విషయసూచిక:- 10:1,2 , 10:3 , 10:4-6 , 10:7 , 10:8,9 , 10:10 ,10:11 , 10:12,13 , 10:14 , 10:15 , 10:16,17 , 10:18 , 10:19,20 , 10:21,22 , 10:23 , 10:24 , 10:25,26 , 10:27 , 10:28,29 .
నిర్గమకాండము 10:1,2
కాగా యెహోవా మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కను పరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.
ఈ వచనాలలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం వెనుక ఉన్న మరో కారణాన్ని మోషేకు వివరించడం మనం చూస్తాం. నిర్గమకాండము 9:16 ప్రకారం, ఆయన ఫరో పట్ల తన బలాన్ని చూపడానికి, భూలోకమంతటా తన నామాన్ని ప్రకటించడానికి అతని హృదయాన్ని కఠినపరిచాడు. ఇప్పుడైతే ఇశ్రాయేలీయులు తమ భవిష్యత్తు తరాలకు ఐగుప్తులో చెయ్యబడిన ఆ దేవుని కార్యాలను వివరించడానికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఫరో హృదయాన్ని కఠినపరిచట్టు ఆ మరో కోణాన్ని బయలుపరుస్తున్నాడు. ఇలా ఐగుప్తులో చెయ్యబడిన దేవుని అద్భుతాలను తమ భవిష్యత్తు తరాలకు ప్రకటించడం, ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞగా జారీచెయ్యబడింది.
ద్వితియోపదేశకాండము 6: 21-23 నీవు నీ కుమారునితో ఇట్లనుము మనము ఐగుప్తులో ఫరోకుదాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి,
తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను
నిర్గమకాండము 12:25-27 యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.
ఈ మాటలు మనసులో పెట్టుకుని, విశ్వాసులైన తల్లితండ్రులు, పెద్దలు కూడా తమ సంతానానికి, దేవుడు తమపట్ల జరిగించిన కార్యాలను ప్రకటించేవారిగా ఉండాలి. ఈ విషయంలో తప్పిపోవడం, దేవుని ప్రాముఖ్యమైన ఆజ్ఞ విషయంలో తప్పిపోవడమే, తమ పిల్లలు దేవునికి దూరం అవ్వడానికి తమ బాధ్యతారహిత్యమే కారణం.
అదేవిధంగా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఎంతవరకూ సబబు అనే విషయంపై ఇప్పటివరకూ అలా రాయబడిన వచనాలన్నిటిలోనూ నేను సమాధానం పొందుపరిచాను (ఉదాహరణకు; నిర్గమకాండము 4:21 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 10:3
కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
ఈవచనంలో మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు తమతో చెప్పిన మాటలను పలకడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన ఫరోను "ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు?" అని ప్రశ్నిస్తూ, "నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము" అని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటివరకూ మనం చూసినదాని ప్రకారం, ఫరో హృదయాన్ని ఆయనే కఠినపరిచాడు కాబట్టి, అతను దేవుని మాటలకు విధేయత చూపించే అవకాశం ఉండదు. ఎందుకంటే అది కేవలం ఆయన చూపించే కృపను బట్టే సాధ్యమౌతుంది. మరి అలాంటి అవకాశం ఫరోకు ఇవ్వబడనప్పటికీ ఆయన ఎందుకిలా ప్రశ్నిస్తున్నాడంటే, ఇది మానవుని నైతిక బాధ్యతను గుర్తు చేస్తుంది. మనిషి తన ఇష్టపూర్వకంగా పాపం చేస్తాడు, ఆ పాపం పరిపూర్ణమయ్యాకే దేవుడు అతడిని బ్రష్టత్వానికి అప్పగిస్తాడు (కఠినపరుస్తాడు) కాబట్టి, అతనిపై దేవునిమాటలకు విధేయత చూపించాలనే బాధ్యత ఎప్పటికీ మినహాయించబడదు. సువార్త ప్రకటనలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు తన నిర్ణయంలో ఉన్నవారందరూ రక్షణపొందేలా ఆత్మీయమరణం నుండి వారిని తిరిగి బ్రతికిస్తున్నాడు, అందుకే వారు దేవునిమాటను (సువార్తను) అంగీకరిస్తున్నారు (ఎఫెసీ 2:1, అపో.కార్యములు 16:14). అయినప్పటికీ ఆ ఆత్మీయమరణంలోనే ఉండి, సువార్తను నమ్మనివారిపై "నమ్మాలనే" బాధ్యత మినహాయించబడడం లేదు, "నమ్మనివానికి శిక్ష విధించబడును" ఎందుకంటే వారు అలా నమ్మకపోడానికి వారి స్వంత పాపమే కారణం.
