పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక;17:1, 17:2,3, 17:4, 17:5,6, 17:7, 17:8 ,17:9, 17:10, 17:11-13, 17:14, 17:15, 17:16

నిర్గమకాండము 17:1 తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున- 

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పున ప్రయాణం చేస్తూ సీను అరణ్యం నుండి రెఫీదీముకు చేరుకున్నట్టు మనం చూస్తాం. యెహోవా మాట చొప్పున అంటే; మేఘస్థంబం ముందుకు సాగినప్పుడు వారు దానిని దేవుని అనుమతిగా భావించి ముందుకు సాగేవారు, ఆ మేఘము నిలిచినప్పుడు వారు కూడా ఆ ప్రాంతంలో నిలిచిపోయేవారు.

నిర్గమకాండము 13:21,22 వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

ఈ వచనాలలో దేవుడు మేఘస్థంబం ద్వారా అగ్ని స్థంబం ద్వారా ప్రజలను ఎలా నడిపిస్తున్నాడో మనం చూస్తాం. ప్రత్యక్షగుడారం నిర్మించాక కూడా ఇదే కొనసాగింది (నిర్గమకాండము 40:36,37). ఈవిధంగా ఆయన విమోచించిన ప్రజలకు పగటి ఎండదెబ్బ కానీ రాత్రి చీకటి, చలిల భయం కానీ లేకుండా ఆయన నడిపించాడు.

అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీయులు సీను అరణ్యం నుండి, రెఫీదీముకు చేరుకున్నట్టు రాయబడింది. ఐతే మోషే ఇశ్రాయేలీయుల సంచారక్రమాన్ని రాస్తున్నప్పుడు ఆ మార్గమధ్యలో‌ తారసపడిన మరికొన్ని ప్రాంతాలను కూడా ప్రస్తావించాడు (సంఖ్యాకాండము 33:12-14).

"ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున"

ఇశ్రాయేలీయులు చేరుకున్న ఈ రెఫీదీము ప్రాంతంలో వారికి త్రాగునీరు దొరకక పోవడం, వారు దేవుణ్ణి శోధించడానికి కారణమయ్యింది. అదెలాగో క్రింది వచనాలలో చూద్దాం.

నిర్గమకాండము 17:2,3 మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషేమీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచుఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు త్రాగు నీటికై మోషేతో వాదిస్తూ దేవుణ్ణి శోధించడం మనం చూస్తాం. అది తిరుగుబాటుగా ఎందుకు ఎంచబడిందంటే; వారు ఇప్పటికే దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను కళ్ళారా చూసారు, ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించడం, పూరేడు పక్షులను పంపి మాంసాన్ని సిద్ధపరచడం, మారా నీటిని మధురంగా మార్చడం ఇలా ఎన్నో చూసారు. కాబట్టి ఇప్పుడు త్రాగడానికి నీరు లేకపోతే ఆ నీటికై ఆయనకు ప్రార్థన చెయ్యాలి, ఆయన గతంలో చేసినట్టుగానే అద్భుతం ద్వారా వారికి నీటిని అనుగ్రహిస్తాడు. కానీ వారు అలాంటి విశ్వాసం కనపరచకుండా ఆయనను శోధించడం, ఆయన సేవకుడైన మోషే పై సణుగుకోవడం ప్రారంభించారు. మనమైతే అలా ఉండకూడదు. విశ్వాస జీవితయాత్రలో మనకు కూడా ఎన్నో ఇబ్బందులు, కొరతలు ఏర్పడుతుంటాయి. ఆ విషయం ప్రభువు ముందుగానే తెలియచేసాడు. ఆ సమయంలో మనం చేయవలసింది విశ్వాసంతో కూడి‌న ప్రార్థన. అందుకే "మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను" (యాకోబు 5: 13) అని రాయబడింది.

