పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 20:1, 20:2, 20:3 , 20:4, 20:5 , 20:6 ,20:7 , 20:8 , 20:9 , 20:10 , 20:11 , 20:12 , 20:13 , 20:14 , 20:15 , 20:16 , 20:17 , 20:18,19 , 20:20 , 20:21 , 20:22,23 , 20:24 , 20:25 , 20:26

 

బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన అంశమైన మోషే ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ధ్యానించబోతున్నాము.

1. గత అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతం దగ్గరకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి దిగివచ్చినప్పుడు "ఉరుములు, మెరుపులు, దేవదూతల బూరద్వనులతో" ఆ ప్రాంతమంతా కంపించినట్టు అది చూసిన ప్రజలంతా వణికిపోయినట్టు మనం చూసాం. ఆయన ధర్మ శాస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడే అంత భయంకరుడిగా వస్తే, దాని ఉల్లంఘన విషయంలో తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఇంకెంత భయంకరుడుగా వస్తాడో మనం ఆలోచించాలి (యెషయా 64:1-3).

2. ధర్మశాస్త్రంలోని ఈ పది ఆజ్ఞలను స్వయంగా దేవుడే తన వ్రేలితో రాసియిచ్చాడు, నిబంధన మందసంలో కూడా ఈ పది ఆజ్ఞలున్న రెండు పలకలనే ఉంచడం జరిగింది (నిర్గమకాండము 34:28 ద్వితీయోపదేశకాండము 4:13, ద్వితీయోపదేశకాండము 10:4). ధర్మశాస్త్రంలోని మిగిలిన మాటలను మోషే ఆత్మ ప్రేరేపణతో, దేవుడు చెప్పగా రాస్తే ఈ పది ఆజ్ఞలను మాత్రం స్వయంగా దేవుడే రెండు పలకలపై రాసాడు. కాబట్టి ఈ పది ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యతను కలిగియున్నాయి. అలా అని మిగిలిన మాటలు ప్రాముఖ్యమైనవి కావు అని కాదు కానీ, ఈ పది ఆజ్ఞల్లోని నైతిక, ఆధ్యాత్మికమైన విషయాలు మొత్తం లేఖనాలకు సారాంశంగా ఉన్నాయి. లేఖనాలలోని మిగిలిన బోధయంతా ఈ పది ఆజ్ఞల్లో ఏదోఒక దాని పరిధిలో చెప్పబడినవే. ఒకవేళ ఈ పది ఆజ్ఞలు main headings అనుకుంటే వీటి వివరణలే మిగిలిన లేఖనాలు. ఈ పది ఆజ్ఞల పరిధిలోనే సువార్తలతో సహా లేఖనాలు అన్నీ రాయబడ్డాయి. కాబట్టి ఈ పది ఆజ్ఞలు దేవుని స్వభావం యొక్క ప్రతిబింబమని మనం అర్థం చేసుకోవాలి.

3. కొందరు అవగాహన లేని బోధకులు కొన్ని లేఖనాలను అపార్థం చేసుకుని ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఈ పది ఆజ్ఞలతో కలపి మాట్లాడుతుంటారు. ధర్మశాస్త్రం కొట్టివెయ్యబడిందంటే క్రీస్తులో నెరవేరిపోయిన విధిరూపకమైన ఆజ్ఞలు (క్రీస్తుకు ఛాయగా ఉన్న ఆచారసంబంధమైన ఆజ్ఞలు) కొట్టివేయబడ్డాయని భావం కానీ ఈ పది ఆజ్ఞలు కూడా కొట్టివెయ్యబడ్డాయని కాదు ( ఎఫెసీ 2:14). ఈ పది ఆజ్ఞలు దేవుని స్వభావానికి ప్రతిబింబాలు కాబట్టి అవి కొట్టివెయ్యబడడం, మార్చివెయ్యబడడం ఎప్పటికీ జరగదు. అందుకే మనం ఇప్పటికీ ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు వంటి నైతిక నియమాలను కలిగియున్నాం. నూతననిబంధన కూడా మనకు ఇదే బోధిస్తుంది. మనకు మాదిరియుంచిపోయిన యేసుక్రీస్తు ఈ ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి మనమూ వాటిని నెరవేర్చబద్ధులమై యున్నాం (1 పేతురు 2:21).

4. మనం క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడే ప్రక్రియలో ఈ పది ఆజ్ఞలు మనకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. మనం వీటిని పాటిస్తాం కాబట్టి నీతిమంతులం కాలేము కానీ, తన స్వంత నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన నీతికి గుర్తుగా మనం వీటిని పాటించాలి. కాబట్టి మనం ఈ పది ఆజ్ఞలను ఉల్లఘించకుండా మన క్రైస్తవ స్వేచ్చను అనుభవించాలి.

5. నూతన నిబంధన మనల్ని ఈ పది ఆజ్ఞలు నెరవేర్చడానికి ఎంతగానో ప్రేరేపిస్తుంది. అందుకే ఆ పది ఆజ్ఞల్లో బోధించబడిన నైతిక నియమాలకు విరుద్ధంగా నడుచుకోవద్దని పదే పదే హెచ్చరిస్తుంది.

రోమీయులకు 13:8-10 ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

ఎఫెసీయులకు 6:1-3 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

యాకోబు 2: 9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం:
1 దేవునియొక్క నీతి ప్రమాణమేంటో మనకు తెలియచెయ్యడం.
2 అది మనం మన స్వంత శక్తివలన అందుకోలేమని చూపించడం.
3 ఆ కారణంగా మనుషులంతా ఆయన దృష్టికి పాపులయ్యారని చూపించడం.
4 అందరి పరిస్థితి అలానే ఉంటే దానినుండి విడిపించే పరిష్కారం కోసం ఆలోచించేలా చెయ్యడం.

గలతియులకు 3: 24 కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

5 సామాజికంగా కూడా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.‌ ఇందులో చెప్పబడిన శిక్షలకు భయపడి కూడా కొందరు చెయ్యాలనుకున్న దుష్టత్వాన్ని చెయ్యలేరు.

6 ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలనే ఉద్దేశంతోనే మనకు విశ్వాసం అనుగ్రహించబడింది. విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచేవారిగా ఉంటారు.

రోమీయులకు 3:31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.

నిర్గమకాండము 20:1
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.

ముందటి అధ్యాయంలో చూసిన విధంగా దేవుడు సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరూ వినేలా ఈ పది ఆజ్ఞలను వెల్లడిస్తున్నాడు. అవి రెండు రాతిపలకలపైన రాయబడ్డాయి. యూదా పండితుల అభిప్రాయం ప్రకారం; ఆ పది ఆజ్ఞలలో దేవునికి సంబంధించిన మొదటి నాలుగు ఆజ్ఞలూ ఒక పలకపై రాయబడితే మిగిలిన ఆరు ఆజ్ఞలూ మరోపలకపై రాయబడ్డాయి. మొదటి పలకపై రాయబడిన నాలుగు ఆజ్ఞలూ దేవుణ్ణి ప్రేమించాలని తెలియచేస్తుంటే రెండవ పలకపై రాయబడిన ఆరు ఆజ్ఞలూ పొరుగువారిని ప్రేమించాలని తెలియచేస్తున్నాయి. మొదటిది దేవునిపై ప్రేమ, రెండవది మనిషిపై ప్రేమ. ఇవి రెండూ విడదీయరాని సంబంధం కలిగియున్నాయి. ఎలాగంటే, దేవుణ్ణి యధార్థంగా ప్రేమించలేని వారు సాటిమనిషిని కూడా యధార్థంగా ప్రేమించలేరు. ఒకవేళ ఏదో స్వార్థంతో అలా చేయవచ్చు కానీ యధార్థంగా ఐతే ప్రేమించలేరు. అలానే సాటిమనిషిని ప్రేమించలేనివారు దేవుణ్ణి యధార్థంగా ప్రేమించలేరు.

1యోహాను 4: 20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.

కాబట్టి పొరుగువాడిని ప్రేమించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు.

రోమీయులకు 13:8-10 ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

నిర్గమకాండము 20:2
నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని.

"నీ దేవుడనైన యెహోవాను నేనే"

ఎవరైనా ఒక రాజు లేదా చక్రవర్తి ఏదైనా శాసనం చేసేటప్పుడు తన పేరుతోనే దానిని చేస్తాడు. అలానే ఇక్కడ దేవుడు కూడా తన ఆజ్ఞలను వివరించడానికి ముందు యెహోవా అనే తన నామాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా అనే ఆ నామానికి భయంకరుడు అనే బిరుదుకూడా ఉంది (కీర్తనలు 76:11). కాబట్టి ప్రజలందరూ భయంకరుడైన ఆయన నామానికి లోబడి ఆ నామం పేరిట జారీచెయ్యబడుతున్న ఆజ్ఞలను (శాసనాలను) గైకొనాలి.

ద్వితీయోపదేశకాండము 28:58,59 నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును.

అదేవిధంగా సృష్టికర్తగా ఆయన అ‌ందరికీ దేవుడే అయినప్పటికీ ఇశ్రాయేలీయులతో ఆయనకున్న ప్రత్యేక సంబంధాన్ని బట్టి, అంటే వారిని విమోచించడాన్ని బట్టి మరియు వారితో నిబంధన చేసుకోవడాన్ని బట్టి "నీ దేవుడైన యెహోవాను నేనే" అంటున్నాడు. ఐతే ఆయన బయలుపరుస్తున్న ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలీయులతో పాటుగా ప్రజలందరూ పాటించబద్దులైయున్నారు. సృష్టికర్తయైన ఆయన ఆజ్ఞలకు సృష్టియావత్తూ లోబడవలసిందే. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు అన్యులు, ఇశ్రాయేలీయులు అనే‌బేధం లేకుండా ఈ పది ఆజ్ఞలను బట్టే అందరికీ తీర్పుతీరుస్తాడు.

"నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని"

ఈమాటల్లో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల జరిగించిన మేలును జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆయన అనుకుంటే; ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నపుడే వారికి పది ఆజ్ఞలను షరతులుగా వాటికి లోబడితే మిమ్మల్ని ఐగుప్తునుండి విడిపిస్తానని చెప్పుండేవాడు. కానీ ఆయన అలా చెయ్యకుండా ముందు వారిని ఆ దాసత్వం నుండి విడిపించి దానికి  కృతజ్ఞతగా ఆయన ప్రేమకు లోబడమంటున్నాడు (తన ఆజ్ఞలను గైకొనమంటున్నాడు) ఆయన వారిని ప్రేమించి మేలు చేసాడు కాబట్టి వారు కూడా ప్రతిస్పందనగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనడంలోనే ఆయనపై వారికున్న ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది ( యోహాను 14:21). మన రక్షణలో కూడా ఆయన కొన్ని ఆజ్ఞలను జారీ చేసి వాటిని పాటించి మనల్ని మనం రక్షించుకోవాలని చెప్పడం లేదు ( తీతుకు 3:5), మొదట మనల్ని పాపమనే అంధకారం నుండి విడిపించి మన పాపాలను క్షమించి, ఉగ్రతనుండి తప్పించి, అప్పటినుండి మారుమనస్సుకు తగిన క్రియలను చెయ్యమని (అపొ.కార్యములు 26:20), ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనమని మాత్రమే బోధిస్తున్నాడు.

