పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం;,4:1, 4:2, 4:3,4 , 4:5 , 4:6,7 , 4:8,9 , 4:10 , 4:11 , 4:12, 4:13 , 4:14 , 4:15 , 4:16,17 , 4:18, 4:19 , 4:20 , 4:22,23, 4:24 , 4:25,26 , 4:27,28 , 4:29-31

 నిర్గమకాండము 4:1

అందుకు మోషే చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా-

ఈ వచనంలో మోషే, దేవుడు తనకు గత అధ్యాయపు ముగింపులో ఇశ్రాయేలీయుల నిర్గమం గురించి తెలియచేసిన మాటలకు స్పందిస్తున్నాడు. అయితే ఇక్కడ మోషే గత అధ్యాయం 18వ వచనంలో "వారు నీమాట విందురు" అనే దేవునిమాటకు విరుద్ధంగా ఈమాటలు పలకడం లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు "వారు నీమాట విందురు" అన్నపుడు "మోషే వారిదగ్గరకు వెళ్ళి దేవుడు చేయమన్న సూచకక్రియలను చేసాక జరిగేదాని గురించి చెబుతున్నాడు". అప్పుడు మాత్రమే ఆ ప్రజలంతా మోషే చెప్పినమాటలు నమ్మి ఫరో వద్దకు వెళ్ళారు (నిర్గమకాండము 4:30)

కాబట్టి, ఇక్కడ మోషే దేవునికి‌ ఇటువంటి ప్రత్యుత్తరమివ్వడంలో, అతనికి దేవునిమాటల పట్ల ఎలాంటి అవిశ్వాసం లేదు కానీ, ఆ ప్రజలవైఖరిని బట్టే అలా మాట్లాడవలసి‌వచ్చింది. ఎందుకంటే గతంలోనే వారు మోషే విషయంలో అభ్యంతరపడి అతనిని తిరస్కరించినట్టు మనం చూసాం (అపో.కార్యములు 7:35) . ఒకవేళ మోషే దేవునితో ఇటువంటి సంభాషణ జరపకుండా ఆ ప్రజల‌ వద్దకు వెళ్ళి, దేవుడు సెలవిచ్చిన మాటలు వారికి తెలియచేసినప్పటికీ వారు అదంతా నమ్మడం అసాధ్యం.

అయితే కొందరు భావిస్తున్నట్టుగా మోషే, దేవుడు చెప్పిన పనినుండి తప్పించుకోవడానికే ఈవిధంగా చెబుతుంటే దేవుడు దానిని చాలా తీవ్రంగా ఖండించును. కానీ ఆయన మోషే అడిగిన ప్రతీదానికీ సానుకూలంగా సమాధానం ఇస్తూ సూచకక్రియలను కూడా అనుగ్రహిస్తున్నాడు. దీనిగురించి క్రింది వచనాలలో కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.

నిర్గమకాండము 4:2
యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.

ఈ వచనంలో దేవుడు మోషే చేతిలోని కఱ్ఱ గురించి అది ఏమిటని ప్రశ్నించడం దానికి మోషే బదులివ్వడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మోషే చేతిలో ఉన్నది ఏంటో తెలియకే ఈ విధంగా ప్రశ్నించడం లేదు. దేవుడు త‌న ప్రత్యక్షతలలో భక్తుల దృష్టిని కొన్ని వస్తువులపైకి మళ్ళించి, వాటిద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వడానికి అలా ప్రశ్నించడం తరచుగా మనకు కనిపిస్తుంది (యిర్మియా 1:11,13 ఆమోసు 7:8 , 8:2 , జెకర్యా 4:2, జెకర్యా 5:2).

మోషే అరణ్యంలో మందలను కాస్తున్నాడు కాబట్టి, కాపరుల చేతిలో కఱ్ఱ ఉండడం సహజం అని మనందరికీ తెలుసు, దానిని కోల అని కూడా అంటారు (లేవీకాండము 27:32). భక్తుడైన దావీదు ఒక సందర్భంలో దేవునిని తన కాపరిగా వర్ణిస్తూ "నీ దుడ్డుకఱ్ఱయూ, నీదండమునూ నన్ను ఆదరించును" అని పలుకుతాడు (కీర్తనలు 23:4). ఎందుకంటే కాపరి చేతిలోని ఒకే కఱ్ఱ క్రూరజంతువుల భారినుండి మందను కాపాడేటపుడు దుడ్డుకఱ్ఱగా, దారితప్పిన మందను శిక్షించి సరైనమార్గంలో నడిపించేటపుడు దండముగా ఇలా రెండు కార్యాలనూ జరిగిస్తుంది. అందుకే దావీడు "నీదుడ్డుకఱ్ఱయూ, నీదండమునూ నన్ను ఆదరించును అని పలుకుతూ, దేవుడు తనను శత్రువులనుండి కాపాడేవాడు మాత్రమే కాదనీ, తను దారితప్పినపుడు శిక్షించి సరిచేసేవాడని కూడా సాక్ష్యమిస్తున్నాడు.

నిర్గమకాండము 4:3,4
అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను. అప్పుడు యెహోవానీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టు కొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.

ఈ వచనంలో దేవుడు, తన చేతిలోని కఱ్ఱ ద్వారా మోషేకు ఒక సూచన అనుగ్రహించడం మనం చూస్తాం. ఆయన తన భక్తులద్వారా చేయించిన అద్భుతాలలో ఇది మొదటిది. దీనికి కారణమేంటో క్రింది వచనంలో చూద్దాం. అయితే ఇక్కడ దేవుడు మోషేకు ఆ కఱ్ఱ పాములా కనిపించేలా కనికట్టు చెయ్యడం లేదు. నిజంగానే జీవం లేని ఎండిపోయిన కఱ్ఱను పాముగా, ఆ పామును మరలా కఱ్ఱగా మార్చాడు. సర్వసృష్టికర్తగా ఇది ఆయనకు సాధ్యమే, ఇంకా వివరంగా చెప్పాలంటే ఇలాంటి అద్భుతం ఆయనకు మాత్రమే సాధ్యం (ఐగుప్తీయులు కూడా ఇలా చేసారుగా అనే ప్రశ్నకు ఆ సందర్భంలో సమాధానం చూద్దాం).

అదేవిధంగా ఇక్కడ మోషే ఆ పామును చూసి పారిపోయినట్టు మనం చూస్తున్నాం‌. కానీ వెంటనే దేవుడు ఆ పాము తోకను పట్టుకోమని ఆజ్ఞాపించినపుడు అతను ఆయన ఆజ్ఞకు లోబడి దాని తోకను పట్టుకున్నాడు. ఇక్కడ మోషేకు దేవునిపట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ఆజ్ఞలను పాటించే విధేయత మరోసారి బహిర్గతమౌతున్నాయి. అందుకే అతను దేవుడు ఆజ్ఞాపించగానే అప్పటివరకూ తాను భయపడి పారిపోయిన పాము తోకను పట్టుకోవడానికి వెనుకాడలేదు. దీనిని బట్టి మన మనసులో ఎటువంటి భయాలు కలుగుతున్నప్పటికీ, ఆ భయాల కారణంగా దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చేవారంగా ఉండకూడదు. దేనికో, ఎవరికో భయపడి దేవుని పరిచర్య విషయంలో వెనుకడుగు వెయ్యకూడదు.

నిర్గమకాండము 4:5
ఆయనదానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.

