పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం;,3:1, 3:2, 3:3 , 3:4, 3:5 , 3:6 ,3:7 , 3:8,9 , 3:10 , 3:11 , 3:12, 3:13 , 3:14 , 3:15 , 3:16,17 , 3:18, 3:19,20 , 3:21,22

 నిర్గమకాండము 3:1 

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.

ఈ వచనంలో మోషే తన మామయైన యిత్రో మందను మేపుతూ అరణ్యం అవతల ఉన్నటువంటి హోరేబు పర్వతానికి వచ్చినట్టు మనం చూస్తాం. మోషే యొక్క గత చరిత్రను మనం జ్ఞాపకం‌చేసుకుంటే, అతను ఐగుప్తులో రాజకుమారుడుగా పెంచబడి, ఐగుప్తీయుల సకల విద్యలనూ‌ అభ్యసించి, అన్ని విషయాలలో మంచి ప్రవీణుడిగా ఎంచబడ్డాడు (అపో.కార్యములు 7:22) . కానీ ప్రస్తుతం అతను‌ అరణ్యంలో తన మామయైన యిత్రో మందలు మేపుకుంటున్నాడు. ఈలోకపరంగా ఆలోచించినప్పుడు ఆ పని అతని‌ స్థాయికి ఏమాత్రం‌ తగింది కానప్పటికీ, మోషే తన పరిస్థితిని బట్టి ఆ పని చెయ్యడానికి వెనుకాడలేదు. కాబట్టి విశ్వాసులు కొన్ని పరిస్థితులను బట్టి తమ స్థాయికి (చదువుకు) తగని పనులు చేయవలసి వచ్చినప్పటికీ, ఆ విషయంలో సిగ్గుపడకూడదు. ఎందుకంటే బైబిల్‌బోధ ప్రకారం, సోమరిగా ఉండడానికి సిగ్గుపడాలి తప్ప కష్టపడడానికి కాదు (2 థెస్సలోనిక 3:10-12) .

మోషే జీవితంలో దేవుడు అనుమతించిన ఈ అరణ్య అనుభవం, అతడిని ఎక్కువసేపు ఏకాంతంగా ఉండేలా చేసి, ఆయనకు ఎంతో దగ్గర చేసిందని చెప్పవచ్చు, ఎందుకంటే ఒక నిజవిశ్వాసి "ఏకాంతసమయం" లో దేవునితో ఎంతో సన్నిహితంగా గడపగలుగుతాడు. దానివల్ల అతను ఆధ్యాత్మికంగా ఎ‌ంతో ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా "ఏకాంతంగా కొండకు వెళ్ళి" ప్రార్థనలో‌ గడిపినట్టు లేఖనాలలో మనం చూస్తాం. కాబట్టి తన స్థాయికి తగని పని చెయ్యడం ద్వారా మోషేకు మేలే జరిగింది. ముఖ్యంగా అతను అంతకుముందు లేని ఓర్పు, సహనాలను కూడా తన అరణ్య అనుభవంలో అలవరచుకున్నాడు. అందుకే అతని మిగిలిన జీవితంలో అనేక శోధనలను, తిరుగుబాటులను విజయవంతంగా సహించగలిగాడు.

సంఖ్యాకాండము 12: 3 మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.

అదేవిధంగా ఆ వచనంలో "దేవునిపర్వతమైన" హోరేబు ప్రస్తావన మనకు కనిపిస్తుంది. దానినే సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతంపైనే దేవుడు యెహోవా దూతగా మోషేకు ప్రత్యక్షమై, ఇశ్రాయేలీయుల విడుదల గురించి ప్రకటించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందినతరువాత కూడా ఆయన ఇదే పర్వతంపైకి దిగివచ్చి మోషేతో మాట్లాడేవాడు. ఇశ్రాయేలీయులు కూడా ఇదే పర్వతంపై దేవుని మహిమను చూసారు. ఆయనవారితో ఇక్కడే నిబంధనను చేసి, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు (నిర్గమకాండము 3:12 , 31:18 , కీర్తనలు 68:17 , అపో.కార్యములు 7:38 ). ఈ చరిత్ర అంతా జరిగిన తరువాత మోషే ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు‌ కాబట్టి మోషే ఆ పర్వతాన్ని "దేవుని పర్వతమని" సంబోధించాడు.

నిర్గమకాండము 3:2

ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.

ఈ వచనంలో యెహోవా దూత మండుతున్న పొద మధ్యలోనుండి మోషేకు ప్రత్యక్షమవ్వడం మనం చూస్తాం. ఇక్కడ ప్రత్యక్షమైనది యెహోవా "దూత" అని రాయబడేసరికి చాలామంది ఈయనను ఒక సాధారణ దేవదూతగా పొరపడుతుంటారు. ముఖ్యంగా స్తెఫెను కూడా ఈయనను దేవదూతగా సంబోధించడం దీనికి ప్రధానకారణం‌ (అపో.కార్యములు 7:30) . అయితే ఈ క్రింది వచనాలనూ మరియు ఇతర లేఖనభాగాలలో ఈయన ప్రత్యక్షతలను మనం పరిశీలించినపుడు ఈయన సాధారణ దేవదూత కాదని, ఈయన యెహోవా దేవుడేయని మనకు అర్థమౌతుంది.

ఎందుకంటే ఈ అధ్యాయం 4వ వచనంలో ఈయన యెహోవా దేవుడేయని రుజువయ్యేలా‌ "యెహోవా చూచెను", "దేవుడు ఆ పొద నడుమనుండి" అని స్పష్టంగా రాయబడింది. 6వ వచనంలో ఈయన మోషేకు "నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము‌‌ ఇస్సాకు యాకోబుల దేవుడను" అని పరిచయం చేసుకుంటున్నాడు. 7వ వచనంలో ఈయన గురించి "యెహోవా ఇట్లనెను" అని రాయబడింది. 14వ వచనంలో ఈయన "నేను ఉన్నవాడను" అని‌ తన నిత్యత్వపు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈ భావంలోనే బైబిల్ దేవునికి యెహోవా (యాహ్వే) అనే పేరు వాడబడింది.

ఈవిధంగా పాతనిబంధన అంతటిలో ఈయన గురించిన సందర్భాలు అన్నిటినీ పరిశీలించినపుడు, ఈయన యెహోవా దేవుడని‌ మనకు అర్థమౌతుంది. అలా అని ఈయన‌ తండ్రియైన యెహోవా దేవుడు‌ కాదు. లేఖనాలలో యెహోవా అనే పేరు తండ్రియైన దేవునికే కాకుండా, కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా సమానంగా వాడబడింది. పాతనిబంధనలో యెహోవా‌ దూతగా తన ఉనికిని‌ చాటుకున్నది‌ ఆయనే. ఈ యెహోవా దూత గురించి మరింత‌ సమాచారం తెలుసుకోవడానికి, ముఖ్యంగా స్తెఫెను ఆయనను దేవదూతగా ఎందుకు ప్రస్తావించాడో‌‌ అర్థం చేసుకోవడానికి ఈ క్రింది‌‌లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి. ఇందులో మరికొన్ని‌ అపోహలకు, వ్యతిరేక వాదనలకు కూడా సమాధానం పొందుపరిచాను.

యెహోవా దూత యేసుక్రీస్తు

అదేవిధంగా, ఈ వచనంలో మోషే చూస్తున్నది కలద్వారా కలిగే దర్శనం కాదు, అక్కడ నిజంగానే అగ్నితో మండుతున్న పొదలో యెహోవా దూత అతనికి‌ ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇతర లేఖనాలలో కూడా ఆ విషయం స్పష్టంగా రాయబడింది.

అపొస్తలుల కార్యములు 7:30 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.

ద్వితీయోపదేశకాండము 33:16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును "పొదలోనుండినవాని" కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.

మార్కు సువార్త 12:26 వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి "పొదను" గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.

