విషయసూచిక:- 23:1, 23:2, 23:3 , 23:4,5, 23:6 , 23:7 ,23:8 , 23:9 , 23:10,11 , 23:12 , 23:13 , 23:14 , 23:15 , 23:16 , 23:17 , 23:18 , 23:19 , 23:20 , 23:21,22 , 23:23 , 23:24 , 23:25 , 23:26 , 23:27 , 23:28 , 23:29,30 , 23:31 , 23:32,33
నిర్గమకాండము 23:1
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు.
ఈ వచనంలో లేనివార్తను పుట్టించకూడదని, దుష్టులతో కలసి అన్యాయపు సాక్ష్యం పలకకూడదని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. మనం ఏ విషయంలోనూ కూడా లేనివార్తను పుట్టించకూడదు (మాట్లాడకూడదు). లేనివార్తను పుట్టించకూడదు అన్నప్పుడు, మనకు ఏం జరిగిందో తెలియని విషయాలను ఊహించుకునో, లేక ఎవరో ఏదో (ఏకపక్షంగా) చెప్పారనో వాటిని నమ్మేసి మాట్లాడకూడదనే భావం కూడా ఇందులో ఉంది. దుష్టునితో కలసి అన్యాయపు సాక్ష్యం పలకకూడదు. అనే నియమం, న్యాయస్థానాల్లో, ప్రభుత్వ అధికారుల యెదుట (పోలీష్ స్టేషన్లలో) మనం చెప్పే సాక్ష్యాలతో సహా వ్యక్తిగతంగా మరొకరి గురించి చెప్పే సాక్ష్యాల విషయంలో కూడా వర్తిస్తుంది. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయంలో చెప్పబడిన పది ఆజ్ఞల్లో తొమ్మిదవ ఆజ్ఞకు సంబంధించిన నియమం.
నిర్గమకాండము 23:2
దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు.
ఈ వచనంలో దుష్కార్యము జరిగించడానికి సమూహాన్ని వెంబడించకూడదని, న్యాయాన్ని త్రిప్పివేసేలా సమూహంతో కలసి సాక్ష్యం పలకకూడదని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. మొదటి వచనం ప్రకారం; మనం లేనివార్తను పుట్టించకూడదు, దుష్టునితో కలసి అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. దానికి కొనసాగింపుగానే ఈ వచనం రాయబడింది. ఒకవేళ దుష్కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవారు ఒక పెద్ద సమూహంగా ఉన్నప్పటికీ, న్యాయాన్ని త్రిప్పివేసేలా వారు సమూహంగా కూడినప్పటికీ, మనం ఒంటరిగా న్యాయం పక్షంగా నిలబడాలని, వారు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి వారితో చేతులు కలిపి న్యాయాన్ని త్రిప్పివేసేలా అబద్ధసాక్ష్యం పలకకూడదని ఈ మాటలయొక్క భావం.
నిర్గమకాండము 23:3
వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాత ముగా నుండకూడదు.
ఈ వచనంలో వ్యాజ్యమాడేవాడు బీదవాడైతే వానియెడల పక్షపాతంగా ఉండకూడదని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. దీనిని మనం రెండువిధాలుగా అర్థం చేసుకోవాలి. వాడు బీదవాడు కాబట్టి, వాడిపై సానుభూతి చూపిస్తూ వాడి వ్యాజ్యం అన్యాయంగా ఉన్నప్పటికీ వాడికి అనుకూలంగా తీర్పు తీర్చకూడదు. అలానే వాడు బీదవాడు కాబట్టి వాడు తన పక్షంగా మాట్లాడేవారికి ఎలాంటి బహుమతులనూ ఇచ్చుకోలేడు కాబట్టి, వాడి వ్యాజ్యం న్యాయంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగానూ తీర్పు తీర్చకూడదు. "వాని యెడల పక్షపాతముగా" ఉండకూడదు అన్నప్పుడు ఈ రెండు అర్థాలు ఇక్కడ వస్తాయి. మనం దీనిని మనసులో పెట్టుకుని, మన సమాజంలో బలహీనులుగా పరిగణించబడే వారి వ్యాజ్యంలో అన్యాయం ఉన్నప్పటికీ దానికి అనుకూలంగా (సానుభూతితో) ప్రవర్తించకూడదు. అలానే వారు బలహీనులు అనేసి వారి వ్యాజ్యంలో న్యాయం ఉన్నప్పటికీ దానికి ప్రతికూలంగానూ (వివక్షతో) ప్రవర్తించకూడదు. వ్యాజ్యమాడేవారు ఎవరైనా సరే న్యాయమే గెలవాలి. అన్యాయం ఖండించబడాలి.
లేవీయకాండము 19:15 న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
నిర్గమకాండము 23:4,5
నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
ఈ వచనాలలో శత్రువుల పశువుల విషయంలో కూడా కనికరంకలిగి నడుచుకోవాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఇక్కడ ఒకవిషయాన్ని గమనించండి, మొదటి మూడు వచనాలూ న్యాయానికి సంబంధించిన విషయాలు, అలానే క్రింది మూడు వచనాలూ కూడా న్యాయానికి సంబంధించిన విషయాలు. మధ్యలో ఈ రెండు వచనాలలో మాత్రం శత్రువుల పశువుల గురించి రాయబడింది. ఎందుకంటే; మన శత్రువుల పశువుల విషయంలోనే మనం కనికరం కలిగి నడుచుకోవాలి అన్నప్పుడు, ఆ శత్రువుల విషయంలో మరింత కనికరం కలిగి నడుచుకోవాలనే అర్థం వస్తుంది కదా! దానిని అనుసరిస్తూ ఆ శత్రువుల విషయంలో కూడా మనం "లేనివార్తను పుట్టించకూడదని, వారిపై అబద్ధ సాక్ష్యం పలకకూడదని, వారి వ్యాజ్యాన్ని అన్యాయంగా తృణీకరించకూడదని" నేర్పేందుకే ఈ రెండు వచనాలలో శత్రువుల గురించి ప్రస్తావించబడింది.
