దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు-
ఈ వచనంలో మోషే మాయయైన యిత్రో ఇశ్రాయేలీయుల విడుదల గురించి విని అతనివద్దకు రావడం మనం చూస్తాం. ఇతను మిద్యానీయుల జాతికి చెందినవాడు, ఈ జాతి అబ్రాహాముకు కెతూరా ద్వారా జన్మించిన మిద్యాను వల్ల ఉద్భవించింది (ఆదికాండము 25:1,2). అబ్రాహామును బట్టి ఈ జాతి ప్రజల్లో కూడా యెహోవా దేవునితో సంబంధం కలిగినవారు ఉన్నారు, అందుకే మోషే మామయైన యిత్రో "యాజకుడిగా" సంబోధించబడ్డాడు. లేవీ యాజకత్వానికి ముందే ఇటువంటి యాజకులు ఉండేవారు ఉదాహరణకు; మెల్కీసెదెకు.
ఈ యిత్రో గురించి మరికొన్ని వివరాలను ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 3:1 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 18:2
నిర్గమకాండము 18:2
మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.
ఈ వచనంలో యిత్రో తనతో పాటు మోషే భార్యనూ అతని ఇద్దరు కుమారులనూ వెంటపెట్టుకుని రావడం మనం చూస్తాం. తన కుమారుడికి సున్నతి చెయ్యలేదనే కారణంతో సత్రంలో దేవుడు మోషేను చంపచూసినప్పుడు ఈ సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేసి మోషేను కాపాడింది. తరువాత ఆమె తన పిల్లలతో కలసి తన తండ్రియైన యిత్రో దగ్గరకు వెళ్ళిపోయింది (నిర్గమకాండము 4:24-26 వ్యాఖ్యనం చూడండి). అందుకే ఇప్పుడు యిత్రో ఆమెనూ ఆ పిల్లలనూ వెంటపెట్టుకుని మోషే దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మోషే ఇప్పుడు ప్రజలతో కలసి మిద్యానీయులకు దగ్గర ప్రాంతమైన సీనాయి పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. గతంలో ఇదే పర్వతం దగ్గర దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు (నిర్గమకాండము 3:1).
నిర్గమకాండము 18:3
నిర్గమకాండము 18:3
అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
ఈ కుమారుడు పుట్టేసరికి మోషే ఫరోభయం వల్ల మిద్యానులో యిత్రో దగ్గర తన వారందరికీ దూరంగా నివసిస్తున్నాడు. మిద్యాను అతనికి అన్యదేశం కాబట్టి ఆ భావంలో తన కుమారుడికి గెర్షోము అని పేరుపెట్టాడు.
నిర్గమకాండము 18:4
నిర్గమకాండము 18:4
నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా ఒక ఐగుప్తీయుడ్ని చంపినప్పుడు ఫరో మోషేను చంపాలని చూసాడు. అప్పుడు మోషే మిద్యానుకు పారిపోయాడు. ఆవిధంగా దేవుడు ఫరో కత్తినుండి తనను తప్పించినందుకు గుర్తుగా మోషే తన రెండవ కుమారుడికి ఎలీయెజెరు అనే పేరు పెట్టాడు. అతను తన కుమారులకు ఇటువంటి పేర్లు పెట్టడం ద్వారా వారికి కూడా దేవుడు చేసిన మేలులు నిరంతరం బోధించబడుతున్నాయి.
నిర్గమకాండము 18:5
నిర్గమకాండము 18:5
మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.
గతంలో ఇదే పర్వతం దగ్గర మోషే తన మామయైన యిత్రో మందను మేపుతున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై "మీరు ఐగుప్తునుండి విడుదల పొందాక ఈ పర్వతంపై నన్ను సేవిస్తారని" పలికాడు (నిర్గమకాండము 3:12). ఆయన పలికినట్టుగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొంది, రెఫీదీము నుండి సీనాయికి చేరుకున్నారు. అప్పుడే యిత్రో మోషేను కలుసుకున్నాడు.
యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా-
ఈ వచనంలో యిత్రో మోషేకు వర్తమానం పంపించడం మనం చూస్తాం. ఈ సంఘటనకు కొంచెం ముందే అమాలేకీయుల దాడి జరిగింది కాబట్టి ఇశ్రాయేలీయులు తమ భద్రతను కట్టుదిట్టం చేసియుండవచ్చు. పైగా అన్ని లక్షల ప్రజల్లో మోషే ఎక్కడున్నాడో గుర్తించడం కూడా యిత్రోకు కష్టం కాబట్టి ఈవిధంగా వర్తమానం పంపించాడు.
అదేవిధంగా ఈ సందర్భం తరువాత మోషే భార్య ప్రస్తావన కానీ, అతని కుమారుల ప్రస్తావన కానీ మనకు కనిపించదు. ప్రధాన యాజకత్వం కూడా అహరోనుకూ అతని కుమారులకూ స్వంతమైంది తప్ప మోషే వంశానికి కాదు. దీనిని బట్టి మనం రెండు విషయాలు గ్రహించాలి.
1 మోషే ఈ చరిత్రను కల్పించి రాయట్లేదు, అలా రాసుంటే తన కుటుంబానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చుకోకుండా రాయడు కదా! అతను వాస్తవంగా జరిగిందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు.
2 పరిచర్య అనేది వంశపారంగా దక్కేది కాదు, పరిచర్య తండ్రుల నుంచి పిల్లలకు దక్కాలంటే వారు కూడా దానికి యోగ్యులుగా ఉండాలి. ముఖ్యంగా దేవుని నిర్ణయాన్ని బట్టే తన ప్రజలపై నాయకత్వం, ప్రధాన యాజకత్వం దక్కుతుంది.
నిర్గమకాండము 18:7
నిర్గమకాండము 18:7
మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
ఈ వచనంలో మోషే తగ్గింపును మనం చూస్తాం. అతను ఇశ్రాయేలీయులకు మహారాజుగా ఉన్నప్పటికీ, యిత్రో వచ్చాడని అతనికి వర్తమానం రాగానే వారిని తన దగ్గరకు తీసుకురమ్మని మనుషులను పంపకుండా స్వయంగా తానే అతని యొద్దకు వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే యిత్రో చేసిన మేలు మోషేకు జ్ఞాపకమే. మనం కూడా మనకు మేలు చేసినవారి పట్ల సదా తగ్గింపును కనపరచాలి.
నిర్గమకాండము 18:8
నిర్గమకాండము 18:8
తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయులకొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.
ఈ వచనంలో మోషే; తన కుటుంబం తనదగ్గరకు చేరగానే విందువినోదాలకు మొదటి స్థానం ఇవ్వకుండా, దేవుడు తమ పట్ల చేసిన కార్యాలనూ ఇశ్రాయేలీయుల విడుదలలో ఆయన కనపరచిన బలాన్నీ యిత్రోకు ప్రకటించడం మనం చూస్తాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, ఆయన గురించి ప్రకటించడానికే మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటాడు.
నిర్గమకాండము 18:9
నిర్గమకాండము 18:9
యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.
ఈ వచనంలో మోషే మాటలు విన్న యిత్రో సంతోషించడం మనం చూస్తాం. దేవుని పిల్లలు ఈవిధంగానే సాటి దేవుని పిల్లలకు కలిగే మేలులను చూసి/విని సంతోషించేవారుగా ఉంటారు.
నిర్గమకాండము 18:10,11
నిర్గమకాండము 18:10,11
మరియు యిత్రోఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసినదనెను.
