పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 25:1 , 25:2, 25:3 , 25:4 , 25:5 , 25:6 ,25:7 , 25:8 , 25:9 , 25:10 , 25:11 , 25:12 , 25:13-15 , 25:16 , 25:17 , 25:18 , 25:19 , 25:20 , 25:21 , 25:22 , 25:23-28 , 25:29 , 25:30 , 25:31 , 25:32-37 , 25:38 , 25:39 , 25:40.

 

నిర్గమకాండము 25:1
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

గడచిన అధ్యాయంలో యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే సీనాయి కొండపైకి దిగివచ్చిన ఆయన సన్నిధిని ప్రవేశించినట్టు మనం చూసాం. అలా ప్రవేశించిన మోషేతో దేవుడు పలుకుతున్న మాటలనే ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ మాటలను మోషే గ్రంథస్థం చేసి ఇశ్రాయేలీయుల ప్రజలకు చదివి వినిపించాడు.

నిర్గమకాండము 25:2
నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.

ఈ వచనంలో దేవుడు తనకు ప్రతిష్ఠార్పణ తీసుకురావలసిందిగా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించమని మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ప్రతిష్ఠార్పణ అంటే, దేవునిసేవ కొరకు ప్రత్యేకపరచిందని అర్థం. అదేవిధంగా ఈ ప్రతిష్ఠార్పణ "మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను" అని మనం చదువుతున్నాం. మనం లేవీయకాండాన్ని చదువుతున్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా దేవునికి అర్పించవలసిన బలులను గురించి మనకు కనిపిస్తుంది. అవి ప్రజలు తప్పనిసరిగా ఇవ్వవలసిందే. అయితే ఇక్కడ‌ చెప్పబడుతున్న ప్రతిష్ఠార్పణ ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వవలసిందిగా చెప్పబడుతుంది. అందుకే ఎటువంటి బలవంతం లేకుండా మనఃపూర్వకముగా అర్పించేవారి దగ్గర మాత్రమే దానిని తీసుకోవాలి. ఈ ప్రతిష్ఠార్పణ ఎప్పుడైనా ఎవరైనా దేవునికి చెల్లించవచ్చు, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వవచ్చు. దీనికి ఎటువంటి నియమాలూ ఉండవు.

దావీదు ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు కూడా ప్రజలు ఇష్టపూర్వకంగా ఈ ప్రతిష్ఠార్పణను చెల్లించినట్టు మనం చదువుతాం (1 దినవృత్తాంతములు 29:6-9). ఈ ప్రతిష్ఠార్పణ విషయంలో యూదులు పెట్టుకున్న ఒక నియమం ఏంటంటే, దీనిని ఇశ్రాయేలీయులు అనగా దేవునిపిల్లలైనవారు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే వారికి మాత్రమే ఈ ప్రతిష్ఠార్పణ ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం విగ్రహారాధికులకు ఉండదు. అదేవిధంగా మతిస్థిమితం లేనివారికి కూడా ఆ జ్ఞానం ఉండదు కాబట్టి వారు దానిని ఇవ్వకూడదు, ఇచ్చినా వారిదగ్గర తీసుకోకూడదు.

ఐతే ఈ ప్రతిష్ఠార్పణ అనేది కేవలం ధర్మశాస్త్ర కాలానికి మాత్రమే పరిమితం కాదు. ఆయన ఈ కృపాకాలంలో మనపై మరింత కృపను కుమ్మరిస్తున్నాడు కాబట్టి, మనం కృతజ్ఞతతో, ఆయన సేవ ముందుకు వెళ్ళాలనే ఆసక్తితో మరింతగా ఆయనకు ఇవ్వాలి.

