పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 32:1, 32:2, 32:3 , 32:4 , 32:5 , 32:6 ,32:7,8 , 32:9 , 32:10 , 32:11-13 , 32:14 , 32:15 , 32:16 , 32:17,18 , 32:19 , 32:20 , 32:21 , 32:22-24 , 32:25 , 32:26 , 32:27 , 32:28 , 32:29 , 32:30 , 32:31 , 32:32 , 32:33 , 32:34 , 32:35.

నిర్గమకాండము 32:1
మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 
 
"మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు"
 
నిర్గమకాండము 24వ అధ్యాయంలో మోషే అప్పటివరకూ దేవుడు ఆజ్ఞాపించిన విధులను ఇశ్రాయేలీయులకు తెలియచేసిన తరువాత ఆయన ఆదేశానుసారం మరలా సీనాయి పర్వతంపైకి వెళ్తాడు. అప్పుడు ఆయన 25వ అధ్యాయం నుండి, 31వ అధ్యాయం వరకూ ప్రత్యక్షగుడార నిర్మాణం, దాని వస్తువుల తయారీ, యాజకవ్యవస్థకు సంబంధించిన విధులను తెలియచేస్తాడు. దీనికి నలబై రోజుల సమయం పడుతుంది (నిర్గమకాండము 24:18). అయితే ఇశ్రాయేలీయులు కనీసం ఈ నలబైరోజులు కూడా అతనికోసం ఎదురుచూడకుండా అంతకుముందే ఈవిధంగా ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు స్వభావాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తాం. అది కూడా చాలా తక్కువసమయంలోనే దానిని బయటపెట్టుకుంటున్నారు. నిజంగా వారు దేవునిపట్ల ఆసక్తి కలిగినవారైతే మోషే కొండమీద ఉన్న ఆ సమయంలో అతను గతంలో తెలియచేసిన దేవుని ఆజ్ఞలను స్మరించుకుంటూ ఆయనను స్తుతించేవారు. కానీ వారు అలా చెయ్యడం లేదు. కాబట్టి దేవునిపట్ల ఆసక్తిలేనివారు తమముందు దేవుడు పెట్టిన ప్రత్యామ్నాయాలను బట్టి బలపరచబడకుండా చాలా తొందరగా ఆయన మార్గం నుండి తొలగిపోతారని ఈ సందర్భం‌ మనకు తెలియచేస్తుంది. నేటి సంఘాల్లో‌ మొదట చాలా ఆసక్తిని కనపరచి తొందరగా తొలగిపోయేవారంతా వీరిలాంటివారే‌.
 
"ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము"
 
నిర్గమకాండము 24:14 ప్రకారం; మోషే యెహోషువతో కలసి కొండపైకి వెళ్తూ ప్రజల బాధ్యతను అహరోను హూరులకు అప్పగించాడు. అందుకే ఇక్కడ ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి అతనిని "లెమ్ము" అంటూ తొందరపెడుతున్నారు. దానికి కారణమేంటో తరువాత మాటల్లో వివరించబడింది. 
 
"మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి"
 
ఇక్కడ ప్రజలు అహరోనును తమకోసం ఒక దేవతను చెయ్యమని బలవంతపెడుతూ దానికి కారణంగా మమ్మల్ని ఐగుప్తునుండి రప్పించిన మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు గతంలో ఆయన ఆజ్ఞాపించిన "నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు" (నిర్గమకాండము 20:22,23) అనే మాటలకు పూర్తి వ్యతిరేకంగా  ప్రవర్తిస్తున్నారు. పైగా అప్పుడు మోషే ఆ ఆజ్ఞలను వారికి తెలియచేసినప్పుడు వాటికి మనస్పూర్తిగా సమ్మతించారు కూడా. 
 
నిర్గమకాండము 19:8 అందుకు ప్రజలందరుయెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. 
 
ఇక వారు దేవునియెదుట ఇలాంటి హేయమైన కార్యానికి పాల్పడడానికి "ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని" కారణాన్ని కూడా చెప్పడం మనం చూస్తాం. పైగా వారు మోషేను అవమానిస్తున్నట్టుగా "ఆ మోషే అనువాడు ఏమాయెనో" అని పలుకుతున్నారు. మోషే ఇప్పటివరకూ ఆ ప్రజలకోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో, ఎంతగా శ్రమపడ్డాడో మనం చదివాం. కానీ వారు అదంతా మరచిపోయి అతనిపట్ల తమ‌ విశ్వాసఘాతకాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఇక్కడ వారు దేవునిపట్ల అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే దేవునిశక్తిని బట్టి మోషే చేసిన అద్భుతాలన్నీ వారికి తెలుసు. మోషేను కొండపైకి పిలిచింది కూడా ఆయనే అని వారికి తెలుసు. అలాంటప్పుడు వారు "ఆ మోషే అనువాడు ఏమాయెనో" అని సందేహపడడానికి తావు ఎక్కడిది? మోషే ద్వారా వారిని ఐగుప్తునుండి విడిపించింది ఆయనే కాబట్టి, వారిని కనానులో ప్రవేశపెట్టడానికే అలా చేసాడు కాబట్టి, అతనిని కొండపైకి పిలిచింది ఆయనే కాబట్టి, ఆయన తప్పకుండా మోషేను వారియొద్దకు పంపిస్తాడని నిస్సందేహంగా నమ్మొచ్చు. కానీ వారు విశ్వాసఘాతకులు కాబట్టి, అవిశ్వాసులు కాబట్టి అలా చెయ్యలేకపోయారు. దేవుని వాగ్దానం విషయమై అవిశ్వాసుల ముందు ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారు దానిని నిస్సందేహంగా విశ్వసించలేరని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది. దేవుడు ఎన్నో ఆధారాలను కళ్ళముందు ఉంచినప్పటికీ ‌ప్రభువైన యేసుక్రీస్తు రెండవరాకడ విషయంలో సందేహపడేవారంతా, హేళన చేసేవారంతా ఇలాంటివారే. ఇశ్రాయేలీయులు మోషే విషయమై "ఆ మోషే అనువాడు ఏమాయెనో" అని చులకనగా మాట్లాడినట్టుగా, వీరు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడను హేళన చేస్తుంటారు. పేతురు ముందుగానే ఈ విషయం మనకు తెలియచేసాడు. 
 
రెండవ పేతురు 3:3,4 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను. 
 
మరొక విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల్లో మొదటినుండీ విగ్రహారాధనా, దేవుని పట్ల తిరుగుబాటూ చెయ్యాలనే కోరిక ఉండబట్టే (యెహెజ్కేలు 20:8, యెషయా 48:8) వారు దానిని ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ "ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదంటూ" కుంటిసాకును చెబుతున్నారు. నిజానికి మోషే దేవునిదగ్గరకు వెళ్ళాడని వారికి బాగా తెలుసు. ఒకవేళ మోషే లేకపోవడాన్ని బట్టే వారు విగ్రహారాధనకు ప్రేరేపించబడుతుంటే, 19-25 వచనాల ప్రకారం మోషే కొండ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి అతనియొద్దకు ఎందుకు రాలేదు? కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు చెబుతుంది కేవలం ఒక సాకు మాత్రమే. పాపం చెయ్యాలనుకునే ప్రతీ ఒక్కరూ కూడా ఈవిధంగానే ఆ పాపానికి కారణాలుగా ఏవొక సాకులను వెతుక్కుంటూ ఉంటారు. ఇశ్రాయేలీయులు ఆ సాకును అడ్డుపెట్టుకుని విగ్రహారాధన చెయ్యకూడదనే ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగా (తిరుగుబాటు చేసినట్టుగా) వీరు కూడా కొన్ని వ్యక్తిగత మరియు సామాజిక సాకులను అడ్డుపెట్టుకుని ఆయన ఆజ్ఞలను ఘోరంగా మీరుతుంటారు, లేదా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. మోషే ఆలస్యం చేసినప్పటికీ అతను అంతవరకూ తెలియచేసిన దేవుని ఆజ్ఞలను ధ్యానించి ఆత్మీయంగా బలపడే అవకాశం ఇశ్రాయేలీయుల ముందు ఉన్నట్టుగా ఆయన వీరి ముందు కూడా పాపంలో పడిపోనవసరం లేని నైతికపరమైన ప్రత్యామ్నాయాలను ఉంచుతున్నాడు. కానీ వీరు ఎలాగైనా పాపం చెయ్యాలనే వాంఛ కలిగినవారు కాబట్టి వాటిని ఆశ్రయించరు. 
 
నిర్గమకాండము 32:2
అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా-
 
ఈ వచనంలో అహరోను ఇశ్రాయేలీయులు తమకోసం దేవతను తయారుచెయ్యమన్నప్పుడు వారిని బంగారు పోగులు అడగడం మనం చూస్తాం. ఈ బంగారంతోనే అతను బంగారు దూడను తయారుచేసాడు. అహరోను ఎందుకిలా చేసాడో మనం ఆలోచిస్తే;
 
1. అతను ఇశ్రాయేలీయులకు భయపడ్డాడు. మోషే కొండపైకి వెళ్తూ ఆ ప్రజలను అహరోను హూరులకు అప్పగించినట్టు మనం‌ చదువుతాం (నిర్గమకాండము 24:14) కానీ ఈ సందర్భంలో కానీ, తరువాత సందర్భాలలో కానీ హూరు ప్రస్తావన ఇక మనకు కనిపించదు. మోషే కొండదిగి వచ్చినప్పుడు కూడా అహరోనును నిలదీస్తాడు తప్ప‌ హూరు గురించి ఏమీ మాట్లాడడు. యూదుల రచనల ప్రకారం ఈ మొదటివచనంలోనే ఆ ప్రజలు హూరును చంపివేసారు. అందుకే అహరోను కూడా భయాక్రాంతుడై ఇక్కడ వారికి సమ్మతిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అతను కూడా ఆ ప్రజలను ఎదిరించి చనిపోయి ఉంటే అతనికి శ్రేష్టమైన ఘనతదక్కేది. ప్రాణభయంతో అతను అలా చెయ్యలేదు కాబట్టి అతని జీవితంపై దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా బంగారు దూడను చేసాడనే ఈ తీవ్రమైన ఆరోపణ మోపబడింది. అందుకే మనం ప్రాణభయంతో దేవుని ఆజ్ఞలను ధిక్కరించే ప్రయత్నం చెయ్యకూడదు. "నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము" (ఫిలిప్పీ 1:21) అనే పౌలు నినాదం ప్రతీ క్రైస్తవుడి మనసులోనూ కొలువుతీరి ఉండాలి. క్రీస్తు నామాన్ని బట్టి‌ మన చుట్టూ శత్రువులు పోగైనప్పటికీ స్తెఫను కనపరచిన నిర్మోమాటాన్నీ ధైర్యాన్నీ వారికి కనపరచాలి (అపొ.కా 7). అతనిలా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మనకది సాధ్యమౌతుంది. 
 
2. అహరోను ప్రాణభయంతో బంగారు దూడను చెయ్యడానికి సిద్ధపడినప్పటికీ అతను తనను తాను కాపాడుకుంటూ ఆ ప్రజలను కూడా ఆ దుష్కార్యం నుండి తప్పించడానికి ప్రయోగాలు చేస్తున్నాడు. వారిని బంగారు పోగులు అడగడానికి ఇదే కారణం. ఎందుకంటే ఎవరైనా తమ‌ బంగారాన్ని కానుకగా ఇవ్వవలసి వచ్చినప్పుడు కొంచెం ఆలోచనలో పడతారు. ఆ ప్రజలు అలా ఆలోచించి తమ బంగారాన్ని ఇవ్వకుండా ఉంటే, తాను ఆ దేవతను తయారు చెయ్యకుండా తప్పించుకోవచ్చని అతను భావించాడు. అహరోనుకైతే దేవునికి విరుద్ధమైన విగ్రహారాధన చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదని, అతని చరిత్రను బట్టి మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమౌతుంది. 
 
నిర్గమకాండము 32:21-24 అప్పుడు మోషేనీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారుమాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి. అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను. 
 