ఈ వచనాలలో యిత్రో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన మేలు, ఐగుప్తీయుల పట్ల ఆయన కనపరచిన తీర్పులను బట్టి ఆయనను స్తుతించడం మనం చూస్తాం. యిత్రో ఇప్పటివరకూ యెహోవా దేవుణ్ణే పూజిస్తూ ఆయనకు యాజకుడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అతను యెహోవా దేవుని శక్తిగురించి మరింతగా తెలుసుకున్నాడు కాబట్టి "యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని (ఆయన మాత్రమే దేవుడని) యిప్పుడు నాకు తెలిసింది" అంటున్నాడు.
నిర్గమకాండము 18:12
నిర్గమకాండము 18:12
మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రా యేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.
ఈ వచనంలో యిత్రో యెహోవా దేవునికి బలులను అర్పించడం, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కలసి దేవుని సన్నిధిలో భోజనం చెయ్యడం మనం చూస్తాం. అప్పటికి ఇంకా లేవీ యాజకత్వం విధించబడలేదు కాబట్టి, తన ప్రజల్లో యాజకుడిగా ఉన్న యిత్రోనే బలులను అర్పిస్తున్నాడు.
అదేవిధంగా వారు భోజనం చేసారంటే దానికి రొట్టెలు కావాలి, ఆ రొట్టెలు మన్నాతో చేయబడినవే. ఎలాగైతే యిత్రో ఇశ్రాయేలీయుడు కాకపోయినప్పటికీ మన్నాను భుజించే ధన్యతను దక్కించుకున్నాడో అలానే క్రీస్తుయేసును విశ్వసించినవారికి కూడా ఇశ్రాయేలీయుడనీ, అన్యుడనీ బేధం లేకుండా అందరికీ సమాన ధన్యత దక్కుతుంది.
గలతియులకు 3: 27,28 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
నిర్గమకాండము 18:13
నిర్గమకాండము 18:13
మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాల మువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి.
లక్షలమంది ఇశ్రాయేలీయుల ప్రజల్లో తప్పకుండా వివాదాలు తలెత్తుతుంటాయి కాబట్టి, ఈ వచనం ప్రకారం మోషే వారి మధ్య న్యాయం తీరుస్తూ ఉండేవాడు. అదేవిధంగా తన భార్యా పిల్లలు తనదగ్గరకు వచ్చిన మరునాడే మోషే ఈ పనిలో నిమగ్నమవ్వడం మనం చూస్తున్నాం. అతను తన కుటుంబం తనదగ్గరకు వచ్చేసరికి తనకు అప్పగించబడిన బాధ్యతలను నిర్లక్ష్యం చెయ్యడం లేదు. వారితో ఆ రోజంతా గడిపాక మరునాడు తన బాధ్యతలో కొనసాగుతున్నాడు. మనం కూడా కుటుంబాన్ని బట్టి దేవుడు అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. అలా అని కుటుంబాన్నీ విడిచిపెట్టకూడదు. అటు కుటుంబం, ఇటు దేవుని పని ఈ రెండింటికీ నష్టం వాటిల్లకుండా సమయాన్ని కేటాయిస్తుండాలి.
నిర్గమకాండము 18:14-16
నిర్గమకాండము 18:14-16
మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచినీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా మోషేదేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.
ఈ వచనాలలో మోషే మామయైన యిత్రో మోషే మాత్రమే న్యాయాధిపతిగా తీర్పు తీర్చడం అటు ప్రజలకూ ఇటు మోషేకూ ఆయాసకరంగా ఉంటుందని గ్రహించి, అతనితో సంబాషించడానికి ప్రశ్నించడం దానికి మోషే బదులివ్వడం మనం చూస్తాం. సీనాయి కొండపై ధర్మశాస్త్రం ఇవ్వబడడానికే ముందే అందులోని నైతిక ఆజ్ఞలు ముందునుండీ బయలుపరచబడే ఉన్నాయి. మోషే వాటిని బట్టే ప్రజలకూ తీర్పుతీరుస్తూ వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ అతను తన మామకు తెలియచేస్తున్నాడు.
నిర్గమకాండము 18:17,18
నిర్గమకాండము 18:17,18
అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు; నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయ ముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.