నిర్గమకాండము 25:3
మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి -

ముందటి వచనంలో దేవునికి ప్రతిష్ఠార్పణను ఎలా తీసుకురావాలో (మనఃపూర్వకముగా) బోధించబడితే ఈ వచనం నుండి వారు ఏమేం తీసుకురావాలో వివరించబడడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవునికి ప్రత్యక్షగుడారం నిర్మించడానికీ, అందులో యాజకత్వానికి అవసరమైన వస్తువులను తయారుచెయ్యడానికీ ఉపయోగించబడ్డాయి. ఇలా‌‌‌ ఇక్కడ దేవుడు‌‌ కోరినవన్నీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తెచ్చుకున్నవే (నిర్గమకాండము 12:35,36). వారియొద్ద సమృద్ధిగా ఉన్నవే. అవన్నీ వారికి ఆయనే ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇచ్చినవాటినుండి ఆయనకు ఇవ్వడానికి వారు రుణపడియున్నారు. కాబట్టి దేవుడు మనయొద్దనుండి మనం చెల్లించగలిగినవి, ఆయనకు రుణపడినవి మాత్రమే కోరతాడు తప్ప మనదగ్గర లేనివి కావని మనం గమనించాలి. మన ప్రవర్తన విషయంలో కూడా ఆయన మనం చేయదగినవే కోరుతున్నాడు.

మీకా 6:8 మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

అదేవిధంగా ఇక్కడ దేవుడు కోరుతున్న వస్తువుల జాబితాలో మనకు ఎక్కడా కూడా ఇనుము యొక్క ప్రస్తావన కనిపించదు. సొలొమోను‌ నిర్మించిన దేవాలయంలో కూడా ఇనుమును ఉపయోగించలేదు. ఎందుకంటే ఇనుమును ఆయుధాలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారు, ప్రత్యక్షగుడారం/దేవాలయమైతే దేవుని సమాధానానికి ఛాయగా ఉంది.‌ అందుకే ఆయుధాలు తయారుచేసే ఇనుమును వాటి నిర్మాణంలో ఉపయోగించలేదని మనం భావించవచ్చు.

ఇక ఇక్కడ దేవుడు కోరుతున్న వస్తువులతో ప్రత్యక్షగుడారంలో ఏమేం తయారుచేసారో‌ చూద్దాం.

బంగారం: ఈ బంగారాన్ని నిబంధన‌ మందసంపై బంగారు రేకు , మందసం మోయడానికి అమర్చబడే ఉంగరాలు, కరుణాపీఠం, రెండు బంగారు కేరూబులు, బల్లపై రేకు, ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు, పళ్ళాలు, దూపార్తులు, గిన్నెలు, పానీయ పాత్రలు, దీపవృక్షం, కత్తెర మరియు చిప్ప, ప్రత్యక్షగుడార తెరలకు యాబై గుండీలు, మందిర అడ్డకర్రలకు రేకు, పలకలకు రేకు, స్థంబాలకు రేకులు, యాజకులకు వస్త్రాలు, వారి నడుముకు గంటలు, పాగాపై యెహోవా పరిశుద్ధుడు అనే రేకు.....మరిన్ని ఇతర వస్తువులు చెయ్యడానికి ఉపయోగించారు. ఈ వివరాలన్నీ మనం 25వ అధ్యాయం నుండి చదువుతాం.

వెండి: ఈ వెండిని మందిరానికి ఇరవై‌పలకల క్రింద‌ నలబై‌‌ దిమ్మలు, మరో ఎనిమిది‌ పలకలక్రింద పదహారు దిమ్మలు, స్థంభాలకు వంకులు దిమ్మలు, మరిన్ని ఇతరవస్తువులు చెయ్యడానికి ఉపయోగించారు. ఈ వివరాలన్నీ మనం 26వ అధ్యాయం నుండి చదువుతాం.

ఇత్తడి: ఈ ఇత్తడిని ఆలయ తెరకు ఉండే ఐదు స్థంబాలకు దిమ్మలు, బూడిదను ఎత్తే వస్తువులను, గంగాళాన్ని, జల్లెడను, ఇత్తడి పీటను మరిన్ని ఇతర వస్తువులు చెయ్యడానికి ఉపయోగించారు. ఈ వివరాలన్నీ మనం 26వ అధ్యాయం నుండి చదువుతాం.

