విషయసూచిక:- 30:1 , 30:2 , 30:3 , 30:4,5 , 30:6 , 30:7,8 ,30:9 , 30:10 , 30:11 , 30:12 , 30:13,14 , 30:15 , 30:16 , 30:17,18 , 30:19-21 , 30:22-25 , 30:26-30 , 30:31 , 30:32 , 30:33 , 30:34,35 , 30:36 , 30:37,38 .
నిర్గమకాండము 30:1
మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.
ఈ వచనంలో దేవుడు బలులు అర్పించడానికి బలిపీఠాన్ని ఎలాగైతే తయారు చెయ్యమన్నాడో, అలాగే ధూపం వెయ్యడానికి కూడా ఒక వేదికను (బల్లను) తుమ్మకర్రతో తయారు చెయ్యమనడం మనం చూస్తాం. దానికి సంబంధించిన కొలతలు కింది వచనంలో వివరించబడ్డాయి.
నిర్గమకాండము 30:2
దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.
ఈ వచనం ప్రకారం, ఆ ధూపవేదిక మూర పొడవు, మూర వెడల్పుతో రెండు మూరలు ఎత్తుగలదై ఉండాలి. దానికి నాలుగు మూలలా నాలుగు కొమ్ములు కూడా ఉండాలి. ఆ కొమ్ములు ఆ వేదికకు అలంకారంగా, ఘనతగా ఉంటాయి.
నిర్గమకాండము 30:3
దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
ఈ వచనంలో తుమ్మకర్రతో చెయ్యబడిన ఆ ధూపవేదికకూ దాని కొమ్ములకూ బంగారు రేకు పొదిగించి దానిచుట్టూ బంగారు జవను అనగా అంచును కూడా చెయ్యాలని మనం చూస్తాం. ఇదే పద్ధతిని మనం మందసం విషయంలోనూ మోతకర్రల విషయంలోనూ కూడా గమనిస్తాం. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం, తుమ్మకర్ర అనేది యేసుక్రీస్తు మానవత్వానికీ దానికి పుయ్యబడిన బంగారు పూత ఆయన దైవత్వానికీ సాదృశ్యంగా ఉంది. ఇక ఈ ధూపవేదికను బంగారు బలిపీఠం అని కూడా పిలిచారు (సంఖ్యాకాండము 4:11).
నిర్గమకాండము 30:4,5
దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.
ఈ వచనాలలో ఆ ధూపవేదికకు కూడా బంగారు ఉంగరాలు చేసి వాటిలో బంగారు రేకు పొదిగించబడిన తుమ్మమోత కర్రలను ఉంచాలని మనం చూస్తాం. మందసం, బలిపీఠం మరియు ఇతర వస్తువుల తయారీ సందర్భాలలో వివరించినట్టుగా ఇశ్రాయేలీయులు అరణ్యంలో కనాను దేశానికి పయనిస్తూ ఉండి, దేవుడు ఆదేశించిన చోట్లల్లా ప్రత్యక్షగుడారాన్ని నిలబెడుతున్నారు. దానికి సంబంధించిన సేవా వస్తువులను ఒకచోటనుండి మరోచోటికి సులభంగా మోసుకెళ్ళడానికే ఈ మోతకర్రలు. ఇశ్రాయేలీయుల్లో లేవీగోత్రీకులు మాత్రమే ఈ పని చేస్తారు.
నిర్గమకాండము 30:6
సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొందును.
ఈ వచనంలో దేవుడు ఆ ధూపవేదికను ఎక్కడ ఉంచాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ప్రత్యక్షగుడారంలో పరిశుద్ధస్థలాన్నీ అతి పరిశుద్ధస్థలాన్నీ వేరు చేసే తెర ఎదుట ఈ ధూపవేదికను ఉంచాలి. అప్పుడు ఈ ధూపవేదిక తెర అవతలి అతిపరిశుద్ధస్థలంలోని మందసానికి ఎదురుగా ఉంటుంది. అప్పుడు ఈ ధూపవేదికపై వెయ్యబడే ధూపం ప్రత్యక్షగుడారంలోని అతిపరిశుద్ధ స్థలానికి కూడా వ్యాపిస్తుంది.
"అక్కడ నేను నిన్ను కలిసికొందును"
ప్రస్తుతం ఈ విషయాలన్నీ దేవుడు మోషేకు సీనాయి పర్వతంపై చెబుతున్నాడు. అందుకే ప్రత్యక్షగుడారం ఏర్పడ్డాక అక్కడ నిన్ను కలుసుకుంటానని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు.
నిర్గమకాండము 30:7,8
అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.
ఈ వచనాల్లో దేవుడు ప్రధానయాజకుడైన అహరోను ఆ ధూపవేదికపై పరిమళద్రవ్యముల ధూపాన్ని ఎప్పుడు వెయ్యాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. అతను ప్రతీరోజూ ఉదయం మరియు సాయంత్రం దీపస్థంభంపై దీపాలు వెలిగించే సమయంలో ఆ పరిమళ ద్రవ్యముల ధూపం వెయ్యాలి. నిర్గమకాండము 29:38,39 వచనాల ప్రకారం, ప్రధానయాజకుడు ప్రతీ ఉదయం మరియు సాయంత్రం బలిపీఠంపై రెండు బలులను అర్పించాలి. అదే సమయంలో ధూపవేదికపై ధూపం కూడా వెయ్యాలి. ఈవిధంగా ప్రధానయాజకుడు ఇశ్రాయేలీయుల పాపాల ప్రాయశ్చిత్తానికై బలులు అర్పించేవాడిగా, ధూపం వేస్తూ వారి తరపున విజ్ఞాపన చేసేవాడిగా ఉంటాడు. దేవుడు ప్రవేశపెట్టిన ఈ నియమం యేసుక్రీస్తు ప్రధానయాజకత్వానికి సాదృశ్యంగా ఉంది (హెబ్రీ 9:10,11). ఆయన మనపాపాలకై బలిగా మారడమే కాకుండా మనకోసం నిరంతరం తండ్రియెదుట విజ్ఞాపన చేసేవాడిగా కూడా ఉన్నాడు (హెబ్రీ 7:25). ఆయన విజ్ఞాపన యొక్క శ్రేష్టతకు నొక్కిచెప్పడానికే దేవుడు ఇక్కడ ప్రధానయాజకుడు వేసే ఆ ధూపం పరిమళద్రవ్యములదై ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రధానయాజకుడు దీపం వెలిగించేటప్పుడే ఆ ధూపం వేస్తున్నట్టుగా, ఆయన కూడా సంఘమనే దీపాలను వెలిగిస్తూ (ప్రకటన 1:13) వారి తరపున విజ్ఞాపన అనే ధూపం వేస్తున్నాడు.
