పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం; 2:1, 2:2, 2:3,4, 2:5,6, 2:7,8, 2:92:10, 2:11, 2:12, 2:13, 2:14, 2:15, 2:16,17, 2:18-20, 2:21, 2:22, 2:23, 2:24,25

నిర్గమకాండము 2:1 లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.

ఈ వచనంలో లేవీ వంశస్థుడు లేవీ కుమార్తెను వివాహం చేసుకున్నట్టు మనం చూస్తాం. వీరే అమ్రాము, యోకెబెదులు (నిర్గమకాండము 6:20). వీరిద్వారానే మోషే జన్మించాడు. తెలుగులో అమ్రాముకు యోకెబెదు మేనత్త అని తర్జుమా చేసారు కానీ ఆమె‌ నిజంగా అమ్రాము తండ్రి కహాతు యొక్క స్వంత చెల్లి కాదు. ఎందుకంటే కహతు తండ్రియైన లేవీకి కుమార్తెలు లేరు (ఆదికాండము 46:11, నిర్గమకాండము 6:16,18). కాబట్టి అమ్రాముకు, యోకెబెదు స్వంత మేనత్తకాదు, అనగా లేవీ స్వంత కుమార్తె కాదు. ఇంగ్లీష్ బైబిల్ లో ఆమె అమ్రాము యొక్క father's sister అని ఉంటుంది. సాధారణంగా వారు తమ‌ తండ్రుల తరానికి చెందిన పిల్లలను తమ తండ్రి పేరుతోనే సంబోధిస్తారు. ఉదాహరణకు తండ్రి సహోదరుని కుమార్తెను, నా తండ్రి కుమార్తె అంటారు. ఇలాంటి భాషనే అబ్రాహాము శారాల విషయంలో కూడా గమనిస్తాం (ఆదికాండము 20:12 వ్యాఖ్యానం చూడండి). ఆవిధంగా అర్థం చేసుకున్నప్పుడు యోకెబెదు లేవీ సహోదరులలో ఎవరొకరి కుమార్తె, అలా ఆమె లేవీకి కుమార్తె, మరియు అతని కుమారుడైన కహాతుకు సహోదరి వరస ఔతుంది.

ఒకవేళ అమ్రాము, యోకెబెదులు సొంత మేనత్త, మేనళ్ళుడు అయ్యుంటే వారు వివాహం విషయంలో దేవుడు నియమించిన వరసలను తప్పిన దోషులు అయ్యేవారు (లేవీకాండము 16). కానీ వారు మంచి విశ్వాసులుగా కనిపిస్తున్నారు. ఈ కారణంగా వారి వివాహం విషయంలో నేను పైన ప్రస్తావించిన వివరణనే ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే కొందరు మోషే ధర్మశాస్త్రానికి ముందు ఎవరు ఎవరిని వివాహం చేసుకోవాలో ఎలాంటి నియమాలు లేవని, అందువల్ల అప్పుడు ఎవరు ఎవరిని వివాహం చేసుకున్నప్పటికీ పాపం కాదని బోధిస్తుంటారు. ఈ బోధ దేవుడు నియమించిన నైతిక ఆజ్ఞలను అవమానించే ఒక దుర్బోధ. మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేకపోతే "యాకోబు కుమారుడైన యూదా తాను శయనించింది తన కోడలితో అని తెలుసుకుని ఎందుకు పశ్చాత్తాపపడ్డాడు?" (ఆదికాండము 38:26). కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతికపరమైన ఆజ్ఞలు లేవనే బోధ కేవలం ఒక దుర్బోధ. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

ధర్మశాస్త్రానికి ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

నిర్గమకాండము 2:2 ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.

ఈ వచనంలో యోకెబెదు తన కుమారుడైన మోషే సుందరుడిగా ఉండడం గమనించి, ఫరో ఆజ్ఞ చొప్పున వానిని నీటిలో పడవెయ్యకుండా మూడు‌ నెలలు దాచడం మనం చూస్తాం. అతని సుందరత్వం గురించి స్తెఫను కూడా ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడు (అపొ. కార్యములు 7:20). ఈవిధంగా మోషే తల్లితండ్రుల మోషే సుందరుడిగా ఉండడం గమనించి, ఆ పిల్లవాడు అందరి పిల్లలులా సాధారణమైనవాడు కాదని, అతనిద్వారా దేవుడు ఏదో గొప్పకార్యం చెయ్యబోతున్నాడని విశ్వసిస్తున్నారు‌. అందుకే ఆ పిల్లవాడిని చంపకుండా బ్రతికించడానికి ప్రయాసపడుతున్నారు.

హెబ్రీయులకు 11:23 మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.

అదేవిధంగా ఈ వచనంలో మనకు మోషే జననం గురించి మాత్రమే ప్రస్తావించబడింది కానీ అమ్రాము, యోకెబెదులకు మోషేకంటే ముందు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారే అహరోను, మిర్యాములు (సంఖ్యాకాండము 26:59). ఈ మిర్యాము గురించి క్రింది వచనాలలో కూడా మనం చూస్తాం.

ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మోషే జన్మించిన ఈ లేవీ గోత్రం షెకెములో లేవీ షిమ్యోనులు చేసిన హింసను బట్టి యాకోబు చేత శపించబడింది (ఆదికాండము 49:5-7). అయినప్పటికీ ఆ గోత్రంలోనే ఇశ్రాయేలీయులకు విడుదల కలుగచేసిన మోషే జన్మించాడు. కాబట్టి మన దేవుడు శాపానికి గురైనదాని నుండి కూడా మేలైనదానిని తీసుకురాగల కృపగలవాడని అర్థం చేసుకోవాలి.

నిర్గమకాండము 2:3,4 తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.

ఈ వచనంలో తన కుమారుడైన మోషేను మూడు నెలలవరకూ దాచిపెట్టిన యోకెబెదు ఇక వానిని దాచలేక ఆ పిల్లవాడిని జమ్ముపెట్టెలో పెట్టి యేటియొడ్డున దానిని విడిచిపెట్టడం మనం చూస్తాం. బహుశా మూడునెలలకు ఒకసారి ఫరో సైనికులు ఇశ్రాయేలీయుల గృహాలను తనిఖీ చేస్తుండవచ్చు, పైగా మూడునెలలు గడిచేసరికి పిల్లవాడి ఏడుపు కూడా బిగ్గరగా ఉంటుంది. అందుకే ఆమె ఆ పిల్లవాడిని దాచలేక ఈవిధంగా చేస్తుంది.

అయితే ఇప్పుడు కూడా ఆమె తన విశ్వాసాన్ని కోల్పోయి ఇలా చెయ్యడం లేదు. ఒకవేళ ఆమె విశ్వాసాన్ని కోల్పోయే ఉంటే ఫరో చెప్పినట్టుగా నీటిలో పడవేసేది కానీ జమ్ముపెట్టెలో పెట్టేది కాదు. ఇక్కడ ఆమె తన బిడ్డ కారణజన్ముడు కాబట్టి దేవుడే ఆ బిడ్డను కాపాడతాడని విశ్వసించి ఈవిధంగా చేస్తుంది. ఈ సంఘటనలో మరో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. యోకెబెదు తన బిడ్డ ప్రత్యేకత చూసి, అతను దేవునికార్యం కోసం పుట్టినవాడని విశ్వసిస్తుంది. దేవుడు ఆ బిడ్డను కాపాడతాడని‌ కూడా విశ్వసిస్తుంది. ఆ బిడ్డను నీటిలో పడవేసి దేవుడే కాపాడతాడులే అనుకోవడం లేదు. ఆమె ఆ బిడ్డకు నీరుతాకకుండా కీలు పూసిన జమ్ముపెట్టెలో పెట్టి మిగిలిన భారం దేవునిపై వేస్తుంది. ఆ బిడ్డకు ఏమౌతుందో తెలుసుకోవడానికి తన కుమార్తెయైన మిర్యామును కూడా అక్కడ కాపలా పెట్టింది. కాబట్టి మన విశ్వాసం "అంతా దేవుడే చూసుకుంటాడులే" అని మన బాధ్యతలను హరించివేసేదిగా ఉండకూడదు, అలాంటి విశ్వాసం బైబిల్ బోధిస్తున్న విశ్వాసం కానేకాదు అది మానవపతన స్వభావం నుండి పుట్టిన మూఢవిశ్వాసం. బైబిల్ బోధించే విశ్వాసం దేవునిపై ఆధారపడుతూ మనపై మోపబడిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తించమ‌ని ప్రేరేపిస్తుంది.

అదేవిధంగా ఇక్కడ జమ్ముపెట్టె ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఈ జమ్మునే పపైరస్ చెట్లు అంటారు. ఇవి ఐగుప్తులోని నైలునది ప్రక్కన విస్తారంగా పెరుగుతాయి. ఈ చెట్లను అల్లి చిన్నచిన్న పడవలను కూడా తయారు చేసేవారు, బైబిల్ గ్రంథప్రతులు కూడా ఈ చెట్లనుంచి తయారు చేసిన కాగితంపైనే రాయబడ్డాయి. కాగితాలకు పేపర్ అనే పేరు కూడా ఈ చెట్టు పేరు (పపైరస్) ను బట్టే వచ్చింది.

నిర్గమకాండము 2:5,6 ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.

పై వచనాలలో యోకెబెదు విశ్వాసం కనిపిస్తుంటే ఈ వచనాలలో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే దేవుని ఏర్పాటును మనం చూస్తాం. దేవుడు మోషేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన చేసిన ప్రమాణాన్ని నెరవేర్చే సాధనంగా పుట్టించాడు. అందుకే మగపిల్లలు చంపబడుతున్న కాలంలో అతడిని పుట్టించి, అందరితో పాటు అతనూ నశించిపోకుండా కాపాడుతు‌న్నాడు. ఆ క్రమంలో ఎవరైతే ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపమనే ఆజ్ఞ‌ను జారీచేసారో అదే ఫరో యొక్క కుమార్తెను ఆయన సాధనంగా వాడుకుంటున్నాడు. యూదా చరిత్రకారుడైన జోసెఫర్ ఈ ఫరో కుమార్తె పేరు తెర్మూతీస్ గా ప్రస్తావించి, ఆమెకు వివాహం అయినప్పటికీ సంతానం‌ లేకపోవడంవల్ల మోషేను కనికరించి దత్తత తీసుకుందని వివరించాడు. కాబట్టి ఒక క్రూరుడైన వ్యక్తి కుటుంబానికి చెందినవారందరూ క్రూరులుగానే ఉంటారని మనం భావించకూడదు. అలాంటి ఒకరిని బట్టి ఆ కుటుంబమంతటినీ ద్వేషించకూడదు.