ఈ విషయంలో అందరూ నమ్మేలా అందరినీ ఆత్మీయమరణం నుండి తిరిగి బ్రతికించాలనే బాధ్యతకు దేవుడు కట్టుబడిలేడు. ఎవరిని బ్రతికించాలో అది పూర్తిగా ఆయన ఇష్టం.
తీతుకు 3: 5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, "తన కనికరము చొప్పుననే" పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
ఒకవేళ మనుష్యులు ఆయన సువార్తను నమ్మకుండా, ఆయనే వారిచేత పాపం చేయించి వారు ఆత్మీయంగా మరణించేలా చేసుంటే ఆ బాధ్యత దేవునిపై ఉండేదేమో. కానీ మనుషులు తమ ప్రతినిధియైన ఆదామును బట్టి ఆత్మీయమరణానికి లోనై ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఆ ఆదాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను, సృష్టిని అనుభవిస్తున్నవారు అతని పతన స్వభావంలో పాలివారై జన్మించడంలో ఎటువంటి అన్యాయం లేదు కదా! ఈ క్రమంలో అందరూ స్వభావసిద్ధంగానూ మరియు క్రియలమూలంగానూ దేవుని ఉగ్రతకు పాత్రులుగానే ఉన్నారు (ఎఫెసీ 2:3) కానీ దేవుడు తన కనికరాన్ని బట్టి కొందరిని ముందుగా నిర్ణయించుకుని ( రోమా 8:30, ఎఫెసీ 1:4-6) వారు ఆత్మీయంగా బ్రతికించబడి సువార్తను విశ్వసించేలా చేస్తున్నాడు (అపో.కార్యములు 13:48). కాబట్టి కొందరు సువార్తను నమ్మకపోవడానికి/దేవునిమాట వినకపోవడానికి వారి స్వంత పాపమే కారణం. అందువల్ల దేవుని మాటను/సువార్తను నమ్మాలనే బాధ్యత వారిపైనే ఉంటుంది. ఆ బాధ్యతను తప్పినవారి విషయంలో ఆ కారణాన్ని బట్టి తీర్పు కుమ్మరించబడుతుంది.
మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; "నమ్మని వానికి శిక్ష విధింపబడును".
దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యతలను గురించిన ఈ అంశం మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింద సూచించిన వ్యాసం చదవండి.
దేవుని సార్వభౌమత్వం మరియు మానవబాధ్యత
నిర్గమకాండము 10:4-6
నీవు నా జను లను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేష మును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.
ఈ వచనాలలో దేవుడు ఐగుప్తుపైకి రప్పించబోతున్న మిడతల తెగులు గురించి ఫరోను హెచ్చరించడం మనం చూస్తాం. ఇవి ఎంత తీవ్రంగా ఉంటాయంటే, కనీసం నేలకూడా కనిపించనంత విస్తారంగా పుట్టుకొస్తాయి, గతంలో వడగండ్ల వర్షానికి తప్పించుకున్న ఐగుప్తీయుల పంటలన్నిటినీ ఇవి పాడుచేస్తాయి. అంతేకాకుండా అవి ఐగుప్తీయుల ఇండ్లలోకి వచ్చి వారిని చాలా బాధపెడతాయి. ఇలాంటి పరిస్థితి ఐగుప్తుకు గతంలో ఎప్పుడూ సంభవించలేదు కాబట్టి దేవుడు ఇక్కడ ఫరోను "నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని" హెచ్చరిస్తున్నాడు.
నిర్గమకాండము 10:7
అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి.
ఈ వచనంలో మోషే చేసిన హెచ్చరికకు ఫరో సేవకులు స్పందన మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు ఏమిటంటే, నిజానికి మోషే వారికి ఉరిగా ఉండలేదు, ఫరో కఠినత్వమే/పాపమే ఐగుప్తుకు ఉరిగా మారింది, పైగా తెగులు సంభవించిన ప్రతీసారీ మోషే వారిపక్షంగా దేవుణ్ణి వేడుకుంటూ వారిని రక్షిస్తూ వచ్చాడు. కానీ వీరు అదేమీ ఆలోచించకుండా మోషేయే వారికి ఉరిగా ఉన్నట్టు నిందలు వేస్తున్నారు. కొన్నిసార్లు దేవునిపిల్లలు లోకంనుండి ఈవిధంగానే నిందలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏలియా గురించి దుష్టుడైన ఆహాబు రాజు పలుకుతున్న మాటలు చూడండి.