ఈ వచనంలో దేవుడు మోషేకు అక్కడ చూపించిన అద్భుతాన్ని అతను ఇశ్రాయేలీయుల మధ్య చెయ్యడం ద్వారా, మోషేకు ఆయన ప్రత్యక్షమైనట్టు వారు నమ్ముతారని చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ మనం "దేవుడు అద్భుతాలను చెయ్యడం వెనుకున్న కారణాన్ని గమనించగలం". ఎందుకంటే ఇప్పుడు దేవుడు మోషేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి, ఆయన చెప్పిన మాటలను ప్రకటించమంటున్నాడు. కానీ వారు ఆ మాటలు ఊరికే చెబితే నమ్మరు కాబట్టి అవి దేవుని మాటలే అని వారు విశ్వసించేలా ఈ అద్భుతాలను రుజువులుగా చేయిస్తున్నాడు. ఈవిధంగా పాతనిబంధనలో అయినా సరే క్రొత్త నిబంధనలో అయినా సరే, దేవుడు ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా అద్భుతాలను చేయించింది, ఆయన ప్రత్యక్షతనూ, ఆయన మాటలనూ దృఢపరచడానికి మాత్రమే.

ఉదాహరణకు;
మొదటి రాజులు 18:36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను-యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, "ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు" ఈ దినమున కనుపరచుము.

ఈవచనంలో ఏలియా ప్రార్థనచేస్తూ తాను దేవుని ప్రవక్తను అనీ, తాను పలికినవన్నీ ఆయన‌ మాటలే అని ప్రజలు విశ్వసించడానికి రుజువుగా ఆయనను అద్భుతం చెయ్యమని అడుగుతున్నాడు. దేవుడు అక్కడ అదేవిధంగా చేసి, ఏలియా పలికినమాటలన్నీ ఆయనమాటలే అని ఇశ్రాయేలీయులకు దృఢపరిచాడు.

యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడాని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలను (క్రియలు) చేసింది, తనను దేవుడు పంపాడడనడానికి సాక్ష్యంగానే అని చెప్పబడడం‌ మనం చూస్తున్నాం.

మార్కు సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన "సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను". ఆమేన్‌.

ఈ వచనంలో అపోస్తలులు వాక్యాన్ని ప్రకటిస్తున్నపుడు, వారి చేత చెయ్యబడుతున్న అద్భుతాల ద్వారా ఆ వాక్యం స్థిరపరచబడుతున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి, ఏకాలంలో అయినా సరే భక్తులకు లభించిన దేవుని ప్రత్యక్షతనూ, వారి మాటలనూ ప్రజలు విశ్వసించడానికి మాత్రమే అద్భుతాలు చెయ్యబడ్డాయి. అదేవిధంగా ఆయన మాటలను నమ్మనివారిపై ఆ అద్భుతాలు తీర్పరులుగా కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే కొందరు అవి చూసి కూడా ఆయన వాక్కును‌ విశ్వసించలేదు. అందుకే హెబ్రీగ్రంథ కర్త కూడా ఈ అద్భుతాల గురించి ఏమని సాక్ష్యమిస్తున్నాడో చూడండి.

హెబ్రీయులకు 2:3,4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, "దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను".

ఈ కారణం‌చేత దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే సంపూర్తి చెయ్యబడి పూర్తి వాక్యం (బైబిల్) మన చేతికి వచ్చిందో, దానికి మరేదీ చేర్చకూడదనే ఆదేశం ఇవ్వబడిందో (ప్రకటన 22:18) అప్పుడే అద్భుతాల ఉద్దేశం నెరవేరిపోయింది. అందువల్ల ఎవరైనా సరే "ఇప్పటికే దృఢపరచబడిన" వాక్యాన్ని బట్టి ఆయనను విశ్వసించాలి తప్ప, దానికి మరలా కొత్త అద్భుతాలకోసం ఎదురుచూడకూడదు. అందుకే నేటికీ కొందరు దుర్బోధకులు అద్భుతాల పేరిట, గారడీ విద్యలనూ, బుటకపు స్వస్థతలనూ చేస్తున్నారు తప్ప, బైబిల్ లో జరిగిన అద్భుతాలవంటి అద్భుతాలను చెయ్యలేకపోతున్నారు. ఉదాహరణకు; ఏలియా దింపినట్టుగా ఎందుకు అగ్నిని దింపలేకపోతున్నారు?యేసుక్రీస్తు లేపినట్టుగా చనిపోయినవారిని ఎందుకు లేపలేకపోతున్నారు? అపోస్తలులు చేసినట్టుగా పుట్టు కుంటివారిని ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఎందుకంటే వాటిని దేవుడు తన భక్తులచేత ఎందుకు చేయించాడో ఆ కార్యం (వాక్యాన్ని స్థిరపరచడం) నెరవేరిపోయాక అటువంటి సామర్థ్యాన్ని ఆయన ఇక మరెవరికీ‌ ఇవ్వడు.

అదేవిధంగా క్రైస్తవసమాజంలో చాలామంది బోధకులు మేము దేవుణ్ణి చూసామంటూ, దేవుడు తమకు ప్రత్యక్షమై‌ ఏదో‌ బయలుపరిచాడంటూ మాయమాటలు చెబుతుంటారు. కానీ దేవుడు తన ప్రత్యక్షతలకూ తన మాటలకూ రుజువుగా ఉంచిన అద్భుతాలను మాత్రం చెయ్యలేరు. ఎందుకంటే నేనుపైన చెప్పినట్టుగా, దేవుడు భక్తులకు ప్రత్యక్షమైంది తన వాక్కును తెలియచెయ్యడానికైతే, అద్భుతాలను చేసింది ఆ వాక్కును స్థిరపరచడానికి మాత్రమే. ఎప్పుడైతే ఆ వాక్యం స్థిరపరచబడి మన‌చేతికి వచ్చిందో దానికి కారణమైన ప్రత్యక్షతలను మరలా అనుగ్రహించి, అద్భుతాల‌ను జరిగించవలసిన అవసరం ఆయనకు‌లేదు. పరిశుద్ధ లేఖనాలకు అధనంగా మరేదీ చేర్చబడదు. అందుకే ఎవరెవరో మాకు దేవుని ప్రత్యక్షత వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, మనం వాటిని విశ్వసించేలా దేవుడు ఎటువంటి రుజువులనూ‌ చూపించడం‌ లేదు.

నిర్గమకాండము 4:6,7
మరియు యెహోవానీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.
తరువాత ఆయననీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.

ఈ వచనంలో దేవుడు మరొక అద్భుతం ద్వారా మోషే చేతికి కుష్టురోగం రప్పించడం, మరలా ఆ చెయ్యిని రొమ్ముపై పెట్టి వెనుకకు తీసినపుడు దానిని బాగు చెయ్యడం మనం చూస్తున్నాం. ఈ అద్భుతం భవిష్యత్తులో మోషే ఐగుప్తుపై రప్పించబోయే తెగుళ్ళను కూడా సూచిస్తుంది. ఇక్కడ మోషే తన చేతిని మరలా రొమ్ముపై ఉంచుకుని వెనుకకు తీయగానే ఆ చేతికున్న కుష్టురోగం బాగుపడినట్టు, ఐగుప్తుపై కుమ్మరించబడిన తెగుళ్ళ విషయంలో కూడా అతను ప్రార్థన చెయ్యగానే విడుదల కలిగేది.

నిర్గమకాండము 4:8,9
మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.

ఈ వచనాలలో దేవుడు మోషేకు రెండు అద్భుతాలు చూపించిన తరువాత, ఇశ్రాయేలీయులు ఆ రెండింటిని బట్టీ నమ్మకపోతే ఏటి నీళ్ళు రక్తంగా మార్చబడే మరొక అద్భుతం చెయ్యమనడం మనం చూస్తాం. ఇక్కడ దేవునికి తన ప్రజలపట్ల ఉండే ఓర్పు మనకు కనిపిస్తుంది. ఆయన మోషేను పంపాను‌ అనడానికి రుజువుగా ఏదో ఒక అద్భుతం చేసి వదిలెయ్యడం‌ లేదు. ఎందుకంటే ఆ ఒక్క అద్భుతాన్ని ప్రజలందరూ నమ్మకపోవచ్చు. ఈ కారణంగా ఆయన ఇశ్రాయేలీయుల ప్రజల్లో మొదటి అద్భుతాన్ని బట్టి నమ్మని ప్రజలు కూడా నమ్మగలిగేలా మరో రెండు అద్భుతాలు కూడా చెయ్యమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఆ ప్రజలు మొదటి అద్భుతాన్ని బట్టి మోషేను నమ్ముతారో లేదో అనే సంశయంతో "నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల" అనడం‌లేదు కానీ, మోషేకు ఇశ్రాయేలీయులందరూ తనను తప్పక నమ్ముతారనే నిశ్చయత కలుగచెయ్యడానికే ఈవిధంగా పలికి మరో రెండు అద్భుతాలను కూడా చెయ్యమంటున్నాడు.