ఇక "అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము" అన్నప్పుడు ఈ ధూపం ఎవరి విజ్ఞాపనకైతే సాదృశ్యంగా ఉందో ఆ యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంతవరకూ అని అర్థం. ప్రస్తుతం ఆయన మన తరపున విజ్ఞాపన చెయ్యడాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఈ "నిత్య ధూపం" ఆయన ద్వారా నెరవేరుతుంది.
అదేవిధంగా ఈ పరిమళ ద్రవ్యముల ధూపం పరిశుద్ధుల ప్రార్థనలతో కూడా పోల్చబడింది (కీర్తనలు 141:2, ప్రకటన 8:3,4). ఇశ్రాయేలీయులు కూడా తమ ప్రధానయాజకుడు ధూపవేదికపై ధూపం వేస్తున్నప్పుడు ప్రత్యక్షగుడారపు/దేవాలయపు ఆవరణం చుట్టూ నిలబడి ప్రార్థించేవారు (లూకా 1:9,10). కాబట్టి యేసుక్రీస్తు బలిని బట్టి పాపవిమోచన పొందిన విశ్వాసులు నిరంతరం తండ్రికి ప్రార్థించేవారిగా ఉండాలి. వారి ప్రార్థన ఆయన దృష్టికి ప్రధానయాజకుడి పరిమళధూపం వలే అంగీకారంగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడగబడిన తరువాత, పాపాన్ని అసహ్యించుకుంటూ, ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నప్పుడే (1 యోహాను 5:13) అది సాధ్యమౌతుంది. ప్రధానయాజకుడు దీపం వెలిగిస్తున్నప్పుడే ధూపం వేసినట్టుగా, మనం వాక్యమనే దీపంతో నిరంతరం వెలిగించబడుతూ ఆ వాక్యానుసారమైన ప్రార్థనా ధూపాన్ని ఆయనకు సమర్పించాలి. వాక్యమనే దీపం, ప్రార్థన అనే ధూపమే మన రక్షణకు రుజువులు. మనం పాపాన్ని అసహ్యించుకుంటున్నప్పుడు మాత్రమే వాక్యమనే దీపం మనలో వెలుగుతుంది, వాక్యానుసారమైన ప్రార్థనా ధూపం మనద్వారా ఆయనకు సమర్పించబడుతుంది.
ఇశ్రాయేలీయులు దేవుడు ఆజ్ఞాపించిన బలుల విషయంలో ధూపం విషయంలో ఆయన కలిగియున్న ఈ పవిత్రమైన ఉద్దేశాన్ని మరచి అపవిత్రమైన జీవితాలుగలవారై అలవాటుగా బలులను అర్పిస్తూ, ధూపద్రవ్యాలను ఆయనకు సమర్పిస్తున్నప్పుడు ఆయన ఎంత తీవ్రంగా స్పందించాడో చూడండి.
యెషయా గ్రంథము 1:13 - మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.
యెషయా గ్రంథము 66:3 - ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.
కాబట్టి విశ్వాసులు ఈ విషయంలో జాగ్రత్త కలిగియుండాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత కూడా అపవిత్రమైన జీవితాలు కలిగి ఆయనకు ప్రార్థించడం ఆయన దృష్టికి బొమ్మను (విగ్రహాన్ని) స్తుతించడంతో సమానం "ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే". అది ఆయనకు దుర్వాసన అంత అసహ్యం "మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము". ఈవిధంగా అలవాటుగా పాపం చేస్తూ ప్రార్థనచేసేవారు, ఆయనను బాధపెట్టినవారై ఇశ్రాయేలీయుల వలే దారుణమైన పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. దేవుణ్ణి బాధపెట్టిన ఇశ్రాయేలీయులు అనుభవించినంత ఘోరమైన శ్రమలు ప్రపంచ చరిత్రలో మరే జాతీ అనుభవించియుండదేమో.
నిర్గమకాండము 30:9
మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దానిమీద పోయకూడదు.