1రాజులు 18: 17 అహాబు ఏలీయాను చూచి-ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా-
ఈ సందర్భమంతటినీ మనం పరిశీలించినప్పుడు ఈ అహాబు అతని భార్య చేస్తున్న చెడుతనాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీయులపై కరువును రప్పించాడు. దానిగురించి ఏలియా ముందుగానే ప్రకటించాడు. అయితే అహాబు ఆ కరువుకు కారణమైన తన చెడుతనాన్ని సరిచేసుకోకుండా దానిని ప్రకటించిన ఏలియాను నిందిస్తున్నాడు.
యెషయా 51: 7,8 నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును.
1పేతురు 2: 20,21 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.
రెండవదిగా; ఫరో సేవకులు ఇక్కడ "తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలియదా" అంటున్నారు. ఈ మాటలను బట్టి దేవునిచేత కఠినపరచబడినవాడి మూర్ఖత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటివాడు తన జీవితంలో ఏం కోల్పోతున్నాడో గుర్తించకుండా దేవునిని ఎదిరించడమే తన జీవిత ధ్యేయంగా ప్రయాసపడుతుంటాడు.
నిర్గమకాండము 10:8,9
మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు మీరు వెళ్లి మీ దేవుడైన యెహో వాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను. అందుకు మోషేమేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను.
ఈ వచనాలలో ఫరో తన సేవకుల మాటలను బట్టి, మోషే అహరోనులను పిలిపించి యెహోవాను సేవించడానికి ఎవరెవరు వెళ్తారని ప్రశ్నించడం, దానికి మోషే బదులివ్వడం మనం చూస్తాం. మోషే ఫరోను కలసిన మొదటిసారే అక్కడికి మేమందరమూ వెళ్తామని అతనికి వివరించాడు (నిర్గమకాండము 5:1) కానీ ఇక్కడ ఫరో కొత్తగా ఆ ప్రశ్నను అడుగుతున్నాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్యా ఇప్పటికే చాలా చర్చలు జరుగుతూ వచ్చాయి కాబట్టి, ఆ విషయంలో మోషే ఏమన్నా రాజీపడతాడేమో అని ఫరో ఆలోచించాడు. కానీ మోషే మాత్రం అదేమాటపై నిలబడియున్నాడు. ఈవిధంగా దేవుని ఆజ్ఞలు/పిలుపు విషయంలో లోకం మనతో రాజీపడాలి కానీ, మనం లోకంతో రాజీపడకూడదు.
నిర్గమకాండము 10:10
అందు కతడు యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.
ఈ వచనంలో మోషే మాటలకు ఫరో వెటకారంగా స్పందించడం మనం చూస్తాం. గతంలో "నేనునూ నా జనులునూ పాపులము, యెహోవా న్యాయవంతుడు" అని ఒప్పుకున్నవాడు ఇక్కడ "యెహోవా మీకు తోడైయుండునా" అంటున్నాడు. సంభవించిన తెగుళ్ళ విషయంలో మీ దేవుణ్ణి వేడుకోండి, "నేను మిమ్మును పోనిచ్చెదను" అని ప్రమాణం చేసినవాడు "నేను మిమ్మును మీ పిల్లలనూ పోనిచ్చెదనా" అంటున్నాడు. దుష్టుల వైఖరి ఇలానే ఉంటుంది. వారు ఆపద సమయంలో దేవుణ్ణి వేడుకుంటారు, ఆ దేవుని పిల్లలనూ బ్రతిమిలాడుకుంటారు కానీ, ఉపసమనం కలగగానే ఎప్పటిలానే ప్రవర్తిస్తుంటారు.
నిర్గమకాండము 10:11
పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.
