విషయసూచిక:- 34:1, 34:2, 34:3 , 34:4,5, 34:6,7 , 34:8 ,34:9 , 34:10 , 34:11 , 34:12 , 34:13 , 34:14 , 34:15 , 34:16 , 34:17 , 34:18 , 34:19,20 ,34:21 ,34:22,23 ,34:24 ,34:25 ,34:26 ,34:27 ,34:28 ,34:29 ,34:30 ,34:31-33 ,34:34,35 .
నిర్గమకాండము 34:1
మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.
ఈ వచనంలో దేవుడు మోషే పగలగొట్టిన పది ఆజ్ఞల పలకల వంటి పలకలను మరలా చెక్కుకురమ్మనడం, వాటిపై ఆయన ఆ ఆజ్ఞలను మరలా రాస్తాను అనడం మనం చూస్తాం. గతంలో ఐతే ఆ పలకలను కూడా దేవుడే ఇచ్చాడు (నిర్గమకాండము 32:16). ఇప్పుడైతే మోషేనే ఆ పలకలను చెక్కుకురమ్మంటున్నాడు. కానీ రాయడమైతే మాత్రం అప్పుడూ ఇప్పుడూ దేవుడే రాసాడు (ద్వితీయోపదేశకాండము 10:1-4). ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గమనించాలి.
1. దేవుడేమీ మోషే ఆ పలకలను తన చేతితో పగలగొట్టాడు కాబట్టి దానికి శిక్షగా ఆ పలకలను నువ్వే తయారుచేసుకునిరా అనట్లేదు. ఎందుకంటే మోషే ఆ పలకలను పగలగొట్టి పొరపాటు చేసినట్టుగా లేఖనాల్లో ఎక్కడా రాయబడలేదు. అందుకే ఈ వచనంలో కూడా నువ్వు ఆ పలకలను పగలగొట్టావు కాబట్టి వాటిని చెక్కుకురా అని కాకుండా, నువ్వు పగలగొట్టిన పలకలవంటి పలకలు చెక్కుకురా అని చెప్పబడుతుంది. ఎందుకిలా అంటే గతంలో మోషేకు ఆ పలకలు పది ఆజ్ఞలూ పట్టేలా ఎంత పరిమాణంలో ఉండాలో తెలియదు. అందుకే దేవుడే వాటిని చేసిచ్చాడు. ఇప్పుడైతే మోషేకు వాటి పరిమాణం గురించి తెలిసింది కాబట్టి నువ్వే వాటిని చెక్కుకునిరా అంటున్నాడు (బహుశా).
2. దేవుడు ఇప్పుడు తన ప్రజలతో సమాధానపడ్డాడు. దానికి గుర్తుగా మళ్ళీ తన ఆజ్ఞలను వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవునికీ మనిషికీ మధ్యలో కలిగిన సమాధానానికి లేక నిబంధనకు ఆయన ఆజ్ఞలే గుర్తులుగా ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడితో సమాధానపడిన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండేలా ఆ ఆజ్ఞలే ప్రధానపాత్రను పోషిస్తాయి. ఈరోజు కొంతమంది నూతననిబంధన విశ్వాసులకు ఎలాంటి ఆజ్ఞలూ లేవు వారు స్వతంత్రులు అన్నట్టుగా మభ్యపెడుతుంటారు. అదే నిజమైతే లేఖనాల్లో బోధించబడిన ఆజ్ఞలన్నీ ఎందునిమిత్తం, ఎవరినిమిత్తం ఉన్నట్టు? మనముందు ఆయన ఆజ్ఞలు లేవంటే మనకూ ఆయనకూ ఏ సంబంధం లేదని అర్థం. మనకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యం ఎప్పుడూ కూడా ఆ ఆజ్ఞలపరిథిలోనే ఉంటుంది.
యోహాను 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును.
3. గతంలో మోషే పగలగొట్టిన పలకలపై రాయబడినవీ, ఇప్పుడు రాయబడుతున్నవి ఒకే పది ఆజ్ఞలు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు "నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను". ఆయన మొదట ఈ పది ఆజ్ఞలనూ ప్రజలందరూ వినేలా పలికాడు (నిర్గమకాండము 20:1-19). మోషే సీనాయి పర్వతంపైన వాటితో పాటుగా 21వ అధ్యాయం నుండి, 23వ అధ్యాయం వరకూ బయలుపరచబడిన మరికొన్ని విధులను కూడా గ్రంథస్థం చేసి ప్రజలకు వినిపించాడు (నిర్గమకాండము 24:7). తరువాత ఆయన 40 రోజులపాటు మోషే తన సన్నిధిలో ఉన్నప్పుడు గతంలో పలికిన పది ఆజ్ఞలనూ పలకలపై రాసి అతనికి ఇచ్చాడు (నిర్గమకాండము 31:18). అవి మందసంలో ఉంచబడాలి కాబట్టి, మోషే ఆ ఆజ్ఞలను అప్పటికే గ్రంథస్థం చేసినప్పటికీ ఆయన వాటిని పలకలపై రాసిచ్చాడు. ఇప్పుడు కూడా మందసంలో ఉంచబడడానికే ఆయన పలకలపై ఆ పది ఆజ్ఞలనూ రాయబోతున్నాడు (ద్వితీయోపదేశకాండము 10:1-5). కాబట్టి గతంలో మోషే పగలగొట్టిన పలకలపై రాయబడిన పది ఆజ్ఞలూ ఇప్పుడు రాయబడుతున్న పది ఆజ్ఞలూ ఒకటే. వీటి గురించి నిర్గమకాండము 20వ అధ్యాయంలో వివరించడం జరిగింది (నిర్గమకాండము 20 వ్యాఖ్యానం చూడండి).
4. ఆజ్ఞలు దేవునివే అయినప్పటికీ వాటిని బయలుపరచడానికి ఆయన మానవసాధనాలను వాడుకుంటున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు పది ఆజ్ఞలనూ దేవుడే రాయబోతున్నాడు. కానీ అవి రాయబడడానికి అవసరమైన పలకలను మోషేను చెక్కుకురమ్మంటున్నాడు. అలానే మోషే ఆయన ఆజ్ఞలన్నిటినీ గ్రంథస్థం చేసాడు, మిగిలిన ప్రవక్తలు కూడా అలానే చేసారు. కాబట్టి మనుషుల చేత రాయబడినంత మాత్రాన అవి దేవుని ఆజ్ఞలు కాకుండాపోవు. ఆయన మానవ సాధనాలనే వాడుకుని తన ఆజ్ఞలను బయలుపరుస్తూ వచ్చాడు.