ఒకవేళ అహరోను కూడా విగ్రహారాధన చెయ్యాలనే ఉద్దేశంతోనే ఆ దేవతను తయారుచేసి ఉంటే మోషేతో ఇలా పలకకుండా దుష్టులైన ఆ మనుషుల సహకారంతో మోషేను ఎదిరించేవాడు. అందుకే అహరోను ప్రాణభయంతో ఇశ్రాయేలీయుల మాటలకు సమ్మతించినట్టు నటించినప్పటికీ ఎలాగైనా ఆ దుష్కార్యాన్ని ఆపడానికి ప్రయోగాలు కూడా చేస్తున్నాడని కచ్చితంగా‌ చెబుతున్నాను. కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదు. పాపం విషయంలో ఇలాంటి పనికిమాలిన ప్రయోగాలూ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ ప్రయోగాలు పాపాన్ని అడ్డుకోలేవు. ఇప్పుడు చూడండి; అతను ఆ ప్రయోగంలో భాగంగా బంగారాన్ని అడిగాడు. వారు ఇవ్వరేమో అనుకున్నాడు. కానీ వారు ఇచ్చారు. ఇప్పుడేమైంది? వేరేదారిలేక దూడను తయారు చెయ్యవలసివచ్చింది, ఆ తర్వాత కూడా అతను కొన్ని ప్రయోగాలు‌ చేసి విఫలమౌతాడు (వాటిగురించి ఆయా సందర్భాలలో చూద్దాం)‌. అందుకే పాపాన్ని పూర్తిగా అడ్డుకోవడం కేవలం దేవుని ఆజ్ఞలకు మాత్రమే సాధ్యమని మనం గుర్తుంచుకోవాలి. భక్తుడైన దావీదు మాటల్లో ఈవిషయం‌ మనం స్పష్టంగా గమనిస్తాం. 
 
కీర్తనలు 119:11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
 
కాబట్టి అహరోను ఇలాంటి ప్రయోగాలు‌ చెయ్యకుండా గతంలో మోషే తెలియచేసిన "మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు" అనే దేవుని ఆజ్ఞను వారికి నిర్భయంగా ప్రకటించియుంటే బావుండేది. అప్పుడు వారు అతన్ని చంపివేసినప్పటికీ "ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచిపెట్టి యుండెను" (నిర్గమకాండము 32:25) అనే నింద అతనిపై‌‌ మోపబడకుండా, స్తెఫను ఆత్మలా అతని ఆత్మ దేవుని సన్నిధికి చేరేది  (అపొ.కా 7:59) . కాబట్టి మనం పాపాన్ని దేవుని ఆజ్ఞలు అనే ఖడ్గంతో ధైర్యంగా‌ ఖండించాలి. పాప కార్యాలకు సిద్ధపడుతున్నవారికి ఆ ఆజ్ఞలద్వారానే బుద్ధిచెప్పాలి తప్ప వారిపై మన స్వంత ప్రయోగాలు చెయ్యకూడదు. అప్పుడు మనం కూడా వారి పాపంలో పాలివారంగా నిందించబడతాం. 
 
రెండవ తిమోతికి 3:16,17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము  ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.
 
నిర్గమకాండము 32:3
ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు అహరోను మాట ప్రకారం బంగారుపోగులను తీసి అతనికి అప్పగించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతో కష్టపడ్డారు, కానీ అక్కడ వారికి తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేదికాదు. అది చూసిన దేవుడు ఐగుప్తీయులకు వీరిపై కటాక్షం కలుగచేసి బంగారాన్నీ ఇతర విలువైన వస్తువులనూ వీరి వశం చేసి అక్కడినుంచి విడిపించాడు (నిర్గమకాండము 3:21,22, 12:36). అలా దేవుని కటాక్షం ద్వారా సంపాదించుకున్న బంగారాన్ని ఇప్పుడు వారు ఆయనకు హేయమైన విగ్రహాన్ని తయారు చెయ్యడానికి అర్పిస్తున్నారు. మనిషి తన పాపపు వాంఛలను తీర్చుకోవడానికి దేవుడు దయతో అనుగ్రహించిన కష్టఫలాన్ని కోల్పోవడానికి నిర్భయంగా నిస్సిగ్గుగా సిద్ధపడతాడని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది.‌ ప్రతీమనిషికీ జ్ఞానాన్నీ బలాన్నీ అనుగ్రహించేది ఆయనే. మనిషి మాత్రం దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానంతో బలంతో సంపాదించినవాటిని ఆయనకు విరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. ఉదాహరణకు; త్రాగుడు, ఆకర్షన, వ్యభిచారం, విగ్రహారాధన, జూదం, ఇతర విలాసాలు. కాబట్టి విశ్వాసులు దేవుడు తమకు అనుగ్రహించిన వనరులనూ మరియు శారీరక బలాన్ని కూడా దేనికోసం కర్చుచేస్తున్నారో పరీక్షించుకుంటూ ఉండాలి. తీర్పుదినంలో వాటికి కూడా మనం లెక్కచెప్పవలసి ఉంటుంది. 
 
నిర్గమకాండము 32:4
అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. 
 
ఈ వచనంలో అహరోను ప్రజలదగ్గరనుండి తీసుకున్న బంగారంతో ఒక దూడను చెయ్యడం, ప్రజలంతా వారిని ఐగుప్తునుండి విడిపించిన దేవుడు ఆ దూడనే అని స్తుతించడం మనం చూస్తాం. ఇక్కడ కూడా అహరోను మరో  ప్రయోగంగానే ఆ దూడను చేసాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 215 సంవత్సరాలు నివసించారు. అక్కడినుండి మోషే ద్వారా దేవుడు వారిని విడిపిస్తున్న క్రమంలో ఆయన ఐగుప్తీయుల దేవతలకు తీర్పుతీర్చినట్టుగా రాయబడింది (సంఖ్యాకాండము 33:4). ఐగుప్తీయులపై ఆయన కుమ్మరించిన పది తెగుళ్ళూ ఆయా దేవతలపై తీర్పులుగానే ఎంచబడ్డాయి. ఆ ఐగుప్తీయులు దూడ (ఆవు) రూపంలో hathor అనే దేవతను పూజించేవారు. ఇప్పుడు అహరోను అదే రూపంలో దేవతను తయారు చేసాడు. ఇశ్రాయేలీయులకు ఏమాత్రం విచక్షణా జ్ఞానం ఉన్నప్పటికీ వారు వెంటనే, మన దేవుడు ఏ ఐగుప్తీయుల దేవతలకైతే తీర్పు తీర్చాడో ఆ దేవతలలో ఒకదాని రూపాన్ని తయారు చేసావేంటి? ఇది మాకు ఎలా దేవుడు ఔతాడని ప్రశ్నించేవారు. ఇలా వారు ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే అహరోను ఆ రూపాన్ని తయారుచేసి ఉంటాడు. కానీ ఇక్కడ కూడా అహరోను చేసిన ప్రయోగం విఫలమైంది. ఎందుకంటే ఆ దూడను చూసిన ప్రజలు ఏమంటున్నారో చూడండి " అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి". దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన మనసు కలిగినవారు కనీస విచక్షణాజ్ఞానం కూడా లేకుండా ఆత్మీయ అంధులుగా ప్రవర్తిస్తారని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది. 
 
ఇక్కడ ఇశ్రాయేలీయులు "మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు" అనే ఆజ్ఞకు వ్యతిరేకంగా ఒక దూడను చేసుకుని, పైగా ఆ దూడనే వారిని ఐగుప్తునుండి విడిపించింది అంటున్నారు. అంటే వారు ఆ దూడ రూపాన్ని యెహోవా దేవునికి అంటగడుతున్నారు. కనీసం మమ్మల్ని తన బాహుబలంతో విడిపించిన ఆ దేవుడు గడ్డిమేసే ఈ దూడ రూపంలో ఎలా ఉంటాడని ఆలోచించడం లేదు. ఇశ్రాయేలీయుల పెద్దలు సీనాయి పర్వతంపై ఆయనను కలుసుకున్నప్పుడు ఎటువంటి రూపాన్నీ చూడలేదు (ద్వితీయోపదేశకాండము 4:12,15). కనీసం ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పటికీ వారు ఇలాంటి స్థితికి దిగజారకపోదురు. నేను పైన చెప్పినట్టుగా దీనంతటికీ దేవుని ఆజ్ఞలపట్ల వారికి విరుద్ధమైన మనస్సు ఉండడమే కారణం. ఎప్పడైతే దేవుని ఆజ్ఞలపట్ల మనకు విరుద్ధత ఉంటుందో అప్పుడు మన పరిస్థితి క్రమక్రమంగా ఇలానే దిగజారుతుంటుంది. 
 
ఇశ్రాయేలీయులు చేసిన ఈ పని వారి చరిత్రపై మాయను మచ్చను తెచ్చిపెట్టింది, అంతేకాదు దేవుడు వారి ఇతర తిరుగుబాటుల విషయమై శిక్షిస్తున్నప్పుడు కూడా దీనిని పరిగణలోకి తీసుకున్నాడు. 
 
కీర్తనలు 106:19-22 హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్యకార్యములను ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. 
 
మరొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆ దూడ రూపాన్ని యెహోవా దేవునికి అంటగట్టడమే కాదు, ఆ సమయంలో వారు ఐగుప్తుకు  తిరిగిపోవాలి అని కూడా అనుకున్నారు.
 
అపొస్తలుల కార్యములు 7:39-41 ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. 
 
ఇక్కడ ఒక విషయం గమనించండి, దేవుడు వారిని తన అద్భుతాల ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలుతేనెలు ప్రవహించే శ్రేష్టమైన కనాను దేశాన్ని వాగ్దానం చేసాడు. కానీ వారు ఆయన మహిమను దూడ రూపానికి దిగజార్చి మరలా ఐగుప్తు బానిసత్వానికి లోబడడాం అనుకుంటున్నారు. ఈవిధంగా ఎప్పుడైతే మనిషి దేవుని స్థాయిని దిగజార్చేలా వ్యవహరిస్తాడో లేక ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తాడో అప్పుడే అతను శ్రేష్టమైనవాటికి‌ బదులు నీచమైనవాటిని ఎన్నుకునే భ్రమకు గురిచెయ్యబడతాడు. విగ్రహారాధన చేసే అన్యజనుల్లో ఇదే జరుగుతుంది.
 
రోమీయులకు 1:23-28 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 
 
నిర్గమకాండము 32:5
అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా-
 
ఈ వచనంలో అహరోను ఆ బంగారు దూడ యెదుట బలిపీఠం కట్టించి మరునాడు యెహోవాకు పండుగ దినమని ప్రకటించడం మనం చూస్తాం.‌ అహరోను ప్రజలదగ్గరనుండి బంగారు పోగులను తీసుకుని వాటిని దూడగా పోతపొయ్యడానికి కొంచెం సమయం పడుతుంది. బహుశా అతను ఆ సమయంలోపు మోషే వచ్చేసి దానిని అడ్డుకుంటాడని భావించాడు. కానీ మోషే ఇంకా రాకపోవడంతో మరోరోజు ఆలస్యం చెయ్యాలని మరుసటి దినానికి పండుగను నియమించాడు. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా అతను ఇలాంటి  ప్రయోగాలు చెయ్యడం ద్వారా జరగవలసిన పాపం జరిగిపోతూనే ఉంది. మరుసటి దినం కూడా అదే జరగబోతుంది. అతను కనీసం మొదటి ప్రయోగంలో విఫలమైనప్పుడైనా దేవుని ఆజ్ఞను బట్టి ధైర్యంగా వారికి బుద్ధిచెప్పకుండా మరో ప్రయోగం చేస్తున్నాడు. కాబట్టి పాపాన్ని దేవుని ఆజ్ఞలతో ముఖాముఖిగా ఖండించకుండా మన స్వంత ప్రయత్నాలతో, దానిని నిలువరించాలని చూసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండడని, జరగవలసిన కీడు జరుగుతూనే ఉంటుందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. 
 
రెండవ తిమోతికి 4:2-4 వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును. 
 
