పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 26:1 , 26:2-6, 26:7-14 , 26:15-29 , 26:30 , 26:31-34 ,26:35-37.

 

నిర్గమకాండము 26:1
మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.

గడచిన అధ్యాయంలో నిబంధన మందసం, దీపవృక్షం మరియు బల్ల యొక్క తయారీ గురించి వివరించిన దేవుడు ఈ వచనం నుండి ప్రత్యక్షగుడారం యొక్క నిర్మాణం గురించి వివరించడం మనం చూస్తాం. ఆయన దిగివచ్చి తన ప్రజల మధ్య నివసించడమే ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణం యొక్క ఉద్దేశం. సాధారణంగా ఎవరైనా ఒక రాజు నివసించడానికి నిర్మించబడే ప్రదేశం అన్నివిధాలుగా సౌకర్యవంతంగా, చూడడానికి ఎంతో అందంగా, ఆ రాజు యొక్క ఘనత ఉట్టిపడేవిధంగా అలంకరించబడుతుంది. అలాంటిది ఈ ప్రత్యక్షగుడారంలో సాక్ష్యాత్తూ రాజులకు రాజైన దేవుడే నివసించబోతున్నాడు కాబట్టి, ఇది మరింత అందంగా, సంక్లిష్టంగా, ఆయన మహిమ చాటబడే విధంగా నిర్మించబడుతుంది. అందుకే ఈ ప్రత్యక్ష గుడారపు తెరలపై ఆయన సన్నిధికి‌ సాదృష్యమైన కెరూబులను చెయ్యాలని ఆయన ఆదేశిస్తున్నాడు.

అదేవిధంగా సంక్లిష్టంగా నిర్మించబడుతున్న ఈ ప్రత్యక్ష గుడారం ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి సాదృష్యంగా ఉంది. మోషే ద్వారా నిర్మించబడుతున్న ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ నివసించింది, యేసుక్రీస్తు శరీరం ద్వారానైతే ఆయన సంపూర్ణంగా ప్రజల మధ్య నివసించాడు. అందుకే పౌలు "దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని" (కొలస్సీ 2:9) జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా ఇదే విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు (హెబ్రీ 9:1-12).

ఇక ఈ ప్రత్యక్షగుడార నిర్మాణమంతా మనం తెరలతో చెయ్యబడుతున్నట్టు గమనిస్తాం. ఆ తెరల కప్పుకు గోడలుగా తుమ్మకర్రతో చేయబడి బంగారు పూత పూయబడిన పలకలు వెండి దిమ్మలపై ఉంటాయి, అవి నిలబడే విధంగా అడ్డకర్రలు ఉంటాయి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎడారి మార్గం ద్వారా కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో వారు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటనుండి మరోచోటికి ఎప్పటికి అప్పుడు మార్చుకునేవీలుగా ఇది ఇలా నిర్మించబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారంపై మేఘము కమ్ముకున్నంతకాలం ఇశ్రాయేలీయులు అదే ప్రదేశంలో నివసిస్తారు. ఎప్పుడైతే మేఘము ప్రత్యక్షగుడారం నుండి పైకి లేస్తుందో ఇశ్రాయేలీయులు మరోచోటికి ప్రయాణమౌతారు. అప్పుడు యాజకులైన లేవీయులు ఈ ప్రత్యక్ష గుడారాపు తెరలనూ, పలకలనూ దిమ్మలనూ స్థంబాలనూ మందసాన్నీ, ఇతర‌ వస్తువులనూ మోస్తూ దేవుడు నిర్దేశించిన స్థలంలో మరలా గుడారంగా అమర్చుతారు‌ (నిర్గమకాండము 40:36-38, సంఖ్యాకాండము 4: 25-27).

నిర్గమకాండము 26:2-6
ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయ వలెను. మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.