నిర్గమకాండము 20:3
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

ఇది పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. ఒకవిధంగా ఇది మిగిలిన ఆజ్ఞలన్నిటికీ పునాదిగా చెప్పబడింది. ఎందుకంటే; ఈ ఆజ్ఞను పాటించేవారు ఆ దేవుడు ఆజ్ఞాపిస్తున్న మిగిలిన ఆజ్ఞలను కూడా గైకొంటారు. అదేవిధంగా ఈ ఆజ్ఞను పాటించేవారు ఆ ఒక్కడైయున్న దేవుని ఆజ్ఞలను తప్ప మరెవ్వరి ఆజ్ఞలనూ పాటించకుండా జాగ్రతపడతారు.

ఇంతకూ ఆయనతప్ప వేరొక దేవుడు మనకు ఎందుకు ఉండకూడదంటే; బైబిల్ చరిత్ర ప్రకారం ఆయనమాత్రమే ఈ సమస్త సృష్టినీ మనిషినీ సృష్టించాడు. ఆయన మాత్రమే సమస్త జీవరాశులనూ పోషించి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అనేది న్యాయమైన ఆజ్ఞ. ఉదాహరణకు ఒక తండ్రి ఎలాగైతే తనపిల్లలు తనను మాత్రమే తండ్రిగా గౌరవించాలని కోరుకుంటాడో ఈ ఆజ్ఞలో కూడా అలాంటి న్యాయబద్ధమైన కోరికే మనకు కనబడుతుంది. మొదటి మనిషిని సృష్టించింది దేవుడైన యెహోవానే. ప్రారంభ మానవజాతి ఆయనను మాత్రమే దేవునిగా గుర్తించి ఆరాధించింది. తరువాత కాలంలో మానవులు విస్తరించి భూమియంతా చెదరిపోయినప్పుడు ఎవరికివారు స్వంత మతాలనూ దేవుళ్ళనూ కల్పించుకున్నారు. అలా కల్పించబడిన మతాల వల్ల దేవుళ్ళవల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదు. అన్నిటినీ కలిగించినవాడు దేవుడు ఔతాడు తప్ప, కల్పించబడినవాడు దేవుడు కాలేడు. వాస్తవమైన దేవుణ్ణి తమ దేవునిగా కలిగియున్నవారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు.

అంతేకాకుండా, సృష్టికర్తయైన దేవునికి ప్రతిగా వేరొక కల్పిత దేవుణ్ణి పూజించేవారు ఘోరపాపం చేస్తూ నిజమైన దేవుని ఉగ్రతకు గురౌతారు. ఉదాహరణకు ఒక కుమారుడు తనను కని పోషించిన తండ్రికి బదులు ఏదో విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని తండ్రిగా గౌరవిస్తే ఎలాగైతే తండ్రి ఆగ్రహానికి గురౌతాడో అలానే సృష్టికర్తయైన దేవునికి ప్రతిగా దేవుళ్ళను కల్పించుకున్నవారు ఆ దేవుని ఆగ్రహానికి లోనౌతారు. అందుకే ఆయనతప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. అందుకే ఈ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడుతున్నప్పటికీ ప్రపంచ మానవాళి మొత్తం ఈ ఆజ్ఞపరిధిలోనే తీర్పు తీర్చబడుతుంది ( రోమా 1:19-24).

ఈ ఒక్కడైయున్న దేవుని గురించి ఆయన చేత సృష్టించబడిన సృష్టిలో ఛాయలూ, ఆయనచేత లిఖించబడిన వాక్యంలో స్పష్టమైన ప్రత్యక్షతలూ మనం గమనిస్తాం. అందుకే ఆయన గురించి తెలుసుకోవడానికి లేఖనాలను ధ్యానిస్తుండాలి, సృష్టిలో ఆయన అదృష్యలక్షణాలను గుర్తించి ఆయనను ఆరాధిస్తుండాలి.

ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అన్నప్పుడు, ఆయన తన గురించి ఎలా బయలుపరచుకున్నాడో అలానే ఆయనను గుర్తించి ఆరాధించాలి. లేకపోతే లేఖనాల్లో బయలుపరచబడిన దేవుణ్ణి కాకుండా, మన స్వంత ఊహల్లో నుండి పుట్టిన దేవుణ్ణి ఆరాధించేవారం ఔతాం.. దురదృష్టవశాత్తూ నేడు క్రైస్తవులుగానే పిలవబడుతూ "అసమర్థుడైన తన చిత్తాన్ని నెరవేర్చుకోలేని దేవుణ్ణి పూజించే అర్మీనియన్లు" "మరియను కూడా దేవతగా పూజించే రోమన్ కేథలిక్కులు" "లేఖనాలు బోధిస్తున్న త్రిత్వ సిద్ధాంతాన్ని విస్మరించే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఏకత్వవాదులవంటి గుంపులు" లేఖనాలలో బయలుపరచబడిన ఆయనను కాకుండా మరొకదేవుణ్ణి ఆరాధించేవారే.

ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు, మనం ఆయనను తప్ప మరెవ్వరినీ ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహించినవాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా ఆయనను మాత్రమే ప్రేమించి ఘనపరచాలి ( మత్తయి 10:37). ఒక్కమాటలో చెప్పాలంటే ఏ విషయంలోనూ కూడా ఆయన స్థానాన్ని మరొకరికి ఆపాదించకూడదు. పాతనిబంధనలో న్యాయాధిపతులు దైవాలుగా సంబోధించబడినప్పటికీ (కీర్తనలు 82) ఆ పదప్రయోగం కేవలం వారు దేవుని ప్రతినిధులు అనేభావంలోనే వాడబడింది తప్ప, వారు కూడా దేవునితో పాటు దేవుళ్ళు అని కాదు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అంటే, ఆయనను విడిచిపెట్టి మరొకర్ని దైవంగా భావించడానికి కానీ, లేక ఆయనతో పాటు మరొకర్ని దైవంగా పూజించడానికి కానీ ఆస్కారం లేదు.

ఈ ఆజ్ఞ ద్వారా నిషేధించబడిన కొన్ని పాపాలు:

1. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆయన మాత్రమే దేవుడు. ఇందువల్ల దేవుడు లేడని వాదించే నాస్తికమతం ఇక్కడ నిషేధించబడింది.

2. ఆయన మాత్రమే మనకు దేవుడు కాబట్టి, ఆ దేవుడు తనను తాను బయలుపరచుకున్న మాధ్యమాన్ని పరిశీలించకుండా ఉండడం (వాక్యాన్ని అశ్రద్ధ చెయ్యడం) ఇక్కడ నిషేధించబడింది. ఎందుకంటే ఎక్కడ లేఖనాల అజ్ఞానం ఉంటుందో అక్కడ దేవుడు తెలియబడని దేవునిగా మిగిలిపోతాడు ( యోహాను 4:22, అపో. కార్యములు 17:23). ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు కాబట్టి, ఆయన మాత్రమే మనకు దేవుడు కాబట్టి, ప్రతీఒక్కరూ ఆయనగురించి తెలుసుకోవడం తప్పనిసరి.

3. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు కాబట్టి, బహుదేవతారాధన ఇక్కడ నిషేధించబడింది.

4. ఆయన మాత్రమే మనకు దేవుడు కాబట్టి మనిషికి ఇష్టానుసారంగా జీవించే స్వేచ్చ ఇక్కడ నిషేధించబడింది. ఆ ఒక్కడైయున్న దేవుని ఆజ్ఞల పరిధిలోనే మనిషి తన స్వేచ్చను అనుభవించాలి. అది మనిషికే ప్రయోజనకరం.

5. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు కాబట్టి, మనం ఆయనపై తప్ప మరొకరిపై దేవునిపై ఆధారపడినట్టుగా ఆధారపడడం, ప్రేమించడం, ఆరాధించడం ఇవన్నీ ఇక్కడ నిషేధించబడ్డాయి.

6. ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఆయనకోసం కాకుండా మరి దేనికోసమైనా బ్రతకడం; ఉదాహరణకు భోజనం చెయ్యడమే జీవితగమ్యం, ధనాన్ని సంపాదించడమే జీవిత ఆశయం ఇలా మరిదేనికోసమైనా బ్రతకడం ఇక్కడ నిషేధించబడింది ( పిలిప్పీ 3:19, మత్తయి 6:24).

నిర్గమకాండము 20:4
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

మొదటి ఆజ్ఞలో ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, ఆయన మాత్రమే దేవునిగా ఉండాలని బోధించబడితే ఈ ఆజ్ఞలో ఒక్కడైయున్న ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించకూడదో వివరించబడింది.
"పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను" ఆయనకు ఆపాదించి ఆ పోలికలో విగ్రహాలను చేసుకుని ఆయనను ఆరాధించకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మయైన, అనంతుడైన దేవుడు. భూమిపై నివాసులు ఇలాంటిపనులు చేస్తున్నందుకే ఆయన దృష్టికి ఘోర పాపులుగా గుర్తించబడుతున్నారు.

రోమీయులకు 1:23,24 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

ఇశ్రాయేలీయులు ఇటువంటి తప్పిదం చెయ్యకుండా పదే పదే హెచ్చరించబడ్డారు.

