పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్
పరిచయం:

విషయసూచిక;,1:1-3, 1:4, 1:5 , 1:6,7, 1:8 , 1:9,10 ,1:11 , 1:12 , 1:1314 , 1:15,16 , 1:17 , 1:18,19, 1:20,21 , 1:22

గ్రంథ పరిచయం:

ఆదికాండము గ్రంథానికి కొనసాగింపుగా నిర్గమకాండము రాయబడింది. సెప్టువజింటు అనువాదకులు దీనికి Έξοδος (Exodus) అని పేరు పెట్టారు. దానికి మన తెలుగులో నిర్గమం అని అర్థం, అదే నిర్గమకాండము‌ గా పిలవబడుతుంది. నిర్గమం అంటే బయలువెళ్ళడం. 70మందిగా ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, లక్షలమందిగా విస్తరించి, ఐగుప్తు నుండి ఎలా బయటకు వెళ్ళారో, ఎలాంటి అద్భుతాల కారణంగా అలా వెళ్ళారో ఈ గ్రంథం‌‌ వివరిస్తుంది. అదేవిధంగా ఐగుప్తు నుండి బయటకు వెళ్ళిన ఆ ఇశ్రాయేలీయులు దేవుని నుండి పొందుకున్న ఆజ్ఞలను, ప్రత్యక్షగుడారానికి సంబంధించిన విధులను కూడా ఇందులో మనం చదువుతాం. ప్రాచీన యూదులు మరియు యేసుక్రీస్తు, అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23). వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ ఐదు పుస్తకాల గురించి కొన్ని సందర్భాలలో, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా 24:44)

నిర్గమకాండము 1:1-3

ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

ఆదికాండము 45,46 అధ్యాయాల ప్రకారం, ఐగుప్తుకు ప్రధానిగా నియమించబడిన యోసేపు, తనవద్దకు ధాన్యం కొనుగోలు చెయ్యడానికి వచ్చిన తన అన్నలను కనుగొని, వారి ద్వారా యాకోబు కుటుంబమంతటినీ ఐగుప్తుకు రప్పించడం జరిగింది. ఈ వచనాలలో మోషే అలా ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుమారుల పేర్లను మరోసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.

నిర్గమకాండము 1:4

యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

ఈ వచనంలో యాకోబు గర్భాన పుట్టినవారు (మనవళ్ళతో సహా) 70మందని రాయబడడం మనం చూస్తాం. వాస్తవానికి యాకోబు గర్భాన పుట్టిన సంతానం 69‌ మంది మాత్రమే, ఇక్కడ మోషే "యాకోబుతో కలిపి మొత్తంగా" ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకంటే ఆదికాండము 46:26 ప్రకారం, యాకోబుతో కలసి ఐగుప్తుకు వచ్చిన అతని సంతానం 66 మంది (కోడళ్ళను మినహాయించి). వారికి అప్పటికే ఐగుప్తులో ఉన్న యోసేపునూ, అతని ఇద్దరి కుమారులనూ జతచేస్తే 69 మంది. ఆ విధంగా యాకోబు మరియు అతని సంతానం కలపి 69+1 = 70 మంది (ఆదికాండము 46:27.).

దీనికి మరో స్పష్టమైన ఆధారం ఏంటంటే,

ద్వితియోపదేశకాండము 10: 22 నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.

ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులతో " నీ పితరులు 70మందియై" ఐగుప్తుకు వెళ్ళారని చెప్పడం మనం చూస్తాం. ఒకవేళ నిర్గమకాండము 1:4లో చెప్పబడిన 70 మంది, అక్కడ వాడబడిన భాషను బట్టి యాకోబు కాకుండా అతని సంతానమే మనం భావిస్తే, ఇక్కడ అదే మోషే యాకోబుతో కలపి 71మంది అని చెప్పేవాడు. ఎందుకంటే ఐగుప్తుకు వెళ్ళిన ఇశ్రాయేలీయుల పితరుల్లో, యాకోబు కూడా ఉండి అక్కడ 17 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి నాలుగవ వచనంలో 70మంది అన్నపుడు యాకోబుతో కలిపి మొత్తంగా ఆ సంఖ్య చెప్పబడిందని మనం అర్థం చేసుకోవాలి.

ఇటువంటి భాష లేఖనాలలో మనకు సాధారణంగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.

ఆదికాండము 35:23-26 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

ఈ వచనాలలో యాకోబు కుమారులు పన్నెండుమందీ అతనికి పద్దనరాములో పుట్టినట్టు రాయబడింది. కానీ యాకోబుకు పద్దనరాములో పుట్టింది పదకొండుమంది మాత్రమే. బెన్యామీను ఎఫ్రాతామార్గం (కనాను దేశం) లో జన్మించాడు (ఆదికాండము35:16-20.). కానీ మోషే ఇక్కడ ఎక్కువమంది కుమారులు పుట్టిన పద్దనరామునే ప్రస్తావిస్తూ అక్కడ పుట్టినవారిలో బెన్యామీనును కూడా కలిపేసి మొత్తంగా వివరించాడు. ఎందుకంటే బెన్యామీను ఎక్కడ పుట్టాడో అప్పటికే అతను వివరణ ఇచ్చాడు కాబట్టి, అతనికోసం మరలా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. యాకోబు సంతానం‌ విషయంలో కూడా మోషే ఆదికాండము 46వ అధ్యాయంలో 69మందని వివరించాడు కాబట్టి, ఇక్కడ యాకోబును విడిగా ప్రస్తావించకుండా మొత్తంగా 70 మందని రాస్తున్నాడు.

