పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

 గ్ర‌ంథపరిచయం; 9:1, 9:2,3, 9:4 , 9:5,6, 9:7, 9:8,9, 9:10, 9:11, 12, 9:13, 14, 9:15, 9:16, 9:17, 9:18, 19, 9:20, 21, 9:22-26, 9:27,28, 9:29, 9:30, 9:31, 32

నిర్గమకాండము 9:1 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరోయొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

ఈ వచనంలో దేవుడు మోషేతో ఫరోకు గతంలో చేస్తూ వచ్చిన హెచ్చరికనే మరలా చెయ్యమనడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఫరో తన హెచ్చరిక వినడని తెలిసినప్పటికీ దానివల్ల‌ ఐగుప్తు నాశనానికి గురౌతున్నప్పటికీ ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల విడుదల విషయంలో రాజీపడడం లేదు. వారికోసం ఐగుప్తును క్రయధనంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఇది ఆయనకు తన పిల్లలపట్ల ఉన్న ఆసక్తిని బోధిస్తుంది. అందుకే "యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను" (యెషయా 43: 3,4) అని రాయబడింది.

నిర్గమకాండము 9:2,3 నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.

ఈ వచనాలలో దేవుడు ఈసారి ఐగుప్తుపైకి రప్పించబోయే తెగులు ఏంటో వివరించడం మనం చూస్తాం. దీనివల్ల ఐగుప్తీయులు తమ అనుదిన జీవితంలో ఉపయోగించే‌ పశువులు/జంతువులను కోల్పోతారు. ఒకవిధంగా ఇది ఐగుప్తు దేశానికి తీవ్రమైన నష్టం. అయితే కొందరు ఈ సందర్భాన్ని ఉదహరిస్తూ తప్పు చేసింది ఫరో/ఐగుప్తీయులు ఐతే దేవుడు వారి పశువులను నాశనం చెయ్యడమేంటని ఆరోపణ చేస్తుంటారు. కానీ ఈ జంతువులన్నిటినీ ఆయన మనుషులకోసమే సృష్టించాడు కాబట్టి, మనిషే వాటిపై ఏలిక కాబట్టి (ఆదికాండము 1:26,28) ఆ మనిషి చేసే పాపాన్ని బట్టి వాటిని లయపరచి, దానివల్ల ఆ మనిషికి నష్టం కలిగించడం ఆయనకు న్యాయమే.

యిర్మియా 12:4 భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.

నిర్గమకాండము 9:4 అయితే యెహోవా ఇశ్రాయేలీ యుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను.

ఈ వచనంలో దేవుడు గత తెగులులో మినహాయించినట్టుగానే (నిర్గమకాండము 8:22) ఈ తెగులులో కూడా ఇశ్రాయేలీయుల పశువులను మినహాయించడం మనం చూస్తాం. సాధారణంగా జంతువులకు ఏదైనా తెగులు వచ్చినప్పుడు అది ఒకదాని నుండి మరోదానికి సులభంగా సంక్రమిస్తుంది. పైగా ఐగుప్తీయుల పశువులు, ఇశ్రాయేలీయుల పశువులు ఒకే నది నీళ్ళు కూడా తాగుతుంటాయి. కాబట్టి ఈ‌ తెగులు వాటికి కూడా సంక్రమించాలి. కానీ ఇక్కడ ఆయన అలాంటిది జరగకుండా ఇశ్రాయేలీయుల పశువులను ప్రత్యేకపరచి కాపాడుతున్నాడు. ఇది ఫరోకూ ఐగుప్తీయులకూ చివరికి ఇశ్రాయేలీయులకు కూడా ఊహించని అద్భుతంగా ఉంటుంది. లోకంలోనికి రాబోయే ఉగ్రతవిషయంలో కూడా దేవునిపిల్లలు ఇలానే కాపాడబడతారు (ప్రకటన 3:10). ఇప్పటికే అలాంటి విశేషమైన కాపుదలను మనం ఎన్నోసార్లు అనుభవయించియున్నాం.

నిర్గమకాండము 9:5,6 మరియు యెహోవా కాలము నిర్ణయించిరేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.