ఈ వచనాలలో దేవుడు విడి విడి తెరలను బంగారు గుండీలతో జతచేసి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. పాతనిబంధన ప్రకారం ఒక మూర అంటే సుమారు 45 సెంటీమీటర్లు. అలాంటి 28 మూరల పొడవు, 5 మూరల వెడల్పు ఉన్న పది తెరలతో ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పని. అంత పెద్దవైన తెరలను వారు తయారు చెయ్యాలంటే, వాటికోసం పెద్దవైన మగ్గాలనే ఉపయోగించవలసి‌ ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారంలోని బంగారు, వెండి, ఇత్తడితో చెయ్యవలసిన వస్తువుల తయారీకి కూడా చాలా పనిముట్లు అవసరం. మరి ఇవన్నీ ఆ ఎడారి ప్రాంతంలో ఇశ్రాయేలీయులకు ఎలా లభించినట్టు? దీనికి సమాధానం చాలా సులభం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ కేవలం ఇటుకలను తయారు చెయ్యడమే కాకుండా ఇతర పనులను కూడా చేస్తుండేవారు. ఉదాహరణకు వారు పట్టణాలను కూడా నిర్మించినట్టు మనం చదువుతాం (నిర్గమకాండము 1:11). ఐగుప్తునుండి వస్తున్నప్పుడు వారు ఐగుప్తీయులనుండి తీసుకున్న బంగారు, వెండి, ఇత్తడి, చర్మాలు, రత్నాలు మొదలైన వస్తువులనే కాకుండా అప్పటివరకూ ఆ దేశంలో ఏఏ పనులను చేసేవారో, ఆ పనులకు సంబంధించిన పనిముట్లను కూడా తమతో తీసుకువచ్చారు. వాటి సహాయంతోనే ఇప్పుడు వారు ప్రత్యక్ష గుడారాన్నీ అందులో ఉంచవలసిన సామాగ్రినీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలను గమనించాలి.

1. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు రప్పించినప్పుడు వారు ఆ దేశాన్ని విడిచిపెట్టారు తప్ప, అప్పటివరకూ తాము ఆయా పనుల్లో సంపాదించిన నిపుణుతను కానీ, ఆ పనులు చెయ్యడానికి అవసరమైన పనిముట్లను కానీ విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు కనానులో ప్రవేశించినప్పటికీ జీవనోపాధియైన ఆ పనులూ పనిముట్లూ వారికి అవసరం. కాబట్టి మనం కూడా ప్రభువు ఏర్పాటును బట్టి లోకంనుండి ప్రత్యేకించబడినప్పటికీ, నైతికతకు విరుద్ధంకాని జీవనోపాధి పనులను విడిచిపెట్టకూడదు. దేవుని వాగ్దానం, పిలుపు అనేవి మనుషులను సోమరులుగా మార్చేవి కావు. అందుకే పౌలు సోమరితనానికి వ్యతిరేకంగా తన పత్రికలో‌ బోధించాడు (2 థెస్సలోనిక 3:10-12). ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, కొందరు సేవకులుగా ప్రత్యేకించబడినవారు దేవుని పిలుపు పేరుతో తమ తమ ఉద్యోగాలను జీవనోపాధి పనులను విడిచిపెట్టి సంఘంపైనే ఆధారపడడం మనం తరచుగా చూస్తుంటాం, ఒకవేళ ఉద్యోగం వారి పరిచర్యకు అభ్యంతరంగా ఉంటే అలా చెయ్యడం సరైనదే కానీ, ఉద్యోగం చేసుకునే సమయం ఉండి‌కూడా పరిచర్య పేరుతో దానిని విడిచిపెట్టి సంఘంపై ఆధారపడడం సరైనది కాదు, అది కేవలం సోమరితనం మాత్రమే. పరిచర్యకోసం అవిశ్రాంతిగా పనిచేసిన పౌలు కూడా తన స్వహస్తాలతో కష్టపడినట్టు మనం ఆయన సాక్ష్యంలో చదువుతున్నాం (1 కొరింథీ 4:12, 2 థెస్సలోనిక 3:8).