ఇక్కడ మరొక విషయం గమనించండి; శత్రువుయొక్క ఎద్దు ఐనా గాడిద ఐనా తప్పిపోతేనే వాటిని తమ యజమానుడికి అప్పగించాలని ఆజ్ఞాపించబడితే, నేటి సంఘంలో మన సహోదరులు తప్పిపోతున్నప్పుడు వారిపై ఎంతశ్రద్ధ చూపిస్తూ వారిని వాక్యానుసారమైన దారిలోకి నడిపించాలో కదా!
యాకోబు 5:19,20 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.
గలతియులకు 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.
అదేవిధంగా మత్తయి సువార్త 5:43 లో "నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా" అని పలికిన యేసుక్రీస్తు మాటలను కొందరు అపార్థం చేసుకుని, అక్కడ ఆయన మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడని, ధర్మశాస్త్రంలో "నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని" రాయబడిందని కొందరు పొరపడుతుంటారు. కానీ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా "నీ శత్రువును ద్వేషించమని" రాయబడలేదు. దానికి విరుద్ధంగా మనం చూసిన వచనాలలో శత్రువులపై కూడా కనికరం చూపించాలనే రాయబడింది. శత్రువుల పశువుల విషయంలోనే కనికరం కలిగి నడుచుకోవాలంటే, ఆ శత్రువుల విషయంలో మరింతకనికరం కలిగి నడుచుకోవాలనే భావం ఆ మాటల్లో ఉందని ఇప్పటికే జ్ఞాపకం చేసాను కదా! మరి యేసుక్రీస్తు ఆ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే; శాస్త్రులు పరిసయ్యుల గురించే అలా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి, యూదుల పూర్వీకులను దారితప్పించింది వారే (నిర్గమకాండము 21:24 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 23:6
దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు.
ఈ వచనంలో దరిద్రుని వ్యాజ్యానికి అన్యాయంగా తీర్పుతీర్చకూడదని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఎందుకంటే వాడు బీదవాడు కాబట్టి, వాడు న్యాయాధిపతులకు ఎలాంటి బహుమానాలూ ఇచ్చుకోలేడు కాబట్టి కొందరు వాడికి అన్యాయంగా తీర్పు తీరుస్తుంటారు. ఇంకొందరు చులకనభావంతో కూడా అలా చేస్తుంటారు. అందుకే అలా చెయ్యకూడదని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు.
లేవీయకాండము 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
ఈ నియమం బీదవాడి విషయంలోనే కాదు, బలహీనులైన అందరి విషయంలోనూ వర్తిస్తుంది. ఉదాహరణకు మన దేశంలో కూడా మైనారిటీ వర్గాలుగా పిలవబడే ప్రజలు కొందరు ఉన్నారు. వారికి చాలా విషయాలలో అన్యాయమే జరుగుతుంటుంది.
నిర్గమకాండము 23:7
అబద్ధమునకు దూరముగా నుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.
ఈ వచనంలో అబద్ధానికి దూరంగా ఉండాలని, నిరపరాధిని చంపకూడదని, దేవుదు దుష్టుడ్ని నిర్ధోషిగా ఎంచడని రాయబడడం మనం చూస్తాం.
అబద్ధానికి దూరంగా ఉండాలి అనంటే; అబద్ధాలు మాట్లాడకూడదని, అబద్ధసాక్ష్యాలు చెప్పకూడదని అర్థం. అబద్ధం అనేది అపవాది లక్షణం కాబట్టి (యోహాను 8:44), దానివల్ల ఇతరుల జీవితాలకు ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి, దేవునిపిల్లలు అబద్ధానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు అబద్ధసాక్ష్యాల కారణంగా నీతుమంతులకూ నిరపరాధులకూ మరణం సంభవిస్తుంది. అందుకే ఇక్కడ "నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు" అని రాయబడింది. అబద్ధసాక్ష్యం ద్వారా ఒక వ్యక్తి చంపబడేలా చెయ్యడం, ఆ వ్యక్తిని మనమే చంపడం రెండూ వేరుకాదు ఒకటే.
అదేవిధంగా "నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు" అని రాయబడిన వెంటనే "నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను" అని కూడా రాయబడింది. ఎందుకంటే; మన సాక్ష్యం ఎలాగైతే "నిరపరాధులనూ నీతిమంతులనూ" చంపేవిధంగా ఉండకూడదో, అలానే దుష్టులను శిక్షింపచేసేదిగా ఉండాలి. ఉదాహరణకు మనకళ్ళముందు ఒక హత్య జరిగిందనుకోండి, ఆ హత్య చేసినవాడు శిక్షించబడేలా తప్పకుండా మనం సాక్ష్యం చెప్పగలగాలి. లేకపోతే ఆ దుష్టుడు నిర్ధోషిగా తీర్పుపొందే అవకాశం ఉంది. దేవుడు దుష్టుడ్ని నిర్దోషిగా ఎంచడు కాబట్టి, మనం కూడా దోషులకు శిక్షలు పడేలా కృషిచేయాలి.
నిర్గమకాండము 23:8
లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.
ఈ వచనంలో లంచం తీసుకోకూడదని, లంచం గ్రుడ్డితనం కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుందని రాయబడడం మనం చూస్తాం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో దారుణాలకు కారణం ఈ లంచమే. ఈ లంచం కారణంగా ఎంతోమంది నీతిమంతుల మాటలు అపార్థం చేయబడి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. మరికొందరు జీవితాలకు తీరని నష్టం కలుగుతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లలో, కొన్నిసార్లు కోర్టులలో కూడా ఈ లంచం వల్ల ఎంతోమంది నీతిమంతులు దోషులుగా మారుతున్నారు, దోషులు నిర్ధోషులుగా చలామణి ఔతున్నారు. ఈవిధంగా ఈ లంచం వల్ల ఎంతోమంది అమాయకులు నష్టపోతున్నారు, న్యాయం పొందుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు లంచం గురించి ఇక్కడ ఇంత కఠినంగా రాయించాడు. ఆయా బాధ్యతల్లో (ఉద్యోగాల్లో) కొనసాగుతున్న విశ్వాసులు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీరు తీసుకునే లంచం వల్ల జరిగే నష్టం కొన్నిసార్లు మీకు కూడా తెలియకపోవచ్చు, కానీ ఈ వచనం ప్రకారం; లంచం అనేది తప్పకుండా ఎవరొకరికి నష్టం కలిగిస్తుంది. ఆ విషయంలో దేవుని ముందు దోషులుగా నిలబడేది మాత్రం మీరే.