అదేవిధంగా మోషే పుట్టినప్పుడు అతడు అందరిపిల్లలకంటే సుందరుడిగా ఉండడం వల్ల మూడునెలలపాటు తన తల్లితండ్రుల ద్వారా కాపాడబడ్డాడు. ఇప్పుడు‌ అతని ఏడుపును చూసిన ఫరో కుమార్తె కనికరంతో అతడిని కాపాడాలి అనుకుంటుంది. ఇక్కడ మోషే సుందరత్వం, ఏడుపు ఈ రెండూ కూడా అతనిని‌‌ కాపాడే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దేవుడు మన జీవితంలోకి సుందరం వంటి ఆనందాన్ని అనుగ్రహించినా ఏడుపు వంటి‌ కష్టాలను అనుమతించినా అవన్నీ మనకు మేలుచేసే సాధనాలుగానే ఉంటాయి. ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క‌ పాఠాన్ని మనం నేర్చుకుంటూ పరిపూర్ణులమయ్యే దిశగా అవి మనల్ని నడిపిస్తాయి. మన జీవితం ఆయన మహిమకోసమే. మనం సుందరం వంటి ఆనందంలో ఉన్నప్పుడు ఆయనకు ఎక్కువ మహిమ కలుగుతుందో ఏడుపు వంటి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు ఎక్కువ మహిమ కలుగుతుందో ఆయనకు బాగా తెలుసు. సమయాన్ని బట్టి ఆయన ఎక్కువ మహిమపొందేలా వాటిని అనుమతిస్తాడు.

నిర్గమకాండము 2:7,8 అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తెవెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.

ఈ వచనాలలో మోషేను దూరం నుండి గమనిస్తున్న‌ మిర్యాము, ఫరో‌ కుమార్తె ఆ పిల్లవాడిని‌ కనికరించడం గమనించి, ఆ పిల్లవాడిని పెంచడానికి దాదిని తీసుకువస్తాను అనడం, దానికి ఫరో కుమార్తె అంగీకరించడం మనం చూస్తాం. ఇక్కడ మిర్యాము మోషే విషయంలో సరైన సమయానికి స్పందిస్తుంది. దానివల్ల ఆ బిడ్డ తిరిగి తన తల్లియొద్దకే చేర్చబడ్డాడు. ఒకవేళ మిర్యాము ఫరోకుమార్తెతో అలా మాట్లాడే సాహసం చెయ్యకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి విశ్వాసులమైన మనం అవసరమైనప్పుడు ధైర్యాన్ని కనుపరిచే యోధుల్లా జీవించాలి.

నిర్గమకాండము‌ 2:9 ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.

ఈ వచనంలో ఫరో కుమార్తె ఈ బిడ్డను నాకోసం పెంచమని మోషేను తన తల్లికే అప్పగించడం, అందుకు జీతాన్ని కూడా నిర్ణయించడం మనం చూస్తాం. ఇక్కడ యోకెబెదు "మృతులలో నుండి పొందినట్టుగా తన కుమారుడిని‌ మరలా పొందుకుంది" చివరికి తన బిడ్డను తానే పెంచుతున్నందుకు ఆమెకు జీతం కూడా నిర్ణయించబడింది. దేవుడు తన చిత్తప్రకారం చేసే కార్యాలు ఈవిధంగా ఊహాతీతంగా ఉంటాయి. ఆమె ఆ బిడ్డను నదిలో విడిచిపెట్టినప్పుడు ఇలా ఊహించియుంటుందా?

నిర్గమకాండము 2:10 ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమెనీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.

ఈ వచనంలో యోకెబెదు మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తెవద్దకు అతన్ని తీసుకురావడం, ఆమె అతన్ని దత్తత తీసుకుని, మోషే అని పేరుపెట్టడం మనం చూస్తాం. అప్పటినుండి మోషే జీవితం, భవిష్యత్తులో ఐగుప్తు సింహాసనాన్ని అధీష్టించే నాయకుడిగా శిక్షణ చెయ్యబడింది (అపో.కార్యములు 7: 22). అయితే దేవుడు అతను నేర్చుకున్నదానిని ఐగుప్తు సింహానం అధీష్టించడానికి కాకుండా అరణ్యంలో తన ప్రజలను నడిపించడానికి సంకల్పించాడు. లక్షలమంది ప్రజలను నడిపించడానికి కావలసిన వివేకం, సహనం, మాటనేర్పరితనం ఇవన్నీ మోషేకు ఐగుప్తు నుండే శిక్షణ అనుగ్రహించాడు.

నిర్గమకాండము 2:11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.