2. ప్రత్యక్ష గుడార నిర్మాణం అనేది సులభమైన విషయమేమీ కాదు, దానికోసం ఎంతోమంది ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే అది సాక్ష్యాత్తూ దేవుని ఆజ్ఞ. కాబట్టి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం మన పతన స్వభావాన్ని బట్టి మనకు కష్టతరంగా అనిపించినప్పటికీ వాటిని నెరవేర్చి తీరాలి. ఉదాహరణకు; దేవుడు మనల్ని "నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు" (మత్తయి 5:44). దీనిని నెరవేర్చడం మన పతన (పగ) స్వభావాన్ని బట్టి మనకు కష్టతరమే. అయినప్పటికీ మనల్ని రక్షించిన ఆయన ప్రేమను తలచుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలను‌ నెరవేర్చిన వారికి ఆయన సిద్ధపరచిన ప్రతిఫలాన్ని తలచుకున్నప్పుడు వాటిని ఎంత కష్టతరమైనా మనం పాటించగలం (ఫిలిప్పీ 3:14, 1 కొరింథీ 9:24, 2 తిమోతీ 4:7,8). ఇశ్రాయేలీయులు ప్రత్యక్షగుడారపు నిర్మాణం కోసం కష్టపడ్డారు కాబట్టే కదా, అందులో నివసించిన ఆయన మహిమను కళ్ళారా చూడగలిగారు. ఆయన సన్నిధి ద్వారా ఎన్నో మేలులను పొందుకోగలిగారు. అలాగని ఆయనేమీ మనపై కష్టతరమైన ఆజ్ఞలను మోపి వదిలెయ్యలేదు. ఆయనపై సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు వాటిని‌ నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తుంటాడు (2 కొరింథీ 3:5). ఉదాహరణకు ప్రత్యక్ష గుడారాన్ని ఎంతో కష్టతరంగా నిర్మించమని ఆజ్ఞాపించిన ఆయనే అలా నిర్మించగలిగే జ్ఞానాన్ని పనివారికి అనుగ్రహించాడు (నిర్గమకాండము 35:35). అందుకే యోహాను "ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు" అంటున్నాడు (1 యోహాను 5:3). నిజమే ఆయనను మనం పూర్ణహృదయంతో ప్రేమించినప్పుడు, ఆయనపై సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలు‌ మనకు భారమైనవి కావు.

నిర్గమకాండము 26:7-14
మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను. మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.

ఈ వచనాలలో ప్రత్యక్షగుడారం యొక్క పైకప్పు నిర్మాణం గురించి మనం చూస్తాం. ఈ పై కప్పు అనేది మేకవెండ్రుకలతోనూ ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతోనూ సముద్ర వత్సల తోళ్లతోనూ నిర్మించబడింది. ఎందుకంటే ఈ ప్రత్యక్షగుడారం అనేది ఎడారి ప్రాంతంలో నిర్మించబడి, ఇశ్రాయేలీయులు కనానుకు చేరుకునేవరకూ ఆ ఎడారిలోనే స్థలాలు మారుతూ ఉంటుంది. ఎడారిలో ఎప్పుడూ కూడా సన్నని ఇసుక గాలిలో పయనిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎడారి తుఫాను ఏర్పడినప్పుడు ఇసుక మరింతగా చెలరేగుతుంది. దానివల్ల మందిరం పైకప్పు కేవలం మేకవెంట్రుకలతో మాత్రమే నిర్మించబడితే దానిగుండా సన్నని ఇసుక పరిశుద్ధమైన వస్తువులపై చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎడారి ప్రాంతంలో రాత్రివేళ‌మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. కేవలం మేకవెంట్రుకలు మాత్రమే ఆ మంచును అడ్డుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు మందిరంలోని పరిశుద్ధమైన వస్తువులు మంచుకు తడిచిపోతాయి. అందుకే దేవుడు ఇక్కడ మేకవెంట్రుకలతో మాత్రమే కాకుండా పొట్టేళ్ల తోళ్లతోనూ సముద్ర వత్సల (గండుచేప) తోళ్లతో కూడా మందిరపు పైకప్పును చెయ్యాలని ఆదేశిస్తున్నాడు. ఇదంతా దేవుడు నివసించబోయే ప్రత్యక్షగుడారంలోకి దుమ్ము, మంచు చేరకుండా, పరిశుద్ధమైన వస్తువులు కూడా వాటి భారిన పడకుండా ఆపడానికే.