నిర్గమకాండము 34:2
ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
ఈ వచనంలో దేవుడు మోషేకు పలకలపై పది ఆజ్ఞలను రాయడానికీ మరియు అతను గత అధ్యాయంలో కోరుకున్నట్టుగా తన మహిమను చూపించడానికీ మరుసటి ఉదయం సీనాయి పర్వతంపై ఆయన సన్నిధిని నిలిచియుండమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఆయన మోషేను రెండు పలకలనూ చెక్కుకుని ఉదయానికల్లా ఆయన సన్నిధిలో ఉండమంటున్నాడు. అంటే ఈరోజు ఉదయమో మధ్యాహ్నమో లేక సాయంత్రమో ఆయన మోషేతో మాట్లాడుతుంటే మరుసటి ఉదయానికల్లా ఆ పలకలతో సహా అతను ఆ పర్వతంపైకి చేరుకోవాలి. మోషే ఆ పర్వతంపైకి ఎక్కడానికి చాలా సమయమే పడుతుంది, అది పెద్ద పర్వతం. ఈవిధంగా ఆలోచించినప్పుడు మోషే ఆ పలకలను చాలా తొందరతొందరగా తయారుచెయ్యాలి. అంత తొందరగా వాటిని తయారుచేసినప్పుడు అవేమీ అందంగా కానీ అలంకారంగా కానీ రూపుదిద్దుకోవు. అంటే ఇశ్రాయేలీయుల దృష్టిలో ఆ పలకలకు ఉన్నటువంటి విశేషమైన విలువ అవి అందంగా చెక్కబడడాన్ని బట్టి కాదు కానీ వాటిపై రాయబడిన ఆజ్ఞలను బట్టే కలిగింది. అవి మోషే చేత తయారుచెయ్యబడినప్పటికీ ఆ ఆజ్ఞలే వాటిపై రాయబడకపోతే కనీసం అవి అందంగా తయారుచెయ్యబడిన పలకల విలువను కూడా పొందుకోలేవు. కాబట్టి దేవుని ప్రజలమధ్యలో మన విలువ కూడా మన అందంపైనో, ఆస్తిపైనో లేక మరేదో సామర్థ్యాన్ని బట్టో ఆధారపడియుండదు. ఒకవేళ వాటిని బట్టి మనకెవరైనా విలువనిస్తుంటే వారు దేవుని ప్రజలే కాదని అర్థం (యాకోబు 2:1-9). ఎందుకంటే దేవుని ప్రజలమధ్యలో మన విలువ మన హృదయమనే పలకపై రాయయబడిన దేవుని ఆజ్ఞలపైనే ఆధారపడియుంటుంది. ఎందుకంటే అవి మనజీవితంలో పరిశుద్ధత అనబడే పరిమళాన్ని వెదజల్లింపచేసి ఇతరుల జీవితాలకు కూడా ఆనందకారకంగా ఉంటాయి. అందుకే కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు.
కీర్తనలు 119:74 నీ వాక్యము మీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతోషింతురు.
నిర్గమకాండము 34:3
ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.
ఈ వచనంలో దేవుడు మోషే తప్ప ఆ పర్వతంపైకి నరుడు కానీ జంతువు కానీ ప్రవేశించకూడదని కఠినంగా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గతంలో అహరోనుతో పాటు ఇశ్రాయేలీయుల పెద్దలు 70మంది కూడా ఆ పర్వతంపైకి వెళ్ళి దేవుని మహిమను చూసారు (నిర్గమకాండము 24:9,10). తరువాత యెహోషువ కూడా ఆ పర్వతంపై మోషేతో పాటుగా 40రోజులు ఉన్నాడు (నిర్గమకాండము 24:13). కానీ ఇప్పుడు దేవుడు కేవలం మోషేను మాత్రమే ఆ కొండపైకి రమ్మంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మోషే మధ్యవర్తిత్వం కారణంగానే ఆ ప్రజలను అంగీకరించడం లేక వారితో సమాధానపడడం జరుగుతుంది, దానికి గుర్తుగానే ఆయన ఇలా ఆజ్ఞాపించాడు. మోషే కనుక విజ్ఞాపన చెయ్యకుంటే ఆ ప్రజలను ఆయన బంగారుదూడ విషయంలో నాశనం చేసియుండేవాడు కదా!. అదేవిధంగా దేవుని సన్నిధి నిలిచే ఆ పర్వతపు పరిశుద్ధతను నొక్కిచెప్పడానికి "ఆ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదనే" హెచ్చరిక చెయ్యబడింది. గతంలో కూడా ఆయన ఇలా ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 19:13).
నిర్గమకాండము 34:4,5
కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
ఈ వచనాల్లో మోషే దేవుడు చెప్పినట్టుగానే ఆ పర్వతంపైకి చేరుకోవడం అప్పుడు ఆయన దిగివచ్చి "యెహోవా అనే తన నామాన్ని ప్రకటించడం మనం చూస్తాం". లేఖనాలలో యెహోవా అనే నామాన్ని మనం చదువుతున్నప్పుడు లేక ఆ పేరుతో ఆయనను సంబోధిస్తున్నప్పుడు అది ఆయన గుణలక్షణాలకు సంబంధించిన నామంగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మనవలే సాధారణమైన నామాలు (పేర్లు) ఉండవు, ఆయన గుణలక్షణాలే ఆయన నామం. అందుకే ఆయన గతంలో ఇదే మోషేకు "ఉన్నవాడను మరియు మాట ఇచ్చి నెరవేర్చువాడను" అనే భావంలో ఈ యెహోవా అనే తన నామాన్ని ప్రకటించాడు (నిర్గమకాండము 3:13,14, 6:2,3 వ్యాఖ్యానం చూడండి). ఇప్పుడు ఆ నామంలోని మరికొన్ని గుణలక్షణాలను కూడా అతనికి ప్రకటించబోతున్నాడు. క్రిందివచనాల్లో వాటినే మనం చదువుతాం. ఇదంతా ఎందుకంటే, గత అధ్యాయంలో మోషే ఆయన మహిమను చూడాలి అనుకున్నాడు, నిజానికి ఆయన గుణలక్షణాలే ఆయనకు మహిమగా ఉన్నాయి. కాబట్టి ఆయన మోషేకు ఇచ్చిన మాటప్రకారం ఆ మహిమకరమైన గుణలక్షణాలను మోషే అర్థం చేసుకోగలిగినంత పరిథిలో అతనికి ప్రకటిస్తున్నాడు.
నిర్గమకాండము 34:6,7
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
ఈ వచనాల్లో దేవుడు యెహోవా అనబడే ఆయన నామం యొక్క గుణలక్షణాలను మోషేకు ప్రకటించడం మనం చూస్తాం. ఆయన గత అధ్యాయంలో చెప్పినట్టుగానే మోషే బండపై నిలబడినప్పుడు చేతులతో అతన్ని కప్పి, అతన్ని దాటివెళ్తుండగా ఈ గుణలక్షణాలను ప్రకటించాడు లేదా ఆయన మహిమను చూపించాడు (నిర్గమకాండము 33:21:24). ఇప్పుడు ఈ గుణలక్షణాలను క్లుప్తంగా విశ్లేషిద్దాం.
కనికరము: ఆయన గుణలక్షణాలలో "యెహోవా" అనగా ఉన్నవాడు (నిత్యుడు, అనంతుడు, సర్వశక్తిమంతుడు) తరువాత కనికరం గలవాడు అనేది రెండవది. ఈ కనికరం ఆయన గుణలక్షణం కాబట్టి, అది ఎవరితోనూ పని లేకుండా, ఆయన చిత్తాన్ని బట్టి లేక ఎన్నికను బట్టి చూపించబడుతుంది. అందుకే ఆయన "ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును" (రోమీయులకు 9:15) అంటున్నాడు. లేఖనాల్లో ఆయన ఎంతోమందిని కరుణించాడు. ఎంతోమందిని కరుణించకుండా ఉన్నాడు కూడా. ఎందుకంటే కరుణ అనేది పూర్తిగా ఆయన చిత్తానుసారమైన ఎన్నికకు సంబంధించింది. దానిని ఎవరూ తమ ప్రవర్తనను బట్టి పొందుకోలేరు.
దయ: ఈ దయ కూడా ఆయన కరుణవంటిదే. భక్తులందరూ ఆ దయను బట్టే ఆయనతో సహవాసం చెయ్యగలిగారు, ఆ దయను బట్టే వారి పాపాల శిక్షనుండి తప్పించబడ్డారు.
దీర్ఘశాంతము: ఆయన తొందరపడి కోపగించేవాడు కాదు. తొందరపడి తీర్పుతీర్చే వాడు కూడా కాదు. అలా కనిపించే సందర్భాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దానివెనుక అప్పటివరకూ ఆయన కనపరచిన దీర్ఘశాంతం ఎంత గొప్పదో అర్థమౌతుంది. అయితే ఈ దీర్ఘశాంతానికి ఆయన చిత్తానుసారమైన పరిధి ఉంటుంది (ఆదికాండము 6:3, లూకా 13:6-9). ఎందుకంటే ఆయన గుణలక్షణాలలో ఏదీ మరో దానిని ధిక్కరించేదిగా ఉండదు. కాబట్టి ఈ దీర్ఘశాంతం ఆయన న్యాయాన్ని ధిక్కరించేవిధంగా నిరంతరం సహించదు కానీ "దీర్ఘ" అనగా ఎక్కువగా అని అర్థం కాబట్టి అది ఎక్కువగా మాత్రం ఉంటుంది. అందుకే ఆయన ఈవిధంగా అంటున్నాడు.