నిర్గమకాండము 32:6
మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు అహరోను నియమించిన పండుగ దినాన దేవునికి బలులను అర్పించడం మనం చూస్తాం. ఇక్కడ దేవునియెదుట వీరి విపరీత ప్రవర్తన మరోసారి బహిర్గతమౌతుంది. మొదటిగా వీరు ఎలాంటి ప్రతిమలనూ చెయ్యకూడదనే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా దూడను చేసుకున్నారు. రెండవదిగా ఆ దూడ రూపాన్ని సర్వశక్తుడైన దేవుని రూపానికి ఆపాదించి ఆయన మహిమను దిగజార్చారు. ఇప్పుడు మూడవదిగా ఆ ప్రతిమకు దహన బలులనూ సమాధాన బలులనూ అర్పిస్తున్నారు. నిజానికి ఇక్కడ వీరు "మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను" (నిర్గమకాండము 20:24) అనే ఆజ్ఞను అడ్డుపెట్టుకుని ఈ పని చేస్తున్నారు. ఆయన చెయ్యవద్దన్న విగ్రహాన్ని చేసుకుని ఆయన అర్పించమన్న బలులను దానికి అర్పించడం ఆయన ఆజ్ఞను ఎంత ఘోరంగా అవమానించడమౌతుందో ఊహించండి. నిజంగా వీరిలో ఆయనకు దహనబలులనూ సమాధాన బలులనూ అర్పించి ఆయనను స్తుతించాలనే కోరికే ఉండుంటే అహరోనుతో ఆ కోరికనే వ్యక్తపరిచి నిర్భయంగా ఆ పని చెయ్యవచ్చు. కానీ వీరికి విగ్రహారాధన‌ చెయ్యాలనిపించింది, పైగా ఆ విగ్రహానికి దేవుడు ఆదేశించిన బలులను అర్పించాలనిపించింది. దేవునిపట్ల నిజమైన విధేయత లేనివారి ప్రవర్తన ఇలానే చాలా ఘోరంగా ఉంటుంది. వారు ఒకవైపు దేవుడు చెయ్యవద్దన్న హేయకార్యాలు చేస్తూ ఆ కార్యాలలో దేవుడు చెయ్యమన్నవాటిని మిళితం చేస్తుంటారు‌, దానివల్ల ఆయనను మరింతగా అవమానిస్తారు.
 
కొన్ని క్రైస్తవ సంఘాలలో ఇలాంటి ప్రవర్తనను మనం స్పష్టంగా చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించని పండుగ దినాన్ని అహరోను నియమించినట్టుగా, వారు లేఖనాలతో సంబంధం లేని, లేఖనాలు ఖండించే కొన్ని పండుగ దినాలను ఏర్పరచుకుని వాటిలో ఆయన ఆజ్ఞాపించిన ప్రార్థనలనూ స్తుతులనూ వాక్యధ్యానాన్నీ చేస్తుంటారు. ఇశ్రాయేలీయులు తమ విగ్రహారాధనా వాంఛకు దహనబలులనూ సమాధాన బలులనూ సాకుగా వాడుకున్నట్టే, వీరు కూడా దేవుడు ఆజ్ఞాపించని ఆ పండుగ దినాలను జరుపుకోవడానికి, సువార్త ప్రకటన అంటూ, ప్రార్థనలో, వాక్యధ్యానంలో, సంఘసహవాసంలో బలపడడం కోసం అంటూ వాటిని సాకులుగా చూపిస్తుంటారు. దేవుడు చెయ్యవద్దని ఆజ్ఞాపించిన ప్రతిమను చేసుకుని ఆ రూపాన్ని ఆయనకు ఆపాదించి, ఆయన నామంపేరిట దానికి బలులను అర్పించడం ఎలా ఆయనకు హేయమో, అలానే మానవులు కల్పించిన పండుగ దినాలను దైవోపదేశాలుగా పాటిస్తూ, వాటిలో ఆయన ఆజ్ఞాపించిన సువార్తను ప్రకటించడం, ప్రార్థనలో వాక్యధ్యానంలో పాల్గోవడం ఆయన దృష్టికి అంతే విరుద్ధం. 
 
"అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి"
 
ఇశ్రాయేలీయులు ఆ ప్రతిమకు దహనబలులనూ సమాధానబలులనూ అర్పించిన తరువాత ఈవిధంగా చేసినట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ వారి బ్రష్టత్వం మరింత దారుణంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ "ఆడుటకు లేచిరి" అనే పదం హీబ్రూ బాషలో వ్యభిచారానికి సంబంధించింది. అప్పటి కొందరు అన్యజనులు తమ దేవతా విగ్రహాలకు పండుగదినాలు జరిపేటప్పుడు వ్యభిచారం చెయ్యడం ఆనవాయితీగా పాటించేవారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. 
 
నిర్గమకాండము 32:25 ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచిపెట్టి యుండెను. 
 
విగ్రహారాధాన మనిషిని ఎంతగా దిగజారుస్తుందో దీనినిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు విగ్రహారాధనను నిషేధించిన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మాత్రమే కాదు ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులుగా మారిన ప్రతీసారీ ఈ వ్యభిచారాన్ని కూడా ఆచారంగా పాటించారు‌.‌ యిర్మియా, యెహెజ్కేలు గ్రంథాలలో ఆ ప్రస్తావనలు మనం వివరంగా చదువుతాం.
 
నిర్గమకాండము 32:7,8
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము. ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. 
 
ఈ వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీయులు చేస్తున్న విగ్రహారాధన గురించి మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఈ విషయం మోషేకు తెలియదు కాబట్టి అతను ఇంకా దేవుని సన్నిధిలోనే ఆయన ఆజ్ఞలకోసం కనిపెడుతున్నాడు. కానీ ఆయన "నీవు దిగి వెళ్లుము" అంటూ అతన్ని త్వరపెడుతున్నాడు. అతనికి వారిపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఆయన మోషే తన సహవాసంలో గడపడం కంటే ఆ ప్రజలను సరిచెయ్యడమే మంచిదని ఈవిధంగా త్వరపెడుతున్నాడు. ఎందుకంటే ఒక నాయకుడికి దేవుడు తనకు అప్పగించిన ప్రజలను సరిచెయ్యడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇక్కడ గొప్ప నాయకుడైన మోషే చూడలేని ప్రజల పాపాన్ని ఆయన చూస్తున్నట్టుగా మనం గమనిస్తాం. మోషేనే కాదు మరే మనిషీ చూడలేనంతగా ఆయన మనిషి యొక్క పాపాన్ని చూస్తుంటాడు.
 
కీర్తనలు 139:2,3 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
 
అందుకే దావీదు ఇలా కూడా అంటున్నాడు. 
 
కీర్తనలు 130:3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
 
ఇక్కడ దేవుడు పలుకుతున్న మాటలను మనం లోతుగా పరిశీలించగలితే;
 
"ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి"
 
గతంలో దేవుడు ఇశ్రాయేలీయుల విడుదలకోసం మోషే ద్వారా ఫరోను హెచ్చరిస్తున్నప్పుడు మాటిమాటికీ "నా ప్రజలను పోనిమ్ము" (నిర్గమకాండము 8:1, 20, 9:1) అని పలికిస్తూ ఆ ప్రజలను తన ప్రజలుగా సంబోధిస్తాడు. తన నిబంధన ద్వారా ఆ సంబంధాన్ని స్థిరపరుస్తాడు. కానీ వారు ఇప్పుడు ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ విగ్రహారాధనకు పాల్పడినప్పుడు వారిని తన ప్రజలు అని కాకుండా మోషేతో "నీ ప్రజలు చెడిపోయిరి" అంటూ వారు మోషేకు చెందిన ప్రజలుగా ప్రస్తావిస్తున్నాడు. జాతిపరంగా వారు మోషేకు చెందిన ప్రజలే కాబట్టి ఆ సంబోధన మోషే విషయంలో సరైనదే. దీనినిబట్టి పాపం మనిషితో ఆయనకు ఉన్న శ్రేష్టమైన సంబంధాన్ని దెబ్బతీస్తుందని స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అలవాటుగా ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తూ పాపానికి పాల్పడేవారిని తన ప్రజలుగా/పిల్లలుగా గుర్తించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్టపడడు. వారిని బట్టి సిగ్గుపడతాడు. ఇశ్రాయేలీయులు పదేపదే ఇలానే తిరుగుబాటు చేస్తున్నప్పుడు అది చూసిన మోషే వారిని తన చివరిదినాల్లో ఏమని నిందిస్తున్నాడో చూడండి. 
 
ద్వితియోపదేశకాండము 32:5 వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము. 
 
కాబట్టి క్రీస్తుయేసు రక్తంద్వారా ఆయన చేసిన శ్రేష్టమైన నిబంధనను (క్రొత్త నిబంధన) బట్టి నిబంధన ప్రజలుగా లేక ఆయన పిల్లలుగా ఆయనతో సంబంధంకలిగియున్న మనమంతా, ఆ సంబంధాన్ని దెబ్బతీసే పాపం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మన పాపం పరిశుద్ధుడైన దేవునితో మనకున్న సంబంధాన్ని దెబ్బ తీస్తుందనేది తిరుగులేని సత్యం.
 
అదేవిధంగా ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులు చేస్తున్న పాపాన్ని చెడుగా వర్ణిస్తున్నాడు "చెడిపోయిరి". ఎందుకంటే ప్రతీపాపం దేవుని దృష్టికి చెడుగానే ఉంటుంది. యేసుక్రీస్తు కూడా పాపాన్ని ఆవిధంగానే వర్ణించాడు. 
 
మత్తయి 12:35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
 
"నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి"
 
ఇశ్రాయేలీయులు ఆయన ఆజ్ఞలను కనీసం 40రోజులు కూడా పాటించలేకపోయారు‌. అంతకుముందే ఆయన పట్ల ద్రోహానికి పాల్పడ్డారు. "త్వరగా తొలగిపోవడం" అంటే ఇదే. దీనిగురించి మొదటివచనంలో కూడా వివరించాను. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపే మనసు లేనివారు, మొదట దానికి అంగీకరించినప్పటికీ ఎంత త్వరగా వాటినుండి తొలగిపోతారో ఇక్కడ మనం గమనిస్తున్నాం. నేటిసంఘాల్లో దేవుని విధేయత చూపుతామని ప్రమాణం చేసి బాప్తీస్మం పొంది మరలా అలవాటుగా పాపంలో చిక్కుకునేవారంతా ఇలాంటివారే. 
 
"తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను" 
 
దేవుడు ఇశ్రాయేలీయుల పాపాన్ని మోషేకు తెలియచేస్తున్నప్పుడు వారు ఏ రూపాన్ని చేసుకున్నారో, దాని గురించి ఏమని పలికారో అవే మాటలను ప్రస్తావిస్తున్నాడు. వారు చేసినదానికీ పలికినదానికీ అధనంగా మరేదీ చేర్చడం కానీ, తీసివెయ్యడం కానీ చెయ్యడం లేదు. ఇక్కడ దేవుని న్యాయపుతీర్పును మనం గమనిస్తున్నాం. ఆయన మనిషి చేసే పాపాన్ని తగ్గించడం కానీ లేక పెంచడం కానీ చెయ్యడు. వారు ఏదైతే చేసారో అదే పాపభారాన్ని వారిపై మోపుతాడు. తీర్పు దినంలో కూడా ఆయన ఇదే చెయ్యబోతున్నాడు. 
 
మత్తయి 16:27 మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
 
అయితే ఆ పాపపు భారం ఉన్నది ఉన్నట్టుగా "తమ పాపాలను నిజమైన మారుమనస్సుతో" ఒప్పుకోనివారిపై మాత్రమే మోపబడుతుంది. అందుకే మనం మన పాపాలను ఎప్పటికప్పుడు నిజమైన మారుమనస్సుతో ఆయన ముందు ఒప్పుకుంటూ, ఆ పాపాలనుంచి సాధ్యమైనంత దూరంగా పారిపోవాలి. అప్పుడు మాత్రమే మనం చేసిన పాపభారం మనపై మోపబడదు. నిజమైన విశ్వాసి తన జీవితంలో తప్పకుండా దీనిని అమలుచేస్తాడు.
 
1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
 
హెబ్రీయులకు 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.
 
నిర్గమకాండము 32:9
మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. 
 