నిర్గమకాండము 23:9
పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
ఈ వచనంలో పరదేశుల గురించి ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పరదేశులుగా అనుభవించిన యాతనను దేవుడు ఇక్కడ వారికి గుర్తు చేస్తూ ఈ మాటలను చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా మన మధ్య పరాయివారిగా నివసిస్తున్న వారి విషయంలో ఈ నియమాన్ని పాటించాలి. వేరే ఊరువాడనీ, వేరే రాష్ట్రం వాడనీ, వారిపై దౌర్జన్యానికి సిద్ధపడకూడదు. ఈమధ్యకాలంలో ఈ ప్రాంతీయ విద్వేషాలను మనం విపరీతంగా చూస్తున్నాం. కానీ దేవుడు దానిని సహించడు.
లేవీయకాండము 19:34 మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
అదేవిధంగా "ఎట్లుండునో మీరెరుగుదురు" అని ఆయన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో అనుభవించిన యాతనను గుర్తుచేసి దానిని బట్టి పరదేశులపై కనికరం చూపించమన్నప్పుడు, దీనిని మనం ఇతరుపట్ల ప్రవర్తించే అన్ని విషయాలలోనూ అన్వయించుకోవాలి. అంటే దీనర్థం; మనం ఎవరినైనా ఏవిధంగానైనా నొప్పించేముందు అదే పరిస్థితి మనకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని వారిపై కనికరం, ప్రేమ చూపించాలి.
మత్తయి 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.
నిర్గమకాండము 23:10,11
ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోబోతున్న కనాను దేశపు భూమిని ఆరు సంవత్సరాలు పంట పండించుకుని, ఏడవ సంవత్సరంలో దానిని బీడుగా విడిచిపెట్టాలని ఆయన ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ ఆజ్ఞ మనకు మొదటిగా, భూమిపై దేవుని అధికారాన్నీ, రెండవదిగా ఆ భూమి ఎప్పటికప్పుడు సారవంతంగా మారేలా దానికి విశ్రాంతి అవసరమనే దానినీ, మూడవదిగా బీదలపై, అడవిమృగాలపై దేవునికి ఉన్న కనికరాన్నీ తెలియచేస్తుంది. ఆ ఏడవ సంవత్సరంలో భూమిని విత్తన్నప్పటికీ, సహజంగా కొన్ని ఫలాలను/పంటను అది అందిస్తుంది. ఆ పంట/ఫలాలు దేశంలోని పేదవాళ్ళు అనుభవిస్తారు, తరువాత అడవి మృగాలు కూడా వాటిని తింటాయి. అలాగని భూమిని విత్తకుండా ఉన్న ఆ ఏడవ సంవత్సరంలో దేశంలో ఎటువంటి కరువూ తటస్థించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే; దేవుడు ఆరవ సంవత్సరం నాడు పండేపంటను మూడింతలుగా వారికి అనుగ్రహిస్తాడు.
లేవీయకాండము 25:20-22 ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో. అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు.
అదేవిధంగా ఏడవ సంవత్సరం భూమిని సాగుచెయ్యకుండా ఉండడం వల్ల, వ్యవసాయంపై ఆధారపడే వారందరికీ విశ్రాంతి లభిస్తుంది. అలాగని పనిచేసుకునేవారు పని లేక ఎటువంటి ఇబ్బందీపడనవసరం లేదు. ఎందుకంటే సాగుచెయ్యబడని పొలంలో సహజంగా పండేపంట బీదవారికే స్వంతం.
నిర్గమకాండము 23:12
ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.
ఈ వచనంలో విశ్రాంతి దినం గురించి మరలా జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. ఎందుకంటే పైన ప్రతీ ఆరుసంవత్సరాల తరువాత ఒక సంవత్సరం భూమికి విశ్రాంతిని ఇవ్వాలని ఆజ్ఞాపించబడింది కాబట్టి, ఎలాగూ ఆ సంవత్సరమంతా ప్రజలు విశ్రాంతిగా ఉంటారు కనుక ఒకవేళ వారపు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తారేమో అనే ఉద్దేశంతోనే ఇక్కడ మరలా వారపు విశ్రాంతిదినం గురించి జ్ఞాపకం చెయ్యబడింది. ఈ విశ్రాంతికి ఆ గృహంలోని వ్యక్తులు, పశువులు ఏవీ మినహాయింపు కాదు. అందరూ దానిని పాటించవలసిందే. దీనివల్ల ఆ గృహంలోని పనివారు, పశువులు ఎంతో విశ్రాంతిని అనుభవిస్తారు. ఇది నిజంగా దాసుల విషయంలో పశువుల విషయంలో చాలా కనికరం చూపించే ఆజ్ఞ, దీనివల్ల ఆరోగ్యానికి కూడా శ్రేయష్కరం.
నిర్గమకాండము 23:13
నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.
ఈ వచనాలలో దేవుడు మొదటిగా "నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. పతనస్వభావియైన మనిషి దేవునిమాటలకు తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు ఈ హెచ్చరికను చేస్తున్నాడు. ఎందుకంటే దేవునిమాటలు జాగ్రత్తగా వినకపోవడం వల్ల అది మనిషికే నష్టం. ఉదాహరణకు పై సందర్భంలో మనం "ఆరు సంవత్సరాలు భూమిని విత్తి ఏడవ సంవత్సరంలో దానికి విశ్రాంతినివ్వాలని" ఆయన ఆజ్ఞాపించడం మనం చూసాం. కానీ యూదులు (ఇశ్రాయేలీయులు) తరువాత కాలంలో ఆ ఆజ్ఞను పాటించలేదు. యూదులు బబులోను చెరలోకి పోవడానికి ఇది కూడా ఒక కారణం. వారు బబులోనులో ఉన్న 70 సంవత్సరాలూ ఆ భూమి అంతవరకూ అనుభవించవలసిన విశ్రాంతికాలాలను (సంవత్సరాలను) అనుభవించింది.
2దినవృత్తాంతములు 36:21 యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెర వేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.