ద్వితీయోపదేశకాండము 4:12-19 యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూప మును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

ఈవిధంగా మనం ఆయనకు ఏదో ఒక రూపాన్ని ఆపాదించి ఆ రూపాలకు సాగిలపడకూడదు, పూజింపకూడదు అనే ఆజ్ఞను బట్టి, మనం ఆయనను ఆయన ప్రత్యక్షపరచిన పద్ధతిలో ఆరాధించాలని, మానవ కల్పిత పద్ధతులలో ఆయనను సేవించకూడదని హెచ్చరించబడుతున్నాం. ఈ హెచ్చరిక ప్రారంభం నుండే బయలుపరచబడింది. అందుకే కయీను దేవుడు ప్రత్యక్షపరచిన బలిపద్ధతిలో‌ కాకుండా కేవలం అర్పణ ద్వారా ఆయనను సమీపించాలని (ఆరాధించాలని) ప్రయత్నించినప్పుడు ఆయన చేత తృణీకరించబడ్డాడు. హేబెలు ఆయన ప్రత్యక్షపరచిన బలిఅర్పణ ద్వారా ఆయనను సమీపించినప్పుడు అంగీకరించబడ్డాడు (ఆదికాండము 4:3,4). తరువాత కాలంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు "యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని" బలిపీఠం దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆయన వారిని కాల్చివేసినట్టు చదువుతాం ( లేవీకాండము 10:1,2). యాజకులు మాత్రమే బలిని అర్పించాలనే ధర్మశాస్త్ర నియమాన్ని మీరుతూ సౌలు బలిని అర్పించినప్పుడు, సమూయేలు చేత గద్దించబడి రాజుగా ఉండకుండా త్రోసివేయబడినట్టు చదువుతాం ( 1 సమూయేలు 13:9-13). ఉజ్జా లేవీయులు మాత్రమే మోయవలసిన మందసాన్ని ముట్టుకున్న కారణం చేత దేవుని కోపానికి లోనై అక్కడికక్కడే మరణించినట్టు కూడా చదువుతాం ( 2 సమూయేలు 6:6,7). ఈ సందర్భాలన్నీ మనకు "దేవుణ్ణి" ఆయన ఆజ్ఞాపించిన పద్ధతిలోనే సేవించాలని, మానవకల్పిత‌ పద్ధతులతో ఆయనను ఆరాధించే ప్రయత్నం చెయ్యకూడదని హెచ్చరిస్తున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు; శాస్త్రులూ పరిసయ్యులూ మానవకల్పిత పద్ధతులను దైవోపదేశాలుగా బోధించి, వాటిద్వారా ఆయనను ఆరాధిస్తున్నప్పుడు తీవ్రంగా గద్దించాడు (మత్తయి 15:9, మార్కు 7:7). అపోస్తలులు కూడా ఈ విషయమై సంఘాన్ని హెచ్చరిస్తూ, తమ నోటిమాట వలన, పత్రికవలన బోధించబడిన విధులను మాత్రమే గైకొనాలని ఆజ్ఞాపించారు (2 థెస్సలోనిక 2:15). అపోస్తలలు తమ నోటిద్వారా పత్రికల ద్వారా బోధించబడిన విధులు "పాతనిబంధన లేఖనాలూ (వాటి సారాంశం), యేసుక్రీస్తు బోధలూ, పరిశుద్ధాత్ముడు‌ వారికి నూతనంగా బయలుపరచిన సంగతులు మాత్రమే".

"పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు" రోమన్ కేథలిక్ వారు తమ‌‌ విగ్రహారాధనను సమర్థించుకోవడానికి ఇది కూడా "నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు" అనే మొదటి ఆజ్ఞలో భాగమేయని దాని ప్రకారం ఆయనది కాకుండా మరో విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తే తప్పు కానీ ఆయన (యేసుక్రీస్తు) విగ్రహాన్ని చెక్కుకుని దానిని పూజించడంలో ఎలాంటి పాపం లేదని వక్రీకరిస్తుంటారు. అయితే పది ఆజ్ఞల సంఖ్యను పూరించడానికి వారు పదవ ఆజ్ఞను రెండుగా విడగొట్టి,  నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు అనేది తొమ్మిదవ ఆజ్ఞ అనీ, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అనేది పదవ ఆజ్ఞ అనీ బోధిస్తారు. కానీ అదంతా ఒకే ఆజ్ఞ పదవ ఆజ్ఞ.

నిర్గమకాండము 20:17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.

మరొక విషయం ఏంటంటే "విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు" అన్నప్పుడు ఈ ఆజ్ఞ శిల్పకళను నిషేధించడం లేదు కానీ, ఆయనకు ప్రతిగా విగ్రహాన్ని చేసుకుని పూజించడాన్ని మాత్రమే పాపంగా హెచ్చరిస్తుంది.

ఈ ఆజ్ఞ ద్వారా నిషేధించబడిన కొన్నిపాపాలు:

A. విగ్రహారాధన
B. లేఖనేతర పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించడం ఉదాహరణకు; స్వీయకల్పిత‌ విధానాలు, పారంపర్యాచారాలు
C. లేఖన విరుద్ధమైన ఏదైనా విధానంలో దేవుణ్ణి ఆరాధించడం
D. లేఖనాల్లో నిర్దేషించబడిన ఆరాధనా పద్ధతులకు ఏవైనా కలపడం లేదా తీసివెయ్యడం

నిర్గమకాండము 20:5
ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు-

ఈ వచనంలో మొదటిగా మనం ఆయన తనను తాను రోషం కలిగిన దేవునిగా ప్రకటించుకోవడం చూస్తాం. ఇంగ్లీష్‌ బైబిల్ లో ఇక్కడ వాడబడిన "jealous God" అనే పదాన్ని బట్టి కొందరు ఈ మాటల్ని అపార్థం చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ పదానికి అసూయ అనే అర్థం కూడా  వస్తుంది. కానీ ఇక్కడ ఆయన చెబుతున్న రోషం ఒక భర్తకు భార్యపై ఉండే రోషం వంటిది (సామెతలు 6:34). ఒక భర్త ఎలాగైతే తన భార్య తనకే సొంతమని రోషంకలిగి ఉంటాడో దేవుడు కూడా తాను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి కాపాడిన ప్రజలపై ఆయనకు రోషం ఉండడం న్యాయమే. నిజానికి ఏ భర్తకైనా తన భార్యపట్ల రోషం లేకపోతే అతను చేతకాని భర్త ఔతాడు. అలానే ఆయన కాపాడి తీసుకువచ్చిన పిల్లల విషయంలో ఆయనకు రోషం లేకుండా కల్పిత విగ్రహాలవైపు, దేవుళ్ళవైపు వారు కొట్టుకునిపోయేలా విడిచిపెడితే (హెచ్చరించకపోతే) అసలు ఆయన దేవుడెలా ఔతాడు?

"నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు"

ఈ వచనంలో ఆయనను ద్వేషించేవారిపట్ల ఆయన‌వైఖరి ఎలా ఉంటుందో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఆయనను ద్వేషించడమంటే ఆయన ఆజ్ఞలను తృణీకరించడమే, ఎలాగైతే ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారో (యోహాను 14:21). అలానే ఆయన ఆజ్ఞలను తృణీకరించేవాడు ఆయనను ద్వేషించేవాడితో సమానుడు. ఐతే ఆయనపై ఒకడు చూపించిన ద్వేషాన్ని బట్టి (ఆజ్ఞలను తృణీకరించడాన్ని బట్టి) ఆయనేమీ ఇక్కడ అన్యాయంగా అతని సంతానంపై ఆ దోషపు శిక్షను మోపడం లేదు. ఒక వ్యక్తి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా విగ్రహాలను కల్పించుకుని పూజిస్తే అందులో అతని కుటుంబం కూడా పాలిభాగస్తులయ్యే అవకాశం ఉంది కాబట్టి, సాధారణంగా ఒక వ్యక్తి పూర్ణ ఆయుష్షుకలిగి జీవిస్తే మూడు నాలుగు తరాలను చూస్తాడు కాబట్టి అతని పాపంలో పాలిభాగస్తులయ్యే ఆ మూడు నాలుగు తరాలపై కూడా ఆ దోషం మోపబడుతుందని ఇక్కడ భావం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈమాటలు మిమ్మల్ని బట్టి మీ తరాలు కూడా విగ్రహారాధికులుగా మారి దోషులు కాకుండా చూసుకోండని హెచ్చరికగా చెప్పబడుతున్నాయి.

నిర్గమకాండము 20:6
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.

పై వచనంలో ఆయనను ద్వేషించేవారిపట్ల ఆయన తీర్పు బయలుపరచబడితే ఈ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను ప్రేమించేవారి పట్ల ఆయనచూపించే కరుణను మనం చూస్తాం. దీనర్థం ఒక నీతిమంతుడైన వ్యక్తిని బట్టి అతని వెయ్యితరాల సంతానం ఏం చేసినా ఆయన పాపంగా భావించడని కాదు. కానీ ఆ తరాలకు ఆయన తమ పాపాలను విడిచిపెట్టే అవకాశం ఇస్తుంటాడని ఇక్కడ భావం. ఉదాహరణకు ఆయన అబ్రాహామును బట్టి ఆయన ఇశ్రాయేలీయులపై కృపచూపిస్తూనే ఉన్నాడు, వారి పాపాలను విడిచిపెట్టేలా శిక్షిస్తూనే ఉన్నాడు. కానీ శేషం లేకుండా మాత్రం వారిని అంతం చెయ్యలేదు. ఇప్పటికీ ఇది కొనసాగుతుంది. అలానే ఆయన దావీదును బట్టి అతని‌ గోత్రంలో జన్మించిన యూదారాజులకు అవకాశం ఇస్తూనే వచ్చాడు.

నిర్గమకాండము 20:7
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.

మొదటి ఆజ్ఞలో ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలని, రెండవ ఆజ్ఞలో ఆయనను ఆయన చెప్పిన పద్ధతిలోనే ఆరాధించాలని బోధించబడితే ఈ మూడవ ఆజ్ఞ ఆయన నామాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఉచ్ఛరించాలని హెచ్చరిస్తుంది. ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా "నీ నామము పరిశుద్ధపరచబడును గాక" అనేట్టుగానే మనం ఉచ్చరించాలి, తలచుకోవాలి. ఎందుకంటే ఆయన నామం, ఆయన వేరు కాదు. ఆయన గుణలక్షణాలే "యెహోవా" అనే ఆయన నామంగా బయలుపరచబడింది. అందుకే భక్తుడైన దావీదు "ఆయన నామము నిన్ను ఉద్దరించును గాక" అంటున్నాడు (కీర్తనలు 20:1). ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అన్నప్పుడు ఏదో సరదాకి అనో, అనాలోచితంగానో ఆ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరింపకూడదని అర్థం చేసుకోవాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడూ కూడా ఆరాధనా భావంతో, భయభక్తులతో ఉచ్చరించాలి. ఆయన బోధించిన నీతిసత్యాలను జరిగించకుండా ఆయన నామాన్ని ఉచ్చరించడం ఘోరపాపంగా పరిగణించబడుతుంది. ఇశ్రాయేలీయులు ఇటువంటి పాపానికే ఒడిగట్టి దేవుని చేత గద్దించబడ్డారు (యెషయా 48:1). మనసులో అక్రమాన్ని పెట్టుకుని ఆయన నామం పేరిట ఏవో అద్భుతాలు చేసామని తమపేరిట సాక్ష్యం పలికేవారు తీర్పు దినాన ప్రభువు చేత అక్రమం చేసేవారులారా నా యొద్దనుండి పొండని త్రోసివెయ్యబడతారు (మత్తయి 7:22,23). ఆయన మాటల చొప్పున నడువకుండా ఆయన నామాన్ని ఉచ్చరించేవారికి ఆయన నుండి కీడే తప్ప మేలు ఏమాత్రం జరుగదు (లూకా 6:46).