అదేవిధంగా, ఐగుప్తుకు‌ వచ్చిన యాకోబు‌ కుటుంబం విషయంలో, ఒకచోట 66, మరోచోట 70, ఇంకోచోట 75 అని రాయబడడాన్ని‌ బట్టి కొందరు దీనిని‌ వైరుధ్యంగా ప్రస్తావిస్తుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి వైరుధ్యం‌ లేదు. దీనిగురించి ఇప్పటికే నేను ఆదికాండము 46వ అధ్యాయంలో వివరించాను (ఆదికాండము46:26వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 1:5

అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

ఆదికాండము 45వ అధ్యాయం‌ ప్రకారం, యోసేపు తన‌ అన్నదమ్ములకు కనపరచుకున్నపుడు తన తండ్రినీ, మిగిలిన కుటుంబాన్నీ ఐగుప్తుకు రప్పించడానికి వారినే పంపించాడు తప్ప, తనకు అప్పగించబడిన బాధ్యతలను బట్టి తాను వెళ్ళలేదు. ఈ ప్రకారంగా యాకోబు కుటుంబం ఐగుప్తుకు వచ్చేసరికి యోసేపు అతని కుమారులు ఐగుప్తులోనే నివసిస్తున్నారు. దానినే ఈ వచనంలో మనం‌‌‌ చూస్తాం. అయినప్పటికీ యోసేపు మరియు అతని‌ కుమారులు ఐగుప్తుకు పరదేశులుగా వచ్చినట్టే. ఎందుకంటే అది వారిదేశం కాదు, దేవుడు వాగ్దానం చేసిన కనాను వారి దేశం.

నిర్గమకాండము 1:6,7

యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.

ఈ వచనాలలో తన కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించిన యోసేపు మరియు అక్కడికి వచ్చిన‌ అతని సహోదరులు చనిపోవడం, వారి సంతానమైన ఇశ్రాయేలీయులు, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులకు చేసిన వాగ్దానం ప్రకారం బహుగా విస్తరించడం మనం చూస్తాం.‌ వీరి విస్తరణ ఎంత అసమాన్యంగా ఉందంటే, మోషే నాయకత్వంలో వీరు ఐగుప్తును విడిచివెళ్ళేటపుడు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాకుండా యుద్ధం చేయగలిగిన పురుషులే ఆరులక్షల వీరులుగా బయలుదేరారు. దీనంతటికీ పట్టిన సమయం కేవలం 215 సంవత్సరాలు మాత్రమే. ఈ సమయంలోనే 70మందిగా ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు లక్షలసంఖ్యలో విస్తరించారు. అందుకే పై వచనంలో వీరిగురించి "బహు సంతానము గలవారై", "అభివృద్ధి పొంది విస్తరించి", "అత్యధికముగా ప్రబలిరి", "వారున్న ప్రదేశము వారితో నిండియుండెను" అని నాలుగు విధాలుగా వర్ణించబడింది.

(కొందరు (నిర్గమకాండము 12:40) లో రాయబడిన మాటలను ఆధారం చేసుకుని ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని భావిస్తుంటారు, కానీ ఆ వచనం తర్జుమాలో లోపం‌ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది కేవలం‌ 215 సంవత్సరాలు మాత్రమే. ఈ క్రింద సూచించిన లింక్ ద్వారా దీనంతటినీ వివరిస్తూ రాయబడిన వ్యాసం చదవండి)

"ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా నివసించారు? 430/400/215?"

అదేవిధంగా, ఇశ్రాయేలీయులు కాపురమున్న ప్రదేశం పేరు గోషెను, దీనినే రామెసేసు అని కూడా అంటారు (11 వచనం). యోసేపు కనానుదేశంలో కరువువల్ల తన కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించినప్పటికీ, ఆ కుటుంబం‌ ఐగుప్తు ఆచారాలను బట్టి కలుషితం కాకూడదనే ఉద్దేశంతో, వారిని ఐగుప్తీయుల మధ్యలో కాకుండా గోషెను అనే ప్రత్యేక ప్రాంతంలో నివసింపచేసాడు.

నిర్గమకాండము 1:8

అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను.

