పాత నిబంధన

విషయసూచిక:- 35:1, 35:2, 35:3 , 35:4, 35:5-9 , 35:10 ,35:11-19 , 35:20 , 35:21 , 35:22-29 , 35:30-33 , 35:34 , 35:35.

 

నిర్గమకాండము 35:1
మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసిమీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా-

ఈ వచనంలో మోషే ప్రజలను సమకూర్చి దేవుని విధులను వారికి తెలియచెయ్యడం మనం చూస్తాం‌. ఇది గత అధ్యాయానికి కొనసాగింపుగా జరుగుతుంది. నేను అక్కడ తెలియచేసినట్టుగా ప్రస్తుతం దేవుడు ప్రజలతో సమాధానపడ్డాడు అనడానికి గుర్తుగా ఇక్కడ ఆయన విధులు వారికి తెలియచెయ్యబడుతున్నాయి.

నిర్గమకాండము 35:2
ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.

ఈ వచనంలో విశ్రాంతి దినాచారం గురించి మోషే వారికి మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఇది పది ఆజ్ఞలలో ఒకటిగా మనకు కనిపిస్తుంది (నిర్గమకాండము 20:8-11 వ్యాఖ్యానం చూడండి). అయితే మొదటిసారిగా ఇక్కడ ఆ విశ్రాంతిదినాచారాన్ని మీరేవారికి మరణశిక్ష విధించాలని చెప్పబడుతుంది, గతంలో ప్రజల్లోనుండి కొట్టివేయబడతాడు (నిర్గమకాండము 31:14) అనే మాటలు దీనినే సూచిస్తున్నాయి. కొందరు దీనిని బట్టి కేవలం విశ్రాంతిదినాచారం మీరితేనే మరణశిక్షనా అంటూ ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఇశ్రాయేలీయులు ఎవరైనా విశ్రాంతిదినాచారాన్ని మీరడమంటే, దేవుని చేత పరిశుద్ధపరచడాన్ని లేక ఆయనకోసం ప్రత్యేకంగా ఉండడాన్ని తృణీకరించడమే. అందుకే ఆయన ఈ ఆజ్ఞ విషయంలో మరణదండనను నిర్ణయించాడు. దీనిగురించి ఇప్పటికే స్పష్టంగా వివరించాను (నిర్గమకాండము 31:12-14 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 35:3
విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.

ఈ వచనంలో మొదటిసారిగా విశ్రాంతిదినం రోజు ఎవరూ వంట కూడా చేసుకోకూడదనే నియమాన్ని మనం చూస్తాం‌. ఎందుకంటే వంట చెయ్యాలంటే కట్టెలు సేకరించాలి, పైగా స్త్రీలు ఎప్పటిలానే ఇంటిపని చెయ్యాలి. అది విశ్రాంతి దినాచారాన్ని మీరడమే ఔతుంది.‌ అందుకే ఆయన ఈవిధంగా ఆజ్ఞాపించాడు. మరి ఇశ్రాయేలీయులు ఆరోజు ఏం తినాలి అనే సందేహం మనకు అవసరం లేదు. ఇశ్రాయేలీయులు మనకులా రోజూ అన్నం వండుకునే తినక్కర్లేదు. వారి ప్రధానమైన ఆహారం రొట్టెలు, కాల్చిన మాంసం. అవి ముందురోజు సరిపడా సిద్ధం చేసుకున్నప్పటికీ మరుసరిరోజుకు పాడుకావు. ఇశ్రాయేలీయులు దూరప్రాంతాలకు రోజులు ప్రయాణం చేసినప్పుడు కూడా ఇంటినుండి తెచ్చుకున్న రొట్టెలనే ఆ అన్నిరోజులూ తింటుంటారు. ఆ రొట్టెలు స్వచ్చమైన గోధుమలతో, నూనెతో చెయ్యబడి చాలారోజులు పాడుకాకుండా ఉండేవి. అంతే కాకుండా వారికి అంజూరపు ఆడపు, ద్రాక్షరసం కూడా భోజన పానీయాలుగా ఉంటాయి.

ఇక్కడ మరొక విషయం ఏంటంటే; "మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదనే" నియమం ఎవరి ఇళ్ళలో వారు వంటచేసుకోకూడదని స్పష్టంగా చెబుతుంది. కాబట్టి విశ్రాంతిదినాన ఆలయంలో లేక ప్రత్యక్షగుడారంలో అర్పించవలసిన దహన బలులకు ఇది వర్తించదు. ఆలయ సేవచేసే యాజకులు ప్రతీరోజూ దహన బలులు అర్పించవలసిందే (మత్తయి 12:5). ముఖ్యంగా రెండు ప్రధానమైన బలులను వారు ప్రతీరోజూ అర్పించాలి (నిర్గమకాండము 29:38-41 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 35:4
మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజ ముతో ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదేమనగా-