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల పాపం గురించి మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన వారు చేస్తున్న పాపాన్ని మాత్రమే కాదు వారి స్వభావాన్ని కూడా చూస్తున్నాడు. అందుకే "వారు లోబడనొల్లని ప్రజలు" అని వారి స్వభావం గురించి పలుకుతున్నాడు‌. ఆయనకు మనిషి చేస్తున్న పాపమే కాదు ఆ పాపానికి ప్రేరేపించే పాపపు స్వభావం కూడా వేదన కలిగిస్తుంది. అందుకే మనం కూడా క్రీస్తుయేసు ద్వారా ఆయన మనల్ని బ్రతికించకముందు స్వభావరీత్యా ఆయన ఉగ్రతకు పాత్రులమైయున్నామని రాయబడింది.
 
ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. 
 
అదేవిధంగా ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఉన్న నిత్యుడైన దేవుడు కాబట్టి, మనిషి అప్పటివరకూ చేసిన పాపమే కాదు భవిష్యత్తులో చెయ్యబోయే పాపం కూడా ఆయనకు స్పష్టంగా కనిపిస్తుంటుందని ఇక్కడ మనకు అర్థమౌతుంది. అయినప్పటికీ ఆ పాపం కార్యరూపం దాల్చినప్పుడు ఆయన దానికి తగినట్టుగా స్పందిస్తుంటాడు, నోవహు జలప్రయ సంఘటనలో ఇదే జరిగింది. 
 
ఆదికాండము 6:5,6నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 
 
నిర్గమకాండము 32:10
కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా-
 
ఈ వచనంలో దేవుని కోపం ఇశ్రాయేలీయులపై మండడం మనం చూస్తాం. ఇది పరిశుద్ధుడునూ విమోచకుడునూ నైన దేవునికి పాపంపై, తిరుగుబాటుపై సహజంగా ఉండే న్యాయమైన కోపం. ఈ న్యాయమైన కోపం ఆయనలో రగలకపోతే ఆయన పరిశుద్ధతకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ఆయన కొందరు ఆరోపిస్తున్నట్టుగా ఏదో క్షణికావేశంతో ఇలా మాట్లాడడం లేదు. ఆయన పరిశుద్ధతను బట్టి వారిపై కుమ్మరించవలసిన తీర్పుగురించే హెచ్చరిస్తున్నాడు. 
 
కీర్తనలు 7:11న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
 
"కావున నీవు ఊరకుండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా"
 
దేవుడు పలుకుతున్న ఈ మాటల్లో ఒకవైపు ఆయనకు పాపంపట్ల ఉండే న్యాయపుతీర్పు బయలుపడుతుండగా మరోవైపు ఈ మాటలు మోషే యొక్క వ్యక్తిత్వాన్ని బహిర్గతపరిచేవిగా కూడా ఉన్నాయి. ఇక్కడ దేవుడు "నీవు ఊరకుండుము" అనగా వారికోసం నన్ను వేడుకోకు అనే ఉద్దేశంతోనే ఆ మాటలు పలుకుతుంటే 7వ వచనంలో ఆయన మోషేకు "నీవు దిగివెళ్ళుము" అని చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ దేవుడు మోషే ఆ ప్రజల పక్షంగా విజ్ఞాపన చెయ్యాలనే ఈ మాటలు పలుకుతున్నాడు. మోషేలో ఎలాంటి స్వార్థపూరిత ఆలోచన ఉన్నప్పటికీ ఆ విధంగా చెయ్యలేడు. కాబట్టి దేవుడు మోషేతో పలుకుతున్న ఈమాటలు;
 
 1. మోషే ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేలా అతన్ని ప్రేరేపిస్తున్నాయి. లేకపోతే దేవుడు వారిని తప్పకుండా నాశనం చెయ్యవలసి ఉంటుంది. ఈ విషయం మనకు ఇంకా స్పష్టంగా అర్థంకావాలంటే మోషే మధ్యవర్తిత్వపు పరిచర్య యేసుక్రీస్తుకు ఛాయగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి (హెబ్రీ 3:2). స్వభావసిద్ధంగానూ క్రియలమూలంగానూ పాపులమై దైవోగ్రతకు పాత్రులుగా ఉన్న మనం (ఎఫెసీ 2:3) యేసుక్రీస్తు విజ్ఞాపనను బట్టి ఆ ఉగ్రతనుండి తప్పించుకునేలా ఎలాగైతే ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువును మనకోసం నియమించాడో (అపో.కా 3:20, హెబ్రీ 7:25). అలాగే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులపై మండుతున్న ఆయన ఉగ్రతనుండి వారు తప్పించబడేలా మోషేను విజ్ఞాపన చెయ్యమని వ్యతిరేకదిశలో అతన్ని ప్రేరేపిస్తున్నాడు. ఇదే ఆయన ఉద్దేశం కాకపోతే మోషే ఎంత వేడుకున్నప్పటికీ ఆయన ఆ ప్రజలను క్షమించకపోదుడు. ఎందుకంటే కరుణించడం అనేది పూర్తిగా ఆయన స్వచిత్తానికి సంబంధించి విషయం.
 
రోమీయులకు 9:15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
 
2. దేవుని ఉద్దేశం మోషే విజ్ఞాపన ద్వారా ఆ ప్రజలను క్షమించడమే అయినప్పుడు మోషేతో "ఊరకుండుము నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని" ఎందుకు అంటున్నాడంటే, ఆయనకు పాపం పట్ల ఎంత కోపం కలుగుతుందో మోషేకు కూడా తెలియాలి. ఆయన ఆ మాటలు మోషేను వ్యతిరేక దిశలో ప్రేరేపించడానికి పలుకుతున్నప్పటికీ, ఆ మాటల్లోని ఆయన కోపం పూర్తిగా సత్యమైనది‌ మరియు న్యాయమైనది. మోషేకు ఈ విషయం బాగా అర్థం కావాలంటే ఆయన అలానే మాట్లాడాలి. అదేవిధంగా ఈ మాటలు మోషే వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా మనకు తెలియచేస్తున్నాయి. దేవుడు ఆరోజు మోషేతో ఇలా మాట్లాడబట్టీ, మోషే దానికి ఒప్పుకోకుండా ఆయనను వేడుకోబట్టీ ఈరోజుకూ మనం ఆ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడని, సాత్వికుడని ప్రశంసిస్తున్నాం. కాబట్టి బైబిల్ చరిత్రలో ప్రాముఖ్యుడైన మోషే ఎలాంటివాడో అప్పటి ప్రజలనుండి ఇప్పటి ప్రజలవరకూ తెలియచెయ్యడానికే దేవుడు మోషేను వ్యతిరేకదిశలో ప్రేరేపించాడు. అదేవిధంగా ఆ మాటల్లో పాపంపై ఆయనకుండే కోపాన్ని కూడా మనకు బహిర్గతం చేసాడు. సర్వోన్నతుడైన దేవునిమాటలు కొన్నిసార్లు ఈవిధంగానే ఒకటికంటే ఎక్కువ ఉద్దేశాలను కలిగి ఉంటుంది. ఆ ప్రతీమాటా ఆయన చిత్తాన్నే నెరవేరుస్తుంది. 
 
నిర్గమకాండము 32:11-13
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను. 
 
ఈ వచనాల్లో మోషే ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తం దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తాం. ఆ ప్రార్థనలో  అతను రెండు విధాలైన ఆందోళనలను దేవుని ముందు ఉంచుతున్నాడు. 
 
1. "నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను?"
 
ఇక్కడ మోషే ఐగుప్తీయుల దృష్టిలో యెహోవా దేవుని నామం ఎక్కడ అగౌరవానికి గురౌతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను ఆయన ఐగుప్తు నుండి విడిపిస్తున్నప్పుడు  "నన్ను సేవించే నిమిత్తం" వారిని విడుదల చెయ్యమని ఫరోను మాటిమాటికీ హెచ్చరించాడు. అన్యజనుల్లో ఆయన నామం ఘనపరచబడేవిధంగా అక్కడ ఎన్నో అద్భుతాలు చేసి వారిని విడిపించాడు. 
 
యెహేజ్కేలు 20:9 అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని.
 
ఇప్పుడు కనుక ఆయన వారిని కాల్చివేస్తే ఐగుప్తీయులంతా ఆయనను నామాన్ని హేళనచేసే అవకాశం ఉంది. అందుకే "నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని" ఆయన చెబుతున్నప్పటికీ మోషే తాను గొప్పజనంగా అవ్వడం కంటే తన దేవుని నామానికి ఎటువంటి అపకీర్తీ కలుగకూడదని ఆలోచించి ఈమాటలు పలుకుతున్నాడు. దేవుని గౌరవం పట్ల అతనికున్న అపారమైన ప్రేమను ఇక్కడ మనం గమనిస్తున్నాం. అతను తాను గొప్ప జనంగా అవ్వడం కంటే ఆయన గౌరవమే ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నాడు. నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన వారిలో ఇటువంటి వైఖరినే మనం చూస్తుంటాం. వారు తమకంటే తమ దేవునినామమే గొప్పదని భావిస్తూ ఆ నామ ఘనతకోసమే ప్రయాసపడుతుంటారు. ముఖ్యంగా వారి పాపం అన్యజనుల్లో ఆ నామానికి అవమానం కలిగిస్తుందని గుర్తించి ఆ పాపాన్ని మనస్పూర్తిగా అసహ్యించుకుంటారు. చివరికి ఆయన వారికి చెయ్యవలసిన ఉపకారాన్ని కూడా ఆ నామఘనత నిమిత్తమే చెయ్యమని వారు ప్రార్థిస్తారు‌. భక్తుల ప్రార్థనలో మనం ఇదే చదువుతాం. 
 
కీర్తనలు 79:9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
 
కీర్తనలు 23:3  ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
 
2. "నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను"
 
మొదటి మాటల్లో దేవుని నామఘనతను గురిగా పెట్టుకుని వేడుకున్న మోషే ఈ రెండవ మాటల్లో అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలను ఆయన విడిపించడానికి కేవలం అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణమే తప్ప మరేదీ కారణం కాదు. కాబట్టి అతను ఆ ప్రమాణాన్ని బట్టే వారిని క్షమించమంటున్నాడు. ఏకాలంలోనైనా దేవుడు మానవులను రక్షించడానికీ క్షమించడానికీ కేవలం ఆయన నిబంధనలు మాత్రమే కారణం. ప్రస్తుతం మనల్ని కూడా ఆయన పాపం నుండీ దాని శిక్షనుండీ విడిపించి, ప్రతీరోజూ క్షమిస్తుందీ కేవలం యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన నిబంధన కారణంగానే. ఆ నిబంధన ప్రక్కన పెడితే ఆయన ఆవిధంగా మనకు మేలు చెయ్యడానికి మనలో ఏమంచీ లేదు. పైగా ఆయన మనల్ని క్షణంలో నశింపచేసేలా మనకూ ఆయనకూ మధ్యలో ద్వేషం మాత్రం ఉంది. 
 
ఐతే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. 10వ వచనంలో ఆయన పలికినట్టుగా ఇశ్రాయేలీయులను ఆయన నాశనం చేస్తే ఆయన నామానికి అపకీర్తి కలుగుతుందని, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణం తప్పిపోతుందని‌ ఆయనకు తెలియదా? మోషే గుర్తు చేస్తేనే కానీ ఆయనకు అవి గుర్తు లేవా? కొందరు అమాయకంగా ఇలా మాట్లాడుతుంటారు. కానీ నేను ఆ సందర్భంలో తెలియచేసినట్టుగా ఆ మాటలు ఆయనకు పాపంపై కలిగే న్యాయపు తీర్పును ప్రకటిస్తున్నాయి. అందుకే ఆయన మోషే విజ్ఞాపన ద్వారా ఆ కోపాన్ని మళ్ళించుకుంటున్నాడు‌. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలనుండి ఆయన కోపం మళ్ళేలా వారి నాయకుడైన మోషే ప్రార్థనను సాధనంగా వాడుకుంటున్నాడు. మరొక విషయం ఏంటంటే, ఆయన తాను చెప్పినట్టుగా ఆ ప్రజలను కాల్చివేసినప్పటికీ ఆయన నామానికి అపకీర్తి కలగదు. ఎందుకంటే వారిని ఎందుకు కాల్చివేసాడో కూడా మోషే రాస్తాడు (సాక్షిగా ఉంటాడు కాబట్టి), అప్పుడు పాపం విషయంలో తాను విడిపించిన ప్రజలను కూడా సహించలేని పరిశుద్ధుడని ఆయన నామానికి మరింత ఘనత‌ కలుగుతుంది. అదేవిధంగా ఆయన మోషేను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు కాబట్టి, మోషే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమే కాబట్టి, ఆయన రాళ్ళద్వారా కూడా అబ్రాహాముకు పిల్లలను పుట్టించగల సమర్థుడు కాబట్టి ఆయన వారిని కాల్చివేసినప్పటికీ అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన ప్రమాణం తప్పిపోయే అవకాశం లేదు. అలాగైతే ఆయన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన ఈ ప్రజల్లో యెహోషువ కాలేబులు మినహా పెద్దలందరినీ నాశనం చేసాడు (సంఖ్యాకాండము 26:65, 32:11). అయినప్పటికీ ఆయన ప్రమాణం నెరవేరింది కదా!
 
