పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

ఈ అధ్యాయంలో అహరోనునూ అతని‌ కుమారులనూ యాజకులుగా‌ ప్రతిష్టించవలసిన విధి గురించీ, వారు అర్పించబలసిన బలుల గురించీ మనం చదువుతాం

విషయసూచిక:- 29:1, 29:2,3, 29:4-7 , 29:8, 29:9 , 29:10-12 ,29:13,14 , 29:15-18 , 29:19,20 , 29:21 , 29:22-24 , 29:25 , 29:26,27 , 29:28 , 29:29,30 , 29:31,32 , 29:33 , 29:34 , 29:35-37 , 29:38-41 , 29:42 , 29:43,44 , 29:45 , 29:46.

 

నిర్గమకాండము 29:1
వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా-

గడచిన అధ్యాయంలో దేవుడు అహరోను కుటుంబాన్ని యాజకులుగా పిలిచి వారిని ప్రతిష్టించమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూసాం. ఈ అధ్యాయంలోనైతే వారిని ఎలా ప్రతిష్టించాలో వివరించడం మనం చూస్తాం. ఈ బహిరంగ ప్రతిష్ట అహరోను కుటుంబానికి దేవుడే కలుగచేసిన ఘనతగా ప్రజల మధ్య సాక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా అహరోను కుటుంబం కూడా ఆయన యాజకత్వ పిలుపును ఘనమైనదిగా ఎంచాలని, శ్రద్ధగా సేవ చెయ్యాలని ఇది గుర్తుచేస్తుంది.

నిర్గమకాండము 29:2,3
ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము. గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.

ఈ వచనాల్లో దేవుడు అహరోను కుటుంబాన్ని యాజకులుగా ప్రతిష్టించడానికై ఆయన సన్నిధికి ఏమేం తీసుకురావాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వీటిని ఆ‌ ప్రతిష్టలో ఏవిధంగా వినియోగిస్తారో క్రింది వచనాల్లో వివరించబడింది. ఇక్కడ మనకు "కళంకములేని రెండు పొట్టేళ్లను" అని నొక్కి చెప్పబడింది. ఆ మాటలకు శారీరక లోపం లేనివని అని అర్థం (మలాకీ 1:8). దేవునికి అర్పించబడే‌ బలిపశువులన్నిటికీ ఈ నియమమే వర్తిస్తుంది. ఎందుకంటే -
1. పాతనిబంధనలోని బలులన్నీ క్రీస్తుయేసు బలికి ఛాయగా ఉన్నాయి కాబట్టి ఆ బలిపశువులన్నీ ఆయన నిష్కళంకతకు సాదృశ్యంగా, శారీరక కళం‌కం లేనివిగా ఉండాలి.

1పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

హెబ్రీయులకు 7:26 - పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

2. ఈ నియమం మనకు దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవిగా ఉండాలని నేర్పిస్తుంది. ఆయనలో మనకు లభిస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలను గ్రహించినవారు ఆయనకు శ్రేష్టమైనవాటిని‌ ఇవ్వడానికి ఆసక్తి కలిగియుంటారు. అందుకే హేబెలు కూడా తన‌ మందలో క్రొవ్విన (శ్రేష్టమైన) వాటిని ఆయనకు అర్పించినట్టు మనం చదువుతాం. కాబట్టి మనం కూడా ఆయన పరిచర్యకై, పరిచారకులకై శ్రేష్టమైనవాటిని ఇవ్వగలగాలి.

అదేవిధంగా ఈరోజు మనమంతా ఆయనకు సజీవయాగంగా మన శరీరాలను అర్పించడానికి పిలవబడ్డాం (రోమా 12:1). కాబట్టి ఆయనకు అర్పించబడుతున్న మన శరీరం కళంకం అంటనిదిగా ఉండేలా మనం జాగ్రత్తవహించాలి. ఆయన దృష్టిలో పాపాన్ని మించిన కళంకం లేదు. పాతనిబంధనలో ఆయన శారీరక కళంకం ఉన్నవాటిని ఆయన సన్నిధిలో నిషేధించింది, క్రీస్తు యొక్క నిష్కళంకతకు సాదృశ్యంగా మాత్రమే కాదు, ఆయన రక్తంలో నిష్కళంకులుగా కడగబడిన మనకు ఈ ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికి కూడా.

నిర్గమకాండము 29:4-7
మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతక మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.