ఈ వచనంలో దేవుడు ఆ ధూపవేదికపై అన్యధూపాన్ని కానీ దహనబలి సంబంధమైన ద్రవ్యాన్ని కానీ నైవేద్యాన్ని కానీ అర్పించకూడదని దానిపై పానీయం పోయకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. "అన్యధూపం" అంటే, ఆయన ఆజ్ఞాపించని పద్ధతిలో ధూపం వెయ్యకూడదని అర్థం. ధూపాన్ని ఎప్పుడు వెయ్యాలో, వేటితో వెయ్యాలో ఆయనే ఆజ్ఞాపిస్తాడు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఈ ఆజ్ఞను ధిక్కరిస్తూ వేరొక అగ్ని ద్వారా ధూపం వేసే ప్రయత్నం చేసే చనిపోయారు (లేవీకాండము 10:1,2). ఈ ధూపం అనేది యేసుక్రీస్తు విజ్ఞాపనకు సాదృశ్యంగా ఉంది కాబట్టి దైవచిత్తానుసారంగా ఆయన చేసే విజ్ఞాపనకు తగినట్టుగానే దైవాజ్ఞ ప్రకారం ఆ ధూపం వెయ్యబడాలి. ఈ ధూపం విశ్వాసుల ప్రార్థనలకు కూడా సాదృశ్యంగా ఉందని మనం చూసాం కాబట్టి మన ప్రార్థనలు ఆయన వాక్యానుసారంగా ఉండాలని కూడా ఈ నియమం మనల్ని హెచ్చరిస్తుంది (1 యోహాను 3:22, 5:13).
అదేవిధంగా ఆ ధూపవేదికపై మరేమీ అర్పించకూడదని పొయ్యకూడదని మనం చూసాం. దానిపై కేవలం ధూపసామాగ్రి మాత్రమే ఉండాలి. ఈ నియమం యేసుక్రీస్తు విజ్ఞాపనను బట్టి మాత్రమే మనం దేవునిచేత అంగీకరించబడుతున్నాం అనేదానికి సాదృశ్యంగా ఉంది. మనం దేవుని చేత అంగీకరించబడడానికి ఆయన విజ్ఞాపన తప్ప మరే కారణమూ లేదు. ప్రాముఖ్యంగా మనలో ఏ మంచితనమూ లేదు. ఆయన మనకోసం బలిగా మారాడు కాబట్టే మనకోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ నియమం మన ప్రార్థనల్లో మన స్వనీతి చోటుచేసుకోకూడదని కూడా మనకు బోధిస్తుంది. మన ప్రార్థన ఎల్లప్పుడూ మన పాపాలను మారుమనస్సుతో ఒప్పుకునేదిగా ఆయనను స్తుతించేదిగా ఉండాలి. పరిసయ్యుడి ప్రార్థనలో కనిపించే స్వనీతి (లూకా 18:10-12) మన ప్రార్థనలో కనిపించకూడదు. లేదంటే మన ప్రార్థన కూడా అన్యధూపమే. మనం దేవునిచేత అంగీకరించబడడానికి యేసుక్రీస్తు బలి విజ్ఞాపన మాత్రమే కాకుండా మా స్వనీతి కూడా కారణమని గర్వాన్ని వహించడమే.
నిర్గమకాండము 30:10
మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
ఈ వచనంలో దేవుడు ప్రధానయాజకుడైన అహరోను సంవత్సరానికి ఒకసారి ఆ ధూపవేదిక కొమ్ములకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది ప్రాయశ్చిత్తం దినం అనబడే రోజు జరుగుతుంది. ఈరోజు మాత్రమే ప్రధానయాజకుడు ప్రత్యక్షగుడారంలోని బలిపీఠానికీ ధూపవేదికకూ బలిరక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆరోజే అతిపరిశుద్ధస్థలంలోకి కూడా బలిరక్తంతో ప్రవేశిస్తాడు. ఈ వివరాలన్నీ మనం లేవీకాండము 16వ అధ్యాయంలో చదువుతాం. హెబ్రీ గ్రంథకర్త కూడా ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తాడు (హెబ్రీ 9:7). ప్రత్యక్ష గుడారం పరిశుద్ధుడైన దేవుని నివాసస్థలంగా ఇశ్రాయేలీయుల మధ్య ఉంటుంది. అందులో లేవీయులైన యాజకులు పరిచర్య చేస్తుంటారు. కానీ అటు ప్రజలూ ఇటు యాజకులూ ఇద్దరూ పాపులే. కాబట్టి ఇశ్రాయేలీయులు తీసుకువచ్చే అర్పణల్లోనూ, యాజకులు చేసే పరిచర్యలోనూ ఏదోవిధంగా అపవిత్రత చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఆ అపవిత్రతను బట్టే ఈ ప్రాయశ్చిత్త దినాన ప్రత్యక్షగుడారంలోని వస్తువులకు కూడా బలిరక్తం ప్రోక్షించబడి, ఆ బలిరక్తం ద్వారా వాటి అపవిత్రతకు ప్రాయశ్చిత్తం చెయ్యబడుతుంది.
లేవీయకాండము 16:16 - అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.
హెబ్రీయులకు 9:7 - సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.
యేసుక్రీస్తు ప్రధానయాజకత్వ పరిచర్యలో, ఆయన బలిలో ఎటువంటి లోపం, అపవిత్రత ఉండదని తెలియచేసేందుకే దేవుడు ఈ ప్రాయుశ్చిత్త దిన నియమాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన బలి, ఆయన పరిచర్య సంపూర్ణంగా పరిశుద్ధమైనవి కాబట్టి ఆయనకు సాదృశ్యంగా ఉన్న ప్రత్యక్షగుడారం, మరియు యాజకపరిచర్య ప్రతీసంవత్సరం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి.
నిర్గమకాండము 30:11
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను.
ఈ వచనంలో దేవుడు మోషేతో ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దానికి కారణమేంటో క్రింది వచనాల్లో వివరించబడింది. అయితే ఈ వచనంలోనూ మరియు 22వ వచనంలోనూ కూడా "యెహోవా మోషేతో ఇట్లనెను" అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఇదే పదప్రయోగం గతంలో కూడా మనం గమనిస్తాం. దీనిప్రకారం, దేవుడు ఈ విషయాలన్నీ మోషేకు ఒకేసారి చెప్పినవి కావని, అతను సీనాయి కొండపై ఉన్నప్పుడు భాగాలుగా ఆయన మోషేతో మాట్లాడాడని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. ఈ పదప్రయోగాన్ని బట్టి మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మోషే ఇక్కడ "యెహోవా మోషేతో ఇట్లనెను" అని రాస్తుండడం ద్వారా ఈ యాజకత్వపరిచర్య లేక ధర్మశాస్త్రం తానేదో సృష్టించింది కాదని, అవన్నీ దేవుని నియమాలని మాటిమాటికీ జ్ఞాపకం చేస్తున్నాడు.