6వ వచనం ప్రకారం యోసేపు మరియు అతని అన్నదమ్ములంతా చనిపోవడాన్ని బట్టి, ఐగుప్తు దేశంలో కూడా యోసేపుతో పరిచయమున్న తరమంతా గతించిపోయి ఇప్పుడు ఒక కొత్తతరం, కొత్త పరిపాలన ఉనికిలోకి వచ్చింది. దానినే ఈ వచనంలో‌ మనం‌ చూస్తున్నాం. అయితే ఇక్కడ "యోసేపును‌ ఎరుగని కొత్తరాజు" అన్నపుడు అతనికి యోసేపు‌ గురించి‌ ఏమీ తెలియదని అర్థం కాదు. ఎందుకంటే ఒకటి రెండు తరాలు గడిచినంత మాత్రాన ఐగుప్తు చరిత్రలో యోసేపు ప్రాముఖ్యత అంత సులభంగా కనుమరుగవ్వడం సాధ్యం కాదు. యోసేపు అనే వ్యక్తి కరువు సమయంలో ఐగుప్తుకు చేసిన ఉపకారానికి సాక్ష్యాలుగా, సజీవంగా నిలిచియున్న ఐగుప్తుదేశం, మరియు అక్కడికి రప్పించబడిన అతని‌ కుటుంబం (ఇశ్రాయేలీయులు) కళ్ళముందు ఉన్నాయి. అంతేకాకుండా అప్పటికి యోసేపు సమాధి‌ కూడా ఐగుప్తులోనే‌ ఉంది (ఆదికాండము 50:26).

ఈ వచనంలో యోసేపును "ఎరుగని" కొత్త రాజు అని తర్జుమా చేయబడిన చోట హీబ్రూలో వాడిన יָדַ֖ע (yā-ḏa) అనేపదానికి "ఆమోదించని, అంగీకరించని" అనే భావం కూడా వస్తుంది. ఉదాహరణకు ఈ వచనాలు చూడండి.

న్యాయాధిపతులు 2:10 ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా-

ఈ వచనంలో యెహోవానైననూ, ఆయన చేసిన కార్యములనైననూ ఎరుగని తరం ఇశ్రాయేలీయుల్లో పుట్టిందని రాయబడింది. కానీ ఈ తరానికి యెహోవా దేవుడు మరియు, ఆయన చేసిన‌ కార్యాలు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రతీతరంవారూ తమ భవిష్యత్తు తరాలకు యెహోవా దేవునికోసం ఆయన చేసిన కార్యాలకోసం వివరించాలని పితరులకు ఆజ్ఞాపించబడింది. అప్పటికే రాయబడిన మోషే ధర్మశాస్త్రం, అందులోని పండుగలు, వారు పంచుకుంటున్న కనానుదేశం కూడా యెహోవా దేవునికీ, ఆయన చేసిన కార్యాలకూ సాక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యెహోవానైననూ ఆయన చేసిన కార్యాలనైననూ "ఎరుగని" తరం పుట్టింది అన్నపుడు, ఆ తరం యెహోవా దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలనూ అంగీకరించక, గుర్తించక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని మనం అర్థం చేసుకోవాలి.

హొషేయ 2:8 దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనేయని విచారింపక అది వాటిని బయలు దేవతకు ఉపయోగపరచెను.

ఈ వచనంలో "విచారింపక" అన్నపుడు కూడా హీబ్రూలో (yā-ḏa) అనే పదమే ఉపయోగించబడింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు యెహోవా దేవుడు తెలుసు కానీ, ఆయనను‌ వారు దేవునిగా అంగీకరించకుండా బయలుదేవతను పూజించడం ప్రారంభించారు. కాబట్టి, "యోసేపును ఎరుగని కొత్తరాజు ఏలనారంభించెను" అన్నపుడు, ఆ రాజు యోసేపును కానీ, యోసేపు తీసుకువచ్చిన పరిపాలనా‌ విధానాన్ని కానీ ఆమోదించని, అంగీకరించనివాడు అని మనం అర్థం చేసుకోవాలి.

అదేవిధంగా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. గతంలో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా నియమించబడి, తన‌ జ్ఞానంతో ఆ దేశాన్నే కాదు, చుట్టుపక్కల దేశాలను కూడా కరువు నుండి‌ కాపాడాడు. ఐగుప్తు దేశంలో‌ ఎన్నో ఉన్నతమైన కార్యాలూ, సంస్కరణలూ చేసాడు. కానీ అతను చనిపోయిన కొంతకాలానికే అతనిని ఆమోదించని, అంగీకరించని రాజు ఒకడు అధికారంలోకి వచ్చాడు. ఐగుప్తు ప్రజలు‌ కూడా అలాంటి వైఖరే కలిగున్నారు. కాబట్టి ఈలోకంలో మనం ఎంత గొప్పస్థాయిలో బ్రతికినా, ఎలాంటి గొప్పగొప్ప కార్యాలు చేసినా మన మరణం‌ తరువాత కొంతకాలానికి అవన్నీ మరుగునపడిపోతాయి.

ప్రసంగి 9:5 బ్రదికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

కానీ మనం, ఈలోకంలో మనకోసమే కాకుండా దేవునికోసం కూడా బ్రతికితే మనం చేసినదానిని మరచిపోవడానికి ఆయన అన్యాయస్థుడు కాడని లేఖనం చెబుతుంది. కాబట్టి ఆయన తప్పకుండా మనకు ప్రతిఫలం‌ ఇస్తాడు, యోసేపు కూడా దేవునికోసం‌ బ్రతికిన కారణాన్ని బట్టి ఐగుప్తు అతడిని మరిచిపోయినా అతని ప్రతిఫలం దేవుని చేతిలో నిలచియుంది.

హెబ్రీయులకు 6:10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.

రోమీయులకు 2: 6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

ప్రకటన గ్రంథము 14:13 అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.