నిర్గమకాండము 25:4
నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు-

నీల ధూమ్ర రక్తవర్ణములు: దీనిని ఆలయ తెరలు చెయ్యడానికి ఉపయోగించారు. ఈ వివరాలన్నీ మనం 26వ అధ్యాయం నుండి చదువుతాం.

సన్నపునార: దీనిని ఆలయంలో యాజకత్వం చేసే లేవీయుల వస్త్రాలకోసం ఉపయోగించారు (నిర్గమకాండము 28:39). ఇది ఐగుప్తులో విస్తారంగా తయారుచేయబడేది (యెషయా 19:8).

మేకవెండ్రుకలు: దీనిని మందిరపు పైకప్పు తెరలు చెయ్యడానికి ఉపయోగించారు (నిర్గమకాండము 26:27).

నిర్గమకాండము 25:5
ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు-

ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు: వీటిని కూడా మందిరం యొక్క పైకప్పు తెరను చెయ్యడానికి ఉపయోగించారు (నిర్గమకాండము 36:19).

తుమ్మకఱ్ఱలు: ఈ తుమ్మకఱ్ఱను మందసం చెయ్యడానికీ, బల్లను చెయ్యడానికీ, వాటి‌ మోతకర్రలను చెయ్యడానికీ, ఆలయ స్థంబాలు చెయ్యడానికీ, తెరలకు పలకలు చెయ్యడానికీ ఉపయోగించారు. ఈ వివరాలన్నీ మనం 25 వ అధ్యాయం నుండి చదువుతాం.

అదేవిధంగా 3వ వచనంలో నేను ఇశ్రాయేలీయులకు దేవుడు ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నవన్నీ ఐగుప్తునుండి తెచ్చుకున్నవేయని వివరించాను. కానీ ఈ తుమ్మకఱ్ఱను వారు ఐగుప్తునుండి తెచ్చుకునే అవకాశం‌ లేదు. వారు తప్పకుండా దీనికోసం చుట్టుపక్కల అడవులకు వెళ్ళి తీసుకురావాలి, అప్పుడే ప్రత్యక్షగుడారం నిర్మించబడుతుంది. కాబట్టి దేవుడు మనతో సహవాసం కలిగియుండాలి అంటే దానికి మనం కూడా కష్టపడాలి, శక్తివంచన లేకుండా ప్రయాసపడాలి. ఇది ఆయన మన బాధ్యతగా మనకు నియమించిన భాగం. ఉదాహరణకు, ఆయన మన పాపాలను కేవలం యేసుక్రీస్తు ద్వారా కృపతో క్షమించి మనకు రక్షణను ప్రసాదిస్తున్నాడు. కానీ ఆ రక్షణ కార్యంలో మనం కూడా మన బాధ్యతగా మన పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆ సమయంలో మనం తీవ్రమైన బాధకు గురికావడం సహజం. నిజంగా రక్షించబడిన ప్రతీ విశ్వాసీ ఈ వేదనను ఆ సమయంలో అనుభవించే ఉంటాడు.

నిర్గమకాండము 25:6
ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభార ములు-

ప్రదీపమునకు తైలము: దీనిని ఆలయంలో దీపము వెలిగించడానికి ఉపయోగించేవారు, ఇది స్వచ్ఛమైన ఒలీవల నూనె (నిర్గమకాండము 27:20).

అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు: యాజకులను అభిషేకించే నూనెలో కలపడానికీ, ఆలయంలో ధూపం వెయ్యడానికీ ఈ సుగంధ సంభారములు ఉపయోగించేవారు.

నిర్గమకాండము 25:7
లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.

లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు: వీటిని ప్రధానయాజకుడు ధరించే వస్త్రం కోసం ఉపయోగించారు. ఈ వివరాలు మనం 37వ అధ్యాయంలో చదువుతాం.

