలో చాలాపెద్ద లోపం ఉంది. ఈ వచనాన్ని చదివినప్పుడు ఆమె గర్భంలో శిశువు చనిపోయి గర్భస్రావం మాత్రమే కలిగి ఆమెకు ఎలాంటి హానీ సంభవించకపోతే నష్టపరిహారం చెల్లిస్తే చాలు అన్నట్టుగా అర్థమౌతుంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న విషయం అది‌కాదు. అందుకే ఇంగ్లీష్ బైబిల్ నుండి ఆ వచనాన్ని పెడుతున్నాను చూడండి.

If men strive, and hurt a woman with child, so that her fruit depart from her, and yet no mischief follow: he shall be surely punished, according as the woman's husband will lay upon him; and he shall pay as the judges determine. "And if any mischief follow, then thou shalt give life for life"- (exodus 21:22,23).

మనుష్యులు పోట్లాడుతుండగా మధ్యలో గర్భవతికి గాయం కలిగి ఆ గర్భవతికి అకాల ప్రసవం జరిగితే, ఆ ప్రసవంలో తల్లికీ‌ బిడ్డకూ కూడా ఏ హానీ సంభవించకుండా సజీవంగానే ఉంటే, అప్పుడు మాత్రమే ఆ గాయానికి కారణమైనవాడు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే అకాలప్రసవం అనేది మరింత‌ బాధాకరంగా ఉంటుంది కాబట్టి దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ తల్లి క్షేమంగా ఉండి, ఆ ప్రసవమైన బిడ్డ చనిపోయినా సరే దానికి కారణమైనవాడికి మరణశిక్ష విధించాలి, క్రింది‌వచనాలు అదే చెబుతున్నాయి. "హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము" (నిర్గమకాండము 21:23). అంతేతప్ప తల్లి క్షేమంగా ఉండి లోపల‌బిడ్డ చనిపోయినా నష్టపరిహారంతో సరిపెట్టవచ్చనే భావం‌ ఇందులో లేదు. పైగా బైబిల్ గర్భంలోని శిశుహత్యలను (అబార్షన్) కూడా నరహత్యలుగా భావించి దానికి కారణమైనవారికి మరణశిక్ష విధిస్తుందనడానికి ఈ వచనం మంచి ఉదాహరణ.

కానీ ఈరోజు చాలామంది స్త్రీలు అబార్షన్ మా హక్కు అంటూ, కడుపులోని శిశువులను చంపుతున్నారు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

"అబార్షన్ ఆమె హక్కా?"

నిర్గమకాండము 21:23-25

హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

వీటికి పై వచనాల ప్రకారం; గర్భంలోని శిశువుతో సహా మరెవ్వరికైనా సరే హాని‌ కలిగితే, అలాంటి నష్టమే ఆ హాని చేసినవారికి కలుగ చెయ్యాలని ఈ వచనాలు చెబుతున్నాయి. ఇవే మాటలు మనకు మరలా మరలా జ్ఞాపకం చెయ్యబడతాయి.

లేవీయకాండము 24:19,20 ఒకడు తన పొరుగు వానికి "కళంకము కలుగజేసినయెడల" వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్నుపంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.

ద్వితియోపదేశకాండము 19:21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

ఇది హాని విషయంలో చాలా న్యాయమైన శిక్ష. దీనికారణంగా ఒకరు ఎలాంటి హానినైతే పొందుకున్నారో దానికి కారణమైన వారికి అదే హాని‌ సంభవించి న్యాయాన్ని పొందుకుంటారు. దురదృష్టవశాత్తు నేటి చట్టాలలో ఇలాంటి న్యాయమైన శిక్షలు కనిపించడం లేదు, దీనికారణంగా హానికి గురైనవారికి సరైన న్యాయం జరగడం లేదు. కంటిని పోగొట్టినవారు, ఇతర కళంకాలు కలుగచేసినవారు కొంతకాలం జైలు జీవితం గడిపిన తరువాత బయటకువచ్చి స్వేచ్చగా జీవిస్తున్నారు. కానీ హానికి గురైనవారు మాత్రం ఆ కళంకాలతోనూ వైకల్యాలతోనూ బాధపడుతున్నారు. హత్యల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హత్యలు చేసిన అందరికీ మరణశిక్ష అమలుజరగడం లేదు, కేవలం సమాజంలో వివాదాస్పదంగా మారినవాటి విషయంలో మాత్రమే మరణశిక్షలు అమలు జరుగుతున్నాయి. దీనికారణంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులకు వేదనే మిగులుతుంది.