ఈ వచనంలో ఫరో, ఇశ్రాయేలీయుల పురుషులు మాత్రమే ఐగుప్తును విడిచివెళ్ళి దేవుణ్ణి సేవించడానికి అనుమతించడం మనం చూస్తాం. ఇక్కడ అతను "మీరు కోరినది అదే కదా" అంటూ అబద్ధం చెబుతున్నాడు. ఎందుకంటే మోషే ఎప్పుడూ కూడా పురుషులము మాత్రమే వెళ్తామని చెప్పలేదు, దానికి ప్రతిగా మా జనులందరమూ వెళ్తామని చెప్పాడు (నిర్గమకాండము 5:1, 7:16). ఇక్కడ ఫరో కుట్రపూరితంగానే ఇలా మాట్లాడుతున్నాడు. ఒకవేళ పురుషులు మాత్రమే వెళ్తే తమ కుటుంబంకోసం మరలా వెనక్కు తిరిగి వస్తారనేది అతని ఆలోచన. లోకం కూడా ఈవిధంగానే మనం ప్రేమించేవారిని అడ్డుపెట్టుకుని మనల్ని దేవునిపిలుపు నుండి తప్పించాలని చూస్తుంటుంది. కానీ మనం మన కుటుంబ రక్షణ కోసం దేవునిపై ఆధారపడుతూ ఆ దేవుని పిలుపు విషయంలో జాగ్రతకలిగి ఉండాలి. కుటుంబాన్ని ఇచ్చింది దేవుడే కదా!
నిర్గమకాండము 10:12,13
అప్పుడు యెహోవా మోషేతోమిడతలు వచ్చు నట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తిని వేయునని చెప్పెను. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
ఈ వచనాలలో దేవుడు, ఫరోను ముందుగా హెచ్చరించినట్టే మిడతల దండును ఐగుప్తుపైకి రప్పించడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు తూర్పుగాలిని విసిరింపచెయ్యడం ద్వారా వాటిని రప్పించాడు. అదేవిధంగా 19వ వచనం ప్రకారం పడమటి గాలిని విసిరింపచేసి వాటిని తొలగించాడు. "గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ, అది ఎక్కడినుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీవెరుగవు" (యోహాను 3:8) అనే మాటలు ఈ సృష్టి విషయంలో మానవుడి పరిమితిని సూచిస్తుంది కానీ, ఈ సృష్టిలో సమస్తమూ దేవునికి లోబడవలసిందే. ఎందుకంటే వాటికి ఆధారం ఆయనే.
కీర్తనలు 135: 7 ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
కొలస్సీయులకు 1: 17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
నిర్గమకాండము 10:14
ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
ఈ వచనంలో ఆ మిడతల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో వివరించబడడం మనం చూస్తాం. ఇక్కడ వీటిగురించి "అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు" అంటూ ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే దీనర్థం ఇటువంటి పరిస్థితి మరలా ఎవ్వరికీ సంభవించలేదని కాదు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వారిపైకి కూడా ఈ మిడతల దండును పంపించి ఆ దేశాన్ని నాశనం చేసాడు.
యోవేలు 2:2 అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
ఆమోసు 4:10 మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని.
కాబట్టి ఐగుప్తు విషయంలో "అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు" అన్నపుడు అది ఐగుప్తును మాత్రమే ఉద్దేశించి చెబుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 6వ వచనంలో "నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని" ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు.
నిర్గమకాండము 10:15
ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
ఈ వచనంలో కూడా ఆ మిడతలు కలిగించిన నష్టం గురించి వివరించబడడం మనం చూస్తాం. వాటి సంఖ్య ఎంత విస్తారంగా ఉందంటే, అవి నేలమొత్తాన్ని కమ్మివెయ్యడమే కాదు, సూర్యకాంతి కూడా ఆ దేశంపై ప్రకాశించకుండా ఆకాశంలో సూర్యుడికి అడ్డుగా ఎగురుతున్నాయి. అందుకే ఆ దేశమంతా చీకటి కలిగింది.
అదేవిధంగా ఈ మిడతల వల్ల ఐగుప్తులో ఉన్న సమస్త కాయగూరలు, ఆకుకూరలు, పంటలు పాడైపోయినప్పుడు, మరలా కొత్తపంట వచ్చేవరకూ ఐగుప్తీయులు ఏం తిన్నారనే ప్రశ్న ఇక్కడ కలుగుతుంది. గతంలో ఐగుప్తు నదులు రక్తంగా మార్చబడి వాటిలోని చేపలు కూడా చచ్చిపోవడం వల్ల వాటిపై ఆధారపడే పరిస్థితి కూడా వారికి లేదు. దీనికి సమాధానంగా మనం అప్పటి దేశపరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆకాలంలో ఏదైనా దేశానికి కరువు సంభవించినప్పుడు పక్క దేశాలనుండి ఆహారపధార్థాలను ఎగుమతి చేసుకోవడం సాధారణం. పైగా ఐగుప్తు రాజ్యం, ప్రపంచంలోని ప్రాముఖ్యమైన రాజ్యాలలో ఒకటి కాబట్టి, దేవుడు వీరి ప్రకృతి సంబంధమైన వనరులను నాశనం చేసాడు తప్ప, ధనాగారంలో ఉన్న ధనం, బంగారం వంటివాటిని ఏమీ చెయ్యలేదు కాబట్టి, వాటిద్వారా వీరు పక్క రాజ్యాలనుండి ఆహారపధార్థాలను ఎగుమతి చేసుకున్నారు. చుట్టుపక్కల రాజ్యాలకు యెహోవా దేవుడు ఐగుప్తులో చేసిన ఈ కార్యాలు ప్రచురమవ్వడానికి ఇది కూడా ఒక కారణం.