కీర్తనలు 50:21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను.
విస్తారమైన కృపాసత్యములు: కృపా సత్యములు ఆయనలో విస్తారంగా ఉంటాయి. కృప అనగా ఏ మనిషీ దానికి యోగ్యుడు కానప్పటికీ అతనిపట్ల ఆయన ఉచితంగా కనుపరిచేది అని అర్థం. నోవహు దగ్గరనుండి నేటి మనవరకూ అంతకుముందున్న వారిపై కూడా ఆయన చూపించింది ఇదే. ఈ కృపను బట్టి మాత్రమే ఆయన వారిని లేక మనల్ని తన సహవాసంలోకి అనుమతించాడు లేక రక్షించాడు (ఎఫెసీ 2:5,8). ఇహపరమైన దీవెనలను సమృద్ధిగా కురిపించాడు. ఇక సత్యములు అనగా, సమస్త సత్యానికీ లేక మంచికీ మూలం ఆయనే. ఆయన ఎవరినీ మోసగించడు, ఎవరికీ అన్యాయం చెయ్యడు, ఎవరితోనూ అబద్ధం చెప్పడు. అందుకే లేఖనంలో ఆయన సత్యవంతుడని, అబద్దమాడనేరని దేవుడని, అన్యాయం చెయ్యనివాడని ఎన్నో సందర్భాల్లో వర్ణించబడ్డాడు. ఆ సత్యవంతుడు అనుగ్రహించింది కాబట్టే మనం చదువుతున్న వాక్యం కూడా సత్యంగా ఉంది. ఎందుకంటే సత్యవంతుడు సత్యాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు.
దేవుడైన యెహోవా: మన తెలుగులో దేవుడు అని తర్జుమా చెయ్యబడిన హీబ్రూ పదం "ఏల్" దానికి శక్తిమంతుడు అని అర్థం. లేఖనంలో ఆయన సర్వశక్తిమంతుడిగా ప్రకటించబడ్డాడు, తన భక్తులకు అలానే ప్రత్యక్షమయ్యాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టే ఈ విశ్వాన్ని కేవలం మాటద్వారా సృష్టించగలిగాడు.
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు: ఇది తన భక్తుల విషయంలో ఆయన చూపించే కృప. ఆయనను నమ్ముకున్నవారిపై ఆయన ఇది నిరంతరం చూపిస్తూనే ఉంటాడు. వారిని విడిచిపెట్టడు.
దోషమును అపరాధమును పాపమును క్షమించును: ఆయన క్షమించే దేవుడు. ఈ గుణాన్ని బట్టే ఆజ్ఞాతిక్రమానికి పాల్పడిన ఆదాము నుండి మనవరకూ ఆయన చేత క్షమించబడుతున్నాము. ఆయన సన్నిధిలో కొనసాగగలుగుతున్నాము. లేదంటే మానవజాతి ఆదాముతోనే అంతమైపోయేది. అయితే ఈ క్షమాపణ ఆయన న్యాయానికి వ్యతిరేకంగా ఉండదు. అందుకే ఆయన మనిషి తన క్షమాపణను పొందుకోవడానికి అవసరమైన ప్రత్యమ్నాయాన్ని కూడా ఆయనే ప్రవేశపెట్టాడు. అదే పాపాన్ని ఒప్పుకుని మారుమనస్సు పొందడం.
ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక: ఆయన క్షమించే దేవుడే అయినప్పటికీ దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు. అనగా పాపాలను ఒప్పుకున్నవారిని ఆయన క్షమిస్తాడు, వారిని ఆయన కృపను బట్టి నిర్దోషులుగా తీర్పు తీరుస్తాడు. కానీ పాపంలోనే కొనసాగే దోషులు ఎప్పటికీ ఆయన న్యాయం దృష్టిలో దోషులే. ఆయన న్యాయం పరిశుద్ధత వారిని ఎప్పటికీ నిర్దోషులుగా అంగీకరించదు. వారు దోషులుగా చావవలసిందే.
మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును: దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 20:5,6 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:8
అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి-
ఈ వచనంలో మోషే తాను కోరుకున్నట్టుగానే దేవుని మహిమను చూసి ఆయనకు మహిమగా ఉన్న గుణలక్షణాలను అర్థం చేసుకోగానే ఆయనకు తలవంచి నమస్కారం చెయ్యడం మనం చూస్తాం. హెబ్రీయుల సంస్కృతిలో తలవంచి నమస్కారం చెయ్యడమంటే, ఆరాధించడం, కృతజ్ఞతలు చెల్లించడం, విధేయత చూపించడం అనే భావాలు వస్తాయి. ఆయన మహిమను చూసిన మోషే ఇప్పుడు అదే చేస్తున్నాడు. అనగా ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనను ఆరాధిస్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. దేవునిగుణలక్షణాలు అర్థం చేసుకున్న ఎవరైనా ఇలా చెయ్యకుండా ఉండలేరు, మనం ఆయనను ఆరాధించడానికీ కృతజ్ఞతలు చెల్లించడానికీ విధేయత చూపించడానికీ ఆయన గుణలక్షణాలే కారణం. అందుకే దావీదు "యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి" (కీర్తనలు 30:4) అంటున్నాడు. ఇలాంటి ఆరాధన, ఇలాంటి కృతజ్ఞత, ఇలాంటి విధేయత మనలో లేదంటే మనకు ఆయన గుణలక్షణాలు అర్థంకాలేదని భావం. ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే, ఆయన లేఖనాలను ఆ ప్రేమతో ధ్యానించినప్పుడు మాత్రమే అవి మనకు అర్థమౌతాయి.
నిర్గమకాండము 34:9
ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుమనెను.
ఈ వచనంలో మోషే తాను కోరుకున్నట్టుగానే దేవుడు తనకు ఆయన మహిమను చూపించిన తరువాత ప్రజలతో పాటు రావలసిందిగా ఆయనను వేడుకోవడం మనం చూస్తాం. దేవుడు మోషే విజ్ఞాపనను ఎప్పటికప్పుడు అంగీకరించి, దానికి రుజువుగా అతను కోరిన మహిమను కనుపరచినప్పటికీ ఇంకా మోషే తనలో ఉన్న సందేహాన్ని బట్టి ఇలా వేడుకుంటున్నాడు. అలాగని అతను దేవునిమాటపై సందేహపడడం లేదు కానీ ఆయన పరిశుద్ధతను బట్టి భయపడుతున్నాడు. ఎందుకంటే ప్రజల పాపం పరిశుద్ధుడైన ఆయన సహించలేనిదని అతనికి బాగా తెలుసు. ఇకపోతే ఇక్కడ మోషే విజ్ఞాపనను మనం గమనిస్తే, దేవుడు గతంలో ఆ ప్రజలపై ఏ ఆరోపణ చేసైతే "లోబడనొల్లని ప్రజలు" వారితో పాటుగా నేను రాను అన్నాడో (నిర్గమకాండము 33:3-5), మోషే దానినే ఒప్పుకుంటూ "వీరు లోబడనొల్లని ప్రజలు", కాబట్టి నువ్వు వచ్చి తీరాలి అంటున్నాడు. అంటే "వీరు లోబడనొల్లని ప్రజలు" కనుక మానవమాత్రుడనైన నేను వీరిని సహించలేను, కానీ నువ్వు ఇప్పుడు నాకు నేను కనికరంగల దేవుణ్ణి, క్షమించేదేవుణ్ణి అని ప్రకటించుకున్నావు కాబట్టి నువ్వు మాత్రమే వారిని క్షమించి నడిపించగలవు అంటున్నాడు "మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుమనెను". ఇక్కడ మోషే దేవుడు తనగురించి ఏదైతే ప్రకటించుకున్నాడో "యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును" దానినే ఎత్తిపట్టుకుంటూ ప్రజలపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఆయన ప్రకటించిన గుణలక్షణాలను బట్టే ఆయనను ప్రార్థించాలి. అదేవిధంగా మోషే చేస్తున్న మధ్యవర్తిత్వపు పరిచర్యయొక్క శ్రేష్టతను మనమిక్కడ గమనిస్తాం. అతను తన ప్రజలతో తన దేవుని సన్నిధి నిలవాలని ఎంతగానో తపనపడుతున్నాడు. అందుకే ఈ మోషే మధ్యవర్తిత్వపు పరిచర్య సాక్ష్యాత్తూ యేసుక్రీస్తు ప్రభువుయొక్క మధ్యవర్తిత్వానికి సాదృష్యంగా ఎంచబడింది.