అందుకే దేవుడు నరహత్య విషయంలో ఎంత తీవ్రంగా స్పందిస్తున్నాడో మరో ఉదాహరణ చూడండి;

సంఖ్యాకాండము 35:31
చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.

సంఖ్యాకాండము 35:33
​మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు‌ నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.

ఈవిధంగా మరణానికి మరణశిక్ష, కంటికి కన్ను, కళంకానికి కళంకం కలుగచేసినప్పుడే అవి బాధితులకు న్యాయం చేకూర్చే న్యాయమైన శిక్షలు ఔతాయి. న్యాయాధిపతియైన దేవుడు అందుకే వీటిని నియమించాడు.

ద్వితీయోపదేశకాండము 4:6,8 ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?

అదేవిధంగా ఈ శిక్షల విషయంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్న ఈ మాటలు చూడండి "నీవు ఎవనిని కటాక్షింపకూడదు". దీనిప్రకారం ఈ శిక్ష విధించే విషయంలో ఎవరినీ ఏ కారణంతోనైనా కటాక్షించకూడదు. స్త్రీ అని కానీ, పురుషుడు అని కానీ, మన దేశం వాడు అని కానీ, పరాయి దేశం వాడు అని కానీ కటాక్షించకూడదు (సానుభూతి చూపించకూడదు). బేధం చూపించకూడదు. నేటి‌ చట్ట వ్యవస్థల్లో ఈ పక్షపాతం కూడా మనకు విస్తారంగా కనిపిస్తుంది. నేరాన్ని బట్టి కాకుండా, లింగాన్ని‌ బట్టి, జాతీయతను‌ బట్టి, శిక్షలు విధిస్తున్నారు. ఇదంతా దేవుని న్యాయానికి వ్యతిరేకమే. దేవుని మనస్సు కలిగిన విశ్వాసులు తప్పకుండా ఈ పరిస్థితిని ఖండించాలి.

ఐతే కొందరు మత్తయి సువార్త 5:38,39 వచనాలలో యేసుక్రీస్తు పలికిన "కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము" అనే మాటలను అపార్థం చేసుకుని ధర్మశాస్త్రం విధించమన్న శిక్షలను యేసుక్రీస్తు కొట్టివేస్తున్నాడని, ఖండిస్తున్నాడని భావిస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఘనపరచడానికి వచ్చాడే తప్ప ఖండించడానికి కాదు.

మత్తయి 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.

మత్తయి 5:19 కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.

ఒకవేళ యేసుక్రీస్తు తండ్రియిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఔతాడు. లేదా తండ్రి సరైన న్యాయాన్ని అనుసరించి వాటిని ఇవ్వలేదని, అందుకే నేను వాటిని‌ మారుస్తున్నానని ఆరోపణ చేసినవాడు ఔతాడు. ఇది అసాధ్యం. యేసుక్రీస్తు తన సిలువ మరణం ద్వారా కొట్టివేసింది. ఆయనకు ఛాయగా ఉన్న ఆచారసంబంధమైన విధిరూపక ఆజ్ఞలనే తప్ప (2 కొరింథీ 3:14-16, ఎఫెసీ 2:14), నైతిక విలువలను, చట్టపరమైన ఆజ్ఞలను కాదు. ఆయనకు ఛాయగా ఉన్న ఆజ్ఞలు ఆయనలో నెరవేరిపోయినప్పుడు వాటి అవసరం ఇంక లేదు ఉదాహరణకు సున్నతి, బలులు, దేవాళయ వస్తువులు, పండుగలు (కొలస్సీ 2:11,16,17, గలతీ 6:15, హెబ్రీ 9:10,11, 10:1). పాతనిబంధన‌ (ధర్మశాస్త్రం) కొట్టివేయబడింది‌ అన్నప్పుడు పాతనిబంధన (ధర్మశాస్త్రం) లో, ఏం కొట్టివేయబడిందో తెలుసుకోవాలి. నైతిక విలువలు ఉన్న ధర్మశాస్త్రం, చట్టానికి (శిక్షలకు) సంబంధించిన ధర్మశాస్త్రం ఎప్పటికీ కొట్టివెయ్యబడదు. అవి దేవుని న్యాయానికీ నైతికతకూ ప్రతిరూపాలు.