నిర్గమకాండము 32:14
అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను. 
 
ఈ వచనంలో దేవుడు మోషే ప్రార్థనను బట్టి ఆ ప్రజలకు కీడు చెయ్యకుండా సంతాపపడడం మనం చూస్తాం. ఇక్కడ నీతిమంతుని ప్రార్థనకు దేవుడు ఇస్తున్న విలువను మనం గమనిస్తున్నాం. ఆయన తలచుకుంటే అప్పుడు కూడా ఆ ప్రజలను నాశనం చేసేవాడు. కానీ మోషే విజ్ఞాపన కారణంగా వారిని క్షమిస్తున్నాడు. అయితే మోషే ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చివేసిందని దీని అర్థం కాదు. పై సందర్భంలో నేను వివరించినట్టుగా సార్వభౌముడైన దేవుడు మోషే ప్రార్థనను సాధనంగా వాడుకుని ఆ ప్రజల పాపంపై తనకు న్యాయంగా కలిగిన కోపాన్ని మళ్ళించుకున్నాడు. అనగా వారి పాపాన్ని ఆ విజ్ఞాపన కారణంగా పరిహరించాడు. 
 
మార్పు లేని దేవునిసంకల్పం ఎప్పటికీ మారదు. అయితే ఆ సంకల్పంలోనే ఆయన కొన్ని మార్పులను ఉద్దేశించాడు, అవి కూడా స్థిరమైన నియమాలను బట్టి ఉద్దేశించాడు. అంటే నువ్వు న్యాయంగా ఉంటే దేవుడు న్యాయం చేస్తాడు, నువ్వు న్యాయం తప్పితే ఆయన దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాడు. లేఖనాలలో  ఆయన మారినట్టుగా లేక సంతాపపడినట్టుగా మనం గమనించే సందర్భాలన్నీ అలాంటివే. ఉదాహరణకు నినెవె విషయంలో, సౌలు విషయంలో. ఇది మరింత స్పష్టంగా అర్థంకావడానికి ఈ వాక్యభాగం చూడండి. 
 
యిర్మీయా 18:7-10 ని పెల్లగింతుననియు, విరుగగొట్టుదు ననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును. 
 
ఈ మాటల్లో దేవుడు నాశనం చేస్తాననని చెప్పిన పట్టణం మారుమనస్సు పొందినప్పుడు ఆ నాశనం విషయంలో సంతాపపడుతున్నాడు. మేలు చేస్తానని ప్రమాణం చేసిన పట్టణం పాపం చేసినప్పుడు ఆ మేలు విషయంలో సంతాపపడుతున్నాడు. ఆయనలోని ఈ మార్పులు ఆయన సంకల్పంలో స్థిరమైన నియమాలను బట్టి ఉద్దేశించబడిన మార్పులు. ఇక్కడ ఆయన మనిషి మారుతున్నాడు కాబట్టి ఆయన కూడా మారుతున్నాడు. ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయుల విషయంలో విజ్ఞాపణ చేసాడు కాబట్టి లేక వారి పాపాన్ని పరిహరించాడు కాబట్టి ఆయన కూడా తన నాశనం విషయంలో సంతాపపడుతున్నాడు. అయితే ఆయన మార్పులేని సంకల్పం ఎప్పటికీ మారదు. నేను పైన చెప్పినట్టుగా మనం ఆయనలో చూసే మార్పులు కూడా ఆయన మార్పులేని సంకల్పంలో ముందుగా ఉద్దేశించబడిన మార్పులే. 
 
నిర్గమకాండము 32:15
మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను.
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల నిమిత్తం దేవుణ్ణి వేడుకున్న తరువాత పది ఆజ్ఞల పలకలను పట్టుకుని సీనాయి పర్వతం నుంచి దిగిరావడం మనం చూస్తాం. ఆ పలకలపై దేవుడు ఇరువైపులా తన ఆజ్ఞలను రాసాడు. యూదుల అభిప్రాయం ప్రకారం "అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను" అంటే ఒక పలకపై రాయబడిన ఒకే ఆజ్ఞలు దాని వెనుక వైపు కూడా రాయబడ్డాయి. ఉదాహరణకు పలక ముందు భాగంలో "నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు" అని రాయబడిన అదే ఆజ్ఞ‌ వెనుకవైపు కూడా రాయబడింది. కానీ నేనైతే మనం పేపర్ పై ఏదైనా రాస్తున్నప్పుడు దాని కొనసాగింపును మరోవైపు కూడా ఎలా రాస్తామో అలానే ఆ పలకలపై కూడా రాయబడిందని భావిస్తున్నాను. 
 
నిర్గమకాండము 32:16
ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. 
 
నిర్గమకాండము 31:18 లో చెప్పబడిన మాటలు ఇక్కడ మరలా ప్రస్తావించబడడం మనం చూస్తాం. నేను ఆ సందర్భంలోనూ మరియు 20వ అధ్యాయపు వ్యాఖ్యానంలోనూ వివరించినట్టుగా ఈ పది ఆజ్ఞలు మొత్తం లేఖనాలకు పునాదులుగా ఉన్నాయి కాబట్టి, అవి దేవుని పరిశుద్ధస్వభావానికి ప్రతిబింబాలు కాబట్టి వాటిగురించి ఇలా నొక్కిచెప్పడం జరుగుతుంది. ఇక "ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత" అన్నప్పుడు ఆ మాటలు మనకు అర్థమయ్యే బాషలో రాయబడ్డాయని గమనించాలి. మనం చేతులతో రాస్తాము కాబట్టి ఆయనకు కూడా అలాంటి వర్ణన వాడడం‌ జరిగింది. ఇలాంటి వర్ణన దేవుని గురించి లేఖనాలలో సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. "ఆ వ్రాత దేవుని చేవ్రాత" లేక "దేవుని వ్రేలితో రాయబడ్డాయి" అంటే ఆయన శక్తితో రాయబడ్డాయి అని అర్థం. దీనిగురించి 31:18 వచనంలో మరింత స్పష్టతను ఇచ్చాను. వాస్తవానికి ఆ పలకలపై దేవుని ఆజ్ఞలు బోర్డుపై సుద్దతో రాసినట్టుగా రాయబడలేదు. ఎందుకంటే అలా రాసినవి చెరిగిపోతాయి. కానీ పది ఆజ్ఞలు ఎప్పటికీ చెరిగిపోని విధంగా రాయబడియుండాలి కాబట్టి, అవి రాతిపై ఉలితో చెక్కినట్టుగా చెక్కబడ్డాయి. 
 
నిర్గమకాండము 32:17,18
ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వనికాదు, అపజయ ధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. 
 
నిర్గమకాండము 23:14వ వచనం ప్రకారం; మోషేతో కలసి యెహోషువ కూడా సీనాయి పర్వతంపైకి వెళ్ళాడు. ఐతే అతను మోషేతో పాటుగా దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి అనుమతించబడలేదు కాబట్టి ఆ ప్రదేశానికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధినుండి దిగివస్తున్నాడో అది చూసిన యెహోషువ అతన్ని కలుసుకుని పాళెంలో జరుగుతున్న హడావుడి గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతను ప్రజలు బంగారు దూడముందు వేస్తున్న కేకలను యుద్ధద్వనిగా భావించి ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఈ యెహోషువ ఇశ్రాయేలీయుల సైన్యానికి సేనాధిపతిగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను వారితో లేడు. ఇది అతనికి చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకే మోషే అతని ఆందోళనను అరికడుతూ అది యుద్ధద్వని కాదని సంగీతధ్వని అని అప్పటికే తనకు దేవుడు తెలియచేసినదాని ఆధారంగా సమాధానమిస్తున్నాడు. 
 
నిర్గమకాండము 32:19
అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. 
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల పాళెంను సమీపించి వారు చేస్తున్న నిర్వాకాన్ని చూసినప్పుడు అతనికి కోపం మండినట్టుగా, వెంటనే దేవుడు అతనికి అనుగ్రహించిన పది ఆజ్ఞల పలకలను పగులగొట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 9,10 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన ఈ తిరుగుబాటును మోషేకు తెలియచేసి వారిని నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే ఆయనను దయచేసి ఆ తీర్పు విషయంలో సంతాపపడమని వేడుకున్నాడు. కానీ ఇప్పుడు అదే మోషే ఆ తిరుగుబాటును కళ్ళారా చూసేసరికి తీవ్రమైన కోపానికి లోనయ్యాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మిక్కిలి సాత్వికుడైన మోషే ఇక్కడ మిక్కిలి ఆగ్రహానికి గురౌతున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు చేస్తున్న పాపం కళ్ళారా చూసినప్పుడు దైవికమనస్సు కలిగిన ఎవరికైనా న్యాయబద్ధంగా అంత కోపాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కానీ దేవుడు ఇలాంటివెన్నో తిరుగుబాటులను, ఘోర పాపాలను  ప్రతీరోజూ చూస్తున్నాడు. ముఖ్యంగా తన పిల్లలు చేస్తున్న తిరుగుబాటులు, పాపాలు. అయినప్పటికీ ఆయన వాటిని ఎంతగానో సహిస్తూ వారికి అవకాశం ఇస్తున్నాడు, లేదంటే ఇది రాస్తున్న నాతో పాటుగా మనమంతా ఆయన ఉగ్రతకు ఎప్పుడో నశించిపోయేవారం. ఆయన దీర్ఘశాంతము గలవాడని భక్తుల ద్వారా కొనియాడబడింది (కీర్తనలు 145:8) ఇందుకే.
 
అదేవిధంగా ఇక్కడ మోషే దేవుని పది ఆజ్ఞల పలకలను పగలగొట్టడం మనం చూసాం‌. కొందరు దీని ఆధారంగా మోషేను తప్పుపడుతుంటారు. కానీ లేఖనంలో ఎక్కడా కూడా మోషే చేసిన ఈపని తప్పుగా పేర్కోబడలేదు, మోషే కూడా ఎక్కడా ఈ విషయంలో పశ్చాత్తాపపడలేదు. వాస్తవానికి మోషే‌ ఇలా చెయ్యడం ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలు తమ తిరుగుబాటువల్ల ఎంత శ్రేష్టమైనవి కోల్పోయారో వారికి తెలియచేసాడు. దేవుని ఆజ్ఞల కంటే, ఆయన నిబంధన కంటే దేవుని ప్రజలకు శ్రేష్టమైనవి మరేవీ ఉండవు. కీర్తనలు 119 లో భక్తుడైన దావీదు మాటలవల్ల ఈ సత్యాన్ని, నిజమైన దేవుని పిల్లలకు ఆయన వాక్యంపై ఉండే వాంఛను, ఆ శాసనాలు చూపించే మార్గదర్శకాలను మనం ఎంతో స్పష్టంగా గమనిస్తాం. ఇప్పుడు ప్రజలు తమ తిరుగుబాటువల్ల వాటిని కోల్పోయారు‌. ఇంకా వివరంగా చెప్పాలంటే "పందుల యెదుట ముత్యములను" వెయ్యకూడదు అన్నట్టుగా విలువైన దేవుని ఆజ్ఞలను పొందుకునే అర్హతను అపవిత్రులైన ఆ ప్రజలు కోల్పోయారని మోషే అలా చేసాడు. దేవుని వాక్యాన్ని దూరం చెయ్యడమే తిరుగుబాటు చేసిన దేవునిపిల్లలకు పెద్ద శిక్ష. అది నడిసముద్రంలో మార్గాన్ని చూపించే దిక్సూచిని పోగొట్టుకోవడంతో సమానం. అందుకే దావీదు చాలా వేదనగా ఇలా అంటాడు. 
 