ఇక ఈ మిడతల తెగులు ఐగుప్తీయుల సెరాపిస్ (serapis) దేవునిపై తీర్పును సూచిస్తుంది. ఐగుప్తీయులు ఈ దేవుణ్ణి తమకు పంటనష్టం కలిగించే మిడతలనుండి తప్పించే దేవునిగా పూజించేవారు. కానీ మన దేవుడు ఆ మిడతలను వారిపై ఊహించనంత విస్తారంగా రప్పించి, వారి పంటను నాశనం చేసి, తననుండి ఏ దేవుడూ వారిని తప్పించలేడని రుజువు చేసాడు.
యెషయా 31: 3 యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
నిర్గమకాండము 10:16,17
కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా యెడలను మీ యెడలను పాపముచేసితిని. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా-
ఈ వచనాలలో ఫరో, మోషే అహరోనులను తనవద్దకు పిలిపించి, మిడతల తెగులు విషయంలో వేడుకోవడం మనం చూస్తాం. ఫరో ఇక్కడ పలుకుతున్న మాటలు నేను 9:27వ వచనంలో వివరించినట్టుగా యధార్థమైన పశ్చాత్తాపంతో పలుకుతున్నవి కావు. కేవలం అప్పుడు కలుగుతున్న శ్రమను తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇక ఈ సందర్భంలో అతను ప్రత్యేకంగా "ఈ చావు మాత్రము" తొలగించమంటున్నాడు. ఎందుకంటే ఆ మిడతలు ఆ దేశపు పంట అంతటినీ తినివేసి కరువుబారిన పడెలా చెయ్యడమే కాకుండా వారిని చచ్చేంతగా ఇబ్బంది పెట్టసాగాయి. "అవి మిక్కిలి బాధకరమైనవి" (14వ వచనం).
నిర్గమకాండము 10:18
అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
ఈ వచనంలో మోషే ఫరోమాట చొప్పున ఆ మిడతల తెగులు గురించి దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తాం. మోషే ఇలా వేడుకున్న గత సందర్భాలలో నేను వివరించినట్టుగా; అతను ఫరోకు చేసిన ప్రమాణం చొప్పున ఆ తెగుళ్ళ గురించి వేడుకుంటున్నాడు. అదేవిధంగా దేవుడు ఐగుప్తు తొలిచూలు పిల్లలవధవరకూ ఆ తెగుళ్ళు కొనసాగుతాయని ముందే చెప్పాడు కాబట్టి, మరో తెగులు రావాలంటే ఈ తెగులు పోవాలనే ఉద్దేశంతో కూడా అలా వేడుకుంటున్నాడు. ఇక్కడ మోషే దేవునితీర్పుకు వ్యతిరేకంగా మాత్రం ఏమీ చెయ్యడం లేదు. కాబట్టి మనం కూడా ఇతరుల కోసం ప్రార్థించేటప్పుడు వాక్యనియమాలకు విరుద్ధంగా కాకుండా వాక్యనియమాల పరిధుల్లో ప్రార్థించేవారంగా ఉండాలి.