దీనినుండి మనం ఒక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. దేవుడు కొంతకాలం నివసించబోయే ప్రత్యక్షగుడారమే అంత శుద్ధిగా ఉండాలని ఆయన కోరుకుంటే, మనం మారుమనస్సు పొందింది మొదలుకొని మనం మరణించేంతవరకూ ఆయన మనలోనే ఉంటానని వాగ్దానం చేసాడు, అలాంటప్పుడు మనం మరెంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడో కదా! కాబట్టి సులువుగా చిక్కులోపెట్టే ఈ లోకపు పాపం‌ నుండి‌ మనల్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి, దానికోసం పాపులతో కలసి కూడా పాపాన్ని తనకు అంటనీయకుండా జీవించిన యేసుక్రీస్తువైపు‌ చూడాలి (హెబ్రీ 12:2, హెబ్రీ 7:26). రక్షించబడిన (దేవుని మూలంగా పుట్టిన) ప్రతీ విశ్వాసిలోనూ ఈ లక్షణం మనం చూస్తాం. అందుకే యోహాను ఇలా అంటున్నాడు.‌

1యోహాను 5:17 దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

ఎందుకంటే మనలో‌ నివసిస్తుంది పరమపవిత్రుడైన దేవుడు కాబట్టి మన హృదయంలోకి ఈ లోకపు పాపం ప్రవేశించినప్పుడల్లా, మన ప్రవర్తన ఆయన పరిశుద్ధతకు విరుద్ధంగా ఉన్నప్పుడల్లా ఆయన దుఃఖపరచబడుతూనే ఉంటాడు కాబట్టి (ఎఫెసీయులకు 4:30), ఒక విశ్వాసి ఎల్లప్పుడూ పాపం విషయంలో తనను తాను భద్రం చేసుకుంటూనే ఉంటాడు. ఉండాలి.

నిర్గమకాండము 26:15-29
మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను. పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును. పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను; ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.

ఈ వచనాలలో ప్రత్యక్ష గుడారానికి మూడు‌ వైపులా గోడలుగా తయారు చెయ్యవలసిన పలకలగురించీ ఆ పలకలు నిలిచియుండడానికి సహాయంగా ఉండే అడ్డ కర్రలూ వెండి దిమ్మల గురించీ మనం చూస్తాం. తుమ్మ కర్రతో చెయ్యబడిన ఈ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ పలకలు తయారు చెయ్యబడిన తుమ్మ కర్ర యేసుక్రీస్తు మానవత్వానికీ ఆ పలకలపై పొదిగించబడిన బంగారు రేకు ఆయన దైవత్వానికీ ఆ పలకలక్రింద‌ ఉంచబడిన‌ వెండి దిమ్మలు ఆయన కలిగించే‌ విమోచనకూ సాదృష్యంగా ఉన్నాయి. ఈ ప్రత్యక్షగుడారం యేసుక్రీస్తు శరీరధారణకు సాదృష్యంగా ఉందని నేను‌ ఇప్పటికే వివరించాను.

నిర్గమకాండము 26:30
అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.

25వ అధ్యాయం 9,40 వచనాలలో దేవుడు మోషేతో పలికిన మాటలనే ఆయన మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఆ సందర్భాలలో నేను వివరించినట్టుగా, ఈ ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు నివసించబోయే, ఆయన ఆరాధించబడే స్థలం కాబట్టి, దాని నిర్మాణం విషయంలో ఆయన చెప్పింది మాత్రమే చేసితీరాలి. ఇందులో పతనస్వభావియైన మానవుని స్వచిత్తానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ నియమాన్ని మనం ఆయన విషయంలో జరిగించే ప్రతీకార్యానికీ ఆపాదించుకోవాలి.