కీర్తనలు 119:19, 20
నేను భూమి మీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
 
ఇశ్రాయేలీయులు మరలా మరలా అపవిత్రులైనప్పుడు కూడా ఆయన ఇదే చేస్తూ వచ్చాడు. ఆయన సన్నిధి నిలిచిన ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. ధర్మశాస్త్రాన్ని (వాక్యాన్ని) బోధించే వారి బోధకులను వారిమధ్య నుండి తీసివేసాడు. అందుకే వారి పాపాన్ని పరిహరించినప్పుడు మరలా ఇలా అంటున్నాడు. 
 
యెషయా 30:21,22 ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు  మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
 
ఈ ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ఆయన వారి పాపాన్ని పరిహరించినప్పుడు మోషే పగులగొట్టిన పది ఆజ్ఞల పలకలను ఆయన మరలా అనుగ్రహించినట్టు చదువుతాం (ద్వితీయోపదేశకాండము 10:1,2)
 
ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏంటంటే, మోషే ప్రజల పాపం గురించి తెలిసినప్పుడు మొదట ఆయన్ని వేడుకున్నాడు. కానీ అదే మోషే వారి పాపం విషయంలో తీవ్రంగా స్పందించి వారికి బుద్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నిజమైన ఆత్మీయనాయకుడు తప్పకుండా ఈ రెండు లక్షణాలనూ కలిగియుండాలి. దీనిగురించి ముందుముందు మరింత వివరంగా మాట్లాడుకుందాం. 
 
నిర్గమకాండము 32:20
మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను. 
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులు పూజిస్తున్న బంగారు దూడను అగ్నితో కాల్చి పొడి చేసి ఆ పొడిని నీటిపై చల్లి వారిచేత త్రాగించినట్టు మనం చూస్తాం. అయితే ఇది 29వ వచనం తరువాత జరిగిన సంఘటనగా మనం అర్థం చేసుకోవాలి, అతనికి ప్రజలపై కలిగిన కోపం చల్లారాకే, అప్పటివరకూ వారు పూజించిన బంగారు దూడను ఎగతాళి చేసేవిధంగా, అలానే వారికి బుద్ధివచ్చేవిధంగా ఇలా చేసాడు. ఎందుకంటే వారు "ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే" అని కొనియాడినట్టుగా ఆ శక్తే ఆ దూడలో ఉండుంటే మోషే దానిని పొడిపొడిగా చెయ్యడం, ఆ పొడి వేసిన నీటిని వారిచేత త్రాగించడం సాధ్యం కాదుగా? 
 
అయితే బంగారు దూడ పొడి కలిసిన నీటిని త్రాగిన ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారనే సందేహం‌ కొందరికి కలగొచ్చు. అలానే బంగారాన్ని పొడిచెయ్యగలమా అది సాగుతుందిగా అనేది కూడా. దీనికి మోషేనే స్పష్టత ఇచ్చాడు చూడండి. 
 
ద్వితియోపదేశకాండము 9:21 అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
 
ఈ మాటల ప్రకారం; మోషే ఆ పొడిని ఏటిలో (కాలువలో) పారబోసి ఆ నీటిని వారిచేత త్రాగించాడు. బంగారు పొడి కొంచెం బరువును కలిగియుంటుంది కాబట్టి అది నీటిలో పారబొయ్యగానే అడుగుకు చేరిపోతుంది‌‌. కాబట్టి అది వారి కడుపులోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇక్కడ మోషే చెప్పిన పద్ధతిలో బంగారాన్ని పొడిగా చెయ్యడం సాధ్యమే. 
 
నిర్గమకాండము 32:21
అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా- 
 
ఈ వచనంలో మోషే అహరోనును ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అహరోనును వారు ఏవిధంగా బెదిరించారో, ఎందుకు ఆ దూడను చేసాడో ఇప్పటివరకూ మోషేకు తెలియదు. అందుకే మోషే "ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని" అని ప్రశ్నిస్తున్నాడు. నీకేం చేసారు అనంటే 1. వారు నీకేం అన్యాయం చేసారు అని ప్రజల పక్షంగా అహరోనును నిందిస్తున్నాడు. 2. నీకేమన్నా కీడు చెయ్యబోయారా అని, అహరోను పక్షంగా ప్రజల ప్రవర్తనను ప్రశ్నిస్తున్నాడు. అహరోను విషయంలో ఈ రెండవదే జరిగింది కాబట్టి అతను క్రింది వచనాల్లో దానికే సమాధానం చెబుతున్నాడు.  ఇక్కడ మోషే ప్రశ్నను సరిగా గమనించండి అతను "నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని" అంటున్నాడు. అంటే అహరోను చేసిన బంగారు దూడను పెట్టుకుని వారు చేస్తున్న ఆ కార్యం వారికి గొప్పపాపంగా ఎంచబడుతుంది. దీనికి ఇప్పుడు అహరోను జవాబుదారుడు ఔతున్నాడు. అతను కనుక ఆ ప్రజలకు భయపడి ప్రయోగరూపంలో ఆ దూడను చెయ్యకుండుంటే, వారిని గద్దించియుంటే అప్పుడు అతను ఆ ప్రజల చేతిలో చంపబడినప్పటికినీ ఇలాంటి నింద అతనిపై మోపబడేది కాదు‌. ఆ ప్రజల పాపానికి ఇతను జవాబు చెప్పవలసిన అవసరం వచ్చేది కాదు. నాయకులుగా ఉన్నవారు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. లేదంటే మీకు అప్పగించబడినవారి పాపం విషయంలో దేవునిముందు మీరే జవాబుదారులుగా నిలబడతారు. 
 
హెబ్రీయులకు 13:17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు.
 
నిర్గమకాండము 32:22-24
అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారుమాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి. అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను. 
 
ఈ వచనాల్లో అహరోను మోషేకు ఎంతో భయపడుతూ సమాధానం ఇవ్వడం మనం చూస్తాం. అతను ఇక్కడ చెబుతున్నది వాస్తవమే అయినప్పటికీ, తాను చేసింది‌ మాత్రం ఒప్పుకోకుండా పైగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. "నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను" అనేది వాస్తవం కాదు. ఎందుకంటే బంగారాన్ని అగ్నిలో వేసినంతమాత్రాన దూడ రూపమో లేక మేక రూపమో వచ్చెయ్యదు ఆ రూపానికి తగినట్టుగా చేస్తేనే ఆ రూపం వస్తుంది. కాబట్టి అహరోను తాను ఆ దూడను అడ్డుపెట్టుకుని వారిపై ప్రయోగం చేసానని ఒప్పుకోవడం లేదు. అందుకే దేవుడు అహరోనును కూడా నశింపచెయ్యాలి అనుకున్నాడు. కానీ మోషే ప్రార్థనను బట్టి అతను కూడా తప్పించబడ్డాడు. 
 
ద్వితియోపదేశకాండము 9:20 మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని.
 
అయితే అహరోను ఈ సందర్భం తర్వాతైనా ఆ విషయంలో పశ్చాత్తాప పడియుంటాడు. అందుకే దేవుడు అతన్ని తృణీకరించకుండా తన యాజకత్వసేవలో చివరివరకూ ఘనంగా వాడుకున్నాడు. 
 
నిర్గమకాండము 32:25
ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి యుండెను. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి మనం చూస్తాం. వారు ఆ బంగారు దూడను పెట్టుకుని "విచ్చలవిడిగా" ప్రవర్తిస్తున్నారు. మద్యం సేవిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. వారికి దేవుడు అనుగ్రహించిన ఘనతకు వ్యతిరేకంగా కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. వారు ఆ విచ్చలవిడితనంలో ఎంతగా మునిగిపోయారంటే కనీసం తమ నాయకుడైన మోషేను పట్టించుకునే పరిస్థితిలో కూడా వారు లేరు. నేను మొదటివచనంలో తెలియచేసినట్టుగా వారి దుర్మార్గపు మనసును, విగ్రహారాధనా వాంఛను ఇక్కడ మరోసారి మనం గమనిస్తాం.‌ మొదటివచనంలో వారు పలికినట్టుగా అహరోనును బంగారు దూడ‌ చెయ్యమనడానికి "మోషే ఏమయ్యెనో" వారికి తెలియదనేదే కారణమైతే ఇప్పుడు మోషే వచ్చినప్పుడైనా ఆ బంగారు దూడను వదిలేసి మోషే దగ్గరకు రావాలి కదా? మరి రాలేదు ఎందుకు? కాబట్టి ఆ సందర్భంలో నేను తెలియచేసినట్టుగా "మోషే ఏమయ్యెనో మాకు తెలియదు" అనే వారి మాటలు విగ్రహారాధన చెయ్యడానికి‌ వారు చూపించిన సాకు మాత్రమేయని మరోసారి జ్ఞాపకం‌ చేస్తున్నాను, దైవవిరుద్ధమైన కార్యాలకు సిద్ధపడుతూ ఇలాంటి సాకులను వెతుక్కునే మనస్సు మనలో కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టే ఈ విషయం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 
 
అదేవిధంగా "వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి యుండెను" అనే మాటలు కూడా మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం దాటి కనాను వైపుగా పయనిస్తున్నారు. ఐగుప్తులో వీరికోసం దేవుడు చేసిన అద్భుతాలను బట్టి చుట్టుప్రక్కల ప్రజలందరికీ రాజ్యాల రాజులందరికీ వీరిపట్ల తీవ్రమైన భయం నెలకొని ఉంది (యెహోషువ 5:1). వేశ్యయైన రాహాబు మాటల్లోనూ మోయాబీయుల రాజైన బాలాకు మాటల్లోనూ ఇది మనం స్పష్టంగా గమనిస్తాం (యెహోషువ 2:9-11, సంఖ్యాకాండము 22). కానీ ఇప్పుడు వీరి ప్రవర్తన విరోధులకు "అదేంటి ఇశ్రాయేలీయులు కూడా దూడను పూజిస్తున్నారా? మద్యం సేవిస్తున్నారా? వ్యభిచారం చేస్తున్నారా? మరి వారి గురించీ వారి దేవుడు గురించీ గొప్పగా విన్నాం కదా" అనే చులకనభావం (ఎగతాళి) పుట్టించేదిగా మారింది. చుట్టుప్రక్కల రాజ్యాల‌వారు వేగుల ద్వారా వీరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వస్తున్నప్పుడు వారితోపాటు కొన్ని అన్య సమూహాలు కూడా వచ్చాయి (నిర్గమకాండము 12:37,38). ఇప్పుడు వారు కూడా అలానే ఎగతాళి చెయ్యడం జరుగుతుంది. ఈ సంఘటనను బాగా గమనించండి. వారు దేవుని‌మార్గంలో పయనిస్తున్నప్పుడు (ఆయన కట్టడలను అనుసరిస్తున్నప్పుడు) శత్రువులకు వారు భయకారణంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ దేవుణ్ణి విడిచి విచ్చలవిడిగా ప్రవర్తించారో అదే శత్రువులకు ఎగతాళిగా మారిపోయారు. అన్యజనుల్లో దేవుని పిల్లలకు ఆ దేవుని కట్టడలు ఊహించని గౌరవాన్ని తెచ్చిపెడితే, వారి విచ్చలవిడి ప్రవర్తన వారికి ఘోరమైన అవమానం తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ‌ గుర్తుంచుకోవాలి. ఈరోజుకీ ఎంతోమంది మిషనరీలు అన్యులనోట కొనియాడబడుతున్నారంటే దానికి కారణం ఏంటి? వారు దేవుని ఆజ్ఞలను బట్టి దురాచారాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో సంస్కరణలు చెయ్యడం, మరెన్నో మేలులూ సేవలూ చెయ్యడమే కదా! అలానే ఈరోజు ఎంతోమంది అన్యులు క్రైస్తవులను ఎగతాళి చేస్తున్నారంటే కారణమేంటి? వారు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి విచ్చలవిడిగా ప్రవర్తించడమే కదా! అందుకే పౌలు తీతుకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి.
 