ఇక "ఫరో" గురించి మనం పరిశీలిస్తే; ఈ గ్రంథమంతటిలో "ఫరో" ప్రస్తావన వచ్చినపుడల్లా అదంతా ఒకే వ్యక్తి కోసం చెప్పబడుతుందని మనం భావించకూడదు. ఎందుకంటే "ఫరో" అనేది ఐగుప్తు రాజుల గౌరవనామం. ఆ మాట Root wordకు 'మొసలి' అనే అర్థం వస్తుంది (యెహెజ్కేలు 29:3). ఐగుప్తీయులు నైలునదిలో నివసించే మొసళ్ళను దేవుళ్లుగా పూజించేవారు కాబట్టి, వారు దేవుని ప్రతిరూపంగా భావించే తమ రాజును ఆ అర్థం వచ్చేలా "ఫరో"లని సంబోధించేవారు.

నిర్గమకాండము 1:9,10

అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.

ఈ వచనాలలో ఐగుప్తురాజైన ఫరో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా తన ప్రజలను ఉసిగొల్పడం మనం చూస్తాం. ఆ క్రమంలో భాగంగా అతను ఇశ్రాయేలీయులు‌ మనకంటే విస్తారంగా, బలమైనవారిగా ఉన్నారని వారివల్ల యుద్ధం‌ కలిగేటప్పుడు ఈ దేశానికే ప్రమాదమని ఐగుప్తీయులకు అబద్ధాలు నూరిపోస్తున్నాడు. వాస్తవానికి కేవలం గోషెను ప్రాంతంలో మాత్రమే నివసిస్తున్న ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశం‌ మొత్తంలో‌‌ ఉన్న‌ ఐగుప్తీయులకంటే సంఖ్యాపరంగా అధికులు కాలేరు. ఇక్కడ ఫరో కేవలం తన‌ ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే‌ ఇలాంటి అబద్ధపు మాటలు చెబుతున్నాడు. ఇలా చెయ్యడంలో అతని అసలు ఉద్దేశం ఏంటో ముందు ముందు చూద్దాం.

అయితే ఫరో ఒక్కడే కాదు, ప్రతీ తరంలోనూ దేవునిపిల్లలను హింసించిన ఆయాదేశపు రాజులు, వీరివల్ల దేశానికి ప్రమాదమనే ఆరోపణ ద్వారానే వారిని హింసించారు. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి;

ఎస్తేరు 3: 8 అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

ఎజ్రా 4:12,13 తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకార ములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

ప్రస్తుతం అనేకదేశాల్లో దేవునిపిల్లలపై అధికశాతంలో దాడులు జరుగుతుంది కూడా "వీరివల్ల దేశానికి ప్రమాదమనే" అబద్ధపు ఆరోపణ కారణంగానే.

ఫరో మాటలను ఇంకా‌ మనం పరిశీలిస్తే, అతను "వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి" అంటూ పిలుపునిస్తున్నాడు. ఇక్కడ ఫరో ఇశ్రాయేలీయులను తనకున్న సైన్యబలంతో అణచివెయ్యాలని చూడడం లేదు కానీ, వారు ఆ దేశంలో చేస్తున్న పనులద్వారానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనినే ఫరో యుక్తిగల ఆలోచనగా భావిస్తున్నాడు. దుష్టత్వంలో ఉన్నవాడు తన దుష్టప్రణాళికనే యుక్తిగా భ్రమపడతాడు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇటువంటి లక్షణం దుష్టులందరిలోనూ సహజంగా కనిపిస్తుంటుంది.

ఒకవేళ ఐగుప్తీయులకూ ఆ దేశపు శత్రువులకూ మధ్యలో యుద్ధం‌ జరిగినపుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల శత్రువులతో చేతులు కలుపుతారు అన్నదే ఫరో భయమైతే, అతను ఇశ్రాయేలీయులను అణచివెయ్యాలనే దుష్టప్రణాళికలు రూపొందించకుండా వారిని సులభంగా ఐగుప్తు నుండి వెళ్ళగొట్టేవాడు. ఎందుకంటే ఐగుప్తుదేశం ఇశ్రాయేలీయుల స్వదేశం కాదు. ఇది ఇశ్రాయేలీయులకు కూడా బాగా తెలుసు.

అయితే ఫరో వారు ఐగుప్తు నుండి ఎక్కడ వెళ్ళిపోతారో అనే ఆందోళనతోనే ఇటువంటి కుట్రను పన్నుతున్నాడు. అందుకే "యీ దేశములో నుండి, వెళ్లిపోదురేమో" అంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల కష్టంవల్ల ఐగుప్తుకు ఎంతో‌ మేలు జరుగుతూ ఉంది. అది కోల్పోవడం‌ ఫరోకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీయుల పట్ల దుష్టప్రణాళికను రూపొందించడంలో ఫరోకు ఉన్న అసలు ఉద్దేశం‌ ఇదే. ఒకవిధంగా ఇతను ఇశ్రాయేలీయులను తమ పితరులకు దేవుడు వాగ్దానం‌ చేసిన కనానుకు తిరిగివెళ్ళనివ్వకుండా అణచివేతతో అడ్డుకట్టలు వెయ్యాలని చూస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనముందు కూడా పరలోకం చేరనివ్వకుండా చెయ్యాలనే అడ్డుకట్టలు వెయ్యబడుతుంటాయి. దేవునికి సమయాన్ని ఇవ్వనివ్వకుండా మనపై మోపబడే పనులభారం అందులో‌ భాగమే. కానీ చివరికి ఫరో ఎలాగైతే ఇశ్రాయేలీయులను కనానుకు చేరనియ్యకుండా ఆపలేకపోయాడో, మనల్ని కూడా ఈ లోకం‌ పరలోకం చేరనివ్వకుండా ఆపలేదు.