ఇక "వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు" అనే మాటలకు మన దేవుని నామాన్ని ఎలాగైతే ఆరాధనా భావంతో, భయభక్తులతో ఉచ్చరిస్తామో, అదేవిధంగా వేరొకదేవుని పేరును ఉచ్చరించకూడదని అర్థం. అంతేతప్ప, అసలు అన్యదేవుళ్ళ పేరులే పలుకకూడదని కాదు. ఎందుకంటే ప్రవక్తలు కూడా అన్యదేవుళ్ళ పేర్లను ఉచ్చరించి ఇశ్రాయేలీయులకు బుద్ధిచెప్పిన ఎన్నో సందర్భాలను మనం లేఖనాలలో చూస్తుంటాం. కాబట్టి వేరొక దేవుని పేరును, వాడు దేవుడు అని ఒప్పుకునేవిధంగా కానీ, ఆరాధనా భావంతో కానీ, భయభక్తులతో కానీ ఉచ్చరించకూడదు. ఆ మహిమ కేవలం నిజదేవునికి మాత్రమే స్వంతం.
నిర్గమకాండము 23:14
సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు సంవత్సరానికి మూడు సార్లు పండుగ ఆచరించాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. అవేంటో క్రింది వచనంలో చూద్దాం. ఈ మూడు పండుగలూ ఇశ్రాయేలీయులు పాటించవలసిన ప్రాముఖ్యమైన పండుగలు. ఇవి దేవుడు ఇశ్రాయేలీయుల ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించినదానికి జ్ఞాపకంగా నియమించబడ్డాయి. ఈ కారణంగా ఇవి క్రైస్తవులకు సంబంధించినవి కావు. ఎందుకంటే ఈ పండుగల ఆధ్యాత్మిక ఉద్దేశమంతా క్రీస్తుకు ఛాయగా ఉండి ఆయనలో నెరవేరిపోయాయి.
కొలస్సీయులకు 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది
ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి; ఇక్కడ ఇశ్రాయేలీయులకు నాకు పండుగను ఆచరించమని స్వయంగా దేవుడే చెబుతున్నాడు. కానీ నూతననిబంధనలో ఎక్కడా కూడా మనకు ఈవిధంగా ఆజ్ఞాపించబడలేదు. ఆదివారం ఆరాధనలో రొట్టెద్రాక్షారసం ద్వారా క్రీస్తుయొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప మనకు ఎలాంటి పండుగా ఆజ్ఞాపించబడలేదు.
లూకా 22:19 పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.
కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవులు పాటిస్తున్న క్రిస్మస్, మట్లాదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ పండుగలేవీ దేవుడు ఆజ్ఞాపించినవి కావు. కేవలం మనుషులు కల్పించినవే. వాటిని వాక్యం ఖండిస్తుంది.
మార్కు 7:7 వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు.
ఒకవేళ మనం కూడా ఇటువంటి పండుగలను ఆచరించాలనేది దేవుని ఉద్దేశమైతే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టే మనకు కూడా వాటివిషయంలో ఆజ్ఞాపించేవాడు కదా!
నిర్గమకాండము 23:15
పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల పాటించవలసిన పండుగగా, పులియని రొట్టెల పండుగను మనం చూస్తాం. అబీబు/నీసాను నెలలో (మనకు మార్చి ఏప్రియల్ మధ్యలో) 14వ తారీఖున పస్కాపండుగ జరుగుతుంది.
నిర్గమకాండము 13:4 ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
నిర్గమకాండము 12:2 నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
లేవీయకాండము 23:5-7 మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
ఇది ఇశ్రాయేలీయుల పక్షంగా ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను దేవుడు వధించి, ఇశ్రాయేలీయులను అక్కడినుండి విడిపించినదానికి జ్ఞాపకంగా జరుగుతుంది (నిర్గమకాండము 12 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 12:7,8 ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను.
ఈ 14వ తేదీ సాయంత్రం నుండే (వారికి సాయంత్రం నుండీ వేరొక దినం లెక్క) అనగా పస్కాబలి ముగిసిన తరువాత, పులియని రొట్టెల పండుగ ప్రారంభమై అది ఏడురోజుల పాటు జరుగుతుంది. 14వ తారీఖు సాయంత్రం తొలిచూలు పిల్లలవధ తరువాత ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు కనీసం వారి పిండి పులిసేంతవరకూ కూడా ఐగుప్తులో నిలపకుండా, వెంటనే అక్కడినుండి పంపించివేసారు. దానికి జ్ఞాపకంగానే ఈ పులియని రొట్టెల పండుగ జరుగుతుంది (నిర్గమకాండము 12 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 12:39 వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
నిర్గమకాండము 34:18 మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
లేవీయకాండము 23:5-7 మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.
నిర్గమకాండము 13:3-7 మోషే ప్రజలతో నిట్లనెనుమీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు. ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. యెహోవానీ కిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్దకనబడ కూడదు. నీ ప్రాంతము లన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.
ఇది ఇశ్రాయేలీయులు పాటించవలసిన ఒక ప్రాముఖ్యమైన పండుగ (పస్కా/పులియని రొట్టెల పండుగ). అదేవిధంగా ఇక్కడ మనం "నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు" అనే మాటలను చూస్తాం. ఎందుకంటే అలా వట్టి చేతులతో కనబడకుండా ఉండడమనేది దేవుడు మనకిస్తున్న సమృద్ధిని ఆయనముందు ఒప్పుకోవడం ఔతుంది. ఆయనకు మనకు ఇస్తున్నదానిలో కొంత ఆయన సన్నిధికి కానుకగా తీసుకువస్తూ, ఆయన ఆశీర్వాదాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది నూతననిబంధన విశ్వాసులమైన మనకు కూడా వర్తిస్తుంది.
1కోరింథీయులకు 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
2కోరింథీయులకు 9:7 సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
నిర్గమకాండము 23:16
నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.
ఈ వచనంలో తొలిపంటయొక్క కొతపండుగ, సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగ అనబడే మరో రెండు పండుగల గురించి ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం.
ఈ తొలిపంటయొక్క కోతపండుగనే ప్రథమఫలముల పంట అని కూడా అంటారు. ఇది అబీబు నెలలో (మనకు మార్చి ఏప్రియల్ మధ్యలో) పులియని రొట్టెల పండుగ ప్రారంభమైన తరువాత రోజు, అనగా వారు పరిశుద్ధ సంఘంగా కూడుకున్న రోజుకు (విశ్రాంతి దినం) తరువాత రోజు జరుగుతుంది.