తీతుకు 2:7 పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
 
మరోవిషయం ఏంటంటే దేవుని పిల్లల విచ్చలవిడి ప్రవర్తన వారికి మాత్రమే కాదు. ఆ దేవునికి కూడా అవమానం కలిగిస్తుంది. నేటి సమాజంలో ఇది కూడా మనం గమనిస్తున్నాం. 
 
రోమీయులకు 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
 
అదేవిధంగా "అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి యుండెను" అని మనం చదువుతున్నాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను. అయితే ఇతనిపై‌ మోపబడుతున్న ఈ నింద కేవలం బంగారు దూడ విషయంలో మాత్రమేయని మనం భావించకూడదు. అతను మోషే కొండపైకి వెళ్ళినప్పటినుంచీ అనుసరించిన బాధ్యతారాహిత్యమే ఇక్కడ ప్రస్తావించబడిందని నేను నమ్ముతున్నాను. కానీ దేవుని కృప ఇతన్ని బాధ్యతకలిగిన ప్రధానయాజకుడిగా నియమించింది. ఆ మహోన్నతమైన పదవిలో బాధ్యకలిగి నడుచుకునే మనస్సును కూడా పుట్టించింది. కాబట్టి నాయకులుగా ఉన్నవారు దేవునిమందపై బాధ్యతగా వ్యవహరించే మనస్సుకోసం ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి. ఒక గొప్ప రాజ్యాన్ని నడిపించడం కంటే ఒక సంఘాన్ని నడిపించడమే గొప్పవిషయం. ఎందుకంటే రాజ్యం ఈలోకానికి చెందింది, సంఘం దేవాదిదేవునికి చెందింది. ఆ సంఘం కోసమే క్రీస్తు తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. 
 
నిర్గమకాండము 32:26
అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. 
 
ఈ వచనంలో మోషే యెహోవా పక్షంగా పిలుపునివ్వడంతో లేవీయులు అతనిదగ్గరకు రావడం మనం చూస్తాం. దీనిప్రకారం ఇశ్రాయేలీయుల ప్రజలంతా ఆ బంగారు దూడను పూజించి విచ్చలవిడిగా ప్రవర్తించడం లేదు. అందులో కొందరు ప్రజలు ముఖ్యంగా లేవీగోత్రంలో కొందరు ప్రజలు శేషంగా ఉన్నారు. "లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి" అంటే ఆ లేవీయుల్లో యెహోవా పక్షంగా ఉన్నవారందరూ అని అర్థం. అంతేతప్ప లేవీగోత్రపు వారంతా అలా చెయ్యకుండా ఉన్నారని కాదు, దానిగురించిన ఆధారం క్రింద ఇస్తాను. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి.
 
1. దుష్టులైన ఇశ్రాయేలీయుల్లో ఎప్పుడూ ఆయన పక్షంగా ఉండే శేషం‌ ఉంటూనే ఉంది. ఆ ప్రజలు యెహోవా దేవుణ్ణి విడిచి భయంకరమైన దుష్టత్వంలో కూరుకుపోయినప్పుడు కూడా వారిని హెచ్చరించే కొందరు ప్రవక్తలు మరియు వారి మాటలను అనుసరించే కొందరు ప్రజలూ శేషంగా ఉన్నారు. ఎందుకంటే పితరులకు దేవుడు చేసిన  వాగ్దానాన్ని బట్టి ఆ శేషం వారిలో ఉండితీరాలి. ఏలియా సంఘటను ఆధారం చేసుకుని పౌలు ఇదే విషయాన్ని బోధిస్తాడు. 
 
రోమీయులకు 11:2-6 తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?  ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. 
 
ఈరోజు కొందరు మతోన్మాదులు బయలుదేరి యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్మరని ఎగతాళి చేస్తుంటారు. నిజానికి వారు అలా నమ్మకపోవడం‌ కూడా దేవుని వాక్యం సత్యమని రుజువుచేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్లో శేషం మాత్రమే రక్షించబడుతుందనే వాక్యం ముందుగానే తెలియచేసిన సత్యం.
 
యెషయా గ్రంథము 10:20-22 ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి నను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణ యింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును.
 
రోమీయులకు 9:6,27,28 అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు కారు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. 
 
2. లేవీయులకు అహరోను నాయకుడిగా ఉన్నాడు. అతనే ప్రధానయాజకుడు. అయినప్పటికీ లేవీయులంతా అతను చేసిన బంగారుదూడను పూజించలేదు. యెహోవా పక్షంగానే ఉన్నారు. కాబట్టి నాయకుడు లేక మాదిరిగా ఉండవలసినవాడు తప్పు చేసినంతమాత్రాన మనం కూడా ఆ తప్పుచెయ్యాలనే నియమమేమీ లేదు. మనకు దేవుని ఆజ్ఞలు మాత్రమే ప్రామాణికం. యేసుక్రీస్తు మాత్రమే మాదిరి. 
 
నిర్గమకాండము 32:27
అతడు వారిని చూచిమీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. 
 
ఈ వచనంలో మోషే తనవద్దకు వచ్చిన లేవీయులకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారిని చంపమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. 
 
1. ఇశ్రాయేలీయుల పాపం గురించి మోషేకు తెలిసినప్పుడు అతను దేవుణ్ణి వేడుకున్నాడు. అయితే ఇప్పుడు తన కళ్ళముందు అలా‌ ప్రవర్తిస్తున్నవారిని చంపమంటున్నాడు. ఎందుకంటే వారు చేసిన పాపం న్యాయంగా మరణశిక్షకు తగింది కాబట్టి ఆ న్యాయాన్ని అతను అనుసరించాలి. లేకపోతే దేవుని ఉగ్రత ఆ ప్రజలందరిపైనా కుమ్మరించబడే అవకాశం ఉంది. మోషే న్యాయబద్ధంగా ఈ నిర్ణయం తీసుకోబట్టే క్రిందివచనం ప్రకారం కేవలం మూడువేల మంది చావుతో ముగిసిపోయింది. కాబట్టి ఆత్మీయనాయకుడు తనకు అప్పగించబడిన వారి పాపం నిమిత్తం వేడుకునేవాడిగా మాత్రమే కాదు ఆ పాపాన్ని బట్టి వారు దైవోగ్రతకు గురవ్వకుండా న్యాయబద్ధంగా వారికి క్రమశిక్షణ చేసేవాడై కూడా యుండాలి (వాక్యానుసారంగా). లేకపోతే పాపానికీ దేవునికీ మధ్యలో రాజీ కుదురుస్తున్నట్టుగా ఉంటుంది. పరిశుద్ధుడైన దేవుడు దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించడు. దానిని సహించడు. 
 
2. మోషే దేవుని న్యాయానుసారంగానే లేవీయుల చేత ఈవిధంగా చేయిస్తున్నాడు అందుకే "ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను" అంటున్నాడు. కాబట్టి మోషే ఇక్కడ హత్యలు చేయించడం లేదు, "విగ్రహారాధనకు, వ్యభిచారానికి" మరణదండన తప్పదనే దేవుని చట్టాన్ని న్యాయంగా అమలుచేస్తున్నాడు. ఈ నియమం మనం మరింత స్పష్టంగా చదువుతాం. 
 
ద్వితీయోపదేశకాండము 13:1-5 ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. 
 
ద్వితీయోపదేశకాండము 17:2-4 నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను. 
 
కొందరు మతోన్మాదులు యెహోవా దేవుడు అంతమంచివాడైతే ఇశ్రాయేలీయుల ప్రజలు విగ్రహారాధనకు ఎందుకు పాల్పడ్డారంటూ ఆరోపణ చేస్తుంటారు‌. ఇశ్రాయేలీయులు విగ్రహారాధనకు పాల్పడ్డారని వాక్యం మూలంగా తెలుసుకున్న వీరు అదే వాక్యాన్ని బట్టి దానికి కారణం దేవుడో లేక ఆ ప్రజల పతనస్వభావమో కూడా తెలుసుకుని ఉంటే బావుంటుంది. కానీ అది నిజాయితీగా ఆరోపణలు చేసేవారు పాటించే వైఖరి కాబట్టి మతోన్మాదులు అలా చెయ్యలేరు. 
 
యిర్మియా 2:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగిపోయిరి?
 
మతోన్మాదులు అలా విమర్శించినప్పటికీ, అలా విగ్రహారాధనకు పాల్పడిన ఇశ్రాయేలీయులకు ఆయన ఇశ్రాయేలీయుల చేతనే శిక్షను‌ విధించడం ద్వారా ఇశ్రాయేలీయులు అందరూ విగ్రహారాధికులు కాలేదని స్పష్టం‌ ఔతుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో తన‌పక్షంగా ఉన్న లేవీయులు ద్వారా ఆయన విగ్రహారాధికులకు శిక్ష విధించాడు. 
 
నిర్గమకాండము 32:28
లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి. 
 
ఈ వచనంలో లేవీయుల ద్వారా మూడువేలమంది చంపబడినట్టు మనం చూస్తాం. నేను పైన చెప్పినట్టుగా మోషే ఈవిధంగా చెయ్యకుండా ఉండియుంటే ఆ ప్రజలందరిపైకీ ఆయన ఉగ్రత కుమ్మరించబడేది. అదేవిధంగా ఈ సంఘటన మనకు కూడా బుద్ధికలిగేలా రాయబడిందని పౌలు హెచ్చరిస్తున్నాడు. 
 
మొదటి కొరింథీయులకు 10:5-11 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులైయుండకుడి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 
 
నిర్గమకాండము 32:29
ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను. 
 
ఈ వచనంలో మోషే యెహోవా పక్షంగా నిలిచిన లేవీయులకు ఇచ్చిన ప్రోత్సహకాన్ని మనం చూస్తాం‌.
"మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడి" అంటే దుర్మార్గులైన ఆ కుటుంబసభ్యులనుండి యెహోవాకు ప్రత్యేకంగా ఉండండని అర్థం. వారిని చంపడం ద్వారా వారు దానిని చేసుకోవాలి.  ఎందుకంటే దైవవిరుద్ధమైన కార్యాలకు పాల్పడింది స్వయంగా కుటుంబసభ్యులైనా సరే వారిపట్ల ఎలాంటి ప్రేమా సానుభూతులు చూపించకూడదు. ఇనుపకొలిమి లాంటి ఐగుప్తు బానిసత్వం నుండి కేవలం తన కృపతో, తన బాహుబలంతో విడిపించిన దేవునిపట్లే తిరుగుబాటు చేసిన ఆ దుష్టులు వీరిపట్ల మాత్రం నమ్మకంగా ఉంటారనేది పూర్తిగా అసంభవం. తమ దేవునిపట్ల ద్రోహానికి పాల్పడేవారు తమ బంధాలవిషయంలో మరింత దుర్మార్గానికి పాల్పడతారు‌. అందుకే అలాంటివారిపై ఎలాంటి సానుభూతి పక్షపాతాలు చూపించకూడదు. అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడమంటే ఇదే. అన్నిటినీ అందర్నీ ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనను ఈవిధంగా ప్రేమించితీరాలి. ఈ న్యాయబద్ధమైన నియమం మనం మళ్ళీ చదువుతాం. 
 
ద్వితీయోపదేశకాండము 13:6-8 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు. వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. 
 
లేవీయులు ఈవిధిని అనుసరిస్తూ దుర్మార్గులైన తమ ఇంటివారినే సంహరించడం వల్ల ఎంతగానో ప్రశంసించబడ్డారు.
 
ద్వితీయోపదేశకాండము 33:8-11 లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీమము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు. యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.
 