నిర్గమకాండము 1:11

కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

ఈ వచనంలో ఫరో ఇశ్రాయేలీయులను అణచివెయ్యడానికి పన్నిన దుష్టపన్నాగం ప్రకారం వారిపై అధికారులను నిర్ణయించి కఠినమైన పనులు చేయించడం మనం చూస్తాం. ఇక్కడ ఫరో ఇశ్రాయేలీయులపై ఎటువంటి సైనికచర్యా తీసుకుని వారిని అణచివెయ్యడం లేదు, ఎందుకంటే ఆ ప్రజలు ఐగుప్తీయులతో సమాధానంగా ఉంటున్నారు. అందుకే ఫరో కుయుక్తిగా ఇశ్రాయేలీయులపై పనిభారం అధికంగా మోపి వారిని శ్రమపెట్టాలని అనుకుంటున్నాడు. దీనిద్వారా వారి ఆరోగ్యం క్షీణించి, బలహీనమైన పిల్లలను కనాలని, లేదా ఆ పనిభారాన్ని బట్టి కుటుంబంతో ఆనందంగా గడపలేక వివాహజీవితాలకు దూరంగా ఉండాలని ఫరో కోరిక. ఇలా వారిచేత కఠినసేవ చేయించుకున్నపుడు ఆరోగ్యపరంగా, సంఖ్యాపరంగా ఆ జాతి క్షీణించిపోతుంది. అదే కనుక జరిగితే అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణం తప్పిపోతుంది. ఇది ఫరో పన్నాగం వెనుక అపవాది పన్నిన పన్నాగం.

ఐగుప్తు దేశానికి 70మందిగా వెళ్ళిన ఇశ్రాయేలీయులు, యోసేపు జీవించినంతకాలం, యోసేపును ఆమోదించిన ఐగుప్తు తరం ఉనికిలో ఉన్నంతకాలం, ఎటువంటి అధికభారం మొయ్యకుండా తమపని తాము చేసుకుంటూ సౌకర్యవంతంగా జీవించారు, ఊహించని విధంగా విస్తరించారు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి అంతే ఊహించని విధంగా తారుమారు అయ్యింది. కాబట్టి ఈలోకంలో మన జీవితాలు ఎప్పుడూ సుఖవంతంగానే గడచిపోవు, కొన్ని సమయాల్లో మనం ఊహించని శ్రమలూ, భారాలూ మనపై మోపబడుతుంటాయి. ఆ సమయంలో మనం‌ కృంగిపోకుండా దేవుడు కలిగించే విడుదల కొరకు ఎదురుచూడాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లోకి ఆనందాన్ని అనుమతించి కొన్ని పాఠాలు, శ్రమలను అనుమతించి మరికొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు. అన్నీ మనకు అవసరమైనవే.

ప్రసంగి 7: 14 ​సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.

అదేవిధంగా ఇశ్రాయేలీయులు "ఫరో కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టినట్లు" ఈ వచనంలో మనం చూస్తున్నాం. కొందరు బైబిల్ పండితుల పరిశోధన ప్రకారం వీరు పిరమిడ్లను, నైలు నదిపై వంతెనలను కూడా నిర్మించారు.

నిర్గమకాండము 1:12

అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఫరో పన్నిన పన్నాగానికి విరుద్ధంగా అత్యధికంగా విస్తరించడం, ఫరో మరియు అతని ప్రజలు వారి విస్తరణ చూసి అసహ్యపడడం మనం చూస్తాం.‌ ఇశ్రాయేలీయులపై పనిభారం అధికంగా మోపి వారిని శ్రమపెట్టడం ద్వారా వారి ఆరోగ్యాలు కృంగిపోవాలని, వారికి పుట్టే పిల్లలు బలహీనులుగా ఉండాలని, చివరికి వారు కుటుంబంతో ఆనందంగా గడపలేక‌ వివాహజీవితాలకు కూడా దూరమై జాతి విస్తరణ నిలచిపోవాలన్నది ఫరో ఉద్దేశం. కానీ ఆ ప్రజలకు దేవుడు తోడైయుండడాన్ని బట్టి, ఆయన తన ప్రమాణాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు‌ కాబట్టి, ఫరో ఊహించినవి ఏవీ జరగడం లేదు. ఇశ్రాయేలీయులు కూడా తమపై అధికభారం మోపబడి, జీవితం‌ భారభరితంగా మారినప్పటికీ దేవుని సంకల్పమైన వివాహ జీవితాన్ని తృణీకరించలేదు. ఎందుకంటే దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం నెరవేరాలంటే, వారు ఫలించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని ప్రమాణం‌ విషయంలో తమపై ఉన్న‌ బాధ్యతను గుర్తిస్తూ దానిని విస్మరించకుండా జాగ్రత్తపడ్డారు.