అంతేకాకుండా మోషే ఇక్కడ "మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుము" అంటూ తన దోషాన్ని పాపాన్ని కూడా దేవునిముందు ఒప్పుకుంటున్నాడు. అతను దేవునిపట్ల ఇప్పటివరకూ ఎలాంటి తిరుగుబాటూ చెయ్యనప్పటికీ వ్యక్తిగతంగా తనలో కూడా కొన్నిలోపాలు ఉండే అవకాశం ఉంది. అందుకే అతను వాటినికూడా ఒప్పుకుంటున్నాడు. ఈవిధంగా మోషే నిజాయితీని ఇక్కడ మరోసారి మనం గమనిస్తాం. కాబట్టి మనం మనవారి పక్షంగా దేవుణ్ణి వేడుకునేటప్పుడు మన పాపాలను కూడా ఒప్పుకునేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన పాపాలను నిజాయితీగా ఒప్పుకోవడం కంటే మనపాపాల విషయంలో మనం చెయ్యగలిగింది ఏమీలేదు.
నిర్గమకాండము 34:10
అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడువమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది.
ఈ వచనంలో దేవుడు మోషే విజ్ఞాపనకు సమ్మతించి ప్రజలతో తన సన్నిధి ఉంటుందనడానికి గుర్తుగా వారిమధ్య ఆయన జరిగించబోయే అద్భుతాల గురించి తెలియచెయ్యడం మనం చూస్తాం. తరువాత చరిత్రలో మనం ఆయన చెప్పినట్టుగానే యోర్దాను నదిని పాయలుగా చెయ్యడం, సూర్యచంద్రులను ఆపివెయ్యడం, శత్రువులపై అసాధ్యమైన విజయాన్ని ప్రసాదించడం వంటి అద్భుతకార్యాలను గమనిస్తాం. "నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది" అన్నట్టుగానే చుట్టుప్రక్కల రాజ్యాలవారు ఇశ్రాయేలీయులను బట్టి తీవ్రభయానికి లోనయ్యారు. రాహాబు అనబడే వేశ్య ఇశ్రాయేలీయుల గూఢచారులకు సహాయం చేసింది ఇందుకే (యెహోషువ 2:9), మోయాబీయుల రాజు బిలాము చేత ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రయత్నించింది కూడా ఇందుకే (సంఖ్యాకాండము 22:3). అదేవిధంగా "నేను నీయెడల చేయబోవునది భయంకరమైనది" అనేమాట ఈ అధ్యాయపు చివరిలో మోషే ముఖం ప్రకాశించడాన్ని కూడా ఉద్దేశించి చెప్పబడిందని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు.
నిర్గమకాండము 34:11
నేడు నేను నీ కాజ్ఞాపించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీ యులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్లగొట్టెదను.
ఈ వచనంలో దేవుడు ప్రజలు తన ఆజ్ఞలను అనుసరించి నడవాలని హెచ్చరిస్తూ వారి యెదుటనుండి ఆయన వెళ్ళగొట్టబోతున్న ప్రాముఖ్యమైన జాతులగురించి తెలియచెయ్యడం మనం చూస్తాం. "నీ యెదుటనుండి" లేక "నీ" అన్నప్పుడు ఆయన మోషేను ప్రజలపక్షంగా గుర్తించి చేస్తున్న ఏకవచన సంబోధన. అంటే ఇప్పుడు నీ అన్నప్పుడు ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పబడుతుంది.
నిర్గమకాండము 34:12
నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులు ప్రవేశించబోతున్న కనాను దేశపు ప్రజలతో నిబంధన చేసుకోవద్దని, అలా చేసుకుంటే అది వారికి ఉరి ఔతుందని హెచ్చరించడం మనం చూస్తాం. మోషే చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు ఈ విషయంలో విఫలమైనట్టు మనం చూస్తాం. అందుకే ఆయన ఇలా అంటున్నాడు.
న్యాయాధిపతులు 2:1-3 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
అదేవిధంగా ఇక్కడ ఈమాటలు పలుకుతుంది యెహోవా దేవుడైతే న్యాయాధిపతుల నుండి మనం చూసిన వాక్యభాగంలో ఈ మాటలను యెహోవా దూత పలుకుతున్నట్టుగా రాయబడింది. 33వ అధ్యాయం లో నేను వివరించినట్టుగా ప్రస్తుతం మోషేతో మాట్లాడుతుందీ, ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులను విడిపించిందీ యెహోవా నామం కలిగిన యెహోవా దూతనే.
నిర్గమకాండము 34:13
కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
ఈ వచనంలో దేవుడు కనానీయులు పూజిస్తున్న దేవతల విగ్రహాలను వాటి బలిపీఠాలనూ ధ్వంసం చెయ్యమనడం మనం చూస్తాం. కొందరు ఈమాటలను ఆధారం చేసుకుని బైబిల్ దేవుడు ఇతరదేశాలపై దురాక్రమణ చేయించి వారి సంస్కృతులను నాశనం చేయించాడని వాపోతుంటారు పాపం. కానీ కనానీయులు తమ దేవతా ప్రతిమలకు పసిపిల్లలను బలులుగా అర్పించేవారు, పురాతత్వ శాస్త్రజ్ఞులు ఆ ప్రదేశాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న "దేవతా స్తంభముల" క్రింద వాటికి సంబంధించిన ఆధారాలు (పసిపిల్లల ఎముకలు) విస్తారంగా లభ్యమయ్యాయి. అందుకే ఆయన ఈవిధంగా వాటిని ధ్వంసం చెయ్యమన్నాడు.
ద్వితియోపదేశకాండము 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమా రులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా.
దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?
నిర్గమకాండము 34:14 ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా ఆయన రోషముగల దేవుడు.
ఈ వచనంలో దేవుడు వేరొక దేవునికి నమస్కారం చెయ్యవద్దని ఆయనరోషం గల దేవుడినని హెచ్చరించడం మనం చూస్తాం. ఎందుకంటే యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అనే వాస్తవం కాసేపు ప్రక్కన పెట్టినప్పటికీ, ఇశ్రాయేలీయుల గురించి పితరులకు వాగ్దానం చేసిందీ, వారిని ఇనుపకొలిమి లాంటి ఐగుప్తునుండి విడిపించిందీ, అరణ్యంలో వారిని అద్భుతరీతిగా పోషిస్తుందీ నడిపిస్తుందీ, కాపాడుతుందీ, చివరికి వారి తిరుగుబాటును సహిస్తుందీ యెహోవా మాత్రమే. అందుకే ఆయన తనకు తప్ప వేరొక దేవునికి నమస్కారం చెయ్యవద్దు అంటున్నాడు. ఇది చాలా న్యాయబద్ధమైన ఆజ్ఞ.