నిర్గమకాండము 25:8
నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

ఈ వచనంలో దేవుడు వారిలో నివసించడానికి పరిశుద్ధస్థలం నిర్మించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారిలో అనగా ఇశ్రాయేలీయుల నివాసం మధ్యన అని అర్థం. మనం‌ పైన చూసిన వస్తువులన్నీ ఆయన వారిమధ్యన నివసించడానికి నిర్మించబోయే పరిశుద్ధస్థలం యొక్క నిర్మాణానికే అడగడం జరిగింది. ఇక్కడ మనకు యెహోవా దేవుడు తన ప్రజలమధ్య నివాసం చెయ్యడానికి ఇష్టపడే దేవునిగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల‌ మధ్య ప్రత్యక్షపు గుడారంలో, దేవాలయంలో నివసించిన ఆయన, నూతననిబంధన కాలంలో యేసుక్రీస్తు శరీరం ద్వారా సంపూర్ణంగా తన ప్రజల మధ్య నివసించాడు (కొలస్సీ 2:9). అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈలోకంలో‌ జీవించినప్పుడు తనను తాను దేవాలయంతో పోల్చుకున్నాడు (యోహాను 2:19). ప్రస్తుతం ఆయన మనలోనే నివసిస్తున్నాడు (2కొరింథీ 6:16).

నిర్గమకాండము 25:9
నేను నీకు కనుపరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.

ఈ వచనంలో దేవుడు తాను కనపరచిన విధంగా ఆ ప్రత్యక్షగుడారాన్ని నిర్మించాలని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కాబట్టి ప్రత్యక్షగుడార నిర్మాణం అనేది మోషే తన స్వంత జ్ఞానంతో నిర్మించింది కాదు, దానిని ఎలా నిర్మించాలో, వేటితో నిర్మించాలో దేవుడే అతనికి సంపూర్ణంగా కనపరిచాడు. సొలొమోను నిర్మించిన దేవాలయం కూడా తన జ్ఞానంతో నిర్మించింది కాదు, దేవుడు దావీదుకు బయలుపరచిన విధంగానే అతను దానిని నిర్మించాడు (1 దినవృత్తాంతములు 28:11-19). మనం కయీను హేబేలు అర్పణల సందర్భం నుండీ చూస్తున్నట్టుగా మానవుడు పతనస్వభావి కాబట్టి, దేవునికి సంబంధించిన ఆరాధనలో, ఆయన నివసించే ఆలయ‌నిర్మాణంలో మానవుని జ్ఞానాన్ని ఆయన అంగీకరించడు. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.

నిర్గమకాండము 25:10
వారు తుమ్మకఱ్ఱతోనొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడునర, దానియెత్తు మూరెడునర.

ఈ వచనంలో దేవుడు మందసం యొక్క తయారీవిధానం గురించి వివరించడం మనం చూస్తాం. 5వ వచనంలో దేవుడు తుమ్మకఱ్ఱను తీసుకురమ్మనడానికి ఈ మందసం యొక్క‌ తయారీ కూడా ఒక ప్రధానమైన కారణం. తుమ్మకఱ్ఱలో నల్ల తుమ్మకఱ్ఱ అనేది చెడిపోకుండా ఉంటుంది. అందుకే ఆయన మందసం యొక్క తయారీకీ ప్రత్యక్షగుడారం యొక్క స్థంబాల తయారీకీ దానిని‌ ఎన్నుకున్నాడు. ఇక ఈ మందసం యొక్క కొలతలను పరిశీలిస్తే, బైబిల్ ప్రకారం మూర అంటే 46 సెంటీమీటర్లు. మందసం యొక్క పొడుగు రెండుమూరలునర అన్నప్పుడు 115 సెంటీమీటర్లు. దాని వెడల్పు మూరెడునర అన్నప్పుడు 69 సెంటీమీటర్లు. ఎత్తు మూరెడునర అన్నప్పుడు 69 సెంటీమీటర్లు. ఈవిధంగా మందసం 115 సెంటీమీటర్ల పొడవుతో, 69 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పులతో తయారు చెయ్యబడింది.

నిర్గమకాండము 25:11
దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.