నిర్గమకాండము 4:10
అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా-

ఈ వచనంలో‌ మోషే తన లోపాలను దేవునిముందు ప్రస్తావించడం మనం చూస్తాం. చాలామంది ఇక్కడ మోషే పలికిన "నేను మాట నేర్పరిని కాను" అనే మాటలను "మోషే ఐగుప్తీయుల సకల విద్యలనూ అభ్యసించి‌ మాటలయందు ప్రవీణుడైయుండెను" (అపో.కార్యములు 7:22) అనేమాటలతో పోల్చి, మోషే ఇక్కడ తప్పించుకోవడానికే అలా అబద్ధాలు చెబుతున్నాడు తప్ప అతనిలో ఎటువంటి లోపం లేదని బోధిస్తుంటారు. కానీ నేను పైన జ్ఞాపకం‌ చేసినట్టుగా ఇక్కడ మోషే తప్పించుకోవడానికే ఇలాంటి అబద్ధాలు చెబుతుంటే, దేవుడు దానిని తీవ్రంగా పరిగణించి, నువ్వు అబద్ధం చెబుతున్నావని గద్దించేవాడు. కానీ క్రింది వచనాల్లో ఆయన మోషేను బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు.

అలా అని మోషే గురించి స్తెఫెను చెబుతున్నమాటలు కూడా అవాస్తవాలు కావు. అక్కడ మోషే "మాటలయందు‌ ప్రవీణుడు" అంటే అతను స్పష్టంగా మాట్లాడగలడని కాదుకానీ, అతను‌ ఎలాంటి సమస్యకైనా తన మాటలద్వారా మంచి పరిష్కారాన్ని చూపించగల ప్రావీణ్యతగలవాడని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే అతను జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు. అయితే అతను ఆ మాటలు అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేడు. ఎందుకంటే కొందరు తెలివిగా మాట్లాడగలరు కానీ, అందరికీ అర్థమయ్యేవిధంగా మాట్లాడలేరు. పైగా మోషేకు నోటిమాంద్యం, నాలుకమాంద్యం (నత్తి) కూడా ఉన్నాయి. దీనిగురించి మనం పౌలును కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు.

రెండవ కొరింథీయులకు 10:10 అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునైయున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, "అతని ప్రసంగము కొరగానిదని" యొకడు అనును.

కాబట్టి మోషే, దేవుడు చెయ్యమంటున్న కార్యం నుండి తప్పించుకోవడానికే అలా అబద్ధాలు చెప్పాడని అతనిపై ఆరోపణలు చెయ్యడం సరికాదు. దానికి ప్రతిగా మనందరమూ మోషేయొక్క తగ్గింపును బట్టి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే అతను దేవుడు తనను చెయ్యమంటుంది శక్తివంతమైన కార్యం కాబట్టి తనలో ఉన్న లోపాల కారణంగా దానిని సక్రమంగా చెయ్యలేనని గుర్తించి ఆయనముందు‌ ప్రాధేయపడుతున్నాడు. లక్షలమంది ప్రజలను నడిపించే మహా గొప్పభాగ్యం దక్కింది దీనివల్ల నాకు కూడా ఎంతో ఘనత కలుగుతుందని సంబరపడడం లేదు. కాబట్టి మనం కూడా మోషేలా దేవునికార్యాల‌ విషయంలో మన లోపాలను బలహీనతలను బట్టి తగ్గించుకునేవారంగా ఉండాలి.‌ అప్పుడు ఆయన మోషేకు‌ సూచించినవిధంగా మనకు కూడా తగిన పరిష్కారాన్ని సూచిస్తాడు (12వ వచనం).

అదేవిధంగా ఇక్కడ మోషే "నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను" అని పలకడం‌ వెనుక దేవుడు తనతో మాట్లాడుతున్నపుడు, అతనిద్వారా అద్భుతాలను చేయిస్తున్నపుడు తనలో‌ఉన్న ఆ నోటిమాంద్యం, నాలుకమాంద్యం‌ కూడా స్వస్థపరచబడుతుందని అతను అనుకుని ఉండవచ్చు. అందుకే "నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి యైనను" అని ప్రత్యేకంగా దేవుడు తనతో మాట్లాడుతున్న ఆ సమయం గురించి ప్రస్తావిస్తున్నాడు. కానీ దేవుడు అది మాత్రం చెయ్యడం లేదు. కాబట్టి మనం అనుకునే విధానంలో ఆయన అన్నీ పరిష్కరించడు. ఆయన చిత్తానుసారంగానే అన్నిటినీ జరిగిస్తాడు. లేని కుష్టురోగం కలుగచేసి, మరలా దానిని స్వస్థపరచిన ఆయనకు మోషేకు ఉన్న నోటి, నాలుక మాంద్యాలను తీసివెయ్యడం పెద్ద విషయమేమీ కాదు కదా!

నిర్గమకాండము 4:11
యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

ఈవచనంలో దేవుడు మోషే అభ్యంతరానికి జవాబుగా అంగవైకల్యం ఉన్నవారిని తానే పుట్టిస్తున్నట్టు తెలియచెయ్యడం మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో అంగవైకల్యం అనేది దేవుని అనుమతితోనే ప్రవేశిస్తుంది. ఈ కారణంగా అటువంటి లోపాలను మనం సాతానుకు ఆపాదించకూడదు. ఎందుకంటే దేవుడు అనుమతించిన ఈ శారీరక లోపాలలో మనకు గొప్ప ఆదరణ ఉంది. మన శరీరంలో ఉన్న ఏలోపమైనా ఆయన అనుమతినే సూచిస్తుంది. కాబట్టి మనం అటువంటి లోపాలను సాతానుకు ఆపాదించి, మనంతట మనంగా దేవుడు ఇస్తున్న ఆదరణను కోల్పోకూడదు. దేవుడు తన చిత్తానుసారంగా మానవుల ఆయుష్షులో హెచ్చుతగ్గులు పెట్టినట్టే, అవయవాల విషయంలో కూడా ఇటువంటి వైకల్యాలను పెట్టాడు.

అయితే కొందరు దీనివల్ల దేవుడు వారికి అన్యాయం‌ చేసాడని నిందిస్తుంటారు. కానీ సృష్టికర్త అయిన దేవునికి తన సృష్టి విషయంలో ఒక చిత్తం‌ ఉంటుంది. ఆయన దానిని అనుసరించే సమస్తాన్ని జరిగిస్తాడు. ఒకవేళ ఆయనకంటూ ఒక చిత్తం లేకుండా మానవులు కొలిచే న్యాయ అన్యాయాలను బట్టి ప్రవర్తిస్తుంటే అప్పుడు ఆయనను సార్వభౌముడు, సర్వాధికారి అని సంబోధించడంలో అసలు అర్థమే లేదు. ఇందువల్ల ఎవరైనా దేవునికి సంబంధించిన విషయాలను ప్రశ్నిస్తున్నపుడు ఆయన పరిధిలోకి వెళ్ళి ప్రశ్నించాలి.