ఈ యెహోవా అనే నామాన్ని ఉచ్చరించడం, ప్రమాణాల్లో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇశ్రాయేలీయులు ఏదైనా ప్రమాణం చేసేటప్పుడు ఆయన నామం తోడనే ప్రమాణం చెయ్యాలి (నిర్గమకాండము 22:1, లేవీకాండము 5:1) ఒకవేళ ఆయన నామం పేరిట ఎవరైనా అబద్ధప్రమాణం చేస్తే ఆయన నామాన్ని అపవిత్రపరిచిన శిక్షను పొందుకుంటారు (లేవీకాండము 19:12, జెకర్యా 5:4). ఇవన్నీ ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఒకవేళ ఎవరైనా వీటిని మీరి పాపం చేస్తే, వారు దానిని ఏదో అనాలోచితంగా చేసామని, సరదాకి చేసామని, పరిస్థితుల కారణంగా చేసామని సమర్థించుకునే అవకాశం ఉంది కానీ ఆయన మాత్రం అలా చేసినవారిని "నిర్దోషిగా ఎంచడు". అలా చేసినవారిని మానవచట్టం ఏమీ చేయకపోవచ్చు కానీ, దేవుని చట్టం మాత్రం విడిచిపెట్టదు. దేవుని నామం పేరిట చేయబడే ప్రమాణానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారంటే " ప్రధాన యాజకుడు ఆయనను చంపాలనే కుట్రతో నీవెవరివో చెప్పమని దేవుని పేరిట ప్రమాణం చెయ్యగానే" అప్పటివరకూ మౌనంగా ఉన్న ఆయన అతనికి తానెవరో సమాధానం ఇచ్చాడు (మత్తయి 26:63,64). ఆ సమాధానం‌ వల్ల ఆయన ప్రాణాలకు అపాయమని తెలిసినప్పటికీ ఆయన దేవుని నామాన్ని బట్టి పెట్టబడిన ఒట్టు విషయంలో మౌనంగా ఉండలేదు. ఎందుకంటే ఆయన అక్కడ లేవీకాండము 5:1 లోని నియమాన్ని అనుసరించారు. అది మన BSI తెలుగు బైబిల్ లో స్పష్టంగా లేదు కానీ, ఆ వచనానికి మూలభాషను అనుసరించి సరిగా చెయ్యబడిన గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుక భాష అనువాదం ఇక్కడ పెడుతున్నాను చూడండి.

"తాను చూచిన, తెలిసిన సంగతి గురించి సాక్ష్యమిమ్మని ఒక వ్యక్తిని ఆదేశించడం జరుగుతుందనుకోండి. ఆ సంగతి తెలియజేయకపోతే అది పాపం. అలా చేసిన వ్యక్తి తన అపరాధం భరిస్తాడు."
(లేవీ 5:1)

ఈ ఆజ్ఞ ద్వారా నిషేధించబడిన కొన్నిపాపాలు:

1. దేవుణ్ణి నామాన్ని సరదాగా లేదా అనాలోచితంగా పలకకూడదు
2. దేవుని నామంలో అబద్ధ ప్రమాణాలు చెయ్యకూడదు
3. దేవుని నామంలో చేసిన మొక్కుబడుల విషయంలో ఎప్పుడూ తప్పిపోకూడదు
4. దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి అబద్ధసాక్ష్యాలు చెప్పకూడదు

నిర్గమకాండము 20:8
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.

మొదటి ఆజ్ఞలో ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలని, రెండవ ఆజ్ఞలో ఆయనను ఆయన ప్రవేశపెట్టిన పద్ధతిలోనే ఆరాధించాలని, మూడవ ఆజ్ఞలో ఆయన నామాన్ని భయభక్తులతో తలచుకుంటూ, ఉచ్చరిస్తూ ఆరాధించాలని బోధించబడితే ఈ నాలుగవ ఆజ్ఞలో ఆయనను ప్రత్యేకంగా ఆరాధించడం కోసం ఒక దినాన్ని (ఏడవదినం) పాటించాలని వివరించబడింది. 11వ వచనం ప్రకారం; దేవుడైన యెహోవా సృష్టిని చేసి విశ్రమించిన దినమే ఈ ఏడవ దినం (శనివారం) అందుకే ఆయన ఇశ్రాయేలీయులకు కూడా అదే దినాన్ని తన ఆరాధన కోసం నియమిస్తున్నాడు. తరువాత కాలంలో‌ శాస్త్రులు పరిసయ్యులు ఈ దినాన్ని ప్రజలకు భారభరితంగా మార్చి, ఆ రోజు చెయ్యవలసిన పనులను కూడా నిషేధిస్తూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గద్దించినట్టు మనం చూస్తాం.

ఐతే కొందరు ఈ ఆజ్ఞను ఆధారం చేసుకుని క్రైస్తవులమైన మనం కూడా ఏడవ దినాన విశ్రాంతిదినంగా పాటించాలని‌ బోధిస్తుంటారు కానీ ఈ విశ్రాంతి దినం క్రీస్తులో మనకుకలిగే విశ్రాంతికి ఛాయగా ఉన్నందువల్ల ప్రస్తుతం మనం దానిని పాటించవలసిన అవసరం లేదు.

కొలొస్సయులకు 2:16,17 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.

అలా అని ఆరాధన కోసం మనకు ప్రత్యేకదినమేమీ లేదా అంటే అలా కాదు. దేవుడైన యెహోవా మొదటి సృష్టిని చేసి విశ్రమించిన ఏడవ దినం ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినంగా నియమించబడితే, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నూతనసృష్టిగా చేసి (2కొరింథీ 5:17) తిరిగిలేచిన ఆదివారం మనకు ఆరాధన దినంగా నియమించబడింది. అందుకే అపోస్తలులు, ప్రారంభక్రైస్తవ సంఘం ఆదివారాన్ని ఆరాధనదినంగా పాటించినట్టు మనం చూడగలం (అపొ.కార్యములు 20:7, 1 కొరింథీ 16:2). పాతనిబంధనలో అన్యజనులు కూడా తన‌ విశ్రాంతి దినాన్ని పాటిస్తారని ప్రవచించబడింది, ప్రభువు దినమైన ఈ ఆదివారం గురించే. కాబట్టి విశ్వాసులందరూ ఈ ఆదివారాన్ని ప్రభువుదినంగా ఆరాధనకోసం పాటిస్తూ ఆరోజు తమ ఇతరపనుల నుండి విశ్రమించాలి. ఆరోజు దేవుని సన్నిధిలో‌ తప్పక గడపాలి. లోకస్తులు చేస్తున్నట్టుగా ఆరోజు సెలవు దినం కాబట్టి సరదాలకోసం కేటాయించకూడదు.

నిర్గమకాండము 20:9
ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను.

ఈ వచనంలో ఆరుదినాలు కష్టపడి పని చెయ్యాలని రాయబడడం మనం చూస్తాం, ఆ ఆరుదినాల పనితరువాత విశ్రాంతి దినంగా ఏడవ దినాన్ని పాటించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఏడవ దినాన విశ్రాంతి దినంగా పాటించడమే కాదు, దానికి ముందున్న ఆరుదినాలు మనం కష్టపడి పని చేసుకోవాలి. సోమరులుగా జీవించకూడదు. పని చెయ్యకుండా సోమరులుగా బ్రతకడాన్ని బైబిల్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే దానివల్ల తమ కుటుంబాలకు అవసరమైనవి కూడా సమకూర్చలేని దౌర్భాగ్యపరిస్థితి దాపరిస్తుంది, దొంగలుగానూ దోపిడీ దారులు గానూ మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అపోస్తలుడు ఇలా అంటున్నాడు

రెండవ థెస్సలొనీకయులకు‌ 3:10-12 మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము.

నిర్గమకాండము 20:10
ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏపనియు చేయ కూడదు.

ఏడవ దినాన్ని విశ్రాంతి దినంగా పాటించాలనే నియమంలో ఆయన ఆరాధన కోసం ఆరోజును కేటాయించుకోవాలనే ఆధ్యాత్మిక భావంతో పాటు మరొక కోణం కూడా దాగియుంది.
1. ఆరురోజులు పనిచేసిన వ్యక్తి ఏడవరోజు విశ్రాంతి తీసుకోవడం అతని‌ దేహానికి చాలా అవసరం. ఒకవేళ అటువంటి విశ్రాంతిరోజు లేకుండా అతను పనిచేస్తూనే ఉంటే అతనికి అది ఆరోగ్యకరం కాదు.
2. ఆకాలంలో బానిసలకు సెలవు దినం ఉండేది కాదు, వారు సంవత్సరమంతా పని చెయ్యవలసిందే. అందుకే దేవుడు ఏడవ దినాన్ని విశ్రాంతి దినంగా నిర్ణయిస్తూ ఇశ్రాయేలీయుల దగ్గర బానిసలుగా ఉన్నవారికి కూడా ఆరోజు విశ్రాంతి కల్పిస్తున్నాడు. అందుకే ఈ వచనంలో ఆమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఈ మాటలను ఆధారం చేసుకునే మిషనరీలు బానిసలకు/పని చేసేవారికి వారానికి ఒకరోజు సెలవుదినం కావాలని పోరాడి దానిని సాధించారు. ఈరోజు భారతదేశంలో ఆదివారం సెలవుదినంగా ఉందంటే ఈ ఆజ్ఞను బట్టి పోరాడిన మిషనరీల కృషి ఫలితమే.

నిర్గమకాండము 20:11
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

ఈ వచనంలో దేవుడు ఏడవ దినాన్నే విశ్రాంతిదినంగా ఎందుకు నియమించాడో ఆ కారణం తెలియచెయ్యబడడం మనం చూస్తాం. 8వ వచనపు వ్యాఖ్యానంలో తెలియచేసినట్టు ఆయన చేసిన మొదటి సృష్టిని ఆధారం చేసుకుని ఈ నియమం జరిగింది. మనమైతే క్రీస్తు చేసిన నూతన సృష్టిని బట్టి ఆదివారాన్ని పాటిస్తున్నాం.

అదేవిధంగా దేవుడు విశ్రమించెను అంటే, ఆయన మనలాగా అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడని కాదు. ఆరోజు ఆయన నూతనసృష్టి ఏదీ చెయ్యలేదని, ఎందుకంటే ఆయన చేయాలనుకున్న సృష్టి అంతా ఆరుదినాల్లోనే పూర్తి చేసాడని దాని అర్థం. దీనిగురించి మరింత‌ వివరంగా తెలుసుకోవడానికి ఆదికాండము 2వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి.