ఈ వచనంలో దేవుడు తుమ్మకఱ్ఱతో తయారు చెయ్యబడిన మందసానికి లోపలా బయటా, చెక్క కనిపించకుండా బంగారు రేకు పొదిగించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది దేవుని ఆజ్ఞలున్న పలకలు ఉంచబడే మందసం యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా దేవుడు మందసం‌ మొత్తాన్నీ బంగారంతో చెయ్యమని చెప్పలేదు, ఎందుకంటే దానికి ఎక్కువగా బంగారం అవసరమయ్యి ఇశ్రాయేలీయులకు భారంగా ఉంటుంది కాబట్టి, ఆయన అటువంటి భారాన్ని వారిపై మోపలేదు. ఇక ఆ మందసానికి బంగారు జవను చుట్టు కట్టాలి అన్నప్పుడు దాని అంచులను బంగారంతో అలంకరించాలని అర్థం.

నిర్గమకాండము 25:12
దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.

ఈ వచనంలో దేవుడు తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారుపూత పూయబడిన మందసానికి ప్రక్కభాగాలలో నాలుగు ఉంగరాలు తయారు చెయ్యమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వాటియొక్క ఉద్దేశం క్రింది వచనాలలో వివరించబడింది.

నిర్గమకాండము 25:13-15
తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను. ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు.

ఈ వచనాల ప్రకారం మందసం యొక్క ప్రక్కభాగాలలో బంగారంతో చెయ్యబడిన ఉంగరాలలో తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారుపూత పూయబడిన మోతకఱ్ఱలను పెట్టాలి. వాటి సహాయంతో ప్రతిష్టించబడిన యాజకులు ఆ మందసాన్ని మొయ్యడం జరుగుతుంది (ద్వితీయోపదేశకాండము 10:8). ఆ‌ మోతకఱ్ఱలను ఆ మందసం నుంచి వేరుచెయ్యకూడదు.

నిర్గమకాండము 25:16
ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను.

ఈ వచనంలో దేవుడు తాను రాతిపలకలపై రాసి మోషేకు అప్పగించిన పది ఆజ్ఞలను ఆ మందసంలో ఉంచమనడం మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ లో ఇక్కడ శాసనాలు అని తర్జుమా చేసిన చోట Testimony అనే పదం ఉపయోగించారు‌. ఆ పది ఆజ్ఞలూ దేవుని మనస్సుకు (లేక స్వభావానికి) సాక్ష్యంగా ఉన్నాయని ఆ పదం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారంగా మోషే ఆ పది ఆజ్ఞలనూ మందసంలో ఉంచడం జరిగింది (ద్వితీయోపదేశకాండము 10:2-5). అదేవిధంగా అందులో అహరోను‌ చిగురించిన కర్రనూ మరియు ఇశ్రాయేలీయులు భుజించిన మన్నాను కూడా ఒక పాత్రలో పట్టి ఉంచడం జరిగింది (నిర్గమకాండము 16:33,34, హెబ్రీ 9:4).

నిర్గమకాండము 25:17
మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.

ఈ వచనంలో దేవుడు మేలిమి బంగారంతో కరుణాపీఠాన్ని చెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ ఇది మందసంపై ఉంచబడే మూత. దానినే ఇక్కడ కరుణాపీఠము అని తర్జుమా చెయ్యడం జరిగింది. ఎందుకంటే పాతనిబంధనలో ప్రాయశ్చిత్తం అన్న కొన్నిచోట్ల హీబ్రూ బైబిల్ లో ఇదే పదాన్ని ఉపయోగించారు. ఈ కరుణాపీఠం క్రీస్తు ద్వారా మనకు కలిగే ప్రాయశ్చిత్తానికి ఛాయగా ఉంది, అందుకే ఇది పూర్తిగా మేలిమిబంగారంతో చెయ్యబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ కరుణాపీఠం ఎలాగైతే మందసంలో ఉంచబడిన దేవుని ఆజ్ఞలకు మూతగా (అడ్డుగా) అమర్చబడిందో, అలాగే క్రీస్తు కూడా ధర్మశాస్త్రం విషయంలో మనకు కలిగే ఉగ్రతకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు (రోమా 3: 25,26). ఆజ్ఞల ఉల్లంఘన విషయంలో క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. ఇక ఈ కరుణాపీఠం యొక్క కొలతల విషయానికి వస్తే మందసం యొక్క పొడవు వెడల్పులకు ఇది సమానం. పొడవు రెండున్నర మూరలు అనగా 115 సెంటీమీటర్లు. వెడల్పు 69 సెంటీమీటర్లు.