లేవీయకాండము 23:5-7 మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను "మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు".
లేవీయకాండము 23:10,11 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. "విశ్రాంతిదినమునకు మరుదినమున" యాజకుడు దానిని అల్లాడింపవలెను.
ఈరోజున ఇశ్రాయేలీయులంతా తమ పంటనుండి కొంతభాగాన్ని దేవునిసన్నిధికి తీసుకురావాలి. ఆ సమయంలో వారికి బార్లీ, గోధుమ పంట చేతికి వస్తుంది.
నిర్గమకాండము 34:26 నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను.
అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణం చొప్పున ఇశ్రాయేలీయులకు ఆయన కనాను భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడనడానికి జ్ఞాపకమే ఈ ప్రథమఫలముల పండుగ.
"పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను"
ఇది ఇశ్రాయేలీయులు పాటించవలసిన మరో పండుగ. దీనినే పర్ణశాలల పండుగ/గుడారాల పండుగ అని అంటారు. ఇది ఇశ్రాయేలీయులకు ఏడవనెలయైన తిష్రీ/ఎతనీ నెలలో (మనకు సెక్టెంబర్ అక్టోబర్ మధ్యలో) 15వ తేదీ నుండి, 22వ తేదీ వరకూ జరుగుతుంది.
లేవీయకాండము 23:34-39 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవదినము మొదలుకొని యేడు దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయ కూడదు. ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘ ముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కుబడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణదినమున ఆ అర్పణ మును తీసికొని రావలెను. అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.
ద్వితీయోపదేశకాండము 16:13-15 నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
ఇశ్రాయేలీయులను దేవుడు; ఐగుప్తునుండి బయటకు రప్పించినప్పుడు వారు గుడారాల్లో నివసించారు. దానికి జ్ఞాపకంగానే ఈ పండుగ జరుగుతుంది.
లేవీయకాండము 23:42 నేను ఐగుప్తుదేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
ఇవే ఇశ్రాయేలీయులను దేవుడు ఆచరించమన్నవాటిలో మూడు ప్రాముఖ్యమైన పండుగలు. నేను పైన తెలియచేసినట్టుగా ఇవన్నీ, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు రప్పించి వారిని కనాను దేశంలో ప్రవేశపెట్టినదానికి జ్ఞాపకంగా నియమించబడ్డాయి.
నిర్గమకాండము 23:17
సంవత్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
ఈ వచనంలో సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా దేవునిసన్నిధిలో కనబడాలని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. ఇక్కడ "పురుషులందరు" యెహోవా సన్నిధికి రావాలంటే, స్త్రీలు రాకూడదని కాదు కానీ పురుషులైనా తప్పకుండా రావాలని ఈ మాటల ఉద్దేశం. ఎందుకంటే గర్భిణీలుగా ఉన్న స్త్రీలు, రుతుస్రావంతో ఉన్న స్త్రీలు, బాలింతరాళ్ళుగా ఉన్న స్త్రీలు చాలా దూరం ప్రయాణం చేసి దేవుని సన్నిధికి వెళ్ళేపరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ పురుషులకోసమని కచ్చితంగా ఆ మాటలు చెప్పబడ్డాయి. ఒకవేళ స్త్రీలకు అలాంటి పరిస్థితి లేకపోతే వారు కూడా తమ పురుషులతో కలసి యెహోవా సన్నిధికి వెళ్ళాలి. ఈ వాక్యభాగాలు చూడండి.
ద్వితియోపదేశకాండము 12:7 మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన "మీ కుటుంబములును" మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటి యందు సంతోషింపవలెను.
ద్వితీయోపదేశకాండము 16:13,14 నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును "నీ కుమార్తెయును" నీ దాసుడును "నీ దాసియును" నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.
ఉదాహరణకు; హన్నా తన భర్తయైన ఎల్కానాతో కలసి యెహోవా సన్నిధికి వెళ్తుండడం మనం 1 సమూయేలు మొదటి అధ్యాయంలో చదువుతాం. యేసుక్రీస్తు తల్లియైన మరియ కూడా యోసేపుతో కలసి యెహోవా సన్నిధికి వెళ్ళడం మనం చదువుతాం (లూకా 2:41). కాబట్టి "పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను" అన్నప్పుడు, ఆ మాటలు స్త్రీలకు మినహాయింపుగా చెప్పబడినవి కావని (లింగ వివక్ష లేదని) మనం గమనించాలి.
ఇంతకూ పురుషులందరూ తప్పక హాజరు కావలసిన ఆ మూడు పండుగలు ఏంటంటే; మొదటిది పులియని రొట్టెలపండుగ. ఇది అబీబు/నీసాను నెలలో (మనకు మార్చి ఏప్రియల్ మధ్యలో) పస్కా రాత్రినుంచి మొదలౌతుంది. ఆ పండుగలోనే ప్రథమఫలాలను దేవునికి అర్పిస్తారు. రెండవది పెంతుకోస్తు లేదా వారముల పండుగ. ఇది పస్కా రోజునుండి ఏడువారాలు లెక్కించి 50వ రోజున సీవాను నెలలో (మనకు మే జూన్ మధ్యలో) చేసే పండుగ (ద్వితీయోపదేశకాండము 16:12). ఈరోజునే పరిశుద్ధాత్ముడు అపోస్తలులపైకి దిగివచ్చి ఆ పండుగ ఆచరించడానికి వచ్చిన యూదులకు అన్యబాషలలో సువార్తను ప్రకటింపచేసాడు (అపో.కార్యములు 2వ అధ్యాయం). మూడవది పర్ణశాలల పండుగ ఇది ఎతనీ (మనకు సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో) లో చేసే పండుగ. దీనిగురించి ఇప్పటికే నేను పైభాగంలో వివరించాను.
నిర్గమకాండము 23:18
నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింప కూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.