ఈ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజలదగ్గరకు పోయి వారు పడుతున్న కష్టాలను, ఐగుప్తీయులు వారిని పెడుతున్న శ్రమలనూ గమనించినట్టు మనం చూస్తాం. స్తెఫను మాటల ప్రకారం అప్పటికి మోషే వయసు 40 సంవత్సరాలు (అపో.కార్యములు 7: 23). అప్పటివరకూ మోషే ఐగుప్తులో రాజకుమారుడి స్థాయిలో సకల విద్యలనూ అభ్యసిస్తున్నాడు.

నిర్గమకాండము 2:12 అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.

ఈ వచనంలో మోషే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని అన్యాయంగా కొట్టడం గమనించి వాడిని చంపివేసినట్టు మనం చూస్తాం. అంటే అతను ఐగుప్తు అధికారాన్ని ఎదిరించి ఇశ్రాయేలీయులను రక్షించాలి అనుకుంటున్నాడు. ఒకప్రక్క లోకంతో కలసిపోయి ఆ లోకమిచ్చే పాపపు ఆనందాన్ని అనుభవిస్తూ మరోప్రక్క దేవునిపిల్లలకు ఏదో మేలు చెయ్యాలని ఆలోచించే కొందరు క్రైస్తవ నాయకులకు మోషే ఇక్కడ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అతను ఐగుప్తు పాపభోగాలకు వేరై తన ప్రజలకు‌ మేలు చెయ్యాలి అనుకుంటున్నాడు.

ఇక మోషే ఒక ఐగుప్తీయుడిని చంపడాన్ని బట్టి, కొందరు అతడు‌ నరహత్య చేసాడని భావిస్తుంటారు. కానీ మోషే పుట్టిందే ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులనుండి విడిపించి వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈ కారణంగా అతనిక్కడ ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఆ ఐగుప్తీయుడిపై పగతీర్చుకున్నాడు. దీనినిబట్టి అతను చేసింది నరహత్యగా కాదు యుద్ధంగా పరిగణించబడుతుంది. అందుకే లేఖనంలో మోషే చేసిన ఈపనిని ప్రతీకారం తీర్చుకోవడంగా రాయబడింది (అపో.కార్యములు 7: 24).

నిర్గమకాండము 2:13 మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.

ఈ వచనంలో మోషే మరలా ఇశ్రాయేలీయుల మధ్య సంచరిస్తున్నప్పుడు వారిలో ఇద్దరు పోట్లాడుకోవడాన్ని గమనించడం మనం చూస్తాం. దీనినిబట్టి ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఎలాంటి అవివేకులు ఉంటారో మనం గుర్తించవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం వీరంతా ఐగుప్తులో బానిసలుగా ఉంటూ కఠినంగా శ్రమపరచబడుతున్నారు. అయినప్పటికీ వీరిలో ఐక్యత లేకుండా ఒకరికి ఒకరు అన్యాయం‌ చేసుకుంటూ పోట్లాటలకు దిగుతున్నారు. ప్రస్తుత సంఘాల్లో కూడా కొందరు విశ్వాసుల పరిస్థితి ఇలానే ఉంది. లోకం నుండి వస్తున్న శ్రమలనూ‌ సువార్తకు ఆటంకాలనూ మరోవైపు సంఘంలోనుండే బయలుదేరిన దుర్బోధలనూ ఐక్యంగా ఎదుర్కోవలసిన వారు వ్యక్తిగత కక్షలకు లోనై, ఒకరిపట్ల‌ ఒకరు అన్యాయానికి పాల్పడుతూ క్రీస్తు నామానికి అవమానకరంగా తయారౌతున్నారు.

నిర్గమకాండము 2:14 అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్ల నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే - నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను.

ఈ వచనంలో‌ మోషే తనముందు పోట్లాడుకుంటున్న ఇద్దరు హెబ్రీయులను సమాధానపరచడానికి ప్రయత్నించడం, అందులో ఒకడు మోషేను ఎదిరిస్తూ నిన్న ఐగుప్తీయుడిని చంపినట్టు నన్నూ చంపాలి అనుకుంటున్నావా అని ప్రశ్నించడం మనం చూస్తాం. ఇక్కడ పోట్లాడుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులూ "దాతాను అబీరాములని" యూదుల జోనాతాన్ టార్గంలో ప్రస్తావించబడింది. ఎందుకంటే తర్వాత కాలంలో కూడా వీరు అలాంటి మాటలతోనే మోషేను ఎదిరించడం చదువుతాం (సంఖ్యాకాండము 16:1-3).

ఇక జరిగిన ఈ సంఘటనను మనం వరుసగా పరిశీలించగలిగితే ఇక్కడ మోషే పోట్లాడుకుంటున్న ఆ ఇద్దరినీ సమాధానపరిచే దిశగా వారిలో అన్యాయం చేసినవాడిని ప్రశ్నిస్తున్నాడు. అంతేతప్ప ఎవరిపైనా దాడి చెయ్యలేదు. అయినప్పటికీ అందులో అన్యాయం చేసినవాడు తన తప్పిదాన్ని ఒప్పుకోకుండా నిన్న‌ ఐగుప్తీయుడ్ని చంపినట్టు, నన్నూ చంపుతావా అంటూ మోషేపై నిందమోపే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవిధంగా మోషేను ఐగుప్తీయుడి హత్య విషయంలో చిక్కులో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇది అన్యాయస్థులకు సహజంగా ఉండే లక్షణంగా మనం అర్థం చేసుకోవాలి. అలాంటివారు తమ‌ అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించినవారిపై ఎలాంటి దాడికైనా సిద్ధపడతారు.