ఈ వచనం నుండి మనం మోషే దేవుడు ఆజ్ఞాపించిన ప్రత్యక్షగుడార సంబంధమైన వస్తువుల సేకరణ మరియు సేవ గురించి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం చూస్తాం.‌ మోషే మొదటిసారి నలభైరోజులు సీనాయి పర్వతంపై ఉన్నప్పుడు దేవుడు వీటిగురించి అతనికి తెలియచేసాడు (నిర్గమకాండము 25-31). కానీ ప్రజలు బంగారు దూడను చేసుకోవడాన్ని బట్టి మోషే ఈ విషయాలేమీ వారికి చెప్పకుండా మరలా నలభైరోజులు దేవునిసన్నిధిలో నిలిచి వారిపక్షంగా విజ్ఞాపన చేసాడు. ప్రస్తుతం దేవుడు ప్రజలతో సమాధానపడ్డాడు కాబట్టి, అతను ప్రత్యక్షగుడారానికి సంబంధించిన ఆ విధులను వారికి తెలియచేస్తున్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి; మోషే గతంలో ఈ ప్రజలకు దేవుని సన్నిధి వారిమధ్య నివసించే మహద్భాగ్యమైన ప్రత్యక్షగుడారం గురించి ఏమీ చెప్పకపోవడానికి వారి విగ్రహారాధనే కారణం. ఎందుకంటే దానివల్ల దేవుడు వారిమధ్య నుండి ఆయన సన్నిధిని ఉపసంహరించుకున్నాడు (నిర్గమకాండము 33:1-7 వ్యాఖ్యానం చూడండి). కానీ వారు ఆ విషయంలో మారుమనస్సు పొందారు కాబట్టి దేవుడు ఆ భాగ్యాన్ని మరలా‌ వారికి ప్రసాదిస్తున్నాడు. మన విషయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించే భాగ్యాలు మనకు దక్కకపోవడానికి మన‌ అవిధేయతే కారణమౌతుంది.

యిర్మియా 5:25 మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.

ఉదాహరణకు ఈరోజు ఎంతోమంది సంఘబోధకులు విశ్వాసుల తిరుగుబాటు మనస్తత్వాన్ని బట్టి లేక వారు తమ దురాశలకు అనుకూలమైన బోధలవైపు మొగ్గుచూపడాన్ని బట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించలేకపోతున్నారు. ఆ దిశగా క్రమశిక్షణ చెయ్యలేకపోతున్నారు. దానివల్ల వాక్యపు బోధ అనుగ్రహించే భాగ్యానికి వారు దూరమౌతున్నారు "యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి, అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి" (యెషయా 30:10,11) అని తమ‌ ప్రవర్తనతో తమ బోధకులను విసిగించిన ఇశ్రాయేలీయుల పరిస్థితి చివరికి ఏమైంది? దేవుడు వారితో ఇలా అంటున్నాడు.

యెషయా 30:12-14 అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కార మును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.

కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తపడి దేవుడు మనకు అనుగ్రహించే భాగ్యాలకు మనల్ని దూరం చేస్తున్న అవిధేయత విషయంలో మారుమనస్సు పొందాలి "నేను భూమి మీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము" (కీర్తనలు 119:19) అంటాడు భక్తుడైన దావీదు. మనం కూడా భక్తులమైతే ఆయన ఆజ్ఞలను మనకు మరుగుచేసే మన పాపపు ఆశల నుండి సాధ్యమైనంత దూరం పారిపోవాలి.

నిర్గమకాండము 35:5-9
మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,
నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.

ఈ వచనాల్లో ప్రత్యక్షగుడారానికి సంబంధించి ఇశ్రాయేలీయులు తీసుకురావలసిన అర్పణల గురించి తెలియచెయ్యబడడం మనం చూస్తాం. వీటిగురించి గతంలో నేను వివరించాను (నిర్గమకాండము 25:1-8 వ్యాఖ్యానం చూడండి). ఇక్కడ "ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము" అర్పణం తీసుకురావాలి అని చెప్పబడుతుంది. అంటే దేవుడు ఎవర్నీ బలవంతపెట్టి ఇవ్వమనడం‌ లేదు. వారి బాధ్యతగా ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి వారిమధ్య నివసించే భాగ్యమైన ప్రత్యక్షపుగుడారం కోసం వారు ఎంతో సంతోషంగా ఇచ్చేవారైయ్యుండాలి. అలా ఏం ఇవ్వాలా అనేది వారికి పుట్టిన బుద్ధిని బట్టి ఉంటుంది. మరో విషయం ఏంటంటే, ప్రస్తుతం వీరు ఏవైతే ఆయనకు ఇవ్వాలని కోరుతున్నాడో అవన్నీ ఆయన ఐగుప్తీయులకు వీరిపట్ల కటాక్షం కలుగచెయ్యడాన్ని బట్టి లభించినవే (నిర్గమకాండము 3:21,22, 12:35,36). అంటే వాటిని దేవుడే ఇచ్చాడు, అలా ఇచ్చినవాటినుండి ఆయనే కొంత అడుగుతున్నాడు. అయినప్పటికీ ఆయనేమీ బలవంతపెట్టట్లేదు. చివరికి అవి వారికి మేలు చేసేదానికోసమే‌ అడుగుతున్నా (ప్రత్యక్షగుడారం) బలవంతపెట్టట్లేదు. ఇలాంటి మంచిదేవుడికి ఆ ప్రజలు‌ ఎంతో సంతోషంగా ఇవ్వబద్ధులైయున్నారు. వారు అలానే ఇచ్చారు కూడా. దేవుడు ఇక్కడ వ్యవహరించిన ఇదే తీరును సంఘం‌ విషయంలో కూడా నియమించడం మనం చూస్తాం. అందుకే పౌలు ఇలా అంటున్నాడు.