మనం కూడా శ్రమలమార్గంలో పయనిస్తున్నపుడు, మనమున్న పరిస్థితులను బట్టి, మనలో కలిగే ఆలోచనలను బట్టి దేవుని ప్రమాణం‌ విషయంలో మన బాధ్యతలను విస్మరించకుండా జాగ్రతపడాలి. పరలోకం‌ చేరుస్తానన్నది దేవుడు మనకు చేసిన ప్రమాణం. లేఖనాలలో వెల్లడిచేయబడిన ఆయన ఆజ్ఞలకు‌ విధేయత చూపించడం, ఆయన ఉద్దేశాలకు అనుకూలంగా ప్రవర్తించడం మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు.

అదేవిధంగా ఈ వచనంలో ఇశ్రాయేలీయుల విషయంలో చూసిన విస్తరణ, మనం సంఘచరిత్రలో కూడా చూస్తాం. వారు ఎలా అయితే ఐగుప్తీయులు తమను శ్రమపెడుతున్నకొలదీ క్షీణించిపోకుండా విస్తరించారో, సంఘం కూడా శ్రమల్లో క్షీణించిపోకుండా బహుగా విస్తరించింది, నేటికీ విస్తరిస్తుంది. ఎందుకంటే ఈ‌ ఇరుప్రజల వెనుకున్నదీ ఒకే దేవాదిదేవుడు. కానీ‌ లోకం‌ వీరి విస్తరణను చూసి వారి వెనుకున్నది దేవాదిదేవుడని గుర్తించి పశ్చాత్తాపపడకుండా, మరింత దుష్టత్వంలో కూరుకుపోయింది. అందుకే "ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీయుల విస్తరణ చూసి అసహ్యపడినట్టు రాయబడింది" వారు ఇశ్రాయేలీయుల విస్తరణ చూసి అసహ్యపడి వారిపై మరింత పగపట్టారు తప్ప, మనం దేవునితో పోరాడుతున్నామని గుర్తించి మారుమనస్సు పొందలేదు. ఇది దుష్టులకు (నాశనానికి నిర్ణయించబడినవారిలో) ఉండే సహజలక్షణం. వీరు దేవునికార్యాలను ప్రత్యక్షంగా గమనించినప్పటికీ, వాటినిబట్టి మారుమనస్సు పొందలేరు. అందుకే యూదా మతపెద్దలు కూడా సంఘం‌ విషయంలో గమలీయేలు ఆలోచనను తృణీకరించి, శిష్యులను హింసించి నాశనానికి లోనయ్యారు.

అపొస్తలుల కార్యములు 5:38,39 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

(1 థెస్సలొనీకయులకు 2:15,16) ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచూ,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికీ విరోధులునైయున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.

నిర్గమకాండము 1:13,14

ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు ఎలాంటి కఠినమైన పనులు చేయించేవారో మనం చూస్తాం. దేవుడు ఇటువంటి కఠినమైన పరిస్థితిని ఇశ్రాయేలీయుల జీవితంలోకి అనుమతించడం ద్వారా, పరదేశుల విషయంలో వీరు ఎటువంటి‌ కనికరమైన వైఖరిని కలిగియుండాలో‌ బోధించాడు(నిర్గమకాండము 22:21, 23:9, లేవీకాండము 19:34, ద్వితీయోపదేశకాండము 10:19). కాబట్టి నేను పైన జ్ఞాపకం చేసినవిధంగా దేవుడు మన జీవితాల్లోకి శ్రమలను, మనకు కొన్ని పాఠాలను నేర్పించి, మన వైఖరిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అనుమతిస్తాడు.

నిర్గమకాండము 1:15,16

మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.

ఈ వచనాలలో ఫరో హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, ఇశ్రాయేలీయుల్లో మగపిల్లలను చంపమనడం‌ మనం చూస్తాం. ఇక్కడ మంత్రసానులు అంటే మంత్రాలు వేసేవారు అని‌ కాదు కానీ, మన తెలుగులో ఇంటివద్ద కానుపు వేసేవారిని అలా సంబోధిస్తారు కాబట్టి తర్జుమాలో ఆ పదం వాడడం జరిగింది. ఇంగ్లీషులో వీరిని ఉద్దేశించి Midwives అనేపదం వాడబడింది. అదేవిధంగా వీరి పేర్లను బట్టి వీరు కూడా ఇశ్రాయేలీయులే అని కొందరు అభిప్రాయపడ్డారు, కానీ ఫరో ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపడానికి వారి స్వజాతి మంత్రసానులనే సంప్రదించాడా? దానికి‌ వారు అంగీకరిస్తారని‌ భావించాడా? అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. పైగా క్రింది వచనాల్లో వారి వంశాభివృద్ధి కూడా ఇశ్రాయేలీయులకు వేరుగా చెప్పబడింది. ఈ కారణంగా వారు ఇశ్రాయేలీయులకు చెందినవారే అని కచ్చితంగా చెప్పలేము. వారు ఐగుప్తీయులే అయ్యుండి, గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీయుల మంత్రసానులుగా పనిచేస్తుండవచ్చు.