మరి యేసుక్రీస్తు పలికిన "కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము" అనే మాటలకు అర్థమేంటంటే; "కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, కళంకానికి కళంకం" అనే శిక్షలు ఎవరికి వారు వ్యక్తిగతంగా పగ తీర్చుకోవడానికి నియమించబడినవి కావు. అవి చట్టపరమైనవి, న్యాయాధిపతులు మాత్రమే విచారణ చేసి విధించవలసినవి. అందుకే వాటిని న్యాయవిధులు అన్నారు (నిర్గమకాండము 21:1). ప్రతీ శిక్షా ప్రతీ జరిమానా న్యాయాధిపతుల సమక్షంలోనే జరగాలి.

ద్వితీయోపదేశకాండము 19:17-21 ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు. మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

ద్వితియోపదేశకాండము 25:1 మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు "న్యాయాధిపతులు విమర్శించి" నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.

ద్వితియోపదేశకాండము 21:2 నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.

కానీ యేసుక్రీస్తు జీవిస్తున్న కాలం నాటికి యూదులు (రబ్బీలు) ఎవరికి వారు వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకోవడానికి "కంటికి కన్ను, పంటికి పన్ను" అనే మాటలను వక్రీకరించేవారు. అందుకే యేసుక్రీస్తు వారిని ఖండిస్తూ, మీ శత్రువులను ప్రేమించండి, చట్టం చేయవలసిన పని మీరు చేయకండి అని చెబుతున్నాడు. మీరు మత్తయి సువార్త 5:21 వచనాల నుండి చదివితే; ఆయన "మీ పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా" అంటూ ప్రారంభిస్తారు. ఇంతకూ యూదుల పూర్వీకులతో ఆ మాటలు చెప్పింది‌ ఎవరు? యేసు క్రీస్తు మోషే‌ (ధర్మశాస్త్రం) గురించి అలా మాట్లాడుతున్నాడా కాదు సుమా. ఎందుకంటే; "నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా" (మత్తయి సువార్త 5:43) ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా "నీ శత్రువును ద్వేషించమని" చెప్పబడలేదు. ధర్మశాస్త్రం "నీ పొరుగువానిని ప్రేమించమని" మాత్రమే చెబుతుంది (లేవీకాండము 19:18). "నీ పొరుగు వానిని" అన్నప్పుడు అందులో మన శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి వారిని కూడా ప్రేమించమనే ధర్మశాస్త్రం చెబుతుంది తప్ప ద్వేషించమని కాదు. దీనికి‌ మరింత స్పష్టతకోసం ఈ వాక్యభాగం చూడండి.

నిర్గమకాండము 23:4,5
నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.

ఈ వాక్యభాగంలో (ధర్మశాస్త్రంలో) నీ శత్రువు/పగవాడి పశువుల విషయంలో కూడా కనికరం చూపించాలని రాయబడింది‌. దీనిప్రకారం; ఆ శత్రువు/పగవాడి విషయంలో మరింతగా కనికరం చూపించాలనే బోధ ఇక్కడ ఉందికదా! కాబట్టి; మోషే ధర్మశాస్త్రంలో "నీ శత్రువును ద్వేషించమని" ఎక్కడా చెప్పబడలేదు‌. మరి‌ అలా ఎవరు చెప్పారంటే; దానికి పై‌ వచనంలోనే యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు.

మత్తయి సువార్త 5:20 శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

ఈ శాస్త్రులు పరిసయ్యుల తెగలు (లేదా రబ్బీలు) లేఖనాలను‌ వక్రీకరించి యూదుల పూర్వీకులను దారితప్పించారు. ఉదాహరణకు; "మీ శత్రువులను ద్వేషించండి". అందుకే యేసుక్రీస్తు వారిని ఖండిస్తూ వారి వక్రీకరణలను సరిచేస్తున్నాడు. "కంటికి కన్ను పంటికి పన్ను" అనే శిక్షలు ధర్మశాస్త్రం ప్రకారం; బాధితులకు న్యాయం జరిగేలే న్యాయాధిపతుల సమక్షంలో అమలుజరగవలసిన శిక్షలు ఐతే, శాస్త్రులు పరిసయ్యులు ఆ శిక్షలను‌ వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకోవడానికి వాడుకోవచ్చని ప్రజలకు బోధించారు. కానీ దేవుడు వ్యక్తిగత ప్రతీకారాలను ప్రోత్సహించడు కాబట్టి యేసుక్రీస్తు దానిని సరిచేసాడు.