ఇంతకూ యెహోవా దూత "మండుతున్న పొదలోనుండే" మోషేకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, అది‌ మోషేకు ఆయననుంచి గొప్ప సూచనగా ఉంది. ఎందుకంటే ఏ పొదా కూడా అగ్నిమధ్యలో‌ కాలిపోకుండా ఉండజాలదు. అటువంటి కార్యం దేవుడు మాత్రమే చెయ్యగలడు.

మరొకవిధంగా ఈ పొదయొక్క పరిస్థితిని ఇశ్రాయేలీయుల జనాంగంతో కూడా మనం పోల్చవచ్చు. ఎలా అంటే; ఈ సంఘటన జరిగేసరికి మోషే ఐగుప్తును విడిచిపెట్టి 40 సంవత్సరాలు‌ గడుస్తుంది (అపో.కార్యములు 7:30) ప్రస్తుతం మోషే వయసు 80 సంవత్సరాలు (నిర్గమకాండము 7:7) . ఐగుప్తును అతను 40 సంవత్సరాల క్రితం విడిచిపెట్టినపుడు తన సహోదరులైన ఇశ్రాయేలీయులు ఎటువంటి శ్రమలో ఉన్నారో, ఈ 40 సంవత్సరాలూ వారు అదే శ్రమలో‌ కొనసాగుతూ, ఆ అగ్నిమధ్య కాలిపోని‌ పొదలా దేవుని‌చేత సజీవంగా కాపాడబడుతున్నారు.

ప్రస్తుత క్రైస్తవ సంఘం కూడా ఇదేవిధంగా విమోచకుడైన క్రీస్తు ఆగమనం వరకూ ఈ‌‌లోకంలో ఎన్ని హింసలు ఎదురైనప్పటికీ, ఆ అగ్నిమధ్య కాలిపోని పొదలా సజీవంగా కాపాడబడుతుంది.

మొదటి పేతురు 1:6,7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

ఇక్కడ మనం గుర్తించవలసిన మరో విషయం ఏమిటంటే, మోషే ఈ ప్రత్యక్షతను పొందుకునేసరికి తనమామయైన యిత్రో మందను కాచే పనిలో‌ఉన్నాడు. మోషే విషయంలోనే కాదు, మరికొందరు భక్తులకు లభించిన ప్రత్యక్షతలను కూడా మనం పరిశీలించినపుడు వారందరూ ఆ సమయంలో ఏదో ఒక‌పనిలో నిమగ్నమై యున్నారు. కాబట్టి దేవుడు పనిచేసేవారినే ఎన్నుకుంటాడు తప్ప, సోమరులను కాదని మనం అర్థం చేసుకోవాలి. తమ‌ జీవనోపాధి పని విషయంలోనే సోమరులుగా ఉండేవారు, ఎన్నో సవాల్లతో కూడిన దేవుని పనిని ఎలా చెయ్యగలరు?

నిర్గమకాండము 3:3 

అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.

ఈవచనంలో మోషే ఆ పొద చుట్టూ అగ్ని ఉన్నప్పటికీ, అది ఎందుకు కాలిపోవడం లేదో, దగ్గరకు వెళ్ళి చూడడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. దీనిని‌బట్టి మోషే భయంలేనివాడిగా, ఉత్సుకత కలిగినవాడిగా మనకు అర్థమౌతున్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు మోషేకు ప్రత్యక్షతను చూపించడానికి ఒక చిన్న పొదను ఎన్నుకున్నాడు తప్ప, ఏ కేదారు వృక్షాన్నో ఎన్నుకోలేదు.

ఇశ్రాయేలీయుల ప్రజలు లోకరీత్యా అంతటి ఘనులేం‌ కాదు, వారు కూడా ఆ‌ చిన్నపొదలాంటివారే. అయినప్పటికీ దేవుని ఎన్నిక చేత వారు లోకంలో‌ అందరికంటే ఘనులుగా ఎంచబడ్డారు. ప్రస్తుతం మనం కూడా ఆయన ఎన్నికను బట్టే ఆయన పిల్లలుగా పిలవబడే మహా గొప్ప ఘనతను పొందుకుంటు‌న్నాం.

మొదటి కొరింథీయులకు 1:29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

నిర్గమకాండము 3:4 

దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి‌ మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

ఈ వచనంలో మోషే ఆ పొదవైపు రాబోయినపుడు యెహోవా దేవుడు అతనిని చూసి పేరుపెట్టి పిలవడం, దానికి‌ మోషే ప్రతిస్పందించడం మనం‌ చూస్తాం. మోషే ఐగుప్తునుండీ, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి దూరంగా ఉన్నాడు తప్ప, దేవునికి ఎప్పుడూ దూరంగా లేడు. అది గత అధ్యాయంలో, తన వివాహం గురించిన సందర్భంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మోషే ఆ పొదలోనుండి ఒకరు తనను పేరు పెట్టి పిలిచేసరికి అది తాను సేవిస్తున్న దేవునిగా గుర్తించాడు. ఎందుకంటే దేవుడు తన పితరులకు ప్రత్యక్షమై ఏవిధంగా వారిని పేరు పెట్టి పిలిచాడో అతనికి తెలుసు. అందుకే అదే పితరుల‌‌ వైఖరిని అనుసరిస్తూ "చిత్తము ప్రభువా" అంటున్నాడు ( (ఆదికాండము 22:1 , 31:11 , 46:2 ).

అదేవిధంగా ఇక్కడ "చిత్తము ప్రభువా" అంటే అది‌‌ కేవలం నోటితో పలికేమాట మాత్రమే కాదు. దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా పలికే ఈ మాటలో, ఆ దేవుని ఆజ్ఞలను గైకొనే సిద్ధపాటు దాగియుంది. అందుకే అబ్రాహాము కానీ, యాకోబుకానీ, దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా ఈమాటలు‌ పలికినప్పుడు తదుపరి ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినట్టు మనం గమనిస్తాం. ఇప్పుడు మోషే కూడా అలాంటి ఉద్దేశంతోనే దేవుని పిలుపుకు "చిత్తము ప్రభువా" అని స్పందిస్తున్నాడు (మరి ఆయన ఐగుప్తుకు వెళ్ళమంటే ఎందుకు వెనుకాడాడో ఆయా సందర్భాలలో చూద్దాం).‌ కాబట్టి విశ్వాసులు కేవలం నోటితో మాత్రమే "ప్రభువా, ప్రభువా" అని పిలిచేవారిగా ఉండకుండా, లేఖనాలలో ఆయన బోధించిన ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనను ప్రభువా అని పిలిచినందుకు ప్రయోజనం ఉంటుంది.

మత్తయి 7: 21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

మొదటి యోహాను 2:3,4 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.

నిర్గమకాండము 3:5

అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.

ఈ వచనంలో దేవుడు తనకు దగ్గరగా వస్తున్న మోషేను నిలువరించి, అతని‌ చెప్పులను విడిచిపెట్టమనడం, ఆ స్థలాన్ని పరిశుద్ధమైనదిగా ప్రకటించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ పర్వతంపైకి ఆయనే యెహోవా దూతగా దిగివచ్చి, ఆయన సన్నిధిని అక్కడ ఉంచాడు కాబట్టి, తన మహిమను అక్కడ ప్రదర్శిస్తున్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలోకి అపరిశుభ్రమైనదేదీ (మురికిగలది) ప్రవేశించడానికి వీలు లేదు. అందుకే ఆయన "నీ చెప్పులు విడువుము" అని మోషేకు సెలవిస్తున్నాడు. దీనిని బట్టి, ఆత్మసంధమైన అపరిశుద్ధత (పాపం) తో మనం దేవుణ్ణి సమీపించలేమని గ్రహించాలి. ఇది తెలియచెయ్యడానికే నూతననిబంధనకు ఛాయగా ఉన్నటువంటి పాతనిబంధనలో ( కొలస్సీ 2:17 , హెబ్రీ 10:1 ) శరీరసంబంధమైన అపరిశుద్ధత కలిగినవారు, అపవిత్రులనీ వారు దేవుని ఆలయంలోకి ప్రవేశించకూడదనీ రాయబడింది. ఉదాహరణకు, స్రావం కలిగినవాడు, నెలసరిలో ఉన్న స్త్రీ, కుష్టురోగి. వీరందరూ అపవిత్రులుగా ఎంచబడిందీ, దేవుని ఆలయంలోకి రాకూడదని నిషేధించబడిందీ "మనం ఆత్మసంబంధమైన కల్మషంతో" పరలోకం చేరలేమని బోధించడానికే.