నిర్గమకాండము 25:18
మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

ఈ వచనంలో దేవుడు రెండు బంగారు కెరూబులను చెయ్యాలని ఆజ్ఞాపించడం‌ మనం చూస్తాం. ఈ కెరూబులు ఆ కరుణాపీఠంపై ఇరువైపులా చెయ్యబడతాయి. నకిషిపనిగా చెయ్యాలని అంటే, ఒకే బంగారు రేకుతో (ముక్కలు అతికించకుండా) చెయ్యాలని అర్థం. బైబిల్ విగ్రహాలను చెయ్యకూడదని వాటిని పూజించేవిధంగా, లేక దేవునికి రూపంగా వాటిని చెయ్యకూడదనే భావంలో చెబుతుంది తప్ప, దేవుని సన్నిధికి ఛాయగా చెయ్యకూడదని కాదు. ఇక్కడ ఈ బంగారు కెరూబులు దేవుని సన్నిధికి సూచనగా చెయ్యబడుతున్నాయి (యెషయా 6).

నిర్గమకాండము 25:19
ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను.

ముందటి వచనంలో తెలియచేసినట్టుగా ఈ కెరూబులు మందసంపై ఉంచబడే కరుణాపీఠంపై ఇరువైపులా చెయ్యబడాలి. ఏకాండంగా అంటే ఆ కరుణాపీఠంతో కలపి (ఒకే బంగారు రేకుతో) చెయ్యబడాలి.

నిర్గమకాండము 25:20
ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.

ఈ వచనంలో దేవుడు ఆ కెరూబుల రూపాలు ఎలా ఉండాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ కెరూబులు కరుణాపీఠంపై ఇరువైపులా ఎదురెదురుగా రెక్కలు విప్పి ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నట్టుగా ఉండాలి. వాటి మొహాలు కరుణాపీఠాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. నేను పైన తెలియచేసినట్టుగా ఈ కెరూబుల భంగిమలు దేవుని సన్నిధిని అనగా, దేవుని ఆజ్ఞలనూ వాటి ఉల్లంఘన విషయంలో క్రీస్తు ద్వారా కలిగే పాపక్షమాపణనూ సూచిస్తున్నాయి.

నిర్గమకాండము 25:21
నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

16 వచనంలోని ఈ మాటలను దేవుడు మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన శాసనాలు (పది ఆజ్ఞలు) ఆయన మనసును సూచిస్తున్నాయి కాబట్టి, ఆయన సన్నిధికి ప్రత్యక్షరూపమైన ఆ ప్రత్యక్షగుడారంలోని మందసంలో ఆ శాసనాలను ఉంచాలని ఆయన మరలా ఆజ్ఞాపిస్తున్నాడు‌. దేవుడు ఒకే విషయాన్ని ఇలా మరలా మరలా జ్ఞాపకం చెయ్యడం ఆ విషయం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది.

నిర్గమకాండము 25:22
అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.

ఈ వచనంలో దేవుడు మోషే నిర్మించబోతున్న ప్రత్యక్షగుడారంలోని మందసం మధ్య నుండి మాట్లాడతానని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇప్పటివరకూ దేవుడు మోషేతో సీనాయి పర్వతంపైకి దిగివచ్చి మాట్లాడుతున్నాడు, కానీ ఎప్పుడైతే ప్రత్యక్షగుడారం ఏర్పరచబడిందో దానినుండే మాట్లాడబోతున్నాడు‌. ఇది ఆయన క్రీస్తు ద్వారా లోకంతో మాట్లాడడాన్ని సూచిస్తుంది. క్రీస్తు ద్వారానే ఆయన లోకానికి సంపూర్ణంగా తనను‌ తాను‌ బయలుపరచుకున్నాడు, మాట్లాడాడు.