అదేవిధంగా ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకూ ఉన్న పంచకాండాలను రాసింది మోషేనే. అయినప్పటికీ అతను ఈ రచనల్లో తనను తాను మూడవవ్యక్తిగా ప్రస్తావించుకుంటున్నాడు. అందుకే "యెహోవా నాతో ఇలా చెప్పాడు" అనకుండా "యెహోవా మోషేతో ఇలా చెప్పెను" అంటున్నాడు. భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనాలను రాస్తున్నప్పుడు ఇలాంటి రచనాశైలిని అవలంభించడం సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్తను రాస్తున్న మత్తయి తనను తాను మూడవవ్యక్తిగా ప్రస్తావించుకోవడం మత్తయి 9:9లో మనం గమనిస్తాం. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే చరిత్రకు సంబంధించిన రచనాశైలిపై అవగాహన లేని కొందరు అజ్ఞానులు ఇలాంటి సందర్భాలను చూపించి, ధర్మశాస్త్రం రాసింది మోషే కాదు, మత్తయి సువార్త రాసింది మత్తయి కాదు అంటూ మాట్లాడుతుంటారు.
నిర్గమకాండము 30:12
వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులకు జనసంఖ్య చేస్తున్నప్పుడు వారు ప్రాణపరిక్రయ ధనాన్ని చెల్లించాలని, అలా చేస్తే వారిలో ఏ తెగులూ పుట్టదని సెలవియ్యడం మనం చూస్తాం. ఆ ప్రాణపరిక్రయ ధనం ఎంతో క్రింది వచనంలో వివరించబడింది. ఒకవేళ వారు ఆ ప్రాణపరిక్రయ ధనాన్ని చెల్లించకపోతే వారిలో తెగులు పుడుతుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో, సాదృశ్యంతో ఆ ధనాన్ని చెల్లించమంటున్నాడు. అవేంటో క్రింది వచనంలో చూద్దాం.
నిర్గమకాండము 30:13,14
వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.
ఈ వచనాల్లో దేవుడు వారు ఇవ్వవలసిన ప్రాణపరిక్రయ ధనం ఎంతో, ఎంత వయసు నుండి ఆ జనసంఖ్యలో పాల్గోవాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇరవై సంవత్సరాల వయసునుండి ఆ పై వయస్సుగలవారంతా ఆ జనసంఖ్యలో పాల్గొని, ప్రత్యక్షగుడారపు తూనిక చొప్పున అరతులం వెండిని (16వ వచనం) ప్రాణపరిక్రయ ధనంగా ఇవ్వాలి. యాజకులు ఈ వెండినంతా ప్రత్యక్షగుడారపు నిర్మాణానికీ దాని ఇతర ఖర్చులకూ వినియోగించారు (నిర్గమకాండము 38). దేవుడు ఈ ప్రాణపరిక్రయ ధనాన్ని నిర్ణయించడంలోని ఉద్దేశమని నేను పై వచనంలో తెలియచేసింది ఇదే. ఆయన వారిమధ్య నివసించడానికై తమ సొమ్మును చెల్లించడం తమ బాధ్యత. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇశ్రాయేలీయులు దీనిని ప్రతీయేటా పాటించేవారు. ఆ సొమ్ము దేవాలయపు ఖర్చులకై వినియోగించబడేది. ప్రభువైన యేసుక్రీస్తు అరషెకెలు పన్ను చెల్లించింది ఆ సందర్భంలోనే (మత్తయి 17:24-27).
అదేవిధంగా ఈ ప్రాణపరిక్రయ ధనం యేసుక్రీస్తు మనపాపాలకై అర్పించిన తన ప్రాణానికి సాదృశ్యంగా ఉంది (మార్కు 10:45). నిజానికి ఇశ్రాయేలీయులు చెల్లించిన ప్రాణపరిక్రయ ధనం వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కాలేదు కానీ ఆ ధనాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రాణార్పణకు సాదృశ్యంగా నియమించాడు కాబట్టే ఆయన ఆ ధనాన్ని బట్టి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, వారి ప్రాణాలు కాపాడాడు. ఇశ్రాయేలీయులు సాదృశ్యాన్ని (ధనం/బలులు) బట్టి పాపప్రాయశ్చిత్తం పొందితే, మనం నిజస్వరూపాన్ని (క్రీస్తు) బట్టి పాపప్రాయశ్చిత్తం పొందుకున్నాం. అందుకే పేతురు ఇలా అంటున్నాడు.
1పేతురు 1:18,19 - పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.
కాబట్టి మన పాపాలకై విమోచనాక్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టిన ప్రభువును పూర్ణహృదయంతో, పూర్ణమనస్సుతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తూ, ఆయనను సిలువ శ్రమకు గురిచేసిన పాపానికి దూరంగా జీవించాలి.
ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు చెల్లించిన ప్రాణపరిక్రయ ధనం నిజానికి వారిని పాపాల నుండి విడిపించలేదు, ఆ ధనం యేసుక్రీస్తు ప్రాణార్పణకు సాదృశ్యంగా ఉంది కాబట్టే దేవుడు ఆ ధనాన్ని ప్రాయశ్చిత్తంగా ఎంచాడు. ఆ ధనం ప్రత్యక్షగుడార నిర్మాణానికీ అందులోని వస్తువుల తయారికీ ఎంతగానో ఉపయోగపడింది. మనం కూడా కానుకలు చెల్లించడం ద్వారా మన పాపాలకు క్షమాపణ పొందుకోలేం, మనం ఆ పాపాలను మారుమనస్సుతో ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనకు క్షమాపణ కలుగుతుంది. కానీ మనం చెల్లించే కానుక వల్ల సంఘ పరిచర్య అభివృద్ధి చెంది ఎంతోమందికి ఆత్మీయక్షేమాభివృద్ధి కలుగుతుంది. సువార్త పరిచర్య ఘనంగా కొనసాగి కొంతమందైనా తమ పాపాలనుండి విడుదల పొందడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ మంచి ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని సంఘానికి మన కానుకలు చెల్లించాలి.
నిర్గమకాండము 30:15
అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులు ప్రాణపరిక్రయ ధనంగా చెల్లించవలసిన ధనం ధనవంతుడూ, పేదవాడూ ఒకేవిధంగా చెల్లించాలని ఆజ్ఞాపించడం మనం చుస్తాం. అది ప్రాణపరిక్రయ ధనం కాబట్టి ధనవంతుడిలోనూ పేదవాడిలోనూ ఉన్నది ఒకే సమానమైన ప్రాణం కాబట్టి ఆయన ఈ హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు పేదవాడు కూడా ఇవ్వగలిగినంత ధనాన్నే (అరతులం) ప్రాణపరిక్రయ ధనంగా విధించాడని మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ఇశ్రాయేలీయుల సమృద్ధి అంతా ఆయన ఐగుప్తీయులకు కటాక్షం కలుగచెయ్యడం బట్టి లభించిందే (నిర్గమకాండము 3:21,12:36) కాబట్టి ఆయన నివసించే మందిరం కోసం వారి ధనాన్ని ఖర్చు చేయించడంలో అన్యాయమేమీ లేదు. పైగా ఆయన వారిమధ్య నివసించడం వారికి ధనం కంటే ఆశీర్వాదకరం, క్షేమకరం.
ప్రాముఖ్యంగా ధనవంతుడూ పేదవాడూ సమానమైన ధనమే ఇవ్వాలనే ఈ నియమం యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం సమానమైన విలువను చెల్లించాడు అనేదానికి సాదృశ్యంగా ఉంది. ఆయన బలి మనందరి పాపాలకూ సమానమైన విలువను చెల్లించి, సమానమైన రక్షణను అనుగ్రహించింది. కాబట్టి నేటి క్రైస్తవ సంఘాలలో ధనవంతుడనీ పేదవాడు అనీ చూపబడుతున్న భేదం ప్రభువు దృష్టికి అసహ్యమని గ్రహించి ఆ భేదాన్ని సంఘం నుండి రూపుమాపడానికి మనమంతా కృషి చెయ్యాలి. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు కూడా ఈవిషయంలో సంఘాన్ని హెచ్చరించినట్టు మనం చదువుతాం (యాకోబు 2).
నిర్గమకాండము 30:16
నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల నుండి ప్రాణపరిక్రయ ధనంగా సేకరించిన వెండిని ప్రత్యక్షగుడారం యొక్క సేవనిమిత్తం వినియోగించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ విషయం ఇప్పటికే నేను పైవచనాల్లో వివరించాను. అయితే ఇక్కడ "అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగానుండును" అనే మాటలు మనం చదువుతాం. ఇశ్రాయేలీయులు చెల్లించిన వెండి ప్రత్యక్షగుడారపు వస్తువులకు వినియోగించబడడం వల్ల ఆ ప్రత్యక్షగుడారంలోని వెండిని చూసినప్పుడల్లా ఇశ్రాయేలీయులకు అది తమ పాపప్రాయశ్చిత్తానికై చెల్లించిన ధనమని జ్ఞాపకం వస్తుంది. దానివల్ల వారికి తాము చేసే పాపాలకు దేవుని సన్నిధిలో విలువ చెల్లించవలసి ఉంటుందని (లెక్క చెప్పవలసి ఉంటుందని) అర్థమౌతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మన విషయంలో ఇదే చేసాడు. మన పాపాల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో చెల్లించవలసిన (లెక్క చెప్పవలసిన) విలువను ఆయనే మన పక్షంగా చెల్లించి, మనల్ని దైవోగ్రత నుండి విడిపించాడు. ఆ విలువ స్వయంగా ఆయన ప్రాణమైన రక్తమే.
హెబ్రీయులకు 9:12 - మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
అందుకే లేఖనం మనల్ని విలువపెట్టి కొనబడినవారని సంబోధిస్తుంది (1 కొరింథీ 6:20,7:23). సాదృశ్యంగా ఉన్న ఇశ్రాయేలీయుల ప్రాణపరిక్రయ ధనం కేవలం అరతులం వెండి మాత్రమే ఐతే, నిజస్వరూపమైన మన ప్రాణపరిక్రయ ధనం యేసుక్రీస్తు ప్రాణంగా దేవుడు నిర్ణయించాడు (యెషయా 53). కాబట్టి మనమంతా పాపం చేసేముందు మన పాపాలకై ప్రాణపరిక్రయ ధనంగా తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తును తలచుకోవాలి. ఇశ్రాయేలీయులకు ఎలాగైతే ప్రత్యక్షగుడారంలోని వెండి వారి పాపాలకైన ప్రాయుశ్చిత్త ధనమని జ్ఞాపకంగా ఉండి వారిని పాపంలో చిక్కుకోకుండా హెచ్చరిస్తుందో, అలానే యేసుక్రీస్తు బలి మనం మరలా పాపంలో చిక్కుకోకుండా జ్ఞాపకంగా ఉంది. ప్రాముఖ్యంగా మనం ప్రభువు బల్ల తీసుకుంటున్నప్పుడు ఈ జ్ఞాపకాన్ని కలిగియుండి, గడచిన వారం మనలో చోటుచేసుకున్న పాపాలకు మరలా స్థానం కల్పించకుండా వాటి విషయంలో మారుమనస్సు పొందాలి. ఈ వారం నూతనమైన పాపాలను మన జీవితంలోకి ఆహ్వానించకుండా జాగ్రత్తపడాలి.