ఈ వచనాలలో అహరోనును ప్రధానయాజకుడిగా ప్రతిష్టించడం గురించి మనం చూస్తాం. ముందుగా అతనూ అతని కుమారులూ ప్రత్యక్షగుడారపు ద్వారం దగ్గర స్నానం చేసి తమ దేహాలను శుద్ధి చేసుకోవాలి. తర్వాత అతను గత అధ్యాయంలో వివరించబడిన ప్రధానయాజకుడి వస్త్రాలను ధరించాలి. పాతనిబంధనలో శుద్ధీకరణ ఆచారాలు మన ఆత్మీయ పరిశుద్ధతకు ఛాయగా ఉన్నాయి కాబట్టి దేవుడు నివసించే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించి అక్కడ సేవ చెయ్యబోయే అహరోను అతని కుమారులు ముందుగా తమ దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ నియమం మనకు "పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడని" (హెబ్రీ 12:14) హెచ్చరిస్తుంది. కాబట్టి మనమంతా అపవిత్రమైన మన శరీరాశలను విసర్జించి నీతిని వెంటాడేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన పక్షంగా శ్రేష్టమైన పరిచర్య చెయ్యగలం. తీర్పుదినమందు ఆయన సన్నిధిలో ప్రవేశించగలం.

నిర్గమకాండము 29:8
మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.

ఈ వచనంలో దేవుడు అహరోను కుమారులకు కూడా చొక్కాయిలను తొడిగించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గత అధ్యాయంలో ఈ చొక్కాయిల తయారీ గురించి వివరించబడింది. అవి కూడా ప్రతిష్టమైనవే. ఆ ప్రతిష్టమైన వస్త్రాలు లేకుండా ఎవ్వరూ ఆయన సన్నిధిలో ప్రవేశించలేరు‌. అలానే మనం కూడా పరిశుద్ధమైన క్రియలు లేకుండా ఆయనను సమీపించలేము.

నిర్గమకాండము 29:9
అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.

ఈ వచనంలో దేవుడు అహరోనూ, అతని కుమారులూ ప్రతిష్టమైన వస్త్రాలు ధరించిన తర్వాత నిత్యమైన యాజకత్వం వారిదవుతుందని తెలియచెయ్యడం మనం చూస్తాం. అప్పటినుంచి అహరోను వంశం‌వారు తరాల చొప్పున ప్రధానయాజకులుగానూ, యాజకులుగానూ ప్రతిష్టించబడతారు.

నిర్గమకాండము 29:10-12
మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపుటడుగున పోయ వలెను.

ఈ వచనాలలో దేవుడు అహరోను మరియు అతని కుమారులు ప్రత్యక్షగుడారంలో ప్రవేశించడానికి ముందుగా ఒక కోడెదూడను బలి అర్పించి బలిపీఠంపై ఆ రక్తాన్ని ప్రోక్షించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇప్పుడు వారు పరిశుద్ధుడైన దేవుని ప్రత్యక్షగుడారంలో ప్రవేశించి సేవ చెయ్యబోతున్నారు కాబట్టి ముందుగా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. అందుకే ఆ దూడపై వారు చేతులు ఉంచి, వారి పాపాలను దానిపై మోపి దానిని బలిచ్చారు. ప్రస్తుతం పరిచర్యలో పాలుపొందుతున్నవారు కూడా ఈ నియమాన్ని అన్వయించుకోవాలి. వారు ముందుగా తమ పాపాల విషయంలో శుద్ధిపొందాలి, అప్పుడే ఇతరుల పాపాలకోసం ప్రభువును‌ వేడుకోవడం సాధ్యమౌతుంది.

నిర్గమకాండము 29:13,14
మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వం తటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది

ఈ వచనాలలో దేవుడు బలిగా అర్పించబడిన దూడ క్రొవ్వును మరికొన్ని భాగాలను బలిపీఠంపై దహించి, మాంసాన్ని చర్మాన్ని మరియు పేడను ప్రత్యక్షగుడారపు పాళెం వెలుపల అగ్నితో కాల్చివెయ్యమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది "పాపపరిహారార్థమైన బలి". ధర్మశాస్త్రంలో ఒక్కొక్క బలికి ఒక్కోవిధమైన క్రమం ఉంటుంది. వాటిగురించి లేవీకాండములో వివరంగా చదువుతాం.