అదేవిధంగా ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పునే సీనునుండి రెఫీదీముకు చేరుకున్నారు. అయినప్పటికీ వారికి అక్కడ నీటి సమస్య తలెత్తింది. కాబట్టి దేవుని మార్గంలో పయనిస్తున్నప్పుడు ఎలాంటి లోటుపాట్లు, కష్టాలు తలెత్తవని మనం భావించకూడదు. అలాంటి సమస్యలను బట్టి ఈ మార్గం/పని దేవుని చిత్తం కాదేమో అనే నిర్ణయానికి కూడా రాకూడదు. కొన్నిసార్లు మనం దేవుని మార్గంలో పయనిస్తున్నప్పుడు కూడా ఆటంకాలు, ఉపద్రవాలు, కష్టనష్టాలు సహజం. అవి మనకు పరీక్షలుగా ఉంటాయి. భక్తుల జీవితాలలో మనం ఇదే గమనిస్తాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని మార్గమైన కనానులో సంచరిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నిర్గమకాండము 17:4 అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను.

ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల త్రాగు నీటికై దేవునికి ప్రార్థన చెయ్యడం మనం చూస్తాం. అతను ఇశ్రాయేలీయుల్లా దేవుణ్ణి శోధించడం లేదు ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఇశ్రాయేలీయులు తనను చంపుతారేమో అనే సందేహం కలిగినప్పటికీ ఆ పరిస్థితిలో కూడా ప్రార్థనే చేస్తున్నాడు. నిజమైన దైవజనుడు ఇలాంటి వైఖరినే కలిగియుంటాడు. అతను కష్టసమయంలో దేవునిపై ఆధారపడతాడు తప్ప, ఇశ్రాయేలీయుల్లా తిరుగుబాటు చెయ్యడు.

"కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను"

ఈ మాటలను బట్టి ఇశ్రాయేలీయులు మోషేతో ఎలాంటి వాదన పెట్టుకున్నారో మనకు అర్థం ఔతుంది. వారు అతనిపై ఎలాంటి గౌరవం చూపించకుండా కోపంగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకే మోషే భయంతో ఇలా మాట్లాడుతున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించింది మోషే కాదు. దేవుడే వారిని విడిపించాడు, ఆ విడుదలలో మోషే ఆయన సాధనం మాత్రమే. ఒకవేళ మోషేనే తనంతట తాను ఆ ప్రజలను విడిపిస్తే ముందస్తుగా వారికి కావలసిన ఆహారం, త్రాగు నీరు సిద్ధం చేసుకుని ఆ పని చేసేవాడు. అన్ని‌ లక్షలమందికి ఆహారం, త్రాగు నీరు సిద్ధం చెయ్యడం అసాధ్యం కాబట్టి, అతను అలాంటి సాహసానికి పూనుకునేవాడు కాదు. ఇశ్రాయేలీయులు ఇదంతా విడిచిపెట్టి, దేవుడు చేసిన అద్భుతాలను మరచిపోయి "మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరి" అంటూ మోషే అహరోనులను నిందిస్తున్నారు.

నిర్గమకాండము 17:5,6 అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

ఈ వచనాలలో దేవుడు మోషే ప్రార్థనకు బదులిస్తూ ఇశ్రాయేలీయుల పెద్దలను తీసుకుని పోయి ఒక బండను కొట్టమనడం, దాని ద్వారా ప్రజలకు నీటిని అనుగ్రహిస్తాననడం మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలీయుల పెద్దలను కూడా ఎందుకు తీసుకువెళ్ళమంటున్నాడంటే ఆ అద్భుతానికి వారు సాక్ష్యంగా ఉండి ప్రజలకు ప్రకటించాలి. తర్వాత ఆ నీటిని త్రాగుతున్న ప్రజలందరూ కూడా దానికి సాక్ష్యమే. జరిగిన ఈ అద్భుతం గురించి కీర్తనాకారుడి మాటల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం (కీర్తనలు 78: 20, కీర్తనలు 105: 41). ఇప్పటికీ సౌదీ అరేబియాలో చీల్చబడిన ఆ బండనూ దానినుండి ప్రవాహంగా నీరు బయలువెళ్ళినప్పుడు ఆ రాతినేలపై నీటిరాపిడి గుర్తులనూ మనం చూడవచ్చు. ఈ వివరాలన్నీ డాక్టర్ జాన్ గిల్ మరియు ఆడాం క్లార్క్ గార్లు తమ వ్యాఖ్యానాలలో పొందుపరిచారు.

అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఆ చీల్చబడిన బండను యేసుక్రీస్తుకు సాదృష్యంగా తన పత్రికలో ప్రస్తావించారు (1 కోరింథీ 10: 4) ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ బండనుండి నీటిని పొందుకున్నారో మనం కూడా యేసుక్రీస్తు నుండి నిత్యజీవం కొరకైన జీవజలాన్ని పొందుకుంటున్నాం (యోహాను 4: 10, యోహాను 7: 38). గమనించండి; ఇది సాదృష్యం మాత్రమే. అంతేతప్ప నిజంగానే ఆ బండ క్రీస్తు అని కాదు.‌

నిర్గమకాండము 17:7 అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించిన ఆ ప్రాంతానికి మస్సా మరియు మెరీబా అని పేర్లు పెట్టబడడం మనం చూస్తాం. వారు దేవుణ్ణి శోధించడం ఇది నాలుగవ సారి.

నిర్గమకాండము17:8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రా యేలీయులతో యుద్ధముచేయగా-

ఈ వచనంలో అమాలేకీయులు అనే జాతి ప్రజలు, తమ మార్గంలో వెళ్తున్న ఇశ్రాయేలీయులపై అన్యాయంగా యుద్ధానికి పాల్పడడం‌ మనం చూస్తాం. ఇశ్రాయేలీయులేమీ వారిని ఇబ్బంది పెట్టలేదు, వారిని రెచ్చగొట్టనూ లేదు అయినప్పటికీ వారు యుద్ధానికి సిద్ధపడ్డారు, కొల్ల సొమ్ము దోచుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేసారు, ప్రజల్లో వెనుక నడుస్తున్న వృద్ధుల వంటి‌ బలహీనులను చంపివేసారు (ద్వితీయోపదేశకాండము 25:17,18) ఐగుప్తు నుండి తమ స్వాస్థ్యం వైపు పయనిస్తున్న దేవునిప్రజలపై అన్యుజనుల తిరుగుబాటుకు ఇది ప్రారంభం, వారు పెట్టుకుంటుంది దేవుని ప్రజలతో కాబట్టి వారి అంతం నిత్యనాశనమే (సంఖ్యాకాండము 24:20).

గమనించండి; అమాలేకీయులు ఇశ్రాయేలీయుల వెనుక బలహీనులను చంపుతున్నప్పుడు ఫరోనూ అతని సైన్యాన్నీ నాశనం చేసినట్టు నాశనం చెయ్యలేదు. ఆ బలహీనులను కాపాడలేదు. కానీ ఆ అమాలేకీయులకు నిత్యనాశనం విధించాడు, అలానే క్రింది వచనాల ప్రకారం వారితో యుద్ధం చెయ్యమన్నాడు. కాబట్టి సార్వభౌముడైన దేవుడు తన నిర్ణయాన్ని బట్టే కాపాడతాడు లేదా అప్పగిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా మన కోణం నుండి కాకుండా ఆయన కోణం నుండి అర్థం చేసుకోవాలి.

నిర్గమకాండము 17:9 మోషే యెహోషువతో మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.

ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులను కూడా యుద్ధానికి సిద్ధపరచమని యెహోషువను ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మనకు ప్రాణ హాని సంభవిస్తున్నప్పుడు, అన్యాయంగా మనపైకి ప్రజలు దండెత్తినప్పుడు యుద్ధం చెయ్యడం తప్పు కాదు. బైబిల్ ప్రాణరక్షణలో భాగంగా చేసే ప్రతిదాడిని నిషేధించదు. అబ్రాహాము మొదలుకుని ఎందరో భక్తులు తమ‌ ప్రాణ, ఆస్తుల రక్షణకై యుద్ధం చేసారు (ఆదికాండము 14:14 వ్యాఖ్యానం చూడండి)