హెబ్రీయులకు 10: 22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

అందుకే మనం దేవునికి వేరుగా చేసే నీతిక్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డలుగా (పాపంగా) గుర్తించబడుతున్నాయి.

యెషయా గ్రంథము 64:6 మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు "మురికిగుడ్డవలెనాయెను"

కాబట్టి, మోషేతో దేవుడు "నీ చెప్పులు విడువుము" అని‌ పలికిన మాట, ఆత్మసంబంధమైన మురికి (అపవిత్రత) కి ఛాయగా చెప్పబడిందని, ఈ కారణంగా ఆత్మసంబంధమైన అపవిత్రతలు కలిగి మనం దేవుణ్ణి సమీపించలేమని గ్రహించాలి. పాతనిబంధనలో ఇలా ఛాయలుగా చెప్పబడిన మరికొన్ని అపవిత్రతల గురించి కూడా తెలుసుకోవడానికి ఈ క్రింది‌ లింక్‌ ద్వారా సూచించబడిన వ్యాసం‌ చదవండి.

బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

అయితే చాలామంది బోధకులు ఇక్కడ మోషేతో దేవుడు "నీ చెప్పులు విడిచిపెట్టుము" అని పలికినమాటను బట్టి, నేటి క్రైస్తవ మందిరాల్లోకి చెప్పులు వేసుకుని రాకూడదనే నియమాన్ని తీసుకువచ్చారు. ఈ విషయంలో విడిపోయిన సంఘాలు కూడా ఉన్నాయంట. కానీ నేను పైన జ్ఞాపకం చేసినట్టు, ఆ పర్వతంపైకి దేవుడే స్వయంగా దిగివచ్చి, తన సన్నిధిని ఉంచాడు. అందువల్లే మోషేను "నీ చెప్పులు విడువుము నీవున్న స్థలము పరిశుద్ధము" అని ఆజ్ఞాపించాడు. కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా అటువంటి పరిశుద్ధస్థలమేదీ లేదు. ఆ సీనాయి కొండకూడా, దేవుడు వెళ్ళిపోయిన తరువాత సాధారణ పర్వతమే. కాబట్టి మోషే సందర్భాన్ని ఆధారంగా తీసుకుని, నేటి క్రైస్తవ మందిరాల్లోకి "చెప్పులు వేసుకుని రాకూడదనే" నియమం తీసుకురావడం సరైనది కాదు. అక్కడ పరిసరాల పరిశుభ్రతను‌ బట్టి, చెప్పులు తీసివెయ్యాలనుకుంటే తీసివెయ్యొచ్చు, ఒకవేళ ఆ ప్రదేశంలో అటువంటి అవకాశం లేకపోతే ఉంచుకోవచ్చు.

ఒకవేళ ఎవరైనా ఈ నామాటలను ఎదిరిస్తూ, సీనాయి కొండపై దేవుడు తన సన్నిధిని ఉంచినట్టే, నేటి క్రైస్తవమందిరాల్లో కూడా ఆయన సన్నిధిని‌ ఉంచుతున్నాడని, అందువల్ల అక్కడ కూడా చెప్పులు తీసివెయ్యాలని వాదిస్తే, వారు మొదటిగా సీనాయి పర్వతంపైకి దేవుడే స్వయంగా దిగివచ్చి, తన సన్నిధిని ఉంచాడని, ఆ సన్నిధిని నేటి మందిరాలతో పోల్చడం సరికాదని గమనించాలి. మరొక విషయం ఏమిటంటే, ప్రస్తుతం దేవుడు మనమధ్య, మనలోనే‌ ఉన్నాడు, మనమే ఆయన మందిరంగా ఉన్నాము ( ఎఫెసీ 4:6 , 1 కొరింథీ 3:17 , 6:19 ) ఇందువల్ల మనం ఎప్పుడూ చెప్పులు‌ వేసుకోకూడదా మరి? కాబట్టి, మన‌ ఆత్మ సంబంధమైన అపవిత్రతకు ఛాయగా చెప్పబడినవాటిని ప్రస్తుత సంఘంలో ఆచారాలుగా చెయ్యకూడదు.

అదేవిధంగా, దేవుడు తనకు దగ్గరగా వస్తున్న మోషేను "దగ్గరకు రావద్దని" నిలువరించడం, ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. ఇది పాతనిబంధనకూ, క్రొత్త నిబంధనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనకు తెలియచేస్తుంది. పాతనిబంధనలో భక్తులు దేవుని సన్నిధిని దూరంగానే అనుభవించగలిగారు, మనమైతే క్రీస్తు యేసును బట్టి, ధైర్యంగా ఆయనకు ఎంతో దగ్గరగా చేరుకుంటున్నాం.

హెబ్రీయులకు 4: 16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

నిర్గమకాండము 3:6

మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.

ఈ వచనంలో దేవుడు తనను తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవునిగా మోషేకు పరిచయం చేసుకోవడం మనం చూస్తాం. అంటే అంతకుముందు మోషేకు ఈ దేవుడెవరో తెలియదని అర్థం కాదు. ఆయన యాకోబుకు ప్రత్యక్షమైనపుడు కూడా తమ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు దేవునిగా తనను పరిచయం చేసుకున్నాడు (ఆదికాండము 28:13) కానీ అప్పటికే యాకోబుకు తన తండ్రి సేవిస్తున్న యెహోవా దేవునిగురించి తెలుసు. కాబట్టి మోషేకు ఈ ప్రత్యక్షతకు ముందు యెహోవా దేవునిగురించి తెలియదని చెప్పడం సాధ్యపడదు. మనం ఇప్పటివరకూ చూసినట్టుగా మోషే "ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని, తన పితరుల దేవుని ప్రజలతో శ్రమలను‌ అనుభవించడం మేలని, ఆలోచించి ఇశ్రాయేలీయుల పక్షంగా పోరాడడానికి సిద్ధపడ్డాడు, ఆ క్రమంలో జరిగిన సంఘటనవల్ల మిద్యానుకు పారిపోయి దేవునితో సహవాసం కలిగే జీవిస్తున్నాడు.

మరికొత్తగా నేను అబ్రాహాము దేవుడనని ఇస్సాకు దేవుడనని, యాకోబు దేవుడనని, నీ తండ్రి దేవుడనని, ఆయన ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడంటే, ఈ పరిచయం ద్వారా ఆయన పితరులతో చేసిన నిబంధనను మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకే ఆయన యాకోబుకు ప్రత్యక్షమైనపుడు కూడా అబ్రాహాము ఇస్సాకుల పేర్లు ప్రస్తావించి వారితో చెయ్యబడిన నిబంధనను‌ ( ఆదికాండము 12:2,3,7 15:5-21 17:2-8 26:2-4 ) జ్ఞాపకం చేసాడు.

ఆదికాండము 28:13,14 మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; "నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును".

ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవుడు ఇక్కడ అబ్రాహాము ఇస్సాకు యాకోబుల పేర్లను ప్రస్తావించడం ద్వారా, వారు శారీరకంగా చనిపోయినప్పటికీ సజీవులుగానే ఉన్నారని ప్రకటిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మృతుల పునరుత్థానం జరుగుతుందని, చనిపోయినవారందరూ సజీవులుగానే ఉన్నారని రుజువు చెయ్యడానికి ఈ సందర్భాన్ని ఉదహరించారు.