ద్వితీయోపదేశకాండము 32:10-12 అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.
అదేవిధంగా ఆయన రోషము గల దేవుడు అన్నప్పుడు ఒక భర్తకు భార్యపట్ల ఉండే రోషాన్ని లేక ఒక తండ్రికి తన పిల్లలకు ఉండే రోషాన్ని సూచిస్తుంది. తాను సృష్టించిన, కాపాడుతున్న, నడిపిస్తున్న, పోషిస్తున్న దేవునికి తన పట్ల రోషం ఉండడం న్యాయమే. ఆ రోషం లేకపోతే ఆయన తన ప్రజలపట్ల బాధ్యతకలిగిన దేవుడు అవ్వడు. ఉదాహరణకు ఏ తండ్రైనా తన పిల్లలు ఎవర్ని తండ్రి అని పిలిచినా, ఎవరితో పోయినా నాకేం బాధలేదంటే, ఏ భర్తైనా నా భార్య ఎవరితో వ్యభిచరించినా నాకు నష్టం లేదంటే వారిని మనం బాధ్యతకలిగిన తండ్రి, భర్తలుగా గుర్తిస్తామా? దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 20:5 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:15
ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
ఈ వచనంలో దేవుడు కనాను ప్రాంతంలోని ప్రజలు తమ దేవతలకు బలిగా అర్పించిన విందుకు వీరిని పిలిచినప్పుడు దానిని తినవద్దని హెచ్చరించడం మనం చూస్తాం. భూమిలోని సమస్తం దేవుడు సృష్టించినవే అయినప్పటికీ అన్యజనులు తాము దేవునికి విరుద్ధంగా నెలకొల్పిన విగ్రహాలకు కొన్ని పశువులను ప్రత్యేకించి బలి అర్పిస్తారు. ఆ విగ్రహాల్లో ఏమీ లేనప్పటికీ అవి దెయ్యం (సాతాను) ప్రేరణతో నెలకొల్పబడినవి. అందుకే పౌలు ఆ బలులను దెయ్యాలకు అర్పించబడేవని ప్రస్తావించాడు (1 కొరింథీ 10:20). ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని పక్షంగా ఆయనకు ప్రత్యేకమైన జనంగా ఉండాలంటే, వారు దేవునికి విరుద్ధంగా జరుగుతున్న ఆ అపవిత్రమైన విగ్రహారాధన వీరికి కూడా అపవిత్రమైనదని సూచించేలా వాటికి బలిగా అర్పించబడినవి తినకుండా ఉండాలి. ఉదాహరణకు మన తండ్రికి ఎవరైనా శత్రువు ఉంటే, మన తండ్రి అతన్ని శత్రువుగా భావించడానికి న్యాయబద్ధమైన కారణం ఉంటే, మనం అతనితో సన్నిహితంగా ఉండగలమా? లేదుకదా, అతను మనకు కూడా శత్రువుగా పరిగణించబడతాడు. విగ్రహాలు వాటి అర్పితాలు కూడా అలాంటివే. కానీ బిలాము వేసిన పన్నాగం వల్ల ఇశ్రాయేలీయులు ఈ విషయంలో దోషులై ఆయన ఆగ్రహానికి గురైనట్టు మనం చదువుతాం.
సంఖ్యాకాండము 25:2,3 ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
నూతననిబంధన విశ్వాసులమైన మనం కూడా ఈ నియమాన్ని పాటించాలి. 1కొరింథీ 10 లో పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాడు.
1 కొరింథీయులకు 10:19-29 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా? అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
దీనిప్రకారం; అన్యజనులు పూజించే దేవుళ్ళలో కానీ వారు అర్పించే బలుల్లో కానీ ఏ శక్తీలేదు. అయినప్పటికీ అక్కడ జరుగుతుంది దైవవిరుద్ధమైన దెయ్యాలప్రేరణతో నెలకొల్పబడిన అసహ్యకార్యం కాబట్టి, వాటిని దేవునిపక్షంగా మనం వ్యతిరేకిస్తున్నాం అనడానికి గుర్తుగా విగ్రహార్పితాలను తినకూడదు. అయితే అది బలి అర్పితం అని మనకు తెలియనప్పుడు కానీ, దుకాణాల్లో అమ్మబడుతున్నప్పుడు కానీ నిర్భయంగా తినవచ్చు. ప్రస్తుతం కొందరు మిడిమిడి జ్ఞానంతో ఈ అవగాహనను ప్రక్కన పెట్టి విగ్రహార్పితాలను తినవచ్చని బహిరంగంగా బోధిస్తున్నారు. వీరిగురించి ప్రభువు ఏమంటున్నాడో చూడండి.
ప్రకటన గ్రంథం 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
ప్రకటన గ్రంథం 2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
కాబట్టి విగ్రహార్పితాలు తినవచ్చు అనేది బిలాము బోధ మరియు యెజెబేలు బోధ. ఇది ప్రభువుకు రోషము పుట్టించే కార్యం "మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?" ఈ నియమం మాంసం విషయంలోనే కాదు, ప్రసాదాల విషయంలో కూడా వర్తిస్తుంది.
నిర్గమకాండము 34:16
మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.
ఈ వచనంలో దేవుడు విగ్రహారాధికులను పెళ్ళిచేసుకోవద్దని, దానివల్ల వీరు కూడా విగ్రహారాధికులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించడం మనం చూస్తాం. దేవుని ప్రజలకు ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. జ్ఞానియైన సొలొమోను కూడా ఈ హెచ్చరికను నిర్లక్ష్యపెట్టి ఘోరంగా తప్పిపోయాడు (1 రాజులు 11:4-8). ఇశ్రాయేలీయుల చరిత్రలో కూడా ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి విశ్వాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదా?
నిర్గమకాండము 34:17 పోతపోసిన దేవతలను చేసికొనవలదు.
ఈ వచనంలో దేవుడు పోతపోసిన దేవతలను అనగా విగ్రహాలను చేసుకోకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ ఆజ్ఞ గతంలో కూడా ఇవ్వబడింది (నిర్గమకాండము 20:3,4,24 వ్యాఖ్యానం చూడండి). కానీ ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకోవడాన్ని బట్టి ఈ ఆజ్ఞ విషయంలో ఘోరంగా తిరుగుబాటుచేసారు. అయినప్పటికీ దేవుడు ఇప్పుడు వారితో సమాధానపడ్డాడు కాబట్టి, ఈ ఆజ్ఞను మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మాత్రమే కాదు గతంలో యెహోవా దేవుడు జారీచేసిన ప్రాముఖ్యమైన కొన్ని ఆజ్ఞలను మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చెయ్యబడుతున్నాయి. క్రిందివచనాలనుండి వాటినే మనం గమనిస్తాం. ఎందుకంటే నేను పైన వివరించినట్టు ఆయన ప్రజలతో సమాధానపడ్డాడు అనడానికి ఆయన ఆజ్ఞలే రుజువులుగా ఉంటాయి. అదేవిధంగా ఆ సందర్భంలో ఈ ఆజ్ఞలను ఇచ్చింది తండ్రియైన యెహోవా, ప్రస్తుతం వాటిని మరలా జ్ఞాపకం చేస్తుంది ఆయన చేత పంపబడిన యెహోవా, ఆయనే యెహోవా దూతగా పిలవబడ్డాడు (నిర్గమకాండము 23:20-23). అందుకే వీటిని యెహోవా దూత పలికినవిగానే ఆయన ఆపాదించుకున్నాడు.
న్యాయాధిపతులు 2:1,2 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు.
ఈ యెహోవా దూత గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత
నిర్గమకాండము 34:18 మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
ఈ వచనంలో దేవుడు పులియని రొట్టెల పండుగ గురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించడం జరిగింది. (నిర్గమకాండము 12:15, 13:3-7, 23:15 వ్యాఖ్యానాలు చూడండి).