నిర్గమకాండము 26:31-34
మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.

ఈ వచనాలలో ప్రత్యక్ష గుడారం ఒక అడ్డ తెరద్వారా పరిశుద్ధస్థలం మరియు అతి పరిశుద్ధస్థలంగా వేరుపరచబడుతున్నట్టు మనం చూస్తాం. అతి పరిశుద్ధస్థలంలో మందసం ఉంటుంది. ఆ ప్రదేశంలోకి ఒక్క ప్రధానయాజకుడికి మాత్రమే అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే పాపపరిహారార్థ రక్తప్రోక్షణ నిమిత్తం ప్రవేశభాగ్యం‌ కలుగుతుంది (హెబ్రీ 9:7). ఈ విధంగా ఈ అడ్డ తెర అనేది మానవుని పాపం‌కారణంగా దేవునితో‌ అతనికి కలిగిన యెడబాటును సూచిస్తుంది. యేసుక్రీస్తు బలిద్వారా మాత్రమే దేవునితో మానవునికి కలిగిన ఆ యెడబాటు తొలగి ఆయన సన్నిధిలో ప్రవేశించే అర్హత లభించింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు అడ్డ తెర చిరిగిపోయినట్టు మనం చదువుతాం (లూకా 23:45). ఈ విషయం మనకు హెబ్రీ గ్రంథకర్త మరింతగా వివరిస్తున్నాడు.

హెబ్రీయులకు 9:8 దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

హెబ్రీయులకు 9:11,12 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

హెబ్రీయులకు 10:19,20 సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.

నిర్గమకాండము 26:35-37
అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచ వలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.

అడ్డ తెర అవతల అనగా అతిపరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం, బంగారు దూపార్తి ఉంచబడితే ఈ వచనాల ప్రకారం ఆ తెరకు ఇవతల దీపవృక్షం, సముఖపు రొట్టెలు ఉండే‌ బల్ల మరియు ఇతర‌ వస్తువులు ఉంచబడతాయి. ఆ తెరకు తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడి ఇత్తడి దిమ్మలు గల ఐదు స్థంబాలు ఉంటాయి. నేను పైభాగంలో తెలియచేసినట్టుగా ఈ పని అంతా చాలా ప్రయాసతోనూ విలువతోనూ కూడుకున్నది.‌ అయినప్పటికీ ఇశ్రాయేలీయులు దానిని విజయవంతంగా నిర్మించారు. ఎందుకంటే, వారికి ఆ వనరులనూ, బలాన్నీ, జ్ఞానాన్నీ ఇచ్చింది ఆయనే. అలాంటి ఆయన వారిమధ్య నివసించడానికి సిద్ధపడినప్పుడు వారు దానికోసం ప్రయాసపడడం, తమకున్న విలువైన వాటిని మనస్పూర్తిగా ఆయన నివాసానికి ఇవ్వడం కేవలం ఆయనకు వారు చూపుతున్న కృతజ్ఞత‌మాత్రమే. ఇశ్రాయేలీయులు చూపించిన ఈ కృతజ్ఞతా మాదిరిని సంఘనిర్మాణంలో మనమంతా అనుసరించగలగాలి. సంఘంగా అనేకులను ఆయనకు నివాసస్థలంగా మార్చడం కోసం, శక్తివంచన లేకుండా ప్రయాసపడాలి (సువార్త ప్రకటించాలి). దానికోసం ఆయన మనకిచ్చిన వనరులను, వరాలనూ మనస్పూర్తిగా వినియోగించాలి, ఈ విషయంలో ఆదిమ సంఘం కూడా మనకు మంచి మాదిరిగా ఉంది. వారు సంఘ నిర్మాణం కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచెయ్యలేదు. తమ ఆస్తులను కోల్పోయినప్పటికీ వెనకడుగు వెయ్యలేదు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.