లూకా సువార్త 20:37,38 పొదను గురించిన భాగములోప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడుకాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను.

అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కూడా, దేవుడు తమతో చేసిన నిబంధన కేవలం ఈలోకంలో వారి సంతాన విస్తరణ మరియు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందడం మాత్రమే కాదని, ఆ నిబంధనలో వారి పునరుత్థానం, పరలోకంలో ప్రవేశించడం కూడా ఇమిడియున్నాయని విశ్వసించి వారు ఈలోకంలో జీవించినకాలంలో కూడా, వాటిపైనే ధ్యాస నిలిపారు.

హెబ్రీయులకు 11:8-10,13,16 అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. "ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను". వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. "అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్దపరచి యున్నాడు".

ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అబ్రాహాము ఇస్సాకు యాకోబులను‌ బట్టి తమతో చేయబడిన నిబంధనలో మృతుల‌పునరుత్థానం, పరలోకం‌ కూడా ఇమిడియున్నాయని గుర్తించి‌ వాటిపై నిరీక్షణ కలిగియున్నారు.

అపొస్తలుల కార్యములు 24:14,15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు (ఇశ్రాయేలీయులు) నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.

కాబట్టి మన దేవుడు ఈలోకంలో జీవించినంతమట్టుకే మనకు దేవుడు కాదు, మనం మరణించిన తరువాత కూడా ఆయన మనకు దేవునిగానే ఉన్నాడు. ఇందువల్ల మన నిరీక్షణ ఈలోకంలో ఆయననుండి ఏం‌ పొందుకుందామనే కాకుండా, "అబ్రాహాము ఇస్సాకు యాకోబులులా" మృతుల పునరుత్థానంలో సదాకాలము ఆయనతో ఉంటామనేదానిపై కేంద్రీకరించబడి ఉండాలి.

1కోరింథీయులకు 15: 19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

అదేవిధంగా మోషే దేవునిమాటలు విన్నతరువాత "తన ముఖము‌ కప్పుకుని ఆయన తట్టు చూడడం మానివేసినట్టు" చూస్తున్నాం. దీనిని బట్టి మనం దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో, అంత ఎక్కువగా ఆయనపట్ల‌ భయాన్ని కలిగియుంటామని అర్థమౌతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన దర్శనం పొందిన భక్తులందరూ భయానికి‌ లోనయ్యారు. అయితే ఈ భయం ప్రాముఖ్యంగా దేవునిముందు మన పాపస్థితికి గురుతుగా ఉండి, పాపం‌పట్ల‌ అసహ్యతకు మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి దేవునికి దగ్గరైనవారు ఆయనపట్ల కలిగే భయాన్ని‌ బట్టి, సిగ్గును బట్టి పాపానికి దూరంగా జీవిస్తారు. ఇటువంటి వైఖరిలేనివారు, దేవునికి దగ్గరైనవారు ఎంతమాత్రం కాదు.

నిర్గమకాండము 3:7
మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.

ఈ వచనంలో దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను చూసానని, వారి మొరను విన్నానని, వారి దుఃఖములు ఆయనకు తెలిసేయున్నవని మోషేతో చెప్పడం మనం చూస్తాం. దీనర్థం ఇప్పుడు కొత్తగా ఆయన వారి బాధను చూసి, మొరను విని, వారి దుఃఖాలను తెలుసుకుంటున్నాడని‌ కాదు. నేను రెండవ అధ్యాయం 24,25 వచనాలలో వివరించినట్టుగా, ఇది ఆయన ఇశ్రాయేలీయులను విడిపించడానికి నిర్ణయించిన సమయం, దీనిగురించి ఆయన ముందుగానే అబ్రాహాముకు వివరించాడు (ఆదికాండము 15:14,15) . ఇప్పుడు ఆ 400 సంవత్సరాల కాలం పూర్తయ్యింది కాబట్టి, "వారి బాధ చూచితిని, మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి"‌ అని అంటే, అబ్రాహాముకు వివరించినట్టుగా వారిని ఐగుప్తునుండి విమోచించి కనానుకు నడిపించడానికి వారిపై ప్రత్యేకంగా లక్ష్యముంచుతున్నాడని భావం.

అదేవిధంగా, ప్రస్తుతం‌ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో శ్రమలను ఎదుర్కొంటూ‌ ఉన్నారు. వారు తమకు కలుగుతున్న శ్రమ విషయంలో ఎవరికీ పిర్యాదు చేసే పరిస్థితి వారికి లేదు. ఎందుకంటే స్వయంగా ఫరోనే ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయిస్తున్నాడు కాబట్టి, వారికి ఐగుప్తు న్యాయవ్యవస్థలో ఏవిధంగానూ న్యాయం‌ జరగదు. కానీ దేవుడు వారి బాధను చూస్తున్నాడు, వారి మొరను‌ వింటున్నాడు, వారి దుఃఖములు ఆయనకు తెలిసేయున్నవి. అందుకే ఆయన వారిని విడిపించడానికి సీనాయి పర్వతంపైకి దిగివచ్చి మోషే ద్వారా వారికి విడుదల‌ కలిగించబోతున్నాడు. దీనినిబట్టి, మనం శ్రమల్లో‌ ఉన్నపుడు ఈలోకాధికారుల నుండి ఎటువంటి న్యాయం లభించకపోయినప్పటికీ, చివరికి వారే మనకు శత్రువులుగా మారి మనపై మరింత‌ భారం మోపుతున్నప్పటికీ, అందరికీ పైగా ఉన్న దేవుడు మన బాధను చూస్తున్నాడని, మన మొరను వింటున్నాడని, మన దుఃఖములు ఆయనకు తెలిసేయున్నవని, విశ్వసించి ఆయన‌ కలిగించే విడుదలకోసం ఓర్పుతో ఎదురుచూడాలి.

ప్రసంగి 3:16,17 మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.

ప్రసంగి 5:8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవా రున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు.

నిర్గమకాండము 3:8,9
కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని.

ఈ వచనాలలో దేవుడు తాను ఎందుకని ఆ పొదలో ప్రత్యక్షమయ్యాడో మోషేకు వివరించడం మనం‌ చూస్తాం. ఇక్కడ ఆయన మొదటిగా, కనాను దేశం గురించి మాట్లాడుతూ అది విశాలమైన దేశమని చెబుతున్నాడు. "శాటిలైట్ బైబిల్ అట్లాస్ ప్రకారం ఈ దేశం ఉత్తరం నుండి దక్షిణానికి 424 కిలోమీటర్లు వ్యాపించియుంది. దాని వెడల్పు 114 కిలోమీటర్లు. అతి తక్కువ వెడల్పు ఉన్నచోట 15 కిలోమీటర్లు ఉంటుంది". దీనిప్రకారం ఈ దేశం ప్రపంచంలోని అన్ని దేశాలకంటే విశాలమైనదేమీ కాదు. కానీ దేవుడెందుకు దీనిని " విశాలదేశంగా" చెబుతున్నాడంటే, నిర్గమకాండము 1:7 ప్రకారం అప్పటికి ఇశ్రాయేలీయులు‌ నివసిస్తున్న గోషెను ప్రాంతం, వారి విస్తరణకు తగినంత విశాలంగా లేదు. ఆ ప్రదేశమంతా వారితో నిండిపోయి ఇరుకుగా మారింది. అందుకే దేవుడు, ఇప్పుడు వారిని నడిపించబోతున్న‌ కనాను దేశం‌ వారి విస్తరణకు తగినట్టుగా విశాలమైన దేశమ‌ని పేర్కొంటున్నాడు.