అదేవిధంగా దీనికి ముందురోజు మోషే ఇశ్రాయేలీయుల‌ మధ్య సంచరిస్తున్నప్పుడు ఒక‌ ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని అన్యాయంగా కొట్టడం గమనించి, ఆ ఐగుప్తీయుడిని చంపి ప్రతీకారం చేసాడు. ఈరోజు ఇశ్రాయేలీయులైన మనుష్యులు పోట్లాడుకుంటున్నప్పుడు కూడా వారి విషయంలో‌‌ మౌనంగా ఉండకుండా వారిని సమాధానపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిని బట్టి మోషే అన్యాయం‌ బయటివాడు చేసినా లోపటివాడు చేసినా సహించలేనివాడని అర్థమౌతుంది. ఇలాంటి లక్షణం దేవునిపిల్లలందరూ తప్పక అలవరచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు అన్యాయం ఎక్కడ ఉన్నప్పటికీ దానిని ద్వేషించే న్యాయమైన దేవుడు. కాబట్టి మనం కూడా సంఘం వెలుపటి అన్యాయాన్నే కాకుండా సంఘం‌ లోపటి అన్యాయాన్ని కూడా ఖండించేవారిగా ఉండాలి.

అయితే మోషే ఐగుప్తీయుడ్ని చంపినట్టు ఇశ్రాయేలీయుడిని చంపలేదు. దీనినిబట్టి అతనిలో పక్షపాతం ఉందని‌ కొందరు ఆరోపిస్తారు. కానీ ఇక్కడ అలాంటి ఆరోపణకు తావులేదు. ఎందుకంటే ఐగుప్తీయులు ఒక ప్రణాళిక ప్రకారం ఇశ్రాయేలీయులను హింసిస్తున్నారు. అందుకే మోషే అందులో అన్యాయంగా కొడుతున్నవాడిని చంపివేసాడు. కానీ ఇక్కడ ఆ ఇద్దరు ఇశ్రాయేలీయులూ తమమధ్య తలెత్తిన వివాదం విషయంలో పోట్లాటకు దిగారు. ప్రతీ వివాదంలోనూ ఎవరో ఒకరి తప్పిదం‌ ఉంటుంది. న్యాయాధిపతులు దానిని విచారించి అన్యాయం‌ చేసినవాడికి తగిన శిక్షనూ అన్యాయానికి గురైనవాడికి తగిన న్యాయాన్నీ జరిగిస్తారు. ఇక్కడ మోషే కూడా వారిద్దరి‌ మధ్యా న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ తన విచారణలో తేలినదానిని‌ బట్టి అన్యాయం చేసినవాడిని నువ్వెందుకు నీ పొరుగువాడికి అన్యాయం చేసావంటూ ప్రశ్నిస్తున్నాడు. ఆవిధంగా ఆ అన్యాయం చేసినవాడిని ఒప్పించి, అన్యాయానికి గురైనవాడికి తగిన న్యాయం చేసి ఇద్దరినీ సమాధానపరచాలన్నది మోషే ఉద్దేశం. కానీ ఆ అన్యాయం‌ చేసినవాడు మోషేకు ఎదురుతిరగడంతో అతను ఐగుప్తీయుడి హత్య విషయంలో భయపడి తన తీర్పును వెల్లడించలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మోషేలో ఎలాంటి పక్షపాతం‌ లేదు.‌‌ పక్షపాతం ఉన్నవారు ఎప్పటికీ దేవుని సేవకులు/పిల్లలు కాలేరు. అందుకే "మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు" (యాకోబు 2: 9) అని స్పష్టంగా రాయబడింది.

ప్రాముఖ్యంగా ఇక్కడ జరిగిన సంఘటన ఇశ్రాయేలీయుల విషయంలో మోషేకు పెద్ద పరీక్షగా మారింది. ఎవర్నైతే అతను ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించాలని ప్రయాసపడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులే అతన్ని తిరస్కరించి సమస్యలో నెట్టే మనస్తత్వంతో ఉన్నారు (అపొ. కార్యములు 7:25-28). ఈ కారణంగా మోషే వారిని అసహ్యించుకుని తిరిగి ఐగుప్తుపై ఆశ పెంచుకోవచ్చు. జరిగిన విషయమంతా ఫరోకు తెలియచేసి తన పెంపుడు తల్లిద్వారా క్షమాపణ పొందుకోవచ్చు. కానీ మోషే అలా ఏమీ చెయ్యడం లేదు. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడే ఉన్నాడు. అందుకే క్రిందివచనాల్లో అతను ఫరో భయంతో ఐగుప్తు నుండి‌ పారిపోయాడు‌ తప్ప, తన తల్లిద్వారా ఫరోతో సమాధానపడడానికి ప్రయత్నించలేదు.