కాబట్టి, ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు తన చిత్తప్రకారమే అంగవైకల్యాన్ని అనుమతించాడని, ఆ అధికారం ఆయనకు ఉందని మనం గుర్తించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వీరిగురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి.

యోహాను సువార్త 9:2,3 ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.

ఈరోజు అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు చెయ్యలేని పనులెన్నో అంగవైకల్యం గలవారు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది తమకున్న వైకల్యాలను‌ అధిగమించి, దేవునికొరకు ప్రయాసపడుతున్నారు. అందువల్ల వీరందరూ తీర్పుదినాన అన్ని అవయవాలు సరిగా ఉండి సోమరులుగా బ్రతుకుతున్నవారిపై తీర్పరులుగా ఉండబోతున్నారు. దేవుడు ఇటువంటి కారణంతో కూడా కొందరి జీవితంలో అంగవైకల్యాన్ని అనుమతించాడని మనం నిస్సందేహంగా భావించవచ్చు.

అదేవిధంగా, దేవుడు కొందరిని‌ అంగవైకల్యంతో పుట్టించి, వారిని అలా విడిచిపెట్టెయ్యలేదు. అందుకే మోషే‌ ధర్మశాస్త్రంలో వీరివిషయంలో హెచ్చరికలు చెయ్యబడడం మనం చూస్తాం.

లేవీయకాండము 19: 14 ​​చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.

అంతేకాకుండా, పాతనిబంధన దేవాలయంలో సేవచేసే యాజకుల విషయంలో కూడా వీరిని మినహాయించి, వీరిపై కష్టతరమైన భారం మోపబడకుండా విశ్రాంతిని అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుడు వారిపై చూపిస్తున్న ఆదరణను మనకు తెలియచేస్తుంది. పై వచనంలో "నీ దేవునికి భయపడవలెను" అనేమాటలు వారి విషయంలో మన‌ బాధ్యతను కూడా గుర్తుచేస్తున్నాయి.

నిర్గమకాండము 4:12
కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు మోషే అభ్యంతరానికి పరిష్కారం సూచిస్తూ నేను నీకు తోడైయుంటానని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా, దేవుడు మనం ఊహించిన, కోరుకున్న విధానంలో మన‌లోపాలకు పరిష్కారం చూపించకపోవచ్చు కానీ, ఆయన‌ పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా మాత్రం ఆయన తోడైయుంటాడు. ఆ పని విషయంలో కావలసిన సామర్థ్యాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు.

పౌలు విషయంలో కూడా మనం ఇటువంటి పరిస్థితినే గమనిస్తాం;

రెండవ కొరింథీయులకు 12:7-9 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. "అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను". కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

నిర్గమకాండము 4:13
అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా-

ఈ వచనంలో మోషే అప్పటివరకూ అతను లేవనెత్తిన అభ్యంతరాలకూ, తన సామర్థ్యలేమికీ దేవుడు తగిన పరిష్కారాలను చూపించినప్పటికీ ఇంకా ఆ దైవకార్యానికి తాను అనర్హుడనని చింతిస్తూ "నీవు పంప తలంచిన వానినే పంపమని" పలకడం మనం చూస్తాం. దీనివల్ల మోషే దేవునికి కోపం రేపినట్టుగా క్రింది వచనంలో గమనిస్తాం. ఎందుకంటే మనకున్న సామర్థ్యలేమి, లోపాలను గురించిన ఆందోళన దేవునిముందు మనల్ని మనం తగ్గించుకునేలా చెయ్యాలే తప్ప, ఆయన మనకు అప్పగించిన బాధ్యతలనుండి తప్పించేవిధంగా ఉండకూడదు. ఎందుకంటే మనం‌ ఆయనముందు మనకున్న లోపాలను బట్టి, సామర్థ్యలేమిని బట్టి తగ్గించుకునేది "నా స్వంత శక్తి చేత ఏమీ చెయ్యలేను, నీ కార్యాన్ని జరిగించడానికి‌ తగిన సామర్థ్యం నీవే అనుగ్రహించమని" వేడుకోవడానికి, ఆ కార్యం విజయవంతమైనపుడు సమస్త మహిమ ఘనతలను ఆయనకే ఆపాదించడానికి తప్ప ఆయన పనినుండి మినహాయించబడడానికి కాకూడదు. కాబట్టి దేవునిముందు తగ్గింపు కలిగియుండడానికీ, ఆ తగ్గింపు మనల్ని ఆయనపని నుండి వైదొలగిపోయేలా చెయ్యడానికి మధ్య ఉన్న వ్యత్యాసం‌ మనం గమనించాలి. మొదటిదానిని మనం అన్వయించుకోవాలి, రెండవదానిని జయించగలగాలి.

అయితే కొందరు యూదా పండితులు మోషే ఇక్కడ మెస్సీయను పంపమని వేడుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మెస్సీయను గురించిన అవగాహన ఇశ్రాయేలీయులకు మొదటినుండీ ఉంది. ఇందువల్ల యోసేపు నిశ్చయముగా దేవుడు మిమ్మును‌ చూడవచ్చును అని భవిష్యత్తును ప్రవచించినప్పుడు (ఆదికాండము 50:24) వారు మెస్సీయ దిగివచ్చి వారిని‌ ఐగుప్తునుండి విడిపిస్తాడని భావించియుండవచ్చు‌.

నిర్గమకాండము 4:14
ఆయన మోషేమీద కోపపడిలేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును.

ఈ వచనంలో మోషే పలికినమాటలను బట్టి దేవుడు అతనిపై కోపపడడం, తరువాత అహరోను గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. నేను‌ మొదటినుండీ చెబుతున్నట్టుగా మోషే తనలో ఉన్న సామర్థ్యలేమి, లోపాలను‌ దృష్టిలో‌ పెట్టుకుని దేవుడు తనను చెయ్యమంటున్న కార్యానికి తాను అనర్హుడనని గ్రహించి‌ ఆవిధంగా మాట్లాడుతున్నాడు తప్ప, దేవునిమాటలకు విముఖత చూపాలనే‌ ఉద్దేశం అతనిలో‌ లేదు. అయితే అతను లేవనెత్తిన ప్రతీ అభ్యంతరానికీ దేవుడు పరిష్కారం చూపించినప్పుడు కూడా అతను ఇంకా తనలో ఉన్న లోపాలు సామర్థ్యలేమి గురించే ఆలోచించి "అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపమని"‌ ప్రాధేయపడడాన్ని బట్టి దేవుడు అతనిపై కోపపడ్డాడు. కానీ ఆ కోపాన్ని బట్టి ఆయన మోషేను తన సన్నిధినుండి‌ వెలివెయ్యలేదు, శిక్షించనూలేదు కానీ మరో సూచనగా అహరోనును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునిలో కలిగే కోపం గురించి మనం రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి మనం‌ ఆయనకు అవిధేయత చూపే ఉద్దేశం లేనప్పటికీ ఆయన పని విషయంలో మనకున్న ఆందోళనలను బట్టి వెనుకడుగు వేస్తున్నపుడు మనల్ని ఆ పనివైపు నడిపించే కోపం‌. రెండు ఆయన ఆజ్ఞలకు అవిధేయులుగా ప్రవర్తిస్తున్నపుడు క్రమశిక్షణ చేసే ‌కోపం.