2కోరింథీయులకు 9:7 సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

కాబట్టి మనం కూడా ఇశ్రాయేలీయుల్లానే దేవుని పరిచర్య నిమిత్తం మనస్పూర్తిగా మరియు సాధ్యమైనంతగా ఇచ్చేవారై ఉండాలి, మనకు కలిగిన సమృద్ధి అంతా ఆయన ఇస్తుందే కదా!. అలా ఇచ్చేవారికోసం ఎంత శ్రేష్టమైన‌ మాటలు రాయబడ్డాయో చూడండి.

2 కొరింథీయులకు 9:6-13 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధి పొందించును. ఇట్టి, ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరచుచున్నారు.

అయితే ఇక్కడ చిన్న స్పష్టతను ఇవ్వదలిచాను. ఆయన ఇశ్రాయేలీయులను తన సన్నిధి నిలిచే ప్రత్యక్షగుడారానికీ మరియు దాని సేవకూ ఇవ్వమన్నాడు. నూతననిబంధనలో కూడా సంఘపరిచర్యకూ, బోధకుల సాధారణ అవసరతలకూ మరియు విశ్వాసులైన బీదల అవసరాలకూ ఇవ్వమన్నాడు. కాబట్టి ఈ నియమం సోమరులైన, ధనాపేక్ష కలిగిన‌‌ బోధకుల విషయంలో వర్తించదని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అలాంటివారికి తమ విలువైన ధనాన్ని వృధాచేసుకుంటున్నవారు దేవునికి ఇచ్చినట్టుగా భ్రమపడవద్దని మనవి. అంతేకాదు మీరు అలాంటివారికి ఇవ్వడం ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకపోగా తీర్పుదినంలో ఆయనముందు దోషులుగా కూడా నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన‌ బోధకులను ఇంకా వృద్ధిచెయ్యమని దేవుడు మీకు చెప్పలేదు కదా? దానివల్ల వారి ఆగడాలు, దుర్బోధలు సంఘాన్ని ఇంకా ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. అలానే వారు నిర్మించే గొప్ప గొప్ప కట్టడాలకు కూడా ఇవ్వమని ఆయన చెప్పలేదు. ఎందుకంటే వారి బోధించేదే దుర్బోధ అయినప్పుడు ఆ నిర్మాణాలు దానిని వ్యాప్తి చెయ్యడానికే కదా! ఇందుల్లో మీ పాత్ర (కానుక) కూడా ఉంటుంది మీరూ ఆయనముందు దోషులుగా నిలబడకతప్పదు సుమా!. అందుకే దేవుడు చెప్పినట్టుగా సంఘపరిచర్యకోసం సంఘంలోని పేదలకోసం, మీకు నమ్మకంగా వాక్యాన్ని బోధించే సేవకుడి న్యాయమైన అవసరాలకోసం ఇవ్వండి. ఇంకా సాధ్యమైతే చుట్టుప్రక్కల పేదలకు కూడా సహాయం చెయ్యండి. వాక్యంలో "బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును" (సామెతలు 19:17) అని రాయబడింది. అలానే ఈమాటలు కూడా చదవండి.

గలతియులకు 6:9,10 మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.

నిర్గమకాండము 35:10
మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.

పై వచనాల్లో దేవుడు అర్పణలు ఇవ్వమన్నాడు. కానీ అర్పణలు తీసుకువచ్చినంత‌ మాత్రాన ప్రత్యక్షగుడారం‌ మరియు దాని పరిచర్య సంబంధమైన వస్తువులు తయారైపోవు. అందుకే ఆయన ఈ వచనంలో వివేకం అనగా ఆయా పనుల్లో నిపుణుత కలిగినవారంతా వచ్చి ఆయన ఆజ్ఞాపించినవి చెయ్యాలంటున్నాడు. అవేంటో క్రిందివచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. మొదట ఇవ్వమన్నాడు, రెండవదిగా పని చెయ్యమంటున్నాడు. అందరూ ఇవ్వలేకపోవచ్చు, అందరూ పని చేసే నిపుణుత కలిగియుండకపోవచ్చు. కానీ రెండింటిలో ఏదోటి ఐతే చెయ్యగలరు. కొందరైతే రెండూ‌ చెయ్యగలరు. కాబట్టి దేవునికోసం అనగా ఆయన పరిచర్యకోసం మనం ఎలాంటి పరిధిలూ లేకుండా ప్రవర్తించగలగాలి.‌ ప్రతీవారం కానుక ఇస్తున్నాం కాబట్టి మేము పని చెయ్యక్కర్లేదని కానీ, మేము పని చేస్తున్నాం కాబట్టి కానుక ఇవ్వక్కర్లేదు అని కానీ ఆలోచించకూడదు. రెండూ చెయ్యగలిగినప్పుడు రెండూ చెయ్యాలి, మనస్పూర్తిగా మరియు శక్తివంఛన లేకుండా చెయ్యాలి. అపోస్తలుల జీవితాలను చూడండి. వారు ప్రభువుకోసం అన్నీ విడిచిపెట్టుకోవడం మాత్రమే కాదు ఆయనకోసం శక్తివంఛన లేకుండా పని చేసారు. ప్రారంభసంఘాన్ని చూడండి, వారు తమకు కలిగింది అంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడమే కాదు ప్రయాసతో సువార్త ప్రకటించారు. ఉదాహరణకు బర్నబా (అపొ.కా 4:36,37, 13:2). ఈక్రమంలో‌ వారు తమ‌ ప్రాణాలను కూడా కోల్పోయారు‌. మరి వారితో పోల్చుకున్నప్పుడు మనం చేస్తుంది ఎంత? ఇంకా చెయ్యవలసింది ఎంత? అందుకే కనీసం మన ధన, ప్రయాసలైనా ఆయనకోసం వెచ్చిద్దాం.

నిర్గమకాండము 35:11-19
అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు. మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పుతెర, బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు, వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిర ద్వార మున ద్వారమునకు తెర. దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్ర ములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.

ఈ వచనాల్లో ఇశ్రాయేలీయుల్లోని వివేక హృదయులంతా చెయ్యవలసిన వస్తువుల గురించి తెలియచెయ్యబడడం మనం చూస్తాం. ఇవన్నీ ప్రత్యక్షగుడారం మరియు దాని సంబంధమైన వస్తువులు. వీటి గురించి ఇప్పటికే నేను‌ వివరించాను, మీరు చదివితే అవి వేటికి ఛాయలుగా నిర్ణయించబడ్డాయో కూడా స్పష్టంగా అర్థమౌతుంది (నిర్గమకాండము 25, 26, 27, 28, 29, 30 వ్యాఖ్యానాలు చూడండి).

ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తలచుకుంటే ప్రత్యక్ష గుడారాన్ని మరియు దాని సేవా వస్తువులను మోషే పగలగొట్టిన పది ఆజ్ఞల పలకలవలే తయారు చేసి ఇవ్వగలడు. కానీ ఆయన అలా చెయ్యట్లేదు. అవి తయారు చెయ్యవలసిన బాధ్యతను వారిపైనే పెడుతున్నాడు. కానీ ఎలా తయారు చెయ్యాలో, వేటితో తయారు చెయ్యాలో ఆయనే చెప్పాడు (నిర్గమకాండము 25-30), ఆ తయారీకి కావలసిన బంగారం వెండి మొదలైన వస్తువులన్నీ ఐగుప్తీయులనుండి ఆయనే వీరికి సమకూర్చాడు. తయారు చెయ్యవలసిన జ్ఞానం, శక్తి కూడా ఆయనే అనుగ్రహించాడు (నిర్గమకాండము 31). అవన్నీ సమకూర్చిన తరువాతనే ఆయన‌ చెప్పినట్టుగా తయారు చెయ్యవలసిన బాధ్యతను వారిపై మోపుతున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులకు ఈ బాధ్యత దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత, ఎందుకంటే వారు ఆ పనులు చెయ్యడం వల్ల దేవుని మహిమ‌ వారి మధ్య నివసించడమే కాదు. అరణ్యంలో ఉండి అంతగొప్ప వస్తువులను తయారుచెయ్యగలిగారనే కీర్తి కూడా చుట్టుప్రక్కల ప్రజలద్వారా వీరికి కలుగుతుంది.

అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏదో కష్టమైన పని చెయ్యమని చెప్పేవాడు మాత్రమే కాదుకానీ ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యగల సామర్థ్యాన్ని కూడా ఆయనే అనుగ్రహించే దేవుడని గుర్తిస్తున్నాం. అందుకే ఆయనకోసం ఎంతో ప్రయాసపడిన, ఎన్నో బలమైన కార్యాలు చేసిన పౌలు "మా వలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది" ("2కోరింథీయులకు 3:5), "అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను" (కొలస్సీయులకు 1:29) అంటున్నాడు. బైబిల్ భక్తులందరూ‌ తమ‌ విజయవంతమైన పరిచర్యవిషయంలో ఇలాంటి ఆలోచననే కలిగియున్నారు. దీనిని మనపై ఆయన మోపిన సువార్త ప్రకటనా బాధ్యతా విషయంలో కూడా అన్వయించుకోవాలి. మన మరియు అనేకుల రక్షణ కొరకు సువార్తను ఆయనే‌ వెలుగులోకి తీసుకువచ్చాడు. దానికి అవసరమైన శక్తి జ్ఞానాలను ఆయనే మనకు అనుగ్రహించాడు. వాటిద్వారా ప్రయాసపడి ఆ సువార్తను ప్రకటించవలసిన‌ బాధ్యతను మాత్రం ఆయన మనపైనే మోపాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల్లా మనం దానికోసం‌ ప్రయాసపడగలగాలి. నిజానికి ఈ బాధ్యత మనకు ఆయన అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఆయనే అన్నీ ఇచ్చి, కేవలం‌ ఆ పనిలో మనం సాధనాలుగా మాత్రమే వాడబడిన కారణంచేత విలువైన బహుమానం మనకు అనుగ్రహించబోతున్నాడు. పైగా మనద్వారా రక్షించబడినవారి దృష్టిలో మనకు గొప్ప గౌరవాన్ని కలుగచేస్తున్నాడు. గ్రామాల్లో వరి చేలు కోసేటప్పుడు ఎవరి కొడవలి వారే తెచ్చుకోవాలి, ఎవరి భోజనం వారే సిద్ధపరచుకుని రావాలి. చేను యజమానికి వాటితో ఏ సంబంధం ఉండదు. అతను‌ కేవలం పని చేసినందుకు జీతం మాత్రమే ఇస్తాడు. కానీ మన పరలోకపు వ్యవసాయకుడైన దేవుడు మాత్రం అలా కాదు. ఆయనే కొడవలిని ఇస్తున్నాడు, చేనును ఎలా కొయ్యాలో చెబుతున్నాడు. కోసే శక్తిని ఇస్తున్నాడు, భోజనాన్ని (వనరులను) సిద్ధపరుస్తున్నాడు. మళ్ళీ యధావిధిగా జీతాన్ని కూడా ఇస్తున్నాడు. ఇలాంటి సువార్త పనిలో నియమించబడడం నిజంగా ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతే కదా!

లూకా 10:2 పంపినప్పుడాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.

నిర్గమకాండము 35:20
ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.

ఈ వచనంలో అప్పటివరకూ మోషే మాటలు విన్నటువంటి ప్రజలు అతని ఎదుటనుండి వెడలిపోవడం మనం చూస్తాం. వెడలిపోయారు అంటే మోషే చెప్పినట్టుగా చెయ్యడానికి సిద్ధపడి అక్కడినుండి వెళ్ళారని అర్థం. క్రింది వచనాల ప్రకారం వారు తమలో కలిగిన ఆసక్తి చల్లారకముందే ఆ అర్పణలన్నిటినీ మోషే దగ్గరకు తీసుకువచ్చారు. ఈరోజు వాక్యం వింటున్నవారందరూ కూడా ఈవిధంగా ఆసక్తి చూపించగలిగితే వారికి ఎంతో శ్రేయష్కరం. కాబట్టి మనం‌ కూడా దేవుని వాక్యాన్ని బట్టి దేవునికోసం ఏదైనా చెయ్యాలనే ప్రేరణను కలిగియున్నప్పుడు సంఘపెద్దల సలహా మరియు సహకారాలతో ఆలస్యం చెయ్యకుండా దానిని తలపెట్టాలి. దేవునిపై ఆధారపడి దానిని పూర్తిచెయ్యగలగాలి. ఆలస్యం చేసామో‌ మనలోని పతనస్వభావం మరియు గర్జించు సింహం‌ వలే తిరుగుతున్న అపవాది యొక్క శోధనలు మనల్ని ఆటంకపచడంలో విజయవంతమౌతాయి.

నిర్గమకాండము 35:21
తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినట్టుగానే అర్పణలు తీసుకురావడం మనం చూస్తాం.‌ దేవుడు చెప్పినట్టుగా తీసుకురావడమే కాదు దేవుడు చెప్పినపద్ధతిలో అనగా మనస్పూర్తిగా వారు తీసుకువచ్చారు. అందుకే "ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో" అని రాయబడింది. ఇంతకూ వారి హృదయం వారికి ఎందుకు రేపింది? వారి మనస్సు వారిని ఎందుకు ప్రేరేపించిందంటే, దీనికి రెండు కోణాల్లో వివరిస్తాను‌.

1. నేను పైన చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కఠినమైన బానిసత్వంలో ఉండేవారు‌. వారి కష్టానికి న్యాయంగా రావలసిన సొమ్ము వారికి దక్కేది కాదు. అలాంటి సమయంలో దేవుడు వారిపై జాలిపడి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడమే కాకుండా అప్పటివరకూ వారు పడిన కష్టానికి న్యాయంగా రావలసిందంతా ఐగుప్తీయుల దగ్గరనుండి వసూలు చేసి వారికి అప్పగించాడు. అలాంటి దేవుడు తన సన్నిధిని వారిమధ్యన ఉంచడానికి (అది కూడా వారి ప్రయోజనార్థం) అవసరమైన మాధ్యమం కోసం అర్పణలు కోరాడు. పైగా ఎలాంటి బలవంతం చెయ్యకుండా స్వేచ్ఛగా ఇవ్వమని కోరాడు. విశ్రాంతిదినం మీరినవాడికి మరణశిక్ష అన్నట్టుగా అర్పణ తేనివాడికి పలానా శిక్ష విధించబడును అని బెదిరించలేదు. ఇవన్నీ ఆలోచించినప్పుడు అలాంటి మంచి దేవునికి అర్పణలు ఇవ్వాలని ఎవరి హృదయం మాత్రం రేగకుండా ఉంటుంది? ఎవరి మనస్సు మాత్రం ప్రేరేపించబడకుండా ఉంటుంది? అందుకే వారు తమలో కలిగిన ఆ ప్రేరేపణను బట్టి ఇవ్వాలనుకుంది అంతా ఆయనకు ఇచ్చారు.

ఇక్కడ వీరు కనుపరచిన‌ మాదిరి మనకు కూడా ఎంతో ప్రేరేపణగా ఉంది. ఎందుకంటే పాపమనే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. మన పాపానికి న్యాయబద్ధంగా రావలసిన ఉగ్రత అనే జీతాన్ని తన కుమారుడిపై మోపి ఆయనను మనకోసం బలిగా అర్పించాడు. ఇదంతా ఆలోచించినప్పుడు మన హృదయం కూడా ఆయనను హత్తుకునేలా, ఆయన కోసం గొప్ప కార్యాలు చేసేలా ప్రేరేపించట్లేదా? తప్పకుండా ప్రేరేపిస్తుంది కదా! అందుకే పౌలు "క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది" (2కోరింథీయులకు) అంటున్నాడు. కాబట్టి దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి.

2. పతనస్వభావియైన మానవుడు దేవుని కార్యాలపై తనకు తానుగా ఆసక్తి చూపించలేడు, ఎందుకంటే అతని హృదయం ఘోరమైన వ్యాధికలిగి దేవుని నియమాలను ఎదిరిస్తూ ఉంటుంది. కానీ దేవుడు తాను కోరుకున్న ప్రజల హృదయాలను తన చిత్తానికి అనుకూలంగా నియంత్రించి తన కార్యాన్ని నెరవేర్చుకోగలడు. అందుకే పౌలు "మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము" (2కోరింథీయులకు 8:16) అంటాడు. అంటే తన చిత్తానికి అనుకూలమైన మానసిక, హృదయ ప్రేరేపణలకు ఆయనే కారణం.

నిర్గమకాండము 35:22-29
స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళ ములను, సమస్తవిధమైన బంగారు వస్తువులనుతెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలనువడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

ఈ వచనాల్లో ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణల వివరాలను మనం చదువుతాం. ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించినవే. ఇక్కడ నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేస్తాను.

1. ఇశ్రాయేలీయులు తీసుకువచ్చినవన్నీ ఒకే రకమైన విలువ కలవి కావు. కొందరు చాలా విలువైన వజ్రాలు తీసుకువచ్చారు. కొందరు విలువైన బంగారం తీసుకువచ్చారు కొందరు ఇంకొంచెం తక్కువ విలువైన వెండిని ఇత్తడిని తీసుకువచ్చారు. మరికొందరైతే తుమ్మ కర్రనూ చర్మపు తోళ్ళనూ నార చాపలనూ తీసుకువచ్చారు. వీరు తీసుకువచ్చిన వాటి విలువల మధ్య చాలా వృత్యాసం ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రత్యక్షగుడారానికీ మరియు ఇతర వస్తువుల తయారికీ ఉపయోగించారు. లేఖనంలో కూడా విలువైన వాటిని పేర్కొని విలువ తక్కువవాటిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే అన్నీ అవసరమైనవే. ముఖ్యంగా వారందరూ తమకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి తీసుకువచ్చారు, మనస్పూర్తిగా తీసుకువచ్చారు. కాబట్టి అవన్నీ సమానంగా గౌరవించతగినవే. సంఘపరిచర్యలో మన పాత్ర కూడా ఇంతే. దేవుడు మనం ఎంత గొప్పగా చేస్తున్నాం, ఎంత విలువైనవి ఇస్తున్నాం అని కాదు, మన సామర్థ్యం కొద్దీ ఇస్తున్నామా శక్తివంఛన లేకుండా మనస్పూర్తిగా చేస్తున్నామా అనేదే చూస్తాడు. దానిని బట్టే మనకు సమానమైన జీతాన్ని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు పేద విధవరాలి విషయంలో ఆయన పలికిన మాటలు చూడండి (మార్కు 12:42-44). ఆమె తన లేమిలో తనకున్నదంతా ఆయనకు సమర్పించింది. కాబట్టి ఆయన ఆమె వేసినదానిని ధనికులు వేసినదానికంటే ఎక్కువగా చూసాడు. మాసిదోనియా సంఘస్తులు కూడా తమ సామర్థ్యానికి మించి ఇచ్చి పౌలు‌ చేత ప్రశంసించబడ్డారు (2 కొరింథీ 8:4).

విలువైన వజ్రాలు వెండి బంగారాలను తీసుకువస్తున్న వారిని చూసి, విలువ తక్కువాటిని తీసుకువచ్చిన ఇశ్రాయేలీయులు సిగ్గుపడలేదుగా? ఆ సిగ్గును బట్టి ఆ విలువ తక్కువవాటిని ఇవ్వకుండా ఆగిపోలేదు కదా? అలా చేసుంటే ప్రత్యక్షగుడారం పూర్తయ్యేది కాదు. ఎందుకంటే, బంగారం వెండి ఇత్తడితో గుడారపు పైకప్పు వెయ్యలేం, తెరలు చెయ్యలేం, తుమ్మకర్ర లేకుండా మోతకర్రలూ స్థంబాలూ బలిపీఠం మందసం బల్ల ఇవేమీ చెయ్యలేం. ధారం లేకుండా వస్త్రాలు కుట్టలేం. ఈవిధంగా విలువతక్కువ వాటిని కూడా ఆయన విలువైనవాటితో పాటుగా వాడుకున్నాడు. ప్రత్యక్షగుడారం మరియు దాని సేవా వస్తువుల తయారీలో అవన్నీ వాటివాటి పాత్రను పోషించాయి. కాబట్టి మనం కూడా సంఘానికి ఇతరులకంటే తక్కువగా ఇస్తున్నామని సిగ్గుపడకూడదు, ఆ సిగ్గుతో అసలు ఇవ్వకుండా ఆగిపోకూడదు. నేను పైన చెప్పినట్టుగా దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి మనస్పూర్తిగా ఇస్తున్నామా లేదా అనేది చూస్తాడు తప్ప, ఎంత ఇస్తున్నాం అని‌ కాదు. అలా చూడడానికి, మనం ఇచ్చినవాటి విలువను బట్టి మనకు విలువ కట్టడానికి ఆయన పకృతిసంబంధియైన మనిషి కాదు. ఈ నియమం నేను కానుకల విషయంలోనే కాదు పరిచర్య విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సంఘంలో మీ పాత్ర చిన్నదే కావొచ్చు కానీ, సంఘపాత్రలలో మీరున్నారా? మీరున్న పాత్రలో వాక్యానుసారంగా కొనసాగుతున్నారా అనేదే ప్రాముఖ్యం. అందుకే పౌలు ఇలా అంటాడు.

1 కొరింథీయులకు 12:5-24 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియునేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

ఈ నియమాన్ని సంఘనాయకులు కూడా మనసులో పెట్టుకుని సామర్థ్యలేమితో ఎక్కువ కానుక ఇవ్వలేని, ఘనమైన పాత్రల్లో కొనసాగలేని విశ్వాసులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలి. లేదంటే పకృతి సంబంధులకూ మీకూ ఏ వ్యత్యాసం ఉండదు. అప్పుడు మీరు అపరాధులను తీర్పుతీర్చబడతారు (యాకోబు 2:1-9).

2. ఇక్కడ స్త్రీలు కూడా తాము చెయ్యగలిగినవి చేసి అర్పణగా తీసుకురావడం మనం చూస్తాం "స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి". ఈ స్త్రీలు పురుషుల‌ వలే చుట్టుప్రక్కల అడవుల్లోకి వెళ్ళి తుమ్మకర్రను కొట్టుకురాలేకపోవచ్చు కానీ వారు చెయ్యగలిగింది చేసారు, అలానే వారికి ఇష్టమైన ఆభరణాలను కూడా కానుకగా ఇచ్చారు. కాబట్టి సంఘ బాధ్యతల్లో స్త్రీలు అనీ పురుషులు అనీ బేధం లేకుండా ఎవరు చెయ్యగలిగింది, అనగా దేవుడు వారికి విభజించియిచ్చిన పనులను శక్తివంఛన లేకుండా చెయ్యగలగాలి (ఇది బలహీనులకు కూడా వర్తిస్తుంది). సువార్త పరిచర్యలో పౌలుతో కొందరు స్త్రీలు కూడా ప్రయాసపడినట్టు మనం చదువుతాం (ఫిలిప్పీ 4:3). అయితే పైన దేవుడు విభజించియిచ్చిన అని ఎందుకు అన్నానంటే, మొదటినుండీ దేవుడు స్త్రీ పురుషులకు అప్పగించిన బాధ్యతలు కొన్ని వేరుగానే ఉన్నాయి. శారీరక స్వభావంలో కూడా మనం దానిని గమనిస్తాం. అలానే సంఘపరంగా కూడా స్త్రీకి, స్త్రీ పురుషులు కలసిఉన్న మిశ్రిత సమాజంలో బోధించడం నిషేధించబడింది. అయినప్పటికీ వారికి ఆయనిచ్చే బహుమానంలో దానిని బట్టి ఎలాంటి తగ్గింపూ ఉండదు. ఇది వివక్షను కూడా సూచించదు. దీనిగురించి ఈ వ్యాసం చదవండి.

బైబిల్ దేవుడికి‌ స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

3. ఇశ్రాయేలీయుల్లో అర్పణలు తేకుండా లేక ప్రత్యక్షగుడారం కోసం పని చెయ్యకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అందుకే "ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో" అని రాయబడింది. ఒకవేళ అందరూ అర్పణలు తెస్తే లేక తేలేనివారు పని చేస్తే ఇలా కాకుండా ఇశ్రాయేలీయులందరూ అర్పణలు తెచ్చారు లేక పనిచేసారు అని రాయబడేది. గమనించండి, గతంలో అహరోను చెవిపోగులను అడిగినప్పుడు కూడా ఇశ్రాయేలీయులందరూ ఇవ్వలేదు. అలానే ఇప్పుడు మోషే ఇవ్వమన్నప్పుడు కూడా ఇశ్రాయేలీయులందరూ ఇవ్వట్లేదు. అప్పుడు అహరోనుకు దుష్టసంఘం ఇచ్చింది, ఇప్పుడు మోషేకు మంచి సంఘం ఇస్తుంది. నేటి సంఘంలో కూడా ఇవ్వగలిగియుండి దేవునికి ఏమీ ఇవ్వని, చెయ్యగలిగియుండి కూడా దేవునికోసం ఏమీ చెయ్యనివారు ఉంటూనే ఉంటారు. వారికి సంఘపరిచర్య కంటే తన ధనం ముఖ్యం, దేవునికోసం ప్రయాసపడడం కంటే సుఖంగా విశ్రాంతిలో ఉండడం ముఖ్యం. వీరిని ప్రభువు "నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే" (ప్రకటన 3:1) అని సంబోధించాడు. కాబట్టి అలాంటివారిని చూసి మనం నిరూత్సాహపడకూడదు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వారు చేసిన పనులను బట్టి ప్రతివానికీ ఇవ్వవలసిన వాని వాని జీతం ఆయనయొద్ద ఉన్నది.

మార్కు 9:41 మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

నిర్గమకాండము 35:30-33
మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.

ఈ వచనాల్లో దేవుడు ప్రత్యక్షగుడారం మరియు దాని పరిచర్య సంబంధమైన వస్తువులను తయారు చెయ్యడానికి బెసలేలును ఏర్పాటు చేసుకుని అతన్ని ఆత్మతో నింపినట్టు మనం చూస్తాం. ఇతని గురించీ మరియు అతను ఆత్మతో నింపబడడం గురించీ ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 31:1-5 వ్యాఖ్యానం చూడండి). ఐతే ఈ బెసలేలు దేవుని ఆత్మతో జ్ఞానం తో నింపబడింది కేవలం పని చెయ్యడానికి మాత్రమే కాదు. అతను తన‌ పని చేస్తూ ఇతరులు చెయ్యవలసిన పనులను కూడా నిర్దేశించాలి, వారి పనులను పర్యవేక్షిస్తుండాలి. అంటే తన జ్ఞానాన్ని వారికి పంచాలి. కాబట్టి దేవుని ఆత్మతో జ్ఞానంతో నింపబడిన నాయకులు ఇతరులకు పనులు చెప్పడమే కాదు, తాము కూడా పని చెయ్యాలి. అలానే తాము పని చేస్తేనే సరిపోదు ఇతరులు కూడా పని చేసేలా తమ జ్ఞానాన్ని వారికి పంచగలగాలి, వారి పనులను పర్యవేక్షిస్తుండాలి. నాయకుడిగా పిలవబడడమంటే ఇన్ని బాధ్యతలను మొయ్యవలసియుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున సువార్తకు పంపినప్పుడు ఆయనేమీ విశ్రాంతి తీసుకోలేదు, తన వద్దకు వచ్చేవారికి బోధిస్తూనే ఉన్నాడు. మళ్ళీ 11వ అధ్యాయంలో ఆ శిష్యులు ప్రయాణం‌చేసిన ప్రదేశాలను తానూ దర్శించి వారి పనిని కూడా పర్యవేక్షించాడు.

నిర్గమకాండము 35:34
అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీ యాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.

ఈ వచనంలో దేవుడు బెసలేలుకు అహోలీయాబును సహకారిగా నియమించడం మనం చూస్తాం. సంఘంలో కూడా ఆయన తన పరిచర్య విజయవంతగా జరిగేనిమిత్తం మనకు సహకారులను జతచేస్తూ ఉంటాడు. దీని గురించి ఇప్పటికే నేను‌ వివరించాను (నిర్గమకాండము 31:6 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 35:35
చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణముల తోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

ఇప్పుడు మోషే నిర్మించబోతున్న ప్రత్యక్షగుడారానికి అవసరమైన వస్తువులన్నీ చాలామట్టుకు ఐగుప్తుకు చెందినవి (తుమ్మకర్ర మరియు చర్మాలు తప్ప). అలానే వారు ఇప్పుడు తయారు చెయ్యబోతున్న వస్తువుల తయారికీ అవసరమైన పనిముట్లు కూడా ఐగుప్తునుండి తెచ్చుకున్నవే. దేవుని ప్రత్యేకజ్ఞానంతో చెయ్యబడినవి తప్ప మిగిలిన వస్తువుల తయారీలో వారు కలిగియున్న నిపుణుత కూడా వారికి‌ ఐగుప్తునుండి సంక్రమించిందే. కానీ వారు ఐగుప్తులో ఎప్పుడైనా మేము ఇక్కడ నేర్చుకున్న పని, మా కష్టాన్ని బట్టి ఇవ్వబడిన జీతం, మా పనిముట్లు ప్రత్యక్షగుడార నిర్మాణానికి ఉపయోగపడతాయని ఊహించియుంటారా? ఉండరు కదా! "భూమియూ దాని సంపూర్ణతయూ యెహోవాయే" అయినప్పుడు మనం ఎక్కడ నేర్చుకున్నా, ఎక్కడ ఏం సంపాదించినా (నైతికపరంగా) వాటిని ఆయన తన కార్యం నిమిత్తం వాడుకోగలడు. కాబట్టి ఈరోజు వివిధరకాలైన జ్ఞానం, మరియు వనరులు కలిగిన విశ్వాసులందరూ సంఘక్షేమాభివృద్ధి కోసం వాటిని ఉపయోగించాలి. అందుకోసమే ఆయన మనకు అవన్నీ అనుగ్రహించాడు.

కొలస్సీయులకు 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.