ఈ వచనంలో దేవునికి బలిగా అర్పించే వాటి రక్తాన్ని పులిసినవాటితో కలపి అర్పించకూడదని మనం చూస్తాం. దీనిగురింవి లేవీకాండము 2వ అధ్యాయంలో మరింత వివరంగా రాయబడింది. పులిసినపిండి పాపానికి ఛాయగా ఉంది కాబట్టి (1 కొరింథీ 5:7,8) ఆ పులిసినదానితో దేవునికి అర్పణం అర్పించకూడదు. క్రొవ్వు విషయంలో ఐతే దానిని నిలువ ఉంచకుండా బలిపీఠంపై కాల్చివేయాలి (నిర్గమకాండము 29:13,22, లేవీకాండము 1:8).
నిర్గమకాండము 23:19
నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
ఈ వచనంలో భూమియొక్క ప్రథమఫలంలో మొదటివాటిని యెహోవా సన్నిధికి తేవాలని, మేకపిల్లను దానితల్లి పాలతో ఉడకబెట్టకూడదని ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం. భూమియొక్క ప్రథమఫలాన్ని ఆయన సన్నిధికి తేవడం గురించి ఇప్పటికే నేను వివరించాను, పస్కా పండుగరోజు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే పులియనిరొట్టెల పండుగలో ఈ ప్రథమఫలపంటను దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఇక "మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు" అన్నప్పుడు, కనానీయుల సంస్కృతిలో కోత కోసేటప్పుడు మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టి, ఆ పులుసును తీసుకుని పంటపై వల్లే ఆచారం ఉండేదంట. అలా చేస్తే వారిపంట విస్తారంగా ఉంటుందని వారి నమ్మకం అంట. అందుకే దేవుడు వీరిని అలా చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే పంట సమృద్ధిగా పండడం అనేది, దేవునిఆశీర్వాదాన్ని బట్టి జరుగుతుంది తప్ప, అలాంటి మూఢనమ్మకాలను పాటించడం ద్వారా కాదు. పైగా అది చాలా క్రూరమైన ఆచారం. మేకపిల్లను తీసుకుని దాని తల్లిపాలను పితికి వాటితో దానిని ఉడకబెట్టడం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. అందుకే దేవుడు దానిగురించి ప్రత్యేకంగా ఆజ్ఞాపిస్తున్నాడు.
లేవీయకాండము 20:23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
లేవీయకాండము 18:3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
ఈవిధంగా దేవుడు క్రూరప్రవృత్తిని పెంపొందింపచేసే ప్రతీదానినీ నిషేధిస్తూ వచ్చాడు. దీనికి మరొక ఉదాహరణ;
ద్వితియోపదేశకాండము 22:6,27 గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగు నట్లును, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.
నిర్గమకాండము 23:20
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా ఒక దూతను పంపుతున్నానని ప్రకటించడం మనం చూస్తాం. ఆ దూత ఎవరో క్రింది వచనంలో వివరంగా చూద్దాం. ఐతే ఈ వచనంలో దేవుడు పలుకుతున్న మాటలను గమనించండి ఇక్కడ ఆయన "నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు" అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆయన ఒక చోటును సిద్ధపరిచాడు. అదే కనాను దేశం. కాబట్టి దేవుడు తన ప్రజలను తాను సిద్ధపరచిన విధంగా నడిపిస్తాడు తప్ప, వారు కోరుకున్న చోటుకు కాదు. ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మన జీవితంలో నెరవేరేది దేవుని సిద్ధపాటే తప్ప, మన వ్యక్తిగత సిద్ధపాట్లు కాదు.
నిర్గమకాండము 23:21,22
ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా పంపబోతున్న దూత గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీయులను హెచ్చరించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ దూత మరెవరో కాదు దేవుని నామం (యెహోవా) కలిగిన దూత. ఆయనే ఆదికాండము 16వ అధ్యాయం నుండీ యెహోవా దూతగా, యెహోవాగా, దేవుని దూతగా భక్తులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడు కాబట్టే "మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు" అని ఆయనకోసం ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ దూత మరెవరో కాదు త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. ఆయన దూతగా భక్తులకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి, లేఖనంలో ఆయన గురించి యెహోవా దూతయనీ, దేవుని దూతయనీ, దూతయనీ రాయబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేకు పొదలో కనిపించింది కూడా ఈయనే. ఆ విషయంలో మోషే తన మరణసమయంలో కూడా జ్ఞాపకం చేసుకుని యోసేపు సంతతిని దీవించాడు.
ద్వితియోపదేశకాండము 33:16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును "పొదలోనుండినవాని కటాక్షము" యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
అదేవిధంగా దేవుడు అక్కడ "అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును" అంటున్నాడు. ఇది షరతుతో కూడిన మాట. దేవుడు అబ్రహాముకు కనాను దేశంకోసం నిబంధన చేసినప్పుడు షరతులు లేని నిబంధన చేసాడు (ఆదికాండము 15వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి). కానీ ఇక్కడ ఆయన ఇశ్రాయేలీయులతో షరతుతో కూడిన నిబంధన చేస్తున్నాడు. వారు ఆయన పంపుతున్న దూత మాటలు జాగ్రత్తగా వింటేనే ఆయన వారి శత్రువులకు విరోధిగా ఉండి, కనాను దేశానికి వారిని చేరుస్తాడు. వారు అలా వినకపోతే మాత్రం చేర్చడు, నాశనం చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఆయన మాటను వినలేదు కాబట్టే ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన ఆ తరపు ప్రజల్లో కాలేబు, యెహోషువలు తప్ప మరెవరూ కనానులో ప్రవేశించలేకపోయారు.
సంఖ్యాకాండము 32:13 అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.