అదేవిధంగా ఇక్కడ యెహోషువ పేరును మొదటిగా చూస్తున్నాం. మోషే తర్వాత ఇశ్రాయేలీయులను‌ నడిపించే నాయకుడ్ని దేవుడు ఇక్కడినుండే సిద్ధం చేస్తున్నాడు, అందుకే ప్రజలను యుద్ధానికి సిద్ధం చేసే బాధ్యత అతనికి అప్పగించబడింది. అలానే ఇశ్రాయేలీయులు యుద్ధం చెయ్యడానికి కావలసిన ఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయనే సందేహం ఇక్కడ కలగవచ్చు. ఆ కాలంలో జంతువుల నుండీ దొంగల నుండీ తమను కాపాడుకోవడానికి ప్రజలు ఆయుధాలను కలిగియుండేవారు. ఇశ్రాయేలీయులు అలా తమదగ్గర ఉన్న ఆయుధాలతోనే అమాలేకీయులతో యుద్ధం చెయ్యబోతున్నారు. వాటికి తోడు సముద్రంలో చనిపోయిన ఐగుప్తీయుల శవాలు ఒడ్డుకు కొట్టుకువచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు వాటిని చూసినట్టు మనం చదువుతాం. బహుశా ఆ సైనికుల ఒరలో ఉన్న ఆయుధాలను కూడా ఇశ్రాయేలీయులు కొల్లసొమ్ముగా తీసుకుని ఉండవచ్చు.

నిర్గమకాండము 17:10 యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి.

ఈ వచనంలో యెహోషువ మోషే మాట ప్రకారం అమాలేకీయులతో యుద్ధం చెయ్యడం, మోషే, అహరోను, హూరు అనేవారు కొండ శిఖరంపైకి ఎక్కడం మనం చూస్తాం. యూదా రచనలు మరియు యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ ప్రకారం ఈ హూరు మోషే అక్కయైన మిర్యాముకు భర్త. తర్వాత కాలంలో ఈ హూరు మనువడైన బెసలేలు ద్వారానే దేవుడు తన మందిరపు పని చేయించుకున్నాడు (నిర్గమకాండము 35:31).

నిర్గమకాండము 17:11-13 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.

ఈ వచనాలలో మోషే తన చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ అమాలేకీయులను జయించడం మనం చూస్తాం. చేతులు పైకి ఎత్తడం అనేది అతను దేవునికి చేస్తున్న ప్రార్థనకు గుర్తుగా ఉంది (నిర్గమకాండము 9:33). కాబట్టి సంఘంలో మోషేలా ప్రార్థించేవారూ ఉండాలి, యెహోషువాలా యుద్ధం (పని) చేసేవారూ ఉండాలి. ఈ రెండింటిలో ఏది లోపించినా ఆ సంఘం జయించలేదు.

నిర్గమకాండము 17:14 అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.

ఈ వచనంలో దేవుడు మొదటిసారిగా జరిగిన సంఘటనను గ్రంథంలో రాయమనడం మనం చూస్తాం. అమాలేకీయుల సంఘటన గురించి రాయాలంటే అప్పటివరకూ జరిగిన చరిత్రను కూడా రాయాలి. ఈవిధంగా దేవుడు చరిత్రను లిఖింపచేసి తన ప్రజలకు అందిస్తూ వచ్చాడు (భద్రపరిచాడు).

"అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును" అని ఆయన ప్రమాణం‌ చేసిన ప్రకారం ప్రస్తుతం ఆ జాతి ఆనవాళ్ళు కూడా మనకు దొరకవు. క్రీస్తు జననానికి ముందే వారు అంతరించిపోయారు.

నిర్గమకాండము 17:15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి-

యెహోవా నిస్సీ అంటే యెహోవా మన ధ్వజము అని అర్థం.

నిర్గమకాండము 17:16 అమాలేకీ యులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.

ఈ వచనంలో యెహోవా దేవునికి అమాలేకీయులతో తరతరాలకూ యుద్ధం కలుగుతుందని మనం చూస్తాం. దేవుని ప్రజలకు విరోధంగా పోరాడడం ఆయన సింహాసనానికి విరోధంగా చేతులు ఎత్తడమే. అందుకే ఆ జాతితో ఆయనకు తరతరాలు యుద్ధం‌ కలిగింది. ఇశ్రాయేలీయులు రాజ్యంగా స్థిరపడినప్పుడు వారి మొదటి రాజైన సౌలు ద్వారా ఆ యుద్ధం ప్రారంభించబడగా (1 సమూయేలు 15:1-8) దావీదు దానిని విజయవంతంగా కొనసాగించాడు (1 సమూయేలు 30:15-18).

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.