నిర్గమకాండము 29:15-18
నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

ఈ వచనాలలో దేవుడు పాపపరిహారార్థ బలి తర్వాత ఒక పొట్టేలును దహన బలిగా అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది "యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము" చెప్పబడింది. మొదటిగా యాజకులు తమ పాపపరిహారం కోసం‌ బలిని అర్పించారు, రెండవదిగా ఆయనకు "సువాసనగల హోమము"గా బలి అర్పించారు. ఇది మనం దేవునికి చెల్లించే స్తుతి యాగానికి సాదృశ్యంగా ఉంది. మొదటిగా మనం క్రీస్తు బలిని బట్టి పాపాల నుండి విడిపించబడ్డాం, ఆ తర్వాతనే ఆయనను స్తుతించే అర్హతను సంపాదించుకున్నాం. కాబట్టి పాపసహితమైన హృదయంతో ఆయనను స్తుతించలేమని, ఆ స్తుతిని దేవుడు అంగీకరించడని మనం గుర్తుంచుకోవాలి. అందుకే బుద్ధిపూర్వకమైన ప్రతీ పాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలియక కూడా మనం అనేకమైన పాపాలు చేస్తుంటాం కాబట్టి, దేవుణ్ణి సమీపించి ఆయనను స్తుతించే/ప్రార్థించే ప్రతీ సమయంలోనూ క్రీస్తురక్తంపై ఆధారపడుతూ ముందుగా మన పాపాల కొరకై క్షమాపణను వేడుకోవాలి. అప్పుడు మాత్రమే‌ మన స్తుతిని/ప్రార్థనను ఆయన అంగీకరించడం జరుగుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, అలవాటుగా పాపాలలో చిక్కుకునేవారి పాపాలను క్రీస్తు రక్తం పరిశుద్ధపరచదు. అలాంటివారు దేవుణ్ణి స్తుతించడం/ప్రార్థించడం వ్యర్థం. ఎందుకంటే దేవుడు వాటిని అంగీకరించడు. ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన ఈ విషయాన్ని నొక్కిచెప్పినట్టు మనం స్పష్టంగా చదువుతాం.

యెషయా 1:13-16 - మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

నిర్గమకాండము 29:19,20
మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, ఆహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను,వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

ఈ వచనాలలో దేవుడు రెండవ పొట్టేలును కూడా బలిగా అర్పించి దాని రక్తాన్ని కొంత అహరోను మరియు అతని కుమారుల శరీరాలపై చల్లి మిగిలినదానిని బలిపీఠంపై ప్రోక్షించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ కొంత రక్తం అహరోనూ అతని కుమారులపైనా, మరికొంత రక్తం‌ బలిపీఠంపైనా ప్రోక్షించబడింది. దేవునికీ మానవులకూ మధ్యలో రక్తమే సంపూర్ణమైన సమాధానం కలుగచేస్తుందని ఈ నియమం‌ మనకు తెలియచేస్తుంది. అందుకే వారి చెవుల దగ్గర నుండి కాలి బొటనవేళ్ళ‌ వరకూ సంపూర్ణ శరీరాన్ని సూచిస్తూ ఆ రక్తం చమరబడింది. ఇప్పుడు అహరోను మరియు అతని కుమారులు ఆ రక్త సమాధానాన్ని బట్టే ప్రత్యక్షగుడారంలో ప్రవేశించబోతున్నారు. ఇది దేవునితో మనల్ని సమాధానపరిచే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉందని గుర్తు చేస్తున్నాను‌.

హెబ్రీయులకు 10:20 - ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.

రోమీయులకు 5:10 - ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

నిర్గమకాండము 29:21
మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితములగును.

ఈ వచనంలో దేవుడు బలిపీఠంపై అర్పించబడిన రెండవ పొట్టేలు రక్తాన్ని మరియు అభిషేక తైలాన్ని కూడా తీసుకుని అహరోను పైనా అతని కుమారుల పైనా వారి వస్త్రాలపై కూడా ప్రోక్షించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ముందుగా వారిపై రక్తం ప్రోక్షించబడి దేవునితో సమాధానం ఏర్పడింది. ఇప్పుడు వారు ధరించిన వస్త్రాలపై కూడా ఆ రక్తం ప్రోక్షించబడుతుంది. క్రీస్తు రక్తాన్ని బట్టి దేవునితో సమాధానపరచబడినవారి క్రియలు ఇకపై ఆ దేవునికి ప్రతిష్టంగా ఉండాలని ఈ నియమం‌ మనకు నేర్పిస్తుంది. మన క్రియలు లోకస్తుల క్రియలుగా ఉండడానికి వీలు లేదు.