ఈ వచనాలలో దేవుడు ఫరోను హెచ్చరించినట్టుగానే ఆ తెగులును రప్పించి ఐగుప్తీయుల పశువులను నాశనం చెయ్యడం, ఇశ్రాయేలీయుల పశువులను కాపాడడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు "రేపు ఇది జరుగుతుందంటూ" కాలాన్ని నిర్ణయించడం ద్వారా ఫరోకు అది ఆయన చేసిన కార్యమే అని అర్థమయ్యేలా స్పష్టమైన రుజువును ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ "ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను" అంటే ఏ మినహాయింపూ లేకుండా అన్నీ చనిపోయాయని కాదు. ఎందుకంటే క్రిందివచనాలలో వడగండ్ల తెగులును బట్టి మరికొన్ని పశువులు చనిపోయినట్టు చూస్తున్నాం. ఈ కారణంగా ఆ తెగులులో నశించిపోకుండా చాలా పశువులను ఆయన‌ మినహాయించాడు. మరి ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయని అంత కచ్చితంగా ఎందుకు రాయబడిందంటే "ఏ మినహాయింపూ లేకుండా కాదు కానీ ఏ బేధమూ లేకుండా అన్నీ రకాల జంతువులూ చనిపోయాయని" వివరించడానికే అలా రాయబడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 3వ వచనంలో ఆయన ఏయే రకాల జంతువుల మీదికైతే ఆ తెగులును రప్పిస్తానని హెచ్చరించాడో (పొలములో నున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱెల మీదికిని వచ్చును) ఆ జాతుల్లో ఏ జాతీ తప్పించుకోకుండా ఆ తెగులు బారినపడ్డాయని అర్థం.

ఇక్కడ ఇశ్రాయేలీయుల పశువులు ఆ తెగులునుండి తప్పించుకోవడాన్ని బట్టి, మనం, మన కాపుదల విషయంలోనే కాదు, మన పశువులు క్షేమంగా ఉండడాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుండాలి.

కీర్తనలు 36:6 యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే.

ఐగుప్తీయుల పశువులు చనిపోయిన ఈ తెగులులో, వారి "ఎపిస్, హతర్" (apis and Hathor) అనే మరో ఇద్దరు దేవతలకు కూడా ఆయన తీర్పు తీర్చాడు. ఎందుకంటే ఐగుప్తీయులు ఎద్దు, గోవుల రూపం గల ఈ దేవతలను పూజించేవారు.

నిర్గమకాండము 9:7 ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపక పోయెను.

ఈ వచనంలో దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయుల పశువులు క్షేమంగా ఉన్నాయో లేక అవి కూడా నశించిపోయాయో అని ఫరో తెలుసుకోవడం, అయినా ఎప్పటిలానే తన హృదయాన్ని కఠినపరచుకోవడం మనం చూస్తాం. ఇక్కడ కఠిన హృదయులకు ఉండే మరో లక్షణాన్ని మనం గమనిస్తున్నాం‌. ఫరో అప్పటికే దేవుడు చెప్పినవాటిలో ఏ ఒక్కటీ తప్పిపోకుండా సంభవించడం కళ్ళారా చూసాడు. అయినప్పటికీ ఇక్కడ మరలా ఆయన చెప్పినట్టే జరిగిందా లేక, ఇశ్రాయేలీయుల పశువుల్లో కూడా ఏమైనా నశించాయా అనే అనుమానానికి లోనై ఆ విషయంలో నిర్థారణ చేసుకుంటున్నాడు. ఒకవేళ ఇశ్రాయేలీయుల పశువుల్లో కూడా ఏమైనా నశించినట్టు తెలిస్తే మోషే అహరోనులతో మీదేవుని మాట తప్పిపోయిందని వాదించే అవకాశం ఉంటుందని అతని ప్రణాళిక. పోని ఆ అవకాశం లేనప్పటికీ కూడా అతనేమీ రాజీపడడం లేదు ఇంకా కఠినంగానే వ్యవహరిస్తున్నాడు. ఈరోజు కొందరు బైబిల్ విమర్శకుల విషయంలో కూడా ఇలాంటి వైఖరినే మనం చూస్తాం, వారు బైబిల్ సత్యం కాదని రుజువు చెయ్యడానికి పడుతున్న ప్రయాసలో బైబిల్ గ్రంథం సత్యమే అని ఎన్నో ఆధారాలు లభ్యమౌతున్నప్పటికీ బైబిల్ పండితుల చేతుల్లో వారి ఆరోపణలన్నీ నిర్వీర్యం చెయ్యబడుతున్నప్పటికీ ఇంకా బైబిల్ లో లోపాలు వెదకాలని తాపత్రయపడుతున్నారు తప్ప, బైబిల్ సత్యమే అని ఒప్పుకోవడం లేదు.