ప్రస్తుతం ఆ కనాను దేశంలో నివసిస్తున్న ఆరుజాతుల పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించబడడం మనం చూస్తాం కానీ, ఆదికాండము 15:18-21 వచనాల ప్రకారం అక్కడ మొత్తం‌ పదిజాతుల ప్రజలు‌ నివసిస్తున్నారు. వారందరూ హాము కుమారుడైన కనాను సంతానం (ఆదికాండము 10:15-18) . దేవుడు ఇక్కడ ఆ కనాను సంతానంలో ప్రముఖ జాతులైన ఆరుపేర్లను మాత్రమే ప్రస్తావించడం జరిగింది.

అదేవిధంగా దేవుడు ఇక్కడ "నేను దిగివచ్చియున్నాను" అంటున్నాడు. దీనర్థం ఆయన ఒక ప్రదేశానికి పరిమితుడని‌ కాదు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడని లేఖనాలు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ( ఎఫెసీ 4:6 , కీర్తనలు 139:5-10 ) కాబట్టి "నేను దిగివచ్చియున్నాను" అంటే ఆయన చేయబోతున్న కార్యాన్నీ, ఆయన మోషేకు ప్రత్యక్షమైన విధానాన్నీ సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి.

నిర్గమకాండము 3:10
కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి, కనాను దేశానికి చేర్చడానికి మోషేకు పిలుపునివ్వడం మనం చూస్తాం. "రమ్ము" అనే మాట ఆయన చేయబోతున్న కార్యానికి సాధనం కమ్మనే పిలుపును సూచిస్తుంది. ఈవిధంగా దేవుడు మందల కాపరిగా ఉన్నటువంటి మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు కాపరిగా నియమించబోతున్నాడు. సాధారణంగా గొర్రెలకాపరులకు వాటిని మేపడానికి చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే అవి ఒకోసారి దారితప్పి‌ నడుస్తుంటాయి, మరికొన్ని గుంపుతో కలసి నడవకుండా మేతదగ్గరే ఉండిపోతుంటాయి. అలాంటి సమయంలో కాపరి వాటిని ఓర్పుగా సమకూర్చి నడిపించగలగాలి. ఇలాంటి అనుభవంకోసమే దేవుడు మోషే జీవితంలో మందలను మేపే పరిస్థితిని అనుమతించాడు. ఎందుకంటే ఇప్పుడు‌ మోషే లక్షలమంది ఇశ్రాయేలీయులకు కాపరిగా మారి, అరణ్యమార్గంలో వారిని‌ కనానుకు నడిపించబోతున్నాడు, వారిలో భిన్నమైన వ్యక్తిత్వం గల‌ మనుషులు‌ ఉంటారు. దావీదు జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితినే మనం చూస్తాం.

కీర్తనల గ్రంథము 78:70-72 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.

అదేవిధంగా ఆయన నూతననిబంధన ప్రారంభసంఘానికి కూడా, లోకంలో‌ ఘనులైనవారిని కాకుండా, చేపలు పట్టే జాలరులవంటి అల్పులైన మనుషులను కాపరులుగా నియమించాడు. తాను నిర్ణయించిన కార్యం కేవలం తన శక్తిమూలంగా మాత్రమే నెరవేరుతుందని రుజువు చెయ్యడానికి ఆయన ఈవిధంగా చేస్తుంటాడు. దీనివల్ల సమస్త మహిమా ఘనతలు ఆయనకు మాత్రమే చెందుతాయి.

నిర్గమకాండము 3:11
అందుకు మోషేనేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తు లోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా-

ఈవచనంలో మోషే దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా తన స్థాయిగురించి అభ్యంతరపడడం మనం చూస్తాం. అయితే ప్రారంభంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై పేరుపెట్టి పిలచినప్పుడు "చిత్తము ప్రభువా" అని పలికినమాటలకు ఇక్కడ మోషే ఎంతమాత్రం విరుద్ధంగా ప్రవర్తించడం లేదు కానీ, ప్రస్తుతం తన శక్తి సామర్థ్యాలను బట్టి ఈవిధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న ఫరోతో అతనికి పరిచయం లేకపోయి ఉండవచ్చు, ఫరో అంటే అప్పటి ప్రాచీన నాగరికత కలిగిన‌ దేశాల్లో ప్రాముఖ్యమైన ఐగుప్తుకు రాజు. మోషే కేవలం ఒక గొర్రెలకాపరి. పైగా ఇశ్రాయేలీయుల ప్రజలు తానున్న సమయంలోనే ఎంతో విస్తరించియున్నారు. ఈ నలభై యేళ్ళతో ఆ సంఖ్యమరింత అధికం ఔతుంది. ఇవన్నీ ఆలోచించిన మోషే తన స్థాయిని బట్టి తనను తాను తగ్గించుకుంటూ, ఆ పని తాను చెయ్యలేననే ఆలోచనతో ఈవిధంగా పలుకుతున్నాడు తప్ప దేవుని పిలుపుకు అవిధేయత చూపించాలనే ఉద్దేశంతో కాదు.‌

యిర్మియాకు దేవుడు ప్రత్యక్షమైనపుడు కూడా అతను తన‌ వయస్సును బట్టి‌ ఇటువంటి మాటలతోనే ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు మనం గమనిస్తాం.

యిర్మీయా 1:6 అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా-

కాబట్టి దేవుని పిల్లలు మోషేలా యధార్థంగా తమను తాము తగ్గించుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిలుపుకు తగిన అర్హత, ఆయన‌ కార్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన సామర్థ్యం నిజంగా మనలో‌ లేవు. అందుకే పౌలు ఏమంటున్నాడో చూడండి.

2కోరింథీయులకు 3: 5 మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

నిర్గమకాండము 3:12
ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.

ఈ వచననంలో మోషేకు దేవుడు ప్రత్యుత్తరమివ్వడం మనం చూస్తాం. ఆయన "నిశ్చయముగా నేను నీకు తోడై యుందును" అనే మాటద్వారా మోషే తన విషయంలో లేవనెత్తిన అభ్యంతరానికి తిరుగులేని జవాబిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మోషే ఫరోతో మాట్లాడేది, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి‌ కనానుకు తోడుకుని వెళ్ళేది తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కేవలం దేవుడు అనుగ్రహించే శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే. ఈ కార్యంలో మోషే కేవలం ఆయన వాడుకునే సాధనం మాత్రమే. కాబట్టి తన కార్యానికి సాధనాలుగా పిలుచుకున్న దేవుడు, పిలవబడినవారందరికి తగిన సామర్థ్యం కలుగచేస్తాడు. ఈవిషయంలో ఎవరూ ‌చింతించవలసిన అవసరం లేదు, అదే సమయంలో తాము చేసిన దేవుని పనిని బట్టి గర్వించే అవకాశం కూడా ఎవరికీ లేదు.

అదేవిధంగా దేవుడు ఇక్కడ మోషేకు ఒక సూచన గురించి కూడా తెలియచెయ్యడం మనం చూస్తున్నాం. మోషే అప్పటికే మండుతున్న పొదనుండి దేవుడు మాట్లాడడం చూస్తున్నాడు కాబట్టి, ప్రస్తుతం అతనికి ఎటువంటి సూచనలు చూపించవలసిన అవసరం‌లేదు. అందుకే ఆయన భవిష్యత్తులో జరగబోయేదానిని సూచనగా ప్రస్తావించడం జరిగింది. అది ప్రస్తుతం జరగకపోయినప్పటికీ, అప్పటికే తాను చూసిన సూచనను బట్టి అది కూడా జరుగుతుందని విశ్వసించడం మోషే పని.