అదేవిధంగా దేవుడు ఇక్కడ అహరోనును మోషేకు సహాయంగా పంపడాన్ని బట్టి, మోషే దేవునిముందు అభ్యంతరాలను లేవనెత్తినందుకే అహరోనును రంగంలోకి దించాడని, మోషే ఆ విధంగా చెయ్యకుండా ఉండుంటే, యాజకత్వం కూడా అతనికే దక్కేదని, ఈవిధంగా మోషే దేవునిముందు తప్పించుకోవాలని ప్రయత్నించడాన్ని బట్టి యాజకత్వాన్ని‌ కోల్పోయాడని భావిస్తుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం‌ కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ముందుగానే అహరోనును సిద్ధం చేసినట్టుగా "ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును" అని మాట్లాడుతున్నాడు. పైగా మోషేలో ఉన్న నోటి, నాలుక మాంద్యాలు వాస్తవమైనపుడు అతను సరిగా మాట్లాడలేడు కాబట్టి, అతనికి ఆ విషయంలో తప్పకుండా సహాయం‌ అవసరం. అందుకే దేవుడు మోషే తన లోపాలను ఆయనముందు అభ్యంతరాలుగా ప్రస్తావించకముందే ఆ పనిలో అహరోనును సహకారిగా నిర్ణయించి, అతనిని కలుసుకునేలా ఐగుప్తునుండి మిద్యానుకు పయనమయ్యేలా ప్రేరేపించాడు.

మరోవిషయం ఏమిటంటే, దేవుడు ఇక్కడ అహరోను గురించి "అతను బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును" అంటున్నాడు. మోషే మాటలయందు ప్రవీణుడే (జ్ఞానంతో మాట్లాడగలడు) కానీ ఆ మాటలను ప్రజలకు అర్థమయ్యేశైలిలో మాట్లాడలేడు. పైగా అతనికి నోటిమాంద్యము, నాలుక మాంద్యాలు కూడా ఉన్నాయి. అహరోను బాగా మాట్లాడగలడు కానీ ఏ సమయంలో దేనిగురించి మాట్లాడాలో ఎలాంటి జ్ఞానంతో మాట్లాడాలో అతనికి తెలియదు. కాబట్టి దేవుడు ఇక్కడ వీరిద్దరినీ ఒకరికి ఒకరు సహకారులుగా నియమించి తన‌ కార్యాన్ని‌ నెరవేర్చుకోబోతున్నాడు. మన సంఘంలో కూడా మనం ఇటువంటి పద్ధతిని అనుసరించాలి. దేవుడు‌ మనకు పంచియిచ్చిన తలాంతులతో ఒకరికి ఒకరు సహాయం‌ చేసుకుంటూ, దేవుని పనిని‌ విజయవంతంగా పూర్తి చెయ్యాలి.

నిర్గమకాండము 4:15
నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించె దను.

ఈ వచనంలో నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా మోషే మాటలయందు ప్రవీణుడై, దేవుడు తనతో చెబుతున్నమాటలను బాగా అర్థం చేసుకుని వాటిని తిరిగి జ్ఞానయుక్తంగా వివరించగలడు కాబట్టి, అతను దేవునినుండి పొందుకున్న మాటలు అహరోనుకు వివరించాలని, ఆయన మోషే నోటికీ అహరోను నోటికీ తోడైయుంటానని చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన మోషేలోనూ అహరోనులోనూ అప్పటికే రెండు వేరు వేరు ప్రత్యేకతలను పెట్టాడు. ఒకరు జ్ఞానయుక్తంగా మాట్లాడగలరు, మరొకరు ప్రజలకు అర్థమయ్యే శైలిలో మాట్లాడగలరు. అయినప్పటికీ ఆయన‌ మరలా మీ నోటికి తోడైయుంటానని చెబుతున్నాడు.

దీనిని బట్టి, ఆయన మనలో మొదటినుండే కొన్ని ప్రత్యేకతలను పెట్టినప్పటికీ, ఆయన నియమించిన ప్రత్యేకకార్యంలో పాల్గొనడానికి అవి సరిపోవు. అప్పుడు ఆయన సహాయం (తోడు) తప్పకుండా అవసరమౌతుంది. అందుకే మనం ఎన్ని ప్రత్యేకతలతో ఉన్నప్పటికీ, దేవుని‌కార్యం విషయంలో తగ్గింపు కలిగి పదే పదే ఆయనను సహాయం వేడుకోవాలి.

నిర్గమకాండము 4:16,17
అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.

ఈ వచనాలలో మోషేకు అహరోను ఏవిధంగా సహాయంగా ఉంటాడో, మోషే దేనిద్వారా సూచకక్రియలను చెయ్యాలో దేవుడు అతనికి మరోసారి తెలియచెయ్యడం మనం చూస్తాం.
ఇక్కడ మోషే అహరోనుకు దేవునిగా ఉంటాడు అనేమాట "దేవుని ప్రతినిధిగా" అతనితో మాట్లాడతాడనే భావంలో చెప్పబడింది. అంతేతప్ప అప్పటినుండి మోషే కూడా దేవుడైపోయాడనే అర్థం ఇందులో లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది అలంకారంగా‌ చెప్పబడినమాట. ఎందుకంటే "నీవు అతనికి దేవుడవుగా ఉందువు" అనేమాటకు ముందున్న మాటలో "అతడే నీకు నోరుగానుండును" అనేమాట కూడా వాడబడింది. దీనిప్రకారం అహరోను మోషే మాటలను ప్రజలకు అందిస్తాడు కాబట్టి ఎలా అయితే మోషే నోరుగా ఉంటాడని చెప్పబడిందో, అలానే మోషే కూడా దేవునిమాటలను అహరోనుకు తెలియచేస్తాడు కాబట్టి "నీవు అతనికి దేవుడవుగా ఉందువు" అని చెప్పబడింది. అక్కడ అహరోను మోషే నోరుగా మారిపోనట్టే, మోషే కూడా దేవునిగా మారిపోలేదు.

ఇక్కడినుండే ఇశ్రాయేలీయుల ప్రజల్లో తమమధ్య దేవుని ప్రతినిధులుగా వ్యవహరించే న్యాయాధిపతులను దైవాలుగా సంబోధించే పద్ధతి ప్రవేశించింది. వీరిగురించి ఆసాపు కీర్తనలోనూ (కీర్తనలు 82:1-8) యేసుక్రీస్తు మాటల్లో కూడా (యోహాను10:34-36) మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని అవాంతర శాఖలవారు ఈమాటలను అపార్థం చేసుకుని, మనం కూడా దైవాలమే అని బోధించడం మొదలు పెట్టారు. దీనిగురించి‌ వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి.

"వీరు దైవములా?"

అదేవిధంగా యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరించే కొన్ని గుంపులు, ఇక్కడ మోషే అహరోనుకూ, తరువాత ఫరోకూ (నిర్గమకాండము 7:1) దేవునిగా నియమించబడడం చూపించి, యేసుక్రీస్తు కూడా ఆ భావంలోనే దేవుడని రాయబడిందని (యోహాను 1:1) అంతేతప్ప ఆయన తండ్రివంటి దేవుడు కాడని వాదిస్తుంటారు. కానీ లేఖనాలు యేసుక్రీస్తును దేవుడు అని పరిచయం చేసినప్పుడు ఆయన తండ్రివలె సర్వాధికారం గల దేవుడని ( (రోమా 9:5, తీతుకు 2:13) తండ్రితో సమానంగా ఉన్న దేవుడని (పిలిప్పీ 2:6) నిత్యుడైన దేవుడని ( (ప్రకటన 1:8, యెషయా 9:6) కచ్చితమైన ఆధారాలను ఇస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని, మోషే దేవునిగా నియమించబడడంతో పోల్చి ఆయన కూడా మోషేవంటి దేవుడే తప్ప తండ్రి (యెహోవా) వంటి దేవుడు కాడని బోధించడం అపవాది కుట్రగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దైవత్వం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింకులద్వారా సూచించిన వ్యాసాలను చదవండి.

"యెహోవా దూత యేసుక్రీస్తు"

"యేసుక్రీస్తు దేవుడా"

"యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటిస్తున్న యూదా మరియు పేతురు రాసిన‌ పత్రికలు"

నిర్గమకాండము 4:18
అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లిసెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఇత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.