దీనిని బట్టి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. నేటికాలంలో మనం సంఘాన్ని సంస్కరించడానికి ప్రయత్నించినప్పుడు మోషేపై ఇశ్రాయేలీయులు చేసినట్టే మనపై కూడా ఎదురుదాడి చేస్తుంటారు. ఎందుకంటే సంఘం అనేది గురుగులు, గోధుమల కలయిక. కాబట్టి ఎవరో ఎదురుదాడికి పాల్పడుతున్నారని, అన్యాయంగా సమస్యల్లో నెడుతున్నారని సంఘం‌ విషయంలో ప్రభువు అప్పగించిన బాధ్యత నుండి మనం వైదొలగకూడదు (2తిమోతీ 4:1,2, తీతుకు 2:15).

నిర్గమకాండము 2:15 ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.

ఈ వచనంలో మోషే ఫరోకు భయపడి మిద్యాను దేశానికి పారిపోయినట్టు మనం చూస్తాం. కొందరు ఇక్కడ మోషే భయపడినట్టు రాయబడినదానినీ హెబ్రీ 11: 27లో "విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను" అనే మాటలతో జతచేసి ఒకచోట మోషే భయపడి పారిపోయినట్టు ఉందనీ మరోచోట భయపడక ఐగుప్తును విడిచిపోయినట్టు ఉందనీ అదేదో వైరుధ్యం అన్నట్టు ప్రస్తావిస్తుంటారు. కానీ హెబ్రీ పత్రికలో "రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను" అనే మాటలు ఈ సందర్భం గురించి చెప్పడం‌లేదు. తర్వాత కాలంలో‌ అతను ఇశ్రాయేలీయులతో పాటుగా ఐగుప్తును విడిచివెళ్ళడం గురించి చెబుతున్నాయి. ఎందుకంటే ఆ సందర్భంలో ఫరో మోషేను ఎంత‌ బెదిరించినప్పటికీ (నిర్గమకాండము 10:28) మోషే భయపడలేదు. ఐగుప్తు నుండి కనాను ప్రయాణంలో ఎర్రసముద్రం ఎదురుగా వచ్చినప్పుడు, ఫరో వెనుక తరుముతున్నప్పుడు కూడా ప్రజలందరూ భయపడ్డారు కానీ మోషే భయపడలేదు.

అలానే సాధారణంగా లోకం "పారిపోవడమంటే" చేతకానితనంగా భావిస్తుంటుంది. కానీ విశ్వాసులు అపాయం కలుగుతుందనే సందేహం కలిగినప్పుడు అక్కడినుండి పారిపోవడాన్ని చేతకానితనంగా తీసుకోకూడదు. అది స్వయంగా ప్రభువే మనకు నేర్పిన యుక్తి (మత్తయి 10:23). ఈవిధంగా మోషే యుక్తికలిగి ఫరో వద్దనుండి మిద్యాను దేశానికి పారిపోయినట్టు మనం‌ చూస్తున్నాం. అబ్రాహాముకు కెతూరా ద్వారా కలిగిన సంతానమే ఈ మిద్యానీయులు‌ (ఆదికాండము 25:1,2).

ఆకాలంలో దూరప్రాంతాలకు ప్రయాణమైనవారు అక్కడున్న నీటిబావుల దగ్గర కూర్చుని ఆ ఊరివారికోసం విచారించడం జరిగేది (ఆదికాండము 24:11, ఆదికాండము 29:2). ఎందుకంటే చుట్టుప్రక్కల ప్రజలంతా ఏదో సమయంలో ఆ బావి దగ్గరకు వస్తారు. అందుకే మోషే కూడా ఒక బావిదగ్గర కూర్చున్నాడు.

నిర్గమకాండము 2:16,17 మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.

ఈ వచనాలలో మిద్యాను యాజకుడి ఏడుగురు కుమార్తెలూ మోషే నిలుచున్న బావిదగ్గరకు రావడం, వారు తమ‌ తండ్రి‌ మందలకు నీరు పెడుతుంటే ఇతర మందకాపరులు వారిని అడ్డగించడం, మోషే లేచి వారికి సహాయం చెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ కూడా మోషే అన్యాయాన్ని సహించలేక అలా చేస్తున్నాడు. తనకెందుకులే అనుకోకుండా తానెవరో‌ తెలియనివారికి కూడా సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం కారణంగానే తర్వాత వచనాల్లో మిద్యాను యాజకుడు అతడిని‌ తన‌ ఇంట్లో చేర్చుకోవడం, తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించడం‌ కూడా జరిగింది. ఈవిధంగా దిక్కుతోచని స్థితిలో మిద్యానుకు చేరిన మోషే జీవితం మరొకరి జీవితంలో ముడిపడి ఫలవంతంగా మారింది. దీనంతటికీ అతను దేవుణ్ణి విశ్వసించి, విశ్వాసఫలంగా ఇతరులకు సహాయం చెయ్యడమే కారణం. కాబట్టి మనం కూడా సాధ్యమైనంతమట్టుకు ఇతరులకు సహాయపడాలి. అందుకే "కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము" (గలతీ 6: 10) అని రాయబడింది.

అదేవిధంగా ఈ వచనాలలో మోషే సహాయం చేసినవారి తండ్రి గురించి "మిద్యాను యాజకుడు" అని రాయబడడం మనం చూస్తాం. ఆ మాటలను బట్టి కొందరు ఇతను యెహోవా దేవుని యాజకుడని భావిస్తుంటారు కానీ దానికి సరైన ఆధారం లేదు. ఆకాలంలో అన్య దేవుళ్ళకు కూడా యాజకులు ఉండేవారు. ఇతను కూడా వారిలో ఒకడైయుండవచ్చు.

నిర్గమకాండము 2:18-20 వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతొ అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.

ఈ వచనాలలో మోషే చేత సహాయం పొందిన మిద్యాను యాజకుడి కుమార్తెలు ఏడుగురూ తమ తండ్రివద్దకు తిరిగిరావడం, రోజూకంటే వారు ముందుగా రావడం గమనించిన వారి తండ్రి వారిని ప్రశ్నించగా వారు జరిగిన సంగతినంతా అతడికి వివరించడం, చివరికి అతను మోషేను భోజనానికి పిలుచుకుని రమ్మని వారిని వెనక్కు పంపించడం మనం చూస్తాం. ఈ మిద్యాను యాజకుడికి రగూయేలు‌ మాత్రమే‌ కాకుండా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. "హోబాబు" (న్యాయాధిపతులు 4:11), "కేయిను" (న్యాయాధిపతులు 1:16), "యిత్రో" (నిర్గమకాండము 3:1). ఎందుకంటే ఆ కాలంలో ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ పేర్లు ఉండడం సర్వసాధారణం.

ఇక ఈ రగూయేలు కుమార్తెల గురించి మనం ఆలోచిస్తే వారు తమ తండ్రి మందలను బావివద్దకు తోలుకుపోవడాన్ని బట్టి పని విషయంలో శ్రద్ధకలిగినవారిగా మనకు కనిపిస్తున్నారు‌. పైగా మందకాపరులు వారిని తోలివేసినప్పుడు వారి సహనం కూడా మనకు కనిపిస్తుంది. ప్రతీరోజూ వారికి అలాంటి పరిస్థితే ఎదురై ఇంటికి చేరడం ఆలస్యమౌతున్నప్పటికీ వారు తమ‌ మందలను కాచే బాధ్యతను విడిచిపెట్టడం లేదు. ప్రాముఖ్యంగా మోషే వారికి సహాయం చేసినప్పుడు అతడిని తమంతట తాముగా ఇంటికి తీసుకువెళ్ళకుండా తండ్రివద్దకు చేరి జరిగిన విషయమంతా తెలియచేసారు. తండ్రి మాటప్రకారమే అతడిని పిలుచుకుని వచ్చారు. ఈవిషయంలో వారు తమ‌ తండ్రి పరువుకు ఎలాంటి ఆటంకం‌ కలగకుండా జాగ్రత కలిగినవారిగా ఉన్నారు.

నిర్గమకాండము 2:21 మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.

ఈ వచనంలో మోషే రగూయేలు ఇంటిలో నివసించడానికి సమ్మతించినట్టు, తర్వాత అతను తన ఏడుగురు కుమార్తెలలో సిప్పోరా అనే కుమార్తెను మోషేకు భార్యగా ఇచ్చినట్టు మనం చూస్తాం. పరదేశిగా తన ఇంట్లో‌ ప్రవేశించిన మోషేకు, రగూయేలు‌ తన కుమార్తెను‌ ఇచ్చి వివాహం చేసాడంటే మోషే ఆ ఇంట్లో ఎంత బాధ్యతగా నిజాయితీగా నడుచుకునేవాడో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వీరి వివాహం జరగడానికి మధ్యకాలంలో మోషే యెహోవా దేవుని‌ గురించి ఆ కుటుంబానికి‌ బాగా ప్రకటించి, యెహోవా దేవునితట్టు తిరిగిన సిప్పోరానే మోషే వివాహం చేసుకునియుండవచ్చు.‌ ఎందుకంటే తర్వాత కాలంలో‌ మోషే మామయైన యిత్రో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడిపించబడినప్పుడు మోషేను‌ కలుసుకుని యెహోవా దేవుణ్ణి స్తుతించి, ఆయనకు బలులు అర్పించి, ఎంతగానో కొనియాడినట్టు మనం చదువుతాం (నిర్గమకాండము 18:6-12). సిప్పోరా కూడా మోషేతో కలసి ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో యెహోవా అతన్ని చంపాలని చూసినప్పుడు "ఆయనను గుర్తించి" "అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని" (ఆదికాండము 17:10) తన బిడ్డకు సున్నతి చేసింది (నిర్గమకాండము 4:24,25). కాబట్టి ఈ సిప్పోరా యెహోవా దేవుణ్ణి ఎరిగిన విశ్వాసి అనడంలో ఎలాంటి సందేహం‌ లేదు.

నిర్గమకాండము 2:22 ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.