ఈ వచనాలలో యిత్రో; మోషే ఒక్కడే న్యాయాధిపతిగా ఉండడం వల్ల అటు ప్రజలకూ ఇటు మోషేకూ ఆయాసకరంగా ఉంటుందని గ్రహించి ఆ విషయాన్ని మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే మోషే దగ్గరకు న్యాయం కోసం వేలమంది వచ్చే అవకాశం ఉంది, న్యాయవిచారణ అనేది అంత సులభంగా తేలిపోయేది కాదు కాబట్టి మోషే ఆరోజంతా కష్టపడినా కేవలం కొన్ని వివాదాలను మాత్రమే పరిష్కరించగలడు. అప్పటివరకూ మిగిలినవారంతా అతనిదగ్గర నిలబడియుండవలసిందే, వారి వంతు రాకపోతే మరునాడు మరలా అక్కడికి రావలసిందే. ఈవిధంగా మోషే ఒక్కడే ఆ పని చెయ్యడం ఇటు మోషేకూ అటు ప్రజలకూ చాలా ఆయాసకరంగా ఉంటుంది.
ఈ విషయం మనం సంఘపరమైన బాధ్యతల్లో కూడా అన్వయించుకోవాలి. సంఘంలో ఏ ఒక్కరిపైనే అన్ని బాధ్యతలూ మోపబడకూడదు. ఎవరు ఎందులో ప్రవీణులో వారికి బాధ్యతలను పంచి ఇవ్వాలి. దానివల్ల సంఘం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.
అపొస్తలుల కార్యములు 6:1-6 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.
నిర్గమకాండము 18:19
నిర్గమకాండము 18:19
కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.
ఈ వచనంలో యిత్రో మోషేకు సలహా ఇవ్వడం ప్రారంభించడం మనం చూస్తాం. అతని ఆలోచన ప్రకారం మోషే ప్రజల పక్షంగా దేవుని సముఖంలో ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవాలి. ప్రజల పక్షంగా దేవుని సముఖంలో నిలబడడమంటే వారికోసం మోషే ప్రార్థన చెయ్యాలి.
నిర్గమకాండము 18:20
నిర్గమకాండము 18:20
నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
ఈ వచనంలో యిత్రో చెబుతున్నదాని ప్రకారం, మోషే దేవుని సముఖంలో ప్రజల పక్షంగా నిలిచి వారికోసం ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు అతనికి తెలిపిన కట్టడలను ఆ దేవుని పక్షంగా ప్రజలకు బోధించాలి. ఈవిధంగా మోషే ప్రజలపక్షంగా దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని పక్షంగా ప్రజలకు బోధిస్తూ తన మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని యిత్రో ఇస్తున్న మొదటి సలహా.
నిర్గమకాండము 18:21-22
నిర్గమకాండము 18:21-22
మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును.
ఈ వచనాలలో యిత్రో ప్రజల్లోని చిన్నచిన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రజల సంఖ్యచొప్పున న్యాయాధిపతులను నియమించి గొప్ప వివాదాలను మాత్రమే తన దగ్గరకు రప్పించాలని సలహా ఇవ్వడం మనం చూస్తాం. అలానే యిత్రో ఇక్కడ ఎవర్ని బడితే వారిని న్యాయాధిపతులను నియమించాలని కాకుండా సామర్థ్యం, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వ్యక్తులనే ఆ పనిలో నియమించాలని చెబుతున్నాడు. సంఘ పరిచర్యలో కూడా మనం ఇటువంటి వ్యక్తులనే పరిచారకులుగా, నాయకులుగా ఎన్నుకోవాలి.
2తిమోతికి 2: 2 నీవు అనేక సాక్షులయెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.
నిర్గమకాండము 18:23
నిర్గమకాండము 18:23
దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భార మును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.