నిర్గమకాండము 29:22-24
మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

ఈ వచనాలలో దేవుడు ఆ పొట్టేలు యొక్క శరీరభాగాలను రొట్టెతోనూ, అప్పడంతోనూ, మరొక పిండివంటతోనూ కలపి అహరోను మరియు అతని కుమారులు యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అల్లాడించడం అంటే చేతులతో వాటిని అటు ఇటు కదపడం అని అర్థం.

నిర్గమకాండము 29:25
తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.

ఈ వచనంలో దేవుడు అహరోను మరియు అతని కుమారులు తమ‌ చేతులతో అల్లాడించినవాటిని తీసుకుని దహనబలిగా అర్పించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం‌. ఇది యెహోవాకు హోమము. ఇక్కడ అహరోనూ అతని కుమారులూ చేతులతో అల్లాడించినవి ఆయనకు హోమంగా మారినట్టు, మన క్రియలు కూడా ఆయనకు ఇంపైన సువాసనగల హోమంగా ఉండాలి. అహరోనూ అతని కుమారులు‌ మొదటి పొట్టేలుతో చేసిన హోమం మనం నోటితో చేసే స్తుతికీ ప్రార్థనకూ సాదృశ్యంగా ఉంటే, వారు ఈ రెండవ పొట్టేలు శరీరభాగాలతో చేసిన హోమం మన క్రియలకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మనం కూడా ఆయనకు యాజకులుగా పిలవబడ్డాం (1 పేతురు 2:9,ప్రకటన 5:9,10).

నిర్గమకాండము 29:26,27
మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.

ఈ వచనాలలో దేవుడు ఆ రెండవ పొట్టేలుయొక్క బోరను (పీక) ఆయన సన్నిధిలో అల్లాడించి దానినీ జబ్బనూ మోషేను తీసుకోమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. బలి అర్పించబడే పశువులనుండి ఈ భాగాలు యాజకులకు చెందుతాయి. ప్రస్తుతం మోషేనే ఆ బలులను అర్పిస్తున్నాడు కాబట్టి అవి అతనికి చెందాయి.

నిర్గమకాండము 29:28
అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును.

ముందటి వచనాలలో మోషేకు చెందినట్టే, ఇకపై ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతిష్టార్పణల్లో బోర‌ మరియు జబ్బ భాగాలు అహరోను మరియు అతని కుమారులకు చెందుతాయని ఈ వచనంలో మనం చూస్తాం. ఇవి దేవుడు వారు చేస్తున్న పరిచర్యను బట్టి వారికి నిర్ణయించిన జీతంలో ఒక‌‌ భాగం. ప్రస్తుతం సంఘ పరిచర్యలో కూడా ఈ నియమం వర్తిస్తుంది.

1కోరింథీయులకు 9:13,14 - ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో (బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.

నిర్గమకాండము 29:29,30
మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.

ఈ వచనాల్లో దేవుడు అహరోనుకు చెందిన యాజకవస్త్రాలూ బంగారు ఏఫోదూ అతని తరువాత అతని కుమారులకు సంక్రమిస్తాయని తెలియచెయ్యడం మనం చూస్తాం. అతని వంశంలో ఎవరు ప్రధానయాజకుడిగా ప్రతిష్టించబడినా వాటిని ధరించే సేవ చెయ్యాలి.

నిర్గమకాండము 29:31,32
మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.

ఈ వచనాల్లో దేవుడు అహరోను మరియు అతని కుమారులు ప్రతిష్టితమైన ఆ పొట్టేలు మాంసాన్ని వండుకుని రొట్టెలతో కలపి దానిని తినాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దాని కారణమేంటో క్రింది వచనంలో వివరించబడింది.

నిర్గమకాండము 29:33
వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి. గనుక అన్యుడు వాటిని తినకూడదు.