నిర్గమకాండము 34:19,20
ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱె పిల్లయేగాని అది నాదగును గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.
ఈ వచనాల్లో దేవుడు తొలిచూలు పిల్లలు మరియు పశువుల ప్రతిష్టగురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 13:2,12,13 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:21
ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.
ఈ వచనంలో దేవుడు విశ్రాంతిదినాచారం గురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 20:9-11 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:22,23
మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
ఈ వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీయులు పాటించవలసిన మూడు పండుగల గురించి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. వీటిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 23:14-17 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:24
ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.
ఈ వచనంలో దేవుడు తన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల పురుషులు సంవత్సరానికి మూడుసార్లు పండుగకు వెళ్ళేటప్పుడు వారి భూమిని ఎవరూ ఆశించరని భరోసా ఇవ్వడం మనం చూస్తాం. ఇలా ఆయన ఎందుకు భరోసా కల్పిస్తున్నాడంటే, గతంలో ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైయుండేవారు. ఇప్పుడు దేవుడు వారిని విశాలమైన దేశంలో ప్రవేశపెట్టబోతున్నాడు "ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను". అయితే ఇశ్రాయేలీయులు ఈవిధంగా విశాలమైన దేశంలో ప్రవేశపెట్టబడినప్పటికీ ఎవరికి వారు సమీపంలో ఆలయాలు కట్టుకుని అక్కడ పండుగలను ఆచరించడం బలులు అర్పించడం నిషేధం. దేశానికి ఆ చివర ఉన్నవారిదగ్గరనుండి ఈ చివర ఉన్నవారివరకూ ప్రత్యక్షగుడారం ఎక్కడ నిలుపబడుతుందో లేక ఆ స్థానంలో మందిరం ఎక్కడ కట్టబడుతుందో అక్కడికి చేరుకునే ఆ పండుగలను ఆచరించాలి (ద్వితీయోపదేశకాండము 12:5-7,13,14). అలా పురుషులంతా తమ తమ ఇళ్ళను భూములను విడిచివెళ్ళేటప్పుడు చుట్టుప్రక్కల శత్రువులు వాటిని ఆక్రమించుకునే ప్రమాదం ఉంటుంది. ఇంటిదగ్గరే ఉన్న స్త్రీలు పిల్లలూ వారిని ఎదుర్కోలేరు. ఇక్కడ మరో విషయం పురుషులను రమ్మంటే స్త్రీలనూ పిల్లలనూ రావొద్దని కాదు, కొన్ని వ్యక్తిగత కారణాలను బట్టి స్త్రీలూ పిల్లలూ రాలేకపోయినా పురుషులు మాత్రం తప్పకుండా రావాలని అర్థం. దీనిగురించి పైన నేను ప్రస్తావించిన వ్యాఖ్యానంలో ఆధారాలతో సహా వివరించాను. ఈవిధంగా ఇశ్రాయేలీయుల పురుషులంతా సంవత్సరానికి మూడుసార్లు తప్పకుండా ఆయన సన్నిధికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారిమనసులో, మేము లేనప్పుడు శత్రువులు మా భూములను ఆక్రమించుకుంటారేమో అలానే ఇంటిదగ్గర ఉన్న మా స్త్రీలనూ పిల్లలనూ చెరపట్టుకుపోతారేమో అనే ఆందోళన నెలకొంటుంది. అందుకే దేవుడు ఇక్కడ అలా జరగదు "ఎవడును నీ భూమిని ఆశింపడు" అని భరోసా కల్పిస్తున్నాడు.
ఇది ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు సంవత్సరానికి మూడుసార్లు జరిగించే అద్భుతకార్యంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో ఒకరాజ్యంపై మరోరాజ్యం, ఒక గుంపు నివసిస్తున్న ప్రాంతంపై మరో గుంపు దురాక్రమణకు పాల్పడి వారి భూములు స్వాధీనం చేసుకోవడం, పురుషులను చంపి స్త్రీలనూ పిల్లలనూ బానిసలుగా చెరపట్టుకుపోవడం సర్వసాధారణంగా జరుగుతుండేది. పైగా ప్రతిఘటించే పురుషులు లేనప్పుడు ఆ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ అలా జరగకుండా నేను కాపాడతాను. మీరు మాత్రం సంవత్సరానికి మూడుసార్లు నా సన్నిధిలో కనపడాలి అంటున్నాడు. అలాగని ఆ భూమి ఆశింపతగింది కాదని కానీ ఆ భూమిని ఆక్రమించుకోవాలనే ఆశ శత్రువులకు పుట్టకుండా ఉంటుందని కాదు, కనాను పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశం కాబట్టి దానిపై చుట్టుప్రక్కలవారు మరింత ఆశకలిగియుండడం సహజం. కానీ దేవుడు వారి ఆశలను నిలువరించి తన ప్రజల భూమిని కాపాడతాడు. దేవుడు తాను అనుకున్నప్పుడు మానవుల దురాశలను నియంత్రించి తన ప్రజలను కాపాడగలిగే శక్తిగలిగిన దేవుడు.
గమనించండి; ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఇవ్వడమే కాదు, ఆ ఆజ్ఞను పాటించేటప్పుడు వారు ఎదుర్కోవలసిన సమస్యలకు కూడా, లేక వారి మనసులో తలెత్తే ఆందోళనకు కూడా ఆయనే పరిష్కారం చూపిస్తున్నాడు. లేక ఆయనే గొప్ప పరిష్కారంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆ ఆజ్ఞలను మనం నెరవేరుస్తున్నప్పుడు ఈ దుష్టలోకం నుండి మనకు సహజంగా కలిగే ప్రమాదాల నుండి తప్పించే దేవుడు కూడా అని గుర్తుంచుకోవాలి. మనం ఆయన ఆజ్ఞలను పాటించాలనే ఆసక్తిని కలిగుంటే చాలు, అందుకోసం లోకాన్ని ఎదిరిస్తే చాలు. ఆయనే మనకు గొప్ప రక్షణకోటగా సమస్యల్లో ఊహించని పరిష్కారంగా ఉంటాడు.
కీర్తనలు 5:11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
అందుకే ప్రభువు ఆజ్ఞలను శ్రద్ధగా గైకొనేవారికి నూతననిబంధనలో కూడా ఇలాంటి భరోసా కల్పించబడింది.
1పేతురు 3:13,14 మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి.
1పేతురు 4:3 మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.
నిర్గమకాండము 34:25
నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింప కూడదు. పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
ఈ వచనంలో దేవుడు పస్కా పశువుయొక్క రక్తాన్ని పులిసిన వాటితో కలపి ఆయనకు అర్పించకూడదని పశువు మాంసాన్ని ఉదయం వరకూ నిల్వ ఉంచకూదని జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. వీటిగురించి ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 23:18, 12:10 వ్యాఖ్యానాలు చూడండి).
నిర్గమకాండము 34:26 నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.
దీనిగురించి కూడా నేను ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 23:19 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 34:27
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.