ఉదాహరణకు; 1యోహాను 5:15 లో మనం ఇతరులు చేసిన పాపం విషయంలో వారికి క్షమాపణ దయచెయ్యమని ప్రార్థించేటప్పుడు, వారు చేసింది మరణకరమైన పాపమైతే అలాంటిదానికోసం వేడుకోకూడదని రాయబడింది. లేఖనాలలో మరణకరమైన పాపంగా ఎంచబడింది, క్రీస్తునూ ఆయన రక్షణనూ తృణీకరించడం మాత్రమే (హెబ్రీ 10:29). అలాంటి పాపం చేసినవాడు తెలిసి కూడా దేవుని కృపనూ ఆయన రక్షణనూ తృణీకరిస్తున్నాడు కాబట్టి, అది మరణకరమైన పాపం. ఆ పాపాన్ని క్షమించమని మనం ఎట్టిపరిస్థితుల్లోనూ వేడుకోకూడదు. యేసుక్రీస్తును సిలువవేసే సమయంలో అక్కడున్న రోమా సైనికులు ఆయన గురించి తెలియక అలా చేస్తున్నారు కాబట్టి, "తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని వేడుకున్నాడు" కానీ యూదులలో కొందరు శాస్త్రులు పరిసయ్యులు ఆయన చేసిన అద్భుతకార్యాలను కళ్ళారా చూసి, ఆయన బోధలను చెవులారా విని కూడా ఆయనను తృణీకరించి సిలువకు అప్పగించారు కాబట్టి, "నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదని" ( యోహాను 19:11) పిలాతుతో చెబుతున్నాడు. వారిని క్షమించమని ఆయన ఎక్కడా వేడుకోలేదు.
నిర్గమకాండము 10:19,20
అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.
ఈ వచనంలో మోషే ప్రార్థనను అంగీకరించిన దేవుడు పడమటిగాలి ద్వారా ఆ మిడతలను ఎఱ్ఱసముద్రములో పడవెయ్యడం, అయినప్పటికీ ఫరో తన మాటచొప్పున ఇశ్రాయేలీయులను పోనియ్యకుండా నిలువరించడం మనం చూస్తాం. ఇక్కడ తూర్పుగాలి ద్వారా మిడతలను రప్పించడం ఎంత అద్భుతమో, పడమటిగాలి ద్వారా వాటిని తొలగించడం కూడా అంతే గొప్ప అద్భుతం. కానీ ఫరో దీనిని బట్టి కూడా తన మనస్సును మార్చుకోలేకపోయాడు. ఎందుకంటే అంతవరకూ అతను చేసిన పాపాలను బట్టి, అతనిపైకి తీర్పులు రప్పించి చుట్టుపక్కల దేశాలలో తన నామానికి ఘనత తెచ్చుకోవడానికి దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి, అతను మార్పుచెందలేడు. దీనిని మనస్సులో పెట్టుకుని, ఈరోజు దేవుని సువార్తకు, ఆయన మాటలకు విధేయులమైన మనమందరమూ ఆయనకు ఎంతగానో కృతజ్ఞతచూపేవారిగా ఉండాలి. ఒకవేళ ఆయన ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టుగా మన పాపాలను బట్టి మనల్ని కూడా కఠినపరచియుంటే మనమూ ఫరోలానే ప్రవర్తించి నిత్యనాశనానికి పోయేవారం. అందుకే మన రక్షణకు కారణం కేవలం మన దేవుడు మాత్రమే.
ఎఫెసీయులకు 2: 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
ఈరోజు చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారు, ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచకుంటే అతను కూడా మారేవాడుగా, ఏశావును ద్వేషించకుంటే అతనూ మార్పుచెందేవాడుగా అంటూ దేవుని సార్వభౌమత్వానికి (చిత్తానుసారమైన నిర్ణయానికి ఎఫెసీ 1:12) విరుద్ధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఇప్పటికే నేను వివరణ ఇచ్చాను.
రక్షణ యెహోవాదే
నిర్గమకాండము 4:21 వ్యాఖ్యానం
కానీ ఇలా ప్రశ్నించేవారు నిజంగా విశ్వాసులైతే ఫరో సంగతి, ఏశావు సంగతి, ఇతర అవిశ్వాసుల సంగతిపక్కన పెట్టి తమను అలా వదిలెయ్యకుండా రక్షించుకున్న దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవారు, ప్రేమించేవారు. ఎందుకంటే ఇక్కడ న్యాయబద్ధమైన ప్రశ్న వారినెందుకు విసర్జించావు, కఠినపరిచావు అని కాదు, నన్నెందుకు ఎన్నుకున్నావు, నన్నెందుకు రక్షించుకున్నావు అన్నదే.