ఆ పొట్టేలు రక్తమే అహరోను మరియు అతని కుమారుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా మారి, వారిని యాజకులుగా ప్రతిష్టించింది కాబట్టి, దానికి జ్ఞాపకంగా వారు ఆ పొట్టేలు మాంసాన్ని వండుకు తినాలి. ఆ ఆహారాన్ని వారు తప్ప ఇతరులెవ్వరూ తినకూడదు. ఆ పొట్టేలు రక్తం‌ వల్ల పరిశుద్ధపరచబడినవారికి మాత్రమే దాని మాంసాన్ని తినే అర్హత ఉంటుంది. ఇది మనల్ని పరిశుద్ధపరచి, దేవునికి యాజకులుగా ప్రతిష్టించిన క్రీస్తు బలికి జ్ఞాపకార్థమైన ప్రభువుబల్లకు సాదృశ్యంగా ఉంది. అందులో కేవలం ఆయన రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడినవారు మాత్రమే యోగ్యులుగా పాలుపొందాలి.

నిర్గమకాండము 29:34
ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండిన యెడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.

ఈ వచనంలో‌ దేవుడు వారు తినగా మిగిలిన ఆహారాన్ని అగ్నితో కాల్చివెయ్యాలని ఉదయం వరకూ మిగుల్చుకుని తినకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దానికి కారణం "అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు". ఇక‌ దానిని అగ్నితోనే ఎందుకు కాల్చివెయ్యాలంటే; ఈ బలులన్నీ యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉన్నాయి కాబట్టి ఆయన శరీరం కుళ్ళు పట్టనట్టే, వాటి మాంసం కూడా చెడిపోకూడదు. దానిని బయటపడవేస్తే అలా చెడిపోయే అవకాశం ఉంది. అలానే పక్షులవంటివి దానిని తినే అవకాశం కూడా ఉంటుంది. ఆయన ముందుగా చెప్పినట్టుగా దానిని తినే అర్హత ఆ యాజకులకు మాత్రమే ఉంది కాబట్టి అలా కూడా జరగకూడదు. అందుకే దానిని అగ్నితో కాల్చివెయ్యాలి.

నిర్గమకాండము 29:35-37
నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.

ఈ వచనాల్లో దేవుడు అహరోనునూ అతని కుమారులనూ మరియు బలిపీఠాన్నీ ఏడురోజులవరకూ ప్రతిష్టించి బలులను అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారు మొదటి కోడెదూడను అర్పించినప్పుడే వారి పాపాలు పరిహరించబడి పరిశుద్ధులుగా మారినట్టు మనం చదువుతాం. కానీ ఏడు రోజులవరకూ వారు అలానే చేస్తుండాలి. ఈ నియమం బలిపశువుల రక్తం ప్రజల పాపాలను సంపూర్ణంగా పరిహరించి పరిశుద్ధపరచలేదని, ఈ‌ బలులన్నీ సంపూర్ణమైన క్రీస్తు బలియాగంవైపు మనల్ని నడిపించడానికే నిర్ణయించబడ్డాయని తెలియచేస్తుంది. అందుకే యాజకులు మాటిమాటికీ తమకోసం కూడా బలులను అర్పించవలసి వచ్చేది. కానీ నేడు మనమంతా యేసుక్రీస్తు సంపూర్ణమైన బలియాగాన్ని బట్టి సదాకాలానికి సంపూర్ణులుగా చెయ్యబడ్డాం.

హెబ్రీయులకు 7:27,28 - ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

హెబ్రీయులకు 10:14 - ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

నిర్గమకాండము 29:38-41
నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను. దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణ ముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.

ఈ వచనాల్లో దేవుడు యాజకులు ప్రతీరోజూ అర్పించవలసిన బలుల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు వ్యక్తిగతంగానూ, పండుగ సమయాల్లోనూ అర్పించే బలులు వేరు, ఇవి వేరు. ఈ రెండు బలులూ ఇశ్రాయేలీయుల పాప పరిహారార్థం నిమిత్తం మరియు ఆయనతో సహవాసం‌ నిమిత్తం ప్రతీ ఉదయ సాయంత్రాలు అర్పించబడుతూనే ఉండాలి. కాబట్టి మనం కూడా కనీసం రోజుకు రెండుసార్లైనా ఆయన ముందు మన పాపాలను ఒప్పుకుంటూ, ఆయనను స్తుతిస్తూ ఆయనతో సహవాసం‌ చెయ్యగలగాలి.

నిర్గమకాండము 29:42
ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.