నిర్గమకాండము 20:12
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

మొదటి నాలుగు ఆజ్ఞలూ దేవునికీ ఆయన ఆరాధనకూ సంబంధించినవి ఐతే ఇక్కడినుండి మనం మానవుల పట్ల అనుసరించవలసిన వైఖరికి సంబంధించిన ఆజ్ఞలను చూస్తాం. దేవునిపై ప్రేమతో మొదటి ఆజ్ఞలను పాటించినవారే, మానవుల పట్ల వెల్లడైన ఆజ్ఞలను కూడా పాటించగలరు. అందుకే ఆయన మొదటిగా తనకు సంబంధించిన ఆజ్ఞలను వెల్లడించి తరువాత ఈ ఆజ్ఞలను బయలుపరుస్తున్నాడు.

"నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"

ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ ( ఎఫెసీ 6:2,3). కొందరు "నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో" అని కనాను దేశం గురించి చెప్పబడడాన్ని బట్టి ఈ ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందినవని పొరపడుతుంటారు. కానీ ఇదే ఆజ్ఞను పౌలు ఎలా ప్రస్తావించాడో చూడండి.

ఎఫెసీయులకు 6:2,3 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు "నీవు భూమిమీద" దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

ఇక్కడ పౌలు దేశానికి బదులు భూమిమీద అని ప్రస్తావిస్తున్నాడు. పైగా ఈ ఆజ్ఞను అతను సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ, భూమిమీద ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తాయి.

ఇక నీ తల్లినీ తండ్రినీ సన్మానించాలి అన్నప్పుడు వారికి లోబడియుండాలని, వారిని సంరక్షించాలని భావం. యూదులు ఈ ఆజ్ఞను మీరి తల్లితండ్రులను సంరక్షించడం మానివేసి వారికి ఇవ్వవలసింది దైవార్పితమని తప్పించుకుంటున్నప్పుడు ప్రభువు వారిని చాలా తీవ్రంగా గద్దించాడు ( మార్కు 7:10-13). అంతేకాకుండా తల్లితండ్రులకు లోబడియుండాలని, తల్లితండ్రులకు లోబడనివారికి/దూషించేవారికి మరణశిక్ష విధించాలని లేఖనాలలో స్పష్టంగా రాయబడింది ( లేవీకాండము 19:3, లేవీకాండము 20:9, ద్వితీయోపదేశకాండము 21:18-21, సామెతలు 30:17). నీ తల్లినీ తండ్రినీ సన్మానించాలి అన్నప్పుడు; ప్రభువునందు వారిని సన్మానించాలని మనం గుర్తుంచుకోవాలి (ఎఫెసీ 6:1). దానర్థం వారిని ప్రభువుతో సమానంగా (దైవాలుగా) కానీ, ప్రభువుకంటే ఎక్కువగా కానీ ప్రేమించకూడదు ఘనపరచకూడదు "తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు" (మత్తయి 10:37). వారిని ప్రభువు ఆజ్ఞల పరిథిలోనే సన్మానించాలి. ఉదాహరణకు "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" అనేది‌‌ మొదటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞను బట్టి తల్లినీ, తండ్రినీ దైవంగా చేసుకోకూడదు. అదేవిధంగా; దైవవిరుద్ధమైన మార్గంలో మన తల్లితండ్రులే మనల్ని ప్రేరేపించినా వారి మాటకు మనం సమ్మతించకూడదు (ద్వితీయోపదేశకాండము 13:6-8). ఈవిధంగా మనం లేఖనాలలోని మిగిలిన ఆజ్ఞలపరిథిలో తల్లితండ్రులను సన్మానించాలి. వారు చెప్పేవి లేఖనానుసారంగా ఉన్నంతవరకూ వారిమాటకు లోబడాలి.

ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు ఆయన నియమించిన అన్ని అధికారాలకూ లోబడాలని ఉద్దేశించాడు. తరువాత లేఖనాలలో ఆ విషయం బయలుపరచబడుతూ వచ్చింది. మనం అధికారులకు లోబడియుండాలి ( రోమా 13:1), భర్తలకు లోబడియుండాలి ( 1 పేతురు 3:1), యజమానులకు లోబడియుండాలి ( 1 పేతురు 2:18), సహోదరులకు లోబడియుండాలి ( ఎఫెసీ 5:21), కాపరులకు లోబడియుండాలి ( హెబ్రీ 13:17) ఇలా "ప్రభువునందు" (ఆయన ఆజ్ఞల పరిధిలో) అధికారానికి  లోబడియుండడం అనే అలవాటు ఇంటినుండే ప్రారంభవ్వాలని  కూడా ఈ ఆజ్ఞలో ఉన్న ఒకానొక ఉద్దేశం. ఎందుకంటే మానవపతన స్వభావం ఒకరికి లోబడియుండడానికి సమ్మతించదు కాబట్టి, ఆ నియమానికి లోబడడమనేది ఇంటినుండే అలవరచబడాలి

అలాగే "నీ తల్లినీ తండ్రినీ సన్మానించాలని" పిల్లలకు ఆజ్ఞాపించబడుతున్నప్పుడు ఆ పిల్లలను దైవభక్తిలో పెంచాలనే బాధ్యత తల్లితండ్రులపై కూడా మోపబడింది (ద్వితీయోపదేశకాండము 6:6,7). దైవభక్తిలో పెరిగిన పిల్లలు మాత్రమే తమ తల్లితండ్రులను సరైనవిధంగా, లేఖనాల పరిధిలో సన్మానించగలరు కాబట్టి ఈ విషయంలో తల్లితండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. నూతన నిబంధనలో కూడా మీ పిల్లలకు కోపం రేపవద్దని, ప్రభువు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచమని తల్లితండ్రులకు ఆజ్ఞాపించబడింది.

ఎఫెసీయులకు 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

కొలస్సీయులకు 3:21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.

కాబట్టి పిల్లలు తల్లితండ్రులను సన్మానించేవారిగా ఉండి ఈ ఆజ్ఞను నెరవేర్చేలా తల్లితండ్రులు పిల్లలకు సహకరించాలి. వారు ప్రభువు యొక్క శిక్షణలో బోధలో పెరిగినప్పుడే వారికది సాధ్యం.

నిర్గమకాండము 20:13
నరహత్య చేయకూడదు.

ఈ ఆజ్ఞ; సృష్టి ఆరంభంలో సాతానుడు జరిగించిన నరహత్యను నిషేధించడం మనం చూస్తాం. వాడు చేసిన మోసం కారణంగానే మానవజాతి మరణానికి లోనయ్యింది, అందుకే వాడు నరహంతకుడు అని చెప్పబడింది ( యోహాను 8:44). తరువాత కయీను కూడా వాడి సంబంధిగా మారి హేబెలును చంపివేసాడు ( 1 యోహాను 3:12). కాబట్టి నరహత్య చేసే ప్రతీ ఒక్కరూ సాతాను సంబంధులే, అందుకే దేవుడు దానిని నిషేధిస్తున్నాడు. ఈ నరహత్య ఎన్నివిధాలుగా ఉంటుందో చూడడానికి ముందు అసలు నరహత్య ఎందుకు చెయ్యకూడదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణమున్న జంతువును చంపుకుని తినడం పాపం, నేరం కానప్పుడు మనిషిని చంపడం మాత్రమే ఎందుకు పాపం, నేరం ఔతుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి బైబిల్ ఏం సమాధానం చెబుతుందో చూడండి.

ఆదికాండము 9:6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

ఈ సందర్భంలో దేవుడు నరహత్య ఎందుకు చెయ్యకూడదో చెబుతున్నాడు. "ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను" కాబట్టి ఏ జంతువునూ ఆయన అలాంటి ప్రాముఖ్యతతో చెయ్యలేదు కాబట్టి, నరహత్య చెయ్యకూడదు. నరహత్య చెయ్యడమంటే "దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని" చంపడమే. అందుకే ఆయన "నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు" (సంఖ్యాకాండము 35:33) అని ఇంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఐతే "నరహత్య చెయ్యకూడదు" అన్నప్పుడు దాని పరిథుల గురించి మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తినీ ఎట్టిపరిస్థితుల్లోనూ చంపకూడదని ఈ ఆజ్ఞ‌ యొక్క ఉద్దేశం కాదు. నాలుగు సందర్భాలలో మనం ఒక మనిషిని చంపినా కూడా అది నరహత్యగా భావించబడదు. అవేంటో వరుసగా చూద్దాం.

1. యుద్ధం:
యుద్ధంలో ఒక రాజ్య సైనికులు తమపైకి దండెత్తిన మరో రాజ్యపు సైనికులతో యుద్ధం చేసి వారిని చంపడం జరుగుతుంది. ఇలా చంపడం నరహత్య కాదు. ఎందుకంటే బైబిల్ లోని చాలా సందర్భాలలో దేవుడే యుద్ధం చెయ్యమన్నాడు (న్యాయంగా).
ఉదాహరణకు; ఇశ్రాయేలీయులకు ఆయన దుష్టులైన కనానీయులపై యుద్ధం చేసి వారిని సమూలంగా హతమార్చమని చెప్పాడు (ద్వితీయోపదేశకాండము 20:16). ఐతే ఇలా దేవుడు చేయించిన యుద్ధాలు పక్కరాజ్యాలపై దురాక్రమణ కోసం కాకుండా, ఆ రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు దేశరక్షణకోసం, మరియు దుష్టశిక్షణకోసం చేయించిన యుద్ధాలు అని మనం గ్రహించాలి. ఆ విధంగా జరిగే యుద్ధాలలో శత్రు సైనికులను, శత్రు దేశస్తులను చంపడం నరహత్యకాదు. ఈ అనుమతి గురించి ఇంకా మనం పరిశీలించగలిగితే; యోహాను దగ్గరకు సైనికులు వచ్చి "మేమేం చేయాలని అడిగినప్పుడు" అతను వారికి ఇస్తున్న సమాధానం చూడండి.

లూకా సువార్త 3:14 సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.

ఈ సందర్భంలో యోహాను తనవద్దకు వచ్చిన సైనికులతో ఎవరినీ బాధపెట్టవద్దని (అన్యాయంగా) అపనిందలు వెయ్యవద్దని, లంచాలు తీసుకోవద్దని చెబుతున్నాడు తప్ప, యుద్ధాలలో పాల్గోవద్దని చెప్పడం లేదు. అదేవిధంగా ప్రభువును విశ్వసించిన శతాధిపతియైన కొర్నేలి గురించి అపొ.కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుతాం. శతాధిపతి అంటే ఒక గుంపు సైన్యానికి అధిపతి.

2. చట్టపరమైన మరణశిక్ష:
మరణానికి తగిన నేరం చేసిన వ్యక్తికి చట్టపరంగా మరణశిక్ష విధించడం, నరహత్య కాదు. ఈ మరణ శిక్ష గురించి మోషే ధర్మశాస్త్రంలో మనం పదేపదే చదువుతాం.