హెబ్రీయులకు 1:1,2 పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో- నానాభాగములుగాను) నానావిధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.

నిర్గమకాండము 25:23-28
మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్ల మోయబడును.

ఈ వచనాలలో దేవుడు తుమ్మకఱ్ఱతో ఒక బల్లను చేసి దానిపై బంగారు రేకును పొదిగించాలని, దాని చుట్టూ బంగారంతో అంచులను చెయ్యాలని, అదేవిధంగా దానిని మొయ్యడానికి బంగారు రేకు పొదిగించబడిన తుమ్మకఱ్ఱలను, దాని ఉంగరాలలో దూర్చాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ చెప్పబడుతున్న బల్లయొక్క కొలతలూ మందసం యొక్క కొలతలూ ఒకటే. దీనిగురించి నేను 10వ వచనంలో వివరించాను. బల్ల అనేది కుటుంబ సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే కుటుంబమంతా కలసి బల్లపైనే భోజనం చేస్తారు. కాబట్టి ఈ‌ బల్ల దేవునికీ తన ప్రత్యక్షగుడారంలో సేవచేసే యాజకులకూ మధ్య సహవాసాన్ని సూచిస్తుంది. డా.జాన్ గిల్ గారు, మందసం మరియూ ఈ బల్ల‌ తుమ్మకఱ్ఱతో చేయబడి దానిపై బంగారు పూతపూయబడడం యేసుక్రీస్తు యొక్క మానవస్వభావానికీ మరియూ ఆయన దైవస్వభావానికీ సాదృశ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే బంగారుపూత పూయబడిన తుమ్మకఱ్ఱ ఎప్పటికీ పాడు కాదు కాబట్టి, "ఆయన తన పరిశుద్ధునికి కుళ్ళు పట్టనియ్యడు" అనేదానిని ఇది సూచిస్తుందని మనం భావించవచ్చు. కానీ ఇది కేవలం అభిప్రాయం మాత్రమే.

నిర్గమకాండము 25:29
మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.

ఈ వచనంలో దేవుడు ఆయన సహవాసానికి సాదృశ్యంగా ఉన్న బల్లపై ఉంచబడే వస్తువులను మేలిమి బంగారంతో తయారు చెయ్యమనడం మనం చూస్తాం. మనం పదే పదే చూస్తున్న ఈ బంగారం దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా వినియోగించబడింది. అందుకే ఆయన యోహానుకు పరలోకం గురించిన ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు అది బంగారంతో నిర్మాణమైనట్టు వర్ణించబడింది. పరిశుద్ధుడైన దేవుడు నివసించే ప్రదేశం కూడా పరిశుద్ధంగా ఉంటుందనేదే దాని భావం.

నిర్గమకాండము 25:30
నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.

ఈ వచనంలో దేవుడు ఆ బల్లపై నిత్యమూ సన్నిధిరొట్టెలను ఉంచాలని జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. వీటిని సముఖపు రొట్టెలు అంటారు. ఇవి ఆయన ప్రత్యక్షగుడారంలో సేవచేసే యాజకులకు ఆహారంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ "నిత్యము" అనే పదప్రయోగాన్ని మనం చూస్తాం. ఇదే మాట మనకు సున్నతి విషయంలోనూ (ఆదికాండము 17:13), పస్కా పండుగ విషయంలో (నిర్గమకాండము 12: 14), ధూపము విషయంలోనూ (నిర్గమకాండము 30:8) మరిన్ని విషయాలలోనూ మనం గమనిస్తాం. అయితే నూతననిబంధన వచ్చాక నిత్యము అని చెప్పబడిన సున్నతి, బలులు, పండుగలు నిలచిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి నిత్యము అన్నప్పుడు దానికాలం వరకూ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న సముఖపు రొట్టెలు కూడా ప్రత్యక్షగుడారం, దేవాలయం ఉన్నంతవరకే ఆ బల్లపై పెట్టబడేవి. దేవాలయం ధ్వంసం చేయబడ్డాక ఇక యూదులకు ఆ అవకాశం లేదు.