మత్తయి సువార్త 5:38,39 కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

యేసుక్రీస్తు కూడా మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన మాటల ఆధారంగానే అలా వారిని సరిచేసాడు. ధర్మశాస్త్రంలో దీనిగురించి స్పష్టంగా ఉంది.

లేవీయకాండము 19:18 "కీడుకు ప్రతికీడు చేయకూడదు", నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

ఈ వచనం ప్రకారం ఎవరూ కూడా కీడుకు ప్రతికీడు చెయ్యకూడదు, (కుడిచెంపపై కొడితే యెడమ చెంప త్రిప్పాలి) పొరుగువారిని ప్రేమించాలి. ఎవరైనా నేరం చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను, కళంకానికి‌ కళంకం, అనే శిక్షలను న్యాయాధిపతులు విధిస్తారు, పౌరులు కాదు. కాబట్టి "ప్రాణానికి ప్రాణం, కంటికి‌కన్ను, కళంకానికి కళంకం" అనే న్యాయమైన శిక్షలను యేసుక్రీస్తు కొట్టివేయనూ లేదు, ఖండించనూ లేదు. పౌలు కూడా చట్టపరమైన శిక్షలను సమర్థిస్తూ ఇలా మాట్లాడతాడు.

రోమీయులకు 13:3,4 ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; "కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు".

యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రంలోని "వ్యభిచరించిన వారికి మరణశిక్ష విధించాలనే" (లేవీకాండము 20:10) నియమాన్ని అనుసరిస్తూ "వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి" మరణశిక్షను ఎందుకు విధించలేదంటే, అక్కడ కూడా ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని మీరుతూ అలా చెయ్యలేదు. ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆమెకు క్షమాభిక్ష పెట్టాడు. ఆయన విధించిన శిక్షల విషయంలో కొందరికి మినహాయింపు కల్పిస్తూ క్షమాభిక్షను పెట్టే అధికారం దేవునికి ఉంటుంది. పాతనిబంధనలో కూడా వ్యభిచరించిన దావీదు బత్షెబాలకు ఆయన మరణశిక్ష విధించకుండా క్షమాభిక్ష పెట్టాడు (2 సమూయేలు 12:13). ఇది దేవునికి సంబంధించిన విషయం. మనమైతే మనకు బయలుపరచబడిన దేవుని ఆజ్ఞలను అనుసరించి, నేరాన్ని నేరంగా చూడాలి, నేరస్తులపై ఎలాంటి పక్షపాతం, సానుభూతులు లేకుండా "కంటికి కన్ను, కళంకానికి కళంకం, ప్రాణానికి ప్రాణం" అనే శిక్షలు చట్టపరంగా అమలుజరిగేలా పోరాడాలి.

యేసుక్రీస్తు తనను సిలువ‌వేసిన రోమా సైనికులను క్షమించింది, వారికి ఆయన ఎవరో తెలియక రోమా చట్టప్రకారం అలా చేస్తున్నారు కనుకనే అని మనం గుర్తుంచుకోవాలి (లూకా 23:34). స్తెఫను కూడా తనను చంపుతున్న యూదులను క్షమించింది, వారిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటికోపం, ప్రతీకార వాంఛ లేదని చెప్పడానికే తప్ప, మోషే ధర్మశాస్త్రంలోని "ప్రాణానికి ప్రాణం" అనే న్యాయవిధికి వ్యతిరేకంగా కాదు (అపో.కార్యములు 7:60). మనం కూడా మన శత్రువుల విషయంలో మనల్ని హింసించేవారి విషయంలో ఇలాంటి వైఖరినే కలిగియుండాలి, వ్యక్తిగతంగా వారిని క్షమించాలి. కానీ చట్టపరంగా మాత్రం దేవుని న్యాయవిధులను అనుసరించి వారికి తీర్పుతీర్చబడాలి. ఎందుకంటే ఒక మనిషిని చంపడం, హింసించడం అనేవి సాక్ష్యాత్తూ దేవుని పోలిక ఆయన స్వరూపంపై జరుగుతున్న దాడి. ఆ విషయంలో సానుభూతులు చూపించడానికి, క్షమాభిక్షలను స్వాగతించడానికి మనం ఎవరం?