యెహోషువ 5:6 యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
అబ్రహాముతో చెయ్యబడిన షరతులు లేని నిబంధన ప్రకారం; ఆయన సంతానం కనానును స్వాధీనపరచుకుంటుంది (అలానే జరిగింది). కానీ ఐగుప్తునుండి బయలు దేరివచ్చిన ఇశ్రాయేలీయుల తరంతో దేవుడు షరతుతో కూడిన (ఆయన మాట జాగ్రత్తగా వినాలి) నిబంధన చేసాడు కాబట్టి, వారు ఆ షరతును మీరినప్పుడు (ఆయన మాటను విననప్పుడు) వారిని నశింపచేస్తాడు. ఇక్కడ దేవుడు రెండు విధాలుగానూ తన ప్రమాణాన్ని నెరవేర్చుకున్నాడు. అటు అబ్రాహాముతో చేసిన నిబంధన మేరకు అతని సంతానాన్ని కనానుకు చేర్చాడు, ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన తరం ముందు పెట్టిన షరతు ప్రకారం; వారు దానిని పాటించనప్పుడు వారిని నాశనమూ చేసాడు. కాలేబు యెహోషువలు తప్ప మరెవ్వరూ ఆ నాశనం నుండి తప్పించుకోలేకపోయారు (సంఖ్యాకాండము 26:65). దేవుడు తన కృపతో షరతులులేని నిబంధన చేసేవాడు మాత్రమే కాదు (సహించేవాడు మాత్రమే కాదు), పాపం విషయంలో న్యాయంగా తీర్పు తీర్చేవాడని కూడా దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
నిర్గమకాండము 23:23
ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీ యులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
ఈ వచనంలో దేవుడు పంపుతున్న దూత ఇతరజాతుల ప్రజలు నివసిస్తున్న కనాను దేశానికి వారిని చేరుస్తాడని, వారిని సంహరిస్తాడని రాయబడడం మనం చూస్తాం. దేవుడు పలికిన ఈమాటలకు నెరవేర్పుగానే ఆ దూత కనానీయులను సంహరింపచేసి, ఇశ్రాయేలీయులను కనానులో ప్రవేశపెట్టాడు. అందుకే ఆయన యెహోషువ మృతిచెందినప్పుడు, ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకోవలసిన కనాను భూమి ఇంకా మిగిలియున్నప్పుడు ఆయన ఇలా అంటున్నాడు.
న్యాయాధిపతులు 2:1 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.
అదేవిధంగా ఈ సందర్భంలో కనాను దేశంలో నివసిస్తున్న జాతుల పేర్లు ఆరు మాత్రమే రాయబడ్డాయి. మోషే కనానులో నివసిస్తున్నవారిలో వారు ప్రాముఖ్యమైన వారు కాబట్టి ఇక్కడ వారి పేర్లను మాత్రమే ప్రస్తావించాడు. వాస్తవానికి ఆ దేశంలో మొత్తంగా 10 జాతుల ప్రజలు నివసిస్తున్నారు.
ఆదికాండము 15:18-21 ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
నిర్గమకాండము 23:24
వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింప కూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ప్రవేశించబోతున్న కనానీయుల దేవతలను పూజించకూడదని, వారి క్రియలవంటి క్రియలు చెయ్యకుండా ఆ విగ్రహాలను ధ్వంసం చెయ్యాలని రాయబడడం మనం చూస్తాం. ఎందుకంటే వారు ఆ దేవతల పేరిట, ఆ దేవతల విగ్రహాల దగ్గర అత్యంత హేయమైన కార్యాలన్నీ జరిగించేవారు ముఖ్యంగా పసిపిల్లలను వాటికి బలులుగా ఇచ్చేవారు.
ద్వితియోపదేశకాండము 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమా రులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా.
దీనిగురించి మరింత వివరంగా, ఆర్కియాలజిస్టులు వెల్లడించిన ఆధారాలతో సహా తెలుసుకోవడానికి ఈ లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?
కొందరు మతోన్మాదులు; ఈ వచనాన్ని ఆధారం చేసుకుని బైబిల్ దేవుడు; కనానీయులు పూజించే దేవగా విగ్రహాలను ధ్వంసం చెయ్యమన్నాడని అదేదో దురాక్రమణకు సంబంధించిన విషయంగా విమర్శిస్తుంటారు. ఆయన అలా చెయ్యమనడానికి న్యాయమైన, సున్నితమైన కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను పైన ప్రస్తావించిన వ్యాసంలో వివరించాను.
నిర్గమకాండము 23:25
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.
ఈ వచనంలో దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలని, ఆయనే వారి ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడని రాయబడడం మనం చూస్తాం. ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే ఆహారాన్నీ (పంటనూ) పానాన్నీ (నీటివనరులను, ద్రాక్షలనూ) దీవించగలడు. ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే రోగాల భారినుండి ప్రజలను కాపాడగలడు. ఏ కల్పిత దేవుడూ ఇలా చెయ్యలేడు.
యిర్మియా 16:20 నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.
కీర్తనల గ్రంథము 115:3-9 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము.
నిర్గమకాండము 23:26
కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశము లోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను.
ఈ వచనంలో కడుపు దిగబడేదీ గొడ్డుదీ ఇశ్రాయేలీయుల దేశంలో ఉండదనీ ఆ ప్రజల లెక్క సంపూర్తి ఔతుందని అనగా వారు దీర్ఘాయుష్మంతులు ఔతారని రాయబడడం మనం చూస్తాం. కడుపు దిగబడేది అంటే గర్భస్రావం అని అర్థం. గొడ్డుది అంటే పిల్లలనుకనలేనిది అని అర్థం. ఈ మాటలు మనుషులకూ పశువులకూ ఇద్దరికీ వర్తించేలా చెప్పబడ్డాయి. అదేవిధంగా ఆ ప్రజలు అకాలమరణాల పాలవ్వకుండా దీర్ఘాయుష్మంతులు ఔతారు. కానీ ఇవన్నీ కూడా షరతులతో కూడిన వాగ్దానాలు. 22వ వచనం ప్రకారం; వారు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చెయ్యాలి. 25వ వచనం ప్రకారం; ఆయనను మాత్రమే సేవించాలి. ప్రజలు ఈవిధంగా చేసినప్పుడే ఈ వాగ్దానాలన్నీ వారిపట్ల ఆయన నెరవేరుస్తాడు. కానీ ఇశ్రాయేలీయుల చరిత్రలో వారు అలా చెయ్యలేకపోయారు కాబట్టి, ఆ వాగ్దానాలను వారు సంపూర్ణంగా అనుభవించలేకపోయారు. కాబట్టి మనం కూడా దేవుని వాగ్దానాలు మనపట్ల నెరవేర్చబడాలంటే, ముందుగా ఆయన చెప్పినదానిప్రకారం నడుచుకోవాలి.
లూకా 6:46 నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?
ఆమోసు 5:24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.