ఇక్కడ దేవుడు చెప్పిన సూచన ప్రకారంగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందినతరువాత అదే సీనాయి పర్వతంపై ఆయనను సేవించి, ఆయన ద్వారా కట్టడలను పొందుకున్నారు (నిర్గమకాండము 19వ అధ్యాయము)

నిర్గమకాండము 3:13
మోషేచిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు తనను వారియొద్దకు పంపిన దేవునిపేరు అడుగుతారని ఊహించిన మోషే ఆ పేరునిమిత్తం దేవుణ్ణి ప్రశ్నించడం మనం చూస్తాం. ఇక్కడ మోషే పలికిన మాటల‌ కారణంగా కొంతమంది "మోషే వరకూ ఉన్న పితరులకు దేవుని పేరు యెహోవా అని తెలియదని" ఆదికాండము రాసింది మోషేయే కాబట్టి ఈ సంఘటన తరువాత గతచరిత్రలో ఆ పేరును ప్రస్తావించాడని అపార్థం చేసుకుంటుంటే, మరికొందరైతే (బైబిల్ విమర్శకులు) యెహోవా దేవుడు మోషే కల్పించిన కల్పితపాత్ర అంటూ అసత్యప్రచారం చేస్తున్నారు.

కానీ, దేవుని పేరు యెహోవాగా పితరులందరికీ తెలుసని లేఖనాలలో కచ్చితమైన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి;

ఆదికాండము 4: 26 మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

ఇక్కడ షేతుకుమారుడైన ఎనోషనుకు తమ దేవుని పేరు "యెహోవా అని" తెలుసు కాబట్టే ఆయన నామము పేరిట ప్రార్థన చేసాడు.

ఆదికాండము 22: 14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

ఇక్కడ అబ్రాహాముకు తనకు ప్రత్యక్షమైన దేవుని‌పేరు "యెహోవా" అని తెలుసు కాబట్టే, తాను ఇస్సాకును బలిగా అర్పించబోయిన ప్రదేశానికి "యెహోవా యీరే" అని పేరుపెట్టాడు. కాబట్టి మోషే గతచరిత్రను రాస్తున్నపుడు ఆ పేరును కొత్తగా ప్రస్తావించలేదు. ఆ దేవుని గురించీ, ఆయన నామం గురించీ పితరులందరికీ తెలుసు. ఈకారణంగా "యెహోవా దేవుడు మోషే కల్పించిన కల్పితపాత్ర" అనే ఆరోపణకు కూడా ఎటువంటి అధారం లేదు.

అలాంటప్పుడు తనకు ప్రత్యక్షమైన దేవునిపేరు యెహోవా అని తెలిసి కూడా మోషే ఎందుకు ఈవిధంగా ప్రశ్నించాడంటే, మొదటిగా ఇది తనలో పుట్టిన ప్రశ్న కాదు. దేవునిమాట ప్రకారం అతను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి వారితో ఐగుప్తునుండి విడుదల కోసం మాట్లాడినప్పుడు వారు తప్పకుండా తనను పంపిన దేవుని పేరు అడుగుతారు. ఎందుకంటే, మోషేను పంపింది తమ పితరులు సేవించిన యెహోవా దేవుడేనా లేక అతను వేరే దేవునిపేరిట అటువంటి అబద్ధపు మాటలు పలుకుతున్నాడా అనేది నిర్థారించుకోవడానికి ఇశ్రాయేలీయులకు ఆ ప్రశ్న చాలా అవసరం. కాబట్టి మోషే ఆ ప్రజల తరపునుండి ఆ ప్రశ్న అడుగుతున్నాడు తప్ప ఆయన పేరు యెహోవా అని తనకు తెలియక కాదు.

రెండవదిగా, దేవుని ప్రత్యక్షతను చూసిన మోషే ఆయన పిలుపుకు "చిత్తము ప్రభువా" అని స్పందించి తన విధేయతను చాటుకున్నాడు. ఆయన మాట ప్రకారం ఆ పొదదగ్గరకు వెళ్ళకుండా ఆగి, తన ముఖాన్ని కప్పుకుని భయాన్ని కూడా కనపరిచాడు. మరిముఖ్యంగా ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి కానీ, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించడానికి కానీ తనకు సామర్థ్యం లేదని గ్రహించాడు. అందుకే అతను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళినపుడు వారు నీకు ప్రత్యక్షమైన దేవుని పేరు ఏంటని ప్రశ్నిస్తే, తనకు తెలిసిన సమాధానమైన "యెహోవా" అని చెప్పవచ్చులే అనుకోకుండా, ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో కూడా దేవునినే అడుగుతున్నాడు.‌ ఇక్కడ మోషే ఐగుప్తుకు వెళ్ళినతరువాత అక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడవలసిన ప్రతీమాటా దేవునిపై ఆధారపడి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈవిధంగా ప్రశ్నించాడు తప్ప దేవునిపేరు యెహోవా అని తనకు తెలియక కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం యెహోవా అనే పేరు పితరులకు తెలుసని ఆధారాలు చూసాం, మోషే కూడా అదే దేవుణ్ణి నమ్మి ఆ దేవుని కాపుదలకు జ్ఞాపకంగా తన కుమారుడికి ఎలీయెజెరు అని పేరుపెట్టాడు (నిర్గమకాండము 18:4).

అదేవిధంగా ఈ ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానంలో "తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము" అని నొక్కిచెప్పడం మనం చూస్తాం (15వ వచనం). దీనిప్రకారం మోషే ఆయన "యెహోవా" అనే పేరే కాకుండా మరొకపేరు కూడా బయలుపరుస్తాడనే ఆలోచనతో ఉండియుండవచ్చు. అందుకే దేవుడు "యెహోవా అనేదే తరతరములకు నా జ్ఞాపకార్థ నామము" ఆ ప్రజలతో అదే పేరు చెప్పమ‌ని బదులిస్తున్నాడు.

అయితే దేవుడు "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు" అని ఎందుకు అంటున్నాడనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం ఔతుంది (నిర్గమకాండము 6:3) ఇప్పటికే దీనిగురించి నేను మరొక‌చోట వివరించడం జరిగింది‌ (ఆదికాండము 12:8 వ్యాఖ్యానం చూడండి).

అదేవిధంగా ఇక్కడ మోషేలో మరొకటి కూడా మనం గమనించాలి. దేవుడు అతనితో ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపించమని చెబుతున్నపుడు, అతను తనకున్న సామర్థ్యలేమిని బట్టి, ఫరో యొద్దకు వెళ్ళడానికీ ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికీ నేనెంతటి వాడనని బదులిస్తున్నాడు. దేవుడు దానికి "నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరు" అంటూ బలపరచినపుడు, మోషే‌ మరలా "ఇశ్రాయేలీయులు నీ పేరు అడిగితే ఏమని చెప్పాలని" తిరిగిప్రశ్నిస్తున్నాడు. ఈ సంభాషణ అంతటినీ బట్టి, దేవుడు తనను చేయమన్న కార్యంలో ఎదురయ్యే సమస్యలను ముందే ఊహించిన మోషే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమౌతుంది. ఇది మోషే యొక్క సిద్ధపాటును సూచిస్తుంది.

ఎందుకంటే గతంలో అతనికి తాను ఏ ప్రజలకోసమైతే అన్నిటినీ విడిచిపెట్టుకుని పోరాటానికి సిద్ధపడ్డాడో ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు నుండే తిరుగుబాటు ఎదురైంది (అపో.కార్యములు 7:35). మోషే దానిని దృష్టిలో పెట్టుకుని కూడా "ఇశ్రాయేలీయులను ఐగుప్తు లో నుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని" అనుండవచ్చు. ఈవిధంగా మోషే తనకు ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా దేవునిదగ్గరే పరిష్కరించుకుంటున్నాడు.

ఇలాంటి సిద్ధపాటు విశ్వాసులమైన మనమందరమూ కలిగియుండాలి.‌ అప్పుడే లోకంతో కానీ, సంఘంతో కానీ వ్యవహరించే‌‌టపుడు మనకు వారినుండి‌ తలెత్తే ప్రశ్నలు, సమస్యలు ముందే ఆలోచించుకుని, వాటికి సరైన పరిష్కారాలతో వారి ముందుకు వెళ్ళగలం. ఇలాంటి సిద్ధపాటు మనలో లేకపోతే, వెళ్ళినచోటల్లా అవమానాలను ఎదుర్కోవడం తప్ప మరే ఉపయోగం ఉండదు.