ఈ వచనంలో మోషే సిప్పోరాలకు ఒక కుమారుడు జన్మించడం మోషే అతనికి నేను పరదేశిని అనే భావంలో గెర్షోము అని పేరుపెట్టడం మనం చూస్తాం. అయితే మోషే దేవునిమాట ప్రకారం మిద్యాను నుండి ఐగుప్తుకు చేరేసరికి గెర్షోము కాకుండా మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఆ రెండవ కుమారుడికి మోషే యెహోవా తనను ఫరో చేతినుండి తప్పించినందుకు గుర్తుగా ఎలియెజెరు అని పేరు పెట్టాడు‌ (నిర్గమకాండము 18: 4).

నిర్గమకాండము 2:23 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.

ఈ వచనంలో మోషేను చంపడానికి ప్రయత్నించిన ఫరో చనిపోవడం, ఇశ్రాయేలీయులు తమకు కలుగుతున్న కష్టాన్నిబట్టి చేసిన ప్రార్థనలు దేవునియొద్దకు చేరడం మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు అబ్రాహాముతో పలికిన మాటల ప్రకారం అతని సంతతి తమది‌కాని దేశంలో బానిసలుగా ఉండవలసిన 400 సంవత్సరాలకు ఇది ముగింపు సమయం (ఆదికాండము 15:13-14). అందుకే పై వచనంలో "ఇశ్రాయేలీయుకు పెట్టిన మొర దేవునియొద్దకు చేరినట్టు రాయబడింది" ఇస్సాకు పాలువిడిచిన రోజు‌నుండి, మోషే ఐగుప్తునుండి‌ ఇశ్రాయేలీయులను విడిపించేంత వరకూ మధ్య‌ ఉన్న సమయమే 400 సంవత్సరాలు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి‌ ఈ వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు‌ ఐగుప్తులో ఎంతకాలం నివసించారు? 400/430/215?

నిర్గమకాండము 2:24,25 కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల మూలుగును విని, వారి పితరులతో ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, వారిని‌ చూసినట్టు, వారిపై లక్ష్యముంచినట్టు ప్రత్యేకంగా రాయబడడం‌ మనం చూస్తాం. అంటే ఈ సమయానికి ముందు దేవుడు వారి మూలుగును వినలేదని‌, పితరులతో ఆయన చేసిన నిబంధన ఆయనకు జ్ఞాపకం‌లేదని, ఆ ప్రజలను చూడలేదని‌, వారిపై లక్ష్యముంచలేదని‌ అర్థం కాదు కానీ ఆదికాండము 15:13-14లో అబ్రాహాముతో ఆయన పలికినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించడానికి ఆయన ముందుగానే నిర్ణయించిన సమయం. ఆ విడుదల సమీపంగా ఉందని తెలియచెయ్యడానికే "దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను" అని ప్రత్యేకంగా రాయబడింది.

దీనిని‌ బట్టి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. శ్రమలనుండి మన‌ విడుదల, బాధలనుండి మనకు ఓదార్పు మన‌ దేవుడు నిర్ణయించిన సమయంలోనే కలుగుతుంది. అప్పటివరకూ ఆయనకోసం మనమంతా ఓర్పుగా కనిపెట్టాలి. దీనికి‌ మించి మరో మార్గమంటూ ఏమీలేదు. యోసేపు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితినే మనం గమనిస్తాం.

అదేవిధంగా, ఇక్కడ దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చదువుతాం. ఆ నిబంధనే ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి కనానుకు చేర్చడం (ఆదికాండము 15:13-21, 46:3,4). దేవుడు పితరులతో చేసిన ఈ నిబంధనను బట్టే ఇశ్రాయేలీయులకు విడుదల‌ కలిగి కనాను దేశం స్వాస్థ్యంగా లభించింది. దీనికి వారి నీతిగల‌‌ ప్రవర్తన ఎంతమాత్రం కారణం‌ కాదు (ద్వితీయోపదేశకాండము 4:37,38, 9:4-6). ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రవర్తన ప్రతీ సమయంలోనూ‌ దేవునికి ప్రతికూలంగానే ఉంది. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా విగ్రహారాధన చేసేవారు, దెయ్యాలకు బలులు అర్పించేవారు (లేవీయకాండము 17:7, యెహెజ్కేలు 20:7,8). కానీ దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన ప్రమాణాన్ని బట్టే ఈ సమయంలో‌ వీరికి విడుదల నిర్ణయించి, మోషే ద్వారా దానిని జరిగించబోతున్నాడు.

మనం రక్షించబడి పరలోకం చేరడానికి కూడా మనం చేసిన నీతిక్రియలు కారణం కాదు. ఎందుకంటే మనమందరమూ ఏదో ఒక విషయంతో తప్పిపోయే పాపులమే. కానీ తండ్రియైన దేవుడు యేసుక్రీస్తుకు చేసిన వాగ్దానాన్ని బట్టి మాత్రమే మనం రక్షించబడి పరలోకం చేరుకోబోతున్నాం (తీతుకు 1:3). కాబట్టి మన రక్షణ విషయంలో ఆయనను ఎంతగానో‌ స్తుతించి విధేయత చూపించబద్ధులమై ఉన్నాము.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.