నిర్గమకాండము 25:31
మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.

ఈ వచనం నుండి దేవుడు బంగారు దీపవృక్షం యొక్క నిర్మాణం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిని నకిషిపనిగా చెయ్యాలని అంటే విడివిడి భాగాలను అతికించకుండా ఒకే బంగారురేకును సాగగొడుతూ చెయ్యాలని అర్థం.

నిర్గమకాండము 25:32-37
దీపవృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను, దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.

ఈ వచనాలలో మనం దీపవృక్షం యొక్క సంపూర్ణమైన నిర్మాణం గురించి చూస్తాం. నిలువుగా ఉన్న కమ్మికి అటు మూడు ఇటు మూడు ఆ కమ్మిపై ఒకటి మొత్తం ఏడు దీపాలు వెలిగించేలా ఇది తయారుచెయ్యబడాలి. దీనియొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రత్యక్షగుడారంలో ఎక్కడా కూడా మనకు లోపలికి వెలుగు ప్రసరింపచెయ్యడానికి కిటికీల యొక్క ప్రస్తావన ఉండదు. అందువల్ల ఆ ప్రత్యక్షగుడారం వెలుతురు లేక చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగల ప్రత్యక్షగుడారంలో ఈ దీపవృక్షమే వెలుగును ప్రసరిస్తుంది. ఈ చీకటిగల చోట వెలుగునిచ్చే దీపవృక్షం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉందని మనం భావించవచ్చు.

2పేతురు 1:19 - మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

నిర్గమకాండము 25:38
దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.

ఈ వచనంలో దేవుడు ఆ దీపవృక్షం యొక్క కత్తెర మరియు చిప్ప బంగారంతో తయారు చెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఎందుకంటే దీపంలో నూనెవత్తు వెలుగుతున్నప్పుడు అది కాలిపోతూ మసిగా మారుతుంది. ఆ మసి ఉన్నప్పుడు వత్తు సరిగా వెలగలేదు. అందుకే బంగారు కత్తెరతో దానిని కత్తిరించి ఆ మసిని బంగారు చిప్పలో వెయ్యాలి.

నిర్గమకాండము 25:39
ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.

ఈ వచనంలో దేవుడు ఆ దీపవృక్షాన్నీ, కత్తెర మరియు చిప్పనూ నలబై వీసల బంగారంతో తయారు చెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నలభైవీసల‌ బంగారం అంటే ముప్పై నాలుగు కిలోలు.

నిర్గమకాండము 25:40
కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.

దేవుడు 9వ వచనంలో తెలియచేసిన మాటలనే ఈ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ మోషేకు జాగ్రత్త చెప్పడం మనం చూస్తాం. నేను ఆ సందర్భంలో తెలియచేసినట్టుగా ప్రత్యక్షగుడారం, అందులోని ఉపకరణాలు దేవుని సన్నిధికి సూచనగా ఉన్నాయి కాబట్టి, అందులో పతనస్వభావియైన మనిషి తన ఇష్టానుసారంగా ఏమీచెయ్యకూడదు. దేవుడు కనపరిచినట్టే సమస్తమూ చెయ్యాలి. ప్రస్తుత మన ఆరాధనలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఆయన తన వాక్యంలో కనపరచిన విధంగానే మనం ఆయనను సమీపించాలి, ఆయనను ఆరాధించాలి, లేదంటే అది ఆయన దృష్టికి ఘోరపాపం ఔతుంది.

2థెస్సలొనికయులకు 2:15 - కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.