ద్వితియోపదేశకాండము 19:21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

నిర్గమకాండము 21:23-25 హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

సంఖ్యాకాండము 35:33
​మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు‌ నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.

ఆదికాండము 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

3. ఆత్మరక్షణ:
అవతలి వ్యక్తినుండి మనకు కానీ, మన కుటుంబసభ్యులు/సన్నిహితులకు కానీ ప్రాణహాని సంభవించినప్పుడు ఆ సమయంలో మన/వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ వ్యక్తిని చంపడం నరహత్య కాదు.

ఉదాహరణకు; ఆదికాండము 14వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అబ్రాహాము కూడా లోతు కుటుంబాన్ని కాపాడడం కోసం శత్రుసైనికులపై దండెత్తి వారిని సంహరించాడు.

అదేవిధంగా;
నిర్గమకాండము 22:2 దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.

ఈ సందర్భంలో ఒక దొంగ దొంగతనం చేసేటప్పుడు దొరికి వాడిని చచ్చేలా కొట్టినా కూడా నేరం కాదని రాయబడడం మనం చూస్తాం. ఎందుకంటే దొంగ ఊరికే దొంగతనానికి రాడు, తనను అడ్డుకున్నవారిని హతమార్చే ఉద్దేశంతో కూడా ఆయుధాలను కలిగి ఉంటాడు. అందుకే వాడినుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడిని చంపినా నరహత్య కాదు. అయితే ఈ ఆత్మరక్షణలో అవతలి వ్యక్తి ఇక మనపై దాడి చెయ్యనివిధంగా గాయపడినప్పుడు కూడా ఇంకా కసితో ఆ వ్యక్తిని‌ కొట్టడం, చంపడం నిషిద్ధమని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మరక్షణ కేవలం మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేది మాత్రమే. ఆ సమయంలో ఆ వ్యక్తి చనిపోతే నరహత్య కాదు కానీ, ఆ వ్యక్తినుండి ఇంక మనకు హానికలిగే పరిస్థితి లేకపోయినా ఉద్దేశపూర్వకంగా చంపడం నరహత్యే ఔతుంది.

4. పొరపాటున ఒక వ్యక్తికి ప్రాణహాని సంభవించడం:
కొన్నిసార్లు మనం చేసే పనుల్లో పొరపాటున అవతలి వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు;

ద్వితీయోపదేశకాండము 19:5,6
పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.

ఈ సందర్భంలో ఒకవ్యక్తి తన జీవనోపాధి‌కోసం పనిచేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతని గొడ్డలి పిడి ఊడడం కారణంగా అవతలి వ్యక్తికి ప్రాణహాని సంభవించింది. ఇది నరహత్య కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమీ అజాగ్రత్తతోనో, పగతోనో, ఉద్దేశపూర్వకంగానో అలా చంపలేదు. ఇక్కడ నేను వాడిన పదాలను గమనించండి. "అజాగ్రత్తతో" కానీ "పగతో" కానీ "ఉద్దేశపూర్వకంగా" కానీ అలా చెయ్యలేదు. ఆ గొడ్డలి పిడి ఊడిపోతుందని తెలిసినప్పటికీ "అజాగ్రత్తతో" దానితో అలానే పనిచెయ్యడం వల్ల అలాంటి ప్రమాదం జరిగితే అది‌ నరహత్యే. అవతలివ్యక్తికి అపాయం సంభవించవచ్చని తెలిసినా కూడా జాగ్రత్తతీసుకోకపోవడం వల్ల అలాంటి ప్రమాదం జరిగితే అది నరహత్యే. వాహనాలను అదుపు చెయ్యలేనంత‌‌ వేగంగా నడుపుతూ దానివల్ల ఎవరికైనా ప్రాణహాని సంభవిస్తే అది నరహత్యే.

నరహత్య అంటే;
1. ఒక వ్యక్తిని పగతో కానీ, ఇతర కారణాలను బట్టి కానీ చంపడం.
2. సహోదరుణ్ణి నిష్కారణంగా ద్వేషించడం (1 యోహాను 3:15).
3. నరహత్యలకు దారితీసే అసూయలు, అన్యాయపు కోపాలను పెంచుకోవడం.
4. ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనకు సాధ్యమైకూడా సహాయం చెయ్యకపోవడం;
ఉదాహరణకు అతడిపై ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు మనకు బలం ఉండి కూడా సహాయం చేసి అతని ప్రాణాలు కాపాడకపోవడం, ఆకలితో చావు బ్రతుకుల మధ్య ఊగుతున్నప్పుడు అతని ఆకలితీర్చి బ్రతికించకపోవడం ఇవి కూడా నరహత్యలే.

5. ఆత్మహత్యకు పాల్పడడం (ఇతరుల ప్రాణాలు తీయడమే నరహత్య అయినప్పుడు ఎవరి ప్రాణాలను వారు తీసుకోవడం కూడా నరహత్యే).

6. ఇది చెయ్యకపోవడం వల్ల ఇతరులకు ప్రాణహాని సంభవిస్తుందని తెలిసినా దానిని చెయ్యకుండా నిర్లక్ష్యం వహించడం. ఉదాహరణకు;

ద్వితియోపదేశకాండము 22:8
క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి "హత్యదోషము" రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.

పర్యావరణాన్ని కలుషితం చెయ్యడం, రోడ్డుపై ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురయ్యేలా ప్రవర్తించడం, సరైన చికిత్స తీసుకోకపోవడం, ఇతరులకు ఆ చికిత్స అందించకపోవడం,...ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల పోయే ప్రాణాలు కూడా నరహత్య క్రిందకే వస్తాయి.

నిర్గమకాండము 20:14
వ్యభిచరింపకూడదు.

నరహత్య చెయ్యకూడదనే ఆజ్ఞ ఒక వ్యక్తికి ప్రాణహాని కలిగించేదానిని నిషేధిస్తే, "వ్యభిచరించకూడదు" అనే ఈ ఆజ్ఞ కుటుంబానికి ప్రమాదకరమైన దానిని మరియు తన స్వంత శరీరానికి హానికరమైనదానిని నిషేధిస్తుంది (1 కొరింథీ 6:18). నరహత్య చెయ్యకూడదనే ఆజ్ఞలో కొన్ని నరహత్యలు కావని మినహాయించబడ్డాయి కానీ, ఈ ఆజ్ఞలో మాత్రం అలాంటి మినహాయింపులు ఏవీలేవు. వ్యభిచరించకూడదు అనే ఈ ఆజ్ఞ వివాహితులైన భార్యాభర్తలకు మాత్రమే కాదు, అవివాహితులైన యువతకు కూడా హెచ్చరికగా చెప్పబడుతుంది. ఎందుకంటే; భార్యభర్తలు ఒకరితో ఒకరు కలిసినప్పుడు మాత్రమే వారి పానుపు (ఆ సంబంధం) నిష్కళంకమైనదని వాక్యం చెబుతుంది, భార్యభర్తల మధ్య కాకుండా మరెవరిమధ్య ఆ సంబంధం కొనసాగినా అది కళంకమే, జారత్వమే (హెబ్రీ 13:4). ప్రభువైన యేసుక్రీస్తు అందుకే ఈ ఆజ్ఞతో పాటు "వేశ్యాగమనములు" అనేదానిని కూడా ప్రస్తావించారు (మత్తయి 15:19).

వివాహానికి వెలుపల జరిగే లైంగిక కార్యకలాపాలన్నీ వ్యభిచారమే. అంటే స్త్రీ, పురుషుడు కలవడం మాత్రమే కాదు, ఎవరికి వారు స్వీయ సంతృప్తి చెందడం (హస్తప్రయోగం), జంతుశయనం, స్వలింగ సంపర్కం ఇవన్నీ కూడా వ్యభిచారమే. ఇలాంటి వ్యభిచారాలకు అవకాశం కల్పించే, మోహపు చూపులు (మత్తయి 5:27,28), అశ్లీల వస్త్రధారణలు (exposing), మాటలు, ఇవన్నీ వ్యభిచారమే. వ్యభిచారానికి ప్రేరేపించే, నీలిచిత్రాలను చూడడం, పుస్తకాలను చదవడం, ఇవన్నీ వ్యభిచారమే. కాబట్టి విశ్వాసులందరూ ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ వ్యభిచారమనే పాపం నుండి తప్పించుకోవడానికి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం, వాక్యధ్యానాన్ని క్రమం తప్పకుండా పాటించడం, దేవుడు నియమించిన బాధ్యతల్లో శ్రద్ధగా కొనసాగడం వంటివి చెయ్యాలి. వ్యభిచారానికి ప్రేరేపించే పరిసరాలకు దూరంగా ఉండడం, అటువంటి సినిమాలు మరియు ఇతర చిత్రీకరణలు చూడకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా వివాహం కాని యువతీయువకులు ఆలస్యం చెయ్యకుండా తొందరగా స్థిరపడి వివాహాం చేసుకోవాలి (1 కొరింథీ 7:9). ప్రభువునుండి ప్రత్యేకవరం ఉంటే మినహా వివాహాం అశ్రద్ధ చెయ్యకూడదు. వివాహం జరిగిన భార్యభర్తలు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ వారివారి ధర్మాలు జరుపుకోవాలి (1 కొరింథీ 7:3). దేవుడు స్వభావసిద్ధంగానే మనలో కొన్నింటిని ఉంచాడు. ఉదాహరణకు ఆకలి, దాహం ఇలాంటివి. అలానే యుక్తవయస్సులో ప్రవేశించినవారికి కలిగే కోరికలు కూడా అందులో భాగమే. ఐతే ఆ కోరికలను తప్పుడు పద్ధతిలో తీర్చుకోకూడదు. దేవుడు చెప్పినవిధంగా వివాహం చేసుకుని భాగస్వామితో మాత్రమే వాటిని పంచుకోవాలి.

వ్యభిచరించకూడదు అనే ఈ ఆజ్ఞలో ఆధ్యాత్మిక కోణాన్ని కూడా మనం గ్రహించాలి. భార్య వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంటే అది ఆమె భర్తకు చాలా కోపాన్ని కలిగిస్తుంది. అవసరమైతే ఆమెను చంపడానికి కూడా అతను సిద్ధపడతాడు. ఈ రోషం సహజంగానే మనందరిలోనూ ఉంటుంది. అలానే దేవుడు కూడా తనను తాను మనకు భర్తగా, మనల్ని తన భార్యగా అలంకారంగా పోలుస్తున్నాడు (యెషయా 54:5, ప్రకటన 21:9). కాబట్టి మనం ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలి, లోకంతో వైరాన్ని పాటించాలి. మనం లోకంతో (లోకపు ఆశలు) కనుక స్నేహం చేస్తే అది ఆయనపట్ల మనం చేసే వ్యభిచారమే ఔతుంది.