కీర్తనల గ్రంథము 103:1,2,3 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
ప్రకటన గ్రంథము 7:9,10
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లయెదుటను నిలువబడి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును "మా రక్షణకై స్తోత్రమని" మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
నిర్గమకాండము 10:21,22
అందుకు యెహోవా మోషేతో ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
ఈ వచనాలలో దేవుడు ఐగుప్తుపై మరో తీర్పును రప్పించడం మనం చూస్తాం. ఈ చీకటి ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ చీకటికి కారణమైన ఆవిరి/పొగ/మంచు వారి చేతికి కూడా తెలిసేలా (స్పర్శ) ఉంది. ఈ పరిస్థితిలో వారు వెలుగుకోసం దీపాలను వెలిగించుకోవడం వంటివి చేయవచ్చు కానీ, ఆ ఆవిరి/మంచు మంటను కూడా ఆర్పివేసేదిగా ఉంది. అందుకే మూడు దినాలవరకూ వారు ఒకరిని ఒకరు కనుగొనలేనంత గాఢచీకటిలోనే ఉండిపోయారు.
నిర్గమకాండము 10:23
మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
ఈ వచనంలో కూడా ఆ చీకటి ఎంతభయంకరంగా ఉందో వివరించబడడం, ఇశ్రాయేలీయులు నివసిస్తున్న గోషెను ప్రాంతంలో మాత్రం ఆ ప్రభావం లేకపోవడం మనం చూస్తాం. ఇక్కడ ఐగుప్తీయుల పరిస్థితిని మనం ఆలోచిస్తే, ఆ చీకటిలో ఒకరిని ఒకరు కనుగొనలేరు, ఆహారాన్ని సిద్ధపరచుకోలేరు, అంతేకాకుండా ఆ చీకటి వారికి భయాన్ని పుట్టించేదిగా ఉంటుంది, ఉదాహరణకు ఆ చీకటిలో ఏవో శబ్దాలు వినిపించడం, పడిపోతున్న, అరుస్తున్న జంతువుల చప్పుల్లు వినిపించడం, ఇలాంటివి. యూదుల చరిత్రకు సంబంధించిన "సొలోమాను జ్ఞానగ్రంథం" అనే పుస్తకం 17వ అధ్యాయం 2-6 వచనాలలో ఐతే ఆ చీకటిలో వారిని దురాత్మలు వచ్చి భయపెట్టినట్టుగా కొన్ని సంగతులు రాయబడ్డాయి.
కీర్తనల గ్రంథము 78:49 ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.
ఇక దేవుడు ఐగుప్తీయులపైకి ఈ చీకటిని ఎందుకు పంపించాడు అనేది మనం పరిశీలిస్తే;
మొదటిగా, వారు ఇంతవరకూ ఆయన వాక్యపు వెలుగును తృణీకరించారు కాబట్టి, వారు కోరుకున్న చీకటినే వారికి అనుగ్రహించాడు. ఆ చీకటిని వారు మూడుదినాలే భరించలేకపోతే, ఆయన వాక్యాన్ని (మాటలను) తృణీకరించిన కారణంగా పొందుకోబోయే నరకంలో, ఇంతకన్నా దారుణమైన నిత్యచీకటిని ఎలా భరించగలరు? ఈరోజు దేవుని వాక్యాన్ని (సువార్తను) త్రోసివేసేవారు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి.
మత్తయి 8: 12 రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు చాలామందికి సువార్త చెబుతున్నపుడు, ఆ సువార్తకు లోబడకపోతే పొందుకోబోయే నరకం గురించి హెచ్చరిస్తున్నపుడు "పోన్లెండి మేము నరకమే పోతాం, మీరు మాత్రం స్వర్గం వెళ్ళండి" అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. వారు కోరుకుంటున్న నరకం ఎంత భయంకరంగా ఉంటుందంటే, మానవుల కంటే శక్తివంతులైన దెయ్యాలు (పతనమైన దూతలు) కూడా దానిని ఇష్టపడడం లేదు. అందుకే అవి మమ్మును పాతాళంలోకి పంపకుండా పందులమంద లోకి పంపమంటూ యేసుక్రీస్తును వేడుకున్నాయి (లూకా 8:31,32). పాతాళం/నరకం విషయంలో దెయ్యాలకు ఉన్న అవగాహన మనుషులకు లేకపోయింది.
రెండవదిగా; ఇది ఐగుప్తీయులు పూజించే ప్రధానదేవుడైన సూర్యదేవుడు (Raa) పై దేవుని తీర్పు. ఫరోలు కూడా ఇతని సంతానమే అని వారు నమ్ముతారు. ఇక్కడ దేవుడు, సూర్యుడు కనిపించకుండా మేఘాన్ని కమ్మజేసి మీరు పూజించే సూర్యుడు నా నియంత్రణలోనే ఉన్నాడని రుజువుచేసాడు.