నిర్గమకాండము 30:17,18
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుకడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.
ఈ వచనాల్లో దేవుడు ఇత్తడి పీట కలిగిన ఇత్తడి గంగాళం తయారుచెయ్యమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అది నీటితో నింపబడి ప్రత్యక్షగుడారపు ద్వారానికీ బలిపీఠానికీ మధ్యలో ఉంచబడుతుంది. దాని ఉపయోగమేంటో క్రింది వచనాల్లో రాయబడింది.
నిర్గమకాండము 30:19-21
ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొన వలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.
ఈ వచనాల ప్రకారం ప్రత్యక్షగుడారంలో సేవ చేసే ప్రధానయాజకుడు మరియు యాజకులు సేవ నిమిత్తం ప్రత్యక్షగుడారంలోకి ప్రవేశించేముందూ, ధూపంవేసే ముందూ తమ చేతులనూ కాళ్ళనూ కడుక్కోవాలి. అలా చెయ్యకపోతే వారికి ఆయన సన్నిధిలో చావు తప్పదు. ఈ ఇత్తడి గంగాళంలోని నీరు యేసుక్రీస్తు బలికీ, ఆయన వాక్యానికీ సాదృశ్యంగా ఉంది.
జెకర్యా 13:1 - ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.
ఎఫెసీయులకు 5:27 - నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.
కాబట్టి విశ్వాసులు నిరంతరం తమ పాపాలను నిజమైన మారుమనస్సుతో ఒప్పుకోవడం ద్వారా, ఆయన వాక్యాన్ని బట్టి హెచ్చరించబడడం ద్వారా తమను తాము శుద్ధిచేసుకోవాలి.
1యోహాను 1:9 - మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1:7 - అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
యాకోబు దీనిని ఉద్దేశించే "పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి" (యాకోబు 4:8) అని హెచ్చరిస్తున్నాడు.
ఇశ్రాయేలీయుల యాజకులు ప్రత్యక్షగుడారంలోకి ప్రవేశించేముందూ మరియు ధూపార్పణ వేసేముందూ తమ చేతులనూ కాళ్ళనూ కడుక్కున్నట్టే, మనం కూడా ప్రాముఖ్యంగా సంఘంగా కూడుకుని ఆరాధించే ముందూ, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపేముందూ మనల్ని మనం నేను పైన చెప్పిన విధంగా శుద్ధిచేసుకోవాలి. అందుకే " ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను" (1తిమోతికి 2:8) అని రాయబడింది. ఆ విధంగా మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా, పరిచర్యలో పాల్గొన్నా, స్తుతించినా, ప్రార్థించినా తీవ్రమైన పర్యవసనాలు ఎదుర్కోవలసి వస్తుంది.
యెషయా 1:16 - మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
సాదృశ్యంగా ఉన్న నీటి శుద్ధిని ధిక్కరించి పరిచర్యలో పాల్గొన్న యాజకులు మరణశిక్షకు నిర్ణయించబడితే "తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను" నిజస్వరూపాన్ని ధిక్కరించి పరిచర్యలో, ప్రార్థనలో పాల్గొంటున్న మన విషయంలో మరెంత దైవోగ్రత కుమ్మరించబడుతుందో ఊహించండి.
నిర్గమకాండము 30:22-25
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
ఈ వచనాల్లో దేవుడు మోషేకు పరిమళ అభిషేక తైలాన్ని చెయ్యమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ తైలాన్ని ఆయన ఎలా వేటితో చెయ్యాలో కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. దానిని స్వచ్ఛమైన గోపరసం, లవంగిపట్ట, నిమ్మగడ్డి, ఒలీవల నూనెతో ప్రత్యక్షగుడారపు కొలతల ప్రకారం కలిపి తయారుచెయ్యాలి. దీనిని యాజకులనూ, ప్రత్యక్షగుడారపు వస్తువులనూ అభిషేకించడానికి అనగా ప్రతిష్టించడానికి ఉపయోగిస్తారు.
నిర్గమకాండము 30:26-30
ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింప వలెను.
ఈ వచనాల్లో దేవుడు పరిమళ తైలంతో వేటిని ఎవర్ని ప్రతిష్టించాలో వివరించడం మనం చూస్తాం. ప్రస్తుతం ప్రత్యక్షగుడారం మరియు యాజకవ్యవస్థ నూతనంగా ఏర్పడుతున్నాయి కాబట్టి, ఈ ప్రతిష్ట జరగాలి. ఆ తైలంతో అభిషేకించబడిన ప్రతీదీ దేవునికి ప్రతిష్టితం ఔతుంది. అంటే దేవునికి చెందినవి/చెందినవారు అని అర్థం. అప్పటినుంచి ఆ వస్తువులు కానీ, వ్యక్తులు కానీ దేవునిసేవకు మాత్రమే వినియోగించబడాలి. ఈ నియమం పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించడానికి సాదృశ్యంగా ఉంది. యాజకులూ, ప్రత్యక్షగుడారపు సేవా వస్తువులూ మొదట బలిరక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చెయ్యబడి తరువాత ఈ ప్రతిష్టాభిషేకం పొందుకుంటున్నట్టే, మనం కూడా మొదట యేసుక్రీస్తు బలిరక్తం ద్వారా పరిశుద్ధపరచబడి, తరువాత పరిశుద్ధాత్ముడి అభిషేకం వల్ల ఆయనకై జీవించడానికి ప్రతిష్టించబడుతున్నాం.