నిర్గమకాండము 9:8,9 కాగా యెహోవా మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.

ఈ వచనాలలో దేవుడు ఆవం (బట్టీ) లోని బూడిద ద్వారా ఐగుప్తు ప్రజలపైకి, జంతువులపైకి మరో తెగులును రప్పించబోతున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల కోసం‌ ఇటుకలను కాల్చేవారు కాబట్టి, ఆ పనిలో వారిని ఐగుప్తీయులు ఎంతగానో కష్టపెట్టారు కాబట్టి, ఇక్కడ దేవుడు అదే ఇటుక ఆవపు బుగ్గి (ఇటుకలను కాల్చేటప్పుడు వచ్చే బూడిద) ద్వారా ఆ ఐగుప్తీయులపైకి తీర్పు రప్పించబోతున్నాడు. తన ప్రజలపక్షంగా దేవుని ప్రతీకారాన్ని‌ ఇక్కడ మనం గమనించాలి. కొన్నిసార్లు లోకం మనల్ని వేటి విషయంలోనైతే హింసిస్తుందో వాటి ద్వారానే ఆయన వారికి‌ బుద్ధిచెబుతాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు, మోషే అహరోనులు కేవలం తమ పిడికిళ్ళతో తీసుకుని ఆకాశం వైపు చల్లిన బూడిదను ఐగుప్తు దేశమందంటతా విస్తరింపచేసి అద్భుతం చేసాడు.

నిర్గమకాండము 9:10 కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.

ఈ వచనంలో మోషే అహరోనులు, ఇటుక ఆవపు బూడిదను ఆకాశం వైపు చల్లినప్పుడు దేవుడు ముందుగా చెప్పినట్టే అది ఐగుప్తు అంతటా విస్తరించి మనుష్యులకూ జంతువులకూ పొక్కులు, దద్దుర్లు (allergy) అవ్వడం మనం చూస్తాం. ఇదేమీ అంత సాధారణమైన తెగులు కాదు, అందుకే దేవుడు దీనిని ఇశ్రాయేలీయులకు హెచ్చరికగా కూడా ప్రస్తావించాడు.

ద్వితియోపదేశకాండము 28: 27 ​యెహోవా "ఐగుప్తు పుంటిచేతను" మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.

అదేవిధంగా దేవుడు ఈ తెగులు ద్వారా ఐగుప్తీయుల "తైఫాన్" (typhon) అనే దేవతకు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తీయులు ఈ దేవుణ్ణి తమకు దిష్టితగలకుండా (రోగాలు రాకుండా) కాపాడే దేవునిగా పూజించేవారు.

నిర్గమకాండము 9:11,12 ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.

ఈ వచనాలలో ఐగుప్తు శకునగాండ్రు కూడా ఆ తెగులు బారినపడినట్టు ప్రత్యేకంగా రాయబడడం, అది చూసి కూడా ఫరో మారుమనస్సు పొందకపోవడం మనం చూస్తాం. ఈ శకునగాండ్రకు సంభవించినదానిని బట్టి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.