నిర్గమకాండము 21:26,27
ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను. వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను.

ఈ వచనాలలో ఎవరైనా యజమానుడు తన దాసుడి/దాసి కన్నును కానీ పంటిని గానీ ఊడగొడితే వారిని స్వతంత్రులుగా పోనివ్వాలని రాయబడడం మనం చూస్తాం. ఒక యజమానుడు ఎంతో ధనాన్ని చెల్లించి దాసుడ్ని కానీ దాసిని కానీ కొనుక్కుంటాడు (2,7 వచనాలు). కానీ ఇప్పుడు వారికి తమ యజమానుడి కారణంగా వైకల్యం వచ్చింది కాబట్టి ఇంక వారు అతనికి దాసులుగా పనిచెయ్యవలసిన అవసరం లేదు. స్వతంత్రంగా ఆ ఇంటినుండి వెళ్ళిపోవచ్చు. ఐతే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆ యజమానుడు ఉద్దేశపూర్వకంగా అలా వైకల్యాన్ని కలుగచేస్తే 23,24,25 వచనాల ప్రకారం అతనికి కూడా అదే వైకల్యం కలుగచెయ్యబడుతుంది. ఇక్కడ ఆ యజమానుడు పొరపాటుగా అలా చేసాడు కాబట్టే అతనికి శిక్ష విధించబడకుండా దాసుడ్ని/దాసిని కోల్పోయిన నష్టాన్ని భరిస్తున్నాడు. పని చేసేటప్పుడు అలాంటి హానులు సంభవించడం సహజమే కదా!

నిర్గమకాండము 21:28
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.

ఈ వచనంలో ఒక ఎద్దు ఎవరైనా మనిషిని పొడిచి చంపితే దానిని రాళ్ళతో కొట్టి చంపాలని, దాని మాంసం కూడా ఎవరికీ ఉపయోగపడకుండా దానిని తినకూడదని రాయబడడం మనం చూస్తాం. ఇది అన్నిరకాలైన జంతు హానుల‌ విషయంలోనూ వర్తిస్తుంది. నరుని ప్రాణం విషయంలో ఆయన జంతువులను కూడా విమర్శిస్తాడు, శిక్షిస్తాడు అనడానికి ఈ ఎద్దు సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.

ఆదికాండము 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.

అదే విధంగా ఆ వచనంలో "ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను" అని స్త్రీ, పురుషుల కోసం విడమరచి చెప్పబడింది. ఇలా విడమరచి చెప్పడమెందుకు "ఏ మనిషినైనా" అంటే సరిపోయేదిగా? ఐతే ప్రాణహాని కానీ, ప్రమాదం కానీ స్త్రీ విషయంలో సంభవించినా, పురుషుడి విషయంలో సంభవించినా, ప్రజలూ మరియు చట్టం, ఎలాంటి బేధం (వివక్ష, పక్షపాతం) చూపకుండా ఒకేలా స్పందించాలని, ఒకేవిధంగా శిక్షించాలని నేర్పించడానే అలా విడమరచి చెప్పబడింది.
ఎందుకంటే;

మొదటి కొరింథీయులకు 11:11,12
అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు. స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

హాని స్త్రీకి సంభవించినా, పురుషుడికి సంభవించినా అది దేవునిపోలిక దేవుని స్వరూపంపైనే జరుగుతుంది. కాబట్టి హాని కానీ, ప్రాణహాని కానీ పురుషుడికి జరిగినా, స్త్రీకి జరిగినా మనం ఒకేవిధంగా స్పందించాలి, చట్టం కూడా ఆవిధంగానే స్పందించి, శిక్షించేటట్టు మనవంతు పోరాటం చెయ్యాలి. జంతువుల నుండి తటస్థించే హానుల విషయంలోనే దేవుడు ఆ సమానత్వ నియమాన్ని అంత కచ్చితంగా ప్రస్తావిస్తే, మానవుల నుండి జరిగే హానులు, హత్యల విషయంలో దానిని ఇంకెంతగా పాటించ (అనుసరించ) బద్ధులలో బాగా ఆలోచించండి. దీనిగురించి ఇప్పటికే నేను 23-25 వచనాల వ్యాఖ్యానంలో వివరించాను. 