1యోహాను 2:20 - అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
కాబట్టి మన జీవితాలు దేవునికి ప్రతిష్టితమైనవిగా, ఆయన పరిచర్యకై వినియోగించాలి. లోకస్తులు జీవిస్తున్నట్టుగా అపవిత్రమైన జీవితాలు జీవించే హక్కు మనకిక ఉండదు.
రోమీయులకు 12:1,2 - కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.
నిర్గమకాండము 30:31
మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను.
ఈ వచనం ప్రకారం ఆ పరిమళ తైలం తరతరాలకూ ఆయనకు ప్రతిష్ఠాభిషేకతైలమై ఉంటుంది. దానికి కేవలం నూతన యాజకులను ప్రతిష్టించడానికి మాత్రమే వినియోగించాలి. దేవుడు చెప్పిన పద్ధతిలో తయారుచెయ్యబడిన ఆ పరిమళ తైలం వ్యక్తిగతంగా ఎవరూ ఉపయోగించుకోవడానికి వీలులేదు. ఎందుకంటే అది దేవునికి ప్రతిష్టించడానికి సంబంధించింది. అదేవిధంగా అది పరిశుద్ధాత్ముడు అభిషేకానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా దేవునికి ప్రతిష్టించబడేవారు మినహా మరెవ్వరూ ఆ అభిషేకాన్ని పొందుకోలేరని ఈ నియమం తెలియచేస్తుంది.
నిర్గమకాండము 30:32
దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయ కూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను.
ఈ వచనంలో దేవుడు ఆ తైలాన్ని నరశరీరంపై పొయ్యకూడదని అలాంటిదానిని తయారు చేసుకోకూడదని హెచ్చరించడం మనం చూస్తాం. ఎందుకంటే పై వచనంలో వివరించినట్టుగా అది దేవునికి ప్రతిష్టించడానికి సంబంధించింది, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యమైనది. కాబట్టి ప్రజలు ఆ తైలాన్ని వ్యక్తిగతంగా తయారు చేసుకుని వంటికి పూసుకోకూడదు. దానిని ప్రతిష్టమైనదిగా గౌరవించాలి. "నరశరీరము మీద దానిని పోయకూడదు" అన్నప్పుడు యాజకుల విషయంలో మినహా మరెవ్వరి విషయంలోనూ అలా చెయ్యకూడదని అర్థం. ఎందుకంటే యాజకులను ఆ తైలంతోనే ప్రతిష్టిస్తారని ఇప్పటికే మనం చూసాం.
కీర్తనలు 133:2 - అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
"దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు" అన్నప్పుడు దానిని ఎవరూ తయారు చెయ్యకూడదని కాదు. ఆ పనిచేసేవారు దానిని తయారుచేసి ప్రత్యక్షగుడారపు పరిచర్యకు అమ్మడమో, కానుకగా ఇవ్వడమో చెయ్యాలి కానీ వ్యక్తిగతంగా వాడుకోవడానికి తయారు చెయ్యకూడదని అర్థం. ఈ నియమాన్ని బట్టి మనం కూడా ప్రభువు బల్లవంటి ప్రతిష్టమైనవాటిని విశ్వాసులకు మాత్రమే సంబంధించిందిగా పాటించాలి. మారుమనస్సు లేని అన్యులకు కానీ, చిన్నపిల్లలకు కానీ సాధారణమైన ఆహారంలా దానిని పంచకూడదు. వాక్యాన్ని కూడా వినోదం కోసం అన్నట్టుగా కానీ, చులకన చెయ్యబడే విధంగా కానీ ఉచ్చరించకూడదు. దానివల్ల పరిశుద్ధమైన వాక్యం అప్రతిష్ట పాలౌతుంది. కొందరు ఈవిధంగానే తామేదో భక్తిపరులం అనిపించుకోవడానికి అన్నట్టుగా సరికాని సందర్భాలలో సరికాని వ్యక్తుల దగ్గర దానిని ప్రస్తావించి అవమానానికి గురిచేస్తుంటారు.
నిర్గమకాండము 30:33
దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
పై వచనంలో వివరించినట్టుగా వ్యక్తిగత ఉపయోగానికై దానిని తయారు చేసేవాడు కానీ, అన్యుడిపై దానిని పోసేవాడు కానీ తన ప్రజల్లోనుండి కొట్టివెయ్యబడతాడని ఈ వచనంలో మనం చూస్తాం. ఆ పరిమళ తైలం ఎవరికోసమైతే ఉద్దేశించబడిందో, ఆ యాజకులు మినహా మిగిలిన ప్రజలందరూ దాని విషయంలో అన్యులే. వారెవ్వరూ దానిని పూసుకోకూడదు. పాతనిబంధన కొందరిని అన్యులు అని ప్రస్తావించినప్పుడు దాని నిర్వచనమేంటో ఇక్కడ మనం గమనిస్తాం. అన్యులు అనగానే హేయులు అనో లేక తక్కువవారు అనో అర్థం కాదు. దేవుని నిబంధనకు వెలుపల ఉన్నవారంతా అన్యులు (ఇశ్రాయేలీయులు మినహా అందరూ). ఆయన నియమించిన ప్రతిష్టతకు వెలుపల ఉన్నవారంతా అన్యులు (యాజకులు మినహా ఇశ్రాయేలీయులు కూడా).