1. వారు ఇంతకాలం ఏ సాతాను శక్తితోనైతే కొన్ని అద్భుతాలను చెయ్యగలిగారో చివరికి దేవుని శక్తితో కూడా పోటీ పడాలనుకున్నారో ఆ సాతాను వీరిని దేవుడు రప్పించిన తెగులునుండి కాపాడలేకపోయాడు. ఎందుకంటే సాతాను కూడా దేవుడు నియమించిన మేరకే తన శక్తిని ప్రదర్శించగలడని, దేవుని శక్తిని తనంతట తానుగా ఎదిరించే/ఆపగలిగే శక్తి వాడికి లేదని కప్పల తెగులు సందర్భంలో మనం వివరించుకున్నాం. కాబట్టి సాతానును ఆశ్రయించేవారి పరిస్థితి ఇలానే ఉంటుంది. పౌలును ఎదిరించిన ఎలుమ అనే అధిపతి విషయంలో కూడా మనం ఇదే గమనిస్తాం (అపో.కార్యములు 13:8-11). వారికి ప్రజలముందు సిగ్గు, దేవుని న్యాయస్థానంలో ఉగ్రత తప్ప చివరికి ఏమీ మిగలదు. ఈ శకునగాండ్ర పరిస్థితే చూడండి, ఆ తెగుల బారిన వారు కూడా పడడం వల్ల, ఇంతకాలం ఏ ఐగుప్తీయులైతే వారిని గొప్పగా భావించి గౌరవించారో ఆ ఐగుప్తీయులు ఇక వారి శక్తిని ఎంతమాత్రం లెక్క చెయ్యరు, గౌరవించరు. ఇది వారికి ఎంతో సిగ్గుకరం.

2. గతంలో ఈ శకునగాండ్రు దేవుని శక్తిని గుర్తించి ఆ విషయంలో ఫరోను కూడా హెచ్చరించారు (నిర్గమకాండము 8:19). వీరు దేవుని శక్తిని అంత స్పష్టంగా గుర్తించినప్పుడు, దేవునిప్రజలైన మోషే అహరోనులతో ఉండాలి కానీ అలా చెయ్యకుండా ఇంకా ఫరోతోనే ఉన్నారు. అందుకే ఆ తెగులు బారినపడ్డారు. కాబట్టి మనం దేవుణ్ణి నిజదేవునిగా శక్తిగల దేవునిగా గుర్తించినంత మాత్రాన సరిపోదు. దెయ్యాలు కూడా దేవుణ్ణి శక్తివంతునిగా ఏకైక దేవునిగా గుర్తించి వణుకుతున్నాయి (యాకోబు 2:19). ఆ మాటకు వస్తే దేవుని శక్తి ఎంత గొప్పదో సాతానుకు తెలియదా? కానీ ఆ దేవునికి లోబడకపోతే ఆయన ప్రజలకు విరుద్ధంగా దుష్టులతోనే కలసి సన్నహాలు చేస్తుంటే ఆ నమ్మిక వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పైగా ఆయనను శక్తిగల దేవునిగా గుర్తించి, ఆయనకు లోబడకపోవడం వల్ల, అది మరింత అవిధేయతగా పరిగణించబడి, మరింత తీర్పుకు‌ లోనయ్యేలా చేస్తుంది. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తకలిగి యుండాలి. దేవుని శక్తిని గుర్తించిన ప్రతీఒక్కరూ ఆయనకు లోబడడం అవశ్యం.

నిర్గమకాండము 9:13,14 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనుహెబ్రీ యుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను.

ఈ వచనాలలో దేవుడు తాను పంపబోయే మరో తెగులు గురించి ఫరోను హెచ్చరించమని మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన మాటలను బట్టి, ఇంతవరకూ సంభవించిన తెగుళ్ళ కంటే ఇది భయంకరంగా ఉంటుంది, దానివల్ల ఫరో యెహోవా దేవునిశక్తిని మరింతగా గుర్తిస్తాడు.

నిర్గమకాండము 9:15 భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.

ఈ వచనంలో దేవుడు తాను అనుకుంటే ఇప్పటికే నిన్నూ నీ ప్రజలనూ నాశనం చేసియుందునని ఫరోను హెచ్చరించడం మనం చూస్తాం. కానీ వారిపట్ల ఆయన ఉద్దేశం అది కాదు కాబట్టి, వారు ఇంకా సజీవులుగా ఉన్నారు, ఆ ఉద్దేశం ఏంటో క్రింది వచనంలో మనం చూస్తాం.