ఆకాలంలో యుద్ధాలు జరుగుతున్నపుడు అందులో పురుషులే పాల్గొనేవారు, పైగా వంశాభివృద్ధి కూడా వారి ద్వారానే జరుగుతుంది. అందుకే ఫరో ఇక్కడ ఇశ్రాయేలీయుల్లో మగపిల్లలను చంపమని, ఆడపిల్లలను బ్రతకనివ్వమని మంత్రసానులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దీనివల్ల ఇశ్రాయేలీయుల జాతి విస్తరణ నిలచిపోయి నాశనం ఔతుంది.

నిర్గమకాండము 1:17

అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా-

ఈ వచనంలో మంత్రసానులు దేవునికి భయపడి, ఫరో ఆజ్ఞచొప్పున ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపకుండా వారిని కాపాడడం మనం చూస్తాం. ఎందుకంటే ఫరో వారిని చెయ్యమన్నది ఎంతో క్రూరమైన కార్యమని, అది దేవునియెదుట ఘోర పాపమని వారికి తెలుసు. అందుకే వారు ఆ విషయంలో ఫరో ఆజ్ఞ పట్ల కాకుండా దేవునిపట్ల‌ తమ భయాన్ని కనపరిచారు. విశ్వాసులమైన‌ మనం కూడా, ఎవరో బలవంతపెట్టారని కాని, ఎక్కువమంది ప్రజలు ఆ వైపుకే మొగ్గుచూపుతున్నారని కాని, ఏదిబడితే అది చెయ్యకుండా మనం‌ చేసే కార్యాలు వాక్యపరిధిలో పరిశీలించుకుని చెయ్యాలి. అధికారులకు లోబడమని బైబిల్ కూడా ఆజ్ఞాపిస్తున్నప్పటికీ, అందులో అధికారం చాటున వారు చేసే అన్యాయమైన, క్రూరమైన కార్యాలను కూడా మనం మన్నించాలనే భావం లేదు. ఏదైనా వాక్యసమ్మతంగా ఉన్నంతవరకే మనకూ సమ్మతం, ఒకవేళ ఏదైనా వాక్యవిరుద్ధంగా ఉంటే అది మనకూ విరుద్ధమే.

అందుకే షద్రకు మేషాకు అబేద్నెగోలు‌ నెబుకద్నెజరు చేసిన దైవవిరుద్ధమైన చట్టం‌ విషయంలో కఠినంగా బదులిచ్చారు, అపోస్తలులు కూడా ఈ విషయంలో మనకు మెలకువలు నేర్పించారు.

దానియేలు 3:14-18 అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు.

మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

అపొస్తలుల కార్యములు 4:19,20 అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి.

నిర్గమకాండము 1:18,19

ఐగుప్తురాజు ఆ మంత్ర సానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్ర సానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.

ఈ వచనాలలో ఫరో ఆ మంత్రసానులు తన ఆదేశానికి‌ వ్యతిరేకంగా హెబ్రీయుల మగపిల్లలను బ్రతుకనిస్తున్నారని జనసంఖ్యను బట్టి గుర్తించి, వారిని ప్రశ్నించడం, దానికి వారు ఇశ్రాయేలీయుల స్త్రీల పరిస్థితిని వివరించి తప్పించుకోవడం మనం చూస్తాం. దీనిని పట్టుకుని కొందరు బైబిల్ విమర్శకులు ఈ మంత్రసానులు ఫరోకు అబద్ధాలు చెప్పినప్పటికీ "దేవుడు వారికి మేలు చేసాడని", దీనిప్రకారం బైబిల్ దేవుడు అబద్ధాలను ఆమోదిస్తాడని విమర్శిస్తుంటారు. కానీ ఇక్కడ ఆ మంత్రసానులు చెబుతున్నదానిలో ఎటువంటి అబద్ధం లేదు. ఇశ్రాయేలీయుల స్త్రీలు అప్పటికే బానిసలుగా కఠినమైన పనులు చేస్తున్నారు కాబట్టి, వారి శారీరక కష్టాన్ని బట్టి, వారు తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి ( నిర్గమకాండము 16:3, సంఖ్యాకాండము 11:5) వారికి ప్రసవం సులభంగానే జరుగుతుంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైన విషయం. అందుకే ఆ మంత్రసానులు మేము వెళ్ళకముందే వారికి ప్రసవం జరుగుతూ ఉండుండొచ్చు, అందుచేత మేము ఆ పిల్లలను చంపలేకపోయామని‌ ఫరోకు బదులిస్తున్నారు. అయితే ఈ వివరణకు 17వ వచనం ప్రకారం, "ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనివ్వడం" ఏముంది, వారికి అవకాశం లేదు కాబట్టే ఆ పిల్లలను చంపలేకపోయారుగా అనే ప్రశ్న సంధించబడుతుంది. దీనికి జవాబు ఏంటంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను చంపకుండా వదిలెయ్యడం వాస్తవమే, అదేవిధంగా ఫరోతో చెబుతున్న మాటలు కూడా వాస్తవమే. ఎలా అంటే, ఇశ్రాయేలీయుల స్త్రీలలో ఎవరైనా ప్రసనవేదన పడుతున్నపుడు వీరికి కబురు‌ పంపినా, వీరికి ఎలాగూ ఆ స్త్రీల చురుకుతనం, శారీరక బలం గురించి తెలుసు కాబట్టి, ప్రసవం అయ్యేవరకూ అక్కడికి వెళ్ళకుండా ఆలస్యం చేస్తుండవచ్చు. ఆవిధంగా వీరు ఆలస్యంగా వెళ్ళేసరికి తల్లి స్పృహలో ఉంటుంది‌ కాబట్టి ఒకవేళ వీరు చంపాలి అనుకున్నా కూడా ఆ బిడ్డను చంపలేరు. ఎందుకంటే ఈ హత్యలు రహస్యంగా జరిగించాలన్నది ఫరో ఉద్దేశం. అలాంటి ఉద్దేశమే లేకపోతే తల్లులు స్పృహలో ఉన్న కారణాన్ని బట్టి శిశువులను చంపలేకపోతున్నామనే వారి వివరణను ఫరో అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విధంగా ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను‌ బ్రతకనివ్వడమూ (ఆలస్యంగా వెళ్ళడం ద్వారా) వాస్తవమే, ఫరోకు చెబుతున్న మాటలు కూడా వాస్తవమే.