ఈ వచనంలో దేవుడు మోషేతో ఇప్పటివరకూ తాను పలికిన ఆజ్ఞలను రాసుకోమని ఆదేశించడం మనం చూస్తాం. నేను మొదటివచనంలో వివరించినట్టుగా రెండవసారి కూడా మందసంలో ఉంచబడే పలకలపై పది ఆజ్ఞలనూ ఆయనే రాసాడు, క్రింది వచనంలో కూడా అది స్పష్టంగా ఉంది. కానీ వాటితో సహా ఇప్పటివరకూ ఆయన ఆజ్ఞాపించిన విషయాలను మాత్రం మోషేనే రాసుకోవాలి. ఇక్కడ దేవుడు ఇలా ఆదేశించడం ద్వారా తన వాక్యాన్ని రాసి భవిష్యత్తు తరాలకు దానిని అందించే బాధ్యతను లేక పలకలపై ఆయన రాసిన ఆజ్ఞలను కూడా పుస్తకంపై (చర్మపు కాగితాలు/పేపపస్) రాసుకోమనడం ద్వారా ఆయన వాక్యానికి ప్రతులు రాసే ఆనవాయితీని కూడా ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి లేఖనాలను రాయడం లేదా వాటికి ప్రతులను చెయ్యడం భక్తులు తమంతట తాముగా చేసినపని కాదు. తన పిల్లలకు తన వాక్యాన్ని అందచెయ్యాలనే ఉద్దేశంతో జారీచెయ్యబడిన దేవుని ఆజ్ఞ మూలంగానే వారు అలా చేసారు. కానీ ఈరోజు ఎవరైతే తమకు కూడా మతగ్రంథాలు ఉన్నాయని చూపిస్తున్నారో, వాటిని రాయమని వారి దేవుడు ఎక్కడ చెప్పాడో అది కూడా చూపించాలి. ఉదాహరణకు కురాను ను తీసుకోండి. ఆ గ్రంథంలో దేవునిగా ప్రస్తావించబడిన అల్లాహ్ లేక మహమ్మద్ తో మాట్లాడినట్టుగా చిత్రీకరించబడిన గాబ్రీయేల్ అందులోని ఆయత్తులను (వచనాలను) రాయమని ఎక్కడ ఆజ్ఞాపించాడో మరి.
అదేవిధంగా మోషేతో దేవుడు పలికినమాటల ఆధారంగా భక్తులు లేఖనాలకు ప్రతులు రాస్తున్నప్పుడు అవి మోషేవలే పరిశుద్ధాత్మ ప్రేరేపితులు రాస్తున్న ప్రారంభ లేఖనాలు కాదు కాబట్టి అందులో సంఖ్యాపరమైన లేక పేర్లకు సంబంధించిన మానవతప్పిదాలు జరగడం సహజం. ఈరోజు మతోన్మాదులు వాటిని చూపించి బైబిల్ తప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారు బైబిల్ ప్రతుల్లో అలాంటి మానవతప్పిదాలు చోటుచేసుకున్నప్పటికీ వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా బైబిల్ లోనే ఉందని గుర్తుంచుకోవాలి.
నిర్గమకాండము 34:28
అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.
మోషే ఇలా ఆ పర్వతంపై నలభైరాత్రుళ్ళు పగళ్ళు ఉండడం ఇది రెండవసారి. ఈ రెండుసార్లూ కూడా అతను భోజనం కానీ, నీరు కానీ లేకుండానే జీవించాడు (ద్వితీయోపదేశకాండము 9:18). కొందరు శాస్త్రీయపరంగా ఇది అసాధ్యమని ఆరోపిస్తుంటారు. పైగా మోషే ఎంతో ఉత్సాహంగా ఆ పర్వతం దిగివస్తుండాన్ని కూడా ఆక్షేపిస్తుంటారు. కానీ మోషే ఈ రెండుసార్లూ ఉన్నది దేవునిసన్నిధిలో అయనగా ఆయన సంరక్షణలో అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన సన్నిధిలో, ఆయనతో సంభాషిస్తూ ఉన్న మోషేను ఆహారం మరియు నీరులేకుండా బ్రతికించడం దేవునికి సాధ్యమే. నలభైరోజులు గడిచినా ఒకప్పటి శక్తి అతనిలో లోపించకుండా బలపరచడం కూడా ఆయనకు సాధ్యమే. పైగా మోషే ఈ సంఘటన తరువాత మరింత శక్తికలిగినవాడిగా ముఖప్రకాశంతో ప్రజలముందుకు వెళ్తాడు. కాబట్టి దేవుడు లేడని వాదించేవారు ఇలాంటి దైవికమైన విషయాలలో కలుగచేసుకోకుండా ఉండడం మంచిది.
ఇక "అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను" అంటే ఆ పలకలపై ఆయన శక్తిద్వారా రాయబడ్డాయని ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 31:18 వ్యాఖ్యానం చూడండి).
ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. గతంలో మోషే 40రోజులు కొండపై ఉండిపోయినప్పుడు ప్రజలు దానిని ఆలస్యంగా భావించి, ఆ మోషే అనువాడు ఏమాయెనో అంటూ బంగారు దూడను చేసుకున్నారు (నిర్గమకాండము 32:1-4). అందుకని దేవుడేమీ ఈసారి మోషేను తొందరగా పంపివెయ్యట్లేదు. అతనికి ఆజ్ఞలను రాసివ్వడానికి అలానే తన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చెయ్యడానికి అంతే 40 రోజుల సమయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే మనిషిని బట్టి తన సమయాన్ని మార్చుకోవలసిన లేక తొందరపడవలసిన అవసరం దేవునికి ఉండదు. ఆయన తాను అనుకున్న సమయంలోనే తన కార్యాన్ని పూర్తి చేస్తాడు. అప్పటివరకూ ఓపికగా ఉండడం మనిషి బాధ్యత. నీ సహన లేమిని బట్టి దేవుడు తన సమయాన్ని మార్చుకోడు. అదేవిధంగా గతంలో తప్పిపోయినట్టుగా ఈసారి కూడా తప్పిపోతారా అని ఇది ప్రజల విశ్వాసానికి కూడా పరీక్షగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయులు ఈ పరీక్షలో విజయం సాధించారు. మనం కూడా ఈ సంఘటనను బాగా గుర్తుంచుకుని ఆయన కార్యాల విషయంలో సహనం పాటించాలి, ఆ పరీక్షలో విజయం సాధించాలి. లేదా గతంలో ఇశ్రాయేలీయులు చేసినట్టుగా బంగారుదూడను చేసుకుని (తిరుగుబాటు చేసి) ఆయన సన్నిధిని కోల్పోవలసి ఉంటుంది.
నిర్గమకాండము 34:29
మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు.
ఈ వచనంలో మోషే నలభై రోజుల తర్వాత పది ఆజ్ఞలు రాయబడిన పలకలతో క్రిందకు దిగి వస్తున్నప్పుడు అతని ముఖచర్మం ప్రకాశించినట్టుగా రాయబడడం మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే గత అధ్యాయంలో అతను కోరుకున్న ప్రకారం ఎప్పుడూ చూడనంతగా దేవునిమహిమను చూసి ఆ మహిమలో 40రోజులు నివసించాడు. దానికి రుజువుగానే ఇలా జరిగింది. అంతేకాకుండా ప్రజలు మోషేను చూసినప్పుడు అతని మధవర్తిత్వాన్ని దేవుడు అంగీకరించాడు అనడానికి కూడా ఇది రుజువుగా ఉంటుంది. అదేవిధంగా ఈ ముఖప్రకాశాన్ని మనం క్రీస్తు రూపాంతరం చెందినదానికి పోలికగా చూడవచ్చు (మత్తయి 17:1). అయితే అక్కడ క్రీస్తు తనకు తానుగా తనకున్న మహిమను బట్టి రూపాంతరం చెందాడు, అప్పుడు "ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటలు వినండనే" శబ్ధం శిష్యులకు వినిపించింది. మోషే మాత్రం దేవుని మహిమను బట్టి అలా ప్రకాశించబడ్డాడు. అది కూడా ఇశ్రాయేలీయులతో ఈయన నా నమ్మకమైన దాసుడు ఈయన మాటలు వినండని వారిని హెచ్చరిస్తుంది.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరో రెండు విషయాలు ఏంటంటే;
1. నిర్గమకాండము రాస్తుంది మోషే అయినప్పటికీ ఈ వచనంలోనూ మరియు ద్వితీయోపదేశకాండము మినహా మిగిలిన పుస్తకాల్లోనూ అతను తనను తాను మూడవ వ్యక్తిగా ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ఇది చరిత్రను రాసేకొందరు అనుసరించే రచనాశైలి అని ఇప్పటికే నేను వివరించాను. ఉదాహరణకు; మత్తయి. దీనిగురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించానంటే ఇక్కడ "అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు" అని రాయబడింది. అప్పుడు మోషేకు అతని ముఖం ప్రకాశించినట్టు తనకే తెలియకపోతే దానిని ఎలా రాయగలిగాడు అనే సందేహం కలుగుతుంది. కానీ మోషే ఈ సంఘటన జరిగిపోయిన తరువాత గ్రంథస్తం చేసాడు, క్రింది వచనాల ప్రకారం అప్పటికే తనను చూసినవాళ్ళు ఆ విషయం అతనితో చెప్పారు కాబట్టి అతను ప్రస్తుతం కూడా దానిని ప్రస్తావించాడు.