నిర్గమకాండము 9:16 నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.

ఈ వచనంలో దేవుడు ఇంతవరకూ ఫరోను నాశనం చెయ్యకుండా సజీవుడిగా ఎందుకు ఉంచాడో‌ వివరించడం మనం చూస్తాం. ఇది మనకు మానవుల పట్ల దేవుని ఉద్దేశాలను (నిర్ణయాన్ని) తెలియచేస్తుంది. ఆయన కొందరు దుష్టులను నాశనం చెయ్యకుండా సజీవులుగా ఉంచేది, వారి‌‌ మార్గాలలో వారిని వర్ధిల్లింపచేసేది వారి విషయంలో తన నిర్ణయాన్ని నెరవేర్చుకుని తనకు ఘనతను తెచ్చుకోవడానికే. ఈవిధంగా చెయ్యడం సృష్టికర్తయైన దేవునికి న్యాయమే. ఫరోను ఆయన తన బలాన్ని కనపరిచే పాత్రగా నిర్ణయించడాన్ని బట్టి అప్పటి చుట్టుప్రక్కల ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల దేవుని శక్తి ప్రకటించబడింది. ఉదాహరణకు ఈ వాక్యభాగాలు చూడండి.

నిర్గమకాండము 18: 10,11 మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.

యెహోషువ 2: 10 మీరు "ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో", యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.

ఈరోజు క్రైస్తవసంఘంలో దేవుని సార్వభౌమత్వాన్ని తృణీకరించే చాలామంది, మానవుల విషయంలో ఆయనకు ఎలాంటి ముందస్తు నిర్ణయమూ లేదని, ఆయన వారి విషయంలో చేసిన నిర్ణయమేదైనా ఉంటే అది వారి భవిష్యత్తులోకి తొంగిచూసి చేసిందే అని వాదిస్తుంటారు. కానీ ఫరో విషయంలో దేవుడు పలుకుతున్న "నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని" అనే మాటలను బట్టి, మానవులలో ఎవరు ఆయన కరుణాపాత్రలుగా ఉండాలో ఎవరు ఉగ్రత పాత్రలుగా ఉండాలో ఆయనముందే నిర్ణయించాడని స్పష్టంగా అర్థమౌతుంది. పౌలు కూడా ఈ మాటలను ఉదహరించి ఇదే సత్యాన్ని ప్రకటించాడు (రోమా 9:10-21). కాబట్టి ప్రతీ మానవుడి విషయంలోనూ దేవునికి ముందే ఒక నిర్ణయం ఉంది. అది వారి భవిష్యత్తును చూసి చేసింది కాదు కానీ ఆయన సంకల్పాన్ని బట్టే చేసింది.

ప్రసంగి 6: 10 ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను.

అలాంటప్పుడు మానవులు చేసే పాపానికి కూడా దేవుడే కర్తనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. కానీ ఆ ప్రశ్నకు ఇక్కడ ఎంతమాత్రం ఆస్కారం లేదు. ఉదాహరణకు ఫరోను తన బలాన్ని కనపరిచే ఉగ్రతపాత్రగా నియమించింది ఆయనే తన తీర్పులు మొత్తం ఐగుప్తుపైకి రప్పించడానికి అతని హృదయాన్ని కఠినపరచింది ఆయనే. కానీ అతను చేసిన పాపానికి దేవునికీ ఎలాంటి సంబంధమూ లేదు, అతను చేసిన పాపానికి అతనే బాధ్యుడు. ఎందుకంటే అలా చెయ్యడంలో అతనికంటూ ఒక ఉద్దేశం‌ ఉంది. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

నిర్గమకాండము 9:17 నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.

ఈ వచనంలో దేవుడు ఫరోయొక్క అతిశయం గురించి హెచ్చరించడం మనం చూస్తాం. దేవునిపిల్లలపై అతిశయపడడం దేవునిపై అతిశయపడడమే. అందుకే ఇక్కడ దేవుడు ఫరో యొక్క చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాడు.