వాదన కోసం ఇదంతా పక్కనపెట్టి, ఆ మంత్రసానులు ఫరోకు అబద్ధమే చెప్పారు అనుకున్నప్పటికీ, అందులో దేవుణ్ణి‌ నిందించే అవకాశం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసింది "వారు ఆయనకు భయపడి ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపడానికి ప్రయత్నించలేదు" కాబట్టే తప్ప "ఫరోకు అబద్ధాలు చెప్పినందుకు కాదు". ఒకవేళ వారు అబద్ధమే చెప్పుంటే అది వారి వ్యక్తిగత నిర్ణయం. ఫరోకు ఆ విధంగా అబద్ధం చెప్పి తప్పించుకోమని దేవుడేమీ వారికి బోధించలేదు. వారు చేసింది‌ మంచిపని అయినప్పడు ఎటువంటి మూల్యమైనా చెల్లించడానికి సిద్ధపడి నిజమే చెప్పవచ్చు.

నిర్గమకాండము 1:20,21

దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.

ఈ వచనాలలో ఆ మంత్రసానులు దేవునికి‌ భయపడి ఇశ్రాయేలీయుల మగపిల్లలను‌ బ్రతకనివ్వడాన్ని‌ బట్టి ఆయన వారికి మేలు చెయ్యడం మనం చూస్తాం. మనుషులు దేవునిపట్ల‌ భయంతో దుష్టత్వానికి దూరంగా జీవిస్తున్నపుడు ఆయన తప్పకుండా వారికి ప్రతిఫలమిస్తాడని ఈ వచనాలు‌ మనకు బోధిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ ప్రతిఫలం వీరి విషయంలో కనిపించిన విధంగా వెంటనే కనిపించకపోవచ్చు, అయినప్పటికీ ఆ ప్రతిఫలం మాత్రం తప్పకుండా తగినసమయంలో చేరువౌతుంది.

ప్రకటన గ్రంథం 2:23 మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

అదేవిధంగా ఆయన మంత్రసానులకు "వంశాభివృద్ధి" కలుగచేసాడు అన్నచోట ఇంగ్లీషు బాషలో Houses అని తర్జుమా చేసారు. దీనిఆధారంగా కొందరు బైబిల్ పండితులు దేవుడు వారికి గృహాలను కట్టించి ఇచ్చాడని బోధించారు. వాస్తవానికి అక్కడ హీబ్రూలో వాడబడిన పదానికి House అనే అర్థం కూడా ఉన్నప్పటికీ, ఆ పదానికి Family అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ వచనాలను మనం సందర్భపరిధిలో పరిశీలించినపుడు తెలుగు తర్జుమాలో వాడబడిన "వంశాభివృద్ధి" అన్నపదమే సరైనదని అర్థమౌతుంది. వారు దేవునికి‌ భయపడ్డారు, అందువల్ల ఆయన ఇశ్రాయేలీయులతో పాటు వారి కుటుంబాలను కూడా విస్తరింపచేసాడు.

నిర్గమకాండము 1:22

అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

ఈ వచనంలో ఫరో‌ మంత్రసానుల ద్వారా తన పన్నాగం ఫలించదని గ్రహించి, మగపిల్లాడు పుడితే నదిలో‌ పారవెయ్యమని స్వయంగా ఆదేశించడం‌ మనం చూస్తాం. పతనమైన మనిషి తన దుష్ట ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి తనకున్న అవకాశాలను బట్టి ఎంతటి క్రూరుడిగా అయినా మారతాడని ఈ చర్య మనకు బోధిస్తుంది.

రోమీయులకు 3:14-18 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపమని ఫరో చేసిన ఈ ఆదేశం, అతని‌ మరణంతో కొద్దికాలంలోనే నిలచిపోయుంది. ఈ క్రూరమైన కార్యం అహరోను పుట్టిన కొంతకాలానికి ప్రారంభమై మోషే పుట్టిన కొంతకాలానికి నిలచిపోయుంది. లేకుంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి‌ బయలువెళ్ళినపుడు వారిలో యుద్ధవీరులుగా బయలువెళ్ళిన పురుషులు ఆరులక్షలమందిగా ఉండేవారు కాదు.

 
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.