ఇక ఆ పరిమళ తైలాన్ని వ్యక్తిగతంగా కలిపేవాడు, అన్యులపై దానిని పూసేవాడు ప్రజల్లోనుండి కొట్టివెయ్యబడతాడు అంటే, దేవుని కోపానికి గురై మరణించడం, లేదా సంతానం లేకుండా చనిపోవడం, లేదా ప్రజల్లోనుండి శాశ్వతంగా వెలివెయ్యబడడం అని అర్థం.
నిర్గమకాండము 30:34,35
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.
ఈ వచనాల్లో దేవుడు ధూపవేదికపై వెయ్యవలసిన ధూపం యొక్క తయారీ గురించి వివరించడం మనం చూస్తాం. ఈ ధూపం ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపనకూ అలాగే ఆయన నామంలో పరిశుద్ధుల ప్రార్థనలకూ సాదృశ్యంగా ఉందని ఇప్పటికే వివరించాను. అందుకే అది స్వచ్ఛమైనదిగా ఉప్పు కలిగినదిగా ప్రాముఖ్యంగా అత్యంత సువాసన కలదిగా తయారు చెయ్యబడాలి. అది పరిశుద్ధమైనదని చెప్పబడింది, పాతనిబంధనలో దేవునికి ప్రతిష్టితమైనవన్నీ అలానే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవన్నీ పరిశుద్ధమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం మనం కూడా ఆయనకు ప్రతిష్టించబడ్డాం. అందుకే లేఖనంలో మనల్ని ఉద్దేశించి "పరిశుద్ధులు" అనే పదప్రయోగం చాలాసార్లు మనకు కనిపిస్తుంది (ఫిలిప్పీ 4:22, 1 కొరింథీ 1:2, 6:2, రోమా 1:2).
కాబట్టి మన జీవితాలు ఆ సుగంధ ధూపం పరిశుద్ధంగా ఎంచబడి దేవుని సన్నిధిలో సువాసనను వెదజల్లినట్టుగా పరిశుద్ధతను కలిగియుండాలి. అందుకే పౌలు ఇలా అంటున్నాడు.
కొలస్సీయులకు 3:12 - కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
నిర్గమకాండము 30:36
దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను.
ఈ వచనంలో దేవుడు ఆ సుగంధ ధూపపు పొడిని ప్రత్యక్షగుడారంలో మందసం ఎదుట ఉంచాలని తెలియచెయ్యడం మనం చూస్తాం. అక్కడే ధూపవేదిక ఉంటుంది (6వ వచనం). దానిపైనే ఆ పొడిని ఉంచాలి. అది దేవుని సన్నిధిలో పరిమళ వాసనను కలిగించేదిగానూ, ఆయనకు చెయ్యబడే విజ్ఞాపనలకు సాదృశ్యంగానూ ఉంది కాబట్టి దానిని అతిపరిశుద్ధంగా భావించాలి. యేసుక్రీస్తు విజ్ఞాపన అతిపరిశుద్ధమైనది. కాబట్టి మనం దేవునికి చేసే ప్రార్థనలూ, విజ్ఞాపనలూ పరిశుద్ధంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. దేవుడు చెప్పిన పద్ధతిలో తయారు చెయ్యబడిన ఆ ధూపపు పొడి పరిశుద్ధంగా ఎంచబడినట్టు, ఆయన వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడే మన ప్రార్థన పరిశుద్ధంగా ఉంటుంది.
నిర్గమకాండము 30:37,38
నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
ఈ వచనాల్లో దేవుడు పరిమళ తైలం విషయంలో హెచ్చరించినట్టే ధూపపు పొడి విషయంలో కూడా హెచ్చరించడం మనం చూస్తాం. ఆ సందర్భంలో నేను వివరించినట్టుగా అది దేవునికి ప్రతిష్టమైనది కాబట్టి, ఎవరికి వారు ఆ ధూపపు పొడిని తయారు చేసుకోకూడదు. "దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు" అనంటే, యాజకులు ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేస్తున్నప్పుడు చూసే ఆ ధూపపు వాసన కోసం మాట్లాడటం లేదు. అప్పుడు వారు ఎలాగూ ఆ వాసన చూస్తారు. కానీ వ్యక్తిగతంగా ఆ పొడిని తయారు చేసుకుని దాని వాసన చూడకూడదని ఈ మాటల భావం. ఆ ధూపం దేవునికి చెయ్యబడే విజ్ఞాపనలకు సాదృశ్యంగా ఉంది కాబట్టి, దేవుడు మాత్రమే మన విజ్ఞాపనలను ఆలకించేవాడిగా ఉన్నాడు కాబట్టి, వ్యక్తిగతంగా ఎవరూ దానిని తయారు చేసుకుని వాసన చూడకూడదు. అది దేవుని మహిమను దొంగిలించడం ఔతుంది. అలా చేసేవారు "ప్రజలలో నుండి కొట్టివేయబడతారు". ఈ నియమం మనకు దేవునికి చెందవలసిన మహిమను, ఘనతను పొందుకోకూడదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత సంఘాల్లోని కొందరు బోధకులు ఈ ఘోరతప్పిదమే చేస్తున్నట్టు మనం గమనిస్తాం. వారు ప్రజలను దేవునికి కాకుండా తమకు శిష్యులుగా మార్చుకుంటూ, వారిచేత దేవునితో సమానంగా కానీ, అంతకంటే ఎక్కువగా కానీ కొనియాడబడుతూ, వారి మనస్సుల్లో వాక్యానికి కాకుండా వీరి అభిప్రాయాలకే పెద్దపీటను వేస్తూ ఆయన మహిమను దొంగిలిస్తున్నారు. వారు కొట్టివెయ్యబడక తప్పదు
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 30

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"