నిర్గమకాండము 9:18,19 ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు ఐగుప్తుపైకి రాబోతున్న వడగండ్ల తీర్పు గురించి ఫరోకు ప్రకటించడం మనం చూస్తాం. సాధారణంగా ఐగుప్తులో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, అలాంటిది ఇప్పుడు వడగండ్ల వానే కురియబోతుంది కాబట్టి, ఇప్పటివరకూ ఐగుప్తీయులు అలాంటిది చూడలేదు. అయితే ఇక్కడ కూడా దేవుడు ఫరోకు తనవారిని రక్షించుకునే అవకాశం‌ ఇస్తున్నాడు. అందుకే నీకు కలిగినదంతా పొలంలోనుండి ఇంటిలోకి రప్పించమని హెచ్చరిస్తున్నాడు.

నిర్గమకాండము 9:20,21 ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.

ఈ వచనాలలో ఫరో సేవకులలో దేవునికి‌ భయపడినవారు చేసినదాని గురించీ భయపడనివారు చేసినదాని‌ గురించీ రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ భయపడినవారు అప్పటినుంచి దేవుణ్ణి‌ అనుసరించేవారిగా మారిపోయారని కాదు కానీ అప్పటికే వారు యెహోవా దేవుని తీర్పులు రుచిచూసారు కాబట్టి ఈ తెగులు విషయంలో జాగ్రత్తపడుతున్నారు. ఇక భయపడనివారు ఫరోలానే తమ హృదయాలు కఠినమైనవారు. ఇక్కడ మనం యెహోవాకు భయపడని/ఆయన మాటలను లక్ష్యపెట్టనివారిలో ఉండే మూర్ఖత్వాన్ని గమనిస్తాం. వారు అప్పటికే దేవుని తీర్పులు రుచిచూసినప్పటికీ కనీసం ఒక్కరోజు కూడా తమ పశువులనూ పనివారినీ పొలంలో ఉండనివ్వకుండా భద్రం చేసుకోలేకపోయారు. ఫలితంగా వారే నష్టపోయారు. ఎందుకంటే వీరి దుష్టమనస్సు దేవునిమాటను ఎలా ఎదిరించాలా అని ప్రేరేపిస్తుందే తప్ప, దానివల్ల కలుగుతున్న నష్టం గురించి హెచ్చరించలేదు.

నిర్గమకాండము 9:22-26 యెహోవానీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను. మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యుల నేమి జంతువుల నేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.

ఈ వచనాలలో దేవుడు ముందే హెచ్చరించిట్టు మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు, వడగండ్లు పిడుగులు కురిసి ఐగుప్తుదేశానికి తీవ్రమైన నష్టం‌ కలుగచెయ్యడం, గత రెండు‌ తెగుళ్ళ మాదిరిగానే ఇశ్రాయేలీయులకు మాత్రం‌ ఇందులో మినహాయింపు లభించడం మనం చూస్తాం. అయితే 31,32 వచనాల ప్రకారం ఈ వడగండ్ల, పిడుగుల వర్షంలో గోధుమపంట (wheat) మరియు మెరపమొలకలు (rie) ఇంకా ఎదగకపోవడాన్ని బట్టి మినహాయించబడడం మనం చూస్తాం.

ఇక ఈ వడగండ్ల, పిడుగుల వర్షం ఐగుప్తీయుల "షు" (sh) అనే దేవునిపై యెహోవా దేవుని తీర్పును సూచిస్తుంది. ఎందుకంటే ఐగుప్తీయులు‌ ఇతడిని వాతావరణ దేవునిగా పూజించేవారు. కానీ ఇక్కడ దేవుడు ఆ వాతావరణం తన ఆధీనంలో ఉందని ప్రకటిస్తూ వారికి తీవ్రమైన నష్టం కలిగించాడు.