ఈ వచనంలో దేవుడు ఆ‌ బలులు తరతరాలకు నిత్యంగా అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. తరతరాలకు నిత్యముగా అంటే, వేరొక యాజకత్వం ఆ స్థానంలో వచ్చేంతవరకూ అని అర్థం. అదే క్రీస్తుయేసు యాజకత్వం. సాదృశ్యమైన అహరోను యాజకత్వం మరియు వారి బలుల యొక్క‌ నిజస్వరూపం ఆయనే (కొలస్సీ 2:17).

"నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును"

ప్రస్తుతం దేవుడు సీనాయి పర్వతంపైన మోషేతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రత్యక్షగుడారం ఏర్పడి యాజకులు ప్రతిష్టించబడ్డాక అక్కడినుండి మాట్లాడతానని చెబుతున్నాడు.

నిర్గమకాండము 29:43,44
అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరో నును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్నీ బలిపీఠాన్నీ మరియు యాజకులకూ తానే పరిశుద్ధపరుస్తానని చెప్పడం మనం చూస్తాం. వాస్తవానికి వారు అర్పించిన ఆయా బలుల‌ను బట్టి వారు కానీ ఆ వస్తువులు కానీ పరిశుద్ధపరచబడవు. ఆ బలులను దేవుడు అంగీకరించబట్టే, వారూ ఆ వస్తువులూ ఆయన సేవకు ప్రత్యేకించబట్టే పరిశుద్ధత కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆయన "పరిశుద్ధపరచెదను" అంటున్నాడు. కాబట్టి ఏ మానవుడూ తన క్రియలను బట్టి దేవుని పరిశుద్ధతను పొందుకోలేడు. దేవుడు ఆ క్రియలను అంగీకరించినప్పుడే పరిశుద్ధత కలుగుతుంది.

లేవీయకాండము 20:8 - మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.

నిర్గమకాండము 29:45
నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును.

ఈ వచనంలో దేవుడు నేను వారిమధ్య నివసించి వారికి దేవునిగా ఉంటానని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. ఇప్పటివరకూ కూడా ఆయన వారికి దేవునిగా ఉండే నడిపించాడు. కానీ ఇప్పటినుంచి ఆ ప్రత్యక్ష గుడారంపై తన‌ మహిమను నిలపడం ద్వారా వారికి దేవునిగా ఉంటానని చెబుతున్నాడు. ప్రజలు ఆ ప్రత్యక్షగుడారంతో సంబంధం కలిగియున్నప్పుడు మాత్రమే ఆయనను దేవునిగా అంగీకరించినట్టు. ఆయన వారిని తన ప్రజలుగా భావించినట్టు. ఈ విధంగా ఆ ప్రత్యక్ష గుడారం ఆయనకూ ఆ ప్రజలకూ మధ్యవర్తిత్వం‌ వహిస్తుంది. ఈరోజు ఎవరికైనా ఆయన దేవునిగా ఉండాలంటే, ఎవరైనా ఆయన ప్రజలుగా గుర్తించబడాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. అందుకే ఆయన ఈలోకంలో ఉన్నప్పుడు ఈమాటలు చెప్పాడు.

యోహాను 14:6 - యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

అదేవిధంగా ఈ మాటలను అపోస్తలుడైన పౌలు కూడా తన పత్రికలో ప్రస్తావించినట్టు మనం చదువుతాం.

2కోరింథీయులకు 6:16,17 - అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

కాబట్టి ఆయన మనలో మనతో నివసించాలంటే, మనం లోకం నుండి దేవుని ఆజ్ఞలను బట్టి ప్రత్యేకంగా జీవించాలి. ప్రతీపాపానికీ దూరంగా పారిపోవాలి.

నిర్గమకాండము 29:46
కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.

ఈ వచనంలో దేవుడు ప్రత్యక్షగుడారాన్ని యాజక వ్యవస్థనూ స్థాపించడానికి గల కారణాన్ని వివరించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తునుండి విడిపించింది ఆయనేయని ఆ తరతరాల ప్రజలు ఆయనను హత్తుకునేలా ఈ ప్రత్యక్షగుడారం, యాజకవ్యవస్థ సాక్షులుగా ఉంటుంది. ఇదంతా కూడా వారికి దేవునిగా ఉండి వారికి మేలు చెయ్యడానికే. మనకు ఆయన దేవునిగా ఉండాలని తన ప్రియకుమారుడిని పంపింది కూడా మనకు నిత్యరాజ్యమనే మేలు చెయ్యడానికే. అందుకే కీర్తనాకారుడు‌ ఇలా అంటున్నాడు.

కీర్తనలు 33:12 - యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.