ఇక "ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను" అనే మాటలను బట్టి కూడా మనం ఒక సంగతిని గ్రహించాలి. దేవుడు తలచుకుంటే తన పిల్లలకు (మంచివారికి) మాత్రమే తన సూర్యుని ఉదయింపచేసి వెలుగును పంచగలడు, వర్షాన్ని కూడా వారికే లాభం కలిగేలా కురిపించగలదు. కానీ ఆయన " చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు" (మత్తయి 5: 45). పకృతిలో ఆయన పెట్టిన ఈ నియమం మనుష్యులందరిపైనా ఆయన చూపిస్తున్న సహజకృపను బోధిస్తుంది. దీనిద్వారా మనం మంచివారిని మాత్రమే కాకుండా చెడ్డవారిని కూడా లేఖనాల పరిధిలో ప్రేమించాలనే నియమాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు.
మత్తయి సువార్త 5:43-48 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
నిర్గమకాండము 10:24
ఫరో మోషేను పిలిపించిమీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా-
11వ వచనంలో, స్త్రీలనూ పిల్లలనూ మినహాయిస్తూ పురుషులు మాత్రమే బలి అర్పించడానికి వెళ్ళాలని ఆదేశించిన ఫరో ఈ వచనంలో, స్త్రీలూ పిల్లలూ కూడా వారితో వెళ్ళడానికి అంగీకరిస్తూ తమ ఆస్తులైన పశువులను మాత్రం అక్కడే ఉంచాలని షరతును విధించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ పశువులకోసమైనా వారు వెనక్కు తిరిగివస్తారని అతని ఆలోచన.
నిర్గమకాండము 10:25,26
మోషేమేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.
ఈ వచనాలలో మోషే, ఫరో షరతుకు ఒప్పుకోకుండా తమ పశువులను కూడా తమతో పంపాలని మాట్లాడడం మనం చూస్తాం. ధర్మ శాస్త్రానికి ముందటికాలంలో కూడా దేవునికి బలులను అర్పించే సాంప్రదాయం ఉన్నప్పటికీ, ఆ బలులను ఏ సమయంలో వేటిని, ఎన్నెన్నిగా అర్పించాలో మరిన్ని కట్టడలు ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. అది ఇంకా మోషేకు తెలియదు కాబట్టి, సీనాయి పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడే తెలుస్తుంది కాబట్టి, అతను ఫరోతో ఈవిధంగా చెబుతున్నాడు. ఇక్కడ మోషే ఎటువంటి అబద్ధం చెప్పడం లేదు. ఎందుకంటే అతనిమాటల్లో మేము బలి అర్పించాక తిరిగివస్తామనే మాటలను మనం ఎక్కడా చూడము. కాదంటే అతను ఫరోకు ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెబుతున్నాడు, పూర్తిగా చెప్పవలసిన అవసరం అతనికి లేదు (నిర్గమకాండము 5వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 10:27
అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
ఈ వచనంలో మోషే పలికినమాటలు అంగీకరించకుండా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం మనం చూస్తాం. ఎందుకంటే అసలైన తెగులు ముందు రాబోతుంది. దానితో ఐగుప్తుపై ఫరోపై దేవుడు రప్పించదలచిన తీర్పులు సమాప్తి చెయ్యబడతాయి. అది జరిగినప్పుడు ఫరోనే ఇశ్రాయేలీయులను తొందరపెట్టి మరీ ఐగుప్తునుండి వెళ్ళగొడతాడు.
నిర్గమకాండము10:28,29
గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
ఈ వచనాలలో ఫరో, మోషేను బెదిరించడం, దానికి మోషే కూడా తగినరీతిలో ప్రత్యుత్తరమివ్వడం మనం చూస్తాం. మిడతల తెగులువిషయంలో "ఈ చావునుండి నన్ను తప్పించమని" వేడుకున్న ఫరో, అలా తప్పించిన మోషేను ఇక్కడ చంపుతానంటున్నాడు. ఇదే దుష్టుల స్వభావం. అదేవిధంగా ఇక్కడ మోషే నిర్గమకాండము 11:4-8 వచనాలలో రాయబడిన మాటలను పలికి ఫరో యొద్దనుండి వెళ్ళిపోయాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయము 10

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"