నిర్గమకాండము 9:27,28 ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము; ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా-

ఈ వచనాలలో ఫరో మోషే అహరోనులను పిలిపించి, గతంలో కంటే ఇంకోమెట్టు దిగి తన పాపం గురించీ యెహోవా దేవుని న్యాయం గురించీ ఒప్పుకోవడం, ఆ వడగండ్ల వర్షాన్ని నిలిపివేసేలా ప్రార్థించమని వేడుకోవడం మనం చూస్తాం. ఇక్కడ ఫరో పలుకుతున్న మాటలు; ఈ వడగండ్ల‌ వర్షం 14వ వచనంలో దేవుడు చెప్పినవిధంగానే అతని మనస్సును నొచ్చుకునేలా (భయపడేలా) చేసిందని రుజువు చేస్తున్నాయి. ఆ భయంలోనే అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా పశ్చాత్తాపంతో కాదు.

నిర్గమకాండము 9:29 మోషే అతని చూచినేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.

ఈ వచనంలో ఫరో వేడుకోలుకు మోషే ప్రత్యుత్తరం మనం చూస్తాం. ఇక్కడ మోషే ఫరో దగ్గర ఉన్న చోటినుండే దేవుణ్ణి వేడుకుంటాను అనడం లేదు, ఆ పట్టణంలో నుండి బయటకు వెళ్ళి ఆ పని చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆ వడగండ్లు అతనికి ఎలాంటి హానీ చెయ్యవు కాబట్టి, అది కూడా ఫరోకు ఒక అద్భుతంగా ఉంటుంది. అందుకే మోషే "అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును" అంటూ నొక్కి చెబుతున్నాడు.

నిర్గమకాండము 9:30 అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.

ఈ వచనంలో మోషే ఫరో మరియు అతని సేవకుల‌ కఠిన హృదయం గురించి నిర్మొహమాటంగా ప్రకటించడం‌ మనం‌ చూస్తాం. ఎందుకంటే దేవుడు అప్పటికే అతనికి ఫరో హృదయం ఎంతవరకూ కఠినమౌతుందో వివరించాడు (తొలిచూలు పిల్లల వధ వరకూ). ఈ కారణంగా అతను దేవుడు చెప్పినదానిని నమ్ముతూ ఈ మాటలు పలుకుతున్నాడు. అయినప్పటికీ మోషే ఇక్కడ ఫరో అభ్యర్థనను అంగీకరిస్తూ ఆ వడగండ్లకోసం ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవాలి. అవతలివారు ఎలాంటివారైనా సరే మనల్ని ప్రార్థనా సహాయం వేడుకున్నప్పుడు "లేఖనాల పరిధిలో" వారికోసం ప్రార్థించడం మన బాధ్యత (1 సమూయేలు 12:23). అయితే నేనిక్కడ ప్రస్తావించినట్టుగా ఆ ప్రార్థన లేఖనాల పరిధిలో మాత్రమే ఉండాలి. ఇక్కడ మోషే కూడా అదే చేస్తున్నాడు. దేవుడు ముందే అతనికి ఐగుప్తీయుల తొలిచూలు పిల్లల వధ వరకూ తెగుళ్ళను రప్పిస్తానని చెప్పాడు. ఆ చివరి తెగులు వరకూ కొనసాగాలంటే అప్పటివరకూ వచ్చినవన్నీ వాటి ప్రభావం చూపించగానే తొలగిపోవాలి. అలా ప్రస్తుతం ఈ వడగండ్ల వర్షం కూడా తొలగిపోవాలి కాబట్టే మోషే ఫరో అభ్యర్థనను అంగీకరించి దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. అతను దేవునిమాటలను దృష్టిలో‌ ఉంచుకునే వాటికి వ్యతిరేకంగా కాకుండా అలా చేస్తున్నాడు. మనం కూడా ఇతరులు ప్రార్థనా సహాయం కోరినప్పుడు వారికోసం తప్పకుండా చెయ్యాలి కానీ ఒకవేళ వారు ప్రార్థన చెయ్యమంటుంది లేఖన విరుద్ధమైన వాటికోసమైతే ఎట్టిపరిస్థితుల్లోనూ దేవునిముందుకు వాటిని తీసుకునివెళ్ళకూడదు.