యాకోబు 4:4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

అందుకే ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిగా విగ్రహాలను పూజిస్తూ, ఇతర రాజ్యాల పాపాలలో పాలిభాగస్తులౌతున్నప్పుడు వారు చేస్తుంది వ్యభిచారమనే నేరంగా ఎన్నో సందర్భాలలో పోల్చబడింది.

నిర్గమకాండము 20:15
దొంగిలకూడదు.

నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞలు మన ప్రాణాలకూ, కుటుంబవ్యవస్థకూ రక్షణగా జారీచెయ్యబడితే, దొంగిలించకూడదు అనే ఈ ఆజ్ఞ మన ఆస్తుల రక్షణగురించి చెప్పబడుతుంది. "దొంగతనం" అంటే; మనది కాని దానిని మనకు అర్హత లేనిదానిని ఆశించడం. అవతలి వ్యక్తి అనుమతిలేకుండా లేదా దౌర్జన్యంగా ఆ వ్యక్తికి చెందినదానిని సొంతం చేసుకోవడం. దీనికి కొన్ని ఉదాహరణలు; జేబు దొంగతనాలు, పెద్ద పెద్ద దోపిడీలు, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నును చెల్లించకపోవడం (ప్రభువైన యేసుక్రీస్తు కూడా అందుకే పన్నును‌ చెల్లించారు మత్తయి 17:27). అవతలి వ్యక్తి వస్తువులను అతనికి తెలియకుండా వాడుకోవడం, తల్లితండ్రులకు తెలియకుండా వారి సొమ్మును ఖర్చు చెయ్యడం (సామెతలు 28:24). కూలివారి జీతాలను సరిగా ఇవ్వకపోవడం, కూలివారు తమ యజమానులనుంచి తమ‌ కష్టం కంటే ఎక్కువగా వసూలు చెయ్యడం, గృహనిర్వాహకులుగా (కుటుంబ యజమాని) ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు అవసరమైనవి ఇవ్వకుండా దాచుకోవడం, ప్రభుత్వాలు రెట్టింపు పన్నులు వసూలు చెయ్యడం,...ఇలా మన కష్టానికి వెలుపల సంపాదించుకునేవి, ఆశించేవన్నీ దొంగతనం క్రిందకే వస్తాయి.

ముఖ్యంగా దేవునిసేవకు ధనాన్ని ఇవ్వకుండా చేతులను‌ బిగబట్టుకోవడం కూడా దొంగతనమే (మలాకీ 3:8).

ఈవిధంగా దొంగతనం చేసి సంపాదించుకున్న ఆస్తుల గురించి బైబిల్ ఏమంటుందో చూడండి;

యిర్మీయా 17:11 న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.

అలా అని ఆకలితో ఉన్న వ్యక్తి అత్యావసర పరిస్థితిలో విస్తారంగా ఉన్న పంటలో కొంత తీసుకుని తన ఆకలిని తీర్చుకున్నంత మాత్రాన అది దొంగతనంగా పరిగణించబడదు. ఎందుకంటే ఆ పంట యాజమానుడికి దానివల్ల నష్టమేమీ కలగకపోగా, అవసరంలో ఉన్న పొరుగువానికి కనికరం చూపించే ఒక అవకాశంగా దానిని ధర్మశాస్త్రం పరిగణిస్తుంది. అలాంటి కనికరాన్ని గుర్తించే ఈ వాక్య భాగాన్ని గమనించండి. 

ద్వితీయోపదేశకాండము 23:24,25 నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు. నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు.

మొట్టమొదటి దొంగతనం ఏదేను తోటలో ఆదాము హవ్వలు మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని దొంగిలించడంతో ఆరంభమైంది. వారు ఆ చెట్టుకు యజమానుడైన దేవుని‌ అనుమతి లేకుండా ఆ పండును‌ దొంగిలించుకుని తిన్నారు. వాగ్దానదేశమైన కనానులోకి ప్రవేశించగానే ఇశ్రాయేలీయుల్లో జరిగిన మొదటి నేరం కూడా దొంగతనమే, ఆకాను అనేవాడు దేవునిమాటకు విరుద్ధంగా బంగారాన్ని దొంగిలించాడు (యెహోషువ 7). ప్రారంభసంఘంలో కూడా అననీయ సప్పీరాలు దేవునికి అర్పితమని చెప్పినదానిలోనుండి కొంత‌ దొంగిలించి ప్రాణాలను‌ కోల్పోయారు.

సాధారణంగా దొంగతనం చెయ్యాలనే కోరిక దేవుడు మనకు ఇచ్చినవాటితో సంతృప్తి చెందకపోవడం వల్ల కలుగుతుంది. అందుకే విశ్వాసులు దేవుడు తమకు ఇస్తున్నవాటితో సంతృప్తి చెందాలి.

మొదటి తిమోతికి 6:6-8 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము.

ఒకవేళ దేవుడు అసలు నాకేమీ ఇవ్వలేదనే నిరాశ ఎవరిలోనైనా ఉంటే; దానికి వారి సోమరితనమే కారణం. ఎందుకంటే సోమరి మాత్రమే కష్టపడకుండా దేవుడు తనకేదో ఆకాశం నుండి ధనం కురిపిస్తాడు అన్నట్టుగా వేచిచూస్తుంటాడు.

పొరుగువారి సొమ్ము దొంగతనం చెయ్యాలనే ఆలోచనను ఎలా జయించాలి? :

1. మనకు కలిగినదానితో సంతృప్తి చెందాలి (1తిమోతికి 6:6-8).
2. ఈలోకంలో ఏదో సంపాదించుకోవాలనే అత్యాశతో బ్రతకకుండా పైనున్న వాటిని వెదకాలి (కొలస్సీ 3:1,2).
3. మనమే ఇతరులకు సహాయం చేసేలా మన చేతులతో కష్టపడి పని చేసి ధనాన్ని సమకూర్చాలి, అలా సమకూర్చిన ధనం నుండి ఇతరులకు సహాయం చెయ్యాలి.

ఎఫెసీయులకు 4:28 దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

ఎప్పుడైతే మన చేతుల కష్టార్జితాన్ని అక్కరలో ఉన్న ఇతరులకు పంచిపెడుతూ ఉంటామో అప్పుడు మనకు ఎవరినీ దోచుకోవాలని అనిపించదు.

నిర్గమకాండము‌ 20:16
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

దేవుడు సత్యవంతుడు (కీర్తనలు 31:5, 1 యోహాను 5:20) కాబట్టి, అబద్ధం అనేది ఆయనకు హేయము కాబట్టి (కీర్తనలు 119:163, సామెతలు 6:19) "నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదనే" ఆజ్ఞను మనకు ఇస్తున్నాడు. అబద్ధం అనేది అపవాదినుండి పుట్టింది (యోహాను 8:44). అందుకే దేవుని పిల్లలు అబద్ధ సాక్ష్యాలకు దూరంగా ఉండాలి. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చమంటున్నాడు, అబద్ధసాక్ష్యం న్యాయమైన తీర్పును గాడి తప్పిస్తుంది కాబట్టి అబద్ధసాక్ష్యం పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పడమనేది ఒక వ్యక్తి మంచి పేరును చెడగొడుతుంది, కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయేలా కూడా చేస్తుంది. ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.

1రాజులు 21:13 ​అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండి-నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.

అందుకే దేవుడు ఒక వ్యక్తిపై అబద్ధ సాక్ష్యానికి సాహసించేవారికి ఆ వ్యక్తి నిజంగా నేరం చేస్తే ఏ శిక్ష పడుతుందో అలాంటి శిక్షనే ఆ అబద్ధసాక్షులకు వెయ్యమని నేర్పించాడు.

ద్వితీయోపదేశకాండము 19:16-19 అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.

ప్రస్తుత న్యాయస్థానాలు ఇలాంటి శిక్షను అమలుచెయ్యకపోయినా అబద్ధికులందరికీ దేవుడు నిర్ణయించిన శిక్షమాత్రం జరిగితీరుతుంది.

ప్రకటన గ్రంథం 21:8 "అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు" ఇది రెండవ మరణము.

"అబద్ధ సాక్ష్యం పలుకకూడదు" అనే ఈ ఆజ్ఞను మనం నెరవేర్చాలంటే మొదటిగా మనలో పక్షపాత వైఖరి లేకుండా చూసుకోవాలి. ఆ వ్యక్తి నా విశ్వాసానికి చెందిన వ్యక్తి కాదు, నా లింగానికి చెందిన వ్యక్తి కాదు, నాకులా ఆలోచించే వ్యక్తి కాదు అని ఒకరి గురించి ఆలోచించినప్పుడే ఆ వ్యక్తిపై అబద్ధసాక్ష్యం చెప్పడానికి సాహసించగలము. ఎందుకంటే మనం మనకులా ఆలోచించే వ్యక్తులపై, మన విశ్వాసానికి చెందిన వ్యక్తులపై, మన లింగానికి చెందిన వ్యక్తులపై పక్షపాతం పెంచుకున్నప్పుడు వాటికి చెందనివారు ఏమైపోయినా పరవాలేదు అనే క్రూరత్వం మనలో విజృంభిస్తుంది. అందుకే బైబిల్ పక్షపాతవైఖరిని ఖండించి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమంటుంది (లేవీకాండము 19:18). మనతో విభేదించే వ్యక్తితోనైనా సరే మనం న్యాయంగానే వ్యవహరించాలి, అతను చెయ్యని తప్పు చేసాడు అన్నట్టుగా ఇబ్బందిపెట్టడానికి చూడకూడదు.

లేవీయకాండము 24:22 మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను.

యాకోబు 2:9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

ఐతే "అబద్ధ సాక్ష్యం పలుకకూడదు" అనే ఈ ఆజ్ఞ కేవలం న్యాయస్థానాలలో చెప్పబడే సాక్ష్యాలకు సంబంధించింది మాత్రమే కాదు, మనం ఏ సమయంలో ఐనా, ఎవరితోనైనా సత్యమే పలకాలని ఈ ఆజ్ఞ మనకు నేర్పిస్తుంది.