నిర్గమకాండము 3:14
అందుకు దేవుడునేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.

ఈవచనంలో దేవుడు మోషే అడిగిన ప్రశ్నకు సమాధానంగా "నేను ఉన్నవాడను" అని చెప్పడం మనం చూస్తాం. దీనర్థం ఆయన‌ తనంతట తానుగా ఉనికిలో ఉన్నవాడు, ఆయన ఉనికికి ఏదీ కారణం కాదు. ఆ ఉనికికి ప్రారంభం కానీ, అంతం కానీ లేనేలేవు.

యెషయా 40: 28 భూదిగంతములను సృజించిన యెహోవా "నిత్యుడగు దేవుడు" ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

ఈవిధంగా మన దేవునికి నిత్యత్వంలో ఉన్నవాడు అనే భావంలోనే యెహోవా (యాహ్వే) అనేపేరు వాడబడింది. ఇది త్రిత్వంలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడే ముగ్గురు వ్యక్తులకూ సమానంగా చెందుతుంది. అందుకే ఈ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమై అతనితో‌ మాట్లాడుతున్న "యెహోవా దూత" తన‌ గురించి ఈమాటలు చెబుతున్నాడు. ఆ యెహోవా దూత ప్రభువైన యేసుక్రీస్తు అని ఇప్పటికే నేను పైన సూచించిన "యెహోవా దూత" అనే వ్యాసంలో వివరించాను.

ప్రకటన గ్రంథము 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

అదేవిధంగా, ఆయన "ఉన్నవాడు" అన్నపుడు మార్పులేనివాడు అని కూడా అర్థం వస్తుంది. ఇది ఇశ్రాయేలీయులకూ ఎంతో ఓదార్పును అనుగ్రహించేమాట. ఆయన మారనివాడు కాబట్టే, పితరులతో ఆయన చేసిన నిబంధన విషయంలో మారిపోకుండా, ఇశ్రాయేలీయుల విడుదలకు మోషేను నియమిస్తున్నాడు. అందుకే ఆ ప్రజలతో నేను ఉన్నవాడను అని చెప్పమంటున్నాడు.

నిర్గమకాండము 3:15
మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.

6వ వచనంలో దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన నిబంధనను మోషేకు జ్ఞాపకం చెయ్యడానికి వారి పేర్లతో అతనికి పరిచయం చేసుకోవడం మనం‌ చూసాం. ఈ వచనంలో కూడా ఆయన అదే నిబంధనను ఇశ్రాయేలీయుల ప్రజలకు జ్ఞాపకం చెయ్యడానికి, తాను దానిని నెరవేర్చబోతున్నానని ప్రకటించడానికి, వారితో అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నన్ను పంపాడని చెప్పమని‌ మోషేతో చెబుతున్నాడు.

నిర్గమకాండము 3:16,17
నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని, ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.

ఈ వచనాలలో దేవుడు నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, పొదలో ఆయన‌ ప్రత్యక్షత గురించీ, ఆయన పలికిన మాటల‌ సంగతీ వారికి వివరించమని మోషేకు మరలా వాటిని జ్ఞాపకం‌ చెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల‌ పెద్దలను పోగు చేసి అన్నపుడు వారు తమ‌తమ గోత్రాలలో ఘనతపొందినవారిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇశ్రాయేలీయుల్లో‌ న్యాయాధిపతుల‌ వ్యవస్థ ప్రారంభం కాలేదు.

అదేవిధంగా ఈ 16వ వచనం, మన BSI తెలుగుబైబిల్ లో పూర్తిగా ముద్రించబడకుండా ఒక ప్రాముఖ్యమైన మాటను విడిచిపెట్టింది. అదేంటంటే ఆదికాండము 50:24 వ వచనంలో యోసేపు చనిపోయేముందు, ఇశ్రాయేలీయుల విడుదలనూ కనానును స్వాస్థ్యంగా పొందబోయేదానినీ జ్ఞాపకం‌ చేస్తూ "నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చును" అని పలుకుతాడు. ఈ 16వ వచనంలో దేవుడు దాని నెరవేర్పుగా I have surely visited you అని పలుకుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ లోనూ, గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుకబాష అనువాదంలోనూ ఇది మనకు కనిపిస్తుంది. దీనిగురించే దేవుడు 18వ వచనంలో ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా ఫరో ముందుకు వెళ్ళి "హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను" అని చెప్పమంటున్నాడు.

ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ వచనాలలో దేవుని సర్వాధికారం, దేనినైనా ఎదురులేకుండా చెయ్యగల సామర్థ్యం మనకు కనిపిస్తుంది. అందుకే "మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము" అంటున్నాడు. ఆయన ఈవిధంగా ఏదైనా పనిచేస్తానని పలికాడంటే అది జరిగించి తీరుతాడు.

దానియేలు 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

యెషయా 46: 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

నిర్గమకాండము 3:18
వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచిహెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణ మంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలను తోడుకునిపోయి ఫరో ముందు ఏం‌ చెప్పాలో మోషేకు వివరించడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన "వారు నీమాట విందురు" అని‌ పలకడం ద్వారా, మోషేకు ఆయన ఆ ప్రజలవిషయంలో నిశ్చయత కలుగచేస్తున్నాడు. దీనిని బట్టి ఒకవ్యక్తి దేవునిమాట (ఆయన పంపినవాని‌ మాట) వినేలా చేసేది ఆయన మాత్రమే. ప్రస్తుతం‌ సువార్త ప్రకటన విషయంలో కూడా, ఆయన నిర్ణయంలో ఉన్నవారందరూ ఆమాటలు విని మారుమనస్సు పొందేలా వారి హృదయాలను తెరుస్తుంది ఆయనే. ఈవిషయంలో సువార్తీకులు కేవలం ఆయన వాడుకునే సాధనాలే తప్ప, వారికున్న సామర్థ్యాన్ని బట్టి ఎవరూ సువార్తను‌ విని రక్షించబడడం‌ లేదు.

అపో.కార్యములు 16: 14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

అపో.కార్యములు 13: 48 అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

అదేవిధంగా ఆరోజుల్లో పలానా ప్రదేశం ఇన్ని కిలోమీటర్లు అని మనవలే కాకుండా, అక్కడికి వెళ్ళడానికి పట్టే సమయాన్ని బట్టి ఆ ప్రదేశం ఇన్నిరోజుల దూరంలో‌ ఉందని‌ లెక్కకట్టేవారు. ఐగుప్తునుండి, మోషేకు దేవుడు ప్రత్యక్షమైన సీనాయి పర్వతం దగ్గరకు వెళ్ళడానికి మూడురోజుల సమయం పడుతుంది (ఏక దాటిగా ప్రయాణం చేస్తే). అందుకే ఆయన ఫరోతో మేము "మూడురోజుల ప్రయాణమంత దూరంపోయి" మా దేవునికి బలి అర్పిస్తామని చెప్పమంటున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు తమ మందలతో పిల్లలతో ఏకదాటిగా ప్రయాణం చెయ్యలేదు కాబట్టి వారు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. పైగా వారు వేరు వేరు దారుల్లో ప్రయాణం చేశారు. 

అయితే కొందరు ఈమాటలను బట్టి, దేవుడిక్కడ ఫరోకు అబద్ధం చెప్పమంటున్నాడని ఆరోపిస్తుంటారు. కానీ ఈమాటలను మనం జాగ్రతగా పరిశీలిస్తే ఆయన ఇక్కడ "మేము తిరిగివస్తాము" అని చెప్పమనడం లేదు. ఫరో ఆ బలి అర్పణకు అనుమతించుంటే, వారు ఆ ప్రకారంగానే‌‌ బలి‌అర్పించి, అటునుంచి తమ‌ దేశానికి పయనిందురు. అయితే ఫరో దానికి ఒప్పుకోడని దేవునికి తెలుసు కాబట్టే, ఆ విధంగా చెప్పమంటున్నాడు. ఇందులో అబద్ధం ఏమీలేదు. వారు పలికినమాటలు ఫరోపై తీర్పు కాబోతున్నాయి. దీనిగురించి తరువాత అధ్యాయంలో మరింత వివరంగా‌ చూద్దాం.

ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, దేవుడు మోషేతో ఇశ్రాయేలీయుల పెద్దలను తీసుకుని ఫరో దగ్గరకు వెళ్ళమన్నపుడు, అక్కడ పలకమన్న మాటలు ఫరోకు మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నట్టే ఉన్నాయి తప్ప, ఫరోను కించపరుస్తున్నట్టు కానీ, రెచ్చగొడుతున్నట్టు కానీ లేవు. దీనినిబట్టి దేవునిపిల్లలు ఎటువంటివారితో మాట్లాడేటప్పుడైనా సరే మొదట ఇటువంటి‌ మర్యాదగల వైఖరినే అనుసరించాలి. ఈ వైఖరి మనం‌ సమస్యల్లో పడకుండా కూడా దోహదపడుతుంది.

నిర్గమకాండము 3:19,20
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును; కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయ దలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.

ఈ వచనాలలో దేవుడు ఆయన చెప్పమన్నమాటలను ఫరోతో చెప్పిన తరువాత అతని ప్రతిస్పందన ఎలా ఉంటుందో, చివరికి ఆయన ఏం చేసి ఇశ్రాయేలీయులను అక్కడినుండి‌ విడిపిస్తాడో కూడా మోషేకు వివరించడం మనం చూస్తాం. ఈమాటలవల్ల ఫరో వారి అభ్యర్థనను తిరస్కరించినపుడు ఇశ్రాయేలీయుల ప్రజలు తమ‌ విడుదల‌ విషయంలో మోషే పలికిన దేవునిమాటపై నమ్మకం కోల్పోకుండా ఉంటారు. ఒకవేళ ఆయన ఈమాటలు కనుక తెలియచెయ్యకుండా ఉంటే, ఇశ్రాయేలీయుల పెద్దల అభ్యర్థనను ఫరో తిరస్కరించినప్పుడు దేవునిమాట విషయంలో అపనమ్మికకు లోనౌతారు. ఆవిధంగా వారిని ప్రేరేపించిన మోషేను కూడా ఇబ్బందిపెడతారు. ఇటువంటి పరిస్థితి రాకుండానే దేవుడు జరగబోయేదానిని మోషేకు తెలియచేస్తూ, అదంతా ఆ ప్రజలకు తెలియచెయ్యమంటున్నాడు. దీనినిబట్టి, దేవుడు‌ పలికిన మాట విషయంలో ఒక వ్యక్తి అపనమ్మికకు లోనయ్యే అవకాశం ఆయన ఎప్పటికీ‌ కల్పించడని మనం అర్థం చేసుకోవాలి.

అందుకే నిత్యజీవానికి వారసులుగా పిలవబడ్డ విశ్వాసుల విషయంలో కూడా ఆయన, వారు ఈలోకంలో శ్రమలను అనుభవించాలని ముందే తెలియచేసాడు.

యోహాను 16: 33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

ఒకవేళ ఆయన ఇటువంటి హెచ్చరిక మనకు చెయ్యకపోతే, మనం కూడా ఈలోకంలో శ్రమలగుండా వెళ్ళవలసి వచ్చినపుడు‌ ఆయన వాగ్దానంపై అవిశ్వాసానికి లోనయ్యేవారం. అందుకే మనకు ఈలోకంలో సంభవించబోయే శ్రమల గురించి ఆయన ముందే తెలియచేసాడు. అపోస్తలులు కూడా దీనినే‌ బోధిస్తూ వచ్చారు.

అపో.కార్యములు 14: 22 శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

1పేతురు 4: 16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

కాబట్టి విశ్వాసులుగా పిలువబడేవారు ఎవరైనా అన్యాయంగా శ్రమలను ఎదుర్కొంటున్నపుడు, దేవుడు తమతో లేడని కానీ, తాము నమ్మే దేవుడు, దేవుడు కాదేమో అని‌ కానీ సందేహాలకు లోనవ్వకుండా ఆయనపై ఆధారపడాలి. ఎందుకంటే "ఫరో మీ మాట వినడని జరగబోయేదానికి ఇశ్రాయేలీయులకు ప్రకటించిన దేవుడు" మనకు కూడా ఈ లోకంలో శ్రమకలుగుతుందని ముందే తెలియచేసాడు.

యోహాను సువార్త 16:1-4 "మీరు అభ్యంతర పడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను". వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు "మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది". వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు. "అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను"

అదేవిధంగా ఈ సందర్భంలో ఆయన ఐగుప్తుపై కుమ్మరించబోయే తీర్పు గురించి కూడా జ్ఞాపకం చెయ్యడం‌ మనం చూస్తాం. ఈ విధంగా దేవుడు ఐగుప్తుపైకి పదితీర్పులను రప్పించడం ద్వారా ఆ దేశం నాశనానికి లోనై ఇశ్రాయేలీయులకు విడుదల లభించింది. ఆ తీర్పులు దేనికి దేనికి సంబంధించినవో, ఆ తీర్పుల వెనుకున్న ఆంతర్యం ఏమిటో రానున్న అధ్యాయాల్లో చూద్దాం.

నిర్గమకాండము 3:21,22
జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వెళ్ళేటపుడు ఎటువంటి సమృద్ధితో వెళ్తారో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన మొదటిగా "జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను" అంటున్నాడు. అంటే ఇంతవరకూ ఎవరైతే తమకు శత్రువులుగా మారి, వారిని‌ బాధించారో ఆ ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల‌ పట్ల ఆయన కటాక్షాన్ని పుట్టిస్తాడు. దీనిని‌బట్టి మన దేవుడు మానవులందరి హృదయాలనూ నియంత్రించగల శక్తిమంతుడని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతీ మనిషి ఆలోచననూ తనకు అనుకూలంగా మార్చుకునే సార్వభౌముడని అర్థమౌతుంది.

2కోరింథీయులకు 8: 16 మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు "హృదయములో పుట్టించిన" దేవునికి స్తోత్రము.

అదేవిధంగా ఇక్కడ "మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను" అని రాయబడిన దానినిబట్టి కొందరు ఇశ్రాయేలీయులు‌ చేసింది దోపిడీగా ఆరోపిస్తుంటారు. కానీ వారు ఐగుప్తీయులను దోచుకుందురు అన్నపుడు, వారికి చెందవలసినదానిని తీసుకోవడంగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారిజాతి, యోసేపు నుండీ ఐగుప్తుకు ఎంతోసేవ చేసింది కానీ, వారికంటూ ఐగుప్తులో తగిన బహుమానం ఏమీలేదు. చివరికి ఆ దేశం సజీవంగా ఉండడానికి కారణమైన యోసేపు సంతానానికి కూడా అక్కడ ఎటువంటి ప్రత్యేకవనరులూ లేవు. ఈ కారణంగా ఇంతకాలం ఇశ్రాయేలీయులను శ్రమదోపిడీ‌ చేసి వారు సంపాదించుకున్నదానిని ఆ ఇశ్రాయేలీయులు తిరిగి సొంతం చేసుకోవడంలో ఎటువంటి దోపిడీ లేదు. పైగా వీరేమీ ఐగుప్తీయుల‌ దగ్గర దౌర్జన్యంగా ఏమీ‌ లాక్కోలేదు. దేవుడు ఆ ప్రజలకు ఇశ్రాయేలీయులపై కటాక్షం కలుగచేసాడు‌ కాబట్టి హృదయపూర్వకంగానే అవన్నీ ఇచ్చారు. ఇది అబ్రాహాముకు దేవుడు చెప్పిన మాట ప్రకారం జరిగింది.

ఆదికాండము 15:14
వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. "తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు".

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.