1
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
2
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
3
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.
4
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
5
పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
6
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
7
అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.
8
ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను
9
నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
10
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
11
గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను.
12
ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.
13
యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.
14
ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.
15
యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
16
ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
17
బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
18
ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.
19
విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
20
నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
21
యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నానుభక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను
22
ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నానుఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను
23
దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
24
కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
25
దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
26
సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు.మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
27
శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.
28
నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
29
నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
30
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.
31
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
32
నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
33
ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.
34
నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
35
నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
36
నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
37
నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
38
వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును
39
యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి
40
నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని
41
వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును.
42
అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితినివీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని.
43
ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివినన్ను అన్యజనులకు అధికారిగా చేసితివినేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు
44
నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు
45
అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
46
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడునా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.
47
ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
48
ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును.నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుబలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండినీవు నన్ను విడిపించుదువు
49
అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
50
నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు