పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 33:1, 33:2, 33:3 , 33:4, 33:5 , 33:6 ,33:7 , 33:8-10 , 33:11 , 33:12,13 , 33:14 , 33:15 , 33:16 , 33:17,18 , 33:19,20 , 33:21-23 .

 

నిర్గమకాండము 33:1
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.

గత అధ్యాయంలో ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించాక దేవుడు వారిపై ఆగ్రహించడం, మోషే ప్రజల తరపున విజ్ఞాపన చెయ్యడం, అప్పుడు దేవుడు వారిని నాశనం చెయ్యకుండా మోషేతో వారిని కనానుకు తోడుకునిపోమనడం మనం చూసాం. అవే మాటలను మరలా ఈ వచనంలో చదువుతున్నాం. అయితే ఇప్పుడు కూడా దేవుడు వారిని "నీ ప్రజలు" అనే అంటున్నాడు తప్ప నా ప్రజలు అనడం లేదు. దానికి కారణమేంటో గత అధ్యాయంలో నేను వివరించాను. దీనిని బట్టి మోషే విజ్ఞాపన కారణంగా ఆయన ఆ ప్రజలను అప్పుడు నాశనం చెయ్యనప్పటికీ వారు చేసిన ఆ పాపాన్ని బట్టి ఆయనతో వారికి కలిగిన యెడబాటు, ఆగ్రహం ఇంకా అలానే ఉందని మనకు అర్థమౌతుంది. అయినప్పటికీ ఆయన ఇక్కడ అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు.

నిర్గమకాండము 33:2
నేను నీకు ముందుగా దూతను పంపి కనానీ యులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.

ఈ వచనంలో దేవుడు మోషేతో నీకు ముందుగా ఒక దూతను పంపి ఆ దూత ద్వారా కనాను ప్రాంతంలో నివసిస్తున్న ప్రాముఖ్యమైన జాతులను అక్కడినుండి వెళ్ళగొడతానని సెలవివ్వడం మనం చూస్తాం. ఆయన ఎందుకని దూతను పంపవలసి వస్తుందో క్రింది వచనాల్లో వివరిస్తున్నాడు.

నిర్గమకాండము 33:3,5 - మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు‌. ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను.

ఈ మాటల ప్రకారం; ఇశ్రాయేలీయులు ఆయనపట్ల తిరుగుబాటు చేసే స్వభావం కలిగినవారు కాబట్టి, ఆ తిరుగుబాటును ఆయన న్యాయం సహించలేదు కాబట్టి, ఆ న్యాయాన్ని బట్టి వారు నశించిపోకుండా ఆయన దూతను పంపుతున్నాడు. ఆయన వారితో రానంటున్నాడు. ఇక్కడ ఈ దూత గురించి మనం పరిశీలించాలి. ఈ దూత "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది" (నిర్గమకాండము 23:20,21) అని గతంలో వాగ్దానం చెయ్యబడిన యెహోవా నామాన్ని కలిగిన యెహోవా దూత కాదు. ఎందుకంటే అప్పటినుండి ఆ దూతనే ఇశ్రాయేలీయులను ఇక్కడిదాకా నడిపించాడు. ఆ దూతనే ఇప్పటివరకూ యెహోవాగా మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యెహోవానే. ఆయనే క్రిందివచనాల్లో మోషే వేడుకోలును బట్టి చివరికి ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించాడు.

న్యాయాధిపతులు 2:1 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకు వచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

ఈ దూత గురించి మరింత‌ వివరంగా, కొందరికి సాధారణంగా కలిగే అభ్యంతరాలకు సమాధానాలను సహా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత యేసుక్రీస్తు

కానీ ఇప్పుడు దేవుడు (ఇప్పటివరకూ వారిని నడిపించిన యెహోవా దూత) వారు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను వారితో రానని, అయితే తాను వాగ్దానం చేసిన దేశానికి వారిని నడిపించడానికి వేరొక దూతను పంపుతానని, ఎవరో ఒక దేవదూత కోసం మాట్లాడుతున్నాడు. అందుకే మోషే దానికి ఒప్పుకోకుండా అభ్యంతరం చెబుతున్నాడు.

నిర్గమకాండము 33:15,16 మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము. నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.

కానీ గతంలో తండ్రియైన దేవుడు ఇప్పుడు తనతో మాట్లాడుతున్న యెహోవా దూతను పంపుతాను అన్నప్పుడు అతను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే తండ్రియైన దేవుడు వారికి ముందుగా పంపిస్తున్న దూత, ఇప్పటివరకూ మోషేతో మాట్లాడిన, మాట్లాడుతున్న ఆ దూత త్రిత్వమైన దేవునిలో రెండవవ్యక్తిగా ఉన్న యెహోవా అని అతనికి బాగా తెలుసు. దీనికి ఇంకొంచెం స్పష్టతను ఇస్తాను. గతంలో తండ్రియైన దేవుడు "నీకు ముందుగా ఒక దూతను పంపుతాను, నా నామం ఆయనకు ఉన్నది" అని చెప్పినప్పుడు మోషేకు ఆ దూత విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దూతకు తండ్రి నామమైన యెహోవా నామం ఉంది. కానీ ఇప్పుడు ఆయన వేరొక దూతను పంపిస్తాను అంటున్నప్పుడు మాత్రం ఏమంటున్నాడో చూడండి.

నిర్గమకాండము 33:12 మోషే యెహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు.

ఈమాటల్లో మోషే దేవుడు పంపుతానన్న దూత ఎవరో తనకు తెలియదు అన్నట్టుగా అభ్యంతరం చెబుతున్నాడు. ఎందుకంటే ఆ దూత సాధారణదూతయని అతనికి అర్థమైంది. అందుకే అతను వద్దు నువ్వే మాతో రా అని ఆయనను బ్రతిమిలాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు పంపుతానంటున్న దూత గతంలో వాగ్దానం చెయ్యబడిన యెహోవా దూత కాదు. ఆ యెహోవా దూతనే యెహోవాగా ఇంతవరకూ ప్రజలను నడిపించాడు, మోషేతో నలబై రోజులు సీనాయి పర్వతంపై మాట్లాడాడు. ఆ యెహోవా దూతనే ఇశ్రాయేలీయులు దూడను చేసుకున్నప్పుడు వారిపై ఆగ్రహించి వారిని నాశనం చెయ్యబోయాడు. "ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది"

నిర్గమకాండము 33:3 
మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను. త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో తాను వెళ్ళకుండా వేరే దూతను పంపిస్తాననడానికి కారణాన్ని తెలియచెయ్యడం మనం చూస్తాం. వారు స్వభావరీత్యా మరియు క్రియలమూలంగా ఆయనకు లోబడనొల్లని ప్రజలు‌ కాబట్టి వారిని ఆయన న్యాయం సహించలేదు. వారిపై ఉగ్రతను కుమ్మరిస్తుంది. దేవుడు అత్యంత కృప కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు అన్నప్పుడు పాపాన్ని సహించేవాడని అర్థం కాదు. ఆయన న్యాయవంతుడు, న్యాయంగా పాపానికి శిక్ష విధించే పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఆయనగురించి ఇలా రాయబడింది.

హబక్కూకు 1:13 నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా-

దేవుని సన్నిధి యెదుట (ఆయన తమతో తమలో ఉన్నప్పుడు) పాపం చెయ్యడం, దేవుని సన్నిధికి వెలుపల (ఆయన తమతో తమలో లేనప్పుడు) పాపం చెయ్యడంలో తీవ్రతలు వేరేలా ఉంటాయి. రెండూ పాపాలే అయినప్పటికీ దేవుని సన్నిధియెదుటే పాపం‌ చెయ్యడం తీవ్రమైనదిగా, ఆయనను ఘోరంగా అవమానించడంగా ఎంచబడుతుంది. అది ఆయన సహించలేడు, అప్పుడు న్యాయబద్ధంగా తన ఉగ్రతను కుమ్మరించవలసి‌ ఉంటుంది. అందుకే ఆయన ఇశ్రాయేలీయులతో తాను వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఒక దూతను మాత్రమే పంపుతానంటున్నాడు. అప్పుడు వారు పాపం చేసినప్పటికీ ఆయన సన్నిధికి వెలుపల ఉండి చేస్తున్నట్టుగా ఎంచబడుతుంది. విశ్వాసులమైన మనమంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఆయన సన్నిధి మనతోనే ఉంది కాబట్టి, ఆయన మనలో మనతో నివసిస్తున్నాడు కాబట్టి, మనం చేసే ప్రతీపాపం చాలా తీవ్రంగా, ఆయనను అవమానించడంగా ఎంచబడుతుంది. ఇప్పటికే మనవిషయంలో ఇలా లెక్కలేనన్నిసార్లు జరిగుంటుంది. కానీ యేసుక్రీస్తు తన సిలువ మరణం ద్వారా విజ్ఞాపన ద్వారా ఆయన న్యాయానికి పరిహారం చెల్లిస్తుండడాన్ని బట్టి నేటికీ మనం సజీవులంగా కాపాడబడుతున్నాం. కానీ ఆయనను ఎంతో బాధకు గురిచేస్తున్నాం. ఎందుకంటే "ఆయన కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది"

ఎఫెసీయులకు 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

కాబట్టి ఆయనను దుఃఖానికి గురిచేసే మన పాపంపై మనకు అసహ్యం‌ కలగాలి. అందుకే పేతురు ఇలా అంటున్నాడు. "మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును" (1పేతురు 4:3). ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధి మనతో మనలో ఉంది.

అదేవిధంగా ఇశ్రాయేలీయులతో ఆయన రాను అని చెప్పడంలో వారిపట్ల ఆయన జాలిని కూడా మనం గమనిస్తున్నాం. ఒకవైపు ఆయన ఇశ్రాయేలీయుల పాపం కారణంగా ఆయనకు కలిగిన కోపాన్ని బట్టి వారి మధ్యనుండి తన సన్నిధిని ఉపసంహరించుకుంటూనే, ఆ సన్నిధి వారిమధ్యన ఉంటే న్యాయబద్ధంగా వారికి కలిగే నాశనం కలుగకుండా కూడా అలా చేస్తున్నాడు. తన సన్నిధిని వారి మధ్య నుండి ఉపసంహరించుకుంటున్నాడు. "కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము" (హబక్కూకు 3:2) అని భక్తుడు ప్రార్థించింది ఇందుకే. కాబట్టి మనం ఆయన కోపంలో కూడా వాత్సల్యాన్ని చూడగలగాలి. ఆయన కోపం శాంతించేలా మన ప్రవర్తనను మార్చుకోవాలి. క్రింది వచనాల్లో ఇశ్రాయేలీయులు అదేగా చేస్తున్నారు.

నిర్గమకాండము 33:4
ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు మోషేతో దేవుడు పలికిన మాటలు తెలుసుకుని దుఃఖించడం మనం చూస్తాం. దానికి గుర్తుగా నినెవే ప్రజలు తమ వస్త్రాలను తీసివేసి గోనెబట్టలు ధరించుకున్నట్టుగా వీరు తమ ఆభరణాలు తీసివేసి ఆయన ముందు తమ తగ్గింపును చాటుకుంటున్నారు. దీనిని బట్టి ఆ ప్రజలు నిజంగానే తమ పాపం విషయంలో మారుమనస్సు పొందినట్టుగా మనం గమనిస్తున్నాం, క్రింది వచనాల్లో కూడా ఆ విషయం మనకు స్పష్టమౌతుంది. ఈ విషయంలో తప్పకుండా మనం ఇశ్రాయేలీయుల‌ మాదిరిని అనుసరించాలి. వారు గతంలో తిరుగుబాటు చేసి ఘోరపాపం చేసినప్పటికీ దేవుని తీర్పును వినగానే పశ్చాత్తాపపడ్డారు. మనం కూడా ఆయన దృష్టికి ఏదైనా తిరుగుబాటు చేసినప్పుడు వాక్యం ద్వారా బోధకుల ద్వారా ఆయన చేస్తున్న హెచ్చరికలకు లోబడి పూర్ణమనస్సుతో పశ్చాత్తాపపడాలి. ముఖ్యంగా మరలా ఆ పాపం జోలికి పోకూడదు‌. ఇశ్రాయేలీయులు నిజంగా మారుమనస్సు పొందినప్పటికీ ఈ విషయంలో వారు నిలకడగా ఉండలేకపోయారు. అందుకే ఆయన తీర్పులు పదేపదే వారిపై కుమ్మరించబడ్డాయి. చివరికి వారిలో శేషం తప్ప మరెవ్వరూ మిగల్చబడలేదు.

నిర్గమకాండము 33:5
కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.

ఈ వచనంలో మొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులకు తమ తిరుగుబాటు స్వభావం గురించి గుర్తుచేస్తూ ఆయన కనుక వారిమధ్యకు వస్తే వారిని క్షణంలో నాశనం చేస్తానని హెచ్చరించడం మనం చూస్తాం. నేను పైన వివరించినట్టుగా ఇది ఆయన పరిశుద్ధతా న్యాయస్వభావాన్ని మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధుడైన దేవునిలోని న్యాయం పాపం విషయంలో రగులుతూ ఉంటుంది. క్షణంలో‌ అది నాశనం చేస్తుంది. అందుకే ఆయన ఈవిధంగా వారిని హెచ్చరిస్తున్నాడు. అయితే ఆయనకు ఆ ప్రజలపై ఉన్న జాలిని బట్టి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణాన్ని బట్టి ప్రత్యామ్నాయంగా ఈమాటలు కూడా పలుకుతున్నాడు.

"గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను"

దేవుడు వారిమధ్యకు వస్తే క్షణంలో వారిని నాశనం చేస్తాడు కాబట్టి, ఆయనలోని న్యాయాన్ని బట్టి అలానే చెయ్యవలసి ఉంటుంది కాబట్టి, "మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను" అంటున్నాడు. అంటే నాలోని న్యాయపు ఉగ్రత శాంతించేలా మిమ్మల్ని మీరు తగ్గించుకుని, మీ పాపాన్ని ఒప్పుకోండి అంటున్నాడు. అలా వారు తగ్గించుకుని తమ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే వారిని శిక్షించాలా లేక క్షమించాలా అనే నిర్ణయం ఆయన తీసుకోగలడు. ఇది ఆయన న్యాయప్రమాణానికీ, క్షమాగుణానికీ సంబంధించిన విషయం. ఆయన న్యాయం శాంతించకుండా ఆయన ఎవర్నీ క్షమించడు. అందుకే "ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు" అంటున్నాడు. అంటే అప్పటివరకూ ఆయనకు తెలియదు అని కాదుకానీ ఆ ప్రజల మారుమనస్సును బట్టి ఆయన స్పందన ఉంటుందని అర్థం. నేను పైన చెప్పిన విషయం మరోసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు న్యాయవంతుడు మరియు కరుణామయుడు కూడా. న్యాయం మరియు కరుణ, ఇవి రెండూ కూడా ఆయన స్వభావలక్షణాలే. ఆయన వీటిలో దేనికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తించడు "ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు" (2తిమోతికి 2:13). కానీ ఆయన న్యాయమేమో పాపానికి శిక్షవిధించమంటుంది. కరుణయేమో వారిని క్షమించమంటుంది. వారిని‌ శిక్షిస్తేనేమో కరుణను పాటించనట్టు ఔతుంది, క్షమిస్తేనేమో న్యాయాన్ని పాటించనట్టు ఔతుంది. పరిశుద్ధుడైన దేవుడు న్యాయాన్ని పాటించకుండా ఉండడం అసంభవం. అప్పుడు ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడు. అందుకే ఇక్కడ ఆయన తన స్వభావాన్ని బట్టి ఆ రెండూ నిర్వహించబడేలా ఆ ప్రజలను మారుమనస్సు పొందమని ఆయనే ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెడుతున్నాడు. ప్రజలు నిజంగా మారుమనస్సు పొందినప్పుడు ఆయనలోని న్యాయం శాంతిస్తుంది. ఆయనలోని కరుణ వారికి క్షమాపణ అనుగ్రహిస్తుంది.

మన విషయంలో కూడా ఇదే జరిగింది. మన పాపాలను‌ బట్టి ఆయన న్యాయం‌ మనల్ని బలి కోరుకుంది. ఆయన కరుణ మనల్ని క్షమించమంది. అందుకే ఆయన మనకు న్యాయబద్ధంగా రావలసిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తుకు విధించి (యెషయా 53) ఆ విధంగా న్యాయాన్ని శాంతింపచేసి తన కరుణతో మనకు క్షమాపణ అనుగ్రహించాడు. ఇదంతా కేవలం ఆయన ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయం కారణంగానే జరుగుతుంది. అందుకే మన రక్షణ విషయంలో మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అది కేవలం ఆయన కృపయే అని స్మరించుకునేవారిగా ఉండాలి. అందుకే పరలోకంలో ప్రవేశించిన సంఘం ఆయనను ఏవిధంగా కొనియాడుతుందో చూడండి.

ప్రకటన గ్రంథం 7:9,10 "అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్లయెదుటను నిలువబడి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి."

ఇక్కడ ఆయన ఆ ప్రజలను ఆభరణాలు తీసివెయ్యమనడంలో మరో విషయం మనం గమనించాలి. అప్పటికే వారు అవి తీసివేసినట్టు రాయబడినప్పటికీ అందరూ అలా చేసుండకపోవచ్చు, అందుకే ఇప్పుడు ఆయన అందర్నీ అలా చెయ్యమని ఆజ్ఞరూపకంగా దానిని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు గతంలో ఆ ఆభరణాలను కానుకలుగా ఇచ్చే అహరోను చేత బంగారుదూడను తయారుచేయించారు. ఆ పాపానికి జ్ఞాపకంగా, ఒప్పుకోలుగా కూడా వాటిని ఆయన తీసివెయ్యమంటున్నాడు. మనం వేటికారణంగానైతే పాపానికి పాల్పడ్డామో వాటి విషయంలో సిగ్గుపడాలని, మననుండి వాటిని దూరంగా ఉంచాలని ఈ నియమం మనకు నేర్పిస్తుంది.

నిర్గమకాండము 33:6
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా తమ ఆభరణాలను తీసివెయ్యడం మనం చూస్తాం. వారు ఏ హోరేబు కొండ దగ్గరైతే బంగారు దూడను చేసుకుని పూజించారో ఆ కొండదగ్గరే వాటిని తీసివేసారు.

నిర్గమకాండము 33:7
అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచువచ్చెను.

ఈ వచనంలో మోషే అప్పటివరకూ ప్రజలమధ్యలో ఉన్న గుడారాన్ని తీసివేసి ఆ ప్రజలకు దూరంగా పాళెం వెలుపల దానిని నిలబెట్టడం మనం చూస్తాం. ఇది యాజకవ్యవస్థ కలిగి మందసం ఉంచబడే ప్రత్యక్షగుడారం కాదు. దానిని తరువాత అధ్యాయాల్లో తయారు చేస్తున్నట్టు మనం‌ గమనిస్తాం. ఈ ప్రత్యక్షగుడారమైతే అప్పటికే ఉంది. మోషే ప్రజల వ్యాజ్యాలను ఈ గుడారంలోనే దేవునితో మాట్లాడి పరిష్కరించేవాడు (నిర్గమకాండము 18:13:15). కానీ ఇప్పుడు మోషే ఆ గుడారాన్ని ప్రజలమధ్యలోనుండి తీసివేసి వారికి దూరంగా నిలబెట్టి, భవిష్యత్తులో తాను నిర్మించబోయే ప్రత్యక్షగుడారం అనే పేరే దానికి పెట్టాడు. ఎందుకంటే మోషేకు ఈ గుడారంలో కూడా ఆయన ప్రత్యక్షమౌతూ వచ్చి, ప్రజల వ్యాజ్యాలకు తీర్పులు తెలియచేసాడు. ఇక్కడ మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి.

1. ఇశ్రాయేలీయులు బంగారుదూడను పూజించడం వల్ల మొదటిగా పది ఆజ్ఞల పలకలను పోగొట్టుకున్నారు. రెండవదిగా దేవుని సన్నిధి వారిమధ్య లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే పరిశుద్ధుడైన ఆయన ఈ పాపులమధ్యలో నివాసం చెయ్యడు. ఆవిధంగా దేవుని సన్నిధి ఇక వారి మధ్య లేదని తెలియచేసేందుకే మోషే ఆ గుడారాన్ని ప్రజల పాళానికి దూరంగా నిలబెట్టాడు. కాబట్టి పాపం వల్ల మనం కోల్పోయేది విలువైన దేవుని సన్నిధినని మనం గుర్తుంచుకోవాలి. అందుకే కీర్తనాకారుడు "నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము" (కీర్తనలు 51:11) అని మొర్రపెడుతున్నాడు.

2. ఇశ్రాయేలీయుల పాపాన్ని బట్టి దేవుని సన్నిధి వారిమధ్యనుండి తీసివెయ్యబడినప్పటికీ ఆయన పూర్తిగా వారిని వెలివెయ్యలేదు, ఆయనను కావాలి అనుకున్న ప్రతీఒక్కరూ ఆ ప్రత్యక్షగుడారం దగ్గరకు వెళ్ళవచ్చు "యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచువచ్చెను". కాబట్టి పాపం కారణంగా ఆయన సన్నిధి దూరమైనప్పటికీ తమ పాపాలను విడిచిపెట్టి ఆయనను ఆసక్తితో వెదికేవారికి ఆయన దూరంగా ఉండడు‌. కాబట్టి "యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి" (యెషయా 55:6).

అపో.కార్యములు 17:27 తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.

నిర్గమకాండము 33:8-10
మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారము లోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుటచూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.

ఈ వచనాల్లో మోషే ఆ ప్రత్యక్షగుడారంలోకి వెళ్తూ వస్తూ ఉండడం, ఆయన మేఘస్తంబం నుండి మోషేతో మాట్లాడుతూ ఉండడం, అది చూసిన ప్రజలు తమ గుడారాల దగ్గర నిలచి ఆయనకు నమస్కారం చేస్తుండడం‌ మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి.

1. గతంలో ఇశ్రాయేలీయులు "ఆ మోషే అనువాడు ఏమాయెనో" అంటూ అతనికోసం చులకనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధి వారికి దూరమైందని అర్థంకాగానే అతనిపైనే తమ దృష్టిని ఉంచుతున్నారు, దేవుడు అతనితో ఏం మాట్లాడాడో అని ప్రతీరోజూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కమాటలో‌ చెప్పాలంటే ఇకపై మోషే చెప్పినట్టుగానే నడుచుకుంటాం అన్నట్టుగా అతనికి లోబడుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఈవిధంగానే మారుమనస్సు పొందిన దేవుని పిల్లలంతా తమను దేవునివాక్యంతో నడిపించే బోధకులకు/పెద్దలకు లోబడియుంటారు. గతంలో ఇశ్రాయేలీయులు తిరస్కరించినట్టుగా తిరస్కరించలేదు. అలానే ఇశ్రాయేలీయులు మోషేను అవమానించారు, కానీ దేవుడు ఆ తిరస్కరించిన ప్రజల మధ్యలోనే అతన్ని ఈవిధంగా ఘనపరుస్తున్నాడు. దేవునికి తెలుసు నిజాయితీగా పరిచర్య చేసే తన సేవకులను ఎలా ఎప్పుడు ఘనపరచాలో.

2. ఇశ్రాయేలీయులు గతంలో చూపించని విధంగా ఇక్కడ ఆసక్తిని చూపిస్తున్నారు. దేవుడు‌ మోషేతో ఏం మాట్లాడాడో అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వారి పాపం కారణంగా దేవుని సన్నిధి వారికి దూరమైందని వారు తెలుసుకున్నారు. అదివారికి ఎంతో బాధ మరియు భయం‌ కలిగించే విషయం. అందుకే వారు మారుమనస్సు పొంది మరింత ఆసక్తిగా ఆయనకోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి పడిపోయి లేచినవారిలో ఇలాంటి ఆసక్తి ఉండాలి. అలానే పడిపోకుండా ఉండడానికి కూడా ఆ ఆసక్తిని కనుపరచాలి.

నిర్గమకాండము 33:11
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.

ఈ వచనంలో దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని రాయబడడం మనం చూస్తాం. ముఖాముఖి అనే మాట మనకు అర్థమయ్యే వర్ణనలో రాయబడింది. మనం ఎవరితోనైనా సన్నిహితంగా మాట్లాడడాన్ని ఉద్దేశించి "అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడాను" అంటుంటాం కదా, అలానే దేవుడు మోషేతో అంత సన్నిహితంగా మాట్లాడుతున్నాడని ఆ మాటలభావం. అది అక్కడే "దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా" అని స్పష్టం చెయ్యబడింది. దేవుడు ఇంత సన్నిహితంగా మోషేతో మాట్లాడడం గురించి ఇతర సందర్భాల్లో కూడా మనం ఆధారాలు చూస్తాం.

సంఖ్యాకాండము 12:5-8 యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.

ద్వితీయోపదేశకాండము 34:10-12 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికినియే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.

ఈ మోషే ఐగుప్తుకు రాజు కావలసినవాడు, ఐగుప్తు రాజుకుమార్తె కుమారుడుగా, రాజకుమారుడి హోదాలో పెంచబడినవాడు. కానీ మోషే దేవుని పిలుపుమేరకు అవన్నీ విడిచిపెట్టేసాడు. దేవునిప్రజలతో కలసి శ్రమలు అనుభవించాడు.

"అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను,విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను" (హెబ్రీ 11:25-27).

చివరికి ఏమైంది? ప్రపంచలో ఎవ్వరికీ దక్కని దేవుని స్నేహితుడు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేవాడు అనే ఘనత అతని స్వంతమైంది. దేవునిపిలుపు కోసం, ఆయన ప్రజల కోసం మనకున్నది త్యాగం చెయ్యగలిగితే ఇలాంటి శ్రేష్టమైన ఘనతనే మనం పొందుకుంటాం. పరలోకంలోనైతే ప్రస్తుతం మోషే పొందుకున్న ఘనతకంటే ఇంతకంటే ఎక్కువైన మహిమను మనం పొందుకోబోతున్నాం కదా.

"తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు"

మోషే దేవునితో మాట్లాడిన తరువాత ప్రజలమధ్యకు వస్తూ వారికి ఆయన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు‌. యెహోషువ మాత్రం ఆ గుడారంలోనే ఉంటున్నాడు. బహుశా దేవుడు భవిష్యత్తు నాయకుడిగా అతన్ని సిద్ధపరచడానికే అలా ప్రజలనుండి ప్రత్యేకంగా ఉంచుతూ ఉండొచ్చు. ఇప్పటికే ఇతను మోషేతో పాటుగా 40రోజులు సీనాయి పర్వతంపై నివసించాడు. అదేవిధంగా "యెహోషువ అను యౌవనస్థుడు" అన్నప్పుడు అతను 30సంవత్సరాలలోపు వయస్సుగలవాడని కాదు. ఆకాలంలో పరిచారకులను యవ్వనస్తులు పడుచువారు అనే సంబోధించేవారు (ఆదికాండము 14:24). యెహోషువ మోషే పరిచారకుడు కాబట్టి ఇక్కడ ఆవిధంగా సంబోధించబడ్డాడు.

నిర్గమకాండము 33:12,13
మోషే యెహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవునేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.

ఈ వచనాల్లో మోషే ఎంతో వివేకంగా బాధ్యతగా తన మధవర్తిత్వపు పరిచర్యను చెయ్యడం మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యనుండి తన సన్నిధిని ఉపసంహరించుకున్నాడు. ఆయనకు బదులుగా ఒక దూతను మాత్రమే వారితో పంపుతాను అంటున్నాడు, ఆ ప్రజలను తన ప్రజలుగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు. అందుకే మోషే ఇక్కడ వ్యక్తిగతంగా దేవునికి అతనిపై ఉన్న కటాక్షాన్ని ఎత్తిపట్టుకుని ఆ కటాక్షం ఆయనకు ప్రజలపై కూడా కలిగేలా వేడుకుంటున్నాడు. ఆ క్రమంలో ఆ ప్రజలను నీ ప్రజలే కదా అంటూ వారిని ఆయనతో సమాధానపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. "దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము" అంటే నువ్వు మాతో కూడా రావాలని అర్థం. ఇది యేసుక్రీస్తు మధ్యవర్తిత్వపు పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. ఆయన కూడా తండ్రికి తనపై ఉన్న ప్రేమను ఆధారం చేసుకుని మనల్ని ప్రేమించేలా చేసాడు.

"ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు"

దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను. గతంలో తండ్రియైన దేవుడు ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్న దూతను అనగా యెహోవాను పంపుతాను అన్నప్పుడు మోషేకు ఎలాంటి అభ్యంతరం, సందేహం కలుగలేదు. కానీ ప్రస్తుతం యెహోవా నామం కలిగిన యెహోవా దూత వేరొక దూతను పంపుతాను అనేసరికి అతనిలా అభ్యంతరం చెబుతున్నాడు, అతనెవరా అని సందేహపడుతున్నాడు.

నిర్గమకాండము 33:14
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా-

ఈ వచనంలో దేవుడు మోషే ప్రార్థనకు స్పందిస్తూ తన సన్నిధి మోషేతో పాటుగా ఉంటుందని తెలియచెయ్యడం మనం చూస్తాం. మోషే ప్రజలతో పాటు కనానుకు వెళ్ళబోతున్నాడు. అంటే ఆయన ఇప్పుడు తన ప్రజలతో వెళ్ళడానికి, తన సన్నిధిని వారిమధ్యన ఉంచడానికి అంగీకరిస్తున్నాడు. ఇక "నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను" అనేది మోషేకు ఆయన సన్నిధిలో కలిగే నిత్యవిశ్రాంతి గురించి చెప్పబడింది. క్రీస్తురాకడలో మనం కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాము.

నిర్గమకాండము 33:15
మోషేనీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.

ఈ వచనంలో మరలా మోషే ఆయన సన్నిధితోడు కోసం దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తాం. అప్పటికే దేవుడు తన ప్రార్థనను అంగీకరించినప్పటికీ ఆయన సన్నిధి అనేది చాలా విలువైనది కాబట్టి, అతను మరలా దానికోసం తన వేడుకోలును కొనసాగిస్తున్నాడు. క్రింది వచనంలో అది మరింత స్పష్టంగా గమనిస్తాం.

నిర్గమకాండము 33:16
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.

ఈ వచనంలో మోషే దేవుని సన్నిధి తోడు కోసం తన ప్రార్థనను కొనసాగించడం మనం చూస్తాం. పైన చెప్పినట్టుగా ఆయన సన్నిధి మోషేకూ మరియూ ఆయన ప్రజలకూ అత్యంత విలువైనది. దేవుని సన్నిధి లేని దేవుని ప్రజలు, దేవుని ప్రజలు కాలేరు కదా, అందుకే మోషే ఆ సన్నిధికోసం ఇలా తాపత్రయపడుతున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధి లేకుండా వారు కనానులో ప్రవేశించినప్పటికీ, వారు ఇతర ప్రజల్లో ప్రత్యేకమైనవారిగా ఉండలేరు. ఎందుకంటే తన ప్రజలను ఇతరులతో వేరు చేసేది దేవుని సన్నిధి మాత్రమే అందుకే మోషే దానిని తలంచుకుంటూ, నీ సన్నిధి మాతో ఉన్నప్పుడు మాత్రమే "అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని" అంటున్నాడు. దీనిని బట్టి ఆయన సన్నిధికి అనగా ఆయన మనలో మనతో ఉండడానికి ఎంత విలువను ఇస్తున్నామో, ఆ సన్నిధిని అనుభవించడానికి ఎంతగా తాపత్రయపడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధి మనలో మనతో ఉందనడానికి ప్రాముఖ్యమైన నిదర్శాలు ఏంటంటే, మొదటిగా ఆయన పరిశుద్ధతకు అధికగౌరవాన్ని ఇస్తూ పాపం చేత మనల్ని కళంకితులను చేసుకోకుండా ఉంటాం, ఆయన వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానించి దానిని గైకొంటాం. సహోదరులను ప్రేమిస్తాం, శత్రువులను క్షమిస్తాం, అలానే ఆయన సువార్త కోసం, బోధ కోసం అలుపెరుగని పోరాటం చేస్తాం. ఈ నిదర్శనాలు మనకు లేకుంటే మనం కూడా ఇప్పుడే ఆయన సన్నిధి ప్రభావం కోసం మోషేలా ఆయనను వేడుకోవాలి.

నిర్గమకాండము 33:17,18
కాగా యెహోవానీవు చెప్పినమాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయ చేసి నీ మహిమను నాకు చూపుమనగా-

ఈ వచనాల్లో దేవుడు మోషే వేడుకోలుకు అంగీకరించడం, మోషే దానికి రుజువుగా (నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును?) ఆయన మహిమను చూపించమనడం‌ మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి.

1. మోషే ఇప్పటికే దేవుడు తన విజ్ఞాపనను అంగీకరించినప్పటికీ దానికి రుజువును కోరుతున్నాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు భక్తులు ఇలా రుజువులు అడగడం దేవునిపై అనుమానంతో కాదు కానీ, తమలోని ఆసక్తిని బట్టేయని మనం గుర్తించాలి. విశ్వాసులకు తండ్రిగా పేరు పొందిన అబ్రాహాము కూడా తన సంతానం విషయంలో ఇలాంటి రుజువును అడిగాడు (ఆదికాండము 15:7,8). ప్రస్తుతం మనకైతే ఆయన వాక్యమే, ఆ వాక్యంలోని భక్తుల అనుభవాలే శ్రేష్టమైన రుజువులుగా ఉన్నాయి.

2. ఇప్పటివరకూ మోషే మండుచున్న పొదలో, సీనాయి పర్వతంపైన, మేఘస్తంబంలోనూ ఆయన మహిమను వివిధవిధాలుగా చూస్తూనే వచ్చాడు. కానీ ఇప్పుడు మరలా ఆయన మహిమను చూపించమంటున్నాడు. అంటే మోషేకు తెలుసు ఇప్పటివరకూ అతను చూసింది కేవలం ఛాయారూపకమైన మహిమను మాత్రమేయని అందుకే అతను ఇప్పుడు ఆయన మహిమను లేక ఆయన రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అనుకుంటున్నాడు. క్రింది వచనాల్లో అదే మనం గమనిస్తాం. ఇక్కడ మోషే ఆయన మహిమను ఎంతగా అనుభవిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువగా అనుభవించాలనే ఆసక్తిని తాపత్రయాన్ని కనపరుస్తున్నాడు. ఉదాహరణకు మనం ఎవర్నైనా ఎక్కువగా ప్రేమించినప్పుడు వారి ప్రేమను ఇంకా ఇంకా అనుభవించాలి అనుకుంటాం, వారి గురించి ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటాం.‌ మోషే దేవునిపట్ల అలాంటి ప్రేమనే కలిగియున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునే మనం ఇలాంటి ఆసక్తినే కనపరుస్తూ ఆయన వాక్యపు మహిమను ఇంకా ఎక్కువగా అనుభవించడానికి, లేక ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దానిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. దేవుని హృదయానుసారుడైన దావీదులో ఇలాంటి తపననే మనం గమనిస్తాం.

కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.

నిర్గమకాండము 33:19,20
ఆయననా మంచితనమంతయు నీ యెదుట కను పరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను. మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.

ఈ వచనాల్లో దేవుడు నీ మహిమను చూపించమని అడిగిన మోషేకు తన గుణలక్షణాలను చూపిస్తాననడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ గుణలక్షణాలే ఆయనకు మహిమగా ఉన్నాయి. ఆయన ఎలాంటివాడో ఆ గుణలక్షణాలే బయలుపరుస్తున్నాయి. యెహోవా అనే ఆయన నామం కూడా "ఉన్నవాడు" అనే ఆయన నిత్యఉనికికి సంబంధించిన గుణలక్షణమే. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఫిలిప్పు మాకు తండ్రిని చూపించమన్నప్పుడు ఆయనలో బయలుపరచబడుతున్న గుణలక్షణాలే దేవుని రూపంగా వర్ణించాడు "యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?" (యోహాను 14:9).

అయితే మోషే ఆయన రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలనుకుంటున్నాడు. కానీ "నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడని" అతనికి చెప్పబడింది. ఎందుకంటే పరిమితుడైన, పాపస్వభావియైన మానవుడు అనంతుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా చూడలేడు. చూసి బ్రతుకలేడు. అందుకే ఆయన ఇప్పటివరకూ మోషేకు కానీ, అబ్రాహాముకు కానీ యాకోబుకు కానీ మరెవరికైనా కానీ పరిమిత రూపంలో ఉదాహరణకు యెహోవా దూతగా తనను తాను కనపరుచుకున్నాడు. అదేవిధంగా భక్తుల దర్శనాల్లో మానవదేహంవలే కనపరచుకున్నాడు, దానిని Anthropomorphism అంటారు. కానీ ఆయన అసలైన రూపం మాత్రం ఎవరూ చూడలేదు, చూడరు కూడా. కానీ ఈ కోరిక అక్షయశరీరాన్ని ధరించుకున్నప్పుడు తీరుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే "ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము" (1యోహాను 3:2) అని రాయబడింది.

మరోవిషయం ఏంటంటే; ఆయన ఇక్కడ "ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను" అంటున్నాడు. ఇవే మాటలను పౌలు కూడా రోమా 9:15లో ప్రస్తావిస్తాడు. ఈ మాటలు ఆయన సార్వభౌమత్వానికి ఉదాహరణగా ఉన్నాయి. ఆయన తనకు ఇష్టమైనవారిని కరుణిస్తాడు, మిగిలినవారిని తన ఉగ్రతకు విడిచిపెడతాడు. సృష్టికర్తగా ఇది ఆయనకు తన సృష్టిపైయుండే న్యాయమైన హక్కు. అంతేకాకుండా నిజానికి ఈ భూమిపై ఏ మనిషీ కూడా తన పాపాన్ని బట్టి ఆయన కరుణకు పాత్రుడు కాడు, కాలేడు. అయినప్పటికీ ఆయన తనలోని కరుణస్వభావాన్ని కనపరచడానికి కొందర్ని ముందుగా ఎన్నుకుని వారిని కరుణిస్తున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచినమనమంతా కూడా అలా కరుణించబడిన కరుణాఘటాలమే. కాబట్టి మనం అర్హము కాని‌ కరుణను ఆయననుండి పొందుకున్నందుకు, మనం అర్హం అయిన ఆయన ఉగ్రతనుండి తప్పించబడినందుకు ఆయనను ఎంతగానో స్తుతించాలి. ఆయనకు పూర్ణమనస్సుతో లోబడాలి. మనం కరుణించబడింది ఇందుకే.

నిర్గమకాండము 33:21-23
మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను; నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.

ఈ వచనాల్లో మోషే తపనను గుర్తించిన దేవుడు ఒక బండపై అతన్ని ఉంచి చేతితో అతన్ని కప్పి వెనుకభాగాన్ని మాత్రమే చూపిస్తాను అనడం మనం చూస్తాం. నిజానికి ఇప్పుడు కూడా ఆయన పరిమితస్థాయిలోనే మోషేకు కనపరచుకుంటున్నాడు. "దేవుడు ఆత్మ" (యోహాను 4:24), "దేవుడు అదృశ్యుడు" (1 తిమోతీ 1:17), ముఖ్యంగా దేవుడు అనంతుడు (1 సమూయేలు 2:3), ఆకాశమహాకాశాలు కూడా ఆయనను పట్టజాలవు (1 రాజులు 8:27). కాబట్టి ఆయనకు ఒక ప్రదేశానికి పరిమితమయ్యే దేహం కానీ రూపం‌ కానీ ఉండవు. కాబట్టి ఇక్కడ ఆయనకు చెయ్యి ఉన్నట్టుగా, ముఖం ఉన్నట్టుగా, వెనుక భాగం ఉన్నట్టుగా చెప్పబడుతుంది, అలంకారంగానూ మరియు తన పరిమిత మహిమను సూచించడానికిగానూ అని మనం అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఎవరైనా వ్యక్తిని ఎలా గుర్తుపడతాం? అతని ముఖాన్ని చూడడం బట్టేకదా, అతని ముఖమే అతనికి గుర్తింపు. అదే వెనుక నుండి చూస్తే అతన్ని మనం పూర్తిగా గుర్తుపట్టలేం, కానీ ఆ వ్యక్తిలా ఉన్నాడే, ఆ వ్యక్తిలా నడుస్తున్నాడే అని ఊహించుకునే వీలుంటుంది. ఆవిధంగా ముఖం అతన్ని పూర్తిగా గుర్తించడానికి అవకాశం‌ కల్పిస్తే, వెనుక భాగం ఊహించుకోవడానికి మాత్రమే అవకాశం‌ కల్పిస్తుంది‌. ఆవిధంగా ఇక్కడ దేవుడు కూడా "నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదు" అంటున్నప్పుడు, నువ్వు నా మహిమను పరిమితస్థాయిలో చూస్తావు (వెనుకభాగంగా) తప్ప, ఉన్నది ఉన్నట్టుగా (ముఖాన్ని) చూడలేవని అర్థం. అయితే ఈ మహిమ మోషే గతంలో చూసిన మహిమకంటే ఎక్కువగానే కనపరచబడుతుంది. అందుకే అతనికి దానివల్ల ఎలాంటి హానీ కలుగకుండా ఆయన తన చేతితో కప్పాడు, అనగా భద్రపరిచాడు. మరో విషయం ఏంటంటే ఇదే మోషే ప్రత్యక్షగుడారం ఏర్పడినప్పుడు దానిపైకి దిగివచ్చిన ఆయన మహిమను తట్టుకోలేక అందులోకి ప్రవేశించలేకపోయాడు (నిర్గమకాండము 40:35). కాబట్టి మోషే అయినా మరెవరైనా సరే ఆయన పరిమిత మహిమను మాత్రమే చూడగలిగారు, తప్ప పూర్తి మహిమను చూడలేదు, చూడలేరు.

అదేవిధంగా ఇక్కడ దేవుడు తనను చూడడానికి మోషేను ఏ బండపై ఐతే నిలబడమన్నాడో ఆ బండనుండే ఇశ్రాయేలీయులకు నీరు ప్రవహించింది. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది (1 కొరింథీ 10:4). ఇప్పుడు ఆ బండపై నుండే మోషే దేవుని మహిమను చూడబోతున్నాడు. కాబట్టి ఇది క్రీస్తు ద్వారా మనం తండ్రి మహిమలో ప్రవేశించడానికి సాదృశ్యంగా ఉంది. ఆ బండద్వారా మాత్రమే మనం ఆయన మహిమలో ప్రవేశించగలం.

ఎఫెసీయులకు 2:18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము

 

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.