నిర్గమకాండము 23:27
నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడ గొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల కారణంగా కనాను దేశంలోనివారికి కలిగే భయం గురించీ, వారి పరాజయం గురించీ ప్రమాణం చెయ్యబడడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయుల భయం కనానుదేశపు వారికి కలిగింది, వీరితో యుద్ధం చేసినప్పుడు వారు పరాజయం పాలయ్యారు. ఈ చరిత్రనంతా మనం సంఖ్యాకాండంలోనూ యెహోషువా గ్రంథంలోనూ చదువుతాం.
ద్వితియోపదేశకాండము 1:3 హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహో నును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత-
యెహొషువ 2:8-11 ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
కానీ ఇది కూడా షరతులతో కూడా ప్రమాణం కాబట్టి ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులలో తదుపరి తరం వారు కూడా ఆయన దృష్టికి చెడునడతను నడిచినప్పుడు వారు కనాను దేశంలోని అందరినీ ఓడించలేకపోయారు. దావీదు కాలంలో మాత్రమే ఇది నెరవేరి, కనాను దేశం పూర్తిగా ఇశ్రాయేలీయుల వశంలోనికి వచ్చింది ఈవిధంగా అబ్రాహాముకు చేసిన షరతులు లేని నిబంధన అప్పుడు సంపూర్తిగా నెరవేరింది.
న్యాయాధిపతులు 2:1-5 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడవారు యెహోవాకు బలి అర్పించిరి.
నిర్గమకాండము 23:28
మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా, కందిరీగలను పంపుతున్నట్టు అవి కనాను దేశంలోని ప్రజలను వెళ్ళగొట్టబోతున్నట్టు రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ కందిరీగలు అంటే నిజంగా కందిరీగలు అని మనం అర్థం చేసుకోకూడదు, ఆయన ఆ ప్రజలపైకి పంపించే భయాన్ని ఇక్కడ కందిరీగలతో అలంకారంగా పోల్చడం జరిగింది.
యెహోషువ 24:12 మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను.
నిజానికి ఇశ్రాయేలీయులు కత్తులతో విల్లులతో యుద్ధం చేసే ఆమోరీయుల ఇద్దరు రాజులను (ఓగు సీహోను) జయించారు. కానీ దానికి కారణం దేవుడు ఆ రాజులపైకి (సైన్యం పైకి) భయాన్ని పంపించడమే. కాబట్టి ఇక్కడ కందిరీగలు అన్నప్పుడు భయాన్ని సూచిస్తున్నాయి.
నిర్గమకాండము 23:29,30
దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను. నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.
ఈ వచనంలో దేవుడు ఒక్కసంవత్సరంలోనే కనానీయులను ఆ దేశంనుండి వెళ్ళగొట్టకపోవడానికి కారణాన్ని తెలియచెయ్యడం మనం చూస్తాం. ఆయన తలచుకుంటే, ఒకే సంవత్సరంలోనే కాదు ఒక నిమిషంలో కూడా వారిని నిర్మూలం చెయ్యగలడు. కానీ ఇశ్రాయేలీయులు ఇంకా బాగా విస్తరించి, ఆ దేశమంతటినీ తమ వంతుల చొప్పున పంచుకునేలా (దేశం ఇంకా మిగిలిపోయి అడవి మృగాల పాలుకాకుండా) ఆయన వారిని క్రమక్రమంగా అక్కడినుండి వెళ్ళగొట్టాడు. సంఖ్యాకాండము, యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథాలను మనం చదివినప్పుడు ఈ విషయం మనకు బాగా అర్థమౌతుంది.
అదేవిధంగా ఇక్కడ దేవుడు ఒకేసారి కనానీయులను అక్కడినుంచి ఎందుకు వెళ్ళగొట్టడో కారణాన్ని తెలియచెయ్యడాన్ని బట్టి, ఆయన ఒకేసారి తన ప్రజల శత్రువులను నాశనం చెయ్యకపోవడానికి ఆ ప్రజలమేలుకై ఉద్దేశించిన ఏదోఒక కారణం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది సంఘానికి శత్రువులైన వారివిషయంలో కూడా వర్తిస్తుంది.
కీర్తనలు 37:13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
నిర్గమకాండము 23:31
మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోబోతున్న కనాను దేశపు సరిహద్దులు వివరించబడడం మనం చూస్తాం. దీని సరిహద్దులు; ఉత్తరాన లెబనోను దేశం నుండి, దక్షిణాన అరణ్యం వరకూ తూర్పున ఉన్న యూఫ్రటీషు నదినుండి పశ్చిమాన ఉన్న మధ్యధరా (ఫిలిష్తీయ) సముద్రం వరకూ వ్యాపించియున్నాయి.
ద్వితియోపదేశకాండము 11:24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
శాటిలైట్ బైబిల్ అట్లాస్ ప్రకారం; ఈ భూమి ఉత్తరం నుండి దక్షిణానికి 424 కిలోమీటర్లు, దాని వెడల్పు 114 కిలోమీటర్లు. అతి తక్కువ వెడల్పు ఉన్నచోట 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆ ప్రజలకు చాలా విశాలమైన దేశం. అయితే ఇశ్రాయేలీయుల చెడునడత వల్ల (న్యాయాధిపతులు 2:1-5) దావీదు కాలం వరకూ కూడా వారు ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోకపోయారు (2 సమూయేలు 5:6,7).
నిర్గమకాండము 23:32,33
నీవు వారితో నైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులకు కనాను దేశంలో నివసిస్తున్న ప్రజలతోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకోవద్దని, అలా చేసుకుంటే ఏమౌతుందో కూడా వివరించడం మనం చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల భయం వల్ల వాళ్ళు వీరితో నిబంధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. గిబియోనీయులు అలానే యెహోషువను మోసగించారు (యెహోషువ 9). కానీ వారితో నిబంధన చేసుకుంటే వారివల్ల వీరు పాపంలో పడే అవకాశం ఉంది కాబట్టి, వారి దేవతల పేరుతో హేయమైన కార్యాలు జరిగించి దేవుని దృష్టికి ఘోరపాపులుగా మారతారు కాబట్టి, దానివల్ల ఆయన ఉగ్రతకు లోనై నాశనం చేయబడతారు కాబట్టి ఆయన ముందుగానే ఈ హెచ్చరికను అంత స్పష్టంగా చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్రను మనం గమనించినప్పుడు ఇవన్నీ వారికి సంభవించాయి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 23

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"