ఈ వచనంలో యిత్రో తన సలహాను ముగించిన తరువాత అది తప్పనిసరిగా పాటించమని బలవంతం చెయ్యడం లేదు కానీ నా సలహా దేవునికి అనుకూలమైతే పాటించమని చెబుతున్నాడు. తరువాత మోషే దానిని పాటించడాన్ని బట్టి ఆ సలహా దేవునికి అనుకూలంగా ఉందని మనకు అర్థమౌతుంది. ఒకవిధంగా ఈ సలాహా ఇచ్చేలా యిత్రోను దేవుడే ప్రేరేపించాడు.
కాబట్టి మనం ఎవరు ఏ సలహా ఇచ్చినా అది దేవుని చిత్తంగా భావించకూడదు, ఆ సలహాను దేవుడు ఆమోదిస్తేనే అది దైవచిత్తానుసారమైన సలహా ఔతుంది. ఈ పరీక్షకు మనం వాక్యం వైపు చూడాలి. మనకు ఇవ్వబడిన సలహా వాక్యం ఆమోదిస్తే అది దేవునికి అంగీకారమే లేదంటే అది దేవునికి అంగీకారం కాదు.
నిర్గమకాండము 18:24-26
నిర్గమకాండము 18:24-26
మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను. వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యె ములను తామే తీర్చుచువచ్చిరి.
ఈ వచనాలలో మోషే తనమామ ఇచ్చిన సలహాను దేవుని అనుమతి ప్రకారం పాటిస్తూ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులను నియమించడం మనం చూస్తాం. ఈ విషయం మనకు ద్వితీయోపదేశకాండము 1:9-18 వచనాలలో స్పష్టమౌతుంది. ఐతే ఈ నియామాకం యిత్రో చెప్పిన వెంటనే జరిగిపోలేదు కానీ చాలా సమయం తరువాత జరిగింది. కానీ అది యిత్రో సలహాను బట్టే జరిగింది కాబట్టి మోషే ఈ సందర్భంలో దానిని ప్రస్తావించాడు.
నిర్గమకాండము 18:27
నిర్గమకాండము 18:27
తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.
ఈ వచనంలో మోషే తనమామయైన యిత్రోను తన స్వదేశానికి పంపిచేసినట్టు మనం చూస్తాం. ఐతే మోషే మాట ప్రకారం యిత్రో కుమారుడు ఇశ్రాయేలీయులతోనే ఉండిపోయి వారికి సహాయం చెయ్యసాగాడు (సంఖ్యాకాండము 10:29-32). మోషే మామయైన యిత్రోకు ఉన్న మరొక పేరును బట్టి అతని సంతానం కేనీయులుగా ఇశ్రాయేలీయుల మధ్యే విస్తరించింది. సౌలు అమాలేకీయులను హతం చేసే సందర్భంలో ఈ విషయం మనకు స్పష్టమౌతుంది (1 సమూయేలు 15:6).
హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
నిర్గమకాండము అధ్యాయము 18
విషయసూచిక:- 18:1, 18:2 , 18:3 , 18:4, 18:5 , 18:6 ,18:7 , 18:8 , 18:9 , 18:10,11 , 18:12 , 18:13 , 18:14-16 , 18:17,18
,18:19,18:20 , 18:21-22 , 18:23 , 18:24-26 , 18:27
నిర్గమకాండము 18:2
నిర్గమకాండము 18:3
నిర్గమకాండము 18:4
నిర్గమకాండము 18:5
నిర్గమకాండము 18:6
నిర్గమకాండము 18:7
నిర్గమకాండము 18:8
నిర్గమకాండము 18:9
నిర్గమకాండము 18:10,11
నిర్గమకాండము 18:12
నిర్గమకాండము 18:13
నిర్గమకాండము 18:14-16
నిర్గమకాండము 18:17,18
నిర్గమకాండము 18:19
నిర్గమకాండము 18:20
నిర్గమకాండము 18:21-22
నిర్గమకాండము 18:23
నిర్గమకాండము 18:24-26
నిర్గమకాండము 18:27
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.