ఈ వచనంలో మోషే దేవునిమాట ప్రకారం ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమై, తనమామయైన యిత్రోను దానికి అనుమతి కోరడం మనం చూస్తాం. ఇక్కడ మోషే తనకు దేవుడు ప్రత్యక్షమవ్వగానే తనంతట తానుగా అక్కడినుండి వెళ్ళిపోయి, యిత్రోను అవమానించడం లేదు. ఎందుకంటే మోషే ఐగుప్తునుండి పారిపోయి వచ్చినపుడు యిత్రో అతనిని‌ ఎంతో ఆదరించాడు. నిరాశ్రయుడిగా తనవద్దకు వచ్చిన మోషేను కేవలం మందలకాపరిగా నియమించుకోవడమే కాకుండా తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించాడు. కాబట్టి మోషే ఐగుప్తుకు తిరిగివెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినపుడు తనను ఐగుప్తుకు పంపించమని‌ వినయపూర్వకంగా యిత్రోను కోరుతున్నాడు. దీనినిబట్టి దేవుని ప్రత్యక్షత, ఆయన పని చెయ్యాలనే తపన, మనల్ని వ్యక్తిగత బాధ్యతలనుండి తప్పించేదిగా ఉండకూడదు.

ఇక్కడ యిత్రో కూడా మోషేను ఎటువంటి ఆటంకం కలుగచెయ్యకుండా ఐగుప్తుకు పంపడానికి సిద్ధపడుతున్నాడు. ఒకవేళ అతను తలచుకుంటే ఆటంకం కలిగించేవాడు. ఎందుకంటే ఇప్పుడు మోషేతో పాటు అతని కుమార్తె మరియు ఆమె పిల్లలు కూడా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి మోషే చరిత్రను బట్టి వారికి ఐగుప్తులో ఏదైనా హాని సంభవిస్తుందనే ఆలోచన అతనికి తప్పకవస్తుంది. కానీ అతను మోషే కోరికను మన్నించి, క్షేమముగా వెళ్లుమని చెబుతున్నాడు. ఈవిధంగా దేవుడు మోషే ఐగుప్తు ప్రయాణానికి అనుకూల వాతావరణం కలుగచేస్తున్నాడు. అయితే ఇక్కడ యిత్రో అనుమతిని ఇవ్వకపోయినప్పటికీ మోషే తప్పకుండా అక్కడినుండి వెళ్ళిపోయేవాడు. దానివల్ల యిత్రోనే మోషేతో ఉన్న మంచి సంబంధాన్ని కోల్పోయేవాడు.

అదేవిధంగా ఇక్కడ మోషే యిత్రోకు తనకు దేవుడు ప్రత్యక్షమైన సంగతి చెప్పకుండా, "నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని" చెప్పడాన్ని బట్టి అతను యిత్రోకు అబద్ధం చెబుతున్నాడని కొందరు ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ మోషే‌ చెబుతున్న అబద్ధం‌‌ ఏమీలేదు. ఎందుకంటే ఒక మనిషిగా తన మనసులో తనకు సంబంధించినవారు ఎలా ఉన్నారో చూడాలనే తపన తప్పకుండా కలుగుతుంది. కానీ అతను ఇంతకాలం తనకున్న భయాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళి వారిని చూడలేకపోయాడు. ఇప్పుడు స్వయంగా దేవుడే అతనికి ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు కాబట్టి, తనలో ఆ తపన మరింతగా పెరిగి దానినే యిత్రోకు చెబుతున్నాడు.

అయితే మోషే తనకు దేవుడు ప్రత్యక్షమైన సంగతి యిత్రోకు చెప్పకుండా ఉండడానికి కారణం‌ ఏంటంటే, ఆ సంగతి యిత్రోకు చెప్పవలసిన అవసరం అతనికి లేదు ఎందుకంటే యిత్రో ఇశ్రాయేలీయుడు కాదు. పైగా మోషే ఆ సంగతిని యిత్రోకు చెప్పినపుడు పొరపాటున ఆ విషయం ఐగుప్తుకు చేరితే, మోషే విషయంలో వారు ముందే జాగ్రతపడి, ఇశ్రాయేలీయుల్లో తిరుగుబాటు తలెత్తకుండా అతను ఐగుప్తుకు చేరకుండా అడ్డుకునే ప్రమాదం‌ ఉంది. ఎందుకంటే మిద్యానుకూ ఐగుప్తుకూ మధ్యలో ఎంతో దూరం ఉండదు, పైగా ఆ ఇరు దేశాలమధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి‌ (ఆదికాండము 37:36). ఈవిధంగా మోషే తాను చేయబోతున్న కార్యం‌ విషయంలో తనకారణంగా ముందుగానే ఆటంకాలు తలెత్తకుండా జాగ్రతపడుతూ, యిత్రోకు సగం కారణం‌ మాత్రమే చెబుతున్నాడు.

నిర్గమకాండము 4:19
అంతట యెహోవానీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా-

ఈ వచనంలో దేవుడు మరలా మోషేకు ప్రత్యక్షమై ఐగుప్తుదేశంలో అతన్ని చంపాలి అనుకున్నవారందరూ చనిపోయారు కాబట్టి అక్కడికి తిరిగివెళ్ళమని చెప్పడం మనం చూస్తాం. గతంలో మోషే దేవునితో మాట్లాడుతున్నపుడు తనకున్న లోపాలనూ, సామర్థ్యలేమినీ ఆయనముందు అభ్యంతరాలుగా ప్రస్తావించాడు తప్ప, తన మనసులో ఉన్న భయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకంటే అతను ఐగుప్తీయుడ్ని చంపిన కారణంగా ఫరో మరియు ఆ చంపబడిన ఐగుప్తీయుడి బంధువులు మోషేపై కక్షకట్టడం సహజం. కానీ మోషే దేవునిముందు తన వ్యక్తిగత భయాన్ని అభ్యంతరంగా పెట్టలేదు కానీ, ఆ కార్యం విషయంలో తన అనర్హతను మాత్రమే అభ్యంతరంగా భావించాడు. ఇక్కడ మోషేయొక్క వ్యక్తిత్వం మరోసారి మనకు అర్థమౌతుంది. అయినప్పటికీ హృదయాలను ఎరిగినదేవుడు మోషేను అలా తన భయంలోనే వదిలెయ్యకుండా మరలా ప్రత్యక్షమై ఐగుప్తులో అతనిని చంపాలి అనుకున్నవారంతా చనిపోయారని ధైర్యమిస్తున్నాడు. కాబట్టి దేవునిపని విషయంలో మన వ్యక్తిగత భయాలను లక్ష్యపెట్టకుండా ముందుకు సాగినప్పుడు ఆయనే మనకు తగిన ఆదరణను కలిగిస్తాడు.

నిర్గమకాండము 4:20
మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించు కొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.

ఈ వచనంలో దేవునిచేత ధైర్యపరచబడిన మోషే తన భార్యనూ పిల్లలనూ తీసుకుని ఐగుప్తుకు ప్రయాణమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ "తిరిగివెళ్ళెను" అంటే ప్రయాణమయ్యాడనే మనం అర్థం చేసుకోవాలి తప్ప అక్కడికి పూర్తిగా చేరిపోయాడని కాదు.‌ ఎందుకంటే, క్రింది వచనంలో మరలా దేవుడు అతనితో "ఐగుప్తుకు తిరిగి చేరిన తరువాత" అంటున్నాడు.‌ కాబట్టి మోషే ఐగుప్తుకు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు తప్ప, ఇంకా ఐగుప్తుకు చేరుకోలేదు. మరోవిషయం ఏమిటంటే, మోషే భార్యా పిల్లలు ఐగుప్తుకు చేరకముందే వెనుకకు పంపబడ్డారు. దీనిగురించి క్రింది వచనాల్లో చూద్దాం.