నిర్గమకాండము 21:29

ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.

ఈ వచనంలో ఒక ఎద్దు పొడిచేది అని తెలిసికూడా దాని యజమానుడు దానిని భద్రం చెయ్యకపోతే, ఆ ఎద్దుతో పాటు ఆ యజమానుడ్ని కూడా చంపివెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది అన్నిరకాల జంతువుల విషయంలోనూ మరియు ప్రమాదానికి కారణమయ్యే అన్ని రకాల వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక జంతువు కానీ, ఏదైనా వస్తువు కానీ ఇతరులకు హానిచేసేదిగా ఉందని, లేదా దానివల్ల హానికలుగుతుందని తెలిసి కూడా దానిని ఆ యజమాని భద్రం చెయ్యకపోతే అతనికి కూడా శిక్ష తప్పదు.‌ ఉదాహరణకు పెట్రోల్ చాలా ప్రమాదకరమైనది, దానిని ఎక్కడికైనా తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా దానిని తరలించడం, లేదా నిప్పుకు అవకాశం ఉన్నచోట దానిని ఉంచడం వల్ల ఎవరి ప్రాణానికైనా హాని కలిగితే దానిని తరలిస్తున్నవాడు కూడా మరణశిక్ష పొందాలి.

నిర్గమకాండము 21:30
వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.

ఎద్దు పొడిచేదని ఆ యజమానుడికి తెలిసికూడా దానిని భద్రం చెయ్యకపోతే ఆ ఎద్దుతో పాటు ఆ యజమానుడికి కూడా మరణశిక్ష విధించబడాలని పైవచనంలో చూసాం. ఈ వచనంలో ఒకవేళ అలా ఎద్దుచేతిలో చంపబడిన వ్యక్తి కుటుంబసభ్యులు ఆ ఎద్దు యజమానుడి చావును కాకుండా నష్టపరిహారాన్ని కోరుకుంటే, ఆ యజమానుడు తన ప్రాణ విమోచన నిమిత్తం నష్టపరిహారాన్ని చెల్లించి మరణశిక్షనుండి తప్పించుకోవచ్చని ఈ వచనం మినహాయింపును కల్పిస్తుంది. ఎందుకంటే ఆ యజమానుడు‌ ఉద్దేశపూర్వకంగా హత్య చెయ్యలేదు కానీ, కేవలం ఎద్దును జాగ్రత్త చేసుకోకుండా అజాగ్రత్తను పాటించాడు. అందుకే ఈ మినహాయింపు అతనికి ఇవ్వబడింది. ప్రాణం పోకపోయినా ధనరూపంలోనైనా అతని అజాగ్రత్తకు శిక్షవిధించబడింది. ఐతే ఇలా ధనం రూపంలో‌ నష్టపరిహారం చెల్లించి శిక్షలనుండి తప్పించుకోవడం ఉద్దేశపూర్వక హత్య, హానుల విషయంలో వర్తించదని మనం గుర్తుంచుకోవాలి. ఇంతవరకూ మనం చూసినట్టు ఉద్దేశపూర్వక హత్యలకు, మరణశిక్షే సరి. ఉద్దేశపూర్వక హానులకు హానియే సరి.

నిర్గమకాండము 21:31
అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.

ఆ ఎద్దు ఎవరి కుమారుడినైనా కుమార్తెనైనా పొడిచినా సరే, పైన చెప్పినదాని ప్రకారంగా పరిహారం చెల్లించాలని, లేదా మరణశిక్ష అనుభవించాలని ఈ వచనం చెబుతుంది. హాని‌ జరిగింది చిన్నపిల్లలకే కదా అని తప్పించుకునే అవకాశం లేదు.

నిర్గమకాండము 21:32
ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను.