2. మోషే దేవుని మహిమలో నివసించినప్పుడు అతనికే తెలియని మార్పు అతనిలో కలిగింది. అతని ముఖం ఎవరూ చూడలేనంతగా దేవుని మహిమను బట్టి ప్రకాశించింది. అహరోను మరియు ఇశ్రాయేలీయుల పెద్దలు చెబితేకానీ అతనికి ఆ విషయం అర్థం కాలేదు. అలానే దేవుని సహవాసంలో గడిపేవారిలో లేక ఆయన ఏర్పాటును బట్టి రక్షించబడినవారిలో కూడా ఆయన పరిశుద్ధతకు సంబంధించిన మార్పు కలుగుతుంది. అప్పటివరకూ పాపాన్ని ప్రేమించిన మనం కొన్నిసార్లు మనకు తెలియకుండానే దానిని అసహ్యించుకోవడం మొదలుపెడతాము. అలానే అనేకవిధాలైన సత్కార్యాలు చెయ్యడానికి కూడా సిద్ధపడుతుంటాము. మోషే ప్రజలను బలపరిచినట్టు మనం కూడా బలహీనులను బలపరుస్తాం. ఆ పరిశుద్ధమైన మార్పుయే మనం ఆయనతో సహవాసం కలిగియున్నామనడానికి రుజువుగా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే ముఖంలో ప్రకాశాన్ని చూసినట్టుగానే మనలో కూడా ఇతరులు పరిశుద్ధతను చూడగలగాలి. ప్రారంభంనుండీ దేవుని ఉద్దేశమే తన పిల్లలను ఇతరులనుండి ప్రత్యేకపరచడం, అనగా పరిశుద్ధపరచడం. ఆయన ఇచ్చిన కట్టడలన్నీ అందుకోసమే నిర్ణయించబడ్డాయి.
ద్వితియోపదేశకాండము 4:5-8 నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?
నిర్గమకాండము 34:30 అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింపవెరచిరి.
ఈ వచనంలో అహరోను మరియు ఇశ్రాయేలీయులు మోషే ముఖప్రకాశాన్ని చూడలేక అతనికి దూరంగా ఉండడం మనం చూస్తాం. నేను పై వచనంలో వివరించినట్టుగా మోషేకు కలిగిన ఆ ప్రకాశం దేవుని మహిమను బట్టి కలిగింది కాబట్టి, అహరోనుతో సహా ఎవ్వరూ దానిని చూడలేకపోయారు. ఇది మోషే మధవర్తిత్వం పై వారికి మరింత విశ్వాసం పుట్టించే దేవుని అద్భుతకార్యం.
నిర్గమకాండము 34:31-33
మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను. అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
ఈ వచనాల్లో మోషే దేవుడు తనకు చెప్పినవన్నీ ప్రజలకు వినిపించడం, తరువాత అతని ముఖానికి ముసుగు వేసుకోవడం మనం చూస్తాం. ఇక్కడ మోషే దేవుని మహిమను బట్టి తన ముఖానికి కలిగిన ప్రకాశాన్ని ప్రజలముందు ఎక్కువసేపు ప్రదర్శించుకోవట్లేదు. దేవునితో సమాధానం లభించిందనడానికి రుజువుగానే దానిని చూపించి వెంటనే ముసుగువేసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆ ప్రకాశాన్ని చూడలేకపోతున్నారని అతనికి తెలుసు. అందుకే దానిని తన గొప్పతనం చాటుకునే ప్రదర్శనగా ఉంచకుండా ముసుగుతో కప్పివేస్తున్నాడు. క్రిందివచనాల్లో దీనిని మరింత స్పష్టంగా చదువుతాం. సంఘంలో ఈ మాదిరిని మనమంతా అనుసరించగలగాలి. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు చాలామంది విశేషమైన దేవుని వరాలను, లేక జ్ఞానాన్ని పొందుకోగానే వాటిని తమకు గొప్పను తెచ్చిపట్టే ప్రదర్శనగా మారుస్తున్నారు. సంఘంలో బలహీనులను చులకనగా చూస్తున్నారు, లేదా వారిపై హెచ్చించుకుంటూ కించపరుస్తున్నారు. ఇలా ఉండకూడదు, మనం వారిని కూడా అన్నివిధాలుగా బలపరిచేలా సాధ్యమైనంతమట్టుకు మనల్ని మనం తగ్గించుకోవాలి.
రోమీయులకు 15:1,2 కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరిం చుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.
ముఖ్యంగా మన జ్ఞానం ఇతరుల నాశనానికి కారణం కాకుండా చూసుకోవాలి. 1కొరింథీ 8లో పౌలు విగ్రహార్పితాలను తినడాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ విషయాన్నే వారికి అర్థమయ్యేలా బోధిస్తాడు. మన దేవుడు బలహీనమైన లేక పాలిచ్చే గొర్రెలను నెమ్మదిగా నడిపించే మంచి కాపరి (యెషయా 40:11). రక్షణ ద్వారా ఆ దైవస్వభావంలో పాలివారమైన మనమంతా బలహీనుల పట్ల ఆవిధంగానే ప్రవర్తించాలి. ఈ వాక్యభాగాలు కూడా చదవండి.
తీతుకు 3:1-5 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
గలతియులకు 6:1,22 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
నిర్గమకాండము 34:34,35
అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
ఈ వచనాల్లో మోషే దేవునితో మాట్లాడడానికి ఆయన సన్నిధిలో లేక గుడారంలో (నిర్గమకాండము 33:7-11) ప్రవేశించేటప్పుడల్లా తన ముఖానికి ఉన్న ముసుగును తీసివెయ్యడం, మరలా ప్రజలయొద్దకు తిరిగివచ్చేటప్పుడు ఆ ముసుగును వేసుకోవడం మనం చూస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ ముసుగు అవసరం లేదు. ఇంతకూ మోషే ముఖం ఎంతకాలం ఇలా ప్రకాశిస్తూ ఉందనేదానికి లేఖనంలో మనకు ఎలాంటి వివరణా లేదు. అయినప్పటికీ అతను చనిపోయేంతవరకూ అతనికి వృద్ధాప్యలక్షణాలు రాకపోవడాన్ని బట్టి (ద్వితీయోపదేశకాండము 34:7) కొందరు బైబిల్ పండితులు అది అతను జీవించినంతకాలం అలానే ఉందని భావిస్తున్నారు.
అదేవిధంగా పౌలు ఈ మోషే ముఖానికి ఉన్న ముసుగును ఛాయారూపకమైన ధర్మశాస్త్రంతో అనగా నైతికపరమైన ధర్మశాస్త్రం కాదు కానీ క్రీస్తుకు ఛాయగా ఉన్న ధర్మశాస్త్రంతో (బలులు, ఆచారాలు) పోలుస్తూ క్రీస్తు పట్ల యూదుల అవిశ్వాసాన్ని తీవ్రంగా ఖండిస్తాడు (2 కొరింథీ 3).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 34

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"