అదేవిధంగా మోషే దగ్గరకు "లేవీయులందరును" వచ్చిరి అన్నప్పుడు ఆ గోత్రపు వారంతా వచ్చారని అర్థం కాదని, ఆ లేవీయుల్లో కేవలం యెహోవా పక్షంగా‌ ఉన్న లేవీయులు మాత్రమే వచ్చారని చెప్పాను. దానికి మనం పైన చూసిన వాక్యభాగమే ఆధారం. ఒకవేళ లేవీగోత్రీకులంతా ఆ పాపం చెయ్యకుండుంటే, యెహోవా పక్షంగా ఉన్న లేవీయులు తమ కుటుంబసభ్యులను సంహరించడం సాధ్యంకాదుగా? 
 
లేవీయులు చేసిన ఈ పనిని బట్టి మనం మన కుటుంబసభ్యుల ఏ పాపంలోనూ పాలివారు కాకుండా, ఆ విషయంలో వారిని మన్నించకుండా, మరుగుపరచకుండా వారిని గద్దించగలగాలి. ప్రస్తుతం లేవీయుల్లా వారిని చంపే అధికారం మనకు  ఇవ్వబడలేదు కానీ, (ఎందుకంటే వారు తమ దేశచట్టప్రకారం అలా చేసారు) నూతననిబంధన ప్రకారం వారికి బుద్ధిచెప్పే, మన మాట విననప్పుడు ఎలాంటి సానుభూతీ లేకుండా వెలివేసే అధికారం మనకు ఇవ్వబడింది. 
 
ఇక్కడ మరోవిషయాన్ని వివరించదలిచాను. లేవీయులకు పితరుడైన లేవీ అతని సహోదరియైన దీనా చెరపబడినప్పుడు షిమ్యోనుతో కలసి ఆ ఊరి పురుషులందర్నీ చంపివేసాడు (ఆదికాండము 34). లేవీ చేసిన ఆ పనిని యాకోబు క్రూరమైన చర్యగా పరిగణించి తన మరణసమయంలో అతన్ని నిందించాడు. 
 
ఆదికాండము 49:5-7 షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. 
 
కానీ అతని సంతానం మోషే పిలుపును బట్టి తన కుటుంబసభ్యులను కూడా చంపివేసినప్పుడు ప్రశంసించబడ్డారు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. 
 
ద్వితీయోపదేశకాండము 33:8,9 లేవిని గూర్చి యిట్లనెను నీ తుమ్మీమము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. 
 
ఇరుసందర్భాల్లోనూ మనుషులను చంపారు కానీ ఫలితాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎందుకంటే, లేవీ తన వ్యక్తిగత ప్రతీకారం కోసం అది కూడా సంధిచేసుకోవడానికి వచ్చినవారిని చంపాడు. కానీ అతని సంతానమైన వీరు విచ్చలవిడిగా తిరుగుతున్నవారిని దేవునిపక్షంగా‌ చంపారు. కాబట్టి మనం చేసేపని ఒకటే ఐనా అలా చెయ్యడంలో మన ఉద్దేశాన్ని బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది. మనం ఎల్లప్పుడూ దేవునిపక్షంగా, ఆయన మహిమకొరకు సేవ చెయ్యడానికే పిలువబడ్డాం. మనం చేసే సేవయొక్క ఉద్దేశం ఎల్లప్పుడూ ఇదే అయ్యుండాలి. 
 
నిర్గమకాండము 32:30
మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. 
 
ఈ వచనంలో మోషే మరలా ప్రజలకోసం దేవుణ్ణి వేడుకోవడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఈ మాటలు అతను లేవీయులు ద్వారా న్యాయబద్ధమైన శిక్షను వారిపై అమలు చేసాక, అలానే ఆ దూడను పొడిచేసి వారిచేత త్రాగించిన తరువాత పలుకుతున్నాడు. లేవీయులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిని చంపుతున్నప్పుడు అది చూసిన ప్రజలు మోషే దగ్గరకు వచ్చి అతన్ని బ్రతిమిలాడుకోవడం సహజంగా జరుగుతుంది. అందుకే మోషే వారిని ఇంక చంపకుండా వారిచేత ఆ బంగారు దూడ పొడి కలిపిన నీరు త్రాగించి, వారి పాపానికి ప్రాయుశ్చిత్తం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే వారిని దేవుడు‌‌ చంపుతానంటేనే ఆయన నామ ఘనతకు అపకీర్తి కలుగుతుందని అడ్డుపడిన మోషే ఇప్పుడు తానే వారందరినీ చంపేస్తే ఉపయోగం ఏముంటుంది? అందుకే కేవలం అతను తనముందే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారిని చంపించాడు. 
 
నిర్గమకాండము 32:31
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి. 
 
ఈ వచనంలో మోషే దేవునియొద్దకు తిరిగివెళ్ళి వారు చేసిన పాపాన్ని ప్రస్తావించడం‌ మనం చూస్తాం. అతను ఆ పాపాన్ని "గొప్ప పాపము" అంటున్నాడు. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మోషే కొండపైకి వెళ్ళింది, ప్రజలపై ఆరోపణ చెయ్యడానికి కాదు వారి తరపున ప్రాయుశ్చిత్తం చెయ్యడానికే. కానీ ఆ క్రమంలో అతను వారి పాపాన్ని గొప్ప పాపము అని ఆయనకు గుర్తుచేస్తున్నాడు. ఇది అతను వారిపై ఆరోపణ చేస్తున్నట్టుగా ఉంది కానీ, దేవుని మనసు ఎరిగిన మోషేకు తెలుసు, దేవుని నుండి క్షమాపణ పొందుకోవాలంటే, పాపానికి ప్రాయుశ్చిత్తం జరగాలంటే ముందు ఆ పాపపు తీవ్రతను ఆయనముందు ఒప్పుకోవాలని. మోషే ఈవిధంగా కనుక ఆ ప్రజల పాప తీవ్రతను ఆయనముందు ఒప్పుకోకుండా దానికి ప్రాయుశ్చిత్తం‌ చెయ్యాలని‌ ప్రయత్నిస్తే అప్పుడు అతను దేవుని పరిశుద్ధతను‌, పాపం‌పట్ల ఆయనకు కలిగే ఉగ్రతను గుర్తించలేనివాడు ఔతాడు. అప్పుడు దేవుడు అలాంటివాని విజ్ఞాపనను అంగీకరించి ఆ ప్రజలను క్షమించడం కూడా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనం‌ మన పాపం గురించైనా లేక ఇతరుల పాపాల‌ గురించైనా ఆయనను‌ వేడుకునేటప్పుడు ఆ పాపపు తీవ్రతను నిజాయితీగా ఆయనముందు ఒప్పుకోగలగాలి. న్యాయమూర్తి ముందు నేరం చేసిన దోషి తరపు న్యాయవాది వాదించేలా ఆ నేరపు తీవ్రతను తక్కువచేసి చూపించడానికి (కారణాలు చెబుతూ) ప్రయత్నించకూడదు. మన పాపాలు ఎంత తీవ్రమైనవంటే, క్రూరమైనవంటే అవి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఘోరమైన సిలువమరణం పొందడానికి కారణమయ్యాయి. గాయపడిన ఆయన దేహాన్ని మరింతగా గాయపరుస్తున్నాయి. 
 
నిర్గమకాండము 32:32
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను. 
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల పాపాన్ని ఒప్పుకున్న తరువాత ఇంకా వారి పాపాన్ని పరిహరింపకపోతే నీ గ్రంథంనుండి నా పేరు తుడిచివెయ్యమని దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తాం. 14వ వచనంలో రాయబడిన "అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను" అనే విషయం ఇంకా మోషేకు తెలియదు. ఆ విషయం ఆత్మప్రేరణతో లిఖిస్తున్నప్పుడే అతనికి తెలిసింది, అందుకే మోషే ఇంకా ఈవిధంగా బ్రతిమిలాడుతున్నాడు. అదేవిధంగా "నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయ్యమంటే" నువ్వు వారిని నాశనం చేసి నన్ను‌ గొప్పజనంగా చేస్తాను అన్నావు కదా, ఒకవేళ వారిని నాశనం చేసేపలమైతే నన్ను కూడా చంపివెయ్యి అని అర్థం. "నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివెయ్యుము" అంటే ఈవిధంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటిమాటలే మోషే మరలా పలక‌డం మనం చూస్తాం. 
 
సంఖ్యాకాండము 11:15 నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
 
అంతేతప్ప మోషే పలికిన ఆ మాటలకు గొర్రెపిల్ల జీవగ్రంథం నుండి నా పేరు తుడిచిపెట్టుము అని అర్థం కాదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొందరు దీనిని ఆధారం చేసుకుని మన రక్షణ పోతుందని (గొర్రెపిల్ల జీవగ్రంథం నుండి మన పేరు తుడిచిపెట్టబడుతుందని) వాదిస్తుంటారు. కానీ గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు‌, మోషే చెబుతున్న గ్రంథం వేరు. మోషే ఇక్కడ నన్ను కూడా చంపివెయ్యి అనే భావంలో అలంకారంగా గ్రంథం అని ప్రస్తావించాడు. దావీదు తన శత్రువులకోసం ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఇలాంటి అలంకారాన్ని మనం గమనిస్తాం.
 
కీర్తనలు 69:28 జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
 
అదేవిధంగా ఇశ్రాయేలీయుల్లో జన్మించే ప్రతీవ్యక్తి పేరూ వారి గ్రంథంలో రాయబడుతుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ పేరు చెరిపివెయ్యబడుతుంది. ఈ వాక్యభాగాలు కూడా పరిశీలించండి. 
 
యెహేజ్కేలు 13:9 వ్యర్థ మైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, "ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాకపోదురు", వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.
 
యెషయా 4:3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.
 
నిర్గమకాండము 32:33
అందుకు యెహోవాయెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును. 
 
ఈ వచనంలో దేవుడు మోషే ప్రార్థనకు  "యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును" అని బదులివ్వడం మనం చూస్తాం. అనగా నాదృష్టికి ఎవరైతే పాపం చేసారో వారినే నాశనం చేస్తానని అర్థం. ఇక్కడ ఆయన తన న్యాయపు తీర్పు గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన ఒకరిపాపాన్ని బట్టి‌ మరొకరికి అన్యాయంగా శిక్షవిధించే దేవుడు కాదు. మనకు అలా కనిపించే సందర్భాలను పరిశీలించినప్పుడు ఆ శిక్షలో వారి భాగమెంతో కూడా స్పష్టమౌతుంది. 
 
నిర్గమకాండము 32:34
కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను. 
 
ఈ వచనంలో దేవుడు మోషే విజ్ఞాపనను అంగీకరించాడనడానికి గుర్తుగా "నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము" అని ముందుగా చెప్పినట్టు "నా దూత నీకు ముందుగా వెళ్లును" అని సెలవివ్వడం మనం చూస్తాం. ఆయన ఇక్కడ "నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని" కూడా అంటున్నాడు. అంటే మోషే విజ్ఞాపనను‌ బట్టి ఆయన వారిని సమూలంగా నాశనం చెయ్యడం మానుకున్నాడు కానీ, వారి పాపాన్నైతే పూర్తిగా తుడిచిపెట్టలేదు. సమయం వచ్చినప్పుడల్లా ఆ పాపన్ని బట్టి వారిని దండిస్తూనే వచ్చాడు "నేను వచ్చు దినమున" అంటే ఆయన తీర్పుతీర్చే ప్రతీసారీ అని అర్థం. క్రిందివచనంలో ఆ విషయమే రాయబడింది.
 
నిర్గమకాండము 32:35
అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.
 
ఉదాహరణకు ఒక తండ్రి తన కుమారుడ్ని దండించేటప్పుడు అతను‌ గతంలో చేసిన తప్పిదాన్ని కూడా ప్రస్తావించి "నువ్వు మొన్నకూడా అలానే చేసావు" అని‌ ఒక దెబ్బ ఎక్కువ వేస్తుంటాడుగా. ఈవిధంగానే ఇశ్రాయేలీయులు ఏ తప్పిదం‌ చేసినా కూడా ఆయన వారికి తీర్పుతీర్చేటప్పుడు ఆ శిక్షను‌ మాత్రమే కాకుండా ఈ బంగారు దూడ విషయమైన శిక్షను కూడా విధిస్తూ వచ్చాడు. 
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.