ఆ ఎద్దు చివరికి ఎవరి దాసుడ్ని/దాసిని పొడిచినా సరే నష్టపరిహారం తప్పనిసరి అని ఈ వచనం చెబుతుంది. అలాగే ఆ ఎద్దును‌ చంపివెయ్యాలి. దాసులకు దాసిలకు ప్రత్యేక కుటుంబం ఏమీ ఉండకుండా వారు యజమానుడికి అమ్మబడి‌ ఉంటారు కాబట్టి, నష్టపరిహారం యజమానుడికే చెల్లించబడాలి, అందుకే ఆ నష్టపరిహారం తక్కువగా ఉంది. కానీ కుటుంబాలకు చెల్లించవలసిన నష్టపరిహారం విషయంలో మాత్రం ఇలాంటి కచ్చితమైన వెల‌ నిర్ణయించబడలేదు. అది కుటుంబ సభ్యులు, న్యాయాధిపతుల సమక్షంలో నిర్ణయించుకుంటారు. యేసుక్రీస్తు దాసుని స్వరూపంలో మనవద్దకు వచ్చాడు అనడానికి (పిలిప్పీ 2:7) ఆయనకు నిర్ణయించబడిన వెల కూడా సాక్ష్యంగా ఉంది. ఇక్కడ ఎద్దు యజమానుడు ఎలాగైతే దాసుని ప్రాణం నిమిత్తం 30 తులాల వెండిని చెల్లించాలో, అలానే యేసుక్రీస్తు 30 వెండి కాసులకు అమ్మబడ్డాడు (మత్తయి 26:15). ఇది జెకర్యాగ్రంథంలోని ప్రవచనానికి నెరవేర్పుగా జరిగింది (జెకర్యా 11:13).

నిర్గమకాండము 21:33,34
ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.

ఈ వచనాలలో ఎవరైనా ఒక వ్యక్తి గోయ్యి తీసి కప్పకపోయినా, లేక నేల నుయ్యిలు వంటివాటిపై కప్పు పెట్టకపోవడం వల్ల ఎవరిదైనా పశువు అందులో పడి చనిపోతే ఆ గొయ్యి తీసినవారు/ఆ నుయ్యికి సంబంధించిన యజమానులు ఆ నష్టాన్ని భరించాలని చెప్పబడడం మనం చూస్తాం. ఈ మాటలు మనకు ప్రమాదానికి కారణమయ్యే వాటన్నిటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని‌ హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం గొయ్యి, నుయ్యికి మాత్రమే పరిమితం కాదు. మన అజాగ్రత్త వల్ల చివరికి ఒక జంతువుకు కూడా హాని‌ కలుగకుండా జాగ్రత్త వహించాలి. ఎద్దుకంటే, ఒక పశువు కంటే మనిషి గొప్పవాడు కాబట్టి, దేవుడు ఒక పశువు విషయంలోనే ఇలాంటి జాగ్రత్తలు చెబితే మనుషుల‌కు హాని‌కలిగించే వాటి విషయంలో మరెంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడో ఆలోచించండి. ఒకవేళ మన అజాగ్రత్త వల్ల మనిషికే ప్రమాదం‌ వాటిల్లితే అది నరహత్యతో సమానం.

నిర్గమకాండము 21:35
ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.

ఎవరిదైనా ఎద్దు వేరొక ఎద్దును చచ్చిపోయేలా పొడిస్తే ఆ ఎద్దుల యజమానులు చనిపోయిన ఎద్దునూ బ్రతికున్న ఎద్దునూ అమ్మివేసి వాటి విలువను సమానంగా పంచుకోవాలని ఈ వచనం చెబుతుంది. ఈ నియమం అన్ని రకాల జంతువుల పెనుగులాటలోనూ వర్తిస్తుంది. అప్పుడు ఇరు యజమానులకూ నష్టం వాటిల్లదు.

నిర్గమకాండము 21:36
అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.

ఈ వచనంలో ఆ ఎద్దు పొడిచేది అని తెలిసి కూడా దాని యజమానుడు భద్రం చెయ్యకపోతే దానివల్ల చనిపోయిన ఎద్దు యజమానుడికి ఎద్దుకు ఎద్దును చెల్లించాలని చచ్చిపోయిన ఎద్దును మాత్రం అతనే తీసుకోవాలని రాయబడింది. బ్రతికున్న ఎద్దుతో పోలిస్తే చచ్చిన ఎద్దు విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి తన ఎద్దు నైజం తెలిసి కూడా దానిని‌ భద్రం చెయ్యలేని యజమానుడు ఆ నష్టాన్ని భరించక తప్పదు.

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.