అదేవిధంగా ఇక్కడ మోషే దేవుడు తనతో చెప్పినట్టుగా "దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని" వెళ్ళడం మనం చూస్తాం. దేవుడు తన ద్వారా జరిగించబోతున్న కార్యంలో ఆ కఱ్ఱను కూడా సాధనంగా‌ వాడుకుంటున్నాడు‌‌ కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. కాబట్టి దేవునిపనిలో మనకు సహాయంగా ఉండే పరికరాల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగియుండాలి.

నిర్గమకాండము 4:21
అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెనునీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యము లన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హ్రుదయమును కఠిన పరచెదను,అతడు ఈ జనులను పోనియ్యడు.

ఈ వచనంలో దేవుడు ఐగుప్తుకు చేరాక మోషే చేయవలసిన అద్భుతాల గురించి ప్రస్తావిస్తూ, నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని, కాబట్టి అతను ఆ జనులను పోనియ్యడని చెప్పడం మనం చూస్తాం. తరువాత చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే ఫరో హృదయం మాటిమాటికీ కఠినపరచబడింది. దీనికారణంగా ఐగుప్తుపైనా ఫరో పైనా దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. కొందరు బైబిల్ విమర్శకులు ఈమాటలను ఆధారం చేసుకుని, ఇక్కడ దేవుడే ఫరో క్రూరంగా ప్రవర్తించేలా అతని హృదయాన్ని కఠినపరచి, మరలా ఆ క్రూరత్వానికి శిక్షవిధించాడని, ఇది ఎంతమాత్రం న్యాయమైన చర్యకాదని ఆరోపణలు చేస్తుంటారు. కానీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడానికి ముందే ఫరో క్రూరుడిగా ఉన్నట్టు మనకు అర్థమౌతుంది.
దానికి మంచి నిదర్శనమే ఇశ్రాయేలీయుల అనుభవిస్తున్న బానిసత్వం.

వాస్తవానికి ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపించిన ఫరో ఈ ఫరో కాకపోయినప్పటికీ, ఈ ఫరో కూడా అటువంటి క్రూరస్వభావమే కలిగియున్నాడు. అందుకే ఆ ఫరో ఇశ్రాయేలీయులపై పెట్టిన పనుల భారాన్ని ఇంకా అమలుచేస్తూ, ఇశ్రాయేలీయులను హింసించడం విషయంలో రాజీపడకుండా ఉన్నాడు.

నిర్గమకాండము 2:23,24 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.

కాబట్టి ఇక్కడేమీ దేవుడు కొత్తగా ఫరోను క్రూరుడిగా మార్చడానికి అతని హృదయాన్ని కఠినపరచలేదు. బైబిల్ ప్రకటించే దేవుడు పాపాన్ని అసహ్యించుకుంటాడు తప్ప పాపం చేసేలా ఎవర్నీ ప్రేరేపించడు ((కీర్తనలు 5:4, హబక్కూకు 1:13). మరి ఇంతకూ ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచడం అంటే ఏమిటంటే, ఈ భూమిపై ఏ మనిషి అయినా తాను చేస్తున్నపాపం విషయంలో మారుమనస్సు పొంది పశ్చాత్తాపపడాలంటే అది కేవలం దేవుని‌ కృప ద్వారానే సాధ్యమౌతుంది (2తిమోతి 2:24) లేకపోతే ఆ వ్యక్తి జీవితాంతం అదేపాపంలో జీవించి నాశనానికి పోతాడు (యోహాను 8:21). ఇక్కడ ఫరో విషయంలో దేవుడు అదే చేస్తూ, అతను మోషే చేసిన అద్భుతాలు చూసినప్పటికీ మారుమనస్సు పొందేలా కృపచూపించబోను అంటున్నాడు. అతని హృదయాన్ని కఠినపరచడం అంటే భావం ఇదే. ఎందుకంటే అప్పటికే ఫరో ఇశ్రాయేలీయులను ఎంతో హింసించాడు కాబట్టి అతనిపట్ల దేవుడు తన బలాన్ని చూపించాలి.

నిర్గమకాండము 9: 16 నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.

అప్పటికే తమ పాపాల వల్ల‌ ఉగ్రతపాత్రులైన వారికి ఆయన కృపచూపించి మారుమనస్సు పొందేలా చెయ్యాలా లేక వారిని అలానే ఉగ్రతకు విడిచిపెట్టెయ్యాలా అనేది పూర్తిగా ఆయన చిత్తం. ఇలా ఆయన కొందరు పాపులను వారు న్యాయబద్ధంగా అర్హులైనటువంటి ఉగ్రతకు విడిచిపెట్టెయ్యడమే వారిని కఠినపరచడం, లేదా భ్రష్టత్వానికి అప్పగించడం.

రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.

కాబట్టి దేవుడు, ఫరో హృదయాన్ని కఠినపరచడం, ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన తీరుస్తున్న తీర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఫరో మరియు ఐగుప్తీయులు అప్పటివరకూ తమ‌స్వచిత్తం చొప్పున ఇశ్రాయేలీయులను హింసించినందుకు శిక్షించబడాలంటే, ఫరోకు మారుమనస్సు పొందే కృపను‌ ఆయన అనుగ్రహించకూడదు‌. అదేవిధంగా దీనిద్వారా ఒకవైపు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులపై కుమ్మరించబడిన తీర్పులను బట్టి ఆయన శక్తిని గుర్తిస్తే, మరోవైపు ఐగుప్తీయులు ఇంతకాలం తాము దేవుళ్ళుగా కొలిచినవారు ఎంత అసమర్థులో గ్రహిస్తారు.

నిర్గమకాండము 4:22,23
అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను;
వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు మోషే ఐగుప్తుకు చేరాక ఫరోముందు ఏం చెప్పాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకూ తనకూ ఉన్న సంబంధాన్ని తండ్రీ కుమారుల సంబంధంతో పోలుస్తున్నాడు. ఇది ఫరో చేస్తున్న తప్పిదంయొక్క తీవ్రతను అతనికి తెలియచేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఆ కాలంలో వేరేవ్యక్తి దాసుడ్ని నిర్బంధించి అతనితో పనిచేయించుకోవడమే పెద్దనేరంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆ దాసుడు వేరేవాని‌‌ సొత్తు. అలాంటిది వేరేవాని కుమారుడ్ని నిర్భంధించి పని చేయించుకుంటే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది కదా! ఈవిధంగా ఫరో దేవునిపిల్లలలైన ఇశ్రాయేలీయులను నిర్భంధించి వారితో కఠినసేవ చేయించుకున్నందుకు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ మాటల్లో భావం.

అదేవిధంగా ఇక్కడ దేవుడు మోషేతో "నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను" అని ఫరోకు చెప్పమంటున్నాడు. ఇక్కడ దేవుని కుమారులు (పిల్లలు) చేయవలసిన కార్యం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలు ఆయనను నిత్యం సేవించాలి, దేవునిపట్ల అటువంటి ఆరాధనాభావం లేనివారు ఆయన పిల్లలు కాదు (మత్తయి 4:10) ఈవిధంగా ఇక్కడ మనం దేవుని పిల్లల చేయవలసినదానినీ, దానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే వారు ఎదుర్కొనే పర్యవసానాన్నీ రెండింటినీ గమనిస్తున్నాం.

అయితే ఈ వచనాలలోని చివరిమాటలు (నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదను) మోషే ఫరో యొద్దకు వెళ్ళిన వెంటనే చెప్పవలసినవి కావు. అవి సంహారక దూత ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను‌ చంపడానికి ముందు ఫరోకు చెప్పబడినమాటలు. దేవుడు ఇక్కడ మోషేకు అతను ఫరోముందు చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాటలన్నిటినీ మొత్తంగా (overall) జ్ఞాపకం చేస్తున్నాడు.