ఎఫెసీయులకు 4:15 ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

ఎఫెసీయులకు 4:25 మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

మనకు తెలిసిన సాక్ష్యం చెప్పకుండా మౌనంగా ఉండడం కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడమే, ఒక వ్యక్తికి ముఖస్తుతి చెయ్యడం కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడమే. ముఖ్యంగా నేటి సంఘాలలో చాలామంది వాక్యవిరుద్ధంగా అబద్ధ సాక్ష్యాలను చెబుతూ అనేకులను వాక్యసత్యం నుండి తప్పిస్తున్నారు,‌ పొరుగువాని పట్ల‌ అబద్ధ సాక్ష్యం చెప్పడమే నేరమైతే, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధబోధలు చెయ్యడం మరెంత నేరం ఔతుందో ఆలోచించాలి. వారందరూ "ప్రకటన 21:8" ప్రకారం అగ్నిగుండములోనే పాలుపొందుతారు. నేటి కుటుంబాలలో కూడా పిల్లలకు ఏవో చేస్తామని హామీలిస్తుంటారు, కానీ అవి నెరవేర్చుకోరు. మనం నెరవేర్చలేనివాటిని హామీలుగా ఇవ్వడం కూడా అబద్ధాలు చెప్పడం పరిథిలోకే వస్తుంది.

ఇలాంటి అబద్ధపు మాటలనుండి తప్పించుకోవడం ఎలా? ఇందుకు మనం ఎక్కువ సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లకు కేటాయించకుండా, మన మన పనుల్లో నిమగ్నమవ్వాలి. ప్రార్థనలోనూ, వాక్యధ్యానంలోనూ గడుపుతుండాలి.

నిర్గమకాండము 20:17
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.

అంతరంగంలో చెడు తలంపులను (ఆశలను) కూడా దేవుడు పాపంగా పరిగణిస్తాడని ఈ ఆజ్ఞ మనకు నేరుగా తెలియచేస్తుంది. ఈ ఆజ్ఞను పాటించినవాడు తన పొరుగువాని పట్ల మరేవిధమైన పాపానికీ ఒడిగట్టలేడు. ఎందుకంటే పాపమనేది మొదట తలంపుల్లోనే ప్రారంభమౌతుంది. ఈ ఆజ్ఞ ఆ తలంపులనే ఖండిస్తుంది. తలంపుల్లోనే ఆ పాపాన్ని మనం అధిగమిస్తే ఇక క్రియల్లో దానిని చెయ్యలేము. ఒకవేళ తలంపుల్లో పాపాన్ని అధిగమించకపోతే అది వేరే ఆజ్ఞల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఉదాహరణకు పొరుగువాని భార్యను కానీ పరాయి స్త్రీ భర్తను కానీ ఆశించే పాపపు తలంపులను అధిగమించకపోతే అది వ్యభిచారంగా మారి "వ్యభిచరించకూడదు" అనే ఆజ్ఞ ఉల్లంఘనగా మారుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞ చివరిగా చెప్పబడుతున్నప్పటికీ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా శిరసావహించాలి. దేవుని ఆజ్ఞలు ఆధ్యాత్మికమైనవని చెప్పడానికి ఈ ఆజ్ఞ ఒక బలమైన ఆధారం. దేవుని ఆజ్ఞలు భౌతికంగా నియంత్రణలో ఉండడానికి మనం చేసుకునే చట్టాలవంటివి కావు. ఆయన ఆజ్ఞలు అంతరంగంలో కలిగే పాపపు ఆశలను కూడా ఖండిస్తూ వాటి విషయంలో మనం దేవునికి లెక్కచెప్పాలని హెచ్చరిస్తున్నాయి. యూదులు ధర్మశాస్త్రాన్ని బాహ్యసంబంధమైనదిగా భావించి అంతరంగంలో తప్పిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దించింది అందుకే (మత్తయి 5:27,28). దేవునిపట్ల భయం మాత్రమే ఈ అంతరంగ పాపాల నుండి మనల్ని తప్పించగలదు.

ఇక ఈ ఆజ్ఞలో మనం ఆశించకూడదని చెప్పబడినవి కేవలం కొన్ని ఉదాహరణలే, "నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు" అని రాయబడింది కాబట్టి మనం మరేదీ ఆశించకూడదు. ఒక చిన్న పుల్లను కూడా. "నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు" అన్నప్పుడు అతని పొలం కావొచ్చు మరేదైనా కావొచ్చు, "నీ పొరుగువాని భార్యనైనను" అన్నప్పుడు వేరే స్త్రీ భర్తను కావొచ్చు, ఇలా మనది కానిదేదీ కూడా మనం ఆశించకూడదు. ముఖ్యంగా పొరుగువాని భార్య, పరాయి స్త్రీ భర్త మనకు ఆకర్షితులయ్యేలా వారితో సంబాషణలు జరపకూడదు. వారి దాంపత్య జీవితంలో సమస్యలు కలిగించకూడదు. ‌

నేను "దొంగిలించకూడదు" అనే ఆజ్ఞలో తెలియచేసినట్టుగా మనం పొరుగువారిది ఏదైనా ఆశించడానికి "దేవుడు మనకు ఇచ్చినదానితో తృప్తి పడకపోవడమే కారణం" అందుకే మనకు కలిగినవాటితో తృప్తిచెందాలి. మనకు కావలసినవాటికోసం ప్రభువును వేడుకుంటూ చేతులతో కష్టపడాలి.

నిర్గమకాండము 20:18,19
ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల ప్రజలు (పెద్దలు) సీనాయి పర్వతంపై దేవుడు దిగి వచ్చి పది ఆజ్ఞలను పలుకుతున్నప్పుడు అక్కడ సంభవిస్తున్న పరిస్థితులను చూసి భయానికి లోనవ్వడం, ఆ విషయమై మోషేకు విన్నవించుకోవడం మనం చూస్తాం. ఈ విషయం మోషే మరింత వివరంగా తెలియచేసిన సందర్భం చూడండి.

ద్వితీయోపదేశకాండము 5:23-27 మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్య మును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వర మును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి. కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చని పోదుము. మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవు డైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.

నిర్గమకాండము 20:20
అందుకు మోషే భయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.

ఈ వచనంలో మోషే; భయపడుతున్న ఇశ్రాయేలీయులకు ధైర్యం చెబుతూ దేవుడు ఆ విధంగా సీనాయి పర్వతం దగ్గరకు ఎందుకు దిగివచ్చాడో వివరించడం మనం చూస్తాం. ఇక్కడ మోషే ఒకవైపు "భయపడకుడి" అంటూ మరో వైపు "ఆయన భయము మీకు కలుగచేయుటకును" అంటున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని స్వరం విని చనిపోతామని భయపడుతున్నారు కాబట్టి మీకు ఆయన తన స్వరం వినిపించింది మిమ్మల్ని చంపడానికి కాదు ఆ విషయంలో మీరు భయపడనక్కర్లేదు కానీ, మీరు పాపం చెయ్యకుండా భయం కలగడానికే ఆయన అలా దిగివచ్చి మాట్లాడుతున్నాడని ఆ మాటల భావం.

నిర్గమకాండము 20:21
ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా-

ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల విన్నపం ప్రకారం; ఇక దేవుని స్వరం వారికి వినిపించకుండా అతనే మధ్యవర్తిగా దేవునియొద్దకు వెళ్ళడం మనం చూస్తాం. మోషే దేవుని మాట ప్రకారమే అలా చేసాడు.

ద్వితీయోపదేశకాండము 5:28-31 మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెల విచ్చెనుఈ జనులు నీతో చెప్పినమాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. మీ గుడా రములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.

నిర్గమకాండము 20:22,23
యెహోవా మోషేతో ఇట్లనెను ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.

ఈ వచనంలో దేవుడు ఆయన ఆకాశం నుండి వారితో మాట్లాడాడు కాబట్టి, ఆయన రూపం వారు చూడలేదు కాబట్టి ఆయనకు పేరిట ఏదో ఒక రూపంలో విగ్రహాలను చేసుకుని ఆయనను ఆరాధించకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ విషయాన్ని వారికి తెలియ చెయ్యడానికే ఆయన ఆకాశం నుండి సీనాయి పర్వతం‌ మీదకు దిగివచ్చి, తన స్వరాన్ని వినిపింపచేసాడు. ఈ విషయమై మోషే ఇశ్రాయేలీయులకు చాలా ఖండితంగా హెచ్చరించాడు.

ద్వితీయోపదేశకాండము 4:11-19 అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింప వలసిన కట్టడ లను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూప మును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

నిర్గమకాండము 20:24
మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.

ఈ వచనంలో దేవుడు తనకు బలులను అర్పించడానికి మంటిబలిపీఠం చేయాలని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు దేవాళయం ఏర్పడేంతవరకూ వారు ఆయనకు ఎక్కడ బలులను అర్పించినా ఆయన వచ్చి వారిని ఆశీర్వదించేవాడు. దేవాళయం ఏర్పడిన తరువాత మాత్రం ఇది నిషిద్ధం, ప్రజలు ఎటువంటి బలినైనా దేవాళయంలో యాజకులద్వారానే అర్పించాలి.

ద్వితీయోపదేశకాండము 12:5,6 మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.

ప్రస్తుతం మనవిషయంలో ఐతే "ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో" అక్కడ ఆయన ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు (మత్తయి 18:20).

నిర్గమకాండము 20:25
నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.

ఈవచనంలో దేవుడు ఒకవేళ ఆయనకు మంటితో కాకుండా రాళ్ళతో బలిపీఠం కట్టాలనుకుంటే పనిముట్ల ద్వారా మలచబడిన రాళ్ళతో అది కట్టకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనికి కారణమేంటో ఇక్కడ వివరించబడలేదు కానీ, బలిపీఠం అనేది ఆయనకు ప్రతిష్టమైనది కాబట్టి ఆయన పరిశుద్ధతను తెలియచెయ్యడానికే మనం ఉపయోగించే పనిముట్లను దానికోసం ఉపయోగించవద్దని‌ చెప్పియుండవచ్చు.

నిర్గమకాండము 20:26
మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్క కూడదు.

మానవ దిగంబరత్వం (సిగ్గు) అనేది వారి పాపాన్ని తెలియచేస్తుంది. ఆదాము హవ్వలు పండు తిని పాపం చేసాకే వారు దిగంబరులమని భావించి సిగ్గుపడి దాక్కున్నారు. అందుకే ఆయన ఆ దిగంబరత్వం కనిపించకుండా మెట్లమీదుగా బలిపీఠం ఎక్కకూడదని చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులు అంగీలను‌ ధరిస్తారు కాబట్టి వారు మెట్లు ఎక్కుతున్నప్పుడు వారి మానం కిందవైపుగా కనిపిస్తుంటుంది. అందుకే బలిపీఠం దగ్గరకు మెట్లమీదుగా ఎక్కవలసివచ్చినప్పుడు ఆ యాజకులు వారి మానం కనిపించకుండా అంగీలోపల లాగులను ధరించాలని ఆజ్ఞాపించబడ్డారు (లేవీకాండము 16:4). సొలోమోను కట్టించిన బలిపీఠానికి ఉన్న మెట్లను యాజకులు ఆవిధంగానే లాగులు ధరించి ఎక్కేవారు.

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.