నిర్గమకాండము 9:31,32 అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.

ఈ వచనాలలో వడగండ్ల వర్షం‌ వల్ల ఏయే పంటలు నాశనమయ్యాయో ఏయే పంటలు‌ మినహాయించబడ్డాయో రాయబడడం మనం చూస్తాం. అయితే మనుషులనూ పశువులనూ చంపేంత విస్తీర్ణంలో వడగండ్లు పడుతున్నప్పుడు ఎదిగిన చేలు మాత్రమే కాదు, భూమిలో పాతిపెట్టిన విత్తనాలు/నారుమళ్ళు కూడా నాశనమైపోతాయి. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం, ఐగుప్తీయులకు చేతికి వచ్చిన పంటను నాశనం చెయ్యడం మాత్రమే కాబట్టి ఇంకా ఎదగని (నారుమళ్ళుగా ఉన్న) గోధుమచేలు, మెరపచేలలో వడగండ్లను కురిపించలేదు. అందుకే వాటికి ఎలాంటి నష్టం కలుగలేదు. ఈ మినహాయింపు కూడా తర్వాత తీర్పు అమలవ్వడానికే (నిర్గమకాండము 10:4,5).

కాబట్టి దేవుడు కొన్నిసార్లు దుష్టులకు కలుగుతున్న నష్టంలో మినహాయింపులు కల్పించేది, కేవలం వారు మారుమనస్సు పొందుతారని మాత్రమే కాదు, ఆ మార్పు కలగకపోతే ఆ మిగిలినవాటిపై మరో తీర్పు కుమ్మరించే ఆవకాశంగా కూడా అలా చేస్తాడు.

నిర్గమకాండము 9:33-35 మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయ ములను కఠినపరచుకొనిరి. యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.

ఈ వచనాలలో మోషే ఫరోకు ఇచ్చిన మాటచొప్పున దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ వడగండ్ల వర్షం ఆగిపోవడం, అయినప్పటికీ ఫరో మరియు అతని సేవకులు తమ హృదయాలను కఠినపరచుకుని పాపం‌ చెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఫరో చేస్తున్నదానిని బట్టి, యధార్థంగా మారుమనస్సు పొంది తమ‌ పాపాలను ఒప్పుకునేవారికీ కేవలం దేవుని శిక్షకు భయపడి తమ పాపాలు ఒప్పుకునేవారికీ మధ్య ఉండే బేధాన్ని మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత మారుమనస్సు పొంది తన పాపాలను ఒప్పుకున్న విశ్వాసి గతంలో వలే పాపంలో కొనసాగడు. అందుకే "దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు" (1 యోహాను 3: 9) అని రాయబడింది. కానీ దేవుని శిక్షను బట్టి కలిగిన భయంలో దానినుండి తప్పించుకోవడానికి పాపాలను ఒప్పుకున్నవాడు మాత్రం, ఉపశమనం కలగగానే అదే పాపంలో జీవిస్తాడు, ఫరో ఇక్కడ అదే చేస్తున్నాడు. వడగండ్ల వానకు భయపడి మోషే అహరోనులను పిలిపించి "నేను పాపం చేసియున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులూ దుర్మార్గులము" అని ఒప్పుకున్నవాడు. ఆ తెగులు నుంచి ఉపశమనం రాగానే మరలా అదే పాపం చేస్తున్నాడు. ఈరోజు తమకు కలిగిన ఇబ్బందులలో ప్రభువును నమ్ముకుని, తమ పాపాలను ఒప్పుకుని, మరలా అవే పాపాలలో "నిశ్చింతగా" కొనసాగేవారంతా ఈ ఫరో వంటివారే.

1 యోహాను 3: 8,10 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును.

అయితే ఈ సందర్భంలో ఫరో మరియు అతని సేవకులు చేస్తున్న పాపం ఏంటంటే దేవుని మాటకు విరుద్ధంగా ఇశ్రాయేలీయులను‌ నిర్భంధించడమే. కాబట్టి దేవుని మాటలను పాటించకపోవడమే లేక వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపం.

1 యోహాను 3: 4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.