నిర్గమకాండము 4:24
అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా-

ఈ వచనంలో మోషే దేవునిమాట చొప్పున తన కుటుంబంతో కలసి ఐగుప్తుకు ప్రయాణమైనపుడు వారు విశ్రాంతి తీసుకునే సత్రంలో ఆయన మోషేను చంపచూడడం మనం చూస్తాం. దీనికి కారణం ఏంటో ఈ క్రింది వచనాల్లో మనకు కనిపిస్తుంది.

నిర్గమకాండము 4:25,26
సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసినిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమెఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

ఈ వచనాల ప్రకారం మోషే ఇద్దరు కుమారులలో (గెర్షోము, ఎలీయెజెరు) ఒకరికి అతను అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనకు గురుతైన సున్నతిని (ఆదికాండము 17:9-14) చెయ్యలేదు. బహుశా చిన్న కుమారుడైన ఎలీయెజెరు (నిర్గమకాండము18:4) విషయంలోనే ఈ సున్నతిని పాటించలేదేమో. అందుకే దేవుడు మోషేను చంపచూసాడు. ఎందుకంటే ఇప్పుడు నిబంధన ప్రజలను‌ విడిపించడానికి బయలుదేరిన మోషే తన కుమారుడి విషయంలో మాత్రం ఆ నిబంధనకు గురుతైన సున్నతిని విస్మరించడం చిన్న విషయమేమీ కాదు. అది గతంలో అలక్ష్యపెట్టబడినా, కనీసం దేవుడు అతనికి ప్రత్యక్షమైనపుడైనా చెయ్యవలసింది. కానీ ఇప్పుడు కూడా అతను అలా చెయ్యకపోయేసరికి, దాని పర్యవసానం మోషేకు తెలియచెయ్యడానికే ఆయన అతడిని చంపచూసాడు.

అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. సున్నతి కారణంగా ‌ఆయన మోషేను చంపాలి అనుకుంటే వెంటనే చంపేసేవాడు కానీ, చంపచూసాడు అన్నపుడు అతను చేసిన తప్పిదంయొక్క తీవ్రతను తెలియచెయ్యడానికే ఆ విధంగా చేసాడని అర్థమౌతుంది. దీనిని బట్టి దేవుని సేవకులమైన మనం ఏ నిబంధన వాక్యాన్ని అయితే ప్రజలకు ప్రకటిస్తున్నామో దానిని పాటించడం విషయంలో అలక్ష్యం చేస్తే, కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇక సిప్పోరా చేసినదానిని మనం ఆలోచిస్తే; బహుశా వారు సత్రంలో బసచేస్తున్నపుడు ఆయన ఉన్నపాటుగా మోషేకు మరణకరమైన వ్యాధిని కలిగించియుంటాడు. అది తమ కుమారుడికి సున్నతి చెయ్యకపోవడం‌ వల్ల వచ్చిన శిక్షయేయని మోషే సిప్పోరాలు గ్రహించారు. అప్పటికి‌ మోషే వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి సిప్పోరానే తెగించి తన కుమారుడికి సున్నతి చేసింది. ఈవిధంగా సిప్పోరా తన భర్తను బ్రతికించుకుంది, అందుకే ఆమె సున్నతిలో తీసివేసే చర్మాన్ని మోషే కాళ్లదగ్గర పడవేసి "ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివి" అంటుంది. ఈమాటలకు నేను సున్నతి చేసి రక్తాన్ని చిందించడం ద్వారా నిన్ను మరలా భర్తగా పొందుకున్నాను (కాపాడుకున్నాను) అని అర్థం.

అయితే ఈ సంఘటన జరిగాక సిప్పోరా మరియు ఆమె ఇద్దరు పిల్లలు తమ‌ తండ్రి ఇంటికి పంపబడ్డారు. బహుశా తన కుమారుడికి కలిగిన సున్నతి గాయం వలన మోషే వారిని కొంతకాలం వరకూ అక్కడే ఉండమని వెనక్కు పంపివేసి యుండవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందేవరకూ వారు తమ‌ తండ్రియైన యిత్రో ఇంటిలోనే ఉన్నారు. తరువాత మోషే ఇశ్రాయేలీయులను విడిపించుకుని తనకు మొదటిగా దేవుడు ప్రత్యక్షమైన సీనాయి కొండదగ్గరకు వచ్చినపుడు వారు అతనికి మరలా అప్పగించబడ్డారు (నిర్గమకాండము 18:2).

నిర్గమకాండము 4:27,28
మరియు యెహోవామోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.

ఈ వచనాలలో దేవుడు, తన భార్యాపిల్లలను యిత్రోవద్దకు పంపివేసి సీనాయి పర్వతందగ్గర నిలిచిన మోషేను కలుసుకోమని అహరోనుకు సెలవివ్వడం, అహరోను అదేవిధంగా చేసినప్పుడు మోషే అప్పటివరకూ జరిగిన సంగతులన్నీ అతనికి‌ వివరించడం మనం చూస్తాం. మిద్యాను నుండి ఐగుప్తుకు వెళ్ళే మార్గంలోనే ఈ సీనాయి పర్వతం‌‌ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి‌ కనాను వెళ్ళేటపుడు కూడా ఈ పర్వతం దాటుకుని‌ మిద్యాను మీదుగా ప్రయాణం చెయ్యాలి. ఆ కాలంలో‌ మందకాపరులు చాలా దూరం వెళ్ళి తమ‌మందలను‌ మేపేవారు కాబట్టి మోషే మిద్యాను నుండి ఈ పర్వతంపైకి వచ్చి మొదటిసారిగా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు.

ఇక అహరోను గురించి మనం పరిశీలిస్తే ఇతను మోషే కంటే మూడు సంవత్సరాల పెద్దవాడు‌ (నిర్గమకాండము 7:7)) అయినప్పటికీ అతను మోషేకు సహకారిగా ఉండడానికి, మోషే తనకు దేవుని‌గా నియమించబడడానికి (16వ వచనం) సిగ్గుపడలేదు. తనకంటే చిన్నవాడు తనకంటే ప్రముఖస్థానంలో ఉండడాన్ని‌ బట్టి అసూయ చెందలేదు‌ కానీ, దేవునికార్యంలో తాను మోషేకు సహకారిగా నియమించబడినందుకు ఎంతగానో సంతోషించాడు. నేడు మనం కూడా సంఘంలో‌ ఇటువంటి వైఖరినే కలిగియుండాలి. మనకంటే ప్రముఖ స్థానంలో ఉన్నవారిని బట్టి అసూయ చెందకుండా, వారి ఆదేశాల క్రింద పని చెయ్యడానికి సిగ్గుపడకుండా దేవుడు నియమించిన పాత్రలలో ఆసక్తిగా సాగిపోవాలి.

రోమీయులకు 12: 10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

రోమీయులకు 12: 16 హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

2కోరింథీయులకు 10: 13 మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని "దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి" అతిశయించుచున్నాము.

నిర్గమకాండము 4:29-31
తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి, యెహోవా మోషేతో చెప్పినమాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియుయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

ఈ వచనాలలో మోషే అహరోనులు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్టుగా, ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలను సమకూర్చి వారిముందు దేవుడు చెప్పిన‌‌సూచక క్రియలన్నీ చేసినపుడు వారు మోషే‌ మాటలను నమ్మినట్టు మనం‌ చూస్తున్నాం. దీనిని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి నమస్కారం చేస్తూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఈ నమస్కారంలో ఇకపై మోషే ద్వారా దేవుడు తమకు ఆజ్ఞాపించినవన్నీ పాటిస్తామనే సంసిద్ధత కూడా ఇమిడిఉంది. అందుకే తరువాత అధ్యాయంలో వారు మోషేతో కలసి ఫరోవద్దకు వెళ్ళినట్టు మనం చదువుతాం.

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.